నడుస్తున్న కాలం-5

పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చెయ్యకతప్పదు

కిందటి వారం తెలంగాణా ప్రభుత్వం వారి సెంటర్ ఫర్ గుడ్ గవర్నన్స్ వారు తమిళనాడు ప్రభుత్వం వారి బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్లుకు, డిప్యూటీ బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్లుకు గ్రామీణ పాలనలో నాయకత్వ శిక్షణ అందించారు. అందులో భాగంగా ఆ అధికారబృందాన్ని ఉద్దేశించి నన్ను కూడా మాట్లాడమని ఆహ్వానించేరు. తమిళనాడులోని దాదాపు ముప్ఫై జిల్లాలనుంచి వచ్చిన ఆ అధికారుల్తో గ్రామీణ స్వయం పరిపాలన గురించీ, గ్రామీణాభివృద్ధి గురించి నా ఆలోచనలు కూడా  పంచుకున్నాను.

గ్రామ స్వరాజ్యం: మహాత్ముడి కల

భారతదేశ జాతీయోద్యమానికి రెండు బాహువులున్నాయనీ, ఒకటి బ్రిటిషు పాలనకు సహకరించక- పోవడం, వలసపాలక చట్టాలను తిరస్కరించడం కాగా, రెండవది గ్రామాల పునర్నిర్మాణమని మహాత్ముడు చెప్తుండేవాడు. భారతదేశం గ్రామాల్లో నివసిస్తున్నది అనేది ఆయన పదే పదే గుర్తుచేసిన మాట. ‘స్వరాజ్యాన్ని నెలకొల్పడమంటే గ్రామాలకోసం పనిచెయ్యడమే ‘ అని 1929 లోనే ఆయన ‘యంగ్ ఇండియా’ పత్రికలో రాసాడు. అలానే ‘గ్రామాలు కృశిస్తే భారతదేశం కూడా కృశిస్తుంది. అప్పుడు దాన్ని మనం భారతదేశం అని పిలవలేం’ అని 1936 లో ‘హరిజన్’ పత్రికలో రాసాడు. ఈ విషయంలో, సహాయనిరాకరణోద్యమం, శాసనోల్లంఘనోద్యమం రోజులనుంచీ తనలో కలుగుతున్న ఆలోచనల్నీ, తన అనుభవాల్నీ క్రోడీకరించుకుని 1941 లో నిర్మాణాత్మక కార్యక్రమాన్ని ప్రకటించాడు. దాన్నే మరికొన్ని మార్పుల్తో తిరిగి 1945 లో మరొకసారి వివరించాడు. మతసామరస్యం, అస్పృశ్యతానివారణ, మద్యనిషేధం, ఖాదీ, ఇతర కుటీర పరిశ్రమలు, గ్రామ పారిశుద్ధ్యం వంటి పద్ధెనింది అంశాలు ఆ అజెండాలో ఉన్నాయి. 1941-45 మధ్యకాలంలో క్విట్ ఇండియా ఉద్యమం, భారతదేశ స్వాతంత్ర్యానికి సంబంధించిన నిర్ణయాలు సంభవిస్తున్నప్పటికీ, మహాత్ముడి దృష్టి వాటిమీదలేదు. గ్రామాల్ని బలోపేతం చెయ్యడమెలా అన్నదాని గురించే ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు.

స్వాతంత్ర్యం తర్వాత గ్రామీణాభివృద్ధి

భారతరాజ్యాంగ రూపకర్తలు మహాత్ముడి ఈ స్వప్నాన్ని నిజం చేయడానికి, అధికరణం 40 ద్వారా, రాజ్యవిధానాన్ని నిర్దేశించే ఒక ఆదేశసూత్రం పొందుపరిచారు. రానున్నకాలంలో గ్రామపంచాయతీల్ని ఏర్పాటుచెయ్యాలనీ, వాటికి తగిన అధికారాల్నీ, నిధుల్నీ సమకూర్చాలనీ ఆ అధికరణం ప్రభుత్వాన్ని నిర్దేశించింది.

భారతప్రభుత్వం ఆ దిశగా చాలా వేగంగా పనిచేసింది. అందులో మొదటిది, 1952 లో ప్రారంభించిన కమ్యూనిటీ డెవలప్ మెంట్ ప్రాజెక్టు (సి.డి.పి). మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఆ ప్రాజెక్టు ఇచ్చిన సత్ఫలితాల్ని దృష్టిలో పెట్టుకుని, రెండవ పంచవర్షప్రణాళికలో దాన్ని దేశమంతటా విస్తరింపచేసారు. అందుకోసం దేశం మొత్తాన్ని కమ్యూనిటీ డెవలప్ మెంట్ బ్లాకులుగా విభజించి, ప్రతి ఒక్క బ్లాకుకీ ఒక బ్లాక్ డెవల్ మెంట్ ఆఫీసరునూ, విస్తరణాధికారులతో కూడిన ఒక బృందాన్నీ నియమించారు. 1957 లో ఏర్పాటైన బలవంత రాయ్ మెహతా కమిటీ దేశంలో మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పాటుచెయ్యాలని సూచించింది. ఆ సూచనల మేరకు  ప్రతి ఒక్క కమ్యూనిటీ డెవలప్ మెంట్ బ్లాకు ఒక పంచాయితీ సమితిగా కూడా పనిచెయ్యడం మొదలయ్యింది. కొత్తగా ఏర్పాటు చేసిన బ్లాకుల ద్వారా కమ్యూనిటీ డెవలప్ మెంటు కు మరింత జవసత్త్వాలు సమకూర్చడం కోసం నేషనల్ ఎక్టెన్షన్ సర్వీసుని కూడా ప్రారంభించి సోషల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లను నియమించారు. ఆ అధికారులు, బ్లాకు డెవలప్ మెంటు సిబ్బంది 56-67 దాకా పదేళ్ళ కాలంలో గ్రామీణాభివృద్ధిలో కొత్త శకానికి తలుపులు తెరిచారు.

పంచాయత్ రాజ్ వ్యవస్థ 1967-92

కానీ, తర్వాత పాతికేళ్ళ పాటు పంచాయత్ రాజ్ వ్యవస్థలు ప్రగతిబాటన పయనించకపోగా అనేక సమస్యల్లో కూరుకుపోవడం మొదలయ్యింది. ముఖ్యంగా రాష్ట్రప్రభుత్వాలు తమ అధికారాల్నీ, నిధుల్నీ జిల్లాస్థాయి, బ్లాకు స్థాయి పంచాయతీలతో పంచుకోడానికి సిద్ధపడలేదు. మూడంచెల పంచాయతీ వ్యవస్థ రాజకీయాలకు కేంద్రబిందువుగా మారింది. ఒకప్పుడు బ్లాకు స్థాయిలో సమగ్ర అభివృద్ధికి దోహదం చేసిన నిధుల, అధికారాల కేంద్రీకరణ నెమ్మదిగా సడలిపోవడం మొదలయ్యింది. మరొకవైపు, కమ్యూనిటీ డెవలప్  మెంట్ ప్రాజెక్టు ప్రణాళిక గిరిజనుల అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపించడం లేదనే కారణం చాత, 1975 నుంచీ గిరిజన ఉప ప్రణాళికా వ్యూహం మొదలయ్యింది. 1980 లో సమగ్ర గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు (ఐ.ఆర్.డి.పి) మొదలయ్యాక, గ్రామీణాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన పంచాయతీ రాజ్ వ్యవస్థల చేతుల్లోంచి జిల్లా కలెక్టరు అధికారంకిందకు వెళ్ళిపోయింది. గ్రామీణ పాలనకు ముఖ్య అంగాలైన పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, విద్య, వైద్యం, ఆరోగ్యం, స్త్రీ-శిశు సంక్షేమం, వ్యవసాయం, సహకారం మొదలైన రంగాలన్నీ వివిధ ప్రభుత్వశాఖల నియంత్రణలో పనిచేస్తూ నేరుగా జిల్లా  కలెక్టరుకే బాధ్యత వహించడం మొదలుపెట్టాయి. చివరికి 90 వ దశకం మొదలయ్యేప్పటికి, మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ దాదాపుగా నిర్వీర్యమైపోయింది.

73వ, 74వ రాజ్యాంగ సవరణలు

ఇటువంటి పరిస్థితుల్లో గ్రామీణ, పట్టణ స్వరిపాలనా సంస్థలకు రాజ్యాంగబద్ధత సమకూరిస్తే తప్ప వాటికి తగిన అధికారాలనూ, నిధులనూ సమకూర్చలేమనే ఉద్దేశంతో ప్రభుత్వం 1992 లో రాజ్యాంగాన్ని సవరించింది. 73 వ సవరణ ద్వారా గ్రామీణ పంచాయతీవ్యవస్థనీ, 74 వ సవరణ ద్వారా పట్టణ స్వరిపాలనా వ్యవస్థనీ బలోపేతం చెయ్యడం కోసం 29 అంశాల్లో అధికారాల్ని బదలాయించింది. అదే సమయంలో షెడ్యూల్డు ప్రాంతాలకు అనుసరించవలసిన విధివిధానాలను ‘పెసా చట్టం 1996’ ద్వారా నిర్దేశించింది. ఈ కొత్త విధివిధానాల ప్రకారం గ్రామస్థాయిలో గ్రామసభలు ఉంటాయి. వాటిపైన మూడంచెల పంచాయతీ రాజ్ సంస్థలు ఉంటాయి. ప్రతి ఒక్క స్థాయిలోనూ ప్రతినిధుల్ని ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. మండల లేదా సమితి స్థాయిలో మండల ప్రాదేశిక ప్రతినిధులు మండల లేదా సమితి అధ్యక్షుల్ని ఎన్నుకోగా, జిల్లస్థాయిలో జిల్లా ప్రాదేశిక ప్రతినిధులు జిల్లా పరిషత్తు అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు. ప్రతి ఒక్క స్థాయిలోనూ, విధివిధానాల్నీ, నిధుల కేటాయింపుల్నీ విస్పష్టంగా పేర్కోవడం జరిగింది.

2024 నాటికి పరిస్థితి

రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయత్ రాజ్ సంస్థలకు అధికారాల్ని బదలాయించిన మూడు దశాబ్దాల తరువాత, దేశవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో అంచనా వేస్తూ, భారత ప్రభుత్వ పంచాయతీ రాజ్ శాఖ, ఒక ఇండికేటివ్ ఎవిడెన్సు బేస్డ్ రాంకింగ్ విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2021-22 నాటికి గ్రామీణ పంచాయత్ రాజ్ సంస్థలకు అధికారాల బదలాయింపు కేవలం 44 శాతం మాత్రమే సంభవించింది. అయితే 2013-14 లో దాదాపు నలభై శాతం ఉన్న బదలాయింపు కన్నా ఇది నాలుగు శాతం పురోగతి అనుకోవలసి ఉంటుంది. రాజ్యాంగసవరణ చేసి మరీ అధికారాల్ని బదలాయించమని విస్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన మూడు దశాబ్దాల తరువాత కూడా రాష్ట్రప్రభుత్వాలు సగం అధికారాలు కూడా పంచాయత్ రాజ్ సంస్థలతో పంచుకోకపోవడం నిజంగా శోచనీయం.

అధికారాల బదలాయింపులో అగ్రస్థానంలో ఉన్న అయిదు రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. కాని మొన్న నేను ఆ అధికారులతో మాట్లాడినప్పుడు వారు కేవలం పంచాయత్ రాజ్ ద్వారా తమకు అందుతున్న నిధుల వరకూ మాత్రమే తమకి బాధ్యత ఉందనీ, ప్రధాన శాఖలు, విద్య, వైద్యం,ఆరోగ్యం, స్త్రీ శిశు సంక్షేమం వంటి వాటిపైన తమకు ఎటువంటి పర్యవేక్షణాధికారం లేదని చెప్పారు. కాని తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో పంచాయత్ రాజ్ సంస్థల పనితీరుతో పోలిస్తే తమిళనాడు పరిస్థితి మెరుగనే చెప్పాలి. ఇక్కడ రెండు రాష్ట్రాల్లోనూ కూడా స్వయం సహాయక బృందాల ద్వారా గ్రామీణ దారిద్ర్య నిర్మూలన సంఘం చేపడుతున్న పథకాలు పంచాయత్ రాజ్ సంస్థల్ని విస్మరించి జరుగుతున్నాయి. దీనివల్ల మూడంచెల పంచాయత్ రాజ్ వ్యవస్థకు సమాంతరంగా మరొక మూడంచెల దారిద్ర్యనిర్మూలనా పథకం అమలు జరుగుతున్నది. అలానే గిరిజన ప్రాంతాల్లో గ్రామసభలు బలోపేతం కాకపోగా, ఇప్పటికీ, గిరిజనాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, అమలు ఐ.టి.డి.ఏల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా పంచాయతీలను బలోపేతం చెయ్యడానికి ఒక ప్రయోగం చేపట్టినప్పటికీ, అధికారాల బదలాయింపు పూర్తిస్థాయిలో జరగనే లేదు.

స్థానిక స్వపరిపాలన ఒక్కటే తరణోపాయం

ఈరోజు రాజకీయంగానూ, పాలనారంగంలోనూ మనం చూస్తున్న అన్ని రకాల దురాచారాలకీ ప్రధాన కారణం రాష్ట్రప్రభుత్వాలు మూడంచెల పంచాయతీ రాజ్ సంస్థలకు అధికారాలు బదలాయించకపోవడమే అని చెప్పాలి. మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం కావడం వల్ల, రాజకీయాధికారం రాష్ట్ర, కేంద్ర శాసనసభల్లో కేంద్రీకృతం కావడంవల్ల, మొత్తం ప్రజాస్వామ్యస్ఫూర్తినే భంగపడుతున్నది. ఈ నేపథ్యంలో 1941 లో మహాత్ముడు ప్రకటించిన నిర్మాణాత్మక కార్యక్రమం ఎంత శక్తిమంతమైందో నాకు అర్ధమవుతున్నది. దాన్ని మనం కేవలం ఒక కలగా కొట్టిపారేసినందువల్ల, రాజ్యాంగ కర్తలు దాన్నొక ఆదేశసూత్రానికి పరిమితం చేసినందువల్ల మనం రాజకీయంగానూ, అభివృద్ధిపరంగానూ కూడా ఎంత నష్టపోయామో ఇప్పుడిప్పుడే అంచనాకు వస్తున్నది. నిజంగా రాజకీయ సంకల్పం ఉంటే ఇదేమంత అసాధ్యం కాదని మనకు కేరళ నిరూపిస్తున్నది. పంచాయత్ రాజ్ వ్యవస్థల పనితీరులో కేరళ నిజంగానే ఒక ఆదర్శ రాష్ట్రం. మొత్తం దేశమంతా కూడా కేరళ నడిచిన దారిలోనే పంచాయత్ రాజ్ వ్యవస్థల్ని బలోపేతం చెయ్యక తప్పదు.

తెలుగు ప్రభ, 17-1-2026

4 Replies to “నడుస్తున్న కాలం-5”

  1. చాలా వివరణాత్మకంగా ఉంది. అందరికి ముఖ్యంగా పోటీ పరీక్ష దారులకు ఉపయుక్తం.

  2. మంచి వ్యాసం. గ్రామాన్ని సంకుచితత్వానికి మూర్ఖత్వానికి నిలయంగా గ్రామీణులను స్వయం నిర్ణయం చేసుకోలేని వారిగా భావించే ధోరణి కూడా కేంద్రీకరణకి కారణమైంది. దానివల్ల గ్రామ స్వరాజ్యం అనే భావన అడుగంటింది. అయితే ఈ భావన గొప్ప మేధావులలో కూడా ఉండేది. రాజ్యాంగ కర్తలైన మేధావులు కూడా ఒక కేంద్రీకృత రాజ్యం కేంద్రీకరణ అనేది వికేంద్రీకరణ కంటే మేలు అయినదని భావించారు.
    ఎంతైనా గాంధీ ప్రభావం వలన ఇంగువ కట్టిన గుడ్డ లా మొదట్లో కొంత వికేంద్రీకరణ గ్రామ స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ క్రమేపి అది క్షీణించింది. ఇప్పటికీ గ్రామాల గురించి మాట్లాడడం దళిత బహుజనుల గురించి వ్యతిరేకంగా మాట్లాడడం గా భావించేవారు ఉన్నారు. అయితే ఆధునిక అభివృద్ధి కేవలం నగరాల కోసం నగరాల అభివృద్ధి కోసమే అన్నట్లు ఉండటం నిజానికి దళిత గిరిజనులకి గొడ్డలిపెట్టుగా మారింది.
    ఈ సందర్భంలో మీ వ్యాసం ఎంతో ఆవశ్యకమైనది

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading