
న్యూయార్కు రివ్యూ ఆఫ్ బుక్సు వారు ప్రచురించే కవిత్వ పుస్తకాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఆ సిరీసులో వారు ప్రరురించిన Austerity Measures (2016) మరింత ఆసక్తికరమైన పుస్తకం. ఆధునిక గ్రీకు కవిత్వం నుంచి కారెన్ వాన్ డైక్ అనే అనువాదకురాలు చేసిన సంకలనం అది. అన్నిటికన్నా ముందు ఆ పుస్తకం శీర్షిక నన్ను ఆకట్టుకుంది. Austerity measure అంటే పొదుపుచర్య. సాధారణంగా పొదుపుచేయడానికి మనపట్ల మనం ఎంతో కొంత కఠినంగా ఉండదుకాబట్టి అది ఏకకాలంలో కఠిన చర్యా, పొదుపుచర్యా కూడా. దేశాలు ఆర్థిక సంక్షోభంలో పడ్డప్పుడు ప్రభుత్వ వ్యయాన్నీ, ప్రజావ్యయాన్నీ కూడా నియంత్రించడంకోసం చేపట్టే చర్యల్ని austerity measures గా పిలవడం పరిపాటి.
ప్రపంచవ్యాప్తంగా 2008 లో సంభవించిన ఆర్థిక సంక్షోభానికి కుప్పకూలిన ఆర్థికవ్యవస్థల్లో గ్రీసు కూడా ఒకటి. దాదాపు పదేళ్ళకాలం పట్టింది గ్రీసుకి ఆ సంక్షోభం నుంచి బయటపడటానికి. అయినా కూడా ఇప్పటికీ ఆ పరిణామాలనుంచి గ్రీకు సమాజం పూర్తిగా కోలుకుందని చెప్పలేం. ఆ రోజుల్లో అంటే 2014 లో గ్రీసు అనుభవిస్తున్న ఆర్థిక సంక్షోభంలో, కవులకీ, రచయితలకీ పుస్తకాలు వేసుకోడంగాని, కొనుక్కోడంగాని, దాదాపుగా దుర్లభమైపోయిన పరిస్థితిలో కవులు రరకాల ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. బహిరంగస్థలాల్లో బహిరంగ కవిత్వపఠనం, ఊరేగింపుల్లో, ప్రదర్శనల్లో కవిత్వం వినిపించడం, గోడల మీద బొగ్గుతో రాయడంతో పాటు ఇంటర్నెట్టుని ఆశ్రయించడం కూడా వాటిల్లో ఒకటి. పేపరు దొరక్క పుస్తకాలు ప్రచురించుకోవడం కష్టంగా మారినప్పుడు కూడా చిన్న చిన్న ప్రెస్సుల ద్వారా ఏదో ఒక రూపంలో, పరిమితంగానైనా పుస్తకాలు వేసుకుని కవులు కవిత్వాన్ని వెదజల్లుకుంటూనే ఉన్నారు. అటువంటి కవిత్వాలనుంచి ఏరి కూర్చిన సంకలనం Austerity Measures.
పదేళ్ళ కిందట గ్రీసు అనుభవించినంత ఆర్థిక సంక్షోభాన్ని మన దేశం అనుభవించకపోయినప్పటికీ, మనం కూడా, కవిత్వ ప్రచురణ వరకూ, ఏదో ఒక అదృశ్య శక్తి మనల్ని కఠినంగా నియంత్రిస్తున్న పరిస్థితిలోనే ఉన్నామని చెప్పాలి. అయితే ఈ అదృశ్య శక్తి, ప్రభుత్వం కాదు, కాగితం లభ్యం కాకపోవడం కాదు, లేదా జి.ఎస్.టి కాదు. మరేమిటి? ప్రజల అభిరుచి. ఈ రోజు అతి తక్కువ మార్కెటు ఉన్న వాటిల్లో అన్నిటికన్నా ముందు కవిత్వమే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, అస్సలు మార్కెటు లేనిదంటూ ఉంటే కవిత్వమే. మానవసంబంధాలన్నీ వ్యాపారసంబంధాలుగా మారిపోయిన ఈ కాలంలో, గాలీ, నీరూ, నీడా కూడా వాణిజ్యవస్తువులుగా మారిపోతున్న కాలంలో, కవిత్వం ఒక్కటీ వ్యాపారవస్తువు కాకుండా ఉన్నదని సంతోషించాలా లేక మల్టీప్లెక్సు థియేటర్ల ఎదట అమ్మే పాప్ కార్న్ పాటి కూడా కాకుండా పోతున్నదని బాధపడాలా?
కాని ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. దీనికి మరో పార్శ్వం కూడా ఉంది. నేనేదైనా సాహిత్యసమావేశంలో పాల్గోటానికి ఏ వూరైనా వెళ్తే, అక్కడ మిత్రులు తమ కొత్త పుస్తకాలు కట్టలు కట్టలు నా చేతుల్లో పెడుతుంటారు. అది కూడా ఉచితంగా. ఆ పుస్తకాల్లో అత్యధికం కవిత్వమే. బహుశా తెలుగులో కవిత్వం అచ్చవుతున్నంత విస్తారంగా మరే ప్రక్రియలోనూ పుస్తకాలు అచ్చవుతున్నట్టులేదు. అలా అచ్చయ్యే పుస్తకాలు దాదాపు మొదటి ప్రచురణ దగ్గరే ఆగిపోతుంటాయి. వాటిని చదివేవారుగానీ, సమీక్షించేవారుగానీ, వాటిగురించి ఒక చర్చలేవనెత్తేవారుగానీ ఎవరూ ఉండరు. సాధారణంగా కొత్త కవిత్వ పుస్తకాల ఆవిష్కరణ సమావేశాలు కుటుంబకలయికల్లాగా ఉంటాయి. ఆ మీటింగుల్లో కవిగారి కుటుంబసభ్యులు తప్ప మరెవరూ పెద్దగా కనిపించరు.
ఇలా విస్తారంగా అచ్చవుతున్న కొత్త కవిత్వాన్ని చూస్తున్నప్పుడు నాకు ఈ ప్రక్రియలో ఏదో ఒక austerity measure లేకుండా పోతున్నదని అనిపిస్తుంది. అదేమిటై ఉండవచ్చు? కవికి తాను అచ్చువేసుకుంటున్న కవిత్వం పట్ల ఉండవలసిన నాణ్యతాస్పృహ. అంటే తన కవిత్వం ఏ మేరకు కావ్యప్రమాణాల్ని అందుకుంటున్నదో ఆలోచించకపోవడం. కావ్యప్రమాణాలంటే, ఇక్కడ నేను చెప్తున్నది, శ్రోతలు తన కవిత్వం చదివి, ఆనందించి, దాన్ని దాచుకుని, మళ్ళీ మళ్ళీ చదివేలా చెయ్యవలసిన లక్షణాలు. ఏ కవికైనా మొదటిసారే తన కవిత్వం అచ్చువేసుకుంటున్నప్పుడే అది ప్రచురణయోగ్యం అవునో కాదో ఎలా తెలుస్తుందని అడగవచ్చు. అటువంటి స్క్రుటినీ అన్నివేళలా ఆరోగ్యప్రదం కాదని కూడా అనవచ్చు. అవును. దీనికి సమాధానం లేదు.
కాని కవిత్వం నేడు అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి కాదనలేం. ఒకవైపు అది మార్కెటుసరుకు కాలేకపోతున్నది. అలాగని అది అంగడిసరుకుగా మారడం కూడా అభిలషణీయం కానేకాదు. అలాగని అది ఎవరికీ అక్కరలేని ఉచిత సరుగ్గా మారిపోవడం కూడా ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. మరెలా?
