అంటున్నాడు తుకా-12

35

నీ పేరు తలపుకి రాగానే
గొంతు గద్గదికమైపోవాలి.

దీవించు ప్రభూ! మా పొట్టల్లో
ప్రేమ ఉప్పొంగిపోవాలి.

జీవనసంతోషానికి రోమాంచమై
నేత్రాలు ఆనందాశ్రువుల్తో నిండాలి.

అష్టాంగాల్లోనూ
నీపట్ల ప్రేమ పొంగిపొర్లాలి.

నీ కీర్తనలు పాడిపాడి
దేహం పులకించిపోవాలి.

రాత్రింబగళ్ళు నిన్నే తలుచుకుంటాను
తుకా అంటున్నాడు:

కల్పాంతందాకా మరొక పనిచెయ్యను.
సాధుసన్నిధిలోనే శాంతి ఎప్పటికీ.

नाम आठवितां सद्गदित कं । प्रेम वाढे पोटीं ऐसें करीं ॥१॥
रोमांच जीवन आनंदाश्रु नेत्रीं। अष्टांग ही गात्रीं प्रेम तुझें ॥ध्रु.॥
सर्व ही शरीर वेचो या कीर्तनीं । गाऊं निशिदिनीं नाम तुझें ॥२॥
तुका म्हणे दुजें न करीं कल्पांतीं । सर्वदा विश्रांति संतां पाई ॥३॥ (818)

36

ఎవరు తన హృదయమందిరంలో
హరిని కూడబెట్టుకున్నారో

అతడి ప్రయాణం ముగిసిపోయింది
అతడి వ్యాపారం సఫలమయ్యింది.

స్వయంగా హరినే చేతికందాక
ఇంక భయచింతలెక్కడివి?

తుకా అంటున్నాడు: హరి అందాక
మరొకటేదీ కోరుకోబుద్ధికాదు.

सांटविला हरी । जींहीं हृदयमंदिरीं ॥१॥
त्यांची सरली येरझार । जाला सफळ व्यापार ॥ध्रु.॥
हरी आला हाता । मग कैंची भय चिंता ॥२॥
तुका म्हणे हरी । कांहीं उरों नेदी उरी ॥३॥ (713)

37

దేవా! నాదొకటే కోరిక
నాకు ముక్తినివ్వకు.

నేను కోరుకునేది
అంతకన్నా గొప్ప సంతోషం.

ప్రేమసుఖం వైష్ణవుల
ఇంట్లో వసించాలనుకుంటుంది.

వృద్ధీ, సిద్ధీ వాళ్ళ గుమ్మందగ్గర
చేతులు కట్టుకు నిలబడతాయి.

నాకు వైకుంఠవాసం అక్కర్లేదు
అది నిలబడే సంతోషం కాదు.

కానీ నీ నామసంగీతం వినబడేచోట
తలెత్తే సంతోషముందే, అద్భుతం.

ఓ మేఘశ్యామా! నీ నామమహిమ
ఎలాంటిదో నీకు తెలియదు.

తుకా అంటున్నాడు: దానివల్ల
మా బతుకు తీపెక్కుతుంది.

देवा ऐकें हे विनंती । मज नको रे हे मुक्ती । तया इच्छा गति । हें चि सुख आगळें ॥१॥
या वैष्णवांचे घरीं । प्रेमसुख इच्छा करी । रिद्धीसिद्धी द्वारीं । कर जोडूनि तिष्ठती ॥ध्रु.॥
नको वैकुंठींचा वास । असे तया सुखा नास । अद्भुत हा रस । कथाकाळीं नामाचा ॥२॥
तुझ्या नामाचा महिमा । तुज नकळे मेघशामा । तुका म्हणे आम्हां । जन्म गोड यासाठी ॥३॥(1462)

38

నా ప్రేమసంపద చూసుకుంటే
నా లోపల్లోపల ఒక తియ్యదనం.

దేవుడు నా నెచ్చెలి! దేవుడు నా బంధువు!
దేవుడు దీనులందరికీ ఆత్మబంధువు.

తన సమస్త వైభవంతో
మమ్మల్ని సింగారిస్తాడు.

తుకా అంటున్నాడు: ప్రేమ పంచటానికి
దేవుడు మనతో కలిసి ఆరగిస్తాడు.

अंतरींची घेतो गोडी । पाहे जोडी भावाची ॥१॥
देव सोयरा देव सोयरा । देव सोयरा दीनाचा ॥ध्रु.॥
आपुल्या वैभवें । शृंगारावें निर्मळ ॥२॥
तुका म्हणे जेवी सवें । प्रेम द्यावें प्रीतीचें ॥३॥ (35)

1-5-2025

6 Replies to “అంటున్నాడు తుకా-12”

  1. దానివల్ల మా బతుకు తీపెక్కుతుంది .
    నీ నామ సంగీతం వినబడే చోట తలెత్తే సంతోషం . నిర్మల ప్రేమభావం ఉత్పన్న మైతే
    ఆ స్థితి కలగడం అవతలి వారి స్పందనతో పనిలేకుండా సంతోషం కలుగజేయడం కొంతకాలంగా తెలిసివస్తున్నది. రమ్మంటే వచ్చేది కాది పొమ్మంటే పొయ్యేది కాదు .అది ఒక అవిరళ భావపల్లవద్యుతి. గోదాకైనా , మీరా కైనా, కబీరురైనా ,తుకాకైనా , త్యాగయ్యకైనా , జయదేవునికైనా , అన్నమయ్యకైనా ఆలంబనలు వేరు వేరు రూపాలుకాని ఆర్తి రూపమొక్కటే . అందరూ సర్వసమర్పకులే ,సహజ సమర్చకులే. 🙏

  2. “దేవుడు నా నెచ్చెలి!”
    ఎంత మాట!
    ఈ రోజు పరిపూర్ణం ఈ మాట తో, సర్.

  3. “నీ విభుం డారసి నీ నిజం బెరుగు నంతకు నంతకు నోర్వు నెచ్చెలీ!”

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading