
ఆ మధ్య ధనుర్మాసం మొదలవుతున్న సందర్భంగా రామాయణం మీద నా ఆలోచనలు పంచుకోవలసిందిగా మిత్రుడు రామసూరి నూజివీడు రమ్మని పిలిచాడు. పూర్వకాలపు ఒక రామాలయంలో సమావేశం. ఆ గోష్టి పూర్తయ్యాక, ఆ రామాలయంలోనే ఒక గదిలో గ్రంథాలయం కూడా ఏర్పాటు చేసామనీ, ఆ మందిరం నా చేతుల్తో ప్రారంభించమనీ అడిగితే రిబ్బను కత్తిరించి లోపల అడుగుపెట్టాను. అక్కడ బీరువాల్లో కొన్ని పాతపుస్తకాలు, ఎప్పటివో ఆధ్యాత్మ గ్రంథాలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఒక పుస్తకం నా దృష్టినిట్టే ఆకర్షించింది. తీసి చూసాను.
‘పుణ్యక్షేత్రాలు’.తిరుమురై తలంగళ్ ప్రచురణ సమితి, బెంగుళూరు వారి ప్రచురణ (1988) . కుతూహలంగా లోపలి పేజీలు తిప్పి చూసాను.
ఆశ్చర్యం! అది నాయన్మారులు తమిళదేశమంతటా సంచరించి ఏ దేవాలయాల్లో పాటలు పాడారో ఆ పాటలు పుట్టిన స్థలాల గురించిన వివరణ. అందులో ప్రతి పుణ్యక్షేత్రం ఎక్కడుందో, ఎలా వెళ్ళవచ్చో లాంటి వివరాలతో పాటు, దేవాలయంలో ఉన్న దేవీదేవతలు, స్థలవృక్షాలు, ఉత్సవవివరాలు మొదలైన సమాచారమంతా ఉంది.అంతకన్నా ముఖ్యం, ప్రతి ఒక్క దేవాలయం గురించిన వివరాలతో పాటు ఆ దేవాలయాన్ని సందర్శించి, ఆ దేవుడి మీద నాయనార్లు చెప్పిన కవితలనుంచి ఒకటో రెండో చరణాలు, తమిళమూలంతో పాటు తెలుగు అనువాదం కూడా ఉన్నాయి. నాయనార్లతో పాటు మాణిక్యవాచకర్, అరుణగిరినాథార్, రామలింగ అడిగలార్, మేక్కండార్ వంటి మహాభక్తి కవుల రచనలనుండి కూడా ఉల్లేఖనలున్నాయి.
ఇంకా ఆశ్చర్యమేమంటే, ఆ పుస్తకం తమిళంలో రాసిన రచయిత పి.ఎం.జయసెంథిల నాథన్ అనే ఆయన పుస్తకానికి రాసిన ముందుమాటలో తమిళదేశంలో పాటలు పుట్టిన స్థలాల గురించి తన కన్నా ముందు మరికోందరు రచయితలు పుస్తకాలు రాసారని చెప్పాడు. వాటిలో ‘తిరుత్తలప్పయణం’ (పుణ్యక్షేత్ర పర్యటన), ‘సేక్కిలార్ అడిచ్చువట్టిల్’ (సేక్కిలార్ దారుల్లో), ‘సేక్కిలార్ వళియుల్ శివత్తలంగళ్’ (సేక్కిలార్ మార్గంలో శివస్థలాలు) వంటి పుస్తకాలు వెలువడ్డాయని పేర్కొన్నాడు. వారెవ్వరూ నాకు తెలియకపోయినప్పటికీ, ‘పుణ్యక్షేత్రాలు’వంటి ఒక ఉద్గ్రంథం తెలుగులో ఇప్పటికే అనువాదంగా వెలువడిందని నాకు తెలియకపోయినప్పటికీ, నేను కూడా సేక్కిలార్ దారుల్లో, పాటలు పుట్టిన స్థలాలను అన్వేషిస్తూ, ‘పాటలు పుట్టిన తావులు’ వెలువరించడం నా భాగ్యంగా భావిస్తూ ఉన్నాను.
