
నలభయ్యేళ్ళ కింద నేను చదివిన కథల్లో బహుశా అత్యంత విషాదాత్మకమైన కథ లేదా మరోలా చెప్పాలంటే అత్యంత fatal short story కాఫ్కా రాసిన TheJudment (1912). ఎందుకంటే ఈ కథ చదివాకనే నా మిత్రుడు కవులూరి గోపీచంద్ మా అందరికీ మానసికంగానే కాక, భౌతికంగా కూడా, దూరమైపోయాడు.
ఈ కథకి సంబంధించిన ప్రతి ఒక్క వివరం, అంటే ఈ కథ మా జీవితాల్లోకి ఎలా ప్రవేశించిందీ. ఆ తర్వాత ఏమి జరిగిందీ, అవన్నీ నాకు గుర్తే. ఎవరో ఆ సంఘటనల క్రమాన్ని ఒక చీటీమీద ఎర్రటి ఇంకులో రాసి, ఆ చీటీని నా స్మృతిపేటికలో కుట్టిపెట్టేసినట్టు.
1982-83 నాటి మాట. ఒకరోజు భమిడిపాటి జగన్నాథరావుగారు ‘నువ్వు కాఫ్కాగారి దుర్గం చదివేవా?’ అనడిగారు. అప్పటిదాకా ఆ పేరే నేను వినలేదు. వినలేదని చెప్పాను. ఆయన, ఆ తర్వాత మళ్ళా మేం కలుసుకున్నప్పుడు, ‘అభ్యుదయ’ పత్రిక పాత సంచిక ఒకటి నా చేతుల్లో పెడుతూ, ‘ఇదుగో, ఇందులో పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన వ్యాసం ఉంది, చదువు’ అన్నారు. ఆ వ్యాసంలో పద్మరాజుగారు కాఫ్కా నవల ‘The Castle’ (1926) గురించి రాసేరు. నాకు తెలిసి, తెలుగులో కాఫ్కా గురించిన మొదటి వ్యాసం అదేననుకుంటాను. మొదటి ప్రస్తావన కూడా అదే అయి ఉండవచ్చు. శ్రీ శ్రీ అనంతంలో ఒకచోట కాఫ్కా మూడు నవలల గురించీ రాసాడు. కాని అది పద్మరాజుగారి వ్యాసానికి చాలాకాలం తర్వాత.
ఆ వ్యాసం నాకేమీ అర్థం కాలేదు. కాని కొన్ని రోజులకే నా చేతుల్లోకి ‘జర్మన్ సంప్రదాయ సాహిత్య దర్పణం’ (1971) వచ్చింది. అది దక్షిణభాషా పుస్తక సంస్థ వారు ఒక జర్మను పుస్తక సంస్థతో కలిసి వెలువరించిన అనువాదం. పాలగుమ్మి పద్మరాజు, కొడవటిగంటికుటుంబరావు, బి.శ్రీనివాసాచార్యులు అనువాదకులు. అందులో కాఫ్కా రాసిన ‘తీర్పు’ కథతో పాటు, ‘విచారణ’ నుంచి కూడా చిన్న భాగం ఉంది. నేను అప్పటికే కాఫ్కా గురించి విని ఉండటం చేత ఆ కథ ఆసక్తిగా చదివాను. కాని అది నాకేమీ అర్థం కాలేదు. ఆ పుస్తకం తీసుకువెళ్ళి గోపీచంద్ కి ఇచ్చి ఆ కథ చదవమని చెప్పాను. ఆశ్చర్యం! ఆ కథ అతనికి అర్థం కావడమే కాదు, అది అతడి మనసుమీద అనూహ్యమైన ప్రభావం చూపించింది.
ఆ కథ చదివిన రెండుమూడు రోజుల తర్వాత ఒక సాయంకాలం నా దగ్గరకొచ్చి ‘బాస్! ఇంతకీ రష్యాలో ఆ స్నేహితుడు లేడు తెలుసునా!’ అన్నాడు. ఆ మాట చెప్తున్నప్పుడు అతడికి కాఫ్కా రహస్యం మొత్తం తెలిసిపోయినట్టుగా, నాకు తప్ప మరెవరికీ చెప్పబోవడం లేదన్నట్టుగా, చెప్పాడు. ఆ స్నేహితుడు రష్యాలో నిజంగా లేకపోతే దాని అర్థమేమిటో నాకు ఆ రోజైతే అర్థం కాలేదు.
ఆ తర్వాత అతడు కాఫ్కా నవలలు ఒకటొకటీ తెప్పించుకున్నాడు. ఒకదానివెనక ఒకటి చదివేసాడు. కాఫ్కా డైరీలూ, మిలేనాకు రాసిన ఉత్తరాలు కూడా తెప్పించుకున్నాడు. ఆ నవలలు నేను కూడా చదువుదామని చూసాను. నాకు ఆ ఇంగ్లిషు అర్థమవుతూ ఉండిందిగాని, రచయిత ఏమి చెప్తున్నాడో బోధపడేదికాదు. కాని గోపీచంద్ ప్రతి రోజూ మేం కలుసుకున్నప్పుడల్లా కాఫ్కా గురించి ఏదో ఒకటి చెప్తూనే ఉండేవాడు. చివరికి ఒక కవిత కూడా రాసేడు. 1983 డిసెంబరులో మా సాహితీవేదిక వెలువరించిన ‘కవితావేదిక’లో ఆ కవితని పొందుపరిచాం. ఇదుగో, ఆ కవిత.
క్షమించు కాఫ్కా
శక్తిమంతుడవు నువ్వు-అయినా క్షమిస్తావు.
కాలాన్ని కాన్ స్టెంట్ గా చేసుకున్నావు, నీ వాటాకు క్షయపాత్ర వచ్చింది-క్షమించు.
రైలొచ్చినప్పుడు ప్లాట్ ఫారాలు
వానలకింద మునిసిపాలిటీ కుండీలు
నీకు తెలియనివి కావు-క్షమించు.
ఊరి మధ్య ఉరికంబాలకు వింత ఆకారాలు తగిలించి ఉంటాయి-క్షమించు
దూరంగా పుట్టలుకట్టిన మనుషులు దిబ్బల మీద కాపలా ఉంటారు
సన్యసించిన జీవితం గురించి అందరూ అప్రమత్తులై ఉంటారు
నీడలమాటున నిజాలు పొంచి ఉంటాయి
చంద్రుడు జారి పగిలినట్లు కొంచెం అలజడి-ఆధారం
ఎండిన బోలు కర్రల్లోంచి రెండు గొంతులు మాట్లాడుకుంటాయి
యుగాల అగాధాల అంచుల్ని కలుపుతూ పడుకొంటావు నువ్వు
చీమలు పాకినట్లుంటే వాటి స్థానాన్ని నిర్ణయించకు-క్షమించు.
వాట్సన్, క్రిక్ ల చిత్రాలు మరింత వంగి అరసున్నాలై వేలాడుతుంటాయి
ఆ చివరొకడు ఈ చివరొకడు తగులుకొని ఉంటారు
నీ కళ్ళల్లో చుట్టచుట్టుకుని పడుకున్న సముద్రాలున్నాయి
నీ కన్నీటికణాల్ని ఇక్కడ పాతాలనుకొంటావు
మోటారు వాహనాల కింద నలిగిన ఆధారం ఉంటుంది
చిరిగిన గుడ్డలు కాలుతూ మైదానాల మీద ఆడుతూ ఉంటాయి
ఊరు చివర దొప్పల్తో కండలున్నవాళ్ళు నిత్యం తోడుతూ ఉంటారు
చెరువుగట్లమీద మేస్తూ అనేకులుంటారు
దూకుతామని ప్రకటనలు చేస్తూంటారు
ఇప్పటికైనా నమ్ము కాఫ్కా
మిత్రుడి సంగతేమోగానీ-జార్జి మాత్రం అమరుడు
(మిత్రుడు కాఫ్కాకి)
తెలుగులో కాఫ్కా మీద వచ్చిన కవితల్లో ఇదే మొదటిది. త్రిపురగారి కాఫ్కా కవితలు అప్పటికి ఇరవయ్యేళ్ళ తర్వాతి మాట.
రాజమండ్రి తర్వాత గోపీచంద్ ఉద్యోగ రీత్యా రాయగడ వెళ్ళడం, అక్కడ పనిచేస్తుండగానే ఒక రోజు భార్యాపిల్లలకి చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగాయి. ఇంకా చెప్పాలంటే, ఒక రైలుప్రయాణంలో, భార్యాపిల్లల్ని బోగీలో వదిలిపెట్టి వెళ్ళిపోయినవాడు ఇప్పటిదాకా మళ్ళా కనబడలేదు. కానీ అతడి అదృశ్యం వెనక కాఫ్కా ప్రభావం ఉందని మాత్రం నాలాగా ఒకరిద్దరు మిత్రులు నమ్ముతూనే ఉంటారు.
ఇన్నేళ్ళ తరువాత, అంటే నాలుగు దశాబ్దాల తర్వాత, మళ్ళా ఇప్పుడు ఈ కథ చదివాను. ఇప్పటికి ఈ కథ నాకు కొంత బోధపడింది. కానీ కాఫ్కా రచనలన్నిటిలానే, ఈ కథ కూడా ఎవరికి వారు చదువుకుని, ఎవరికి వారు అర్థం చెప్పుకోవలసిందే. ఈ కథని ఆ ముగ్గురు అనువాదకుల్లో ఎవరు అనువదించారో తెలియదు. కాబట్టి ముగ్గురి పేర్లూ ఇస్తున్నాను.
తీర్పు
జర్మన్ మూలం: ఫ్రాంజ్ కాఫ్కా
తెలుగు అనువాదం: పాలగుమ్మి పద్మరాజు, కొడవటిగంటి కుటుంబరావు, బి. శ్రీనివాసాచార్యులు
నడి వసంతంలో ఒక ఆదివారం ఉదయం జార్జిబెండెమన్ — ఒక యువక వర్తకుడు – నది ఒడ్డున ఎత్తునూ, రంగునూ బట్టి తప్ప వేరు వేరుగా గుర్తించడానికి వీలు లేని చపుకరకం ఇళ్ళుగల పొడుగైన వీథిలోని తన ఇంట్లో మొదటి అంతస్తులో తన గదిలో కూచుని ఉన్నాడు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న తన పాత స్నేహితుడికి ఉత్తరం వ్రాయడం అప్పుడే పూర్తిచేశాడు. నిదానంగా, స్వాప్నికంగా ఆ ఉత్తరాన్ని కవర్లో పెట్టి రెండు మోచేతులూ బల్లమీద ఆనించి, కిటికీగుండా నదివేపు, నదిమీది వంతెన వేపు, నది ఆవలిగట్టున పచ్చపచ్చగా కనిపించే కొండల వేపూ చూస్తున్నాడు.
స్వదేశంలో తను బాగుపడేందుకుగల అవకాశాలపట్ల అసంతృప్తితో కొన్నేళ్ళ క్రితం రష్యా పారిపోయిన స్నేహితుణ్ణి గురించి అతడు ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం సెయింట్ పీటర్స్ బర్గ్ నగరంలో వ్యాపారం చేస్తున్నాడు అతను. ఆరంభంలో లాభసాటిగానే సాగినా, చాలానాళ్ళుగా వ్యాపారం దిగనాసిలిపోతున్నట్టు, ఇటీవల మరీ అపురూపమవుతున్న అతని స్వదేశాగమన సందర్భాలలో అతడు చెబుతూవచ్చాడు. అంటే, — ఒక విదేశంలో ఏమీ ప్రయోజనం లేకుండా తనని తను అలా హరింప చేసుకుంటున్నాడన్నమాట! ఇప్పుడు పొడుగ్గా పెరిగిన అతని గడ్డం బాల్యం నుంచీ జార్జి బాగా ఎరిగిఉన్న ఆ ముఖాన్ని పూర్తిగా మరుగుపరచలేకపోతూంది. అంతర్గ తంగా ఉన్న వ్యాధిని సూచిస్తూ అతని చర్మం క్రమంగా పసుపువన్నెకు తిరుగుతూంది. అతను చెప్పినదాన్నిబట్టి చూస్తే, ఆ నగరంలో తన దేశీయులు నివసించే కాలనీతో అతనికెలాంటి సంబంధంలేదు. రష్యన్ కుటుంబాలతోనూ రాకపోకలు లేపు. అంటే శాశ్వతంగా బ్రహ్మచారిగా ఉండిపోయే పరిస్థితికి అతని మనస్సును సన్నద్ధపరుచుకుంటున్నాడన్నమాట!
స్పష్టంగా పట్టాలు తప్పిపోయిన ఆ మనిషికి ఎవరు మాత్రం ఏమి వ్రాయగలరు? అతణ్ణి చూసి ఎవరైనా జాలిపడగలరు; ఏమీ సాయం చేయలేరు. స్వదేశానికి తిరిగివచ్చి మళ్ళీ ఇక్కడ నిలదొక్కుకుని పాత స్నేహాలన్నిటినీ పునరుద్ధరించుకొని (అలా చేయడానికి అతనికి అడ్డంకి ఏమీలేదు) స్నేహితుల సాయం మీద ఆధారపడమని అతనికి సలహా చెప్పడం మంచిదా? కాని, అలా అంటే—అంతవరకూ అతను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయనీ, ఇంక వాటికి స్వస్తి చెప్పి ఇంటికి తిరిగివచ్చి కొంపచేరిన దుబారావ్యక్తిగా అందరిచేతా తేరిపార చూడబడుతూ ఉండమనీ, వాస్తవ పరిస్థితి తన స్నేహితులకే తెలుసుననీ, ఇంటివద్ద కుదురుగా ఉండి పైకివచ్చిన తన స్నేహితులు తనకు ఏమి నిర్దేశిస్తే తాను ఆది చేయవలసి ఉన్న ఒక మొద్దబ్బాయిగా ఉండమనీ అతనికి చెప్పినట్టు అవుతుంది. ఆ మాట అతనికి ఎంత ప్రేమగా చెబితే అతనికి అంత ఎక్కువ కోపం వస్తుంది. పైగా, అతని మనస్సును నొప్పించడానికి మనం సిద్ధపడినా దానివలన లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మకంగా చెప్పగలమా? బహుశః, అతణ్ణి స్వదేశానికి తీసుకురావడం సాధ్యపడకపోవచ్చును. అతడే అన్నాడు ఒకసారి— స్వదేశంలోని వ్యాపారంతో తనకు బొత్తుగా పరిచయం పోయిందని. ఆ పక్షంలో ఇక్కడికి వచ్చినా స్నేహితుల సలహా వలన క్రుంగిపోతూ క్రమంగా వారికి మరింత దూరమవుతూ ఇక్కడా విదేశంలో ఉన్నట్టే ఉండవలసి వస్తుంది, కాని, వాళ్ళ సలహా పాటించి ద్వేషంవలన కాకపోయినా పరిస్థితుల ప్రభావంవలన స్వదేశంలో ఇమడలేక ఇక్కడ స్నేహితులతోగాని, ఇతరులతోగాని సరిపుచ్చుకోలేక ఆవమానింపబడినట్టు బాధపడుతూ ‘తనకు స్నేహితులూ లేరు. తనది అని చెప్పుకోదగ్గ దేశమూ లేదు’ అనుకుంటూ ఉండేపక్షంలో ఇప్పుడున్నట్టు అతడు విదేశాల్లోనే ఉండిపోవడం మంచిదికాదా? ఈ సంగతులన్నీ ఆలోచించి చూస్తే వ్వదేశంలో అతడు పైకి రాగలడని ఎవడైనా నమ్మకంగా ఎలా చెప్పగలడు ?
ఈ కారణాలవల న ఎవరికైనా అతనితో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించాలని ఉన్నా సుదూరప్రాంతంలో ఉన్న పరిచితుడికి నిర్మొహమాటంగా చెప్పవలసిఉన్న నిజమైన సంగతులు యథాతథంగా ఆకడు వ్రాయలేడు. ఆఖరుసారి అతడు వచ్చి మూడేళ్ళ పైగా అయింది. అందుకు రష్యాలో రాజకీయపరిస్థితులు ఆనిశ్చితంగా ఉండడం కారణమని అతడు కుంటిసాకు చెబుతాడు. వేలకొద్దిమంది రష్యన్లను సుఖంగా విదేశాలలో పర్యటించడానికి ఆ పరిస్థితులు అనుమతిస్తున్నాయిగాని, ఒక చిన్న వ్యాపారస్థుడు కొద్దికాలంపాటు దేశం వదలిపోవడానికి మాత్రం ఒప్పుకోడంలేదు. అయితే ఈ మూడేళ్ళలోనూ జార్జి స్వంతజీవిత పరిస్థితులు కూడా బోలెడంత మారినయి. రెండేళ్ళక్రితం అతని తల్లి చనిపోయింది. అప్పట్నించీ ఇంట్లో తనూ, తన తండ్రీ భాగస్వాములుగా గడుపుతున్నారు. ఆ సంగతి అతని స్నేహితునికి తెలియ చేయడం, అతడు అలాంటి సంఘటన ఎంత దుఃఖాన్ని కలిగిస్తుందో దూరప్రాంతంలో ఉన్నవాడికి అర్థం కాదేమో అనిపించేటంత పొడిమాటలతో సానుభూతి తెలుపుతూ జవాబు వ్రాయడం జరగకపోలేదు. కాని, అప్పట్నుంచీ జార్జి వ్యాపారం, ఇతర విషయాలూ కూడా మరింత దృఢదీక్షతో చూసుకోవడం మొదలుపెటాడు.
బహుశః తన తల్లి బ్రతికి ఉండగా వ్యాపారంలో ప్రతి సంగతీ తన ఇష్టం ప్రకారమే జరగాలనీ తండ్రి పట్టుబడుతూ ఉండడంవలన తనకు తానుగా నిజమైన ఏ కార్యక్రమం కొనసాగించడానికి వీలులేకపోయింది.
ఆమె చనిపోయిన తరువాత తండ్రి వ్యాపారంలో ఇప్పటికీ ఉత్సాహంగానే పాల్గొంటూ ఉన్నా, వెనుకటి దూకుడు కొంత తగ్గిపోయింది. కేవలం యాదృచ్ఛికంగా అదృష్టం కలిసిరావడంవలన (ఆదీ నిజానికి సంభవమే!) ఎలాగో ఈ రెండేళ్ళలోనూ అనుకోని విధంగా వ్యాపారం పెరిగింది. ఉద్యోగస్థుల్ని అదనంగా రెట్టింపుమందిని వేసుకోవలసివచ్చింది. సాలుసరి వ్యాపారపు విలువ నిస్సందేహంగా అయిదింతలకు పెరిగింది. ఇంకా త్వరలో మరింత అభివృద్ధికి అవకాశం కనిపిస్తుంది.
కాని, జార్జి స్నేహితుడికి ఈ అభివృద్ధిని గురించి ఏమీ తెలియదు. తొలి సంవత్సరాలలో బహుశః సానుభూతి తెలుపుతూ వ్రాసిన ఉత్తరంలోనే ఆఖరుసారిగా జార్జిని రష్యా వలస వచ్చేయమనీ, జార్జి వ్యాపారశాఖవంటిదానికి అక్కడ మంచి విజయావకాశాలు ఉన్నాయనీ ప్రోత్సహించడానికి అతడు ప్రయత్నించాడు. అతను ఉదహరించిన మొత్తాలు ప్రస్తుతం జార్జి వ్యాపారపు మొత్తాలలో పోల్చిచూస్తే అత్యల్పాలు. అయినా, తాను వ్యాపారంలో సాధించిన విజయాన్ని గురించి మిత్రుడికి తెలియజేయడానికి అతడు వెనుకాడాడు. ఇక ఇప్పుడు ఆ వెనుకటి సంగతులు తెలియజేయడం అసందర్భంగా ఉంటుందిగద! అందుచేత, జార్జి ప్రశాంతమైన ఆదివారంపూట తీరిగ్గా ఆలోచిస్తూంటే మనస్సులోకి యథాలాపంగా వచ్చే అప్రధానమైన సాధారణ విషయాలను గురించి మాత్రమే తన లేఖలో వ్రాశాడు. తన స్నేహితుడు ఈ దీర్ఘ వ్యవధానంలో స్వదేశంలోని తన పట్టణాన్ని గురించి ఏర్పరచుకొని ఉండే భావాన్ని తను చెదరగొట్టకూడదని అతను ప్రధానంగా ఆశించాడు. ఆ ప్రకారం – దీర్ఘ వ్యవధానాల మధ్య జార్జి వ్రాసిన మూడు ఉత్తరాలలోను మూడుసార్లు ఒక అప్రధానమైన వరుడికి అంతగాను అప్రధానమైన వధువుతో సంబంధం నిశ్చయమైనట్లు తన స్నేహితుడికి వ్రాయడం, తను ఆశించినదానికి విరుద్ధంగా తన స్నేహితుడు ఆ ప్రముఖ సంఘటనలో ఆసక్తి చూపనారంభించడం జరిగింది.
