మా నాన్నగారు

ఈ రోజుతో మా నాన్నగారు విశ్వేశ్వర వెంకటాచలపతి (1925-2025) శతజయంతి సంవత్సరం పూర్తవుతోంది. మా కుటుంబం అందరి తరపున మా అన్నయ్య సుందర్రావు ఈ ఏడాది పొడుగునా ఆయనకు నివాళిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాడు. ఆయన జీవితకాలం ఏ ఏ ప్రాంతాల్లో జీవించారో అవన్నీ సందర్శించాడు. అక్కడ ఆయన్ను ఆదరించిన కుటుంబాలను, వారి వారసులను కలుసుకొని వారికి సత్కారం చేశాడు.

అయినా, మా నాన్నగారి స్మృతికి  నేను ఘటించవలసిన నివాళి ఘటించలేదనే అనిపిస్తున్నది. ‘మీరు మీ నాన్నగారి జీవిత చరిత్ర ఎందుకు రాయకూడద’ ని అడిగాడు పి సురేష్ బాబు, నా రాజమండ్రి మిత్రుడు, ఆ మధ్య. నిజానికి మా ఊళ్లో కొండ రెడ్ల గురించి ఒక నవల రాస్తే మా నాన్నగారు మరింత సంతోషిస్తారు అనుకుంటాను. మరీ ముఖ్యంగా, భారతీయ తత్వశాస్త్రం పైన నేను సంకల్పించిన ‘ఆత్మాన్వేషణ’ పూర్తి చేస్తే అది నిజంగా ఆయన ఋణం ఎంతో కొంత తీర్చుకున్నట్టు అవుతుంది.

ఇప్పటికైతే, రెండేళ్ల కిందట రాసిన ఈ కథని, మీతో పంచుకోనివ్వండి.


తల్లులూ, కొడుకులూ


అంతరంగం నెమ్మదిగా తెరుచుకుంటున్నట్టు ఆ రోడ్డు, ఆ వీథి, ఆ ఇల్లు. అలవాటైన దృశ్యమే, కాని అంతగా ఎప్పటికీ నా హృదయానికి తీసుకోలేకపోయిన ప్రపంచం. శీతాకాలపు సాయంకాలం. ఆ ఇల్లు నెమ్మదిగా శిథిలావస్థకు చేరుకుంటూ ఉంది. ఒకప్పుడు ఊరిమధ్యలో కోటలాగా కనిపించిన ఇల్లు. ఎన్నో ఏళ్ళ కిందట మొదటిసారి ఈ ఊరు వచ్చినప్పుడు, పసివాడిగా ఆ ఇంటి వీథరుగు మీద పడుకున్నప్పుడు, తెల్లవారుతూనే పిచికల కువకువ, ఎదురుగా తెల్లనిగోడ, బావి దగ్గర చప్పుళ్ళు, దానిమ్మకొమ్మల్లో విచ్చుకునే ఎర్రని మొగ్గలు, ఎదురుగుండా వీథిలో సీమచింతచెట్లు- మా ఊరికీ, ఈ ఊరికీ చింతచెట్టుకీ, సీమచింతచెట్టుకీ ఉన్నంత తేడా ఉంది. సీమచింత చెట్టునిక్కడే మొదటిసారి చూసాను.

ఇప్పుడు ఆ తెల్లని గోడలేదు. ఇంటిముందు మురుగుకాలవ. ఆ అరుగు, మా తాతయ్యగారు, మా నాన్నగారు, చిన్నాన్న, మా అన్నయ్యలు కరణీకం లెక్కలు రాసుకునే ఆ అరుగు పూర్తిగా గచ్చు పగిలిపోయిఉంది. కాని పైన 1948 అన్న అంకెలింకా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. నేను పుట్టి పెరిగిన తాటాకు ఇంటినుంచి ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడల్లా ఏదో విదేశంలో అడుగుపెడుతున్నట్టే ఉండేది. వాకిట్లో అడుగుపెట్టి కుడివైపు తిరగ్గానే ఏనుగు తలకాయలు చెక్కిన సిమెంటు మెట్లు, ఆ మెట్లమ్మటే చిన్నప్పుడు జారుతూండటం ఓ సరదా. ‘పిల్లలూ, హుష్‌, అటుపొండి, తాతయ్యగారు’ పడుకున్నారు’ అనేవారెవరో. భయం భయంగా ఒకవైపూ, ఆ సిమెంటుమెట్లమ్మటే మరోసారి జారుడుబల్ల ఆడాలన్న కోరిక మరోవేపూ..అది కూడా మా ఊళ్ళో, మా ఇంట్లో ఉండే వాతావరణం కాదు. మా ఇంట్లో వీథరుగుమీద, ఇంటిముందు చింతచెట్టుకింద, వానలు పడ్డప్పుడు రామకోవెల పక్కన, కొద్దిగ్గా నవయవ్వనంలో అడుగుపెట్టాక, ఏటి ఒడ్డున, చాపరాయిచెంతన, ఎప్పుడేనా, ఎక్కడేనా ఆడుకునేవాళ్ళం. మా నాన్నగారు జమాబందీకి వెళ్ళినప్పుడు, వేసవి రాత్రుల్లో, ఆ చాపరాయిమీద బీడీ ఆకులు ఎండబెట్టుకునేవాళ్ళతో స్నేహం కలిపాడు మా అన్నయ్య. మొదటిసారి వాళ్ళ దగ్గర బీడీ కాల్చాను.

డిసెంబరు నెల చివరి రోజులు, క్రిస్మస్‌ అయిపోయిందిగాని, కొత్తసంవత్సరం ఇంకా మూడునాలుగురోజుల దూరంలో ఉంది. ఎక్కడో క్రైస్తవ గీతాలు వినిపిస్తున్నాయి. ఇళ్ళమీద క్రిస్మస్‌ తారలు అక్కడక్కడా మెరుస్తూనే ఉన్నాయి.

ఆ ఇంట్లో అడుగుపెట్టేటప్పటికి, అత్తయ్య మా కోసం ఎదురుచూస్తూ ఉంది. నా చిన్నప్పుడు ఒక భవంతిలాగా, హర్మ్యంలాగా కనిపించిన ఆ ఇల్లు, ఇప్పుడా జ్ఞాపకం తాలూకు నీడలాగా ఉంది. ఆ కటకటాల ముందువసారా, ఒకప్పుడు ఎంతో సువిశాలంగా అనిపించిన ఆ ముందుగది ఇప్పుడు ఇరుగ్గా, ఇంటికొచ్చిన అతిథిని ముక్తసరిగా పలకరించే గృహస్థులాగా ఉంది. లోపల హాల్లో మటుకు శుభ్రంగా ఉంది.

‘రండర్రా, నేనే వద్దామనుకున్నాను, కాని ఇదిగో ఈ కాళ్ళు పడనివ్వట్లేదు’ అందామె మోకాళ్ళు రుద్దుకుంటూ. పక్కనే వాకర్‌.

అరవైల నడివయసుకి చేరుకుందామె. ఒకప్పుడు తామరపూల కొలనులాగా కలకల్లాడిన ఆ ఇంట్లో ఇప్పుడామె కుటుంబం ఒక్కటే మిగిలింది. మేము పోయినసారి వచ్చినప్పుడు ఆమె తల్లి, మా చిన్నబామ్మగారు కూడా ఉన్నారు, కాని ఇప్పుడా చినబామ్మగారు ఈ లోకంలో లేదు.

ఆ హాల్లో ట్యూబు లైటు పనిచెయ్యడం లేదు. సి ఎఫ్‌ ఎల్‌ మందకొడిగా వెలుగుతూ ఉంది. టివిమీద చిన్న గుడ్డ తెర. పక్కన నల్లటిబైండుచేసిన పవిత్రగ్రంథం.

ఇది నా ఊరు కాదు, ఇది నా ఇల్లు కాదు, ఈమె నా తండ్రికి సొంత చెల్లెలు కాదు. కాని నువ్వొక్కప్పుడు విన్న పాటని నెమరేసుకోడానికి మిగిలిన స్వరాలు ఇవే. ఒకప్పుడీ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు పెద్ద తిరుగుబాటు నడిపాడు. ఆయన్ని బ్రిటిష్‌ వాళ్ళు కాల్చిచంపేసారు. చాలా కాలానికి, స్వతంత్రం వచ్చాక, దేశం ఆయన్ని స్మరించుకోవాలనుకున్నప్పుడు, ఆయనకు పడ్డ ఋణాన్ని తీర్చుకోవాలనుకున్నప్పుడు ఆ ప్రేమ, ఆ గౌరవం, ఆ భక్తి అంతా బతికున్న ఆయన సోదరుడి మీద కురిపించింది. అలాగే మా తల్లిదండ్రుల గుర్తుగా మిగిలింది వీళ్లే.

అమ్మా, నాన్నగారూ నేను పుట్టిన ఇంటినీ, ఊరినీ వదిలి మళ్ళీ ఈ ఊరు వచ్చి ముప్ఫై ఏళ్ళు కావొస్తూంది. ఇద్దరూ రెండుమూడు నెలల వ్యవథిలో మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి పదేళ్ళు కావొస్తూంది. మా నాన్నగారికి ఇది పుట్టిన ఊరు కాదు, కర్మక్షేత్రమూ కాదు. కాని విషాదమేమిటంటే, ఆయన మరణించింది ఈ ఊళ్ళోనే. అప్పటికి పదిపన్నెండేళ్ళ కింద మా బామ్మగారికి ఎక్కడ అంత్యక్రియలు చేసారో, అక్కడే ఆయనకీ చేసాం. సూర్యాస్తమయం అయ్యాక, అక్కణ్ణుంచి తిరిగివస్తూండగా, మా అన్నయ్య అన్నాడు ‘నాన్నగారికి ఈ ఊరితోనే ముడిపడిఉంది. ఈ ఊరంటే ఆయనకు ప్రాణం’ అన్నాడు.

ఆ మాటలు నన్నిప్పటికీ కలవరపెడతాయి.ఆయనకు ఏది ఇష్టమో, ఎక్కడ ఆయన ప్రాణం లగ్నమయిఉందో, ఆయన మరణించేదాకా నేనెందుకు తెలుసుకోలేకపోయాను? ఆ విషయం ఆయన మరణించడానికి ముందు పదేళ్ళ ముందో, ఏడాది ముందో, కనీసం నెల్లాళ్ళముందో, చివరికి వారం రోజులముందు తెలిసినా ఎంత బాగుండేది!

ఆయన ఇంక నెలరోజులే బతుకుతారని తెలిసిఉంటే నువ్వేమి చేసిఉండేవాడివి?

ఆయనతో యుద్ధం చేసిఉండేవాణ్ణి కాదు. పెద్ద ఆపరేషన్‌ జరిగి, ఇంకా కోలుకోని మా అమ్మని తీసుకుని ఆ పల్లెటూరికి పోతాననే ఆయన పట్టుదలకి అడ్డుపెట్టి ఉండేవాణ్ణి కాను. ఆయనొక్కడే ఆ డి.సి.ఎంలో సామాను మొత్తం ఎక్కించుకుని అంత ఆతృతతో ప్రయాణం చేసి అలసిపోయే పరిస్థితి తెచ్చి ఉండేవాణ్ణి కాను.

అన్నిటికన్నా ముఖ్యం, ఆయన జీవితకాల అనుభవాల్ని ఆయనతో చెప్పించి ఉండేవాణ్ణి, రాసుకుని ఉండేవాణ్ణి, అపురూపమైన కూనిరాగంతో ఆయన పాడే పద్యాలు రికార్డు చేసుకుని ఉండేవాణ్ణి. అంతేనా, ఎన్నో ముఖ్యమైనవీ, అర్థంలేనివీ, అంతగా పట్టించుకోనక్కర్లేనివీ ఎన్నో ఆయన్ని అడిగి ఉండేవాణ్ణి. ‘వాళ్ళు ఆ పొలం అమ్ముతానంటున్నారు, కొనుక్కుందామా?’, ‘మీరొకసారి ఎక్కడో ఎవరో మీ చెయ్యి చూసి మీ జాతకమంతా చెప్పారన్నారు కదా, ఏం చెప్పారు?’, ‘మీరెప్పుడూ తాతయ్యగారి గురించి చెప్తూ ఉంటారు కదా,ఆయనకు భారతభాగవతాలు కంఠోపాఠమని చెప్తారు కదా, 1913 నుంచీ ఆయన ఆంధ్రపత్రిక చదివేరని చెప్తారు కదా, అవన్నీ ఎక్కడ చదివారు?’

అన్నిటికన్నా ముఖ్యం నేనాయనతో మాట్లాడుకుంటూ ఉండేవాణ్ణి. రోజూ పొద్దున్నపూటో, సాయంకాలం పూటో ఆ కొండ బాటన, పొడుగ్గా నీడలు పడుతుండేవేళ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ నడుచుకుంటూ పోయేవాళ్ళమనిపిస్తుంది. అట్లా ఎన్నోసార్లు నా చిన్నప్పుడు ఆయన నా చేయి పట్టుకు నడిపించినట్టు.

కాని ఇప్పుడింక అవేవీ సాధ్యం కాదు. ఇంక ఈ లోకంలోనూ సాధ్యం కావు. మరొక లోకముంటుందో, మళ్ళా పుడతామో తెలీదు. మళ్ళా మరొకసారి పుట్టినా ఈ జ్ఞాపకం కొనసాగేదీ కాదు. ఏదన్నా ఎక్కడో అట్టడుగుపొరల్లో స్మృతి కొనసాగినా, అదేమిటో మంచులాగా మసగ్గా ఉండేదే తప్ప, స్పష్టంగా పోల్చుకోగలిగేదీ కాదు.

వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఈ ఊరితో బంధం తెంచేసుకోవచ్చు. కాని ఎక్కడో ఈ దుమ్ములోనూ, ఈ గాలిలోనూ వాళ్ళ స్ఫురణ కోసం వెతుక్కుంటూ మళ్ళా మళ్ళా ఇక్కడికొస్తూనే ఉన్నాను. ఆయన్ను చూసినవాళ్ళు, ఆయన పెంచి పెద్దచేసినవాళ్ళు, ఆయన్ను తమ చిన్నప్పణ్ణుంచీ బాగా ఎరిగినవాళ్ళు మా అత్తయ్యా, మా చిన్నాన్నా ఇంకా ఇక్కడున్నారు. వాళ్ళని చూస్తాను. వాళ్ళ దగ్గర కూచుంటాను, అట్లా కూచున్నప్పుడేనా మా అమ్మనీ, నాన్నగారినీ చూసినట్టుంటుందని. కాని, ఎప్పటిదో, మీ వంశచరిత్ర రాసిన పాతకాలపు తాళపత్రగ్రంథం తిరగేసినట్టే అనిపిస్తుంది. నీ పూజామందిరంలో ఉండే తాళపత్రం, ఎప్పటిదో, అంచులు నలిగిపోయిఉంటాయి, అక్షరాలు వెలిసిపోయి ఉంటాయి. ఆ గొలుసుకట్టు రాతలో ఒక్క రెండో అక్షరాలు మాత్రమే పోల్చుకోగలుగుతావు. అయినా ఆ తాళపత్రాన్ని చదవాలన్నట్టే, చదవగలవన్నట్టే అటూ ఇటూ తిప్పుతుంటావు. అట్లానే ఉంటుంది వాళ్ళతో మాట్లాడుతుంటే.

నేనూ, అక్కా, విజ్జీ, పిల్లలూ అంతా ఇంటికొచ్చామన్న సంతోషంలో అత్తయ్యకి ఊపిరాడటం లేదు. ప్రేమా, అతిథ్యమూ కలగలిసిపోతూండగా మేమా హాల్లో కుర్చీల్లోనూ, మంచం మీదా అంతా తలోచోటా సర్దుకు కూచున్నాం.

ఆమె ఆరోగ్యం గురించి ప్రశ్నలు.

కిందటి వేసవిలో ఆమె మాకు ఆవకాయలు పెట్టి పంపించింది. ఆ మాటలు.

‘నిన్నన్నే మీ చిన్నాన్న అంటున్నాడే, మనవాళ్ళు ఈ ఊరొచ్చి వంద ఏళ్ళయిందట’ అంది అత్తయ్య.

ఆ మాటలంటూండగానే చిన్నాన్న నేరుగా లోపలకి వచ్చేసాడు.

ఎప్పట్లానే కాళ్ళకి చెప్పుల్లేకుండా, జుబ్బాలాంటి చొక్కా. దానిమీద కనిపించీ కనిపించిన సన్నని గీతల డిజైన్‌.

అతను లోపలకి రావడం చూస్తూనే

‘రా.రా.. రా చిన్నాన్నా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం’ అంది అక్క.

అతను లోపలకి వచ్చి కూచునేదాకా అంతా లేచి నిల్చున్నారు. అతని కోసం కుర్చీ ఖాళీచేసి అక్క మంచం మీదకు వెళ్ళి కూచుంది.

‘అదే అన్నయ్యా, నువ్వు చెప్పిన మాటలే తలుచుకుంటున్నాం. మనవాళ్ళు ఈ ఊరొచ్చి వందేళ్ళయిందన్నావు కదా. ఆ మాటే చెప్తున్నాను’ అంది అత్తయ్య.

‘ఎప్పుడొచ్చారు మీరనో ఎలా ఉన్నారనో ఏదో కుశల ప్రశ్న అడగాలని నోరుతెరిచిన చిన్నాన్న ఆ మాటలు వింటూనే-

‘1914’ అన్నాడు.

‘1914 లో వచ్చారు మా తాతయ్యగారు చలమయ్యగారు, కొడుకు చూడకపోతే బతుకు తెరువు వెతుక్కుంటూ ఇక్కడికొచ్చారు. ఒక రోజు రాజమండ్రిలో వరదరావు హోటల్లో కూచుని ఉంటే కలెక్టరో, తహశీల్దారో కనబడితే, అయ్యా నాకేదన్నా ఉద్యోగమిప్పించడని అడిగారట. అప్పట్లో ఇక్కడ గరిమెళ్ళ మంగరాజు పితూరీ జరిగింది. ఇక్కడ కరణం ఆ పితూరీకి సాయపడ్డాడని వాణ్ణి ఉద్యోగంలోంచి తీసేసారట. ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఏజెన్సీలో వెళ్ళి పనిచేస్తావా అని అడిగితే ఎక్కడైతే ఏమిటి, అదే మహాప్రసాదమనుకుంటూ వచ్చేసారట.’

ఆయన బండి కట్టించుకుని వచ్చారు మన్యానికి. అట్లా వచ్చినాయన మూడేళ్ళు మటుకే ఉండగలిగారు. జ్వరం పట్టుకుంది, సొంత ఊరు వేధించడం మొదలుపెట్టింది. ఉండలేక, మళ్ళా ముక్కినాడ వెళ్ళిపోయారు.’

ఎప్పుడు?

1917 లో.

1917.

ఆ ఏడాదిని నేను ప్రపంచ చరిత్రలో నాకు తెలిసిన చారిత్రిక సంఘటనల్తో పోల్చుకుంటున్నాను.

‘ఈ కరణీకం చేస్తావా అని మా నాన్నగారిని అడిగారు’ మా చిన్నాన్న మళ్ళా చెప్పడం మొదలుపెట్టాడు. ‘మా నాన్నగారు చెయ్యలేనంటే, మా చిన్నాన్న, అప్పటికింకా మైనరు, ఆయన పేరుమీద రాసేసి ముక్కినాడ వెళ్ళి అక్కడే చనిపోయారు మా తాతయ్యగారు.’

ముక్కినాడ.

నా తండ్రి కన్నా ముందు కనీసం అయిదారు తరాలు అక్కడే పుట్టి జీవితం సాగించారు. ఆ ఊరెక్కడుందో ఇప్పటిదాకా చూడలేదు నేను. మా అన్నయ్య చెప్పాడు. యెర్రవరం నుంచి రాజమండ్రి వెళ్ళేటప్పుడు, రాజానగరానికి కొద్దిగా ముందు, పక్కకు తిరగాలి, ఏలేరు నది దాటాలి. దొంతమూరు, ముక్కినాడ, తామరాడ, గోనేడ-ఈ పేర్లు మా నాన్నగారి బాల్యమంతా గడిచిన ఈ పేర్లు, ఆయన నోటమ్మట ఎన్నోసార్లు విన్నపేర్లు-నేనిప్పటికీ చూడలేదు. సాయంకాలం పడుతూ ఉంటే గోడమీద పలచబడే నీడల్లాగా, ఈ పేర్లు కలిగించే అస్పష్ట సంవేదనలు కూడా చాలా ఏళ్ళుగా పలచబడిపోయాయి. మళ్ళా ఇన్న్నాళ్ళకు వింటున్నాను.

సొంత ఊరు వదులుకుని వేరే చోట ఉండలేకపోయిన మా ప్రపితామహుడు, తన అంత్యక్షణాలు సమీపించాయనగానే ఏదో తోసుకొస్తున్నట్టు బండికట్టించుకుని తన ఊరికి వెళ్ళిపోయి తన ఇంటిముంగిట్లో కాలం చేసాడు.

మా తాతగారు కూడా అట్లానే ఈ లోకాన్ని వదిలివెళ్ళిపోయారని విన్నాను.

‘తాతయ్యగారు కూడా వాళ్ళ ఊరికే వెళ్ళి చనిపోయారని విన్నాను. అదెట్లా జరిగింది చిన్నాన్నా?’ అనడిగాను.

‘మా నాన్నగారా! ఆయన పెదశంకర్లపూడి కరణంగా పనిచేసేవారు. అక్కడే మా చిన్నచెల్లెలు అంటే మీ సీతత్తయ్య పుట్టింది. వాళ్ళ అమ్మ అంటే మా తాతమ్మగారు సీతమ్మగారు మా అమ్మ ఆలనాపాలనా చూసుకుని ఒకరోజు తన మూడో కొడుకు ఇంటికి గోనేడ వెళ్ళారు. ఆమె వెళ్ళి నాలుగురోజులు తిరక్కుండానే ఒక రాత్రి మా నాన్నగారు బండివాణ్ణి పిలిచి గోనేడ వెళ్ళాలి, బండి కట్టించమన్నారు. రాత్రివేళ బండి కట్టలేనని బండివాడంటే వాడిమీద విసుక్కున్నారట. నేను చచ్చిపోయేక బండికడతావా అనడిగారట. ఆ రాత్రికి రాత్రే మా అన్నయ్యని, అంటే మీ నాన్నని తీసుకుని పెదశంకర్లపూడినుంచి గోనేడ వెళ్ళిపోయారు. రెండు మూడురోజులయ్యాక మీ నాన్నని వెనక్కి వెళ్ళిపొమ్మని చెప్పారు. మీ నాన్నకి విపరీతమైన బెంగ పుట్టి, వెక్కి వెక్కి ఏడ్చేసాడుట. ఎందుకు అంతలా ఆపుకోలేనంత ఏడుపు వచ్చిందో తనకి అప్పుడు తెలియలేదని చెప్పేవాడు మీ నాన్న.’

‘మీ నాన్న వెళ్ళిన మర్నాడో, రెండోనాడో మా నాన్న పొద్దున్నే వాళ్ళ మరదల్ని ‘అమ్మా కాఫీ ఇవ్వు’ అని అడిగాడట. ఆమె కాఫీ ఇచ్చేలోపే ఆయనకి ఎగశ్వాస మొదలయ్యిందట. అప్పట్లో వాళ్ళు అంటే ఆయన తమ్ముడూ, మరదలూ కొత్త ఇల్లు కట్టుకున్న రోజులు. ఈ మనిషి ఆ కొత్త ఇంట్లో ఎక్కడపోతాడో అని తొందర తొందరగా తీసుకువెళ్ళి పశువులపాకలో పడుకోబెట్టారు. ఆ క్షణమో, మరుక్షణమో ఆయన ఈ లోకం వదిలిపెట్టేసాడు. తీరాచేసి ఆ క్షణాన తన దగ్గర తల్లిలేనేలేదు. ఆ సమయాన ఆమె ఆ ఇళ్లల్లోనే, ఎక్కడో, ఏదో పనుల్లోనో ఉండిపోయినట్టుంది.’

‘ఆ తర్వాత మా అమ్మకీ, అన్నయ్యకీ సంగతి తెలిసి గోనేడ వెళ్ళేటప్పటికి, తామరాడకీ, గోనేడకీ మధ్య ఉన్న ఏట్లో అందరూ స్నానాలు చేస్తున్నారు. మా అమ్మకీ, మా అన్నయ్యకీ, మాకెవ్వరికీ కడసారి చూపు దక్కనే లేదు’ అన్నాడు మా చిన్నాన్న.

ఎందుకు అంత త్వత్వరగా వెళ్ళిపోయాడు ఆయన తన భార్యాపిల్లల్ని కూడా వదిలిపెట్టి ఆ ఊరికి? తన ప్రాణంపోతోందంటే తనని తీసుకుపోయి పశువుల పాకలో పడుకోబెట్టిన తన తమ్ముడి ఇంటికి? ఇప్పుడు అర్థం చేసుకోగలను. ఆయన తన తల్లికోసం వెళ్లిపోయాడు. ఇప్పుడు మా నాన్నగారిని చూసాక అర్థమయ్యింది నాకు. తాత, తండ్రి, మనవడు- వాళ్ళ చివరిక్షణాల్లో వాళ్ళు తల్లిదగ్గరో, తల్లి జ్ఞాపకాల దగ్గరో ఉండాలని బలంగా అనుకున్నారని.

2

ఆ రోజు నా కళ్ళముందే ఉంది. ఇంకా చెప్పాలంటే నేను అప్పణ్ణుంచీ ఆ రోజు దగ్గరే ఆగిపోయాను. మంగళవారం రాత్రి హైదరాబాదునుంచి బయల్దేరి బుధవారం పొద్దున్నకి రాజవొమ్మంగి చేరాను. మా అమ్మానాన్నగారూ కూడా అప్పటికి వారం రోజులై ఉంటుంది కాకినాడనుంచి రాజవొమ్మంగి చేరుకుని. అక్కడొక గిరిజనుడి ఇంట్లో ఒక వాటా అద్దెకు తీసుకున్నారు. నేను వెళ్లేటప్పటికే సామాను సర్దుకుని పెట్టుకున్నారు. జీవితం మళ్లా కొత్తగా మొదలుపెడుతున్నారు.

కాని అందుకోసం, కాకినాడ నుంచి రాజవొమ్మంగి వెళ్ళిపోడానికి మా నాన్నగారు ఎంత యుద్ధం చేసారని! అంతకుముందు హైదరాబాదునుంచి కాకినాడకి వెళ్ళిపోడానికీ అంతే యుద్ధం చేసారు. అప్పటికి మా అమ్మకు కంటి కాన్సరుకి ఆపరేషన్‌ జరిగింది. ఆమె కోలుకుంటూ ఉంది. ఎప్పుడు మళ్లా డాక్టరు అవసరం పడుతుందో తెలియదు. హైదరాబాదులోనే ఉండండి అని చెప్పాను. అడిగాను. చేతులెత్తి మొక్కాను. కాని ఆయన వినిపించుకోలేదు. ఆయన ప్రాణం రాజవొమ్మంగి వెళ్లిపోడానికి ఎందుకంతగా కొట్టుమిట్టాడిపోయిందో అప్పుడు నాకు తెలియలేదు. ఎంతో కొంత సౌకర్యంగా ఉండే చోటు వదిలిపెట్టి ఎందుకు మళ్ళా ఆ అడవికి వెళ్ళిపోతానని ఆయన గొడవచేస్తున్నారో నేను ఊహించలేకపోయాను.

కాని వాళ్లని మా అక్క కొన్నాళ్ళు కాకినాడలో ఆపగలిగింది. అక్కడ తాను కొత్త అపార్ట్‌ మెంటులోకి మారుతూ తన ఇల్లు మా అమ్మా, నాన్నకి ఇచ్చేసింది. కాని అతికష్టం మీద ఉండగలిగారు ఆయనక్కడ. ఆరునెలలు. ముళ్ళమీద కూచున్నట్టు కూచున్నారు. చివరికి జనవరి రెండవవారంలో నాకు ఫోన్‌ చేసారు.

‘మేము రాజవొమ్మంగి వెళ్ళిపోదామనుకుంటున్నాం. మీ అన్నయ్య అక్కడ ఒక ఇల్లు చూసి పెట్టాడు. సౌకర్యంగానే ఉంటుందని చెప్పాడు.’

నాకు చాలా కోపం వచ్చింది. మా నాన్నగారి మీదా, మా అన్నయ్య మీద కూడా. ఆ ఊళ్ళో ఆయనకు ఏం సౌకర్యం ఉంటుందో, ఏమి భద్రత ఉంటుందో నాకు తెలియదా? వాళ్ళకు తెలియదా? పిలిస్తే పలకడానికి మనిషి కూడా దొరకడు. డాక్టరు దొరకని ఊరు. మందుల షాపు కూడా తెరిచి ఉండని ఊరు. అక్కడికి వాళ్ళు వెళ్తామంటే మాత్రం మా అన్నయ్య ఎలా ఒప్పుకున్నాడు? నాతో మాటమాత్రమేనా ఎందుకు చెప్పలేదు? వాళ్ళకి అక్కడ ఏదైనా అత్యవసరమైతే ఎవరు వెళ్ళాలన్నా కనీసం ఒకరోజు పడుతుంది. అలాంటిది ఎలా వెళ్ళనివ్వడం?

ఆ శరభవరం, ఆ రాజవొమ్మంగి ఆయన్ను జీవితమంతా ఎంతలా వేధించాయో నాకు తెలుసు. ఎంతగా వెంటాడాయో కూడా మాకు తెలుసు. ఆ గిరిజన ప్రాంతాల్లో మళ్ళా ఆయన అడుగుపెట్టగానే గిరిజనులు ఆయన దగ్గరకొస్తారు. తమ భూములు ఆక్రమించుకున్న గిరిజనేతరుల మీద కేసులుపెట్టమంటారు. ఆయనకి ఆ భూమిలెక్కలు కంఠోపాఠం. ఆ సర్వేనంబర్లు కంఠోపాఠం. చివరికి ఏ భూమికి ఏ సర్వే రాయి ఎక్కడుంటుందో కూడా ఆయనకు గుర్తే.

ఆయన కరణంగా పనిచేస్తున్నప్పుడు ఒక తహశీల్దారు భూముల మీద అజమాయిషీకి వచ్చాడు. ఫీల్డు మెజర్‌ మెంటు బుక్కు చేత్తో పట్టుకుని ఒక పొలం మీద నిలబడి ‘ఇక్కడ సర్వే రాయి ఎక్కడ’ అనడిగాడు.

‘మీరు నిల్చున్న చోటనే’ అని చెప్పారు మా నాన్నగారు.

‘ఎక్కడ? కనిపించడం లేదు’ అన్నాడు తహశీల్దారు.

మా నాన్నగారు అక్కడ రైతు చేతిలో ఉన్న గునపం తీసుకుని తహశీల్దారు నిలబడ చోట భూమిలోకి ఒక్క పోటు పొడిచారు. ఖణేల్‌ మన్న రాయి చప్పుడు వినిపించింది.

ఆయన తొమ్మిది ఊళ్ళకి కరణం. తొమ్మిది ఊళ్ళల్లోనూ ప్రతి అంగుళం ఆయనకి తెలుసు. ఏ నేల ఎన్నిచేతులు మారిందో తెలుసు. ఎవరెవరు బినామీలుగా ఏ గిరిజనుడి భూమి ఆక్రమించారో తెలుసు. ఆయన రాజవొమ్మంగిలో కూచుని తమ మీద గిరిజనుల్తో కేసులు పెట్టిస్తున్నాడని గిరిజనేతరులు ఎమ్మార్వోకి ఫిర్యాదు చేసారు. భూమి లెక్కలు మా నాన్నగారికి కంఠోపాఠం అని తెలియని ఆ ఎమ్మార్వో ఆయన మీద కేసు పెట్టాడు. రెవెన్యూ రికార్డు ప్రభుత్వానికి అప్పగించలేదని ఇల్లు సోదాచేయించాడు. మూడు నాలుగేళ్ళు ఆయన వాయిదాలమీద వాయిదాలకి కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. చివరికి ఆ కేసు కొట్టేసారు.

ఇదంతా నా మనసులో ఉంది. ఆయన అక్కడికి వెళ్తే ఆ గిరిజనుల మీద ప్రేమ ఆయన్ని ఊరుకోనివ్వదు. అప్పుడు ఆ ఎనభై ఏళ్ళ వయసులో కూడా ఆయన మళ్ళా ఏ గిరిజనేతరుడిమీదనో పిటిషన్‌ పెట్టిస్తారు. ఎల్‌.టి.ఆర్‌ కోర్టులో కేసు మొదలవుతుంది. ఎన్నాళ్ళుగానో, ఎన్నేళ్ళుగానో ఆ ఊళ్ళల్లో గిరిజనుల భూములు ఆక్రమించిన గిరిజనేతరులు మళ్ళా ఆయన మీద కక్ష కడతారు. ఒకసారి మా ఊళ్ళో ఆయన మీద దాడిచేసారు కూడా. ఇవన్నీ అవసరమా? ఇప్పుడు ఈ వయసులో? అది కూడా మా అమ్మకి బాగులేనప్పుడు?

‘మీరు రాజవొమ్మంగి వెళ్ళడానికి వీల్లేదు’ అన్నాను, ఆ రోజు ఫోన్‌లో. చెప్పిన మాట వినని పిల్లవాణ్ణి దండిరచే తండ్రిలాగా మారింది నా స్వరం.

‘నేనిక్కడుంటే చచ్చిపోతాను’ అన్నారాయన.

నాకు తెలీదు, ఒకప్పుడు ఆయన తండ్రి కూడా బండికట్టనని చెప్పిన బండివాడితో ఆ మాటే అన్నారని. ఒకప్పుడు ఆయన తాతకూడా చివరిక్షణాల్లో అట్లానే బండికట్టించుకుని మరీ తనవూరు వెళ్లిపోయాడని.

కానీ నేను ఆలోచిస్తున్నది మా అమ్మ గురించి. ఆ అడవిలో ఆమెకు సకాలంలో వైద్యం అందకపోతే? ఆమెకేమైనా అయితే?

కానీ మా నాన్నగారు తన మంకుపట్టు వదల్లేదు.

మేము వెళ్ళిపోతాం, ఇంకొక్క రోజు కూడా ఇక్కడ ఉండలేం. ఇక్కడుంటే నేను చచ్చిపోతాను.’

‘చచ్చిపోండి అయితే’ అన్నాను. ఫోన్‌ పెట్టేసాను.

కాని ఆయన సంకల్పం ముందు నా భయాలు, సందేహాలు, అభ్యంతరాలు ఏవీ నిలబడలేవు. నిలబడజాలవని కూడా నాకు తెలుసు.

మళ్లా ఫోన్‌ చేసాను.

‘సరే వెళ్ళండి, రాజవొమ్మంగి. అక్క చిన్న డి సి ఎం ఏర్పాటు చేస్తానంది. దగ్గరుండి లగేజి అంతా ఎక్కిస్తుంది. మీకోసం ఒక జీపు పెడుతుంది. నాలుగురోజులాగి నేను రాజవొమ్మంగి వస్తాను’ అన్నాను.

అక్కడ ఆయన సమకూర్చుకున్న చిన్న ఇంటిస్థలంలో, అంతదాకా వాళ్ళుంటున్న తాటాకు పాక తీసేసి అక్కడొక చిన్న ఇల్లు కట్టిద్దామని నిశ్చయించుకున్నాను. ఆ మాటే చెప్పాను ఆయనకి.

ఆ వెంటనే బాంకుకి వెళ్ళాను. ఇల్లు కట్టడానికి లోను తీసుకోడానికి మాట్లాడేను. ఆ రాత్రే రాజవొమ్మంగి బయల్దేరాను. పున్నమి రాత్రి. ఆ రాత్రంతా రైల్లో ఆయన గురించే ఆలోచిస్తూ ఉన్నాను.

