కొన్ని క్షణాల వైభవం

కథాశిల్పరహస్యాల్ని వివరిస్తూ నేను కొన్ని వ్యాసాలు రాయాలని నేను చాలాకాలం కిందట ఒక ప్రాజెక్టు మొదలుపెట్టాను. అందుకోసం ప్రపంచసాహిత్యంలోంచి కొన్ని కథలు అనువాదం చేసాను. వాటిల్లో ఈ ‘కొన్ని క్షణాల వైభవం’ కథ కూడా ఒకటి. కథానిర్మాణంలో పతాకస్థాయిని చిత్రించడానికి ఒక ఉదాహరణగా ఈ కథని వివరించాలని అనుకున్నాను. ఆ వ్యాసాల్లో కొన్ని రాసాను, మిగిలినవి ఇంకా రాయవలసే ఉంది. ఇప్పుడు గూగీ వా థియాంగో (1938-2025) మన మధ్యనుంచి నిష్క్రమించాడు. ఆయనకు నివాళిగా ఈ కథని మీతో పంచుకుంటున్నాను. Minutes of Glory (2019) అనే పేరు మీద వెలువడ్డ కథాసంపుటిలో కథ ఇది.


ఆమె పేరు వంజిరు. కానీ ఆమె క్రైస్తవనామం బియాట్రిసు. దాన్నే ఆమె ఎక్కువ ఇష్టపడుతుంది. ఆ పేరు ఆమెకి మరింత నిర్మలంగా, మరింత సుందరంగా వినిపిస్తుంది. దానర్థం ఆమె అందవిహీనంగా ఉందనికాదు, అలాగని ఆమెను సుందరి  అని కూడా అనలేం. ఆమె దేహం నల్లగా, బొద్దుగా స్ఫుటమైన ఆకృతి కలిగి ఉండే మాట నిజమేకానీ ఆ దేహంలో ఆత్మఇంకా అవతరించవలసిందా అన్నట్టుంటుంది. ఆమె మద్యశాలల్లో పనిచేస్తున్నది. అక్కడికి రకరకాల మనుషులు వస్తూ, నురగలుకక్కుతున్న బీరులో, తమ ఆంతరంగిక జీవితాల్ని వెళ్లబోసుకుంటుంటారు. ఆమెనెవరూ పట్టించుకోనట్టే ఉంటారు. ఎప్పుడైనా యజమానికానీ, లేదా ఓపికపట్టలేని కస్టమరు గానీ ఆమెని పేరు పెట్టి పిలుస్తారు, ‘బియాట్రిస్‌’ అని. అప్పుడు తక్కిన కస్టమర్లు కూడా తలెత్తి ఒకటిరెండు క్షణాలు అంత అందమైన పేరుగల మనిషి ఎవరా? అన్నట్టు పరికించి చూస్తారు. కానీ అట్లాంటి మనిషి అక్కడ కనబడక వాళ్లు మళ్లా తమ తాగుడులో ముతకజోకుల్లో, నవ్వుల్లో, తక్కిన పరిచారకుల్ని ఆటపట్టించడంలో మునిగిపోతారు. ఎగరడంలో దెబ్బతిన్నపక్షిలాగా మిగిలిపోతుందామె. అప్పుడప్పుడూ ఎక్కడోచోట నేలమీదకు వాలక తప్పదన్నట్టే, కానీ, అస్థిరంగా అటూఇటూ ఎగురుతూనే ఉన్నట్టుగా, ఆమె ‘లిమురు’ పట్టణమంతటా , ఎన్నో మద్యశాలల్లో, అలస్కా, పేరడైజు , ద మాడర్ను, థోము లాంటి చోట్లల్లా ప్రత్యక్షమవుతుంటుంది. ఆమె ఎక్కడా ఒకచోట స్థిరంగా పనిచేయకపోవడానికి ఎన్నో కారణాలు. ఆమె కస్టమర్లను మరీ ఆకర్షించలేకపోతోందని ఎవరైనా యజమానికి కోపమొచ్చినప్పుడు అతగాడు ఆమెని నోటీసు కూడా ఇవ్వకుండా, జీతం ఇవ్వకుండా పనిలోంచి తీసేస్తుంటాడు. దాంతో ఆమె మరో మద్యశాలను ఆశ్రయించకతప్పదు. లేదా ఒకొక్కప్పుడు ఆమె మరీ ఒకే చోట పనిచేయడంపట్ల విసు గెత్తిపోవడం కూడా కారణం. రోజూ అవే  దృశ్యాలు చూస్తూ ఉండడం. బారు మూసేసే సమయానికి తనకన్నా ఏమాత్రం అందంగా లేని అమ్మాయిలకోసం కస్టమర్లు తగాదా పడటం కూడా ఆమెకు కష్టం కలిగించేది. నాలో లేనిది వాళ్లల్లో ఏముంది? అని ఆమె నిరాశతో తననుతాను ప్రశ్నించుకునేది. తను ఒక్కర్తేమాత్రమే ఉండే ఒక మద్యశాలసామ్రాజ్యం కోసం ఆమె పరితపించేది. అటువంటి సామ్రాజ్యానికి తను సామ్రాజ్ఞిగా కస్టమర్లు తనకోసం కానుకగా మద్యం తెచ్చే దృశ్యాలు ఊహించుకునేది. ద్వేషంకన్నా కూడా ప్రేమా, వాంఛ కలగలసిన నవ్వుల్తో, శాపనార్థాలతో వాళ్లు అసహనంతో రగిలిపోవాలనుకునేది.

ఆమె లిమురు పట్టణాన్ని వదలిపెట్టి చుట్టుపక్కలుండే చిన్నచిన్న బస్తీల్లో కొన్నాళ్లు ప్రయత్నించింది. గరారిగ, కమిరితొ, రిరోని, చివరకు తీకును, ప్రతిఒక్కచోటా అదే కథ. ఎప్పుడైనా ఆమెకో క్లైంటు దొరికేవరకూ, కానీ ఎవరూ కూడా ఆమె కోరుకున్నట్టుగా ఆమెను పట్టించుకునేవారు కాదు. ఎవరూ కూడా ఆమెకోసం ఎగబడేవారు కాదు. కస్టమర్లకు మరెవరూ దొరక్కపోతేనే ఆమె గత్యంతరంగా ఉండేది. మనుషులు సాధారణంగా మరీ తప్పతాగిన తరువాత చూపించేలాంటి నటన కూడా ఆమెపట్ల చూపించేవారు కాదు. ఆ మరునాటి రాత్రిగానీ, లేదా మరో పని దినాన కానీ అదే క్లయింటు ఆమె చూసినా కూడా తెలియనట్టే నటించేవాడు. అతడి దగ్గరున్న సొమ్ము అప్పటికే మరికొంత మంది ఎగబడుతున్న అమ్మాయిలకోసం ఖర్చు పెట్టడానికే ఇష్టపడేవాడు .

దీన్ని ఆమె తీవ్రంగా అసహ్యించుకునేది. ప్రతి ఆడపిల్లలోనూ ఆమె తన శత్రువునే చూసింది. వాళ్ల పట్ల ఒకవిధమైన నిర్లిప్తవైఖరి అవలంభించింది. తనతోటి యువతులందరిలోనూ మరీ ముఖ్యంగా న్యగూథీని ఆమె మరీ ఎక్కువగా ద్వేషించేది. ఆమెని  తన హృదయంలో ముల్లులాగా భావించేది. న్యగూథీకి పొగరు ఎక్కువ. ఎవరితోనూ కలవదు. కానీ ఆమె కోసం మగవాళ్లెప్పుడూ గుమిగూడుతుండేవారు. ఆమె మగవాళ్లతో పోరాడుతూన్నప్పటికీ వాళ్లు ఆమెను మచ్చిక చేసుకోవడానికి రకరకాల కానుకలు తెచ్చి పోస్తూనేఉండేవారు. ఆమె వాటిని తన హక్కులాగా స్వీకరిస్తూండేది. ఆమె చూడ్డానికి చాలా అసహనంగా, విసుగ్గా మనుషుల్ని చీదరించుకుంటున్నట్టుగా ఉండేది. అయినాకూడా మగవాళ్లు ఆమెని పట్టుకు వేళ్లాడుతుండేవారు. ఆమె మాటలు కరుస్తున్నట్టుగా, కొరడాలతో కొడుతున్నట్టుగా ఉన్నా, వాళ్లు దాన్ని ఇష్టపడేవారు. స్వేచ్ఛగా సంచరించే స్త్రీ ఉదాసీన నేత్రాల్నీ, ముకుళిత అధరాల్నీ వాళ్లు వదులుకోలేకపోయేవారు. న్యగూథీ కూడా ఎగురుతున్న పక్షి లాంటిదే. ఆమె కూడా ఎక్కడా ఒకచోట స్థిరంగా వాలనేలేదు. కానీ అందుకు కారణం ఆమె సదా మార్పునీ, ఉద్రేకాన్నీ కోరుకుంటుండడం. కొత్త ముఖాల్నీ, కొత్త క్షేత్రాల్నీ అన్వేషిస్తుండడం. ఆమె నీడని కూడా బియాట్రిసు  అసహ్యించుకునేది. తను ఎలా ఉండాలనుకుంటుందో ఆ రూపాన్ని ఆమె న్యగూథీలో చూసేది. సెక్సు, హింసలతో కూడుకున్న మద్యశాలల అధో ప్రపంచంలో పూర్తిగా మునిగిపోతూనే, అదే సమయంలో పూర్తిగా, దానికి అతీతంగా కూడా ఉండగలిగే ఒక పరిస్థితిని ఆమెలో చూసేది. బియాట్రిసు  ఎక్కడికి వెళ్లినా న్యగూథీ ఛాయ కూడా ఆమెను అటూఇటూగా అనుసరిస్తూనే ఉండేది.

ఆమె లిమురు నుంచి ‘చిరి’ జిల్లాలోని ‘ఇల్మొరాగు’ కు వెళ్లిపోయింది. ఇల్మొరాగు  ఒకప్పుడు ఎవరికీ పట్టని గ్రామం. కానీ న్యంగెండొ అనే ప్రసిద్ధ మహిళ వల్ల ఆ గ్రామానికి మళ్లా ప్రాణమొచ్చింది. ప్రతిఒక్క పాప్‌బృందమూ ఆ మహిళను కీర్తించకుండా ఉండలేదు. ముత్తూ ముచుంగవ అనే యువనాట్యబృందం ఆమె గురించే ఇలా పాడారు:

ఇల్మొరాగు  వెళ్ళాలని నైరొబీ వదలినప్పుడు
తెలియనే లేదు నాకు
ఈ అద్భుతమైన బిడ్డనాదవుతుందని
న్యంగెండొ

అందుకనే ఇల్మొరాగు  అలసిపోయినవాళ్ల ఆశాసౌధం. అణగారిపోయినవాళ్లకు అక్కడ ఒకింత విశ్రాంతి, స్వచ్ఛజలాలు దొరికేచోటు. కానీ న్యగూథీ అక్కడ కూడా ఆమెను వదలిపెట్టలేదు.

కథల్లో, పాటల్లో, నాట్యాల్లో వర్ణనాల మాట ఎలాఉన్నా ఇల్మొరాగు  లిమురు కన్నా ప్రత్యేకంగా ఏమీ లేదని ఆమె తొందరలోనే గ్రహించింది. ఆమె రకరకాల ప్రయోగాలు చేసి చూసింది. దుస్తులా? కానీ ఇక్కడకూడా తళతళలాడే దుస్తులు కొనుక్కోవటానికి సరిపోయేటంత డబ్బు ఆమె సంపాదించలేకపోయింది. ప్రత్యేకంగా ఇంటి అద్దె. జేబులనిండా డబ్బుండే మగస్నేహితులు లేకుండా డెబ్భైఐదు షిల్లింగులు ఏమూలకి సరిపోతాయి? అప్పటికి అంబి ఇల్మొరాగు  చేరుకుంది. తన సమస్యకు పరిష్కారం అదేననుకుంది బియాట్రిసు . తనకన్నా నల్లగాఉన్న అమ్మాయిలు కూడా చర్మాన్ని తెల్లబరుచుకునే క్రీముల్ని రాసుకుని లిమురులో రాత్రికి రాత్రి తారలుగా మారిపోలేదా! మగవాళ్లు వాళ్లని తినేసేటట్టు చూసేవారు. ఆ కొత్త ఆడస్నేహితులు గురించివాళ్లు మరీ అతిశయోక్తిగా మరీ గొప్పలు చెప్పుకునేవారు. ఇట్లాంటివన్నీ లోతుగా ఆలోచించినప్పుడల్లా మగవాళ్లు విచిత్రమైన ప్రాణులనిపించేది బియాట్రిసుకి. వాళ్లు అంబి, బుటోన్‌, ఫైర్‌స్నో, మూన్‌స్నో, సవరాలు, తలకట్ల గురించి పైకి మాట్లాడ్డమైతే గట్టిగా వ్యతిరేకంగా మాట్లాడేవారు. కానీ ఎవరైనా అమ్మాయి అంబి రాసుకుని చర్మాన్ని తెల్లబరుచుకుని కనిపిస్తే లేదా ఐరోపీయ స్త్రీ లాగనో లేదా భారతీయ స్త్రీ లాగనో సవరం చుట్టుకుని కనబడితే చొంగ కార్చుకుంటూ వెంటపడుతుండేవారు. నల్లవారు తమ నల్ల చర్మాన్ని అసహ్యించుకునే ఈ మనఃస్థితికి మూలకారణం ఎక్కడుందో అన్వేషించడానికి బియాట్రిసు  ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఆమె ఈ వైవిధ్యాన్ని ఉన్నదున్నట్లుగా అంగీకరించింది. దాంతో కసిగా తన ముఖానికి కూడా అంబి పూసుకుంది. అవమానకరంగా కనిపిస్తున్న తన నల్లదనాన్ని గట్టిగా తుడిచేయాలనుకుంది. కానీ ఆమెకు అంబీ కూడా కావలసినంత రాసుకునే పరిస్థితి లేదు. దొరికిన కొద్దిపాటీ కూడా  ముఖానికి, ముంజేతులకీ మాత్రమే సరిపోయేది. దాంతో తన మెడ, కాళ్లు నల్లగానే మిగిలిపోయేవి. అదీకాక ఆ ముఖంలో కూడా ఇంకా అక్కడక్కడా కొంత బొల్లిగానే ఉండిపోయేది. ముఖ్యంగా కనురెప్పలు, చెవుల వెనుక ఇటువంటి వాటివల్ల ఆమె తన అంబీతనం పూర్తిగా వెల్లడికాక సిగ్గుగా, చిరాగ్గా ఉండేది.

తన తదనంతర జీవితంలో నోచుకున్న కొన్ని క్షణాల వైభవానికి ముందు అనుభవించిన అవమానదశగా ఈ అంబీదశ ఆమెకెప్పుడూ గుర్తుంటుంది. ఆమె ఇల్మొరాగు లో స్టార్‌ లైట్‌ బార్‌ అండ్‌ లాడ్జింగు లో పనిచేసింది. అక్కడే న్యగూథీ కూడా కౌంటరులో ఉండేది. చేతులనిండా గాజులతో పెద్దపెద్ద చెవి కమ్మలతో కనిపించేదామె. ఆ యజమాని ఉదారక్రైస్తవుడు. క్రమం తప్పకుండా చర్చికి వెళుతుండేవాడు. హరాంబి ప్రాజెక్టులకి చెల్లించవలసినంతా చెల్లించేవాడు. బానపొట్ట, నెరిసినజుత్తు, మృదుభాషి. పెద్ద మనిషి. ఇల్మొరాగు లో నలుగురికీ తెలిసినవాడు. కష్టపడి పనిచేసేవాడు. బారు మూసేసేదాకా ఇంకా చెప్పాలంటే న్యగూథీ వెళ్లిపోయేదాకా కూడా అతడు పనిచేస్తూనే ఉండేవాడు. అతడి దృష్టి మరే ఆడపిల్ల వైపూ పోయేదికాదు. ఎప్పుడూ ఆమె చుట్టూతానే తిరుగుతూండేవాడు. ఆమెనుంచి ప్రతిఫలం ఆశించకుండానే రకరకాల దుస్తులు దొంగచాటుగా కానుక చేస్తూండేవాడు. ఏదో ఆశ. కనీసం రేపన్నా నెరవేరుతుందేమోనని. తక్కిన పరిచారికలకు అతడు నెలకి ఎనభై షిల్లింగులు మాత్రమే ఇచ్చేవాడు. న్యగూథీకి సొంతగది ఉండేది. ఆమెకి ఎప్పుడు నచ్చితే అప్పుడు లేవచ్చు. కానీ బియాట్రిసూ , తక్కిన పిల్లలూ  మాత్రం ఐదు గంటలకు లేవవలసి ఉండేది. లాడ్జిలో ఉంటున్నవాళ్లకోసం టీ తయారుచేయవలసి ఉండేది. బారు  శుభ్రం చేయడం, పళ్లాలు, గ్లాసులు కడగడంలాంటి పనులుండేవి. ఇక అప్పుడు వాళ్లు వంతులువారీగా రెండుగంటల దాకా బారు ని కనిపెట్టుకుని ఉండవలసివచ్చేది. అప్పుడు కొద్దిపాటి విరామం దొరికేది. మళ్లా ఐదుగంటలు కాగానే వాళ్లు మళ్లా కస్టమర్లకోసం సిద్ధం కావలసిఉండేది. రాత్రి పన్నెండుగంటలదాకా, లేదా కస్టమర్లు టస్కర్లకోసం, పిల్‌స్నర్ల కోసం ఎంతసేపు దాహం పడితే అంతసేపు నురగలుకక్కే బీరుతో, చిరునవ్వులతో వాళ్లనే సేవిస్తూ ఉండవలసి వచ్చేది. కానీ బియాట్రిసుకి అన్నిటికన్నా చిర్రెత్తించే విషయం మరొకటుండేది. అదేమంటే యజమాని వాళ్లని ఆరుబయటే పడుకోమని నిర్భందించేవాడు. లేకపోతే వాళ్లు పొద్దున్నే లేవడం కష్టమవుతుందనేవాడు. నిజానికి బియాట్రిసుకి అదేమంత పెద్దవిషయం కాదు. కానీ అతడి అసలు ఉద్దేశం అదికాదు. ఆరుబయట పడుకునే ఆడపిల్లలు తమ శరీరాల్ని ఎరలాగా వాడే అవకాశముంటుందన్నది అతడి ఆలోచన. చాలామంది ఆడపిల్లలు న్యగూథీ నేతృత్వంలో ఈ నియమాన్ని ఉల్లఘించేవారు. వాచ్‌మేనుకి లంచమిచ్చి లోపలికిపోయి పడుకునేవారు. వాళ్లకోసం ఎప్పుడూ వచ్చే కస్టమర్లనో లేదా ఒక్కరాత్రికి మాత్రమే కలిసిపోయే స్నేహితుల్నో వాళ్లకు నచ్చినచోట కలుసుకునేవారు. కనీసం అక్కడైనా తమని  తమ కస్టమర్లు బారు పరిచారికల్లాగా చూడకూడదనుకునేవారు. బియాట్రిసు  ఎప్పుడూ లోపలే పడుకునేది. ఎప్పుడైనా ఆమెతో ఒక్కరాత్రి గడపడానికొచ్చే అతిథులు కూడా ఆమెతో చాలా కొద్దిసేపే గడిపేవారు. ఒకరాత్రి న్యగూథీ ఒప్పుకోకపోవడంతో యజమాని ఆమె దగ్గరకు వచ్చాడు. మామూలుగా అతడు ఆమె పనిలో వంకలు పెట్టేవాడు. పేర్లు పెట్టేవాడు. కానీ ఇప్పుడు మరేదో కసితో మరెవరిపట్లనో కోపంతో అతడామెను ఉన్నట్టుండీ పొగడ్డం మొదలుపెట్టాడు. అతడామెను అందిపుచ్చుకుని తన బానపొట్టతో, నెరిసినజుత్తుతో, ప్రతిఒక్కదాంతో ఆమెమీద ఎగబడ్డాడు. ఆ మనిషిపట్ల విపరీతమైన వెగటుపుట్టింది బియాట్రిసు కి. న్యగూథీ తోసిపుచ్చి పక్కకు పారేసినదాన్ని తాను స్వీకరించటం ఆమెకు అంగీకారయోగ్యంగా అనిపించలేదు. ఓరి భగవంతుడా! న్యగూథీకి ఉన్నదేమిటీ? నాకు లేనిదేమిటి? అని ఆమె తనలో తనే రోదించింది. ఆ మగాడు ఆమె ముందు మోకరిల్లాడు. ప్రాధేయపడ్డాడు. ఎన్నో కానుకలు వాగ్దానం చేశాడు. కానీ ఆమె లొంగలేదు. ఆ రాత్రి ఆమె కూడా నియమాన్ని ఉల్లంఘించి కిటికీలోంచి బయటకు దూకేసింది. ఆ రాత్రి మరో బారు లో గడిపి పొద్దున్న ఆరుగంటలయ్యాకనే తిరిగివచ్చింది. దాంతో యజమాని ఆమెను అందరిముందూ పిలిచి తిట్టి ఉద్యోగంలోంచి తీసేసాడు. కానీ ఈ సారి బియాట్రిసు  తననుచూసి తనే ఆశ్చర్యపడింది.

ఆ పైన ఆమె ఉద్యోగం లేకుండా ఓ నెల రోజులు గడిపింది. తోటి స్త్రీల దయాదాక్షిణ్యం మీద ఒక గదినుంచి మరోగదికి మారుతూ తలదాచుకుంది. కానీ ఎటువంటి పరిస్థితిలోనూ ఇల్మొరాగు  వదలిపెట్టి మరొక కొత్త పట్టణంలో మళ్లా అంతా కొత్తగా జీవితం మొదలుపెట్టడం ఆమెకు ఏ కోశానా ఇష్టంలేకపోయింది. కానీ గాయం సలుపుతూనే ఉంది. ఎక్కడా కారు నిలువకుండా దిమ్మరిగా తిరిగి తిరిగి ఆమె విసుగెత్తిపోయింది. ఇప్పుడామె ముఖానికి అంబి రాయడం మానేసింది. డబ్బు లేదు. అద్దంలో తననుతాను చూసుకుంది. జీవితం కళ తప్పింది. ఏడాదికూడా కాలేదు కానీ ఆమెకు వార్ధక్యం ముంచుకొచ్చినట్టుగా అనిపించింది. మరెందుకీ పంతం? అని తననుతానే ప్రశ్నించుకుంది. కాని ఎందుకనో ఆమెకి ప్రేమకోసం యాచించడమన్నా, నేరుగా రొక్కానికి తన దేహాన్ని కుదుటపెట్టడమన్నా, ఒళ్లు గగుర్పొడిచేది. ఆమె కోరుకున్నదల్లా శుభ్రమైన పని. తనను పట్టించుకునే ఒక మనిషి లేదా ఎందరో మనుషులు. బహుశా ఒక మనిషికోసం, ఒక ఇంటికోసం, ఒక బిడ్డకోసం, ఆమె తనకున్న కోరికను ఎన్నటికీ విడవకుండా మోసుకుంటూ తిరిగేది. బహుశా ఆమెకున్న ఈ నిష్కల్మషమైన అవసరం వల్లనే మగవాళ్లు ఆమెను వదలి తక్కిన పనిమనుషుల వెంట పడేవారు. ఆమె ఎన్నో రాత్రుళ్లు నిద్రలేకుండా ఏడుస్తూ ఉండేది. తన ఇంటిని తలచుకునేది. అట్లాంటి క్షణాల్లో ఆమెకి ‘న్యేరి’లోని వాళ్ల అమ్మ ఇల్లే ఈ భగవంతుడి సృష్టిలోకెల్లా అత్యంత మధురాతిమధురమైన స్థలమనిపించేది. తన తల్లిదండ్రుల రైతుజీవితాన్ని ఆమె అపారమైన సుఖసంతోషాల భ్రాంతిమయకల్పనలతో నింపేసుకునేది. ఆమెకు మళ్లా తన ఇంటికి పోవాలనీ, వాళ్లని చూడాలనీ చాలా కోరికగా ఉండేది. కాని ఉట్టిచేతులతో వాళ్ల దగ్గరకు ఎట్లా వెళ్లడం? ఏ విధంగా చూసినా ఇప్పుడా స్థలం ఒక సుదూరజ్ఞాపకం. ఆమె జీవిస్తున్న జీవితం ఇప్పుడు ఇక్కడ అపరిచితమానవుల మధ్య మద్యశాలలో నడుస్తున్నదే. కళ తప్పిన జీవితం. వన్నె తరిగిన జీవితం. మళ్లా తమ నేలకీ, తమ పొలాలకీ, ఆ గాలులకీ, ఆ వెన్నెలకీ ఎన్నటికీ చేరువకాలేని తరం తనది. చిక్కటి నీడలతో, గుసగుసలాడే ఆ పొదరిళ్లు ఇంకెంతమాత్రం తమకోసం కాదు. టుముటుములో ఆకాశాన్ని తాకే కొండలచెంతన వెన్నెల నీడల్లో ఆ సరసాలూ, ఆ నాట్యాలూ తనకోసం కాదు. ఆమెకి తన గ్రామానికే చెందిన ఓ అమ్మాయి గుర్తొచ్చింది. ఆమెను లిమురులో ఒక సంపన్నుడు తరువాత మరో సంపన్నుడు ఉంచుకుంటూనే వచ్చాడు. పైకి ధగధగలాడే ఆ జీవితం మధ్యనే ఆమె తననుతాను కాల్చుకుని చనిపోయింది. ఈ తరం మృత్యురహస్యాన్ని చూసి బెదిరేతరం కాదు. జీవితరహస్యం పట్ల కూడా దీనికంతే నిర్లక్ష్యం. అవివాహితులుగా ఉంటూనే తల్లులైన ఎందరు స్త్రీలు తమ శిశువుల్ని మరుగుదొడ్లలో పారేయలేదూ? వాళ్లు తల్లులుగా జీవించడంకన్నా ఆకర్షణ కోల్పోకుండా ఉండడాన్నే ఎక్కువ కోరుకున్నారు. తన గ్రామానికి చెందిన ఆ యువతి ఆత్మహత్య చేసుకున్నప్పుడు నలుగురికీ అదొక నవ్వులాట. ఏ కష్టమూ లేకుండానే ఆమె మెట్రిక్‌ అయ్యిందని అన్నారు వాళ్లు. ఆ తరువాత ఓ వారం రోజులపాటు తను కూడా మెట్రిక్‌ కావాలనే బియాట్రిసు  కూడా అనుకుంది కానీ అలా చేయటం ఆమెకు చేతకాలేదు.

ఆమె ప్రేమను కోరుకుంది. జీవించడం కోరుకుంది.

ఇల్మొరాగు లో కొత్తబారు ఒకటి తెరిచారు. ట్రీ టాపు  బారు . లాడ్జింగు , రెస్టారెంటు కూడా ఉన్నాయి. అదేదో రెండుమూడు అంతస్తుల భవనం కాకపోతే దానికి ట్రీ టాపు  అనే పేరెందుకు పెట్టారో బియాట్రిసుకి అర్థంకాలేదు. కిందన టీ దుకాణం. పైన ఓ గదిలో బీరు దుకాణం. లాడ్జిలో గదులు ఐదు నిముషాలకి గానీ, రాత్రంతా గడపడానికి గానీ అద్దెకిస్తారు. దాని యజమాని ప్రభుత్వ సర్వీసులో పనిచేసి రిటైరయ్యాడు. కానీ ఇంకా రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నాడు. అతడికి కెన్యాలోని ప్రతి పెద్ద పట్టణంలోనూ ఏదో ఒక వ్యాపారమూ  వాణిజ్య సముదాయమూ  ఉన్నాయి. అతడు చాలా పెద్ద సంపన్నుడు. దేశమంతటినుంచీ చాలా పెద్ద మనుషులు అతని బారుకి వస్తారు. మెర్సిడెసు లో వచ్చే పెద్దమనుషులు. బెంట్లేసు లో వచ్చే పెద్దమనుషులు. జాగార్ల లోనూ, డైమ్లర్లలలోనూ వచ్చే పెద్దమనుషులు. యూనిఫాం తొడుక్కున్న డ్రైవర్లు నడిపే కార్లలో వచ్చే పెద్దమనుషులు. ఆ పెద్దమనుషులు బయట కార్లలో వేచి ఉండీ, వేచి ఉండీ విసుగొచ్చి కునుకుపాట్లు పడుతూ ఉంటారు. మరికొంతమంది అంతపెద్దవాళ్లు కాదుకానీ, ఆ పెద్దవాళ్లను చూసి దణ్ణం పెట్టడానికి వచ్చిపోతూండేవారు. వాళ్లంతా ఎక్కువగా రాజకీయాలే మాట్లాడుతుండేవారు. కొంత వాళ్ల పని గురించి కూడా. గాసిప్పు  పొంగిపొర్లేది. మీకు తెలియదా? ఈ మధ్యనే కదా ఫలానా ఫలానా వాళ్లకి ప్రమోషనొచ్చింది, నిజంగానా. ఫలానా ఫలానా వాళ్లని ఉద్యోగంలోంచి తీసేశారు. ప్రజాధనం స్వాహాచేసేశారు. బొత్తిగా చేతకానివాళ్లనుకో. అస్సలు చాకచక్యం లేదు. వాళ్లంతా వాదించుకునేవారు. దెబ్బలాడుకునే వాళ్లు. ఒక్కొక్కప్పుడు మరీ ముఖ్యంగా ఎన్నికల ప్రచారా లప్పుడు ముష్ఠియుద్ధానికి కూడా దిగేవారు. కాని వాళ్లంతా ఏకీభవించే విషయమొకటుండేది. అదేమంటే, కెన్యాలో సమస్యలన్నిటికీ మూలకారణం ‘లువొ’ కమ్యూనిటీనే అనే విషయంలో. అలాగే, మేధావులూ, విశ్వవిద్యార్థులూ  తమ తమ దంతహర్మ్యాల్లో సౌకర్యవంతంగా, పొగరుమోతుతనంగా జీవిస్తున్నారు అనే విషయంలో, అలాగే జరుగుతున్న మొత్తం అభివృద్ధిలో ‘కియాంబు’దే అతిపెద్ద వాటా  అనుకోవడంలో, అలాగే ‘న్యేరి’, ‘మురంగా’లకు చెందిన మనుషులే మొత్తం నైరోబిలో వ్యాపారమంతా చేజిక్కించుకున్నారనీ, వాళ్లిప్పుడు ‘చిరి’ జిల్లాలో కూడా ఆక్రమిస్తున్నారనీ, అలాగే ఆఫ్రికావాళ్లు ముఖ్యంగా పొలాల్లో పనిచేసేవాళ్లు సోమరిపోతులనీ, వాళ్లకి ‘మన’మంటే చెప్పలేనంత అసూయనీ, వాళ్లు చెమటోడుస్తుంటే మనం హటాత్తుగా ధనవంతులమయిపోయామనీ-ఇలాంటి విషయాల్లో మాత్రం వాళ్లంతా ఒక్కలానే ఆలోచించేవాళ్లు. లేకపోతే ప్రతిఒక్కడూ ఆత్మస్తుతి చేసుకుంటుండేవాడు లేదా పక్కవాడి పొగడ్తలకి ప్రతిఫలంగా తనుకూడా పొగడ్తలు కురిపిస్తూండేవాడు. ఒక్కొక్కప్పుడు మరీ తాగిన మైకంలో, ఆత్మస్తుతి ఇచ్చిన మత్తులో, సంతోషంపట్టలేక బార్లో ఉన్న ప్రతిఒక్కడి కోసం మరో రెండు రౌ డ్లు బీరు ఆర్డరిస్తుండేవారు. చివరికి ఇల్మొరాగు లో ఉండే బీదవాళ్లు కూడా ఈ సరికొత్త ధనికులతో కలిసి విందారగించడానికి ట్రీ టాపు  బారు కి వచ్చి కూర్చునేవారు.

ఇక్కడ బియాట్రిసుకి బారు ఊడ్చే పని, పక్కగుడ్డలు సర్దే పనీ దొరికింది. మొదట్లో కొన్ని వారాలపాటు ఆమెకిది చాలా గొప్పగా అనిపించింది. ఇంతకుముందు తనకు కేవలం పేర్లుగానే తెలిసిన మనుషుల్ని ఇప్పుడామె కళ్ళారా చూస్తోంది. వాళ్లకోసం పక్కలు సిద్ధం చేస్తోంది. బీదవాళ్లు కూడా పెద్దవాళ్ల ముందు ఎట్లా పెద్దగా కనిపించాలని ప్రయత్నాలు చేస్తున్నారో, తాగి తందనాలు ఆడుతున్నారో ఆమె కళ్లారా చూసింది. కానీ ఇంతలోనే మళ్లా విధి ఆమెవెంట పడిం ది. తక్కినబార్లనుంచి ఆడపిల్లలు ఇక్కడకి  కూడా మందలాగా వచ్చిపడ్డారు. ఆమెకు లిమురులో తెలిసినపిల్లలు, ఇల్మొరాగు లో తెలిసినపిల్లలూ. వాళ్లల్లో చాలామంది ఒకరికో లేక చాలామంది పెద్దమనుషులతోనో సంబంధమున్నవాళ్లే. తమ అసంఖ్యాకమైన తమ ప్రేమికులతో వాళ్లు దాగుడుమూతలాడేవాళ్లు. ఇక ఇక్కడ కూడా న్యగూథీ కౌంటరు వెనక చేరింది. డబ్బున్నవాళ్ల దృష్టిలో, పేదవాళ్ల దృష్టిలో కూడా ఒక్కలానే పడేది. తన పెద్ద కళ్లతో, గాజుల చేతులతో, వేలాడుతున్న చెవి కమ్మలతో ఆమె అదే ఉదాసీనవైఖరి అవలంభించేది. గదులు ఊడ్చేదానిగా, పక్కలు సర్దేమనిషిగా బియాట్రిసు  ఇక్కడ మరింత అనామకురాలైపోయింది. చక్కటి అదృష్టానికి నోచుకున్న ఆడపిల్లలు ఆమెను కించపరచడం మొదలుపెట్టారు.

ఆమె తన కలలతో, జీవితంతో తలపడిం ది. అప్పటిదాకా గదుల్లో పరుపులమీద ఐదు నిముషాల సుఖప్రదమైన పెనగులాటా , మూలుగులూ మిగిల్చిన మరకల దుప్పట్లను మార్చి కొత్తదుప్పట్లు పరిచే కొద్దిక్షణాల వ్యవధిలో ఆమె కిటికీ పక్కనుంచీ, బయటఉన్న కార్లను, డ్రైవర్లనూ చూస్తూండేది. కొద్ది రోజులకే ఆమెకి ఆ కార్ల నంబరు ప్లేట్లను బట్టీ, ఆ డ్రైవర్ల యూనీఫాంలను బట్టి ఆ యజమానులను గుర్తు పట్టేసేది. ఇద్దరే కూర్చోవడానికి వీలుగా ఉండే సన్నని మెర్సిడెసు  స్పోర్ట్సు కార్లలో తనకోసం వెతుక్కుంటూ వచ్చే ప్రేమికుల్ని ఊహించుకుంటుండేది. అట్లాంటి ఒక ప్రేమికుడితో చేయిచేయి కలిపి, ఎత్తుమడమల జోళ్లతో, నేలమీద టకటక చప్పుడు చేసుకుంటూ, చిన్నచిన్న అడుగులతో నైరోబి ముంబాస వీథుల్లో వడివడిగా నడిచిపోవాలని కలగనేది. ఆ కలలో ఏదైనా ఒక పెద్ద గాజు కిటికీ ముందు హటాత్తుగా ఆగి ‘ ప్రియా, నా కోసం ఇది కొనవూ?’ అని అడిగేది. ఆ ప్రియుడు కోపం నటిస్తూ ‘ఏదీ?’ అనేవాడు. ‘అవిగో ఆ మేజోళ్లు డార్లింగ్‌’ అనేది. కుట్టుకనిపించని కన్నాల్లేని అందమైన అసంఖ్యాకమైన అట్లాంటి మేజోళ్లు ఆమెకు సుఖమయ జీవితానికి చిహ్నంగా భావించేది. చిరిగిపోయినవాటిని కుట్టుకుంటూ తనింకెంతమాత్రం జీవించదు. జీవించదుగాక జీవించదు. అర్థమవుతోందా? ఎప్పటికీ. ఇక దాని తరువాత ఆమె రకరకాల రంగురంగుల సవరాలు కొనుక్కొంటుంది. నల్లని సవరాలూ, ఎర్రని సవరాలూ, ఆఫ్రికను  సవరాలూ, ప్రపంచంలో ఉండే అన్నిరకాల సవరాలూనూ . అప్పుడు మాత్రమే ఈ ప్రపంచమంతా బియాట్రిసు కి పాదాక్రాంతమై ప్రశంసలు కురిపిస్తుంది. అటువంటి క్షణాల్లోనే ఆమె తన ఆత్మన్యూనతనుంచి బయటపడి రెక్కలు చాపుకుని పైకెగురుతుంది. ఐదు నిముషాల తక్షణసంతోషం  కోసం గదులు ఊడ్చి, పక్కలు సర్దే పనిమనిషి కాదామె. ఆమె బియాట్రిసు . వెన్నెలవెలుగులో విప్పారిన నగ్నదేహంతో మగవాళ్లకు వణుకుపుట్టించిన ‘వంగూమకేరి’ వారసురాలామె. తన ప్రేమికులెందరినో నపుంసకులుగా మార్చేసిన మహిళగా ప్రశంసలు అందుకున్న న్యంగెండో, నవ్యజనావాసం ఇల్మొరాగును స్థాపించిన న్యంగెండో కూతురామె.

అప్పుడామె తన ఎదుటఉన్న మనిషిని చూసింది. అతడు తన కలల ప్రేమికుడికి పూర్తి వ్యతిరేకరూపంలో ఉన్నాడు. ఒక ఆదివారం మధ్యాహ్నం ఐదుటన్నుల పెద్దలారీ నడుపుకుంటూ వచ్చాడు. దాన్ని జాగ్రత్తగా బెంజులు , జాగార్లు, డైమ్లర్ల పక్కనే పార్కు  చేశాడు. ఒక లారీలాగా కాదు. ఆ సన్నని కార్లతోపాటే అదికూడా ఒకటన్నట్టుగా, పైగా అదలా ఉన్నందుకు తనెంతో గర్విస్తున్నట్టుగా. అతడు బూడిదరంగు బేగి సూటు వేసుకున్నాడు. దానిమీద ఖాకీ మిలటరీ ఓవర్‌కోటు తొడుక్కుని ఉన్నాడు. అప్పుడతడు తన ఓవర్‌కోటు విప్పి దాన్ని జాగ్రత్తగా మడిచి ముందుసీట్లో పెట్టాడు. తలుపులు మూసేసాడు. ఆ లారీని కొద్దిగా తుడిచాడు. అప్పుడు దాని చుట్టూ ఒకసారి తిరిగి ఎక్కడైనా, ఏదైనా దెబ్బతిందా అన్నట్లుగా పరీక్షించి చూశాడు. ట్రీ టాపు లో అడుగు పెట్టబోయే ముందు ఒక్కసారి మళ్లా వెనక్కి తిరిగి ఆ లారీని చూసుకున్నాడు. తక్కినవాటినన్నిటినీ మరుగుజ్జుల్లాగా వెలవెలబోయేట్టుగా చేస్తున్నట్టున్నదది. అతడు ట్రీ టాపు లో అడుగుపెట్టి ఒకమూల కూర్చొని గట్టిగా ఓ కెన్యాబీరు ఆర్డరిచ్చాడు. అప్పుడు దాన్ని తీరిగ్గా రుచి చూస్తూ చుట్టూ తనకు తెలిసినవాళ్లెవరన్నా ఉన్నారేమో చూడాలన్నట్టుగా చుట్టూ కలియచూశాడు. నిజంగానే అక్కడున్నవాళ్లల్లో తనకుతెలిసినవాడిని ఒకడిని గుర్తు పెట్టి వాడికోసం వెంటనే వేట్‌69 క్వార్టరు బాటిలు  ఒకటి ఆర్డరిచ్చాడు. ఆ పెద్దమనిషి పల్చని చిరునవ్వుతో తలుపుతూ ఆ కానుకను అంగీకరించాడు. కానీ ఆ లారీడ్రైవరు అతడితో సంభాషణ మొదలుపెట్టబోతే దాన్నా పెద్దమనిషి మొదట్లోనే తుంచేశాడు. దాంతో ఆ డ్రైవరు తిరిగి మళ్లా తనున్నచోటికే జారిపోయాడు. కానీ ఒక్క నిముషమే. మళ్లా మరోసారి ప్రయత్నించాడు. కానీ ఈసారి చుట్టూ ఉన్నవాళ్ల ముఖాల్లో ఆగ్రహం తొంగిచూసింది. వాళ్లతో కలిసి వాళ్ల ఛలోక్తుల్లో పాలుపంచుకుందామని అతడు చేసిన ప్రయత్నాలు విషాదకరంగా అనిపించాయి. అతడు మరీ గట్టిగా నవ్వబోతే ఆ పెద్దమనుషులు నవ్వడం ఆపేశారు. దాంతో అతడి నవ్వొక్కటే గాల్లో గింగురుమంటూ వినిపించింది. ఇక ఆ సాయంకాలం బాగా పొద్దుపోయాక అతడు తన బల్ల దగ్గర నుంచి లేచి తళతళలాడే వంద షిల్లింగుల నోట్లు లెక్కపెట్టి కౌంటరు దగ్గరున్న న్యగోథీకి అందించాడు. చూడబోతే వాటిని జాగ్రత్తగా దాచమని ఇస్తున్నట్లుంది. చుట్టూ మనుషులు గుసగుసలాడారు. గొణుక్కున్నారు. కొందరు నవ్వుకున్నారు. అతడ్నిచూసి వాళ్లు ఈసడించుకున్నట్టే ఉంది తప్ప ముచ్చటపడ్డట్టు లేదు. అందుకనే దానివల్ల కూడా అతడేమీ నలుగురి దృష్టినీ ఆకర్షించలేకపోయాడు. ఇక నెమ్మదిగా అతడు తను అద్దెకు తీసుకున్న ఏడో నంబరు గదివైపు తడబడుతూ అడుగులేశాడు. బియాట్రిసు  అతడికి తాళంచెవులు అందించింది. అతడామెను ఒక్కక్షణం పాటు చూసి ఆ మీదట కళ్లు తిప్పేసుకున్నాడు.

ఆ తరువాత అతడు ప్రతి శనివారం వచ్చేవాడు. ఐదింటికి. అప్పటికే పెద్దమనుషులు చాలామంది అక్కడుండేవారు. ప్రతిసారీ అతడు అదే తతంగం నడిపేవాడు. డబ్బు పైకి తీసి లెక్కపెట్టడం మినహా. ప్రతిసారి అదే ఓటమి చవిచూసేవాడు. వచ్చిన ప్రతిసారీ కూడా అతడదేమూలకు కూర్చునేవాడు. ప్రతిసారి ఆ ఏడోనెంబరు గదినే అద్దెకు తీసుకునేవాడు. బియాట్రిసు  దాదాపుగా అతడి రాకకోసం ఎదురుచూడ్డానికి అలవాటు పడిపోయింది. ఆమెకు తెలియకుండానే ఆమె ఆ గది అతడికోసం సిద్ధం చేసేది. పెద్దమనుషుల సమాజంలో మరీ అవమానానికి గురైనప్పుడల్లా అతడు బియాట్రిసుని వెళ్లకుండా ఆపేసి ఆమెకేదో ఒకటి చెప్పుకుంటుండేవాడు. లేదా ఇంకా చెప్పాలంటే, ఆమెను కూర్చోబెట్టి తనతోతనే మాట్లాడుకుంటుండేవాడు. అతడికి జీవితం సంఘర్షణమయం. పెద్ద చదువు చదువుకోవాలన్న కోరిక ఉన్నప్పటికీ అతడు ఎప్పుడూ బడికి వెళ్లలేదు. ఆ అవకాశం దొరకలేదు. రిఫ్ట్‌వేలిలో యూరోపియన్లు నివాసముంటున్న ప్రాంతంలో అతడి తండ్రి కూడా అనధికారికంగా నివాసముండేవాడు. ఆ వలసరోజుల్లో అది చాలా పెద్దవిషయం. దానర్థమేమిటంటే, ఆ ఇంగ్లీషువాళ్లకోసం వాళ్ల పిల్లలకోసం ఆ మనిషీ, అతడి పిల్లలు జీవితమంతా చెమటోడ్చి బతకాల్సి ఉంటుందని. అతడు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నాడు. తక్కినవాళ్లలానే అతన్నికూడా నిర్బంధానికి పంపించారు. ఆ నిర్బంధం నుండి బయటకు వచ్చేటప్పటికి అతడికి రిక్తహస్తాలు తప్ప మరేమీ లేవు. స్వాతంత్య్రం రాగానే ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో చేరటానికి తగిన చదువులు తను చదువుకోలేదని గుర్తించాడు. మొదట్లో బొగ్గుపనివాడుగా జీవితం మొదలుపెట్టాడు. తరువాత మాంసం దుకాణం నడిపాడు. ఆ తరువాత నెమ్మదిగా రిఫ్ట్‌వేలి నుంచీ, చిరి జిల్లా నుంచీ నైరోబీకి కూరగాయలు, బంగాళాదుంపలు పెద్దఎత్తున రవాణా మొదలుపెట్టాడు. తన ఈ పెరుగుదలను చూసి ఎంతో గర్విస్తుండేవాడు. కానీ తక్కినవాళ్లు- ఋణాలమీదా, ఉచితవిద్యమీదా- ప్రస్తుతస్థాయికి ఎదిగినవాళ్లు తనలాంటివాళ్ల కష్టాన్ని చూసి గుర్తించడం లేదని వాళ్లను ఈసడించుకుంటుండేవాడు. తను నోచుకోలేకపోయిన చదువుకోసమే ఆలోచిస్తూ తన పిల్లలకోసం మంచి అవకాశాలు రావాలని కోరుకుంటుంటాడు. అప్పుడు జాగ్రత్తగా తన దగ్గరున్న డబ్బు లెక్కపెట్టుకుని దాన్ని తలగడ కింద పెట్టుకుని ఇక బియాట్రిసుని వెళ్లిపొమ్మనేవాడు. అప్పుడప్పుడు అతడామెకోసం ఓ బీరుబాటిలు  కొనేవాడు కానీ అతడు ఎవరినయితే మగవాళ్ల చుట్టూ డబ్బుకోసం వెంపర్లాడే ఆడవాళ్లనుకునేవాడో వాళ్లంటే అతడికి చాలా చులకనభావముండేది. అతడికి ఇంకా పెళ్లి కాలేదు.

ఒకరాత్రి అతడామెతో పడుకున్నాడు. పొద్దున్నే ఒక ఇరవై షిల్లింగుల నోటు వెతికి ఆమె చేతిలో పెట్టాడు. ఆమె ఆ డబ్బు తీసుకుంది కానీ ఆమె మనసులో ఏదో అపరాధభావం పొడసూపకపోలేదు. అతడిట్లా చాలా వారాలు గడిపాడు. ఆమె డబ్బు తీసుకోవడానికి సంకోచించలేదు. అదామెకు ఉపయోగపడుతూనే వచ్చింది. కానీ అతడు ఓ సంచిడు బంగాళాదుంపలకో లేదా ఓ బుట్టడు కేబేజీలకో డబ్బు చెల్లించినట్టే ఆమె దేహానికి కూడా డబ్బు చెల్లించాడు. ఒక పౌండు ఖర్చుమీద అతడు ఆమెను తన కష్టసుఖాలు వినడానికి శ్రోతగా మార్చుకోగలిగాడు. పైవాళ్ల మీద తనకున్న బాధలన్నీ ఒంపుకోటానికి ఓ పాత్ర, తన బరువు దింపుకోటానికి ఓ రాత్రి ఆసరా. అతడి సోది వినీవినీ ఆమెకు విసిగెత్తిపోయింది. అతడు చెప్పుకునే బాధల్లో కూడా కొత్తదనమేమీ ఉండేదికాదు. అయితే అతనిలో ఎక్కడో లోపల్లోపల ఏదో లేకపోలేదని ఆమె గుర్తించింది. ఒక నిప్పు కణిక, లేదా ఒక అంకురం, లేదా ఓ పుష్పం. కాని దాన్నెవరో ఆర్పేసారు, చిదిమేశారు. ఆమె అతడిలో ఒక సహబాధితుణ్ణి చూసింది. అందుకోసం అతడి రాకకోసం ఎదురుచూస్తూండేది. ఆమెకు కూడా మాట్లాడుకోడానికీ, చెప్పుకోటానికి ఎవరో ఒకరు మనిషి కావాలనిఉండేది. తనను అర్థం చేసుకునే ఒక మనిషితో తన హృదయాన్ని పంచుకోవాలని ఆమె కూడా ఆరాటపడిరది.

ఏమైతేనేం ఒక శనివారం రాత్రి ఆమె అతడి కథకి హటాత్తుగా అడ్డు పడింది. అతడు ఎప్పుడూ చెప్పేది  తన జీవితంలో పైకెగబాకడానికి తానెట్లా ప్రయాణిస్తూవచ్చాడో ఆ కథ. ఆ కథకి తాను ఎందుకడ్డుపడిం దో ఆమెకే తెలియలేదు. బహుశా బయటపడుతున్న వానకూడా ఒక కారణం కావచ్చు. అది పైన ఇనపరేకులమీద మృదువుగా చప్పుడు చేస్తూ ఉంది. ఆ చప్పుడులో ఏదో ఒక వెచ్చదనం, ఒక మత్తు కూడా ఉన్నాయి. అతడు ఆమెను వినడం మొదలుపెట్టాడు. అతడు వినక తప్పలేదు. ఆమె న్యేరీలో కరటినకి చెందిన మహిళ. ఆమె సోదరులిద్దరినీ బ్రిటిషు  సైనికులు కాల్చేసారు. మరొక సోదరుడు నిర్బంధంలోనే మరణించాడు. అందుకనే ఆమె ఒక్కర్తే  బిడ్డ అనవచ్చు. ఆమె తల్లిదండ్రులు బీదవాళ్లు. కానీ వాళ్లు తమకున్న కొద్దిపాటి చెలకమీద చెమటోడ్చి పనిచేసి ఆమెను ప్రాథమిక పాఠశాల్లో డబ్బు కట్టి చదివించారు. మొదట ఆరేళ్లు ఆమె కూడా కష్టపడింది. కానీ ఏడో సంవత్సరం ఆమె కొద్దిగా కష్టపడ్డం తగ్గించింది. దాంతో ఆమె అంతగా మంచి శ్రేణిలో ఉత్తీర్ణత చెందలేదు. అయితే తనలాంటి మార్కులు వచ్చిన చాలామంది చక్కటి ప్రభుత్వఉన్నతపాఠశాలల్లో చేరడం ఆమెకు తెలియందికాదు. తనకన్నా తక్కువ మార్కులు వచ్చినవాళ్లు కూడా వాళ్లకున్న పరిచయాలవల్ల చాలామంచి పాఠశాలల్లో చేరిందికూడా అబద్ధం కాదు. కానీ తాను చెల్లించగలపాటి ఫీజులు తీసుకునే ఏ ఉన్నతపాఠశాలల్లో కూడా ఆమెకు ప్రవేశం దొరకలేదు. ఆమెను ఏదైనా హరాంబి పాఠశాలలో చేర్పించడానికి వాళ్ల తల్లిదండ్రుల స్తోమత సరిపోలేదు. దాంతో ఆమె ఏడవ తరగతి పూర్తి చేయలేకపోయింది. బడి వదలిపెట్టి ఇంటి దగ్గరే తల్లిదండ్రుల దగ్గర ఉండిపోయింది. అప్పుడప్పుడూ ఆమె వాళ్లకు షంబలోనూ, ఇంటిపనుల్లోనూ సాయపడేది. కానీ ఊహించండి: గత ఆరేళ్లుగా ఆమె తన తల్లిదండ్రుల జీవితంకన్నా భిన్నమైన జీవితం జీవిస్తూ వచ్చింది. పల్లెల్లో మరీ మొద్దుజీవితం. ఆమె అప్పుడప్పుడూ పనికోసం ‘కరెటినా’కి, ‘న్యేరీ’కి వెళ్లేది. ప్రతి ఆఫీసులోనూ ఆమెను అవే ప్రశ్నలు అడుగుతుండేవారు: నీకే పని కావాలి? నువ్వేం చేయగలవు? టైపు చేయగలవా? షార్ట్‌హాండు వచ్చునా? ఆమె విసిగిపోయింది. అప్పుడు న్యేరీలో కళ్లల్లో నీళ్లు పొంగుతుండగా ఓ దుకాణంలో ఫాంటా తాగుతూండగా ఆమె ఓ యువకుణ్ణి చూసింది. అతడు నల్లటి దుస్తుల్లో కళ్లద్దాలతో కనిపించాడు. అతడామె దుఃస్థితి చూశాడు. ఆమెతో మాట్లాడాడు. అతడు నైరోబినుంచి వస్తున్నాడు. పనికోసం వెతుకుతున్నావా? అదేమంత కష్టంకాదు. పెద్దపట్టణాల్లో ఉద్యోగాలకు కొరత ఉండనే ఉండదు. తను తప్పకుండా సాయం చేస్తాడు. వెళ్లడమెలానా? తనకో కారుంది- పాలనురగలాంటి ప్యూగియోటు. స్వర్గమే మరి. ఆ ప్రయాణం చాలా బాగా కుదిరింది. తెల్లవారితే నవోదయమే అనిపించింది. నైరోబి. అతడామెను టెర్రాస్‌బారుకు తీసుకువెళ్లాడు. అక్కడ వాళ్లు బీరు తాగుతూ నైరోబి గురించి మాట్లాడుకున్నారు. ఆ కిటికీలోంచి ఆమె నియానులైట్లతో వెలుగుతున్న నగరాన్ని చూసింది. జీవితం ఆశావాహంగా అనిపించింది. ఆ రాత్రి ఆమె అతడికి తననుతాను సమర్పించుకుంది. జీవితంలో కొత్తవెలుతురు రానున్నదన్న ఆశ ఆమెలో ఉల్లాసాన్నీ, ఉత్సాహాన్నీ నింపింది. ఆ రాత్రి ఆమె గాఢంగా నిద్రపోయింది. తెల్లవారి లేచేటప్పటికి ఆ పాలనురుగులాంటి తెల్లనికారులో వచ్చిన ఆ మనిషి అక్కడలేడు. ఆమె అతన్ని మళ్లా ఎప్పుడూ చూడలేదు. ఆ రకంగా ఆమె ఒక బారు  పరిచారికగా జీవితం ప్రారంభించింది. గత ఏడాదిన్నరగా ఆమె తన తల్లిదండ్రుల్ని చూడ్డానికి ఒక్కసారి కూడా వెళ్లలేదు. బియాట్రిసు  ఏడ్వడం మొదలుపెట్టింది. తన పట్ల తనకే కలుగుతున్న జాలితో వెక్కివెక్కి ఏడ్చింది. తన అవమానాలు, జీవితంకోసం నిరంతరం చేస్తున్న పోరాటం ఆమె మనసులో ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆమె బారు  సంస్కృతికి అలవాటుపడలేకపోయింది. ఇంతకన్నా ఉన్నతమైంది మరేదో తనకు సంభవించనున్నదనే ఆమె ఆశిస్తూ వచ్చింది. కానీ ఆమె ఇరుక్కుపోయింది. ఆమెకిప్పటికి తెలిసిన జీవితం ఇది మాత్రమే. కానీ ఈ జీవితం నియమనిబంధనలు కూడా ఆమె పూర్తిగా నేర్చుకోలేకపోయింది. మళ్లా ఆమె మరొక్కసారి ఎలుగెత్తి రోదించింది. వెక్కివెక్కి ఏడ్చినప్పుడల్లా కన్నీళ్లు వరదలా ప్రవహించాయి. అప్పుడు ఒక్కసారిగా ఆమె రోదన ఆగిపోయింది. ఆ ఏడుపు గాల్లోనే గడ్డకట్టిపోయింది. ఆమె ఎదుటఉన్న మగవాడు అప్పటికే నిండా దుప్పటి ముసుగుతన్ని పడుకున్నాడు. అతడు గురక తీస్తున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. అది కూడా బిగ్గరగా వినబడుతోంది.

ఆమె మనస్సులో విచిత్రమైన శూన్యం ఆవరించింది. ఆమె ఎదుట, లోపలా ఏదో వెగటుదనం ఊరినట్లనిపించింది. మళ్లా మరోసారి కొత్తగా ఓడిపోయిందామె. ఈ ఓటమి చూసి ఆమె ఏడ్వాలనుకుంది. తనపట్ల ఎంతో క్రూరంగా ప్రవర్తించిన మగవాళ్లనెందరినో చూసిందామె. తన శీలాన్ని అవహేళన చేసినవాళ్లను చూసింది. దాన్ని వాళ్లు నటనగా భావించడం చూసింది. అవన్నీ మౌనంగా తలవంచి సహించిందామె. కానీ భగవంతుడా! ఇది మాత్రం కాదు. ఎంతమాత్రం కాదు. ఈ మనిషి నాలాగా సహబాధితుడు కాడా! శనివారం వెనుక శనివారం ఇతడు ఇన్నాళ్లుగా తన బాధలు నాతో విప్పి చెప్పుకోవటం లేదా? ఆమె చేసిన సపర్యకు అతడు డబ్బులు చెల్లించాడు. తనవంతు బాధ్యతని టస్కరు బాటిళ్లతోటీ, తెల్లవారగానే చెల్లించే విచ్చు రూపాయలతోటీ తీర్చేసుకున్నాడు. ఆమె అంతరంతరాల్లో చెలరేగుతున్న సంక్షోభం అతడికొక జోలపాటలాగా పనిచేస్తూ వచ్చింది. ఇదంతా తలచుకునేటప్పటికి ఆమెలో ఏదో తెగిపోయింది. ఏడాదిన్నరగా కూడగట్టుకుంటున్న క్రోధం, సహిస్తూవస్తున్న అవమానాల చేదు ఇప్పుడు ఈ మనిషివైపు తిరిగాయి.

ఇక ఆ తరువాత ఆమె ఏం చేసిందనేది ఒక అనుభవజ్ఞురాలి హస్తలాఘవానికి సంబంధించిన విషయమే.

అతడామె కళ్లు తడిమి చూసింది. అతడు గాఢనిద్రలో ఉన్నాడు. ఆమె అతడి తల పైకెత్తింది. నెమ్మదిగా వదలిపెట్టింది. ఇప్పుడు ఆమె కళ్లల్లో కన్నీళ్లు లేవు. అవి చల్లగా స్థిరంగా ఉన్నాయి. ఆమె అతడి తలకిందనుంచి తలగడ పక్కకు జరిపింది. దాన్నంతా వెతికి చూసింది. దాన్లో దాచిన అతడి డబ్బు బయటకు తీసింది. తళతళలాడుతున్న ఐదు గులాబీరంగు నోట్లను లెక్కపెట్టింది. ఆ డబ్బును తన జాకెట్టులో దాచుకుంది.

ఏడవనెంబరు రూం నుండి బయటకు వచ్చింది. బయట ఇంకా వాన పడుతూనే ఉంది. ఆమె తనుండే చోటికి వెళ్లాలనుకోలేదు. ఆ ఇరుకు గదినిగానీ లేదా తన రూంమేటు చెప్పుకునే గొప్పల్ని గానీ ఆమె ఇంకెంతమాత్రం భరించలేననుకుంది. అట్లానే ఆ వానలో ఆ బురదలో బయటకు నడిచింది. న్యగూథీ గదికి వెళ్తున్నానని గ్రహించింది. ఆ గది తలుపు తట్టింది. మొదట బదులేమీ లేదు. అప్పుడు పైన వాన చేస్తున్న చప్పుడు మధ్య న్యగూథీ నిద్రమత్తులోనే అడగడం వినిపించింది.

ఎవరది?

నేనే తలుపు తియ్యి.

ఎవరు?

బియాట్రిస్‌.

రాత్రి ఈ వేళప్పుడా?

అవును.

లైట్లు వెలిగాయి. గడియ తొలిగింది. తలుపు తెరుచుకుంది. బియాట్రిసు  లోపల అడుగుపెట్టింది. ఆమె, న్యగూథీ ఒకరికొకరు ముఖాముఖీ నిలబడ్డారు. న్యగూథీ పల్చని రాత్రిగౌనులో ఉంది. ఆమె భుజాలమీదుగా ఆకుపచ్చని శాలువా వేలాడుతోంది.

‘బియాట్రిస్‌! ఏమైందీ? ఏం జరిగిందీ?’ అని అడిగిందామె గొంతు పెగల్చుకుని. ఆమె కంఠంలో ఒకింత ఆత్రుత.

‘నేను కొద్దిసేపు పడుకోనా? నేను బాగా అలసిపోయాను. నీతో మాట్లాడాలి కూడా’. బియాట్రిసు  స్వరంలో ఏదో నిబ్బరం. ఏదో కొత్త బలం.

‘ఇంతకీ ఏం జరిగిందీ?’

‘నేను నిన్ను ఒకేఒక్కటి అడగాలనుకుంటున్నాను, న్యగూథీ’.

వాళ్లింకా నిల్చొనే ఉన్నారు. అప్పుడు మరేమీ మాట్లాడకుండా వాళ్లిద్దరూ మంచం మీద కూర్చున్నారు.

‘నువ్వు మీ ఇల్లు ఎందుకు వదలిపెట్టివచ్చావు న్యగూథీ?’ అని అడిగింది బియాట్రిసు . మరొక క్షణం నిశ్శబ్దం. న్యగూథీ ఆ ప్రశ్న గురించే ఆలోచిస్తున్నట్టుంది. బియాట్రిసు  సమాధానం కోసం ఎదురుచూసింది. నెమ్మదిగా న్యగూథీ గొంతు విప్పింది. ఆ స్వరం ఒకింత కంపిస్తోంది.

‘అది చాలా పెద్ద కథ బియాట్రిస్‌. మా అమ్మానాన్న బాగానే ఉన్నవాళ్లు. వాళ్లు చక్కటి క్రైస్తవులు కూడా. మా ఇంట్లో చాలా కట్టుబాట్లు ఉండేవి. నువ్వు వేరేవాళ్లతో కలిసి తిరగకూడదు, ఆ పాతకాలపు ఆచారాలు, పండగల్లాంటి వాటికి పోగూడదనేవారు. ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎప్పుడు తినాలి? ప్రతీదీ నియమబద్ధంగా ఉండేది. చివరికి నువ్వు నడిస్తే కూడా ఒక క్రైస్తవస్త్రీలానే నడవాలి. నువ్వెప్పుడూ మగపిల్లలతో కలిసి తిరక్కూడదు. ఎప్పుడూ నియమాలూ నియమాలే. దాంతో ఒకరోజు బడినుంచి ఇంటికి వెళ్లడానికి బదులు నాలాంటి మరో అమ్మాయితో కలిసి ‘ఈస్ట్‌లీ’కి పారిపోయాను. ఈ నాలుగేళ్లుగా మళ్లా ఇంకా ఆ ఇంటిమొహం చూడలేదు. అంతే.’

మళ్లా నిశ్శబ్దం. వాళ్లిద్దరూ ఒకర్నొకరు చూసుకున్నారు. ఒకర్నొకరు పోల్చుకున్నారు.

‘న్యగూథీ మరో మాట. అయితే నువ్విందుకు జవాబివ్వక్కర్లేదు. ఏమంటే, ఎందుకో నువ్వెప్పుడూ నన్ను అసహ్యించుకుంటూ వచ్చావనే నాకనిపించింది.’

‘లేదు.  లేదు.  బియాట్రిస్‌. నేనెప్పుడూ నిన్ను అసహ్యించుకోలేదు. నేనెవర్నీ అసహ్యించుకోలేదు. అసలు నాకు దేనిలోనూ ఆసక్తిలేదు. నాకిప్పుడు మగవాళ్లపట్ల కూడా ఇష్టం పోయింది. అయితే నాకు తక్షణఉద్రేకం కావాలి. నన్ను పొగడ్తున్నట్టుండే వంచనాత్మకదృక్కులు కావాలి. వాటిని చూసినప్పుడల్లా నాకు బాగుంటుంది. కాని నువ్వు, నువ్వు వీటన్నిటికీ అతీతురాలివి- నాలో లేనిదేదో నీ అంతరంగంలో ఉందనిపిస్తుంది.’

బియాట్రిసు  ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకోవడానికి ప్రయత్నించింది.

ఆ మర్నాడు పొద్దున్నే ఆమె నైరోబి పోయే బస్సెక్కింది. బజారువీథిలో దుకాణాలన్నీ కలయతిరిగింది. అప్పుడు ప్రభుత్వవీథిలో కెన్యట్టా ఎవెన్యూ, కిమతి వీథిలో అడుగుపెట్టింది. హుస్సేను  సులేమాను  వీథిలో ఓ దుకాణంలో అడుగుపెట్టి చాలా మేజోళ్లు కొనుక్కుంది. ఒక జత తొడుక్కుంది. అప్పుడు తనకోసం కొత్త దుస్తులు కొనుక్కుంది. వాటిలోకి మారింది. బాటా చెప్పుల దుకాణంలో ఎత్తుమడమల బూట్లు కొనుక్కుంది. తన పాత  చెప్పులు పక్కన పారేసింది. కొత్త వాటిని తొడుక్కుంది. అకాంబ కియోస్కులో అడుగుపెట్టి కొత్తచెవికమ్మలు కొనుక్కుంది. అద్దంలో తన కొత్తరూపం చూసుకుంది. హటాత్తుగా ఆమెకు విపరీతమైన ఆకలి వేసింది. ఒక జీవితకాలానికి సరిపడా ఆకలి వేసింది. మోతీమహలు  ముందు ఒక్కక్షణం ఆమె తటపటాయించింది. అప్పుడు లోపలికి అడుగుపెట్టింది. ఫ్రాన్సేలో ప్రవేశించింది. ఆమె కళ్లల్లో ఒక మెరుపు. దాన్ని చూసి మగవాళ్ల కళ్లు ఆమె వైపు తిరిగాయి. అదామెను పులకింపచేసింది. అప్పుడామె ఒక మూల ఒక బల్ల వెతుక్కుని భారతీయ భోజనం ఆర్డరిచ్చింది. ఓ మగవాడు తనబల్లని వదలిపెట్టి ఆమె దగ్గరకు చేరాడు. ఆమె అతణ్ణి   చూసింది. ఆమె కళ్లల్లో సంతోషం తొణికిసలాడుతోంది. అతడు ముదురురంగు దుస్తులు వేసుకుని ఉన్నాడు. అతడి కళ్లల్లో వాంఛ రగులుతోంది. అతడు ఆమె కోసం మద్యం ఆర్డరిచ్చాడు. ఆమెను సంభాషణలో దింపడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె నిశ్శబ్దంగా భోంచేసింది. అతడు తన చేయి బల్లకిందపెట్టి ఆమె ముంగాళ్లు తడిమి చూశాడు. ఆమె ఏమీ అనలేదు. ఆ చేయి అట్లానే పైకి జరిగి ఆమె తొడలదాకా వెళ్లింది. అప్పుడామె హటాత్తుగా తన భోజనం సగంలోనే ఆపేసి ఆ మద్యం ముట్టకుండానే బయటకు వెళ్లిపోయింది. అలా వెళ్లిపోవడం ఆమెకు సంతోషమిచ్చింది. అతడు ఆమె వెంట పట్టాడు. అతడు తన వెంట పడుతున్నాడని ఆమె చూపులు తిప్పకుండానే గ్రహించింది. కొన్ని గజాలపాటు అతడు ఆమె పక్కనే నడిచాడు. ఆమె తనలోతనే నవ్వుకుంది కానీ అతడివైపు చూడలేదు. అతడి ధైర్యం సడలిపోయింది. అతడక్కడే ఓ గాజు కిటికీ వైపు  చూస్తూ నిల్చొండిపోయాడు. ఆమె అతణ్ణి  వదలిపెట్టి ముందుకు వెళ్లిపోయింది. తిరిగిమళ్లా ఇల్మొరాగు  వెళ్లే బస్సెక్కినప్పుడు మగవాళ్లు లేచి ఆమెకు సీటు చూపించారు. దాన్ని ఆమె తన హక్కు లాగా అంగీకరించింది. తిరిగి ట్రీటాపు  బారు లో ఆమె నేరుగా కౌంటరు దగ్గరికి నడిచింది. ఎప్పటిలానే పెద్దమనుషుల సమాజం మళ్లా అక్కడ చేరి ఉంది. ఆమె అక్కడ అడుగుపెడుతూండగానే వాళ్ల సంభాషణ కొన్నిక్షణాలపాటు ఆగిపోయింది. వాళ్ల కాంక్షాభరితనేత్రాలు ఆమెవైపు తిరిగాయి. ఆడపిల్లలు కూడా ఆమెనే చూస్తూ నిల్చొండిపోయారు. చివరకు న్యగూథీ కూడా ఒక్కక్షణం పాటు తన ఉదాసీనతను పక్కన పెట్టేసింది. బియాట్రిసు  వాళ్లకోసం మద్యం తీసుకుంది. మేనేజరు ఆమె దగ్గరకు వచ్చాడు. కానీ అతడికి ధైర్యం చాలలేదు. అతడేదో మాట్లాడబోయాడు. ఆమె ఎందుకు పని మానేసింది? ఆమె ఎక్కడికి వెళ్లిందీ? ఆమెకీ బారు లో పనిచేయడం ఇష్టమేనా? అప్పుడప్పుడూ కౌంటరు  దగ్గర న్యగూథీకి సాయంగా ఉంటుందా? ఒక బారు  పరిచారిక ఆమెకొక కరెన్సీ నోటు అందించింది. ఒక పెద్దమనిషి ఆమెను తన బల్లదగ్గరకు ఆహ్వానిస్తూ పంపిన సంకేతమది. నాలుగుమూలలనుంచీ మరిన్ని నోట్లు ప్రవహించాయి. అన్నివైపుల నుంచీ ఒకటే ప్రశ్న. ఈ రాత్రికి ఆమె అందుబాటులో ఉంటుందా? వీలైతే నైరోబికి వస్తుందా? ఆమె కౌంటరు వదలిపెట్టలేదు. కానీ వాళ్లందించిన మద్యం ఒక హక్కులాగా స్వీకరించింది. ఇప్పుడామెలో కొత్త అధికారం, కొత్త ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నాయి.

ఆమె ఒక షిల్లింగు తీసుకుని జూక్‌బాక్సులోకి తోసింది. వెంటనే ఆ పెట్టెలోంచి ‘హూన్యూ వా మషంబ’ని పాడుతూ రాబిన్‌సను  మ్వాంగీ కంఠస్వరం వినబడ్డం మొదలయింది. పొలాల్లో పనిచేస్తున్న తిరస్కృతయువతుల గురించి పాడిన పాటది. అతడా పాటలో వాళ్లని నాగరికయువతులతో పోలుస్తూ పాడాడు. అప్పుడామె ఓ ‘కమరు’, ఓ ‘డి. కె’ వాయించింది. మగవాళ్లు కొందరు ఆమెతో కలిసి నాట్యం చేయడానికి ముందుకొచ్చారు. ఆమె వాళ్లను పట్టించుకోలేదు. కానీ వాళ్లట్లా తనచుట్టూ గుమిగూడ్డం ఆమెకు సంతోషమిచ్చింది. అప్పుడామె మరొక ‘డి. కె’ వాయిద్యానికి అనుగుణంగా తన పిరుదులు లయబద్ధంగా కదిపింది. ఆమె దేహం మొత్తం స్వేచ్ఛగా కదిలింది. ఇప్పుడామె స్వేచ్ఛగా ఉంది. ఆమె ఉద్రేకంతో ఊగిపోతూ చుట్టూ గాలి బరువెక్కించింది.

అప్పుడు హటాత్తుగా ఆరింటికి ఆ ఐదుటన్నుల లారీ డ్రైవరు బార్లోకి ఊడిపడ్డాడు. ఈ సారి అతడు మిలటరీఓవర్‌ కోటు తొడుక్కుని కనిపిస్తున్నాడు. అతడి వెనగ్గా ఓ పోలీసు ఉన్నాడు. అతడు చుట్టూ చూశాడు. ప్రతిఒకళ్లి కళ్లూ అతడివైపే తిరిగాయి. కాని బియాట్రిసు  మాత్రం తన పిరుదులు ఊపుతూ నాట్యం చేస్తూనే ఉంది. జూక్‌బాక్సు  సంగీతానికి అనుగుణంగా తన కొన్ని క్షణాల వైభవాన్ని సంతోషంగా గడుపుతున్న ఆ యువతిలో బియాట్రిసుని అతడు మొదట పోల్చుకోలేకపోయాడు. కానీ ఆమెను గుర్తు పట్టగానే ఒక్కసారిగా ‘అదిగో ఆ పిల్లే! దొంగ! దొంగ!’ అని అరిచాడు.

జనాలు తమ కుర్చీల్లో అతుక్కుపోయారు. పోలీసు వెళ్లి ఆమె చేతులకి బేడీలు తొడిగాడు. ఆమె అతణ్ణి వారించలేదు. గుమ్మందాకా వెళ్లాకమాత్రం ఒకసారి తల వెనక్కి తిప్పి ఉమ్మేసింది. అప్పుడామె పోలీసుల వెనకనే అడుగులేసింది.

అంతదాకా బార్లో గంభీరంగా అలముకున్న నిశ్శబ్దాన్ని ఎవరో వేసిన ఛలోక్తి నవ్వుల్లోకి మార్చేసింది. హింస లేకుండానే జరిగిన తీయని దొంగతనం అంటున్నారెవరో. వాళ్లంతా ఆమె గురించే మాట్లాడుకున్నారు. ఆమెను చితకబాదిఉండాల్సింది అన్నారొకరు. ‘ఇట్లాంటి బార్‌ పనిమనుషుల’ గురించి ఈసడిస్తూ మాట్లాడారు మరికొందరు. సమాజంలో పెరుగుతున్న నేరప్రవృత్తి గురించి కలలు అడ్డంగా ఆడిస్తూ విచారం వెలిబుచ్చారు మరికొందరు. ఆస్తులు దొంగతనాలు చేసేవారిని కూడా ఉరితీసేటట్టుగా చట్టం చేస్తే బాగుండదూ? అక్కడున్న వాళ్లకి తెలియకుండానే ప్రతిఒకరి దృష్టిలోనూ ఆ ఐదు టన్నుల లారీడ్రైవరు ఉన్నట్టుండి హీరోగా మారిపోయాడు. వాళ్లు అతని చుట్టూ చేరి మొత్తం జరిగిందంతా చెప్పమని అతణ్ణి ప్రశ్నలతో ముంచెత్తారు. కొందరు అందుకోసం మద్యంకూడా తెచ్చిపెట్టారు. ఇంకా గమనించవల్సిందేమిటంటే వాళ్లంతా అతణ్ణి  ఎంతో శ్రద్ధగా విన్నారు. నిశ్శబ్దంగా అప్పుడప్పుడూ ప్రశంసా పూర్వకంగా కేరింతలాడుతూ మరీ విన్నారు. సమాజంలో ఆస్తిహక్కు మీద జరగబోయిన దాడిని చక్కగా అరికట్టగలిగిన ఈ సందర్భంలో వారందరూ ఒక కుటుంబంగా మారిపోయారు. ఇన్నాళ్లకు ఆ లారీడ్రైవరు కు సామాజిక అంగీకారం లభించింది. అతడు సంతోషంగా తన కథ మొత్తం చెప్పాడు.

కానీ కౌంటరు వెనక న్యగూథీ మాత్రం ఏడుస్తూనే ఉంది.

1976

3 Replies to “కొన్ని క్షణాల వైభవం”

  1. ఆద్యంతం చదివింపజేసే కథ. పరిసరాలు ప్రదేశాలు జీవన వ్యవస్థ కొత్తదైనా అంతరంగ వేదన ఆలోచనాత్మకంగా కథీకరించబడింది ( ఈ ప్రయోగం తప్పేమో ) . రెండు విభిన్న పాత్రల విలోమాసక్తులను నిర్వహించడంలో రచయిత కృతకృత్యుడయ్యాడు. తెగింపుతో తన అనుకున్నది సాధించిన తరువాత శిక్ష అనుభవించడం చాలా చిన్నదిగా అనిపిస్తుందేమో . మీ విశ్లేషణ కై ఎదురు చూస్తూ ఉంటాను .

  2. ప్రతి దేశంలోనూ, ప్రతి కాలంలోనూ బియాట్రిస్ లాటి అభాగ్యులు, వారిని వాడుకుంటూ వారి స్థాయిని ఎదగనివ్వని పెద్దమనుషులూ వుoటూనే వుంటారు. శారద (నటరాజన్) రాసిన మంచీ-చెడు నవల గుర్తుకొస్తున్నది. కథ, కథనం రెండూ బావున్నాయి. ధన్యవాదాలు!

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading