
కవిసంధ్య 54 వ సంచిక రాళ్ళబండి కవితాప్రసాదును స్మరిస్తూ వచ్చింది. మే 21 న ఆయన పుట్టినరోజుని స్మరిస్తూ శిఖామణి ఈ సంచిక కోసం ఏదేనా రాయగలరా అంటే ఇంతకు ముందు రాసిన తలపుల్లోంచే ఈ నాలుగు వాక్యాలూ గుదిగుచ్చి పంపించాను. ఆ ఆత్మీయమిత్రుణ్ణి మరోసారి తలుచుకుంటూ, ఈ వ్యాసం మీతో కూడా పంచుకుంటున్నాను.
ఉద్యోగ విరమణ అయ్యాక నేను మళ్ళా హైదరాబాదు వచ్చి మూడేళ్ళు దాటింది. ఎప్పుడేనా బయటికి వెళ్తే, ఒకప్పుడు నగరంలో గడిపిన కాలమంతా డైరీలో రాసిపెట్టినట్టుగా కళ్ళముందు కదులుతూ ఉంటుంది. కాని ఆ డైరీలు చదవాలని లేదు. ఆ పేజీల్లో ఎందరో మిత్రులు, మిత్రురాళ్ళు. ఒకప్పుడు వాళ్ళు లేకుండా ఒక్కరోజేనా గడుస్తుందా అనుకున్న వాళ్ళు. కాని వాళ్ళంతా చాలా దూరంగా జరిగిపోయారు. కొందరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు కూడా.
కాని ఆ డైరీలు తెరవకుండానే నన్ను ప్రతి రోజూ పలకరిస్తున్న వాళ్ళల్లో అందరికన్నా ముందు కవితాప్రసాద్ ఉంటాడు. ఆయన మనల్ని వదిలిపెట్టి అప్పుడే పదేళ్ళు గడిచిపోయిందా అనిపిస్తోంది. పొద్దుణ్ణుంచి సాయంకాలందాకా విరామం లేకుండా కూస్తూనే ఉన్న కోయిల గొంతు అతణ్ణి పదే పదే జ్ఞాపకం చేస్తూనే ఉంది. ఆఫీసులో కూచుని ఉండగా, పదిమంది మనుషులు ఛాంబరులోకి చొరబడ్డట్టుగా, అడుగుపెట్టే ఆ మనిషి నా తలపుల్లోకి కూడా అంతే ఉత్సాహంతో జొరబడుతూనే ఉన్నాడు.
కొత్త కవిత్వం పుస్తకమేదన్నా ఫ్లిప్‌కార్టు నుంచి ఆఫీసుకి రాగానే, ఓపిగ్గా దానికి అట్టవేసుకునేదాకా ఆగి, ఆ కవిత్వం తనకి చదవాలని ఉందని చెప్పి పట్టుకుపోయేవాడు. మళ్ళా వెంటనే ఇచ్చేసేవాడు. కాని మళ్ళా రెండుమూడు వారాలో, నాలుగైదు వారాలో గడవగానే ‘ఆ మచాడో ఒకసారి చదవాలని ఉంది’, ‘హాఫ్ ఫినిషెడ్ హెవెన్ రేపొకసారి తీసుకొస్తారా?’, ‘రిల్కని మళ్ళా చదవాలని ఉంది’ అనేవాడు. పాశ్చాత్యకవిత్వాన్ని తాను ఎక్కడ మిస్సవుతానో అనే ఒక యాంగ్జయిటి ఉండేది అతడి మాటల్లో. కాని నాకు అతడి పొట్టలో ఉన్న పదివేల తెలుగు పద్యాల్నీ మళ్ళీ మళ్ళీ వినాలని ఉండేది. తెలుగు ఛందస్సు గురించి మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవాలని ఉండేది.
‘ఏమండి భద్రుడుగారు, భోజనం చేసార మీరు’ అంటో రూములో అడుగుపెడుతూ, ‘మీకు తెలుసా, ఈ వాక్యం మధ్యాక్కర ఛందస్సులో ఉంది. మనం మాట్లాడుకునే తెలుగు వాక్యాలన్నీ చిన్న చిన్న మార్పుల్తో మధ్యాక్కర పద్యాలయిపోతాయి’ అనేవాడు. (చూడండి, అయిదో గణం మొదటి అక్షరం మీద యతి, అచ్చం నన్నయగారు వేసినట్టే). ‘భోజనం అంటే గుర్తొచ్చింది. శ్రీనాథుడు భోజనం చేసారా అనడు. భుజక్రియ చేసారా అంటాడు’ అనేవాడు.
2
వరంగల్లోని సహృదయ సాహిత్య, సాంస్కృతిక సంస్థ వారు ఆయన పేరిట ఒక అనుబంధ పురస్కారం ఏర్పాటు చేసారు. అటు సాహిత్యంలోనూ, ఇటు పాలనలోనూ కూడా సమానమైన కృషి చేసిన రచయితలని ఎంపిక చేసి, ప్రతి ఏటా ఆయన పుట్టినరోజు నాడు సహృదయ అనుబంధ పురస్కారాన్ని అందిస్తూ ఉన్నారు. అందులో భాగంగా 2020 సంవత్సరానికిగాను నాకు కూడా ఆ పురస్కారం ప్రకటించారు. కాని మిత్రుడి పేరు మీద ఒక పురస్కారం అందుకోవడంలో నేను సంతోషం కన్నా నిర్వేదమే ఎక్కువ అనుభవించాను. కలకాలం జీవించివలసినవాడు, కలకల్లాడుతూ మనమధ్య కలిసి ఉండవలసినవాడు అర్థాంతరంగా నిష్క్రమించడం ఏమిటి, అతడి పేరుమీద నేను ఇక్కడ పురస్కారం తీసుకోవడం ఏమిటి? నాకైతే, నా అన్న పేరుమీదనో, తమ్ముడి పేరు మీదనో ఒక పురస్కారం ఇస్తే ఎలా ఉంటుందో ఇది కూడా అలానే అనిపించింది.
3
కవితాప్రసాద్ నేను జీవితంలో చూసిన అత్యంత ప్రతిభామూర్తుల్లో ఒకడు. సాహిత్యం, సంస్కృతి, పాలన, ప్రేమానురాగాల విషాయంలో అంత జీవశక్తి ఉన్న మనుషులు చాలా అరుదుగా కనిపిస్తారు. ఆయన ప్రతిభ ఎటువంటిదంటే, ఆయన రాసిన ‘ఒంటరి పూలబుట్ట’ ని ఒక రాణి సదాశివమూర్తిగారు సంస్కృతంలోకి అనువదిస్తే, ఆ సంస్కృతానువాదానికి కేంద్ర సాహిత్య అకాదెమీ పురస్కారం లభించింది!
ఒకసారి కె.సదాశివరావుగారు కవితాప్రసాద్‌ని పరిచయం చేయమంటే వాళ్ళింటికి తీసుకువెళ్ళాను. మామూలుగా తెలుగు సాహిత్యకారులు ఎవరు కనిపించినా వారిని తన పాశ్చాత్య సాహిత్య పరిజ్ఞానంతో ఉక్కిరిబిక్కిరి చేసే సదాశివరావుగారు అవాళ అప్రతిభుడై, కళ్ళు పెద్దవి చేసుకుని, శరీరమంతా ఒక చెవిగా కవితాప్రసాద్‌ని వింటో, చూస్తో ఉండిపోయేరు.
అప్పటికి ఎన్నో ఏళ్ళుగా నేను ఆయన శేముషిని కళ్ళారా చూస్తున్నప్పటికీ, వింటున్నప్పటికీ, ఆ రోజు ఆయన చూపిన ప్రతిభ నన్ను అప్రతిభుణ్ణి చేసింది. ఎన్ని పద్యాలు, ఎన్ని చాటువులు, ఎన్ని సాలంకార సవివరణలు! మరీ ముఖ్యంగా ‘కవిత్వమంటే మౌనంగా చదువుకునేది కాదు, బిగ్గరగా చదువుకోవాలి, ఇంకా చెప్పాలంటే రాగయుక్తంగా పాడుకోవాలి’ అని అంటూ తన మాటలు తనకే సంతృప్తిగా లేక, ‘ఉహుఁ కవిత్వమంటే అభినయిస్తూ పాడుకోవలసింది సార్’ అని అన్నాడు.
‘అంటే ఎలా?’ అనడిగారు సదాశివరావుగారు.
‘ఎలానా? ఇదిగో, ఇలా`’ అని కుర్చిలోంచి లేచి నిల్చున్నాడు. ‘ఏమేమీ కలహాశనుండచటికై ఏతెంచి ఇట్లాడెనా?’ అని అన్నాడు. ‘చూడండి, సత్యభామ ముందు ఇలా అడుగుతుంది. అప్పుడు, ఇదుగో ఇలా ఈ పక్కకొస్తుంది’ అని నాలుగడుగులు ఇటుపక్కకి నడిచాడు. అప్పుడు ‘ఆ మాటల్ చెవియొగ్గి తావినియెనా?’ అనడిగాడు. మళ్ళా ఇటుపక్కకొచ్చాడు. ‘ఆ గోపికావల్లభుండేమే మాడెను? అనడిగాడు. వెంటనే అక్కడే నిలబడి ‘రుక్మిణీ సతియు?’ అని అన్నాడు. అప్పుడు మళ్ళా రుసరుసా అటుపక్కకి నడిచి ‘నీ వింకేటికి దాచెదే!’ అని అరిచినంత పనిచేసాడు. చివరికి మళ్ళా వచ్చి కుర్చీలో కూచుని నిస్పృహతో ‘నీ మోమోటలు మాని నీరజముఖీ! నిక్కంబెరింగింపవే!’ అని అన్నాడు. ‘ఒక పద్యం మనం చదువుకుంటే ఇలా చదువుకోవాలి సార్, మనసులోనే కాదు, బయట కూడా’ అన్నాడు.
ఎన్నేళ్ళయింది ఈ ఘట్టం నడిచి! ఇప్పుడు ఇలా రాస్తుంటే మళ్ళా నా కళ్ళముందు ఆయన సాంతం అభినయిస్తున్నట్టే ఉంది. Poetry as Performance అంటే ఏమిటో ఆ రోజు కళ్ళారా చూసాను.
3
ఒకరోజు పొద్దున్నే ఉట్నూరు బస్టాండులో దిగాను. మార్చినెల. ఉగాది సందర్భంగా మా రవీందరు ఒక సాహిత్యసమావేశం ఏర్పాటు చేసాడు. నేనూ, మా అక్కా ఆ ఊళ్ళో అడుగుపెట్టగానే ఆ తెల్లవారు జామున నిండుగా పూసిన వేపచెట్ల తీపిగాలి మమ్మల్ని గుప్పున తాకింది. అప్పుడు వినిపించింది ఒక కోకిల కూత. నేను ఉలిక్కిపడ్డాను. అది ఎందుకో నా మిత్రుడే కోకిలగా మారి నా వెంట వస్తున్నాడనిపించింది. బహుశా ఈ భ్రమ ఈ జన్మకి వీడదు.
ఒక స్కూలు టీచరుగా జీవితం ప్రారంభించి ఒక రాష్ట్ర శాఖాధిపతిగా, అదికూడా సాంస్కృతిక శాఖాధిపతి కావడం జీవితం ఆయనకి అందించిన మహదానందాల్లో అదొకటి. ఆ శాఖకి రెండుసార్లు డైరక్టరుగా పనిచేసాడుగానీ, ‘నేనొక లెక్కల మాష్టర్ని. చాలా మంచి లెక్కల మాష్టర్ని. ఉపాధ్యాయుడిగా జీవించినప్పుడు కలిగిన ఆనందం లాంటిది మళ్ళా నాకు దొరకనే లేదు’ అనేవాడు. తిరుపతిలో ధర్మప్రచార పరిషత్తు కార్యదర్శిగా పనిచేసి తిరిగి మళ్ళా సాంఘిక సంక్షేమశాఖకి వచ్చిన తర్వాత మా అనుబంధం మరింత బలపడింది. అప్పణ్ణుంచీ, అంటే దాదాపుగా ఆయన జీవితంలో చివరి అయిదారేళ్ళు ఆయన నా దైనందిన జీవితంలో ఒక భాగమైపోయాడు. రోజూ ఎన్నో గంటల పాటు ఎందరో కవులు, రచయితలు, పుస్తకాలు, పద్యాలు-నేనాయన సాహిత్యవిశ్వరూపం చూసాను. ఆయన పొట్టలో కనీసం యాభై వేల పద్యాలైనా వుంటాయి.
