ఫలప్రదమైన అనునయం

ఈమాట సంపాదకులు బైరాగి శతజయంతి ప్రత్యేక సంచిక వెలువరిస్తూ అందులో ఆయన గీతాలు, గేయాలు, పద్యాల్లోంచి పదింటిని ఎంపికచేసి, వాటిని ప్రశాంతి చోప్రాగారితో పాడించారు. ఆ పత్రికల్లో ఆ వ్యాసాలన్నీ ఒక ఎత్తూ, ఈ గానమొకటీ ఒక ఎత్తూ. ఎందుకంటే, గానం కూడా ఒక విధమైన interpretation నే. ముఖ్యంగా కవి శబ్దార్థాల ద్వారా మనకి పూర్తిగా వివరించలేని తన నిగూఢ అంతరంగాన్ని, ఆ శబ్దసంయోజనంలో పొదిగిపెట్టిన, సంగీతం ద్వారా వెల్లడి చేసే అవకాశం ఉంటుంది. ఆ సంగీతాన్ని ఆ గాయిక పట్టుకున్నారు. ఆమె పాడిన కవితలన్నింటిలోనూ, ‘వర్షాయామిని’, ‘అదే జ్యోతి’, ‘జయ దేవానాం ప్రియ’, ‘అనునయము’ కవితలు ఈ కారణం వల్ల నన్ను మరీ ఆకట్టుకున్నాయి.

మహాకవుల కవిత్వాలకు మాత్రమే కాదు, వారు ఎంచుకుని చేసే అనువాదాలకు కూడా ఒక కార్టొగ్రఫి ఉంటుంది. తాము ఏ కాలాన్ని, లోకాన్ని దర్శిస్తున్నారో అది తమ కవిత్వంలో ఆవిష్కరించడానికి ప్రయత్నించినట్టే, తాము ఏ కాలాలకీ, ఏ దేశాలకీ సన్నిహితులుగా ఉన్నారో అది వారి అనువాదాల్లో ప్రతిఫలిస్తూ ఉంటుంది. దానిలో కూడా ఒక అన్వేషణ ఉంటుంది. ఒక ప్రయాణం ఉంటుంది.

ఉదాహరణకి శ్రీ శ్రీనే తీసుకోండి. ఆయన ‘మహాప్రస్థానం’ దాకా ఆంగ్లో-అమెరికను అమెరికను కవుల వైపూ, ఫ్రెంచి సింబలిస్టుల వైపూ చూసాడు. ‘ఖడ్గసృష్టి’కాలానికి వచ్చేటప్పటికి యూరపియను కవులవైపూ, ముఖ్యంగా ఫ్రెంచి సర్రియలిస్టులవైపు చూసాడు. ఆ తర్వాత ‘మరోప్రస్థానం’ కాలానికి వచ్చేటప్పటికి మూడవప్రపంచ దేశాలకు చెందిన కవులవైపూ, సామ్రాజ్యవాద ధిక్కార గళాలవైపూ చూస్తున్నాడు. (ఈ విషయం మీద మరింత వివరంగా చదవాలనుకుంటే, నా వ్యాసం ‘శ్రీశ్రీ అనువాదం చేసిన కవితలు, సాహిత్యసంస్కారం, 2017, పే.73-88 చూడవచ్చు.)

తెలుగులో శ్రీశ్రీ తర్వాత విస్తృత ప్రపంచాన్ని తన అనువాదాల్లో పట్టుకొచ్చిన మరొక మహాకవి బైరాగినే. శ్రీశ్రీ అనువాదాల్లో ఒక రాజకీయ ప్రపంచ పటం కనిపిస్తే, బైరాగి అనువాదాల్లో ఒక spiritual landscape కనిపిస్తుంది. ‘ఆగమగీతి’ (1981) సంపుటంలోని మొత్తం 129 కవితల్లో 31 కవితలు అనువాదాలు. అంటే దాదాపు నాలుగో వంతు. ఆయన అనువదించిన కవుల్లో ఇలియటు, రిల్క, గిలాం అపోలినార్, పాల్ యూలార్డ్, రాబర్ట్ డెస్నాస్, పియర్రి రివర్డీ, జాకె ప్రివర్ట్, ఇవాన్ బోనీఫ్, వంటి పాశ్చాత్యకవులతో పాటు, మర్దేకర్, రామేశ్వర్ శుక్ల, జీవనానంద దాసు, నియాజ్ హైదరు,  దినకర్, విందా కరందీకర్ వంటి భారతీయ కవులు కూడా ఉన్నారు. వీరితో పాటు హాఫిజ్ కవితలు రెండు, ఒక అజ్ఞాత చిలీ కవి కవిత కూడా ఆయన అనువాదాల్లో ఉన్నాయి. బైరాగి ఈ కవుల్నే ఎందుకు ఎంచుకున్నాడు, వారి కవితల్లో ఆ కవితల్నే ఎందుకు ఎంచుకున్నాడు లాంటి అంశాలు లోతుగా పరిశీలించవలసినవి. (కాని బైరాగి కవిత్వానికే సరైన అనుశీలన ఇంకా రానప్పుడు ఆయన అనువాదాల పైన పరిశీలనను ఆశించడం అత్యాశే అవుతుందేమో.)

