
సుప్రసిద్ధ జర్మను రొమాంటిక్ కవి హోల్డర్లిను కవిత్వాన్ని పరిచయం చేస్తూ గతంలో అయిదు పోస్టులు పెట్టాను. మధ్యలో ఆరునెలల విరామం. కానీ ఆయన నన్ను వదిలిపెట్టలేదు, నేనూ నా మనసులో ఆ కవిత్వాన్ని వదిలిపెట్టలేదు. హోల్డర్లినుకు చాలా అనువాదాలున్నాయి. సుప్రసిద్ధ తత్తవేత్త హిడెగ్గరు ఆయన కవితలమీద చాలా పుస్తకాలే రాసాడు. కాని, ఈ మధ్యకాలంలో, వీటిని జర్మను నుంచి James Mitchell అనే ఆయన అనువదించి, ఎవరేనా adapt చేసుకోడానికి వీలుగా holderlinpoems.com అనే తన సైటులో పొందుపరిచాడు. అతడికి ధన్యవాదాలతో ఆ కవితల్ని తెలుగుచేసి మీతో పంచుకుంటున్నాను.
1
సగం జీవితం
గంగరేగుపండ్లతోనూ
ముద్దమందారాలతోనూ భూమి
సరోవరమ్మీదకి వాలి ఉంటుంది.
అందమైన హంసలు కదలాడే
ఆ నిశ్చల పవిత్రజలాల్లో
ముద్దుల్తో మత్తెక్కి మీ శిరసుల్ని
ముంచి తేలుస్తుంటారు.
ఇంతలో శీతకాలమొస్తుంది.
ఆ పువ్వులెక్కడ? ఆ సూర్యరశ్మి ఎక్కడ?
భూమ్మీద పరుచుకున్న ఆ నీడలెక్కడ?
నిస్తబ్ధంగా నిశ్శబ్దంగా
నిలబడి ఉంటాయి గోడలు
గాల్లో కొట్టుకుంటూ
గాలిమరలు.
హోల్డర్లినుకి మతిభ్రమించడానికి కొద్దిగా ముందు రాసిన ఈ గీతం ఆయన సుప్రసిద్ధ పద్యాల్లో ఒకటి. మొదటిసగభాగంలో రమణీయమైన వేసవి చిత్రం. మధ్యలో ఒక విరామం. ఆ వెంటనే శీతకాలం కోతపెట్టినట్టుగా ముంచుకొచ్చే స్తబ్ధత. జీవితం సగానికి విరిగినట్టుండే ఈ కవితలో, సంతోషసంచలనమూ, విషాదనిస్తబ్ధతా పక్కపక్కనే కనిపించడం యాదృచ్ఛికం కాదనిపిస్తుంది, హోల్డర్లిను జీవితం లాగే.
మొదటిభాగంలోని సంతోషమంతా ‘ముద్దుల్తో మత్తెక్కి’ అన్న మాటలో ఉన్నట్టే, రెండో భాగంలో విషాదమంతా ‘గాలికి కొట్టుకొంటున్న గాలిమరలు’ అన్న మాటలో ఉంది.
2
జిమ్మరు కోసం
రహదారుల్లాగా, కొండచరియల్లాగా
జీవితపు రేఖలు బహువిధాలు.
ఇక్కడి మన జీవితాన్ని అక్కడొక దేవుడు పరిపూర్తి చేస్తాడు
సమన్వయంతో, శాంతితో, శాశ్వతవరదానంతో.
హోల్డర్లిను మానసికంగా అస్వస్థుడయ్యాక, అతడికి ఎర్నెస్టు జిమ్మరు అనే ఒక వడ్రంగి టూబింగెను పట్టణంలో తన ఇంట్లో ఆశ్రయమిచ్చాడు. 1807 నుంచి 43 లో హోల్డర్లిను ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకా కంటికి రెప్పలాగా కనిపెట్టుకుని ఉన్నాడు. ఈ చిన్ని కవిత, హోల్డర్లిను కవిత్వంలో హంసగీతి అని చెప్పదగ్గది. ఒక సంక్షుభిత జీవితనాటకానికి భరతవాక్యం లాంటిది.
ఇంతకు ముందు చేసిన అనువాదాల లింకులు ఇక్కడ చూడొచ్చు.
23-10-2025


Thanks for introducing Holderlin’s poetry, sir.
“శాశ్వతవరదానం” 🙏🏽
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!