పుణ్యక్షేత్రాలు వెయ్యి పేజీల ఉద్గ్రంథం. దాన్ని తెలుగు చేయడానికి అయిదుగురు అనువాదకులు అవసరమయ్యారు. ఆ అనువాదకుల్లో ఒకరైన చల్లా రాధాకృష్ణ శర్మ ఆ పుస్తకానికి గ్రంథసమీక్ష కూడా రాస్తూ ఇలా రాసారు:
‘సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు లేని చోటు లేదని మన తరతరాల విశ్వాసం. ఆలయంలోని విగ్రహం (మూర్తి) లోనే కాక, ఆ ఆలయం నెలకొన్న చోటును (స్థలం), అక్కడ ఉండే నీటిలోనూ (తీర్థం) ఈశ్వరుడు ఉన్నాడు. ‘శాస్త్రోక్తంగా మూర్తిని, స్థలాన్ని, తీర్థాన్ని సేవించే వ్యక్తి గురుకటాక్షానికి పాత్రుడు కాగలడు’ అని 17 వ శతాబ్దిలో జీవించిన తాయిమానవర్ అనే ప్రసిద్ధ భక్తి కవి పేర్కొన్నాడు.’
ఈ రోజు నా పుస్తకం ఆవిష్కరణ ఉందని ఆహ్వానం పంపినప్పుడు, ఒక మిత్రుడు, భగవత్ క్షేత్ర వర్ణన సరే, భగవంతుణ్ణి కూడా మీదైన మాటల్లో స్తుతించండి అని సందేశం పంపించాడు. మహనీయ తెలుగువాగ్గేయకారులైన అన్నమయ్య, క్షేత్రయ్య, త్యాగయ్యల్లాగా తమిళభక్తి కవులు కేవలం కవులు మాత్రమే కాదు, గీతకారులు కూడా. వారిది సాహిత్యం మాత్రమే కాదు, సంగీతం కూడా. ‘గాయకుడిగానే నీ సమక్షానికి నా ప్రవేశం’ అని టాగోర్ అనుకోవడంలో అంతరార్థమిదే. జీవితసౌందర్యాన్ని మాటల్లోనూ, రంగుల్లోనూ పట్టుకోవడమెలానో కొంత సాధన చేసానుగాని, రాగాల్లో కనుగొనడమెట్లానో ఇంకా జాడతెలియడం లేదు. భగవత్కృప నా జీవితంలో సంగీత రూపంగా ఇంకా అనుభవంలోకి రావలసి ఉంది.
బహుశా నా మిగిలిన జీవితమంతా నా చుట్టూ ఉన్న గాలుల్లో రాగాలను వెతికి పట్టుకోవడంకోసమూ , ఆ రాగాల్ని పాటలుగా మార్చడం కోసమూ జీవించవలసి ఉంటుందనుకుంటున్నాను.
~
పాటలు పుట్టిన తావులు ఎలక్ట్రానిక్ ప్రతి ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
21-2-2020

కళాత్మకత అందరిలోనూ ఎంతో కొంత ఉంటుంది. కానీ, కళాభివ్యక్తి ఏ కొందరికో భావత్కృపా భాగ్యంగా లభిస్తుంది. మీ కవితలు, రచనలు కొన్ని సగం సగం చదివితేనే నేనొక ధ్యాన పారవశ్యం పొందాను. మీకు ధన్యవాదాలు…🙏🙏
Thank you very much
Sir Nuziveedu e library lo పుణ్యక్షేత్రాలు’.తిరుమురై తలంగళ్ ప్రచురణ సమితి, e book ni Chudavachu Sir?
Sir please provide the library address?
+919059294790 రామసూరి
Thank you🙏
Sir Nuziveedu e library lo పుణ్యక్షేత్రాలు’.తిరుమురై తలంగళ్ ప్రచురణ సమితి, e book ni Chudavachu Sir?
రామసూరి గారిని అడగవచ్చు.
Thank you very much Sir