
రెండేళ్ళ కిందట ‘పోస్టు చేసిన ఉత్తరాలు’ నా బ్లాగులో రాస్తున్నప్పుడు వాటికి మొదటిపాఠకురాలు మానసనే. ఇప్పుడు పుస్తకంగా వెలువరించినప్పుడు కూడా ఆమెనే మొదటిపాఠకురాలిగా తన అద్భుతమైన స్పందనని ఫేస్ బుక్కులో తన వాల్ మీద పంచుకున్నారు. ఆ అపురూపమైన వాక్యాల్ని మీతో పంచుకోకుండా ఎలా ఉంటాను!
రెండేళ్ళ క్రితం భద్రుడి గారి బ్లాగులో, ఎప్పటిలాగే, ఉదయాన్నే, ఒక ఉత్తరం కనపడేసరికి కళ్ళు ఆ అక్షరాల వెంట పరుగులు తీశాయి. ఎమిలీ లేఖాసాహిత్యాన్ని పరిచయం చెయ్యడానికి ఆయన ఎంచుకున్న కొత్త పద్ధతని రెండు రోజులు చదివాక నిశ్చయమైపోయింది. 15 లేఖలు. వరుసగా, పదిహేను రోజులు. మూడో రోజుకి మామూలు కన్నా ఓ నిమిషం ముందే లేచి చదివానని గుర్తు. తరువాతివన్నీ నాకే ఇక. మధ్యలో ఎమర్సన్ మార్గరెట్ కూడా వచ్చి ఆ ఉత్తరాలకు కొత్త చూపునద్దారు, అది రెండో వారపు కథ.
ఎమిలీని ఈ ఉత్తరాల్లో మళ్ళీ చూస్తున్నప్పుడు, నేను నిజంగా ఆమెని ప్రేమించాను. ఆమె భాష అర్థం చేసుకునే కొద్దీ కొత్త అందాలు చూపెడుతూ ఉంటుందని ఆ చిన్న చిన్న కవితల వ్యాఖ్యానాలు చదివాకే అర్థం చేసుకున్నాను. విలక్షణంగా సాగిన ఆమె జీవితాన్ని, ఈ ఉత్తరాల వెలుగులో చూశాక, ఆమె -నేనూ ఎక్కడో ఒకేలాంటి మనుషులమా అనిపించింది. కవిత్వం జీవితేచ్ఛ అని, ప్రపంచం మీది ప్రేమ అని, మాట బరువుని మళ్ళీ తూచి చూపించే తరాజని, కోమలంగా గంభీరంగా ప్రకృతి తనతో చెప్పిన మాటే కవిత్వమని – ఎన్ని రకాలుగా చెప్పింది ఎమిలీ.
ఎమిలీ భావుకత్వాన్ని ఈ ఉత్తరాల్లో చూసి ఎక్కడికక్కడ నివ్వెరపోతూనే వచ్చాను. ఆ చూపు నా హృదయాన్ని తాకాక, దానిలో నుండి పొంగే సంతోషమర్థమయ్యాక – నా జీవితంలో నుండి ఎన్ని అద్భుతాలనో పట్టుకున్నాను. కొండలూ సూర్యాస్తమయాలూ నా సహచరులని చెప్పుకుందావిడ. మధ్యాహ్నాల వేళ కొలను మీద గాలి చేసే సవ్వడి పియానో సంగీతాన్ని మించిపోతుందని రాసిందావిడ. ఆఫీసు వేళల్లో కిటికి బయట కూస్తున్న కోకిలను ‘నా యవ్వనవేళల్లో యే స్నేహితుడూ నన్నిలా బయటకు రమ్మని పిలిచి అల్లరి పెట్టలేదు’ అని రాసిన ఇంకో కవికి ఈ కవయిత్రి నచ్చడంలో వింతేముంది!
ఈ ఉత్తరాల కట్ట, ఒక ‘తలపుల దుమారం’. ఒక్కో ఉత్తరం ఎన్నేసి కబుర్లు మోసుకొచ్చిందో, ఎన్ని ప్రపంచాల్ని తిప్పి తీసుకొచ్చిందో చదివే చూడాలి. ఎంతమంది కవులు..ఎన్నెన్ని రసవత్తరమైన సంభాషణలు, సంఘటనలు, ఎంత గంభీరమైన చర్చలు, ఊహలు..
కొన్న ఏడాది తర్వాత పూల కుండీలో ఒక పూవు పూస్తే, ఆకాశం పంపిన అతిథిలా ఓ సీతాకోక వచ్చి దాని మీద మృదువుగా వాలిన క్షణంలో ఆ పూల మొక్క నాటిన మనిషి అక్కడే ఉంటే! ఆ సీతాకోక గాఢమైన చుంబనం, పరిష్వంగం …పూవు చెదరకుండా రేక రాలకుండా తేనె చప్పరించిన సీతాకోక ఉన్మత్తత! మనుషులకైనా అంత గాఢంగా ముద్దాడడం రాదట! ఉద్విగ్నతను వదులుకోనిదీ, శాంతిని దక్కించుకున్నదీ- అపురూపమైన క్షణాన్ని స్మరించుకుంటూ- అదిగో అక్కడ మొదలైంది ఈ ఉత్తరాల పర్వం – ఎమిలీ రాసిన ఈ చిట్టి కవితని ప్రస్తావిస్తూ…
This is my letter to the World
That never wrote to me-
The simple News that Nature told-
With Tender Majesty
ఈ లేఖల వెదుకులాట ఆ వార్తలని సేకరించడమే.
*
ఉత్తరం మొదలెట్టేముందు ప్రియమైన అన్న మాటకు ముందు “నా” చేర్చాలన్న ఆరాటమొకటి ఉద్విగ్నతలోకి నెట్టే క్షణాల ప్రస్తావన కూడా మర్చిపోనంత అందమైన ఉత్తరాలివి.
సాయంకాలమయ్యేటప్పటికి లంగరు దించిన పడవ లాగా పున్నాగ పూల చెట్టు మీద నుండి కిందకు దిగి నిలబడే పూల సౌరభం ఈ లేఖల్లో దొరికింది. ఈ లేఖలే, శరత్కాలపు రోజుల్లో తెల్లారి లేచేసరికి పారిజాతం చెట్టు కింద పాల నురగలా పరుచుకున్న పూల సూక్ష్మ సుగంధాన్ని ఎవరో తన మెత్తటి చేతులతో తెచ్చి అద్దినట్టు అక్టోబరు ఉదయాల్లో నా చెంపలను చల్లబరిచాయి.
సాయంకాలపు నీరెండలో వినపడే అనాహతనాదం ఈ అక్షరాల్లో నుండి మళ్ళీ. మాటలే పుట్టించగల కాంతిలీల ఇంకో లేఖలో. అసర్ నమాజు ప్రార్థన ముగిసిన నిశ్శబ్దపు ఛాయ ఈ లేఖ ఎప్పుడు నా చేతుల్లో పడితే అప్పుడే. మృత్యువు నీడ. మాటలు పెగలని దుఃఖం. It is too soon for language.. అని చదివీ చదవగానే విషాదాన్ని వెల్లడి చేయాలన్న ఆరాటమో తొందరపాటుతనమో తగ్గి, మనసులో కుదురుకునే నెమ్మది. నిజంగా!! నిజంగా!! మూడు ముక్కల్లో చెప్పిందా ఎమిలీ? ఆ ఉత్తరం ఎన్నిసార్లు చదివితే మాట బరువు తూచగలవాళ్ళమవుతాం. ఎంతో తపిస్తే తప్ప మాట్లాడకూడదని ఇంకెలా అర్థం చేసుకుంటాం.
“నేను ఎప్పటికీ ఈ భూమి మీద ఒక బాటసారిగానే, ఒక యాత్రికురాలిలాగే జీవించవలసి ఉంటుందని తెలుసు. చివరికి పశుపక్ష్యాదులకి కూడా తల దాచుకోవడానికి ఒక చోటంటూ ఉంటుంది, నాకు తప్ప. కానీ నా లాంటి వాళ్ళకి తల దాచుకోవడానికి కావలసినది హృదయాలు.” అని రాసింది ఫుల్లరు. ఆ బరువైన ఉత్తరమంతా చదివి, నా సర్వశక్తులూ వికసించే తావుల కోసం నేనిలా కలగన్నానా అన్న మాటలు చదివి, అక్కడే – ఆ మాట దగ్గరే ఉత్తరం పూర్తి చెయ్యలేక ఆగిపోయిన రోజు మళ్ళీ ఈ పూట కూడా అనుభవమయ్యింది. ‘నేను నిజంగా మహాత్ముడనేనా?’ అని 1948 జనవరి 30 న మహాత్ముడు వెక్కి వెక్కి ఏడవడం గురించి చదివాక, రెండో సారి ఆగిపోయి..