లక్ష పద్యార్చనకి శ్రీకారం చుట్టినవాడు. చాలామంది అవధానుల ధారణకీ, కవితాప్రసాద్ ధారణకీ తేడా ఉంది. మా మాష్టారు శరభయ్యగారి తర్వాత అంత శక్తిమంతమైన random access memory మళ్ళా కవితాప్రసాద్ దగ్గరే చూసాను. తిక్కన పద్యాలు ఎత్తుకుంటూ, నాచనసోముణ్ణి చుట్టబెట్టి అనంతామాత్యుణ్ణుంచి కల్పవృక్షందాకా విహంగ వీక్షణం చేస్తాడు. ఏ ఛందస్సు గురించి అడగండి, కొన్ని వందల పద్యాలు ఉదాహరణగా దొర్లిపోయేవి.
కవులు పుట్టవచ్చు. కళాకారులు పుట్టవచ్చు. కానీ తన హృదయాన్నీ, రసననీ, మొత్తం జీవితాన్నీ పద్యానికి పల్లకిగా మార్చుకుని వూరేగించగలవాళ్ళు మాత్రం ఇక ముందు తరాల్లో పుడతారనుకోను. నాకు తెలిసి ఆ పద్య గంధర్వుల్లో చివరివాడు కవితాప్రసాద్.
18-6-2025


నాకీ సారి ఈ మాటలన్నీ మీ గొంతులో మీ అభినయంలో కనపడ్డాయి. ఇట్లాంటి ఉదయపు వేళల్లోనే కదా… మాకీ కబుర్లు చెప్పారు..
శ్రీనివాస్ అంకె అన్నారు ఆ రోజు, మనతో కాఫీ టేబుల్ పంచుకోవడానికి ప్రపంచ కవులంతా పోటీ పడ్డారని. 😊😊 గుర్తొస్తే భలే నవ్వొస్తుంది.
కవితా ప్రసాద్ గారు ఆయన సిగ్నేచర్ నవ్వుతో మన మాటలన్నీ వినే ఉంటారని అనుకోవడమే నాకు బాగుంది.
థ్యాంక్ యూ ఫర్ షేరింగ్, సర్ ❤️
కవితా ప్రసాద్ కు మిమ్మల్ని ఒక్కసారేనా చూపించలేకపోయానే అనిపిస్తుంది.
మీరు,తాడి ప్రకాష్ గారు రాసింది చదివి ‘ కవితావనం’ సంపాదించాను సర్.ఎలాంటి పుస్తకమది!
ధన్యవాదాలు!
ధన్యవాదాలు సార్!
గొప్ప స్మరణ. కవితా ప్రసాద్ నాకు B.Ed classmate. క్లాస్మేట్ గా చాలా క్యాజువల్ గా ఒరే అని పిలుచుకోవచ్చు. అలా నన్ను ఒరే అనే వాడు. నేను ఒరే అంటే బుగ్గలు సాగదీసి పకపకా నవ్వే మిత్రుడు వాడు. టీచరుగా వాడు పాఠం చెబుతుంటే చూశాను. అంత గొప్ప గురువు మళ్ళీ పుట్టడు. అదే అంటే మళ్ళీ అదే నవ్వు. మీరన్నట్లు వాడి పొట్టలో లక్షలాది పద్యాలు. వాడి అధికారి జీవితం నేను చూడలేదు. కారణం నేను సాహిత్యానికి దూరంగా వెళ్ళిపోయాను. ఓసారి ఓ international funding కోసం గవర్నమెంట్ రికమండేషన్ కోసం వెళ్ళాను. ఆక్కడున్నాడు. నాకు తెలియదు. హత్తుకుని రాయడం మానేసినందుకు బూతులు తిట్టాడు. అదే ఆఖరిసారి వాడిని చూడటం.
బండారు బీఈడీ కాలేజీ నుండి రోడ్డు మీదికి స్టూడెంట్స్ అంతా పోతుంటే ముందుండి వాడు త్యాగరాజ కీర్తనలు ఆలపిస్తూ పోవడం.. ఎప్పటికీ చెరగని అపురూప దృశ్యం.
మడత నలగని కవితా ప్రసాద్ మేల్తలపులు గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు.
నమస్కారం
మీరు చెప్పినవి అక్షరలక్షలు. నేను వారిని రెండుసార్లు కలిసాను. అదీ చాలా తక్కువ సమయంగా. వారి అవధాన గ్రంధం చదివి వారిని చూడాలని అనిపించి కలిసాను. వారు నాకు ప్రేమగా ఒంటరి పూలబుట్ట బహుమతిగా ఇచ్చారు. అవి మా ఇంటికి వచ్చే వరకూ చదువుకున్నా. అంత త్వరగా వారు మాయమవటం నాకు చాలా దుఃఖం కలిగించిన విషయాలలో ఒకటి. వారి గురించి మీ కలంద్వారా గుర్తు చేసుకోవటం మరోసారి. మరోసారి ఆలోచనలలో కదిలారు వారు.
వందనాలు
మీ మాటలు అక్షర సత్యం. హృదయపూర్వక ధన్యవాదాలు.
ఎప్పుడు చూచినా నుదుట బొట్టు , పెదవుల పై చిరునవ్వు , మోములో ఏదో తెలియని ఆత్రుత , అందులోనే కలిసినా వారిపై ప్రస్ఫుటంగా గోచరించే ఆదరం. వారిని రెండు మూడు సందర్భాల్లో కలుసుకోవడం జరిగింది. మొదటిసారి రవీంద్రభారతి భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో వారికి సదాశివ కావ్య సుధతో పాటు నా పుస్తకాలు కూడా ఇచ్చినప్పుడు. అప్పట్లో నేను తుమ్మూరి రాంమోహన్ రావు కంటే వాధూలస గానే ఎక్కువ మందికి తెలుసు. నన్ను చూడగానే
ఆత్మీయంగా పలుకరించి నా మువ్వల ప్రస్తావన తెచ్చి నన్ను పులకింపజేయడం మరువలేని అనుభూతి . ఆ తరువాత సదాశివ స్మతి సుధకు
ముందుమాట కోసం మాసాబ్ ట్యాంకులో మిమ్మల్ని అడగటానికి వచ్చినప్పుడు ఆ ప్రాంగణంలో కలుసుకుని పరామర్శించకోవడం గుర్తుంది. మరో మారు గిరిజామనోహరు బాబుగారి కుమార్తె వివాహానికి వారు కూడా వచ్చినపుడు మేమిరువురం కాసేపు ముచ్చట్లాడుకున్నాం. ఇంకోసారి మా నాగబాల సురేశ్ కుమార్ గారు టెలివిజన్ కళాకారులకు
శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో రాళ్లబండి కవితా ప్రసాద్ గారి ప్రసంగం ఒకపూట పెట్టడంతో వారి అనుభవసారం వారి మాటల్లో వినడం జరిగింది. చివరిగా సదాశివ స్మృతి సుధ పుస్తకం మీకు అందజేయడానికి మీ దగ్గరికి మెహదీ పట్నం వస్తున్నాయంటే మీరు రవీంద్రభారతి ఆఫీసులో ఉన్న కవితా ప్రసాద్ గారికిస్తే మీకు చేరుతుందనడంతో మధ్యదారిలో వారివద్దకు వెళ్లి వీరికొక పుస్తకం ఇచ్చి మరో పుస్తకం మీ కోసం ఇవ్వడం మరచిపోలేను.
వారికి మనః పూర్వక స్మృత్యంజలులు.
మీరిలా వారి స్మరించుకోవడం చాలా చాలా సంతోషం. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
పచ్చని జ్ఝాపకం!
ధన్యవాదాలు సార్!
వేనకు వేల పువ్వులను ఒంటరి చేస్తూ పూల బుట్ట వడి వడిగా కాలం ఒడిలోకి ఒదిగి కూర్చుండిపోయింది!😢 మీ అక్షరాలు ఆతనిని పునర్జీవింపజేసి కళ్లెదుట నిలిపాయి! మర్చిపోతేనే కదా గుర్తుచేసుకోవాలి?ఆ అవసరం ఎప్పుడూ రాలేదు.
అవును. ఆయన గుర్తులుగా మనం మిగిలాం.
అద్భుతంగా రాశారు.
ధన్యవాదాలు మేడం!
కవిత ప్రసాద్ గారి ఫోటో గూడ ఒకటి పెడితే ఈ మీ వ్యాసం ఇంకా హృద్యం గా ఉండేది 💐🙏
ఈ బ్లాగు పోస్టు మొదట్లో ఉన్నది కవితా ప్రసాద్ గారి ఫోటో నే కదా! ఫీచర్ ఇమేజ్ లో ఉన్నది కూడా ఆయన ముఖచిత్రమే. మీరు వ్యాసం చూసినట్టు లేదు.
అవును సార్.. మీ వ్యాసం చదివిన ఆనందంలో ఫోటో లను గమనించలేదు.. క్షంతవ్యుడను 🙏