
నలభయ్యేళ్ళ కింద చదివినవి తెలుగులోవీ, అనువాదాల్లోవీ కూడా నన్నింతకాలంగానూ వెన్నాడుతున్నవి, నేను మరవలేనివి, కొన్ని కథలున్నాయి. అలాంటి కొన్ని కథలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
నేషనలు బుక్ ట్రస్టు వారు ప్రచురించిన ‘కథాభారతి: హిందీ కథలు’ నా చేతుల్లోకి మొదటిసారి వచ్చింది, 1979 లో. అందులో ఫణీశ్వర నాథ్ వర్మ ‘రేణు’ ‘మూడో ఒట్టు’ కథ నన్నెట్లా వెన్నాడిందీ, ఇంతకు ముందు మీతో పంచుకున్నాను. నేను ‘ఆ వెన్నెల రాత్రులు’ నవల రాయాలనుకోవడం వెనక ఆ కథ కూడా ఒక స్ఫూర్తి.
ఆ కథాసంకలనంలోనే ‘వేసవి కాలం’ అనే కథ కూడా ఈ నాలుగు దశాబ్దాలుగానూ నన్ను వదిలిపెట్టకుండానే ఉంది. ఆ కథకుడు ఎవ్వరో అప్పుడు నాకు తెలీదు. కథతో పాటే ఆ కథకుడి పేరు కూడా పుస్తకంలో చదివి ఉంటానుగాని, కథకుల పేర్లమీదకి దృష్టి పోయే వయసు కాదది. నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు, కథలు రాయడం మొదలుపెట్టాక, ఈ కథలో ‘వేసవి కాలం’ గురించి రాసినట్టు వర్షాకాలం నుంచి రాయాలనే ఒక కోరిక చాలా బలంగా ఉండేది. రాజమండ్రి వదిలిపెట్టినా కూడా ఆ కోరిక నన్ను వదిలిపెట్టలేదు. చివరికి రెండేళ్ళ కిందట, ‘రెండు ప్రపంచాలు’ అనే కథ రాసినదాకా, ఆ బరువు నన్ను పీడిస్తూనే ఉంది. ఇప్పుడు మీరు ఈ కథ చదివి, ‘రెండు ప్రపంచాలు’ కథ చదివితే, మీకెలాంటి పోలికా కనిపించదు. ఆశ్చర్యం లేదు, ఎందుకంటే, ఆ కథ నాకు స్ఫూర్తితప్ప, ఆ కథని అనుకరించలేదు కాబట్టి.
ఈ కథా రచయిత కమలేశ్వర్ (1932-2007) ఇరవయ్యవ శతాబ్దపు హిందీ రచయితల్లో అగ్రశ్రేణి రచయిత. ఉత్తరప్రదేశ్ లో మైనీపూరులో పుట్టిన కమలేశ్ నవయవ్వనపు రోజుల్లో రివల్యూషనరీ సోషలిస్టు పార్టీలో చేరాడు. మార్క్సిస్టుగా జీవితం మొదలుపెట్టాడు. విప్లవకార్యకలాపాల్లో వార్తాహరుడిగా పనిచేసాడు. ఆ తర్వాత ఢిల్లీలో, ముంబైలో చాలా పత్రికల్లో పనిచేసాడు. హిందీ సాహిత్యంలో 50 ల్లో తలెత్తిన ‘నయీ కహానీ’ ప్రభంజనంలో మోహన్ రాకేశ్, నిర్మల వర్మలతో పాటు కమలేశ్వర్ కూడా ప్రధాన పాత్ర వహించాడు. నెమ్మదిగా హిందీ ఫిల్ము రంగం ఆయన్ని అక్కున చేర్చుకుంది. ‘ఆంధీ’, ‘మౌసమ్’ లాంటి సినిమాలకి కథకుడు, ‘సారా ఆకాశ్’, ‘ఛోటీ సీ బాత్’, ‘బర్నింగ్ ట్రెయిన్’ లాంటి సినిమాలకు సంభాషణలు రాసాడు. దేశ విభజన నేపథ్యంగా రాసిన ‘కిత్నే పాకిస్తాన్’ నవల ఇంగ్లిషులోకి కూడా అనువాదమయ్యింది. రెండేళ్ళ పాటు దూరదర్శనుకు అడిషనలు డైరక్టరు జనరలుగా పనిచేసాడు. ఆ కాలంలోనే దూరదర్శన్ నెట్ వర్కు దేశమంతా విస్తరించింది. భారత ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్ గౌరవంతో సత్కరించింది.
కమలేశ్వర్ రాసిన ‘గర్మియోం కే దిన్’ కథని జె.భాగ్యలక్ష్మిగారు ‘వేసవికాలం’ అని చేసారు. దాన్ని ఇంగ్లిషులోకి అనువదించిన సతీష్ వర్మ, కుష్వంత్ సింగులు Summer Days అని చేసారు. కాని నేనైతే ‘ఉక్కపోస్తున్న దినాలు’ అని పేరుపెట్టి ఉండేవాణ్ణి.
‘గర్మియోం కే దిన్’ కమలేశ్వర్ తొలిదశలో, అంటే 1952-59 మధ్యకాలంలో, రాసిన కథ. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలిదశాబ్దపు రోజులనాటి కథ. ఆ రోజుల్లో తననీ, తన కథల్నీ, తన కథల్లోనీ పాత్రల్నీ నడిపించింది జీవితం పట్ల disagreement ( అసహమతి) అని చెప్పుకున్నాడాయన. ‘మేరీప్రియ కహానియాఁ ‘ (1976) సంపుటానికి రాసుకున్న ముందుమాటలో Stories are basically a medium of disagreement for me అని చెప్పుకున్నాడు. అంతేకాదు, తాను రాసిన కథలు తాను ఎప్పటికప్పుడు తీసుకుంటూ వస్తున్న నిర్ణయాలకు సంబంధించిన కథలని కూడా చెప్పుకున్నాడు. కథని ‘సౌందర్యాత్మక’, ‘సాహిత్య శాస్త్ర’ దృక్పథంతో చూడటం తనకిష్టం లేదనీ, తాను రాసిన కథలు తానెలా రాసాడో తనకు తెలియదనీ చెప్తూ, ప్రతి ఒక్క కథా ఒక ‘నిర్ణయకేంద్రిత ప్రక్రియ’ అనీ, అది ఎప్పటికప్పుడు మారిపోతూ వస్తున్నదని కూడా చెప్పుకున్నాడు. కాబట్టి సాధారణమానవుడి జీవితప్రయాణంలో అతడికి తోటియాత్రీకుడుగా నడవడమొక్కటే నేటికాలపు కథకుడు చెయ్యవలసింది అని కూడా అన్నాడు.
ఆ ముందుమాటలో చివర ఈ వాక్యం రాసుకున్నాడు: ‘నాకు పాత్రలెప్పుడూ కథలనివ్వలేదు. అవి ఏ స్థితిలో ఉన్నాయో ఆ స్థితులే నాకు కథల్ని ప్రసాదించాయి’ అని.
వేసవికాలం అటువంటి ‘స్థితి’ గురించిన కథ. అందులో వైద్యజీ, అతడికి సైన్ బోర్డు రాసిపెట్టిన చందర్, ఆ దుకాణానికి మెడికల్ సర్టిఫికెటు కోసం వచ్చిన కోసన్ స్టేషన్ కూలీ, అతణ్ణి పంపిన సో బరన్ సింగ్, తాయెత్తు కట్టించుకోడానికి వచ్చిన పాండురోగి, బచ్చన్ లాల్ లాంటి పక్క దుకాణదారులూ, కొంతసేపు ఆ దుకాణంలో పెట్టమని ఒక పెద్ద డబ్బా పంపిన ఠాకూరు సాబ్, ఆ ముందురోజే గుర్రబ్బండి కొన్న సుఖదేవ్ బాబు- అసలు ఉత్తరప్రదేశ్ లో అప్పుడప్పుడే పట్టణంగా మారుతున్న ఆ బస్తీ మొత్తం ఆ వేసవికాలం మధ్యాహ్నం ఒక పరిస్థితిలో ఉంది. ఆ పరిస్థితి ఒకరకంగా స్వతంత్రభారతదేశపు పరిస్థితి కూడా. సరుకులో నాణ్యత కాదు, సైన్ బోర్డు ముఖ్యమని భావించే కొత్త జాగృతి ఒకటి ఆవరిస్తూ ఉన్న కాలం.
ఆ కథలో ఒక ‘స్థితి’ని చిత్రిస్తున్నట్టు ఉన్నప్పటికీ, అందులో చాలా చలనం ఉంది. చాపకింద నీరులాగా కాలం గతిశీలకంగా ప్రవహిస్తూ ఉంది. ప్రతి ఒక్క పాత్రా ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితిలో మనకి కనబడుతుంది. అయిదు రూపాయలు ఖర్చుపెట్టి సయ్యద్ ఆలీతో బోర్డు రాయించుకోలేక, అణా అణా ఆదా చేసి బోర్డు రాయించుకున్న వైద్యజీకి, నాలుగు రూపాయల ఆదాయాన్నివ్వగల మెడికల్ సర్టిఫికెటు క్లయింటు చేతుల్లోంచి జారిపోడం కథలో ముఖ్య సంఘటన. ఆ కూలీ మళ్ళా వస్తాడనే నమ్మకంతో, ఆ ఎండవేళ, ఇంటికి భోజనానికి కూడా పోకుండా, ఆ ఉక్కలోనే, ఆ వేడిలోనే వైద్యజీ ఎదురుచూస్తుండటంతో కథ ముగుస్తుంది.
నేను మొదటిసారి చదివినప్పుడు, ఈ కథ నన్ను ఆకట్టుకున్నప్పుడు, ఈ కథలో ఇంత లోతు ఉందని నాకు తెలీదు. ఈ కథ రాసిందొక చేయి తిరిగిన కథకుడని కూడా తెలీదు. అయినా కూడా ఈ కథ నన్ను పట్టుకుంది. గొప్పకథలకుండే ప్రాథమిక లక్షణం అదేననుకుంటాను.
వేసవి కాలం
హిందీమూలం: కమలేశ్వర్
తెలుగు అనువాదం: జె.భాగ్యలక్ష్మి
టాక్సు ఆఫీసు హడావిడిగా ఉంది. దాని గుమ్మం వద్ద ఇంద్ర ధనుస్సురంగులలో బోర్డులున్నాయి. సయ్యద్ అలీ ఈ బోర్డులను చాల శ్రమపడిచక్కగా పెయింటు చేశాడు. ఆ ఊర్లో చూస్తూ ఉండగానే దుకాణాలుపెరిగిపోయాయి. అన్నిటికీ సైన్ బోర్డులు వ్రేలాడుతున్నాయి. సైన్ బోర్డుతగిలిస్తే షాపుకు గొప్పతనం వస్తుంది. చాలా రోజుల క్రితం దీనానాథ్ తన హల్వా దుకాణానికి సైన్ బోర్డు పెట్టించగానే అక్కడ పాలు త్రాగేవాళ్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. బోర్డుల వెల్లువ ప్రారంభమయింది. “ఓం-జైహింద్” బోర్డులతో ప్రారంభించి “ఒకసారి తప్పకుండా పరీక్షించండి” “కల్తీ ఉందని ఋజువు చేస్తే వంద రూపాయలబహుమానం” అనే బోర్డుల వరకూ వచ్చింది.
టాక్సు ఆఫీసు పేరు మూడు భాషలలో వ్రాశారు. చేర్మెన్ చాలాతెలివైనవాడు. అతని తెలివితేటలను అందరూ పొగుడుతుంటారు. అందుకే సైన్బోర్డులు హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో వ్రాయించారు. దూరదూరంనుండి నాయకులు ఉపన్యాసాలివ్వటానికి వస్తుంటారు. దేశవిదేశాలనుండి ఎంతోమంది ఆగ్రాలోని తాజమహల్ చూసి తూర్పుదేశానికి ప్రయాణిస్తూ ఈ దారినే వెళ్తారు. వాళ్ళపై ఈ సైన్ బోర్డుల ప్రభావం ఉంటుంది. ఇక సైన్ బోర్డులపై ఋతువుల ప్రభావం, సంతలు, తిరునాళ్ళు జరిగే రోజుల్లో మిఠాయి అంగళ్ళ వారు, జూలై, ఆగష్టు నెలలోపుస్తకాలు, కాగితాలు అమ్మేవారు, పండుగ పబ్బాలకు బట్టల దుకాణాలవారు, వర్షాకాలంలో వైద్యులూ, హకీంలు వారి వారి సైన్ బోర్డులకు క్రొత్త రంగులు పూస్తుంటారు. మంచి నెయ్యి అమ్మేవాళ్ళు, వాళ్ళ గుడిసెలగోడలపైనే ఇటుకలతోనో ఇంకేదైనా రంగుతోనో వ్రాసుకొని పని గడుపుకొంటారు. ఇది లేకుండా పని జరుగదు. అన్నీ తెలిసినవాడిలా వైద్యమహాశయుడన్నాడు. “పోస్టరు లేకుండా సినిమావారి పని కూడా జరుగదు. పెద్ద పెద్ద పట్టణాల్లో కిరసన్ అమ్ముకునే వాళ్ళు కూడా సైనుబోర్డులు పెట్టుకొంటారు. సైన్ బోర్డులు చాలా అవసరం. పిల్లా పాపలకుకూడా సైన్ బోర్డులున్నాయి. లేకపోతే పేరు పెట్టడం దేనికి ? సైన్ బోర్డు పెట్టుకునే సుఖదేవ్ బాబు కాంపౌండరునుండి, డాక్టరయి బ్యాగ్ పట్టుకుని తిరుగుతున్నాడు.”
దగ్గరే కూర్చున్న రామచరణ్ మరో విచిత్రకరమైన విషయం చెప్పాడు : “నిన్ననే సుఖదేవ్ బాబు బుధాయివాలా ఇక్కాను గుఱ్ఱంతోసహా కొన్నాడు.”
“దాన్ని తోలేదెవరు?” అని రేకు కుర్చీమీద ప్రాణాయామ ముద్రలో కూర్చున్న పండిత్ అడిగాడు.
“ఇదంతా జేబు కొట్టే వేషాలు” అని వైద్య మహాశయుడు అన్నాడు. ఆయన ధ్యాసంతా ఇక్కా బండిమీదే ఉంది. “రోగుల దగ్గర నుంచే కిరాయివసూలు చేస్తాడు. పెద్ద పెద్ద ఊళ్లల్లో డాక్టర్లు ఇప్పించినట్లు బండితోలేవానికి కూడా బక్షీష్ ఇప్పిస్తాడు. దీనివల్లే వైద్య వృత్తికి చెడ్డపేరొస్తుంది. రోగుల బాగోగులు చూడాలా లేక తన గొప్పదనం ప్రకటించాలా? ఇంగ్లీషు వైద్యమంటూ రోగి ప్రాణం సగం ముందే తీసేస్తాడు-ఆయుర్వేద వైద్యుడయితే నాడి చూడకుండానే మొహం చూసి రోగం కనుక్కుంటాడు. ఈ వృత్తిలో ఇక్కా బండితో ఒరిగేదేముంది? ఈలాగేచూస్తూ వుండు. కొన్నాళ్ళకు బండి తోలేవాడు కూడా కాంపౌండరుఅవుతాడు..” మాట మధ్యలోనే వైద్యజీ జీవంలేని నవ్వు నవ్వాడు.”ఎవరేమి చెప్పగలరు? డాక్టరీ తమాషా అయిపోయింది. వకీళ్ల, ముక్తార్ల కొడుకులందరు డాక్టర్లయి పోతున్నారు. అది అసలు వంశపారంపర్యంగారావాలి. వైద్యుని కొడుకు వైద్యుడవుతాడు. సగం విద్య చిన్నతనంలోనే మూలికలు, ఇతర సరంజామాలు నూరటంతోనే నేర్చుకుంటాడు. తులము, మాసము,రత్తి అన్ని కొలతలూ తూచకుండానే అందాజుగా తెలుసుకొంటాడు. ఔషధం అశుద్దమయ్యే మాటే లేదు. ఔషధం తయారుచేసేతీరులోనే దాని గొప్పదనం ఉంది… ధన్వంతరి…” ఎవరో దుకాణం.లోకి రావడం చూసి వైద్యజీ మాట ఆపేశాడు. అక్కడ కూర్చున్న వారితో తను బాతాఖానీ పెట్టుకున్నట్టుగాక వాళ్ళందరూ తన రోగులైనట్టు మొహం పెట్టాడు.
ఆ మనిషి దుకాణంలోకి రావటంతోనే, ఎందుకొచ్చాడో గ్రహించేశాడు వైద్యజి. చాలా నిర్లక్ష్యంగా చూచాడు. కాని ఈ లోకంలో పై పైమెరుగులకు ఎంతో విలువుంది. వీడే రేపు జబ్బు పడొచ్చు, లేకపోతేవీళ్ళింట్లో ఎవరైనా జబ్బు పడొచ్చు. అందుకే కొంచెం జాగ్రత్తగా హుందాగా వ్యవహరించాలి. తనని తాను సంబాళించుకుని “ఏమిటి, అంతా బాగున్నారా?” అని అడిగాడు. అతను సమాధానమిస్తూ తల పైనున్న ఒక పెద్ద డబ్బాను క్రిందకు దించి “ఠాకూరు సాబ్ ఇక్కడపెట్టమన్నారు. ఒంటిగంటా ఒంటిగంటన్నర ప్రాంతంలో మార్కెట్ నుండి తిరిగి వస్తూ దీనిని తీసుకుపోతారు.”
“అప్పటికి దుకాణం మూసేస్తాము.” కొంచెం చికాగ్గా అన్నాడు వైద్యజీ. “హకీమ్, వైద్యుల దుకాణాలు రోజంతా తెరిచి ఉండవు. మేమేమీవ్యాపారం చేసుకునే వాళ్ళం కాదు.” ఇంకెప్పుడైనా వీడి అవసరమొస్తుందేమోననే ఆశతో కొంచెం సర్దుకొని “సరే, ఆయనకేం ఇబ్బందికలుగదులే. మేము లేకపోతే మా ప్రక్క దుకాణంలో పెట్టిస్తానులే” అన్నాడు.
ఆ వ్యక్తి వెళ్ళగానే వైద్యజీ అన్నాడు: “మద్యనిషేధంతో ఒరిగేదేముంది? ఇది అమల్లోకి వచ్చినప్పటినుంచీ, ఇంటింటా బట్టీలు తయారయ్యాయి. సారాయి నెయ్యిలా అమ్ముడు పోతుంది. ఇక డాక్టర్ల సంగతిచెప్పాలా ? ..వారి దుకాణాలు సారా దుకాణాలయ్యాయి. మందులా వాడటానికి అనుమతి దొరుకుతుంది. కాని బాహాటంగా జింజరులా అమ్ముతున్నారు. ఏం లాభంలేదు. మాకు భంగు, నల్లమందు చిన్న పొట్లంకావలసి వచ్చినా ఎన్నో వివరాలు అడుగుతారు.”
“బాధ్యతగల విషయం మరి” అన్నాడు పండిత్.
“ఇప్పుడు బాధ్యతంతా వైద్యుడిదే అయినట్లుంది. అందరి రిజిష్టరీఅయిపోయింది. ఎవరు బడితే వాళ్ళు వైద్యం చేసే కాలం పోయింది. ఇప్పుడు రిజిష్టరయిన వాళ్ళే వైద్యం చెయ్యాలి. చూర్ణం అమ్ముకొనే వాళ్ళు కూడావైద్యులుగా చలామణి అయ్యేవారు. ఇప్పుడంతా సాగదు.. లక్నోలో సర్కారువాళ్ళు పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత అంతా చక్కబడింది.”
వైద్యజీ మాటలేమీ రుచించక పోవటంతో పండిత్ పైకి లేచాడు.వైద్యజీ లోపలికి అడుగేసి బోర్డు వ్రాస్తున్న చందర్ నుద్దేశించి, “దీనిలోతెల్ల రంగు చిక్కగా ఉంది. కొంచెం టర్పెంటయిన్ కలుపు” అంటూ ఒకసీసా తనే తెచ్చాడు. దాని మీద అశోకారిష్ట లేబిల్ ఉంది.
ఇదే విధంగా ఏయే మందుల శరీరాలలో (సీసా (సీసాలలో) ఏయే (పదార్థాల)ఆత్మలున్నాయో మరి, ఎదురుగా అలమార్లో పెద్ద పెద్ద సీసాలున్నాయి. వాటి మీద రకరకాల అరిష్టాల, ఆసవాల పేర్లు అంటించి ఉన్నాయి.మొదటి వరుసలో ఈ సీసాలున్నాయి. వాటి వెనుక అవసరమైన ఇతరసామగ్రి ఉంది. బల్ల మీద తెల్ల సీసాల వరుస ఉంది. వాటిల్లో ఏవో స్వాదిష్ట చూర్ణాలు.. భాస్కరలవణం ఇత్యాది వస్తువులున్నాయి. తక్కిన సీసాలలో ఏముందో కేవలం వైద్యునికే ఎరుక.
టర్పెంటయిన్ కలిపి చందర్ మరలా వ్రాస్తున్నాడు- “ప్రొఫెసర్ కవిరాజ్. నిత్యానంద్ తివారి.” పై పంక్తిలో “శ్రీ ధన్వంతరీ ఔషధాలయం.” అని వైద్యజీ స్వయంగా వ్రాశాడు. ఆ తెల్లటి అక్షరాలు దూదిపింజల్లా ఉన్నాయి. పైన ఖాళీ స్థలం చూసి వైద్యజీ అన్నాడు: “బాబూ, పైన జైహింద్ అని వ్రాయి.. ఇక్కడ మిగిలిన స్థలంలో ఒక ప్రక్క ద్రాక్షాసవం సీసా, ఇంకో వైపు పింగాణి కల్వం బొమ్మ వేయి.. అర్టు మాకు ఎనిమిదో తరగతి వరకే ఉండేది. కాకపోయినా ఇదంతా అభ్యాసంతో వచ్చేస్తుంది.”
చందరకు ఓపిక సన్నగిల్లుతోంది. అనవసరంగా ఇక్కడ చిక్కు కున్నాడు. తన చేతి వ్రాత బాగున్నందుకు తనకు పట్టిన గతి ఇది. “ఎవరైనా పెయింటరుకు యిస్తే బాగా వ్రాసేవాడు” చెమట తుడుచుకొంటూ కుంచె క్రింద పెట్టాడు చందర్.
“వాడికయితే అయిదు రూపాయలివ్వాలి నాయనా.. రెండు లైన్లు వ్రాసినందుకే. నేను శ్రమపడినందుకు పది పన్నెండు అణాలలోనే తయారయింది. ఈ రంగులు కూడా మా పేషెంటు ఒకడు ఇచ్చిపోయాడు. ఎలక్ట్రిక్ కంపెనీ పెయింటరుకు అజీర్ణ రోగం ఉండేది. రెండు డోసుల మందిచ్చేను. డబ్బులు తీసుకోలేదు. వాడు రెండు మూడు రంగులు, కొంచెం వార్నిష ఇచ్చిపోయాడు. రెండు పెట్టెల రంగుతో ఈ బోర్డు తయారయింది. ఒకటో, ఆరో కుర్చీకి కూడా రంగు సరిపోతుంది.. నీవు ఆ మాత్రం వ్రాయి చాలు. ఎర్రరంగు షేడ్ నేనిస్తాను.. బార్డరు మూడు రంగుల్లో ఉంటే బాగుంటుందా?” అని వైద్యజీ అడిగి తనకు తానే సమాధాన పడ్డాడు.
చందర్ కు చాలా ఉక్కగా ఉంది. మధ్యాహ్నం అయ్యే కొద్దీ, రోడ్డు పైన దుమ్మూ, వడగాలీ ఎక్కువవుతున్నాయి. మొహమాటం కొద్దీ చందర్ కాదనలేకపోయాడు. విసనకర్రతో తన వీపు గోక్కుంటూ, కరణాల రిజిష్టర్లు, పెద్ద పెద్దవి, తన ముందేసుకు కూర్చున్నాడు వైద్యజీ.
ఎండ వేడికి తాళలేక దుకాణం తలుపు రెక్క మూసి ఖాళీ రిజిస్టర్లలో కౌలుదార్ల పట్టా వివరాలు నకలు చేస్తూ కూర్చున్నాడు. చందర్ ‘ఇదంతా ఏమిటి వైద్యజీ’ అని అడిగాడు.
వైద్యజీ తలెత్తి చూశాడు. “ఊరికే కూర్చుంటే లాభమేముంది? ఏదైనా పని చూసుకుంటే మేలు. క్రొత్తగా వచ్చే ఈ గవర్నమెంటు గ్రామాధికార్లకు లెక్కా-పక్కా రాదు. ప్రతి రోజూ రెవెన్యూ ఇనస్పెక్టర్లూ, డిప్యూటీ తాసిల్దార్లు మందలిస్తూనే ఉంటారు. విధిలేక వాళ్ళందరూ ఎవరెవరికో డబ్బిచ్చి పని చేయించుకొంటున్నారు. మునుపటి కరణాలు ఇప్పుడెక్కడున్నారు ? గ్రామ వివరాలన్నీ వాళ్ళ నోట్లోనే ఆడుతుండేవి. పాపం వాళ్ళ నోటి దగ్గరి తిండి లాక్కున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా వాళ్ళే ఈ పనులన్నీ చేస్తున్నారు. క్రొత్త వాళ్ళ జీతం డబ్బులనీ ఈ పనులు చేయించుకున్నందుకే అర్పణమయిపోతున్నాయి. వాళ్ళకు కడుపు నిండాలి కదా.. రైతుల నుండి రెండు, మూడు రూపాయలు వసూలు చేస్తుంటారు. వసూలు చేయకపోతే ఏం తింటారు మరి? ఇద్దరు, ముగ్గురు గ్రామాధికార్లు నాకు తెలుసు. వాళ్ళ దగ్గర నకలు చేయటం రిజస్టర్లు నింపటం వంటి చిన్నా పెద్దా పనులు దొరుకుతుంటాయి.”
బయట జనం పలుచబడి పోతున్నారు. ఆఫీసుల్లో పని చేసేవాళ్ళు వెళ్ళిపోయారు. ఎదురుగా టాక్సు ఆఫీసు వద్ద వట్టి వేర్ల తడకలపై నీళ్ళు చల్లుతున్నారు. దూరంగా రావి చెట్టు ఆకుల గలగల వినిపిస్తుంది. అప్పుడే ఒక వ్యక్తి తలుపులో నుండి లోపలికి తొంగిచూశాడు. వైద్యజీ మాటలు ఆగిపోయాయి. అతని కళ్ళు ఆగంతకుని పరీక్షగా చూశాయి. మనిషి గంభీరంగా మారిపోయాడు. “ఒక బోర్డు ఆగ్రాలో తయారవుతోంది. అది వచ్చే వరకు దీనితో పనిసాగుతుంది. వీటన్నిటినీ పట్టించుకునేంత తీరుబడి ఎక్కడుంది?..” అంటూ ఒకేసారిగా వ్యవహారంలోకి దిగుతూ వచ్చిన వ్యక్తిని అడిగాడు: “ఏమిటయ్యా” “డాక్టరు సర్టిఫికెట్ కావాలి.. కోస్మా టేసన్లో పోర్టరుగా పని చేస్తున్నాను” రైల్వే పోర్టర్ల నీలం యూని ఫారంలో ఉన్న అతను అన్నాడు.
వైద్యజీ వాడి అవసరాన్ని పూర్తిగా అంచనా వేసుకుంటూ “ఏ తారీఖు నుండి ఏ తారీఖు వరకు కావాలి ?” అని అడిగాడు.
“పదిహేను రోజుల కోసం ముందే వచ్చాను. ఇంకా ఏడు రోజులకు”
ఏదో లెక్కలు గట్టి వైద్యజీ అన్నాడు: “నీకు మంచి సర్టిఫికెటు ఇస్తాను. సర్కారు వాళ్ళ రిజిస్టరు నంబరు కూడా ఇస్తాను. అంతటికీ నాలుగు రూపాయలు తీసుకొంటాను.” వాడు వెనక్కి తగ్గుతాడేమోననే భయంతో “వెనకటిది తీసుకోకపోతే, రెండు రూపాయల్లోనే పనయిపోతుంది” అన్నాడు.
పోర్టరు నిరాశ చెండాడు. వాడికంటె ఎక్కువ హతాశుడయ్యాడు వైద్యజీ. ఏమీ పట్టనట్లు పోర్టరు అన్నాడు: “సోబరన్ సింగ్ మీ దగ్గ రకు పంపాడు.” వీడు చెప్పే ధోరణి చూస్తే అదేదో సోబరన్ సింగ్ పనిలా అనిపించింది. వైద్యజీ అర్థం చేసుకున్నాడు. “ఇది నాకు ముందే తెలుసు. ముఖ పరిచయం లేకుండా మేము సర్టిఫికెట్టు ఇవ్వము. పరువుకు
సంబంధించింది కదా ! నువ్వెక్కడ ఉంటావో, ఏమి చేస్తుంటావో నాకేం తెలుసు? ఇదంతా ఆలోచించాలి .. విశ్వాసం మీద పని చెయ్యాల్సి ఉంటుంది. పదిహేను రోజుల క్రితం నుండి నీ పేరు రిజిష్టరులో ఎక్కించాలి. రోగమేమిటో వ్రాయాలి.. ప్రతిరోజు నీవు వస్తున్నట్లు నీ పేరు వ్రాయాలి. అప్పుడే పని అవుతుంది.. అంతా కట్టుదిట్టంగా చేయాలి..” చందర్ తనను సమర్థించాలన్నట్టు చూశాడు వైద్యజీ. చందర్ అందుకున్నాడు : “నీకు నిజంగా చేసిందో, ఇంకేదైనా దోపిడీలో ఉన్నావో వీరికేం తెలుసు..గవర్నమెంటుతో పని” అన్నాడు.
“ఐదు రూపాయలకు తక్కువయితే ఏ డాక్టరు సర్టిఫికెట్టు ఇవ్వడు..” ఈ విధంగా అంటూ వైద్యజీ కరణాల రిజిష్టరు ప్రక్కకు జరుపుతూ నొక్కి చెప్పాడు. “ఊపిరి పీల్చుకునే సమయం కూడా లేదు. చూడు.. కనిపిస్తూందా పేరు.. రోగులను వదిలేసి గవర్నమెంటు వాళ్ళకు చూపించ టానికి వివరాలతో ఈ రిజిష్టరు తయారు చెయ్యాలి. ప్రతి పేషంటు పేరూ, రోగము, ఆదాయమూ.. అన్నీ వ్రాయాలి. దీనిలోనే నీ పేరు వ్రాయాలి. నువ్వే చెప్పు రోగులకు మందులివ్వడం ముఖ్యమా లేక నీలాంటి వాళ్ళకు రెండు మూడు రూపాయలకు సర్టిఫికెట్లిచ్చి సర్కారు వాళ్ళ దగ్గర చిక్కుకోవడం మంచిదా?” తహసీల్ ఆఫీసు రిజిష్టరు ఠక్కున మూసేసి ఎదుటినుండి తినేశాడు. ఏదో ఉపకారం చేస్తున్నవాడిలా మొహం పెట్టి కలంతో చెవి కెలకసాగాడు.
రైల్వే పోర్టరు ఒక నిముషం ఆలోచిస్తూ నిలబడ్డాడు. వైద్యజీ తలవంచుకొని ఏదో పని చేసుకోవటం చూసి, దుకాణంనుండి వెళ్ళిపోయాడు. వైద్యజీ ఒక్కసారిగా తన తప్పు తెలుసుకున్నాడు. విషయాన్ని తెగేవరకూ లాగాడు. అది తెగి ఊరుకుంది. ఏం చెయ్యాలో తోచలేదు. వెంటనే పోర్టర్ని కేకేశాడు. “ఇదిగో ఇలారా.. ఠాకూర్ సోబరన్ సింగ్ కు– నా నమస్కారాలు చెప్పు. ఆయన పిల్లా పాపా అంతా క్షేమమేనా ?”
పోర్టరు ఆగి “ఆ – అంతా బాగున్నారు” అన్నాడు.
వాడు వినేటట్టు చందర్ వైద్యజీ అన్నాడు. “పది గ్రామాలూ, పట్టణాలు వదిలి ఠాకూర్ సోబరన్ సింగ్ నా దగ్గరికే వైద్యానికి వస్తాడు. నేను కూడా ఆయన పని చేయడానికి సిద్ధంగానే ఉంటాను.. చందర్ బోర్డుమీద ఆఖరి అక్షరం వ్రాస్తూ “వెళ్లిపోయాడా ?” అని అడిగాడు.
“తిరిగి తిరిగి వాడే” వస్తాడు.. తనకు తాను చెప్పుకొంటున్నట్లుగా-వైద్యజీ అన్నాడు : వాడు రావటం తప్పనిసరి అయినట్లు భావిస్తూ”పల్లెటూర్ల వైద్యులూ, వకీళ్ళూ, ఒకేలాగే ఉంటారు. సోబరన్ సింగ్ నా పేరు చెప్పి ఉంటే వాడు తప్పక తిరిగి వస్తాడు. పల్లెటూరి వాళ్ళ బుర్ర కొంచెం మందంగా పని చేస్తుంది. ఎక్కడో కూర్చుని ఆలోచించి వాడే వస్తాడు.”
“ఇంకెవరి దగ్గరనుండయినా వాడు తీసుకుంటే..” అని చందర్ అనబోతుంటే వైద్యజీ మధ్యలోనే కలుగజేసుకొన్నాడు. “ఉహు – అలా ఎన్నటికీ కాదు..” అంటూ బోర్డువైపు చూసి ప్రశంసాత్మకంగా “వహ్వా .. చందర్ బాబూ ! సైన్ బోర్డు బలేగా కుదిరింది.. పని జరుగుతుంది. ఈ అయిదు రూపాయలూ పెయింటరుకు ఇచ్చి, రోగుల నుంచి వసూలు చేయవలసి వచ్చేది. దీనికితోడు ఇక్కా బండి ఖర్చు కూడా పెట్టుకోవలసి వచ్చేది. ముక్కును ముందు నుంచి పట్టుకున్నా, వెనుక నుండి పట్టుకున్నా దానిలో తేడా ఏముంది? సయ్యద్ ఆలీ వ్రాసిన బోర్డుతో రోగుల రోగాలేమీ నయమవ్వవు కదా! అంతా మనలో ఉంది” అంటూ మెల్లగా నవ్వాడు. తన మాటలకే తనకు నవ్వొచ్చిందో ఇతరుల గురించి నవ్వొచ్చిందో తెలీదు.
అప్పుడే ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. పోర్టరే వచ్చాడనుకున్నాడు వైద్యజీ. అయితే వీడు పాండురోగం వాడు. వాడిని చూడగానే వైద్యజీ మొహం వికసించింది. తను లోపలికి వెళ్ళి ఒక తాయెత్తు తెచ్చాడు.
“ఇక దీని ప్రభావం చూడు. ఇరవై, ఇరవైఐదు రోజుల్లో దీని మహత్తు నీకు తెలుస్తుంది.” అంటూ పాండురోగి చేతికి దానిని కట్టాడు. వాడు ఇచ్చిన చిల్లర జేబులో వేసుకొని గంభీరంగా కూర్చున్నాడు. రోగి వెళ్లగానే “ఈ విద్య మా తండ్రిగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఆయన వ్రాసిన పుస్తకాలెన్నో ఉన్నాయి.. వాటిని నకలు చేద్దామని ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాను.. దానిలోవన్నీ అనుభవంతో వ్రాసినవే. విశ్వాసం ఉండాలి బాబూ. చిటికెడు ధూళితో మనిషి ఆరోగ్యవంతుడవుతాడు. హోమియోపతి వైద్యమంటే ఏమిటనుకున్నావు? చిటికెడు చక్కెర. దేనిమీదయినా విశ్వాసం ఉంటే చాలు” అన్నాడు.
చందర్ వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ “ఔషధాలయం మూసే సమయమయింది. మీరు భోజనానికి వెళ్ళరా?” అని అడిగాడు.
“నువ్వు వెళ్ళు. నేను పది నిముషాలు ఆగి వస్తాను.” వైద్యజీ తహసీలు రిజిస్టరు ముందుకు లాక్కున్నాడు. దుకాణం తలుపు బార్లా తీశాడు. బయట ఎండకు కళ్ళు జిగేలుమన్నాయి. ప్రక్క దుకాణం బచ్చన్ లాల్ తన కొట్టు మూసి ఇంటికి వెళ్తూ వైద్యజీ ఔషధాలయం ఇంకా తెరిచే ఉండటం చూసి “ఇంకా భోజనానికి వెళ్ళలేదా?” అని అడిగాడు.
“లేదు. కొంచెం ముఖ్యమైన పనుంది. అది పూర్తిచేసి వెళ్తాను.” వైద్యజీ నేలపై చాప పరిచాడు. కాగితాలు, రిజిస్టరు బల్లపైనుండి తీసి చాపమీద పరిచాడు. కాని ఎండ ఎండే. చెమట కారిపోతోంది. ఉండుండి విసురుకొంటూ నకలు చెయ్యడం మొదలుపెట్టాడు. కొంచెంసేపు పట్టుదలగా పనిచేశాడు. ధైర్యం సన్నగిల్లింది. లేచి పాత సీసాల మీద దుమ్ము తుడుచి, వరుసగా పెట్టాడు. కాని మండు వేసంగి మధ్యాహ్నం. . కాలం ఆగిపోయినట్లనిపించింది. ఒకసారి తలుపులో నుండి వీధి కేసి చూశాడు. రోడ్డు మీద ఒకరిద్దరు కనిపించారు. వచ్చే పోయే జనం తనకు బాసటగా నిలిచినట్లయింది. లోపలికి వచ్చాడు. బోర్డు తీగ సరిచేసి, దుకాణం ముందు వ్రేలాడ దీశాడు. దుకాణం మెడకు తాయెత్తు కట్టినట్టు ఆ బోర్డు అమిరింది.
ఇంకొంచెం సమయం గడిచింది. కొంచెం ఉత్సాహం వచ్చింది. చెంబెడు నీళ్ళు త్రాగాడు. పంచె పైకి కట్టి మరలా పని చెయ్యడానికి కూర్చున్నాడు. బయట ఏదో అలికిడి అయింది. ఎవరో అని చూశాడు.
“విశ్రాంతి తీసుకోవటానికి ఇంటికి వెళ్ళలేదా వైద్యజీ” తనకు తెలిసిన ఒక దుకాణదారుడు ఇంటికి వెళ్తూ అడిగాడు.
“వెళ్ళాలనే అనుకొంటున్నాను. కొంచెం పని మిగిలిపోయింది. అది పూర్తి చేసి వెళ్లామనుకొంటున్నాను” గోడకు వీపు ఆనించి కూర్చున్నాడు. చొక్కా తీసి ప్రక్కన పెట్టాడు. రేకుల కప్పు అగ్గిలా మండుతోంది. వైద్యజీ కళ్ళకు నిద్ర కూరుకొస్తూంది. కునుకు పట్టింది.. సమయం గడిచింది కూడా. ఇక ఉండలేక రిజిస్టర్లను తలగడగా వేసుకొని పడుకొన్నాడు. నిద్ర పట్టినట్టు ఉంది.. పట్టనట్టూ ఉంది .. ఎందుకో మరి.
బయట అలికిడికి ఉలికిపడ్డాడు. కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు. బచ్చన్ లాల్ ఇంటినుండి తిరిగి దుకాణానికి వచ్చాడు.
“అరె. మీరింకా వెళ్ళనేలేదా?”
వైద్యజీ గట్టిగా విసురుకోసాగారు. బచ్చన్లాల్ వెళ్తూ ‘ఎవరి కోసమయినా చూస్తున్నారా?’ అన్నాడు.
“ఒక పేషంటు వస్తానని చెప్పి వెళ్ళాడు.. ఇప్పటివరకూ..” బచ్చన్ లాల్ వెళ్ళిపోవటం వైద్యజీ చూశాడు. మాట ఆపేశాడు, తన చెమట ఒత్తుకోసాగాడు.
Featured image pc: Reuters through The Hindu
30-7-2025


ఓ మై గాడ్.. నేను చాలా సిగ్గు పడుతున్నాను. కమలేశ్వర్ పేరు ఇంతవరకూ నాకు తెలియనందుకు. ఆంధీ.. మౌసమ్.. కథకుడు ఇతడా.. ఆ రెండు సినిమాలు నా ఆల్ టైం ఫేవరెట్ ఫిల్మ్స్ లిస్టు లో ఉంటాయి. ఆంధీ సినిమా ఇప్పటికీ నెలకోసారి చూస్తూ ఉంటా కానీ టైటిల్స్ అస్సలు గమనించను. నేనిన్నాళ్లు అవి గుల్జార్ కథలే అనుకుంటున్నాను. మరో అత్యంత ఇష్టమైన ఛోటీ సీ బాత్ సినిమాకి డైలాగ్స్ రాసింది కూడా ఇన్నాళ్లు బాసు ఛటర్జీ యే అనుకుంటున్నా. ఇదీ నా ఫస్ట్ రియాక్షన్. ఇంక మిమ్మల్ని 40 ఏళ్ల నుంచి వెంటాడుతున్న కథ అన్నారంటే కచ్చితంగా చదివి తీరాలి. మీరు రోజు ఇంత హోమ్ వర్క్ ఇస్తుంటే ఎలా సార్.. ?
నిజమే కదా! కానీ ఏం చేయను? ఏమీ రాయకపోతే ఆరోజు జీవించినట్టే ఉండదు.
కథ బాగుంది సార్, కమలేశ్వర్ కథ ను చదవడం ఇదే మొదటిసారి, మీరు అన్నట్టు ఉక్కపోత దినాలు బాగుంటుంది. కదా అంతా కూడా దృశ్యమానంగా ఉంది. అనువాదమే ఇంత బాగుంటే, హిందీలో కదా ఇంకెంత బాగుంటుందో అనుకున్నాను. ఇప్పుడు మీ కథ చదవాలి.
ధన్యవాదాలు సార్!
రోజువారీ బతుకులో వైద్యుల మానసిక స్థితి
అచ్చం ఇలానే ఉంటుంది.ఎంత నిశితంగా తానే వైద్యుడిగా పరకాయ ప్రవేశం చేసి వ్రాసారు. రచయిత కు, పంచుకున్న మీకు నమస్సులు అందిస్తున్నాను.
హృదయపూర్వక ధన్యవాదాలు మేడం!