
అందెశ్రీని మొదటిసారి కలుసుకున్నది ముప్ఫై ఏళ్ళ కిందట. సి.వి.కృష్ణారావుగారు నడిపే నెలనెలా వెన్నెల సమావేశంలో. మాసాబు టాంకు ఇంటిదగ్గర. ఆ రోజు కృష్ణారావుగారు అందెశ్రీ గురించి నాలుగైదు పరిచయ వాక్యాలు చెప్పారు, సాధారణంగా తాను చూసిన కొత్త కవిగురించి, తనో కొత్త నక్షత్రాన్ని చూసినట్టే చెప్తారే, అదే శైలిలో. అప్పుడు అందెశ్రీని ఒక పాట పాడమని అడిగారు. ఆయన క్షణం కూడా జాగు చెయ్యకుండా-
కొమ్మ చెక్కితె బొమ్మరా
కొలిసి మొక్కితె అమ్మరా
ఆదికే ఇది పాదురా
కాదంటె ఏదీ లేదురా
గీతం వినిపించారు. ఆ పాటకన్న ఆయనకి మరో పరిచయవాక్యం అవసరం లేదనిపించింది. ఆ తరువాత మూడు దశాబ్దాల కాలం, ఆయనా, నేనూ ఎక్కడో దూరం నుంచో లేకపోతే ఏదన్నా సమావేశంలో దగ్గరనుంచో చూసుకుని చిరునవ్వు నవ్వడం తప్ప పెద్దగా మాట్లాడుకున్నది లేదు. కాని ఆ మధ్యకాలమంతటా, ఎవరికైనా పోను చేసినప్పుడు, ఆ మొబైల్లో ‘మాయమైపోతున్నడమ్మా, మనిషన్నవాడూ’ అని వినబడ్డప్పుడల్లా అందెశ్రీ గుర్తొచ్చేవారు విధిగా.
మూడేళ్ళ కిందట, ఒక రోజు ఆయన హఠాత్తుగా మా ఇంటికొచ్చారు. ఆ రోజు మరెవరో మిత్రుడు కూడా పక్కనున్నాడు. ఆయన చాలా సేపే కూచున్నారు. ముప్ఫై ఏళ్ళుగా నాతో మాట్లాడాలనుకున్నవన్నీ గుక్క తిప్పుకోకుండా మాట్లాడాలనుకున్నారు. కాని ఆయన వచ్చిన పని ప్రధానంగా ఇది. ప్రసిద్ధ థేరవాద భిక్షువు, అనువాదకుడు, నికాయాలనుంచి ముఖ్యపాళీ గ్రంథాల్ని తెలుగు చేస్తున్న భిక్కు ధమ్మరక్ఖిత తో ఆయన ఒక పుస్తకం రాయించారు. బుద్ధుడి బోధనల్ని, పాళీలో ఉన్నవాటినుంచి కొన్ని ఎంపికచేసిన ముఖ్యభాగాలను, బుద్ధుడి జీవితచరిత్రతో కలిపి ఒక పుస్తకం రాయించారు. దానికి ‘స్వర్ణహంస’ అని తనే పేరుపెట్టారు. ఆ పుస్తకానికి నాతో ముందుమాట రాయించడం కోసం నాదగ్గరికి వచ్చారు.
ఆ రోజు ఆయన ఉద్వేగం, ఆ మాటలు, స్వర్ణహంస అని పేరెందుకుపెట్టారో, అవన్నీ విన్న ఉత్సాహంలో ముందుమాట రాయడానికి ఒప్పుకున్నానుగాని, నాకు ధైర్యం చాల్లేదు. ఆ పుస్తకం ఆరునెలలకు పైగా నా దగ్గర ఉండిపోయింది. చివరికి ఒకరోజు ఆయనకు ఫోను చేసి ముందుమాట రాయలేనని చెప్పాను. చెప్పానేగాని, ఆ తర్వాత రెండుమూడు నెలలపాటు నా మనసుకి స్థిమితం చెక్కలేదు. బుద్ధవాణిని ఒక బౌద్ధభిక్షువు తెలుగులోకి తీసుకువచ్చినప్పుడు, వినయంగా నాకు వచ్చినదేదో నాలుగు మాటలు రాయాలి తప్ప రాయలేనని చెప్పడం సమంజసం కాదనిపించింది. అందుకని ఆయనకి మళ్ళా ఫోను చేసాను. ‘ఆ ముందుమాట మీరే రాయాలి, రాస్తారని నాకు తెలుసు, అందుకనే ఎదురుచూస్తున్నాను’ అన్నారు ఆయన. ఆ మాటల్లో ఎంత నమ్మకం! బహుశా ఆ నమ్మకమే నాతో చివరికి ఆ వ్యాసం రాయించింది.
ఆ తర్వాత దీర్ఘాసి విజయభాస్కర్ ఉపనిషత్తుల్ని తెలుగులోకి అనువదించిన పుస్తకం’సృష్టిగర్భ’ కూడా ఆయనే ప్రచురిస్తున్నారని తెలిసినప్పుడు సంతోషమూ, ఆశ్చర్యమూ రెండూ కలిగేయి. విశాఖపట్టణంలో జరిగిన ఆ పుస్తకావిష్కరణ సభలో కూడా మేమిద్దరం పాల్గొన్నాం. ఆ రోజు ఆయన ప్రసంగం గొప్ప భావోద్వేగంతో సాగింది. ఆ మాటలు వినడం ఒక అనుభవం.
ఆ మధ్యాహ్నం హోటల్లో భోజనం చేస్తున్నప్పుడు తాను విజయభాస్కర్ తో కలిసి చేపట్టబోతున్న ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ‘వాక్కులమ్మ ప్రచురణలు’ పేరిట తత్త్వశాస్త్రం గురించీ, భారతీయ దర్శనాల గురించీ, ముఖ్యంగా బౌద్ధం గురించీ పుస్తకాలు తేవాలని తన మనసులో ఉన్న ఎన్నో ప్రణాళికల్ని ఆ రోజు మాకు చెప్తూనే ఉన్నారు.
రెండుమూడు వారాల కిందట ఒక రాత్రి మళ్ళా హఠాత్తుగా ఫోను. ‘మీరు నాకు జ్ఞానభిక్ష పెట్టాలి’ అంటూ. ఆయన మాట్లాడే తీరు అది. భిక్ష అని అంటున్నారంటే, మళ్ళా ఏదో పెద్ద బాధ్యత నా భుజాన వేయబోతున్నారని అర్ధం. ఏమిటన్నాను. ‘భారతదేశంలో బౌద్ధం ఉత్థానపతనాల మీద ఒక సమగ్రమైన పుస్తకం కావాలి. అది మీరే రాయాలి’ అన్నారు. ‘దానికొక జీవితకాలం పడుతుంది’ అని మనసులో అనుకున్నాను. కానీ కాదనలేదు. కాదని ఆయన్నుంచి తప్పించుకోవడం కష్టం.
మొన్న, మొన్న అంటే మొన్ననే, ఆయన్నుంచి మళ్ళా ఫోను. ‘నిన్న రాత్రి ఒంటిగంటనుంచి రెండున్నరదాకా మృణాళిని గారు మిమ్మల్ని చేసిన ఇంటర్వ్యూ చూసాను. నాకో ప్రశ్న ఉండిపోయింది. మీరే చెప్పాలి ‘ అన్నారు. ఆ తర్వాత ఒక అరగంట పాటు పాశ్చాత్య తత్త్వశాస్త్రం గురించీ, భారతీయ దర్శనాల గురించీ చర్చిస్తూనే ఉన్నారు. తాను మరొక వందేళ్లు ఈ లోకంలో మసలబోతున్నాడు అనిపించింది ఆ చర్చలు వింటే.
ఇవాళ పొద్దున్న శిఖామణి వాల్ మీద, అందెశ్రీ ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారని చదవగానే, ముందు నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. మొన్న మాట్లాడిన మనిషి ఇవాళ కనుమరుగైపోయాడంటే, జీవితం నిజంగా బుద్బుదం అనే మాటకన్నా కూడా ముందు, నా మనసులో తలెత్తిన ప్రశ్నలు: ఆ ప్రణాళికలు, ఆ సంకల్పాలు, తాను తీసుకురావాలనుకున్న ఆ పుస్తకాలు- ఏమైనట్టు?
ఆయనకి పునర్జన్మలో విశ్వాసముందో లేదో నాకు తెలియదు. కానీ, ఎన్ని తలపులు! ఎంత క్రియాశీలత! ఎంత సత్యాన్వేషణ! రెండు రోజుల కింద మాట్లాడిన మనిషి ఈ రోజు ఫోనుకి అందరంటే నమ్మలేకపోతున్నాను.
కాని ఒక మనిషి, భూమ్మీదకు వచ్చిన తరువాత, కొన్నాళ్ళు ఇక్కడ గడిపిన తరువాత, దేన్ని వెతుక్కోవాలో, దేన్ని పట్టించుకోవాలో, దేన్ని పొందాలో, దేనికి పాదుచేయాలో, దేన్ని నిలబెట్టాలో స్పష్టంగా తెలిసినవాడు అందెశ్రీ అని మాత్రం ఈ కొద్ది పరిచయంలోనూ నాకు బోధపడింది. ఆయన చరితార్థుడు.
10-11-2025


ఆయన మీరన్నట్టు చరితార్థుడు. మీ నివాళి వాక్యంతో సాహితీ తీర్థచరితార్థుడయ్యాడు.
మాయమై పోయిన మనిషి మాటల్లో బతుకుతాడు. ఆయనతో చిరు పరిచయమే అయినా అది ఆత్మీయం .ఆయన ఆత్మకు శాంతి
చేకూరాలి.
సాహితీ శిఖరం శ్రీ అందెశ్రీ గారికి నివాళులు 🙏🙏
నిజంగా చరితార్థుడు🙏