“మనిషి, స్త్రీ గాని పురుషుడు కాని తన సకల జీవ శక్తులూ వికసించాలని కోరుకున్నప్పుడు, ఆ కఠినాతికఠినమైన మార్గం మీద ప్రయాణం మొదలెట్టినప్పుడు, ప్రపంచం చేతుల్లో చెయ్యి కలిపి నడవడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు..అడుగడుగునా ఒక నిరాశ నిస్పృహ నిన్ను వెంటాడుతూనే ఉండచ్చు. కానీ నీ ఇంద్రియాలూ నీ చైతన్యమూ, అనుభూతి మేల్కొంటున్నాయని తెలిసాక, నీ engaged thought ని నువ్వు కొనసాగించవలసిందే…” – నిజంగా మనమొకరిని ప్రేమిస్తే, వాళ్ళని వాళ్ళకు చూపించే కాగడా మాత్రమే అసలైన కానుకట. అలాంటి కాగడా ఈ ఉత్తరం. డాబా మీద పారిజాతపు మొక్క పైన కూర్చున్న దేవదూత ఎప్పుడు వెళ్ళిపోయాడో, ఆ రోజు గమనించుకోనే లేదు నేను.
ప్రేమలు, వాటి నుండి పుట్టే వేదనలు ..ఎమర్సన్, మార్గరెట్ ఫుల్లర్ మధ్య సంభాషణలు మలిసగంలో ఇంకా లోతైన చర్చలే చేశాయి. స్నేహాల గురించి, స్నేహ ధర్మాల గురించి ఈ కింది మాటలు చదివిన తరువాత – మామూలుగానే నా కబుర్లలో గాసిప్ చేరకూడదన్నది నియమంగా పెట్టుకున్న నేను, ఆ విషయంలో ఇంకా కఠినంగా తయారయ్యాను – ఇంకొంచం ప్రేమను కూడా కోరుకునే ఉంటాను కానీ – మొత్తంగా ఇదే-
“నా స్నేహితుడు నాకొక స్పూర్తి కావాలి. ఒక సందేశం, ఆలోచన, ఒక దృష్టి, నిజాయితీ ఇవీ నేను స్నేహితుడి నుండి కోరుకునేవి. వార్తలూ, సరుకులూ కాదు. రాజకీయాలూ, పుకార్లు, ఇరుగు పొరుగు కాలక్షేపాలూ కాదు.
దిగంతం మీద విశ్రమించే మేఘ శకలంతోనో లేదా సెలయేటి ఒడ్డున వికసించే గడ్డిపూలతోనో పోల్చి చూసినప్పుడు ఆ స్నేహం తక్కువపాటిదని అనిపించకూడదు కదా!”
దేవా!! ఎట్లాంటి హెచ్చరిక! ఈ వాక్యం చూడగానే కాసేపు మాటలు రాకుండా అయిపోయాను. వస్తుందా ఒక మనిషి స్నేహాన్ని తల్చుకుంటే అంత అందమైన భావన. ఒక సూర్యోదయాన్నో పిట్టల పాటల్నో, నది గలగలలనో వింటున్నప్పుడు – వాటన్నిటితో పాటు తోడుంటే బాగుండు అనిపించే స్నేహం! ప్రేమ. అట్లాంటి నిర్మలమైన అనుభూతి, వాటి స్వచ్ఛతని, సౌందర్యాన్ని భగ్నం చేయని తోడు. ఊహించడానికే ఎంత బాగుంది.
అప్పుడు నేనైతే ఎమిలీ లా ఈ సంతోషంలో దేవతలకు కూడా వాటా లేదనేస్తాను. ![]()
నిండా రెండు వారాలు..ఒక సోమవారం మొదలెడితే, మళ్ళీ రెండు వారాల తర్వాత సోమవారం వచ్చేసరికి అన్ని ఉత్తరాలూ పూర్తయిపోయాయి. బదులిచ్చిన ఉత్తరాలు ఏ కొన్నో. అయితేనేం! ఆ రెండు వారాలూ యే పని చేస్తున్నా ఆ ఉత్తరంలోని ఏదో మాటతో మనసు ముడిపోయినట్టే ఉండేది. ఆ మాట తిప్పిన ఊహాలోకాల్లో నుండి కొసరుకున్న ఉత్సాహంతో రోజు ఇట్టే గడిచిపోయేది. నా రోజు రోజంతా ఊహల్లో ఉత్తరమై గాల్లో చక్కర్లు కొడుతూనే ఉండేది. సంతోషం పట్టరానిదైతే కేరింతలుగా ఉంటాం. అది ఆ కాసిన్ని క్షణాలకే. అది రోజు రోజంతా ఉంటే?
Life is a finest secret. So long as that remains, we must all whisper.. అన్న రహస్యాన్ని చెప్పే స్వరం – కాలాలకు అవతలి నుండి, గుసగుసగా మన చెవుల్లో…
*
ఈ పుస్తకం అందరికీ ఇలా చేరువవుతుందో లేదో నేను చెప్పలేను. కానీ, ఇదిగో, ఈ కింది కవిత రాసిందే, ఆవిడకి భగవంతుడి భాష తెలుసని నేను నమ్ముతున్నాను. సాయంకాలం డాబా మీదకెళ్ళి సంజె వెలుగుల్లో ఆకాశాన్ని చూస్తూ నిలబడిపోయినప్పుడు, పక్షులు బారులు కట్టి ఇళ్ళకు పోవడాన్ని ఊరికే అలా చూస్తూన్నప్పుడు, తీగనెగబాకి, నక్షత్రాల్లా విచ్చుకున్న సన్నజాజుల్ని చూసినప్పుడు – అవి నాతో ఏం గుసగుసలాడి పెదాల మీదకి నవ్వు తెప్పిస్తాయో, ఏవి ఒక్కోరోజు బెంగ పుట్టిస్తాయో నాకెప్పుడూ తెలీలేదు. వాటికి ఒక భాష ఉందని, అది భగవంతుడి భాష అని, ఈ పుస్తకం చదివాకే నేను పోల్చుకున్నాను. నేర్చుకున్నాను.
ఒక తేనెటీగ మర్మర ధ్వని
నా మీద మత్తుమందు చల్లుతుంది
ఎందుకని ఎవరన్నా అడిగితే
చెప్పడం కన్నా మూగబోవడం
మేలనిపిస్తుంది
కొండ మీద ఎర్ర రంగు
నా మనసుని దోచుకుంటుంది
ఎందుకని ఎవరన్నా గొణిగితే
చూసుకో, దేవుడున్నాడిక్కడ
అని మాత్రమే చెప్పబుద్ధేస్తుంది.
తూర్పు తెల్లవారగానే
నా గుండె వేగంగా కొట్టుకుంటుంది
అదెట్లా అని అడిగావనుకో
నన్ను చిత్రించిన చిత్రకారుడు
మటుకే చెప్పగలిగిందది.
Featured image: Emily Dikinson’s garden, pc: https://www.emilydickinsonmuseum.org/
8-9-2025


ఎవరితోనూ సంబంధమూ, పేచీ లేకుండా కేవలం ప్రకృతిలో ప్రేక్షకుడిగా ఉండి ఇంతటి ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చని తేనెలొలికే కవితలద్వారా తెలియజెప్పిన ఎమిలీ, వాటిని తన ఔదార్యంతో అంతే అందంగా తెలుగులోకి తెచ్చిచ్చిన ఋషి మిత్రులూ, అదికూడా అందుకుందుకు బద్ధకించిన వాళ్లకి ఆ అరటిపండుని సుతారంగా ఒలిచి నోటికందించిన తేటనీటి సరోజం మానసా …. పరుగులాపి ప్రకృతినాస్వాదించమనీ, కృతజ్ఞులై ఉండమని చెప్పకనే చెప్తున్న ఈ ముగ్గురికీ అనేక ధన్యవాదాలు!
ఈ వాక్యాలు మీ సహృదాయినికీ, మీ ఔదార్యానికీ గుర్తు సోదరీ!
Very beautifully expressed!!
మానస గారికి అభినందనలు!!
ధన్యవాదాలు మాధవీ!
ఈ వచనం మొత్తం లేఖల సువాసన, శబ్దం, నిశ్శబ్దం అన్నింటినీ అనుభవింపజేస్తుంది. పున్నాగపూల వాసన, పారిజాతం చెట్టు కింద పడిన పూలు—ప్రకృతిని లేఖలతో మేళవించిన తీరు మంత్రముగ్ధం చేస్తుంది. “It is too soon for language..” అన్న మాట దగ్గర మీరు ఆగిపోయిన అనుభవం హృదయాన్ని తాకుతుంది. మార్గరెట్ ఫుల్లర్ రాసిన హృదయాల అవసరం మీ ఊహలో మళ్లీ మళ్లీ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. గాంధీజీ రోదన గురించి చేసిన ప్రస్తావనలో లోతైన మౌనం కనబడుతుంది. స్నేహం గురించి ఎమర్సన్ మాటలు—వార్తలకన్నా ఒక స్పూర్తి కావాలని—చాలా ఆలోచింపజేస్తాయి. ఒక నిజమైన స్నేహం పిట్టల పాటలతో, నది గలగలలతో పోల్చిన తీరు అత్యంత అందంగా ఉంది. రెండు వారాల లేఖల పఠనం ప్రతి రోజును ఊహల్లో లేఖలా మార్చేసింది. “Life is a finest secret..” అన్న భావం ఈ వచనంలో రహస్యంగా ప్రవహిస్తోంది. చివరగా, మీరు ఉటంకించిన కవిత “దేవుని భాష”ను మనసుకు దగ్గర చేసింది.