అయినా, జార్జి ఒక నెలరోజులక్రితం ఒక గొప్ప కుటుంబంలోని పిల్ల ప్రాలీవ్ ప్రైడా బ్రాండెన్ ఫెల్డ్తో తనకు సంబంధం నిశ్చయమైన సంగతి కాక ఇలా తెలియజేశాడు: ‘ నేను చెప్పవలసిఉన్న ముఖ్యమైన వార్త చిట్టచివరికి అట్టేపెట్టాను. కలవారి ఇంటిపడుచు ప్రైడా బ్రాండెన్ ఫెల్డ్ తో నా వివాహం నిశ్చయమైంది. నీవు వెళ్ళిపోయిన తరువాత చాలాకాలానికి ఆమె ఈ ప్రాంతాలకు వచ్చింది గనుక నీవు ఆమెను ఎరిగుండే అవకాశంలేదు. ఆమెను గురించిన ఇతర విశేషాలు ముందుముందు చెబుతాను. ఇవాళ ఒక్క మాట మాత్రం చెబుతున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను: నీ నా మధ్య ఉన్న అనుబంధంలో వచ్చిన మార్పల్లా ఇదివరకు నీ స్నేహితుడు సర్వసాధారణమైన వ్యక్తి; ఇప్పుడు అతడు సంతోషపరవశుడు; అంతేకాకుండా నా కాబోయే వధువులో నీ కొక నమ్మకమైన స్నేహితురాలు లభించగలదు. ఒక బ్రహ్మచారికి అది అంత అప్రధానమైన సంగతి కాదుగదా! నా కాబోయే వధువు నీకు హార్దిక అభినందనలు పంపుతున్నది. త్వరలో స్వయంగానే నీకు వ్రాస్తుంది. మమ్మల్ని చూడడానికి నీవు రాలేకపోవడానికి అనేక కారణాలుంటాయని నాకు తెలుసు, కాని, అన్ని అడ్డంకులను త్రోసిపుచ్చడానికి నా వివహం సరియైన అవకాశం కాదా? అయినా నీ సొంత పరిస్థితులు జాగ్రత్తగా ఆలోచించుకుని నీకు ఏది మంచిదని తోస్తే అలా చెయ్యి!”
ఆ ఉత్తరం చేత్తోపట్టుకొని కిటికీలోనుంచి బయటికి చూస్తూ వ్రాతబల్ల ముందు చాలాసేపు జార్జి అలాగే కూచున్నాడు. వీధిలో పోతూ ఉన్న ఒక పరిచితుడు చేసిన అభినందనను పరధ్యానపు మందహాసంతో అందుకొన్నాడు.
చివరికి ఉత్తరం జేబులో పెట్టుకుని ఒక చిన్న హాలుగుండా నడిచి తండ్రి గదిలోకి వెళ్ళాడు. కొన్ని మాసాలుగా తను ఆ గదిలో ప్రవేశించి ఉండలేదు. నిజానికి ఇప్పుడు ఇలా ఆ గదిలోకి వెళ్ళవలసిన అవసరం లేదు. వ్యాపారరీత్యా రోజూ తండ్రిని చూస్తూనే ఉన్నాడు. ఇద్దరూ కలిసి భోజనశాలలో మధ్యాహ్నభోజనం చేస్తూనే ఉన్నారు. అయితే, సాయంత్రంపూట మాత్రం ఎవరి ఇష్టానుసారం వాళ్ళు గడుపుతున్న మాట వాస్తవమే! అప్పటికీ, జార్జి స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళడమో, లేక ఇటీవల తన కాబోయే వధువును చూడడానికి వెళ్ళడమో జరిగితే తప్ప, వారిద్దరూ కలిసి ఉమ్మడి హాలులో చెరొక వార్తా పత్రికా ముందు వేసుకుని కూచోడం జరుగుతూనే ఉంది.
చక్కగా ఎండ కాస్తున్న ఈ ఉదయం పూట కూడా తండ్రి గది అంత చీకటిగా ఉండడం జార్జికి ఆశ్చర్యమనిపించింది. అంటే ప్రక్కన ఉన్న ఇరుకు సందుకు అవతలి ఎత్తైన గోడ తాలూకు నీడ అంత ఎక్కువగా పడుతూందన్న మాట. ఒక మూల కిటికీ పక్కగా జార్జి చనిపోయిన తన తల్లి తాలూకు జ్ఞాపకచిహ్నాలు ఒక కంటికి మరీ వేలాడుతున్న చోట ఒక వార్తా పత్రికను చూపు సరిగా ఆనక దగ్గరగా పెట్టుకొని చదువుతూ తండ్రి కూచుని ఉన్నాడు. బల్ల మీద ఆయన ఉదయపు భోజనం తాలూకు అవశేషాలు ఉన్నాయి. ఆయన ఏమంత ఎక్కువగా భోజనం చేసినట్టు కనిపించదు.
“ఓ! జార్జ్!” అన్నాడు తండ్రి. లేచి అతని కెదురుగా నాలుగడుగులు వేస్తూ.
ఆయన బరువైన డ్రస్సింగు గౌను విప్పారి నడుస్తూ ఉంటే ఆయన చుట్టూ రెపరెప కొట్టుకుంది. “మా నాన్న ఇప్పటికీ రాక్షసుడిలాంటి మనిషే!” అనుకున్నాడు జార్జి తనలో తాను, “ఇక్కడ మరీ చీకటిగా ఉంది,” అన్నాడు పైకి.
“ఔను! తగినంత చీకటిగానే ఉంది” అన్నాడు తండ్రి.
“పై పెచ్చు మీరు కిటికీ కూడా మూసేసినట్టున్నారు.”
“అలా ఉండడమే నా కిష్టం.”
“బావుంది! బయట ఎంత వెచ్చగా ఉందో చూడండి!” అన్నాడు జార్జి తన వెనుకటి మాటను కొనసాగిస్తూ. అని కూచున్నాడు. తండ్రి తన ఉదయ భోజనపు పళ్ళాలు సద్ది బీరువాలో పెట్టాడు.
శూన్యంగా తండ్రి కదలికలను గమనిస్తూ కూచుని ఉన్న జార్జి అన్నాడు: “ఏం లేదు! మీతో చెబుదామని వచ్చాను. నా వివాహసంబంధాన్ని గురించిన వార్త పీటర్స్ బర్గ్ కి తెలుపుతున్నాను,” జేబులోనుంచి ఉత్తరం కొంచెం పైకిలాగి మళ్ళీ లోపలికి నెట్టేశాడు.
“పీటర్స్ బర్గ్ కా?” అన్నాడు తండ్రి.
“అక్కడ ఉన్న నా స్నేహితుడికి, ” తండ్రి కళ్ళలోకి చూడాలని ప్రయత్నిస్తూ బదులు చెప్పాడు జార్జి. ‘వ్యాపార సమయంలో ఆయన మరో విధంగా ఉంటాడు; ఇక్కడ చేతిమీద చేయి వేసుకుని ఎంత గంభీరంగా కూచున్నాడు!’ అనుకొన్నాడు.
“ఔనౌను! నీ స్నేహితుడికి!” అని విచిత్రంగా ఒత్తి పలికాడు తండ్రి.
“ఔను నాన్నా! మొదట నా వివాహ సంబంధం సంగతి అతనికి తెలియజేయవద్దనుకున్నాను. అతని మీద దయ తలచి; ఆదొక్కటే కారణం. మీకూ తెలుసు గదా, అతను చిత్రమైన మనిషి. ఇతరు లెవరైనా నా పెళ్ళి సంబంధం సంగతి చెబితే చెప్పనీ! అతను ఒంటరిగాడు అవడంవలన అదీ అంత సంభావ్యం కాదు. అలాంటి దానిని నేను అడ్డగించలేను. కాని నా అంతట నేను మాత్రం అతనికీ విషయం చెప్పకూడదు, అనుకున్నాను.”
”అయితే ఇప్పుడు నువ్వు నీ మనసు మార్చుకున్నావు?” అడిగాడు తండ్రి పెద్ద సైజు వార్తా పత్రిక కిటికీ అంచున పెట్టి దానిమిద తన కళ్ళజోడు ఉంచి దానిని ఒక చేత్తో కప్పుతూ.
“ఔను! ఆ సంగతి బాగా ఆలోచించాను. అతను నాకు మంచి మిత్రుడయితే నాకు సంతోషంగా వివాహసంబంధం కుదిరినందుకు అతనూ సంతోషపడాలి అనుకున్నాను. అందుకని ఈ మాట అతనికి చెప్పడం ఇంక వాయిదా వేయదలుచుకో లేదు. కాని, ఉత్తరం పోస్టులో వేసేముందు మీకు తెలియజేద్దామని వచ్చాను.”
“జార్జ్!” పళ్ళులేని బోసి నోరు ముందుకి పెట్టి అన్నాడు తండ్రి,”జాగ్రత్తగా విను! ఈ విషయం నాతో మాట్లాడడానికని నువ్వు వచ్చావు. నిస్సందేహంగా అది నీకు గౌరవాపాదకమే! కాని, నువ్వు పూర్తి నిజం నాకు చెప్పకపోతే ఇదంతా వట్టి మాయ! అంతకంటే నికృష్టం! నేను ఇక్కడ ఉదాహరించడానికి వీలులేని విషయాలు ఇప్పుడు కదలించదలచుకోలేదు. మీ అమ్మ చనిపోయినప్పటి నుంచీ కొన్ని సంగతులు జరిగినయి. అవి సరి అయినవి కావు. వాటిని గురించి చెప్పే రోజు వస్తుంది, మనం అనుకుంటున్న దానికంటె త్వరలోనే రావచ్చు. వ్యాపారంలో నాకు తెలియకుండా చాలా పనులు జరుగుతున్నయి. పూర్తిగా నాకు పరోక్షంగా జరుగుతున్నాయని నే ననటం లేదు. నేనింక పనులు చూడలేక పోతున్నాను. నా జ్ఞాపకశక్తి తగ్గుతూంది. చాలా విషయాల్ని గురించి ఇప్పుడు నేను పట్టించుకోవడం లేదు. మొదటి సంగతి: ఇది ప్రకృతి శాపం. రెండవది మీ అమ్మ చావు నీకంటే నాకు తీరని ఆఘాతమైంది. ఇప్పుడెలాగూ ఆ సంగతి మాట్లాడుతున్నాం గనక, ఈ ఉత్తరం విషయంలో జార్జ్! నిన్ను బ్రతిమిలాడుకుంటున్నాను. నన్ను మోసం చెయ్యకు! ఇది స్పల్పవిషయం నాతో చెప్పవలసినంత అవసరం లేదు. నన్ను మోసం చెయ్యకు! నిజంగా నీ ఈ స్నేహితుడు సెయింట్ పీటర్ బర్గ్ లో?”
గాభరాపడుతూ జార్జి లేచి నుంచున్నాడు. “నా స్నేహితుల సంగతి మీకెందుకు లెండి! వెయ్యిమంది స్నేహితులైనా నాకు మా నాన్నంత కారు. నేనే మనుకుంటున్నానో తెలుసా? మీ విషయంలో మీరు తగినంత శ్రద్ధ తీసుకోవడం లేదు. పెద్దతనంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు లేకుండా వ్యాపారంలో నేనేమీ చెయ్యలేను ఆ సంగతి మీకు బాగా తెలుసు. వ్యాపారం మీ ఆరోగ్యానికి ముప్పుతెచ్చే పక్షంలో రేపే ఆ వ్యాపారాన్ని శాశ్వతంగా మూసివేయడానికి నేను సిద్ధం. కాని, అది చాలదు. మీ జీవిత విధానం సూరాలి. మౌలికమైన మార్పు తెచ్చుకోవాలి. అక్కడ ఆ హాల్లో బోలెడంత వెలుతురు ఉంటే మీరీ చీకట్లో కూచుంటారు. ఉదయ భోజనం ఏదో కతికి బలం పట్టకుండా చేసుకుంటున్నారు. కిటికీ మూసుకుని కూచుంటారు. గాలి మీకు చాలా మంచిది. ఇలా కాదు నాన్నా! డాక్టరుని తీసుకువస్తాను. ఆయన ఆదేశాలు పాటిద్దాం! ఈ గది మారుద్దాం. మీరు ముందు గదిలోకి మారవచ్చు. నేను ఇక్కడికి వస్తాను. మీకేమీ మార్పు కనిపించదు. మీ సామాన్లన్నీ మీతో వస్తాయి. కాని, అవన్నీ తరువాత చూసుకోవచ్చు. ఇప్పుడు ముందు మిమ్మల్ని పడుకోపెడతాను రండి. మీకు విశ్రాంతి చాలా అవసరం. రండి మీ దుస్తులు తీసివేయడానికి నేను సాయం చేస్తాను. నాకు చేతనవును మీకే తెలుస్తుంది. లేక ఇప్పుడే మీరు ముందుగదికి వెళతానంటే ప్రస్తుతానికి నా పరుపు మీద మీరు పడుకోవచ్చు. అదే చాలా మంచిపని!”
జార్జి తండ్రికి దగ్గరగా ఆనుకుని నిల్చున్నాడు. తండ్రి నెరిసిపోయిన చింపిరి జుట్టు అతని రొమ్ములమీద ఆనేటట్టు వంగాడు.
“జార్జ్!” కదలకుండా హీనస్వరంతో అన్నాడు తండ్రి.
వెంటనే తండ్రి ప్రక్కన మోకరిల్లాడు జార్జి. ముసలివాని అలసిపోయిన ముఖంలో ప్రక్కలగుండా నిదానంగా తన వైపే చూస్తున్న రెండు పెద్ద కనుగ్రుడ్లు అతడు చూశాడు.
‘సెయింట్ పీటర్స్ బర్గ్ లో నీకు స్నేహితుడు లేడు, నువ్వెప్పుడూ నాకు టోకరా ఇస్తూనే ఉన్నావు. నా కాలు పుచ్చుకుని లాగడానికి నీకు సంకోచంలేదు. నీ కంత దూరాన ఎలా స్నేహితుడుంటాడు? నేను నమ్మలేను.”
“వెనుకటి సంగతులు జ్ఞాపకం తెచ్చుకోండి నాన్నా!” అన్నాడు జార్జి. తండ్రిని కుర్చీలోనుంచి పైకి లేవనెత్తుతూ. ఆయన దుర్బలంగా నిలబడగా డ్రస్సింగ్ గౌను ఊడబీకుతూ, ‘ఆఖరుసారి అతడు మనల్ని చూడడానికి వచ్చి మూడేళ్ళు కావస్తుంది. మీకతనంటే ఎక్కువ ఇష్టం లేదని నాకు జ్ఞాపకం ఉంది. కనీసం రెండు సార్లు అయినా అతడు నాతోకూడా నా గదిలో కూచుని ఉన్నా అతణ్ణి మీరు కలుసుకోకుండా నేను నివారించాను. మీ కతనంటే అనిష్టత ఉండడాన్ని నేనర్థం చేసుకోగలను. అతడి విచిత్రలక్షణాలు అతని కున్నాయి. కాని, తరువాత తరువాత మీరు అతనితో సరిపుచ్చుకున్నారు. అతని మాటలు వింటూ తల ఊపుతూ, అతన్ని ప్రశ్న లడుగుతూ ఉండడం చూసి నేను గర్వపడ్డాను. మీరు గతంలోకి చూస్తే మీకు తప్పకుండా జ్ఞాపకం వస్తుంది, రష్యన్ విప్లవాన్ని గురించి ఏమాత్రం నమ్మడానికి వీలులేని చిత్రమైన కథలు అతను చెబుతూండేవాడు. ఉదాహరణకి అతడు వ్యాపారపుపని మీద ‘కీవ్’ నగరానికి వెళుతూ ఓ గుంపుమధ్య చిక్కుకుని, ఒక మేడమీదికి వరండాలో తన అరచేతిలో సిలువగుర్తు కోసుకుని ఆ అరచేతిని పైకెత్తి జనాన్ని ఉద్భోధిస్తున్న మతాచార్యుణ్ణి చూసినట్టు చెప్పాడు. అటు తర్వాత ఆ కథను ఒకటి రెండుసార్లు మీరే స్వయంగా చెప్పారు కూడాను!”
ఈలోగా జార్జి తండ్రిని తిరిగి కూచోపెట్టి, జాగ్రత్తగా ఆయన ఉలెన్ డ్రాయర్లూ మేజోళ్లూ ఊడదీశాడు. తండ్రితాలూకు ఆ లోపలిదుస్తులు అపరిశుభ్రంగా ఉండడం చూసి తను అశ్రద్ధ వహించినందుకు తనని తాను నిందించుకున్నాడు. తన తండ్రి లోపలి దుస్తుల్ని ఎప్పటికప్పుడు మార్పిస్తూ ఉండడం నిశ్చయంగా అతని బాధ్యత. తన కాబోయే వధువుతో భవిష్యత్తులో తన తండ్రి విషయమై ఏమి ఏర్పాట్లుచేయాలో అతడింకా సూటిగా గుర్తించలేదు. ఏమంటే పైకి అనుకోకపోయినా వివాహం అయినతరవాత పాత ఇంట్లో తండ్రి ఒక్కడే ఉండడం ఖాయమన్నట్టే తాము వర్తిస్తున్నారు. కాని, ఇప్పుడు తన నూతనగృహానికి తండ్రిని తమవెంట తీసుకు వెళ్ళాలని వెంటనే దృఢంగా నిశ్చయం చేసుకున్నాడు. నిదానించి చూస్తే తన తండ్రి విషయంలో తీసుకోదలచిన శ్రద్ధ కాలం మించిపోయిన తరవాత తీసుకోవడం కాగలదని అనిపించింది.
తండ్రిని రెండు చేతులతో ఎత్తి పరుపుమీద పడుకోపెట్టాడు. ప్రక్కవైపు ఆ నాలుగడుగులూ నడుస్తూ ఉండగా ఆ వృద్ధుడు రొమ్ముమీది తన గడియారపు గొలుసుతో ఆడుకుంటూ ఉండడం చూసి అతనికి చాలా భయమైంది. ఆయన గట్టిగా గడియారపుగొలుసు పట్టుకొని ఉన్నందువలన ఒక నిమిషంపాటు ఆయనను పక్కమీద పడుకో పెట్టలేకపోయాడు.
ఆయన్ని పక్కమీద పడుకోపెట్టగానే, అంతా సవ్యంగా ఉన్నట్టు కనిపించింది. రగ్గు ఆయన భుజాలదాకా కప్పుకున్నాడు. కళ్ళెత్తి జార్జివంక బొత్తిగా ప్రేమ లేని ఒక చూపు చూశాడు.
“నా స్నేహితుడు ఇప్పుడు మీకు జ్ఞాపకంవస్తున్నాడు కదండీ?” ఉత్సాహంగా తల ఊపుతూ అడిగాడు జార్జి.
” నాకు రగ్గు పూర్తిగా కప్పినట్టేనా?” పాదాలకు రగ్గు కప్పిఉందో లేదో తను చూసుకోలేనట్టు అడిగాడు తండ్రి.
“అప్పుడే మీకు పడకలో వెచ్చదనం తెలుస్తోందన్నమాట!” అని జార్జి రగ్గు ఒంటికి మరింత అంటి పెట్టుకుని ఉండేటట్టు లోపలికి దోపాడు.
“నాకు పూర్తిగా రగ్గు కప్పేసినట్టేనా?” మళ్ళీ అడిగాడు తండ్రి, చిత్రంగా కొడుకునుంచి జవాబు ఆశిస్తున్నట్లు కనిపిస్తూ.
“ఆదుర్దాపడకండి. పూర్తిగా కప్పినట్టే’
“లేదు” అరిచాడు తండ్రి, కొడుకు జవాబును మధ్యలో త్రుంచివేస్తూ, రగ్గు పైకి ఎగిరిపోయేటంత విసురుగా విదిలించివేస్తూ నిటారుగా ప్రక్కమీద లేచి కూచున్నాడు. మనిషి తూలిపోకుండా ఒక చేత్తో తేలికగా పైన పట్టుకున్నాడు.
“నువ్వు పూర్తిగా నా కళ్ళు కప్పాలనే చూస్తున్నావు. నాకు తెలుసురా! నా చిన్నారిపాపా! కాని, నాకింకా పూర్తిగా కళ్ళు మూసుకుపోలేదు. ఇదే నా కడపటి బలమైనా నీకు ఇది చాలు; ఎక్కీతక్కీగా చాలు. అవును! నాకు నీ స్నేహితుడు తెలుసు. వాడు నా మనస్సుకి నచ్చిన కొడుకులాంటివాడు నాకు. అందుకనే ఇన్నేళ్ళు గానూ వాణ్ణి నువ్వు మోసం చేస్తున్నావు. అతని పరిస్థితికి నేను విచారించడం లేదనుకుంటున్నావు కదూ! అందుకే నువ్వు నీ ఆఫీసు గదిలో కూచుని తలుపులు బిడాయించుకుంటున్నావు – యజమానిగారికి తీరిక లేదు; ఆయనను డిస్టర్బ్ చేయకూడదు. నువ్వు రష్యాకి నీ అబద్ధాలకోరు ఉత్తరాలు వ్రాసుకుంటూ ఉండడానికి వీలుగా. కాని, దేవుడి దయవల్ల కొడుకునెలా అర్థం చేసుకోవాలో తండ్రికి నేర్పనక్కరలేదు. ఇప్పుడు ఆ మిత్రుణ్ణి పూర్తిగా అధః పాతాళంలోకి తొక్కేసి, వాడు మళ్ళీ కదలకుండా వాడి మీద బై కాయించానని నమ్ముతూన్నందువల్ల ఇప్పుడు నా సుపుత్రుడు వివాహం చేసుకోడానికి నిశ్చయించుకున్నాడు.”
తండ్రి కల్పించిన ఈ అభాండానికి తెల్లబోయి చూశాడు జార్జి. ఒక్క సారిగా తన తండ్రి అంత పరిచితుడుగా కనిపిస్తున్న సెయింట్ పీటర్స్ బర్గ్ లోని తన స్నేహితుడు లోగడ ఎప్పుడూ లేనంత స్పష్టంగా అతని భావనాపథంలో మెరిశాడు. విస్తృతమైన రష్యాలో కనపడకుండా కలిసిపోయిన అతనిని జార్జి చూశాడు. దోపిడీకి గురి అయి ఖాళీ అయిపోయిన ఒక గిడ్డంగి గుమ్మం దగ్గర అతనిని చూశాడు. ఛిన్నభిన్నమైన షోకేసుల మధ్య, చెల్లా చెదరుగా పడి ఉన్న సరుకు తాలూకు ఆవ శేషాల మధ్య, క్రింద పడబోతున్న గాస్ బ్రాకెట్ల మధ్య అప్పుడే అతడు లేచినుంచుంటున్నాడు. అంత దూరదేశం అతడు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? –
“నా మాటలు శ్రద్ధగా విను!” అరిచాడు తండ్రి. జార్జి ఉలిక్కిపడి సంగతంతా శ్రద్ధగా ఆకళింపు చేసుకునేందుకు మంచంవైపు పరుగెత్తాడు. కాని, సగం దారిలోనే నిలిచిపోయాడు.
“ఆమె తన గౌను పైకెత్తిందని!” తండ్రి సాగదీస్తూ అన్నాడు. “ఆ దౌర్భాగ్యురాలు ఇలా తన గౌను పై కెత్తిందని,” ఆమెను అనుకరిస్తూ తన చొక్కా పైకి ఎత్తాడు. యుద్ధంలో తగిలిన గాయంవలన తొడమీద ఏర్పడిన మచ్చ కనిపించేటంతగా చొక్కా పైకి ఎత్తాడు. “ఆమె ఇలా తన గౌను పైకి ఎత్తిందని, అయినా అమెతో నువ్వు రాజీపడ్డావు. ఏ పోరూ పొక్కూ లేకుండా ఆమెతో నువ్వు స్వేచ్ఛగా కులకడం కోసం నీ తల్లి స్మృతిని నువ్వు కళంకితం చేశావు. స్నేహితుణ్ణి వంచించావు. కాని, నీ తండ్రి కదలగలడు. కదలలేడనుకుంటున్నావా?”
ఆయన లేచి, ఏమీ పట్టుకోకుండా నిల్చుని కాళ్ళు విదిలించాడు. ఆయన అంతర్ దృష్టి ఆయనను ప్రకాశవంతంగా చేసింది.
తండ్రికి సాధ్యమైంత దూరంగా ఒక మూల ఒదిగి నిల్చున్నాడు జార్జి. చాలా కాలం క్రితం అతని మనస్సులో దృఢనిశ్చయం చేసుకున్నాడు. తండ్రి ప్రతి కదలికా శ్రద్ధతో గమనించాలనీ, పరోక్షమైన దాడిలో వెనుకనించో, మీదనుంచోతన మీదికి లంఘించి తనని ఆశ్చర్యపరిచే అవకాశం ఆయనకు ఈయకూడదనీ, చాలా రోజులుగా మరచిపోయిన ఆ నిశ్చయం ఆ క్షణంలో అతనికి జ్ఞాపకం వచ్చింది. పొట్టి దారపు ముక్కను సూదిబెజ్జంలో ఎక్కిస్తున్నవాడిలాగా, అంతలో మళ్ళీ అతను ఆ మాట మరచిపోయాడు.
‘ఇంత చేసినా నీ స్నేహితుడు వంచింపబడలేదు,” చూపుడువేలు ఆడిస్తూ గట్టిగా అన్నాడు తండ్రి. “అతని ప్రతినిధిగా ఇక్కడ నేనున్నాను.”
“ఏమిటి ప్రహసనంలో విదూషకుడిలాగా!” పట్టలేక జార్జి ఆ జవాబు పైకి అనేశాడు. వెంటనే దానివలన జరిగిన హానిని అతడు గుర్తించి కళ్ళు తిరగ్గా నాలిక కొరుక్కుని ఆ బాధతో క్రింద చతికిలబడ్డాడు.
‘ఔను! నేను ఇన్నాళ్లూ ప్రహసనమే ఆడుతున్నాను. ప్రహసనం! చాలా మంచిమాట! నిర్భాగ్యుడైన ఒక వృద్ధ భార్యావియోగికి మిగిలిన సుఖం ఇంకేముంది? చెప్పరా! జవాబు చెప్పేటప్పుడు నా బ్రతికి ఉన్న నిజమైన కొడుకుగా జవాబుగా చెప్పు! నాకింక మిగిలిఉన్న దేమిటీ అని. ఈ మారుమూల గదిలో, విధేయత చూపని ఉద్యోగులతో, ఎముకలదాకా వ్యాపించిన వార్ధక్యంతో ఏం మిగిలింది నాకు? కొడుకు లోకంలో కులుకుతూ తిరుగుతూ ఉంటే, తను అమర్చిపెట్టిన బేరాలు పైసలు చేస్తూఉంటే, విజయానందంతో ఉప్పొంగిపోతూ గౌరవనీయుడైన వ్యాపారస్థుడిలాగ తండ్రినుంచి దూరమవుతూ ఉంటే ఇంక నాకు మిగిలిందేమిటి? నేను నిన్ను ప్రేమించలేదనుకుంటున్నావా నువ్వు ఎంతగా నన్ను తిరస్కరిస్తున్నా?”
ఇప్పుడింక ముందుకు వంగుతాడు అనుకున్నాడు జార్జి. ఒకవేళ తూలి కింద పడిపోతే? అతని మనస్సులో గుసగుస ధ్వని చేస్తూ ఈ మాటలు కదలిపోయినయి.
తండ్రి ముందుకు వంగాడు. కాని, పడిపోలేదు తను అనుకున్నట్టుగా జార్జి తన దగ్గరకు రాకపోవడం వల్ల మళ్ళీ నిటారుగా నిలబడ్డాడు
”ఉన్నచోటే నిలబడు! నీ అవసరం నాకు లేదు. నా దగ్గరకు వచ్చే శక్తి నీకు ఉందనీ, నువ్వు కావాలనే దూరంగా నిలబడ్డాననీ అనుకుంటున్నావా? అంత గట్టి నమ్మకం పెట్టుకోకు! ఇప్పటికీ మనిద్దరిలో నేనే బలమైనవాణ్ణి, నా మట్టుకు నేనే అయితే ఈ పాటికి నా బలం తగ్గి ఉండేది. కాని, మీ అమ్మ తన బలం కూడా నాకు ఇచ్చిపోయింది. అందువల్లనే నీ స్నేహితుడితో నేను చక్కని సంబంధం పెట్టుకో గలిగాను. నీ కాతాదార్లందరూ ఇదిగో ఈ జేబులో ఉన్నారు.”
“ఈయన చొక్కాకి కూడా జేబులున్నాయే!” అనుకున్నాడు జార్జి తనలో తను. ఆ మాటతో లోకంలో ఆయనను సాధించగలవారెవ్వరూ లేరనే నమ్మకం అతనికి కుదిరిపోయింది. కేవలం ఒక్క క్షణం పాటే అలా అనుకున్నాడు. ఏమంటే అన్నీ క్రమంగా అతను మరిచిపోతూ వస్తున్నాడు.
“నీ కాబోయే వధువును కూడా వెంట పెట్టుకొని నా దారిని అడ్డగించడానికి ప్రయత్నించి చూడు! నీ ప్రక్కన నిలిచి ఉండగానే ఆమెను విసిరివేస్తాను. ఆ పని ఎలా చేస్తానో నీకు తెలియదు.”
ముడుచుకున్న ముఖంతో జార్జి తన అపనమ్మకం ప్రదర్శించాడు. తండ్రి తన మాటల నిజాన్ని దృఢవరుస్తూ, జార్జి ఉన్న మూల వైపు తల పంకించాడు.
” ‘వివాహ సంబంధం సంగతి స్నేహితుడికి తెలియచేయాలా?’ అని నన్ను ఆడగడానికి వచ్చి ఇవాళ నాకు ఎంత వినోదం కలిగించావు! ఒరే మూర్ఖుడా! నీ సంగతి ఇదివరకే తెలుసురా నాకు! అంతా పూర్తిగా తెలుసు. వ్రాత పరికరాలు నా నుంచి దూరం చేయడం నువ్వు మరచి పోయినందువల్ల అతనికి నేను వ్రాస్తూనే ఉన్నాను. అందుకే, ఇన్నేళ్ళుగా అతనిక్కడికి రాలేదు. నీ కంటె వందరెట్లు ఎక్కువ బాగా అతనికి అన్ని సంగతులూ తెలుసు. నీ ఉత్తరాలు తెరవనైనా తెరవకుండా ఎడమ చేత్తో నలిపి పారవేస్తూ ఉంటాడు. కుడి చేత్తో నా ఉత్తరాలు పట్టుకుని ఆద్యంతం శ్రద్ధగా చదువుతూ.
తన ఉత్సాహంలో ఆయన తల మీదుగ తన చేయి విసురుకున్నాడు.
‘అన్ని సంగతులూ వెయ్యిరెట్లు ఎక్కువ బాగా అతనికి తెలుసు,’ గట్టిగా’అన్నాడు.
“పదివేల రెట్లు!” అన్నాడు జార్జి, తండ్రిని వేళాకోలం చేయడానికి. కాని,
అతని నోట్లో ఆ మాటలు చాలా నిజంగా అన్నట్టు ధ్వనించాయి.
“ఇలాంటి ఏదో ఒక ప్రశ్నతో నువ్వు వస్తావని సంవత్సరాల తరబడి నేను ఎదురు చూస్తున్నాను. ఇంతకంటె నేను మరో విషయం పట్టించుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావా? ఇదిగో చూడు!” అని ఎలాగో ఆయన మంచంమీద వచ్చిపడిన ఒక వార్తా పత్రిక కాగితం జార్జివైపుకి విసిరాడు. పాత వార్తా పత్రిక! పేరు జార్జికి పూర్తిగా అపరిచితం!
“ఎంతకాలం పట్టిందిరా నువ్వు పెద్దవాడివవడానికి! నీ తల్లి చచ్చిపోవలసి వచ్చింది. ఈ శుభదినం చూడడానికి ఆమె నోచుకోలేదు. రష్యాలో నీస్నేహితుడు సర్వనాశనం అయిపోతున్నాడు. మూడేళ్ళ క్రితమే తగినంతగా పచ్చబడిపోయాడు. ఇక నా సంగతి అంటావా? నేను ఏ స్థితిలో ఉన్నానో నువ్వు చూస్తూనే ఉన్నావు. అందుకు నీ తలలో ఇంకా కళ్ళు మిగిలి ఉన్నాయి.”
“అంటే, నా కోసం ఇన్నాళ్లూ పొంచి ఉన్నారన్న మాట!” అన్నాడు జార్జి.
జాలి పడుతున్నట్టు, అతి తేలికగా తండ్రి అన్నాడు. “ఆ మాట నువ్వు ఇంకా కొంచెం ముందరే అంటావనుకున్నాను. కాని, నువ్వు ఇప్పుడు అన్నా ఏమీ ఫరవాలేదు,” మరింత గొంతుకతో – “ఇప్పుడు నువ్వుగాక ఈ ప్రపంచంలో ఇంకా ఎంత ఉందో నీకు తెలిపి ఉంటుంది. ఇంతవరకూ నిన్ను గురించి మాత్రమే నీకు తెలుసు. అమాయికపు పసిపాపవి! అవును. నిజం. కాని, అంతకంటె నిజం. __ నరరూపరాక్షసుడివి! అందుచేత ఇదిగో స్వీకరించు: నీళ్ళలోపడి చావాలని నీకు నేను శిక్ష విధిస్తున్నాను.”
జార్జికి ఆ గదిలోనుంచి బయటపడేట్టు ఏదో శక్తి తొందర చేసినట్టనిపించింది. అతడు పరుగెత్తి పోతూవుంటే తండ్రి దభీమని మంచంమీద పడిన చప్పుడు ఇంకా అతని చెవులలో మ్రోగుతూనే ఉంది. మెట్లమీద వాలు బల్లనుంచి జారినట్టు శర వేగంతో దిగుతూ ఉదయం గది ఊడవడానికి మేడమీదికి వస్తున్న పనిమనిషితో ఢీ కొన్నాడు. “హాయ్ జీసెస్!” అంటూ ఆమె తన చేతి గుడ్డతో ముఖం కప్పుకుంది.
కాని, అప్పటికే అతడు వెళ్ళిపోయాడు. వీథి గుమ్మందాటి, రోడ్డుదాటి, వీళ్ళవైపు. ఎవరో తరుముతున్నట్టు పరుగెత్తాడు. నది ఒడ్డున ఉన్న ఇనుప బద్దీలు చేరుకునేసరికి, పస్తులున్న మనిషి అన్నం మీదికి ఎగబడినట్టు అతను రొప్పుతున్నాడు. చిన్నప్పుడు తల్లి తండ్రులు గర్వంతో పొంగిపోయేందుకు కారణమైన పేరు పొందిన వస్తాదు.తను. అలాంటి వస్తాదులాగ ఇనుప బద్దీ పట్టుకుని వ్రేలాడుతూ ఒకసారి ఊగాడు. దూరంగా మోటారు బస్సు వస్తూ ఉండడం చూశాడు. తాను నీళ్ళలో పడే చప్పుడును ఆ బస్సు ధ్వని కప్పివేస్తుంది కదా అనుకుని ఒక్కసారి మెల్లగా “ప్రియమైన తల్లి తండ్రులారా! ఎన్ని చెప్పినా నే నెప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను,” అని పట్టువదలి నీళ్ళలోకి జారిపోయాడు.
అదే క్షణంలో నిరంతరాయమైన ప్రవాహంగా బ్రిడ్జిమీద ట్రాఫిక్ సాగిపోతూంది.
Featured image: A street in Prague where Kafka spent most of his time.
25-11-2025


క్షయ పాత్ర!
సర్…ఎంతటి వ్యక్తీకరణ ఇది🙏
అవును.