ఉదాహరణకి, ఆయన ‘అనునయము’ పేరిట అనువదించిన హాఫిజ్ కవితనే చూద్దాం. పారశీకంలో గజలుగా రాసిన కవితను బైరాగి తెలుగులో మూడు పద్యాలుగా అనువదించాడు. బైరాగికి గజలు ఛందస్సు పట్టుబడనిదేమీ కాదు. ఉదాహరణకి, ఆయన గేయంలాగా రాసినప్పటికీ, ఆగమగీతిలోని ‘ఎవరు’ అనే కవితది దాదాపుగా గజలు నిర్మాణమే. కాబట్టి ఆయన హాఫిజ్ ను గజలుగా అనువదించి ఉండవచ్చు. లేదా గేయంగానో, గీతంగానో అనువదించి ఉండవచ్చు. కాని మూడు పద్యాల్లో, రెండు శార్దూలాలు, ఒక ఉత్పలమాలలో ఎందుకు అనువదించాడు?

ఆ మూలకవిత, దివానులో 336 వ గజలుని, అనువదించడానికి బైరాగి  బహుశా గెర్ట్రూడ్ బెల్  Poems from the Diwan of Hafiz (1897) అనువాదాన్ని అనుసరించి ఉండవచ్చునని అనుకున్నాను.

కాని నా ఊహ తప్పని ఇప్పుడనిపిస్తోంది. ఎందుకంటే, బైరాగి ఆగమగీతిలో ఫ్రెంచి కవుల కవితల అనువాదాలు పొందుపరిచినప్పుడు, వాటిని ఇంగ్లిషునుంచి అనువదించినట్టుగా పేర్కొన్నాడు. హిందీ, ఇంగ్లిషు కాక, ఆయన అనువదించిన ఇతరభాషా కవుల్లో జీవనానందదాసు ని ఇంగ్లిషు నుంచి కాక బెంగాలీ నుంచే అనువదించినట్టుగా కనిపిస్తుందని ఆదిత్య అన్నాడు. ఇక మర్దేకర్, కరందీకర్ లను నేరుగా మరాఠీనుంచి, నియాజ్ హైదరును ఉర్దూనుంచే అనువదించాడని అనుకోవచ్చును. అలా చూసినప్పుడు ఆయన హాఫిజును ఇంగ్లిషు నుంచి అనువదించి ఉంటే, ఆ విషయం తప్పనిసరిగా పేర్కొని ఉండేవాడు. అదీకాక, ఉర్దూ పైన పట్టు ఉన్న కవికి పారశీకాన్ని ఏదో ఒక మేరకు అర్థం చేసుకోవడం కష్టం కాదనుకుంటాను. కాబట్టి ఆగమగీతిలో హాఫిజ్ కు చేసిన రెండు అనువాదాలూ కూడా పారశీకం నుంచే నేరుగా చేసి ఉంటాడని ఇప్పుడు భావిస్తున్నాను.

కాబట్టి ఆ గజలు పారశీకంలో ఏ విధంగా ఉండి ఉండవచ్చు? నాకు పారశీకం రాదుగాని, రూమీకి నికల్సనులాగా, హాఫిజు దివానును యతాతథంగా అనువదించిన విల్బరు ఫోర్సు క్లార్క్ మూడు సంపుటాలూ నా దగ్గర ఉన్నాయి కాబట్టి, ఈ గజలు కోసం వెతికాను. వాటిలో మూడవ సంపుటంలో 439 (435) అనువాదం ఇలా ఉంది:

Where, the glad tidings of union with Thee,
so that, from desire of life, I may rise?
The holy bird (of paradise) am I, from the world’s snare, I rise.

By Thy love (I swear) that if me, Thy slave, Thou call,
Out from desire of lordship of existence and dwelling (both worlds) I rise.

O Lord, from the cloud of guidance, the rain (of mercy) cause to arrive
Before that, from the midst, like a (handful of) dust, I rise

(O holy traveller!) at the head of my tomb, without wine and the minstrel, sit not;
So that by thy perfume, dancing- I may rise.

Though I am old, one night me, close in Thy embrace take
So that, in the morning, from Thy embrace, young- I may rise

(O true Beloved!) think not that, from the dust of the head of Thy street,
By the sky’s tyranny or by time’s violence, (to choose employment)- I rise.

O Idol, sweet of motion, arise, and Thy (lofty cypress-like) stature display:
That, like Hafiz, from desire of life and the world, I may rise.

షిరాజ్ నగరంలో హాఫిజ్ సమాధిఫలకం మీద ఈ ఏడు షేర్లలో మొదటి అయిదూ చెక్కబడ్డాయట! బహుశా బైరాగి ఈ గజలు ఎంచుకోడానికి అది కూడా ఒక కారణమై ఉండవచ్చు. ఇప్పుడు దీన్ని యథాతథంగా తెలుగుచేసి చూద్దాం.

నీ సంతోషసమాగమంలో కోరికలు విదిలించుకుని లేచివస్తాను.
స్వర్గ విహంగాన్ని, ప్రపంచపుటుచ్చులనుంచి లేచి వస్తాను.

నీ ప్రేమమీద ఆన, నీ బానిసని, నీ పిలుపు వినగానే
ఈ రెండులోకాల ప్రభుతనుంచీ నిశ్చయంగా లేచి వస్తాను.

నీ అనుగ్రహం వల్ల నీ కృపావర్షం తప్పక కురుస్తుంది
దానికన్నా ముందే పిడికెడుదుమ్ములాగా నేను లేచివస్తాను.

యాత్రికుడా, మధువు, మానిని వినా నా సమాధి దర్శించకు
అప్పుడు మీ పరిమళభరిత నృత్యానికి నేను తప్పక లేచివస్తాను.

వృద్ధుణ్ణి, అయినా ఒక రాత్రి, నీ బిగికౌగిట్లోకి తీసుకొమ్మంటాను
తెల్లవారేటప్పటికి తప్పక నేనొక నవయువకుడిగా లేచివస్తాను

ప్రియతమా, నీ వీథిలో పరుచుకున్న దుమ్ము గురించి చింతించకు
ఆకాశమూ, కాలమూ  ఏకమైనా కూడా నేను లేచి వస్తాను.

ఓ ప్రతిమావిలాసమా, మేలుకో, నీ స్వరూపసందర్శనం అనుగ్రహించు
అప్పుడు హాఫిజులాగా ఈ భవసాగరం నుంచి లేచి వస్తాను.

హాఫిజ్ కు క్లార్క్ అనువాదం పందొమ్మిదో శతాబ్ది మర్యాదకు తగ్గట్టే ఎటువంటి స్వతంత్రం తీసుకోకుండా యథాతథంగా చేసిన అనువాదం. బైరాగి ఈ అనువాదాన్ని అనుసరించలేదని మనకు తెలుస్తూనే ఉంది. ఈ గజలుకి బైరాగి చేసిన అనువాదం ఇలా ఉంది:

నీ సంయోగపు వార్త విన్న తరి, నేనీ మృణ్మయావాస పుం
గాసిన్ వీడుచు లేచి వచ్చెద, విహంగమ్మాత్మ వీడే క్షణో
ల్లాస ప్రోద్ధతి రెక్కలార్చినటులే, లావొంది నా యాత్మ కై
లాసౌన్నత్యము నందబోవు, మమతా లౌల్యంపుటుచ్చుల్ విడన్

నీ ప్రణయమ్ము బిల్వ విని నేనమృత స్రవదంతరుండనై
అప్రతిమాన వేగమున నంబరవీథిని తేలివత్తు, నా
కప్రతిమ, త్వదంఘ్రితల కామిని, దుర్లభ జన్మమృత్యు యు
గ్మప్రభుతన్ త్యజించెదను, కాలము, దేశము కాలదన్నెదన్

దేవా! ఎక్కడ తావకీన కరుణాదివ్యాంబుదాసార సం
స్రావమ్మక్కట! నాదుబూది నవసంస్కారార్థ మెన్నాళ్ళుగా
త్రోవల్ గాచె తృషార్త ధూళి పటలిన్, రూక్షాబ్దముల్ పోయె, ఝం
ఝా వాత్యల్ గొనిపోకమున్నె రసముల్, జాలొంద వర్షింపుమా!

(నీ సంయోగవార్త విన్నవెంటనే, నేను నన్ను అలసట పెట్టే ఈ మట్టిగూడువదిలి లేచి వస్తాను. విహంగం ఆత్మని అందుకునే క్షణాల ఉల్లాసమూ, ఉధృతీ రెక్కలార్చినట్టుగా,  పట్టలేని సంతోషంతో నా ఆత్మ కైలాస ఔన్నత్యాన్ని అందబోతుంది. నన్నింతదాకా ఈ ప్రపచంలో బంధించిన మమకారం, లౌల్యం అనే ఉచ్చులు విడిపోతాయి.

నీ ప్రణయపు పిలుపు విని నాలోపల అమృతపు ఊటలూరుతుండగా ఎవరూ ఆపలేనంత వేగంతో, ఆకాశవీథిలో తేలివస్తాను. నీ స్వర్గస్వరూప చరణయుగాన్ని కోరుకునేవాణ్ణి, ఎంతో దుర్లభమని చెప్పదగ్గ ఈ జీవితంపట్లా, మృత్యువుపట్లా వ్యామోహాన్ని వదిలిపెట్టేస్తాను. కాలాన్నీ, దేశాన్నీ పక్కకు నెట్టేస్తాను.

దేవా! నీ కరుణాంబువుల దివ్యవర్షమెక్కడ? ఆగని ఆ జడివాన ఎక్కడ? ఎన్నో ఏళ్ళుగా నా భస్మం సద్గతికోసం దప్పి పడి ఉంది. ఇప్పటికే ఎంతో కాలం కఠినంగా గడిచిపోయింది. ఇప్పుడేనా పెనుసుడిగాలులు ఈ భస్మధూళిని ఎగరేసిపోకముందే, దయతో నా మీద వర్షించిపో!)

విల్బరు ఫోర్సు క్లార్కు అనువాదాన్ని దగ్గర పెట్టుకుని చూస్తే బైరాగి తన అనువాదంలో ఈ ముఖ్యమైన మార్పులు చేసాడని తెలుస్తున్నది.

గజలుని గజలుగా కాకుండా వృత్తపద్యాలుగా అనువదించడం.

మొత్తం ఏడు షేర్లనీ యథాతథంగా అనువదించకుండా, హాఫిజ్ సమాధిఫలకం మీద లిఖించిపెట్టిన మొదటి అయిదు షేర్లలో మొదటి మూడు షేర్ల భావాన్ని మాత్రమే మూడు పద్యాలుగా పునఃసృజించడం.

మూలానికి శీర్షిక లేదు. కాని బైరాగి తన పద్యాలకు ‘అనునయము’ అని పేరుపెట్టాడు. అనునయం అంటే వేడికోలు, బతిమిలాడటం. మూలకవితలో విన్నపంకన్నా కూడా భగవంతుడి కరుణావర్షం తన పైన తప్పక కురుస్తుందనే assertion ప్రధానంగా ఉంది.

మూలంలో స్పష్టంగా పేర్కోని స్వర్గాన్ని తన అనువాదంలో కైలాసంగా పేర్కోవడం.

మూడవ పద్యంలో మూలభావంకన్నా తన ఆర్తిని మరింత విస్తరించి చెప్పడం.

ఈ మార్పుల వల్ల బైరాగి మూలకవితను మరింత ప్రభావశీలంగా, మరింత ఫలప్రదంగా తీర్చిదిద్దాడని చెప్పవచ్చు. వృత్తపద్యాల వల్ల, ఆ అపురూపమైన శయ్యవల్ల, తన వేడికోలులో ఒక అవిచ్ఛిన్నతను, తెంపులేనితనాన్ని, ఏకోన్ముఖతను ఆయన అనితరసాధ్యంగా తీసుకురాగలిగాడు. ఇక స్వర్గాన్ని కైలాసంగా అభివర్ణించడం బైరాగి అన్వేషణకు తగ్గట్టుగానే ఉంది. ఎందుకంటే ఆయన ఎదురుచూసే మానవుడు, ‘జగతీవిషసార పాయి’, ‘సంతత శూలాగ్రశాయి’  కాబట్టి, అటువంటి త్యాగధనుడి లోకం కైలాసం కాక మరేమవుతుంది?

ఇప్పుడు ఈ పద్యాల్ని ప్రశాంతి చోప్రా గారి స్వరంలో వినండి.


Featured image: Tomb of Hafez, Shiraj, Iran

16-9-2025

4 Replies to “ఫలప్రదమైన అనునయం”

  1. పారసీక మూలానికి, విల్బరు ఫోర్సు క్లార్కు ద్వారా, మీరు చేసిన అనువాదం అద్భుతం. ఇప్పుడు బైరాగి తన అనువాదంలో భారతీయ తాత్వికతను కూడా జోడించి దానికి మరింత ఔన్నత్యాన్ని ఎలా తీసుకురాగలిగాడో మనకు అర్థమవుతుంది. 🙏🙏🙏

  2. చక్కని వివరణ . ప్రశాంతి చోప్రా గారి గళం లో బైరాగి గారి పద్యం హొయలు పోయింది.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading