
ఉణుదుర్తిసుధాకర్ వృత్తిరీత్యా మెరైన్ ఇంజనీరు. ప్రవృత్తి రీత్యా కథకులు, సామాజిక విశ్లేషకులు, విమర్శకులు. ఆయన ‘తూర్పు గాలి’ తెలుగులోనూ, ఇంగ్లిషులోనూ కూడా ప్రాచుర్యం పొందిన పుస్తకం. వారి శ్రీమతి వింధ్య కూడా సామాజిక శాస్త్రవేత్త. ఆమె త్రిపుర గారి కుమార్తె కావడం మరొక సంతోషకరమైన విషయం. ఎప్పుడో మూడున్నర దశాబ్దాల కిందట నేను పార్వతీపురంలో పనిచేస్తున్నప్పుడు, శ్రీకాకుళం తిరుగుబాటును అధ్యయనం చేస్తూ ఆ దంపతులిద్దరూ ఆ గిరిజన ప్రాంతాల్ని పర్యటించినపతపటినుంచీ, వారితో నాకు స్నేహం బలపడుతూ ఉంది. సుధాకర్ గారు నా ‘కథల సముద్రం’ పుస్తకం పైన ఎంతో సహృదయంతోనూ,, ఎంతో ఔదార్యంతోనూ చేసిన ఈ సమీక్ష నాకు చాలా సంతోషం కలిగించింది. అందుకని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను ఈ సమీక్షను ప్రచురించిన కుమార్ కూనపరాజు గారికి నా ధన్యవాదాలు.
ఆగస్టు నెల రెండవ తేదీన జరిగిన ‘రావిశాస్త్రి కథాపురస్కార సభ 2025’లో కొన్ని పుస్తకాలు నాకు కానుకలుగా లభించాయి. వాటిల్లో వాడ్రేవు చినవీరభద్రుడి వ్యాస సంకలనం ‘కథల సముద్రం’ ఒకటి. చదవడం మొదలుపెట్టాక నిలుపుచెయ్యడం సాధ్యపడలేదు. అందుకే ఈ నాలుగు వాక్యాలు. గత ఐదారేళ్లుగా భద్రుడు తెలుగు కథలు, నవలలు, అనుదాలపై రాస్తూ వచ్చిన వ్యాసాలు ఇవి. చాలా వరకూ ముందుమాటలు. చాలా సందర్భాలలో – రచయితపై వల్లమాలిన అభిమానంతోనో, ఏదో ఒక సిద్ధాంతానికో, అస్తిత్వానికో కట్టుబడి ఉండడం మూలానో, ఒత్తిడిని భరించలేకో, ‘రిటర్న్ గిఫ్ట్’గానో – ప్రశంసాపూర్వకమైన ముందుమాటలు వెలువడతాయని నాకు తెలుసు. అటువంటి మొక్కుబడి రాతల నుండి నేర్చుకోతగినది పెద్దగా ఉండదు. ఇందుకు భిన్నంగా, ఈ సంపుటిలోని వ్యాసాలలో అడుగడుగునా ఆణిముత్యాలు మెరిసి అబ్బురపరచాయి; కొత్త ఆలోచనలను ప్రేరేపించాయి. వాటిని ఆత్రంగా ఏరుకుంటూ, ఒక రాత్రిపూట మొత్తం పుస్తకాన్ని చదివేశాను.
సమీక్ష విహంగ వీక్షణం అయితే, విమర్శ రచనని మరింత ఉన్నతమైన అమూర్తతా స్థాయికి (Higher level of abstraction) తీసుకెళ్లాలని అంటారు. మరి ఇటువంటి సమర్థవంతమైన సద్విమర్శని సమగ్రంగా, వివేచనవంతంగా ఎలా విశ్లేషించాలి? ఇది ఈ వ్యాసకర్తకి సవాలు. వీటిల్లో కొన్నింటినినైనా పరిచయం చేసే ప్రయత్నం ఇది.
మొదటి వ్యాసమైన ‘ద స్టోరీ టెల్లింగ్ యానిమల్’లో, ‘మానవుడు లేనిదాన్ని కూడా జరిగినట్టుగా ఎందుకు ఊహించుకుంటాడు?’ అనే ప్రశ్నను లేవనెత్తుతాడు, భద్రుడు. ఆయన ఇచ్చిన సమాధానం: ‘యథార్థాల్ని శకలాలుగా గుర్తు తెచ్చుకోవడం కన్నా, వాటిని సమగ్రంగా తనకై తాను చిత్రించుకోవడం మనిషికి ముఖ్యం.’ అనుభవం, అర్థవంతం అయ్యే క్రమం రచయిత పరోక్షంగానో, ప్రత్యక్షంగానో అందజేసే వ్యాఖ్యానాల ద్వారానే. బాలగోపాల్ చెప్పినట్లు రోజువారీ జీవితాల్లో మనకు కనిపించకుండాపోయే కొత్త కోణాలను సాహిత్యం ఆవిష్కరించే క్రమం ఇదే.
మాటలు నేర్చిన జంతువుగా మనిషికి కథలు చెప్పుకోవడం, తద్వారా చుట్టూ ఉన్నవారిని నవ్వించడం, లేదా ఏడ్పించడం, పోనీ వినోదింపజేయడం, అలాగే నీతుల్ని బోధించడం, పూర్వీకులను గుర్తుచెయ్యడం అత్యవసరం, నిత్యావసరం. కథలూ, గాథలూ తెగల్నీ, సమూహాల్నీ, నిజానికి మానవ సమాజాన్నీ ఏకం చేసే సజీవమైన బంధనాలు. పంచతంత్రం నుంచి మహాభారతం దాకా మన సమాజానికి అందుతూన్న విరిగిపోని బంధం, ‘ఇగిరిపోని గంధం’ అనుభవ వ్యక్తీకరణకి మెరుగులు దిద్దిన సృజనాత్మకత. ఆ కథనాల ఫలితమే భారతీయ చిత్తం.
అనుభవాలకు సృజనాత్మకత మేళవించినపుడు తయారయ్యే ఉత్పత్తి, పాఠకుల స్వీయానుభవాల కటకాలలో కనిపించే అన్వయింపులతోనూ, విమర్శకుల వ్యాఖ్యానాల భూతద్దాలతోనూ వక్రీభవనం చెందుతుంది – ఒక్కోసారి వక్రీకరణ కూడా.
రావిశాస్త్రి వ్యాసంలో శాస్త్రిగారి రచనలను సామాజిక వాస్తవికతపై ఆయన చేసిన వ్యాఖ్యానం (hermeneutics of social reality) అంటాడు, భద్రుడు. నిజమే, రావిశాస్త్రి వ్యాఖ్యానించకపోతే, ముత్యాలమ్మలూ, హేడ్డుగారూ, సీనియర్ లాయరూ భరించలేనంత విషాద వాస్తవాలుగానే శూన్యంలో ఉండిపోతారు. నిజానికి ‘కన్యాశుల్కం’ మొత్తం గిరీశం చేసే అపహాస్యం; మరో మెట్టు పై నుంచి మధురవాణి ఎండగట్టిన పురుష ప్రపంచపు కాపట్యం.
గురజాడ అపహాస్యంతో కన్యాశుల్కాన్ని నడిపిస్తే, రావిశాస్త్రి శైలి కవితా వాస్తవికత (poetic realism) అంటాడు భద్రుడు. ఈ ప్రతిపాదనను సమర్థించుకుంటూ ‘కవీ, కథకుడూ, చిత్రకారుడూ’ అనే వ్యాసంలో రావిశాస్త్రి రచనల్లోంచి అపురూపమైన పేరాలను ఉటంకిస్తాడు. వాటిని చదువుతూంటే వచనం, భావం, ఉద్వేగం తాదాత్మ్యం చెందిన ఆల్కెమీ మనల్ని మళ్లీ మళ్లీ అబ్బురపరుస్తుంది. వచనానికీ, కవిత్వానికీ మధ్య హద్దులను చెరిపేసినవాడు రావిశాస్త్రి అనకుండా ఉండలేము.
Otherని otherగా కాకుండా selfలో భాగం చేస్తూ, సున్నితంగా చెప్పే, సన్నిహిత వాక్య సృష్టే సాహిత్య ప్రయోజనం అంటాడు భద్రుడు, ‘తెహ్‌జీబ్’ వ్యాసంలో. నేటి అస్తిత్వ వాదాల విభజనల మధ్య ఇది ఆలోచించవలసిన హితవు. అంతేకాదు, సృజనాత్మక రచనలుగా ఉండాల్సిన రచనలు, సామాజికశాస్త్ర పాఠ్యపుస్తకాలుగా మారిపోయే ప్రమాదం పట్ల రచయితలు జాగరూకతను కలిగి ఉండాలంటాడు.
సమస్యలకు పరిష్కారాలను వెతకడం, లేదా సూచించడం, ఊకదంపు ఉపన్యాసాలు ఇవ్వడం – ఇవేవీ రచయితల పనులు కావు అని చెహోవ్ అన్నాడని భద్రుడు తెలియజేస్తాడు. విభిన్న వాదాలను, వాటికి ప్రతీకలైన పాత్రలను నిష్పాక్షికంగా మనముందుంచి నాటకీయతను సృష్టిస్తాడు చెహోవ్ అని కూడా అంటాడు. చెహోవ్ కథల్ని అజరామరం చేసిన సాహిత్య శిల్పరహస్యం, అతడి సామాజిక స్పృహ ఎక్కడా వాచ్యంగా ఉండకపోవడమే అంటాడు.
కుమార్ కూనపరాజు పూనికతో, అరుణా ప్రసాద్ ఇటీవల తెలుగులోకి అనువదించిన డాస్టొయెవ్‌స్కీ నవల ‘బ్రదర్స్ కరమజోవ్’పై వ్రాసిన వ్యాసం, ఈ పుస్తకానికి తలమానికం. ఇందులో కొన్ని అబ్బురపరచే పరిశీలనలు చేస్తాడు భద్రుడు. ‘ప్రతీ జాతికీ అన్నదమ్ముల గురించిన ఇతిహాసం ఒకటి ఉంటుంది,’ అంటాడు. మనకి అప్రయత్నంగానే రామాయణ-మహాభారతాలు గుర్తుకి వస్తాయి. 140 ఏళ్ల నాటి రష్యన్ నవలని ఇప్పుడు తెలుగులోకి అనువందించాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నను లేవనెత్తి, జవాబుగా – మూడు ప్రయోజనాలున్నాయంటాడు. వాటిని తెలుసుకోవాలనుకొనేవారు ఈ వ్యాసం చదవాల్సిందే. అలాగే, ‘గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును. అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును,’ అనే బైబిల్ వాక్యాన్ని (డాస్టొయెవ్‌స్కీ, నవలను తన భార్యకు అంకితం చేస్తూ దీన్ని పేర్కొన్నాడు.) సవివరంగా చర్చిస్తాడు, భద్రుడు. నాకైతే రాబోయే తరాల భవిష్యత్తు కోసం తమ సర్వస్వం అర్పించిన త్యాగధనులు, పూర్వీకులు గుర్తుకొచ్చారు. ఈ మహా వాక్యం డాస్టొయెవ్‌స్కీని ఎంత లోతుగా కదిలించి ఉంటుందో ఊహిస్తే, ఈ నవలను అర్థంచేసుకోవడం అంత సుగమం అవుతుందనిపించింది. ఈ విధంగా – చాలామంది క్లిష్టమైన రచన అని భావించే బ్రదర్స్ కరమజోవ్ నవలకు ద్వారాన్ని తెరిచే తాళం చెవిని మన చేతికిస్తాడు భద్రుడు.
‘మూడో ఒట్టు’ వ్యాసరూపంలోని గమ్మత్తైన కథ. ఇది చదివాక నేను కూడా ‘ఫణీశ్వర్ నాథ్ ఉత్తమ కథలు’ అన్న పుస్తకాన్వేషణలో ఇరుక్కున్నాను. మంచి విమర్శకులు ఎందుకు చదవాలో, ఎలా చదవాలో చెబుతారు. ఒక్కోసారి ఏమేమి చదవాలో కూడా చెబుతారు. అటువంటి అరుదైన సందర్భాలను పాఠకులు వదులుకోకూడదు.
‘వెనుకబడ్డ’ శ్రీకాకుళం జిల్లాలోని గిరిజనేతర ప్రాంతాల భూసమస్యని చర్చించిన అట్టాడ అప్పల్నాయుడి ‘బహుళ’ నవల వెలువడిన సందర్భంలో రాసిన ‘One Hundred Years of Multitude’; డోంగ్రియా కోదు సమాజంపై రాజా నరసింహ రాసిన ‘నియాంపురం’ నవలపై ‘ఒక అడుగు ముందుకు’ అనే వ్యాసం; అదిలాబాదు గోండులపై యల్లాప్రగడ సంధ్య నవల ‘మోదుగపూలు’ని విశ్లేషిస్తూ రాసిన ‘ప్రేమవల్ల మాత్రమే’ – వీటిని ఉమ్మడిగా పరిగణించాల్సి ఉంటుంది
పై వ్యాసాలను కలిపి చదివితే తెలుగు రాష్ట్రాల గిరిజన సమాజంపై వీరభద్రుడికిగల విస్తారమైన, లోతైన అవగాహన మనలను ఆశ్చర్యచకితులను చేస్తుంది. బాల్యం నుండీ కూడ గిరిజనులపట్ల అతడికి ఉండిన ప్రేమ, గిరిజన జీవన విధానంతో, సంస్కృతితో అతనికి ఉన్న దీర్ఘకాలిక అనుబంధం, గిరిజనాభివృద్ధి శాఖలో, రాష్ట్ర ప్రభుత్వంలో అతడు నిర్వర్తించిన విధులు, ముఖ్యంగా గిరిజన విద్యోన్నతికై అతడు పడ్డ తపన – ఇవన్నీ ఒక్కసారిగా మనకి గుర్తుకు వస్తాయి. సామాజిక శాస్త్రవేత్తలతో సహా గిరిజన సమాజాన్ని అర్థం చేసుకోవాలని కోరుకొనే వాళ్లందరూ చదవాల్సిన ఈ వ్యాసాలు వీరభద్రుడు సేకరించిన సమాచారాన్నీ, చేసిన విశ్లేషణను, అందించిన అంతర్దృష్టిని వెల్లడిస్తాయి.
కళింగాంధ్ర రచయితలు (శ్రీకాకుళోద్యమ స్ఫూర్తితో భూషణం రాసిన ‘కొండగాలి’ వెలువడే వరకూ) తమ రచనలలో గిరిజనులకు స్థానం కల్పించలేదు? అనే ప్రశ్నను లేవనెత్తి విస్తారంగా చర్చిస్తాడు వీరభద్రుడు, పై వ్యాసాలలో. మల్లిపురం జగదీష్ వంటి నేటితరం గిరిజన రచయితలు తమ కథలను తామే వ్రాసుకోవడం, ప్రతి ఒక్కరూ స్వాగతించవలసిన పరిణామం అని కూడా అంటాడు. నిజానికి రాజ్యం మాత్రమే కాకుండా, మొత్తం సమాజం తన దృష్టిని గిరిజన సమస్యలవైపుగా మళ్లించేలా చేసింది అనాటి ఉద్యమమే. అందులో భాగంగానే సాహిత్యంలో గిరిజనుల ప్రస్తావనతో మొదలై, స్వంత గొంతును వినిపింపజేసే వరకూ సాగిన ప్రయాణాన్ని చూడాలి. ‘విఫలమైన’ శ్రీకాకుళ ఉద్యమం సాధించిన విజయాల్లో సాహిత్యరంగాన్ని గిరిజనుల ప్రవేశానికి సిద్ధం చేయడం ఒకటి.
ఈ సందర్భంగా ప్రొ. ఆర్.ఎస్. రావు 1985లో ‘కన్యాశుల్కం’పై చేసిన ప్రసంగంలోని ముగింపు వాక్యాలను గుర్తుచేసుకోవాలి (చూడుము: ప్రసంగానికి వ్యాసరూపం ‘గురజాడ కన్యాశుల్కం – సామాజికాభివృద్ధి క్రమం’ – రేగులగడ్డ సోమేశ్వరరావు, ‘విభాత సంధ్యలు.’ సంపాదకుడు సి.వి. సుబ్బారావు).
“…ఇప్పుడు కన్యాశుల్కం ఎవరైనా రాస్తే అందులో ఏమీ మార్పులుండవా? ఉంటాయి. ఒక గిరిజనుడి పాత్ర తప్పకుండా ఉంటుంది. బహుశా మధురవాణి సామాజిక విప్లవానికి ప్రతీక అవుతుంది.”
కొండని అద్దంలో చూపించడం తెలుగు వారికి తెలిసిన నానుడి. ఇప్పుడు కథల సముద్రాన్ని అద్దంలో చూపించాడు వీరభద్రుడు. కథకులూ, సమీక్షకులూ, విమర్శకులూ, తెలుగు సాహిత్య ప్రేమికులూ, జిజ్ఞాస కలిగిన పాఠకులూ చదవాల్సిన పుస్తకం ఇది. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాలపై ప్రేమతో మనకి దీన్ని అందజేసిన భద్రుడికి ధన్యవాదాలు, అభినందనలు.
కథలసముద్రం – కథలూ, నవలలూ, కలబోతలూ’. వాడ్రేవు చినవీరభద్రుడు. ఎన్నెలపిట్ట ప్రచురణ. పే. 200. వెల రూ. 250/-. ప్రతులకు: www.ennelapitta.com, ఫోన్: 7989546568. www.pustakam.in, www.telugubooks.in, Amazon.
1-9-2025


చాలా సమగ్రంగా, ఉన్నంతంగా సమీక్షించారు… శ్రీ సుధాకర్ గారికి నమస్సులు.
మీకు అభినందాభివందనములు 🙏❤️🌹
ధన్యవాదాలు సార్