ఈ పద్మవ్యూహంలో నాకై నేను అనుసరిస్తున్న austerity measure ఒకటున్నది. అదేమంటే, కవిత్వం పుస్తకాల రూపంలో ప్రచురించకపోవడం. దానికి బదులు కవిత్వపుస్తకాల్ని డిజిటలు పుస్తకాలుగా ఇంటర్నెట్టు ద్వారా అందుబాటులో ఉంచడం. అప్పుడది అంగడిసరుకుగా మారే ప్రమాదం నుంచీ తప్పించుకుంటున్నది, శ్రోతల ఇష్టాయిష్టాలతో సంబంధంలేకుండా పుస్తకాలు అచ్చువేసి వారికి ఉచితంగా పంచిపెట్టే ప్రమాదం నుంచీ తప్పించుకుంటున్నది.
సోవియెటు రష్యాలో స్టాలిన్ నియంతృత్వకాలంలో అన్నా అఖ్మతోవా లాంటి కవులు తమ పుస్తకాలు ప్రచురించుకోడానికి ప్రభుత్వం అనుమతించనప్పుడు, వారి పుస్తకాల్ని మౌఖికంగానో లేదా సైక్లొస్టయిలు చేసో పంచుకునేవారట. ఆ పరిస్థితిని ఉద్దేశించి అఖ్మతోవా తాము గూటెన్ బర్గు కన్నా ముందటికాలానికి పోకతప్పట్లేదని అనేవారు. బహుశా, ఇప్పుడు కూడా కవిత్వం తన సంక్షోభం నుంచి బయటపడటానికి, గూటెన్ బర్గుకన్నా మునుపటి కాలానికి పోక తప్పదేమో!
(తెలుగుప్రభ సాహిత్యానుబంధంలో, 17-10-2025 న ప్రచురితం, స్కైబాబకి ధన్యవాదాలతో)
16-10-2025


ఇది వాస్తవ పరిస్తితి. నిజానికి భాష సౌందర్యాన్ని ఇనుమడింప చేయడానికి ప్రధాన సాధనం కవిత్వం. ఉన్నత ప్రమాణాలు కలిగిన కవిత్వం వచ్చినప్పుడు తప్పనిసరిగా పాటకులు పెరుగుతారు.
పాఠకులు పెరగవచ్చు కానీ కవిత్వాన్ని కొనేవాళ్ళు పెరగరు.
చాలా బాగా చెప్పారు. దీనికి ఒక కారణం ఉంది.
అసలు తాము రాసేది కవిత్వమా ..కాదా? అనేది ముందుగా నిర్ణయించుకుని ముందుకి అడుగేస్తే… నిజమైన కవిత్వం వెలుగులోకి వచ్చి అందర్నీ ఆనందపరిచి హాయిని ఇస్తుంది. మీరు గమనించారో ,లేక మీ వరకు రాలేదో కానీ… అదిగో ఆకాశం
నేనే కామేశం
రాస్తున్నా కవిత్వం
ఇది కాదు కపిత్వం… అని రాసి పొంగిపోతూ ఆ కాగితం ముక్క చూపించి… ఇది కవిత్వం కాదు అంటే పౌరుషానికి పోయి తిట్టిపోసి… కక్ష పెంచుకుని అవమానించే వారు వందల కొద్దీ ఉన్నారు.
ఇంక కవిత్వం ఏమిటి? నాలుగు అక్షరం ముక్కలొస్తే చాలు ఏవేవో గీకి పారేసి… సభలు పెట్టేసి టీలు, కాఫీలు ఇచ్చేసి అది కవిత్వం అంటున్నారు.
అందుకే అసలైన కవిత్వం మరుగున పడి జనాలు కవిత్వం అంటే పరిపోగున్నారు.
ఎక్కువ మాట్లాడిఉంటే మన్నింపు కోరుతున్నాను. నమస్సులు
ధన్యవాదాలు