ఆయనకి తన తండ్రి చనిపోయినప్పటికి పదిహేడు, పద్ధెనిమిదేళ్ళు. తన తండ్రి పూర్తి నిస్సంగి. చనిపోయేటప్పటికి దోసెడు కొంపగాని, జానెడు నేల గాని చేర్చిపెట్టలేదు. అయినా మా నాన్నగారు తన జీవితకాలంలో తన తండ్రి గురించి ఒక చిన్న ఫిర్యాదు చెయ్యగా మేము వినలేదు. తన తండ్రి గురించి ఎప్పుడు మాట్లాడినా ఆయనకొక చెప్పలేని వివశత్వం, పట్టలేని గర్వం. ప్రాపంచికమైన ఏ బాధ్యతలూ పట్టించుకోకుండా పద్యాలు చదువుకుంటో వెళ్ళిపోయిన ఆ తండ్రి ఎక్కడ? జీవితమంతా ప్రపంచంతో పోరాడుతూనే గడిపిన ఆ కొడుకు ఎక్కడ? ఇద్దరూ విభిన్నధ్రువాలు. కానీ మా నాన్నగారి దృష్టిలో ఆయన తండ్రి ఒక హిమాలయం, తాను ఎన్నటికీ ఆ ఎత్తుకు చేరుకోలేడు. అసలు చేరుకోవాలన్న ఆశ కూడా లేనట్టే ఉండేవాడు.

తన తండ్రి పోగానే తన తల్లినీ, తమ్ముణ్ణీ, ముగ్గురు చెల్లెళ్ళనీ తీసుకుని ఆయన రాజవొమ్మంగి వెళ్ళారు. అక్కడ వాళ్ళ చిన్నాన్న, అంటే మా చినతాతయ్య గ్రామకరణంగా పనిచేసేవారు.

1942 నాటి మాట.

1917, 42 ఇవన్నీ ఎంతో ముఖ్యమైన సంవత్సరాలు ప్రపంచ చరిత్రలోనూ, దేశ చరిత్రలోనూ మాత్రమే కాదు, మా కుటుంబ చరిత్రలో కూడా.

అలా రాజవొమ్మంగిలో మా తాతయ్యగారి పంచన నీడ వెతుక్కున్న నా తండ్రి అక్కడే ఎనిమిదేళ్ళు గడిపాడు. తన తల్లి, తాను, తన తమ్ముడు అహర్నిశలు మా తాతయ్యగారి కుటుంబానికి సేవచేస్తూ గడిపేరు.

‘ఆ రేషను రోజుల్లో ఇంట్లో పెట్టుకున్నారు. అందుకు ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేం’ అనేవారు మా బామ్మగారూ, నాన్నగారూ కూడా ఆ రోజుల్ని తల్చుకునేటప్పుడు.

1950 లో ఆయనకి రాజవొమ్మంగి పక్కన శరభవరం అనే చిన్న గ్రామానికి కరణీకం దొరికింది. 51 లో రాజవొమ్మంగి నుంచి శరభవరం వచ్చేసారు. 52 లో పెళ్ళయింది. అప్పణ్ణుంచి 85 దాకా ముప్పై మూడేళ్ళు ఆ ఊళ్ళోనే ఉన్నారు. నేను పుట్టింది అక్కడే. నా పేగుబంధం ముడివడ్డది ఆ ఊరుతోనే. కాని మా నాన్నగారి ఆత్మ ముడిపడ్డది రాజవొమ్మంగితో అని ఆయన బతికుండగా తెలియలేదు నాకు.

శరభవరంలో ఆయన గ్రామకరణంగా పనిచేసే తొలిరోజుల్లో ఆయనా, మా చిన్నాన్నా ఆ గిరిజన గ్రామాలకు వెళ్ళి అక్కడే రోజులకు రోజులకు ఉండిపోయేవారు. ఆ గిరిజనులు ఏమిస్తే అది తిని అక్కడే ఏ రామకోవెల్లోనో నిద్రపోయేవారు. రామలక్ష్మణులు అనేవారట వాళ్ళిద్దరినీ చూసి.

ఆ రోజుల్లో ఆయనకు గిరిజనుల్తో ఏర్పడ్డది ఉద్యోగ సంబంధం కాదనీ, అంతకన్న బలమైన హృదయసంబంధమనీ ఆయనకు తెలియలేదు. వెళ్ళిన కొత్తలోనే ఆయనకు అర్థమయింది. 1917 మద్రాసు ప్రభుత్వ చట్టం ప్రకారం గిరిజనుల భూమి గిరిజనేతరులు కొనుగోలు చెయ్యకూడదని. 1959 లో మళ్ళా ఆ చట్టమే మరింత స్పష్టంగా రెగ్యులేషనుగా వచ్చిందని కూడా తెలుసు. శ్రీకాకుళంలో గిరిజనులు తిరుగుబాటు చేసిన తర్వాత 1970 లో ప్రభుత్వం ఆ రెగ్యులేషన్‌ ని సవరించి, గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకీ, గిరిజనేతరులకీ మధ్య మాత్రమే కాదు, గిరిజనేతరులకీ, గిరిజనేతరులకీ మధ్య కూడా భూబదలాయింపు నిషేధించిందనికూడా ఆయనకు తెలుసు. అయినా కూడా తన తోటి కరణాలు ఆ గ్రామాల్లో పెద్ద ఎత్తున పొలాలూ, తోటలూ సమకూర్చుకుంటున్నారనీ, బంగళాలు కట్టుకుంటున్నారని కూడా ఆయనకు తెలుసు. కాని తాను మాత్రం అక్కడ ఒక సెంటు భూమి కూడా సంపాదించుకోకూడనుకున్నాడు. గ్రామకంఠంలో తనకి ఉన్న చిన్నపాటి నివేశన స్థలంలో బతికినంతకాలం ఒక తాటాకు ఇంట్లోనే బతికాడుగాని, పెంకుటిల్లు కట్టాలన్న ఊహ కూడా చెయ్యలేదు.

ఎవరన్నా ఇంటికొచ్చినప్పుడు, ఆ వీథరుగు మీద రాతకోతలు నడుస్తున్నప్పుడో, మాటామంతీ సాగుతున్నప్పుడో, ఎవరో ఒకరు అనేవారు ‘కరణం గారూ, లోగిలి ఎప్పుడు కడుతున్నారు?’

ఆ ప్రశ్న వినగానే ఆయన మొత్తం ప్రభుత్వ చట్టాలు, 1917, 1959, 1970 సంవత్సరాలవారీగా చెప్పుకొచ్చేవాడు. ‘ఏజెన్సీలో నాన్‌ ట్రైబల్‌ అన్నవాడికి ఉండటానికి రైట్‌ లేదండీ. మనమంతా వెళ్ళిపోవలసినవాళ్ళమే, ఇక్కడ ఉండేవాళ్లం కాదు’ అనేవాడు ఊరంతా వినబడేటట్టు బిగ్గరగా.

మాది పెద్దకుటుంబం. ఎనిమిది మంది పిల్లలం. ఆయనకి తన ఉద్యోగం మీద వచ్చే ఆదాయం మాకు సరిపోయేది కాదు. కాని ఆయన తన పద్ధతి మార్చుకోలేదు. జీవితపు ఏ మలుపులోనూ కూడా ఆయన గిరిజనుడి భూమికోసం ఆశపడలేదు. సరికదా, వాళ్ల భూముల్ని రక్షించడంకోసం తన చుట్టూ ఉండే ఇరుగుపొరుగుతో యుద్ధం చేస్తూనే వచ్చాడు.

‘వెళ్ళిపోవాలి మీరిక్కణ్ణుంచి. మీకిక్కడ ఉండటానికి రైట్‌ లేదు’ ఇది ఆయన రోజూ వాళ్లతో చెప్పే మాట.

‘చదువుకోవాలిరా. చదువుకోండి. ఇక్కణ్ణుంచి వెళ్ళిపోండి. ఇక్కడ మీకు బతకడానికి ఆధారం లేదు. ఈ ఇల్లు, ఈ ఊరు మీవి కావు. చదువుకోండి, చదువుకోండి’` ఇది ఆయన రోజూ మాతో చెప్పే మాట.

1914 లో గిరిజనులు తిరుగుబాటు చేస్తే అప్పటి రాజవొమ్మంగి కరణం వాళ్ళకి సాయం చేసాడని బ్రిటిష్‌ ప్రభుత్వం అతణ్ణి ఉద్యోగంలోంచి తీసేసి మా ముత్తాతగార్ని అక్కడ కరణంగా నియమించింది. కాని ఆయనా, మా తాతగారూ కూడా అక్కడ కరణాలుగా పనిచేయడానికి ఇష్టపడలేదు. తాము పుట్టిపెరిగిన ఊళ్ళకే వెళ్ళిపోయారు.

కాని మా నాన్నగారి కథ మరోలా నడిచింది. ఆయనకి ప్రభుత్వంతో కలిసి గిరిజనులకోసం పోరాడే అవకాశం లభించింది. ఎన్ని గొడవలు పడ్డా, ఎంత హింస పడ్డా, ఎంత లేమి, కటకట అనుభవించినా ఆయన ఆ దారి వదులుకోలేదు.

1984 దాకా.

ఆ ఏడాది ప్రభుత్వం గ్రామాధికార వ్యవస్థని రద్దుచేసింది. రాత్రికి రాత్రి ఆర్డినెన్సు తెచ్చింది. అది పిడుగుపాటు మా నాన్నగారికి, మాకు, మా కుటుంబానికి.

ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా నాకు వెంటనే మరో విషయం కూడా గుర్తొస్తుంది. మా ఊళ్ళో చిన్నప్పుడు అగ్నిప్రమాదాలు జరిగేవి. ఏదో ఒక తాటాకు ఇంటికి నిప్పంటుకునేది. ఊళ్ళోవాళ్ళందరివీ తాటాకు ఇళ్ళే. అందుకని ఒకవైపు ఆ ఇంటిమంటలు ఆర్పటానికి పరుగెడుతూనే మరోవైపు తమ ఇళ్ళల్లో విలువైనవేవో బయటకి తెచ్చేసుకునేవారు. మా నాన్నగారు గ్రామరికార్డు బయటకి తెచ్చుకునేవారు. ‘తొమ్మిది ఊళ్ళకు చెందిన జీవితాలకు సంబంధించిన రికార్డు. దాన్ని కాపాడుకోవడం అన్నిటికన్నా ముఖ్యం’ అని చెప్పేవారు. ఆ చీకట్లో,ఆ అగ్నిప్రమాదపు వెలుగులో ఆ దస్త్రాలు ఆయన బయటకి తెచ్చుకుంటున్నప్పుడు తన ప్రాణాల్నే మూటగట్టుకుని బయటకి తెచ్చుకుంటున్నట్టు కనబడేది.

అటువంటిది ప్రభుత్వం ఆ వ్యవస్థ రద్దుచెయ్యగానే ఆయన చేసిన మొదటిపని ఆ రికార్డు స్వయంగా తీసుకువెళ్ళి తాశిల్దారుకి అప్పగించెయ్యడం.

అది నిజంగా ఆయన జీవితంలో పరీక్షాకాలం. కరణీకం పోయిన తర్వాత కూడా ఒక ఏడాది ఆయన మా ఊళ్ళో ఉన్నారు. అప్పటికి నక్సలైట్లు మా ప్రాంతంలో బలపడుతూ ఉన్నారు. రాత్రుళ్ళు వాళ్ళు ప్రజాకోర్టులు నడిపేవారు. గిరిజనుల భూమిని ఆక్రమించుకున్న గిరిజనేతరుల్ని ఆ కోర్టుకి పిలిచేవారు. విచారణ చేసేవారు. వాళ్ళకి ఏ శిక్ష విధించాలో చెప్పమని గిరిజనుల్ని అడిగేవారు. చాలాసార్లు ఆ నాన్‌ ట్రైబల్స్‌ ని చితకబాదేవారు. జరిమానాలు విధించేవారు. ఒకటి రెండు కేసుల్లో వాళ్ళకి కాలో చెయ్యో తీసేసారు కూడా. రాత్రుళ్ళు నడిచే ఆ కోర్టులకి మా నాన్నగారిని తీసుకుపోయేవారు. ఆయనకి అక్కడి భూమి చరిత్ర కంఠోపాఠమని వాళ్లకి తెలుసు. మేము ఎక్కడో దూరంగా మా మా ఉద్యోగాల్లో, మా మా జీవితాల్లో ఇరుక్కుపోయి ఉండేవాళ్ళం. తుపాకులు ధరించిన నక్సలైట్లు రాత్రి పూట మా ఇంటికి వచ్చి మా నాన్నగారిని తీసుకుపోతే ఆయన ఎంతకీ ఇంటికి రాకపోతే మా అమ్మ తానొక్కర్తీ హరికెన్‌ లాంతరు పట్టుకుని ఆ అడవిలో ఆ చీకట్లో ఆ ప్రజాకోర్టు ఎక్కడ జరిగితే అక్కడికి వెతుక్కుంటూ పోయేది. ‘సిస్టర్‌, అన్నని పంపించేస్తాం, కంగారు పడొద్దు’ అనేవాళ్ళు అన్నలు. కాని అసలైన కంగారు ఆ పొద్దుణ్ణుంచీ మొదలయ్యేది. పోలీసులు వచ్చేవారు, ‘కరణంగారూ, రాత్రికి ఎక్కడికెళ్లారం’టూ.

అదొక నరకంలా నడిచింది మా అమ్మకీ, నాన్నగారికీ. అది భరించలేక, ఆ ఊరు, మేము పుట్టిపెరిగిన ఆ ఇల్లు వదిలిపెట్టి రాజవొమ్మంగి వచ్చేసారు.

1985 లో.

అందుకనే 2005 లో ఆయన మళ్ళా రాజవొమ్మంగి వెళ్లిపోతామంటే మేము అంత ఆందోళన పడ్డది. వాళ్ళిద్దరూ ఆ వృద్ధాప్యంలో నాదగ్గరో, మా అన్నయ్యదగ్గరో, మా అక్క దగ్గరో ఇంత ప్రశాంతంగా ఉంటే అదే చాలనుకున్నాం.

కాని ఆయన వెళ్ళిపోయారు మా అమ్మని తీసుకుని, ఎనభై ఏళ్ల వయసులో. కాకినాడ నుంచి రాజవొమ్మంగికి. మా అక్క ఏర్పాటు చేసిన డి సి ఎంలో లగేజి ఎక్కించి ఊరుకోకుండా తాను కూడా అందులోనే కూచున్నారట. ‘చిన్నపిల్లాడిలాగా ఉన్నాడు ఆ లగేజి పట్టుకుని రాజవొమ్మంగి వచ్చేసినప్పుడు’ అంది మా అత్తయ్య ఆ క్షణాల్ని గుర్తు చేసుకుంటూ.

బుధవారం పొద్దున్నకి నేను రాజవొమ్మంగి చేరాను. ఆ ముందురోజంతా ఆయనకి అస్సలు బావులేదనీ, ఏమైపోతారో అని కంగారుపడ్డామనీ చెప్పింది మా అమ్మ.

కాకినాడ నుంచి రాజవొమ్మంగి రాగానే ఆయన చేసిన మొదటిపని ఆ ఊరంతా ఒకసారి తిరిగెయ్యడం. అందరినీ పలకరించి, ఇక తాము అక్కడే ఉండిపోతామనీ, వాళ్ల పిల్లలు అక్కడే ఇల్లు కట్టిస్తున్నారనీ అందరికీ చెప్పడం. ‘అంత హుషారు ఆయనలో ఈ మధ్యకాలంలో చూడలేదు’ అన్నాడు మా చిన్నాన్న.

వాళ్లు అప్పటిదాకా రాజవొమ్మగిలో ఉంటూ వచ్చిన ఇల్లు, ఆ మధ్యకాలంలో వాళ్ళు లేకపోడంతో పాడుపడిరది. నేను మేస్త్రీని తీసుకొచ్చి ఆ ఇంటికి కొలతలు తీయించాను. ఇల్లుకట్టడానికి ప్లాను తయారు చేసుకున్నాం.

కాని ఆ సాయంకాలం ఆయన నన్ను దగ్గరికి పిలిచారు. ‘నేను ఇంక ఉంటానని నమ్మకం లేదు. మీ అమ్మని హైదరాబాదు తీసుకువెళ్ళిపో’ అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఆయనలో ఆ రోజు చూసిన ఉత్సాహానికీ, ఆ మాటలకీ లంకె కుదరలేదు. ఆ పక్కన మంచం మీద అప్పుడే ఉతికి ఇస్త్రీ చేసిన ఆయన గుడ్డలున్నాయి. తెల్లని పంచెలు, చొక్కాలు. జీవితమంతా ఆయన పాటించిన నిష్ఠల్లో ఆదొకటి. తెల్లవారుజామునే లేవడం, స్నానం చెయ్యడం. తెల్లని పంచె, చొక్కా, తువ్వాలు. ఒక్క మరకకూడా లేని దుస్తులు, జీవితం.

పొద్దున్నే నా మంచం దగ్గర నిలబడి మా అమ్మ నన్ను లేపుతోంది. ‘ఏమమ్మా’ అన్నాను. ఆమె మొహంలో ఏదో చెప్పలేని భావన. ఆమెకి ఏదో తెలుస్తున్నట్టూ, కాని దాన్ని ఆమె నమ్మడానికి ఇష్టపడనట్టూ ఉంది.

‘మీ నాన్నగారికి రాత్రంతా బావులేదు. ఇబ్బంది పడుతున్నారు చూడు’ అంది.

ఆయన మంచం మీద పడుకుని ఉన్నారు. ‘కడుపు ఉబ్బరంగా ఉంది’ అన్నారు. డాక్టరు దగ్గరకు పరుగెత్తాను.

డాక్టరు వచ్చాడు. ఆయన్ని చూసాడు. ఏదో వైద్యం చేసాడు. అతను గవర్నమెంటు మెడికల్‌ ఆఫీసరు. పి హెచ్‌ సికి వెళ్ళి ఇప్పుడే మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.

కొంతసేపు గడిచింది. మా నాన్నగారు అచేతనంగా పడుకుని ఉన్నారు. మా అమ్మ ‘నాకేదో కంగారుగా ఉంది రా’ అంది.

మళ్ళీ డాక్టరుదగ్గరికి బయల్దేరాను. దారిలో మా అత్తయ్య కొడుకు దత్తు ఎదురయ్యాడు. ‘మామయ్య పోయాడని డాక్టరు ఇప్పుడే చెప్పాడు’ అన్నాడు.

నాకు మాటరాలేదు.

‘పద డాక్టరు దగ్గరకు వెళ్దాం అన్నాను’ ఎలాగో గొంతుపెగుల్చుకుని.

‘ఎక్కడ డాక్టరు? ఇప్పుడే ఏలేశ్వరం బస్సెక్కేసాడు. అక్కడే బస్‌ స్టాండు దగ్గరే చెప్పాడు నీకు చెప్పమని’ అన్నాడు దత్తు.

తిరిగి ఇంటికి వచ్చాం.

మంచం మీద మా నాన్నగారు. ఎదురుగా కుర్చీలో కూచుని ఒక్కత్తీ మా అమ్మ. ఆమె చూపుల్లో నేనెన్నడూ చూసి ఉండని శూన్యం.

మళ్ళా ఊళ్ళోకి వెళ్ళాను. పబ్లిక్‌ టెలిఫోన్‌ బూత్‌ నుంచి అందరికీ వార్త చెప్పాను. మా అన్నయ్యకి చెప్పాను. ఎలాగేనా సాయంకాలంలోపు వచ్చెయ్యమని.

పక్కన నిండుగా పూసిన మామిడిచెట్టు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల బాలికలు బడికి వెళ్తున్నారు. చదువుకున్న ఆడపిల్లలంటే మా నాన్నగారు ఎంత మురిసిపోయేవారు! తాళ్ళపాలెంలోనూ, బోయపాడులోనూ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు తెరిచినప్పుడు ఆయన చేసిన హడావిడీ అంతా ఇంతా కాదు. చాలాకాలం పాటు మా ఇంటికి ఏ అతిథులొచ్చినా, ఏ అధికారులొచ్చినా ఆయన వాళ్ళని ఆ ఆశ్రమపాఠశాలలకి తీసుకుపొయ్యేవారు.

తెలుసునా ఆ పిల్లలకి? జీవితమంతా తమకోసం, తమ హక్కులకోసం పోరాడిన ఒక మానవుడు, తమ ఆత్మబంధువు అక్కడే, అప్పుడే ఈ లోకాన్ని విడిచిపెట్టాడని?

సాయంకాలానికి మా అన్నయ్య, అక్క, నా భార్యాపిల్లలూ అందరూ చేరుకున్నారు. రాజవొమ్మంగి పొలిమేరల్లో, ఒకప్పుడు మా బామ్మగారికి ఎక్కడ వీడ్కోలు పలికారో, ఆ చోటు వెతికి చూపించాడు మా చిన్నాన్న. అక్కడే మా అన్నయ్య పెద్దకొడుకుగా మా నాన్నగారి అంత్యేష్టి నిర్వహించాడు. సరిగ్గా అప్పుడే శరభవరం నుంచి మా పొరుగింటి అవధాన్లుగారూ, ఒక రాజుగారూ మోటారు సైకిలు మీద రాజవొమ్మంగి వెళ్తున్నారు. వాళ్ళు మమ్మల్ని చూసి అక్కడ ఆగారు. మూడు దశాబ్దాలపైన తనకి మా నాన్నగారు చేసిన సేవకి మా ఊరు తన ఋణం అలా తీర్చుకుంది. ఆ అంతిమసంస్కారవేళ తన ప్రతినిధుల్ని అక్కడికి పంపించింది.

ఆ మర్నాడు ఆ ఇంట్లో బీరువాలో ఆయన డబ్బులు దాచుకునే చిన్న బాక్సులో ఊళ్ళో తీర్చవలసిన నెలవారీ బాకీల లిస్టు కనబడింది. మూడువేల చిల్లర. దాంతోపాటే ఆ నెల మేం పంపిన మనియార్డరు కూడా. అదీ మూడువేల చిల్లరనే.

అన్ని బాకీలూ తీర్చేసాం. ఈ లోకం నుంచి వెళ్లిపోయినప్పుడు ఆయనకి ఇల్లులేదు, ఒక సెంటుపొలం లేదు. బీరువాలో తులం కూడా బంగారం లేదు. చేతికి వాచీ లేదు. కనీసం వేలికి ఉంగరం కూడా లేదు. గాంధీగారికి మల్లే మా నాన్నగారు కూడా ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళినవి కళ్ళజోడు, రాసుకునే కలం, ఒక జత చెప్పులు, ఆ ముందురోజే ఉతికి, ఇస్త్రీ చేసి తెచ్చిన నాలుగు జతల దుస్తులూనూ.

నేనెందరో వీరుల కథలు చదివాను. యోగుల కథలు, త్యాగుల కథలు చదివాను. కాని ఆ రోజు నేను మొదటిసారిగా ఒక వీరుణ్ణి, ఒక త్యాగిని, ఒక యోగిని చూసానని తెలుసుకున్నాను. అటువంటి మనిషిని నా జీవితంలో మరొకరెవరినీ ఇప్పటిదాకా చూడలేదని కూడా నాకు నేను చెప్పుకుంటున్నాను.

3

మీరు కమ్యూనిస్టునా అనడిగారు ఒక చలనచిత్రదర్శకుణ్ణి. ఆయన జీవితమంతా శ్రామికులపక్షాన నిలబడ్డవాడు. సమష్టి జీవితం గురించి మాట్లాడినవాడు. మనం నిజంగా ఒకరిని కమ్యూనిస్టు అని పిలవదలచుకుంటే అతణ్ణిమించినవారు మరొకరు కనబడరు.

కాని ఆ దర్శకుడు తాను కమ్యూనిస్టుని కాదని చెప్పాడు. అంతేకాదు, ఎవరేనాగాని కమ్యునిస్టు కాగలగడం, అలా బతక్కగలగడం దాదాపు అసాధ్యం అని చెప్పాడు.

సొంత ఆస్తి పరిత్యజించగలిగిన నా తండ్రి నాకు తెలిసిన యథార్థమైన కమ్యూనిస్టు అని నేను చెప్పవచ్చు. కాని అలా చెప్పాలనుకోవడం లేదు. తరతరాలుగా పీడనకి లోనవుతూ వస్తున్న గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకోసం నిలబడ్డ ఒక పోరాటకారుడిగా కూడా ఆయన గురించి చెప్పుకోవచ్చు, రాయవచ్చు. కాని నాకు దాని మీద కూడా ఆసక్తి లేదు.

తన తండ్రి లాగా ఆయన ఈ ప్రపంచంలో ఉంటూనే ఈ ప్రపంచానికి అంటిపెట్టుకోకుండా ఉండిపోయిన మనిషి అని ఎలానూ చెప్పలేను. ఆయనకి ఈ ప్రపంచమంటే ఎంతో ఇష్ఠం. మనుషులంటే పిచ్చి. నలుగురితో కలిసి మెలిసి బతికే ఏ చిన్న అవకాశాన్నీ ఆయన ఎప్పుడూ వదులుకోలేదు. ఇంటికి ఎవరేనా అతిథి వస్తే, ఆయన చూపించే ఆదరణ దానికదే ఒక రిచ్యువల్‌ లాగా ఉండేది. ఆ అతిథికి ముందు నమస్కారం పెట్టాలి. తాగడానికి చెంబుతో మంచినీళ్ళివ్వాలి. ముందు ఆ చెంబు కడగాలి, నీ చేతులు కడుక్కోవాలి. నీ వేళ్ళు ఆ నీళ్ళకి తగలకూడదు. ఆ అతిథి భోజనానికి కూర్చోబోయేటప్పుడు బకెట్లో నీళ్ళు తోడి చెంబు చేతికి అందించాలి. ఆయన కాళ్ళూ చేతులూ కడుక్కున్నంతసేపూ పక్కనే ఒక తువ్వాలు పట్టుకు నిల్చోవాలి.

ఉహూఁ, ఆయన్ని ఒక విరాగి అని ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పలేను.

మరి ఎవరు? ఆయన్ని తలుచుకుంటే నీకేమిటి స్ఫురిస్తున్నది?

మా అన్నయ్య ఒకసారి నాకో సంగతి చెప్పాడు. అతను మా బంధువుల్లో ఒకర్ని చూడటానికి వాళ్ళింటికి వెళ్ళాడట. ఆ బంధువు బాగా చదువుకున్నవాడు. ఆరోజుల్లోనే యూనివెర్సిటీలో ఎమ్మే చేసినవాడు. తలచుకుంటే ఆ రోజుల్లో అతనికి చాలా పెద్ద ఉద్యోగం వచ్చి ఉండేది. కాని బయటికి వెళ్ళకుండా ఆ ఊళ్ళోనే చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండిపోయేడట. ఎందుకని అడిగేడట మా అన్నయ్య. అప్పుడు ఆ బంధువు మా అన్నయ్యను తన ఇంటిపెరట్లోకి తీసుకువెళ్ళాడట. అక్కడ ఒకాయన మా బంధువు ఈడువాడే ఉన్నాడట. అతణ్ణి ఒక స్తంభానికి గొలుసుతో కట్టేసి ఉన్నారట. అతణ్ణి చూపించి ఆ బంధువు చెప్పాడట.

‘ఇతను మా తమ్ముడు. మతిస్తిమితం లేనివాడు. బయట వదిపెట్టలేం. ఇలా కట్టి ఉంచక తప్పదు. అహర్నిశలు కనిపెట్టుకుని ఉండకతప్పదు. ఇతనికోసమే నేనిక్కడ ఉండిపోయాను’ అని చెప్పాడట.

అన్ని బంధాల్నీ తెంచుకుని వెళ్ళిపోగల వాళ్ళు అదృష్టవంతులు. జీవించినంతకాలం ఏ బంధమూ అంటకుండా జీవించినవాళ్ళు కూడా ధన్యులు. కానీ ఏదో ఒక్క బంధానికో, అనుబంధానికో తన జీవితాన్ని అర్పించగలిగినవాళ్ళు, వాళ్ళే ఈ ప్రపంచాన్ని కోరుకోదగ్గదిగా మారుస్తున్నారు. మిథ్యాప్రాయం తప్ప మరేమీ కాదనుకునే ఈ జగత్తుకి ఒక అర్థం సమకూరుస్తున్నారు.

మరి నా తండ్రి ఏమి కోరుకున్నాడు?

ఆయన చివరి క్షణాల్లో మా అమ్మను నాకు అప్పగించేసాక, ఇక ఆయనకి మిగిలిన చివరి బాధ్యత ఏమిటి? తనది కాదనుకునే ఆ గిరిజన ప్రాంతానికి, అక్కడ ఉండటానికి తనకి రైట్‌ లేదనుకునే ఆ ఊరికే మళ్ళా ఎందుకంత యుద్ధం చేసి వెళ్ళిపోయారు?

చినవీరభద్రుడూ, ఇప్పటికన్నా అర్థమయిందా నీకు? ఆ పదిహేడు పద్ధెనిమిదేళ్ళ పిల్లవాడు, తన తండ్రి తనకు అప్పగించివెళ్ళిపోయిన ఆ తల్లి చెయ్యి వదల్లేకనే అక్కడికి వెళ్ళిపోయాడని!


ఫొటోలో మా అమ్మ, నాన్నగారితో పాటు మా అక్క కొడుకు రాజా, మా మూడవ చెల్లెలు రాధిక

2015-23

23 Replies to “మా నాన్నగారు”

  1. ఎంత గొప్ప నివాళి అందించారండీ… “చినవీరభద్రుడూ, ఇప్పటికన్నా అర్థమయిందా నీకు? ఆ పదిహేడు పద్ధెనిమిదేళ్ళ పిల్లవాడు, తన తండ్రి తనకు అప్పగించివెళ్ళిపోయిన ఆ తల్లి చెయ్యి వదల్లేకనే అక్కడికి వెళ్ళిపోయాడని!”.. మీ కథ లో ఈ ముగింపు వాక్యాలు చదవగానే నాకు నేను చదివిన మరొక గొప్ప తండ్రి స్మృతిలో మరొక గొప్ప కొడుకు రాసిన కథలో చివరి వాక్యాలు “ఒరేయ్ నాన్న! నేను పోయిన ఆ క్షణం దగ్గరే నీ జీవనం గమనం స్తంభిస్తే నేను పోయి నట్లే లెక్క. అలా కాక, నువ్వు తమ్ముళ్లూ, చెల్లెళ్లూ మీ మీ బ్రతుకుల్లో నడుస్తూ, మీ వెనకాల నా స్మృతిని నడిపించుకుంటూ, మీ జీవితాల్లోకి , నన్ను ఇముడ్చుకుంటూ వెళితే నేను బ్రతికి ఉన్నట్లే కదరా?!” గుర్తొచ్చాయి. అందుకే కేవలం మీ ఇద్దరి సాహిత్యానికే కాదు మీ ఇద్దరితో కూడా నాకు కొద్దిపాటి సాన్నిహిత్యం లభించినందుకు నేను ఎంతో అదృష్టవంతుడనని అనుకుంటూ ఉంటా

  2. ఇది కథ లాగా లేదు. ఒక గొప్ప మానవతావాది జీవిత చరిత్ర ను కళ్ళక్కట్టినట్టుంది.

    మీ నాన్నగారిలాగా జీవించడం బహుశా ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు..

    గొప్ప నివాళి….
    🙏🙏❤️🌹🌹🥰

  3. Sir!! At a loss for words after reading this…
    The true depth of a legacy is felt only after our elders are gone 🙏🏽 Thank you for sharing precious history and what a great tribute!! 🙏🏽

      1. నమస్కారం అండి,
        మా నాన్న గారు కూడా లామ్ గ్రామానికి కరణంగా చేసారు. మా – మీ నాన్న గార్ల మధ్య అనేక సామీప్యాలు ఉన్నాయి.
        మీరు వ్రాసినది అక్షర సత్యం.
        ధన్యవాదాలు అండి.

  4. మీరు స్వంత ఇల్లు సమకూర్చుకోకపోవటం తండ్రి గారి ప్రభావమా?
    వద్దనుకున్నారా?

  5. సర్ ముందుగా మీ నాన్నగారికి స్మృత్యంజలి. మీ తండ్రి గారి జీవితచిత్రాన్ని అక్షరాల్లో పటం కట్టారు. ఆయన జీవిత చరిత్రను కథాగుళిక గా మార్చటం మీకు మాత్రమే సాధ్యమయ్యే పని.
    ఏ జీవిత చరిత్ర చదివినా సారాంశమే గదా మనసు లో మిగిలేది. ఆ సారాంశం మ కథలో నూరుపా ళ్లు కనిపించింది. గత సంవత్సరమే మా బాపు శతజయంతి . మేమూ ఎనమం డుగురమే . పేదరికం అనుభవిస్తున్నా మన్న ఆలోచన అప్పట్లో రాలేదు .
    అప్పటి వాళ్ల చరిత్రలు చదువుతుంటే ఇమాన్స్ అన్ రిటెన్ రిజిస్ట్రీ పోయెం గుర్తుకు వస్తుంది. ఒక ఆదర్శవంతమైన తరం వంతెన చివర్లో మనం ఉన్నందుకు కొంత ఊరట. ముందు తరాలకు ఇదొక అరుదైన జ్ఞాపిక . అది ఆదర్శం అని తెలియకుండానే అలాంటి జీవితం ఆస్వాదించిన మీ నాన్నగారికి మరోసారి నీ హృదయపూర్వక జోహార్లు

  6. నిబద్ధత, నిజాయితీ, మానవత్వం కలగలసిన వ్యక్తిత్వం వారిదనిపిస్తుంది. అటువంటి వారు revenue department లో అరుదు ఈ కాలంలో. మీకు ఆ వారసత్వం వచ్చినట్లుంది. చివరి పేరాలు చదువుతుంటే నా కళ్ళు వర్శిస్తూనే ఉన్నాయి. నాలుగు సంవత్సరాల క్రితం ఇదే నెలలో పాత పెంకుటిల్లో మరణించిన తండ్రి గారు గుర్తుకొచ్చారు. నిన్ననే వారి జన్మదినం. నా కొకటి స్పూరిస్తుంది.. The dead are never dead to us, until we have forgotten them.

  7. “ఎంత అద్భుతంగా రాశారు! ప్రతి లైన్లో భావోద్వేగం ఉట్టిపడింది. నాన్నగారి పట్ల మీ ప్రేమ, గౌరవం ఎంత లోతుగా ఉందో అర్ధమవుతోంది. పాత ఇంటి జ్ఞాపకాలు, వంశచరిత్ర వెతికే ప్రయత్నం, దానిలో దొరికిన ఆశ్చర్యం – ఇవన్నీ చదివితే మనకూ ఒక అనుభూతి కలుగుతుంది. మన మూలాలను తెలుసుకోవడం ఎంత ముఖ్యమో మీరు ఈ కథ ద్వారా చెప్పారనిపిస్తోంది. ఆ 20 ఫోటోలు లభించడం అనేది నిజంగా అదృష్టం, ఒక ఆత్మసంతృప్తి. మీ అనుభవం అందరికీ ప్రేరణ కలిగించేలా ఉంది. ఇది కేవలం ఒక కథ కాదు, ఒక ఆత్మయానం.”

  8. మహాత్ముడి గురించి ఐన్ స్టీన్ చెప్పిన మాటే మీ నాన్నగారికి కూడా వర్తిస్తుంది సర్..
    “ఇలాంటి మనిషి రక్తమాంసాలతో ఈ నేల మీద నడయాడాడు అంటే..”

    🙏🙏🙏🙏🙏🙏🙏

  9. ఒక తండ్రి జీవిత గాధ! వివశుడై కన్నీటి పర్యంతం అవుతున్న తనయుడు వివరించిన తీరు, ఆద్యంతం నన్ను మరోలోకంలోకి తీసుకు పోయింది. కుటుంబ సంబంధాలలో మరో కోణాన్ని ఆవిష్కరించింది. త్రికరణశుధ్ధిగా తండ్రిని ప్రేమించి ఆరాధించడమంటే యేమిటో అర్థమైంది.

    పూర్తి పరిచయం వున్న గాధ యిది. మిత్రుడు “మల్లు” అనేక సందర్భాలలో నాతో పంచుకున్న సంగతులు యివి. కానీ, ఆవేదనభరితమైన జీవిత వ్యధని, ఆదర్శప్రాయమైన జీవిత విధానాన్ని పూసగుచ్చినట్లు వివరించడం అనితరసాధ్యం!

    చినవీరభద్రుడు ధన్యుడు!
    వారి తండ్రి గారు కూడా

  10. Bava, I couldn’t read the article in one stretch, for tears kept clouding my vision. Yet, you held me gently and walked me through the corridors of your memory. What shone bright was Pedda Mavayya’s indomitable persona and your tender, rain-soaked heart. Every moment I spent with your words felt like a treasure. You will always remain as vast and high as the sky.
    With love and lots admiration
    Giri

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading