
రిచర్డ్ రైట్ గురించి చాలా పెద్ద వ్యాసం రాయవలసి ఉంటుంది. Uncle Toms Children కథలు, Native Son వంటి నవల 12 Million Black Voices: A Folk History of the Negro in the United States వంటి డాక్యుమెంటేషన్ గురించి వివరంగా రాయాలి. అతడి సంక్షుభిత బాల్యం గురించీ, యవ్వనకాలంలో అతడు తానెవరో తాను తెలుసుకోడానికి చేసిన అన్వేషణ గురించీ, ముఖ్యంగా 40-60 దాకా ప్రపంచమంతా కల్లోలభరితంగా ఉన్నప్పుడు, ప్రపంచ రాజకీయాల్లో అమెరికా కొత్త అంతర్జాతీయ శక్తిగా అవతరిస్తున్నప్పుడు, పెట్టుబడిదారీ సమాజానికీ, కమ్యూనిజానికీ మధ్య విభేదాలు ప్రపంచరాజకీయాల్ని ప్రభావితం చెయ్యడం మొదలుపెట్టినప్పుడు, రైట్ ఒక శిబిరం నుంచి మరొక శిబిరానికి, ఒక దేశం నుంచి మరొక దేశానికి ఎలా పరిభ్రమిస్తూ ఉన్నాడో అదంతా కూడా, స్థూలంగానైనా, రాయవలసి ఉంటుంది.
కమ్యూనిస్టుగా, ఆ తర్వాత ఫ్రాన్సులో సార్త్రేకి, సైమన్ డి బోవాకి స్నేహితుడిగా, చివరికి ఫ్రాన్సు వదిలిపెట్టి ఇంగ్లాండులో తనకి ఆశ్రయం వెతుక్కున్నవాడిగా, కమ్యూనిజంతో తెగతెంపులు చేసుకుని, ఆసియా, ఆఫ్రికా దేశాల వైపు చూపు సారించినవాడిగా, రైట్ ప్రపంచమంతా చేసిన ప్రయాణం అతణ్ణి పాల్ రోబ్సన్ వంటివారి కోవలో నిలపగలిగేదని నిశ్చయంగా చెప్పగలం.
రైట్ పుట్టిపెరిగిన కాలంలో నల్లజాతి ఆర్థిక భద్రత కోసం వెతుక్కుంటూ నెమ్మదిగా పౌరహక్కుల కోసం నినదించడం మొదలుపెట్టింది. తమ సమస్యలకు మద్దతిచ్చే క్రమంలో, కమ్యూనిస్టులు సోవియెట్ రాజకీయ ప్రయోజనాల కోసం, స్టాలినిస్టు నరమేధానికి తమని కూడా బలిపశువులుగా వాడుకుంటున్నాయా అని రైట్ అనుమానించాడు. కాబట్టి వారి నుంచి చాలా బాహాటంగానే వైదొలగాడు. తనకి రాజకీయంగా కన్నా కూడా, సామాజికం గానూ, ఇంకా చెప్పాలంటే మానసికంగానూ తోడునిలిచే స్నేహితుల కోసం, సిద్ధాంతాల కోసం వెతుక్కున్నాడు. ఆ వెతుకులాటలో భాగంగా అతడు ఎగ్జిస్టెన్షియలిజం వైపు చూసాడు. కిర్క్‌గార్డ్, హస్రెల్, హిడెగ్గర్‌ల రచనల్ని అధ్యయనం చేసాడు. మరొకవైపు మార్క్స్‌నీ, ఎగ్జిస్టెన్షియలిజంనీ సార్త్రే సమన్వయించడానికి చేసిన ప్రయత్నాలపట్ల అతడు తృప్తి చెందలేదు.
ఈలోపు అతడు రాస్తూ వచ్చిన రచనలపైన స్వదేశంలో సమీక్షలు ఏమంత ప్రోత్సాహకరంగా ఉండేవి కావు. పరాయిదేశాల్లో తలదాచుకోవలసి వచ్చినందువల్ల అతడు స్వదేశీ ప్రభుత్వాన్ని, అధికారుల్ని తీవ్రంగా వ్యతిరేకించలేకపోయేవాడు. పైగా తనలాగా దేశం వదిలిపెట్టి శరణార్థులుగా యూరోప్‌లో తలదాచుకున్న తోటి నల్లజాతి రచయితలతో కూడా అతడికి స్నేహసంబంధాలు స్థిరపడలేదు. మధ్యలో ఒకసారి ఘనా వెళ్ళాడు. అప్పట్లో క్వామే ఎన్‌క్రుమా స్వాతంత్య్రపోరాటాన్ని సాగిస్తున్నాడు. కాని అక్కడ కూడా నిలవలేకపోయాడు. ఇలా నిరంతరం అనిశ్చితిలో, ముఖ్యంగా, ఆలోచనాపరంగా అనిశ్చయంగా జీవించవలసి రావడం అతడి ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఘనాలో ఉండగా తగుల్కొన్న అతిసార వ్యాధి అతణ్ణి నెమ్మదిగా కబళించివెయ్యడం మొదలుపెట్టింది. చివరికి తన 52 వ ఏట, పారిస్‌లో అతడు గుండెపోటుతో మరణించాడు.
సాధారణంగా శక్తిమంతులైన, ప్రభావశీల రచయితల విషయంలో జరిగినట్టే, రైట్‌ని కూడా ఇప్పుడు మళ్ళా అమెరికాతో పాటు ప్రపంచం కూడా నిశితంగా పునఃపఠించడం మొదలుపెట్టింది. ‘పోరాటం తాలూకు అవసరం పట్ల నన్ను జాగరూకుణ్ణి చేసినవాళ్ళల్లో రైట్ కూడా ఒకడు’ అని అమిరి బరాకా అన్నాడు.
అయితే, ఇక్కడ నేను రైట్ ని ఒక రచయితగా, నవలాకారుడిగా, పాత్రికేయుడిగా కాక, ఒక కవిగా పరిచయం చెయ్యాలనుకుంటున్నాను. ఆయన రాసిన కవితల్లో I Have Seen Black Hands (1934) అనేది చాలా గొప్ప కవిత. Mark Strand సంకలనం చేసిన 100 Great Poems of the Twentieth Century (2005) అనే సంకలనంలో ఆ కవిత కూడా చోటు చేసుకుందంటే, రైట్ ఎంత ప్రభావశీలమైన కవినో మనం గుర్తించవచ్చు. కానీ, నేనిక్కడ ఆ కవితను కూడా పరిచయం చెయ్యబోవడం లేదు. అందుకు బదులు, రైట్ రాసిన కొన్ని హైకూలు మీకు అందివ్వబోతున్నాను.
ఒక నల్లజాతి కవి తన గురించీ, తన జాతి విముక్తి గురించీ అన్వేషిస్తున్న క్రమంలో, కమ్యూనిస్టుగా, ఎగ్జిస్టెన్షియలిస్టుగా, రాజకీయ నిరసనకారుడిగా తీవ్రసాహిత్యకృషి చేస్తూ ఉన్నవాడు, హైకూ వైపు ప్రయాణించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తన చివరిదినాల్లో తనని కదలనివ్వకుండా మంచానికే పరిమితం చేసిన అనారోగ్యంలో అతడు 5, 7, 5 సిలబుల్సు లెక్కపెట్టుకుంటూ, ఇంగ్లిషులో 17 సిలబుల్సుతో హైకూలు రాసాడని తెలిసినప్పుడు నివ్వెరపడకుండా ఉండలేం. ప్రసిద్ధులైన యూరపియన్, అమెరికన్ కవులు హైకూలు రాయకపోలేదుగాని, రైట్ లాగా ఆ ప్రక్రియను ఒక జీవితకాలపు అన్వేషణగా హృదయానికి హత్తుకున్నవారు మాత్రం కనిపించరు. అతడు ఆ ప్రక్రియను తనకు ఊరటనిచ్చేదిగా, తనను స్వస్థతపరిచేదిగా ఎంతగా భావించాడంటే, ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగువేల హైకూలు రాసాడు. వాటిల్లోంచి 817 హైకూల్ని ప్రచురణకోసం తనే ఎంపిక చేసుకున్నాడు. రైట్ కుమార్తె జూలియా పూనిక వల్ల Haiku: This Other World (1998) అనే సంపుటిగా వెలుగు చూసాయి. యొషినబు హకుతని, రాబర్ట్ ఎల్ టెనెర్ అనే ఇద్దరు హైకూ పండితులు ఆ పుస్తకానికి రాసిన విపులమైన పరిచయ వ్యాసాన్ని ముగిస్తూ ఇలా అంటున్నారు:
తన జీవితచరమాంకంలో నాలుగువేల హైకూలు రాయడం ఒక రచయితగా అతడి ప్రయాణంలో సంభవించిన మార్పుకి అద్దం పడుతున్నది. కాని అంత కన్నా కూడా అతడి కొత్త దృక్కోణాన్ని, హైకూ రాయడంలో అతడు వెతుక్కున్న కొత్త అభివ్యక్తిని మనం చూడాలి. వస్తువాదమూ, దానికి తోడుగా నిలబడే దురాశా ఈ రెండే జాతుల మధ్య సంఘర్షణకి కారణమనే తన నమ్మకాన్ని రైట్ మునుపటెప్పటికన్నా కూడా మరింత బలంగా నమ్ముతున్నట్టుగా ఈ కవితల్లో కనిపిస్తుంది. జాతివివక్ష గురించిన తన ఈ నమ్మకాన్ని అతడు తన కాల్పనిక సాహిత్యంలో, వ్యాసాల్లో నేరుగా ప్రకటిస్తే, ఈ హైకూల ద్వారా పరోక్షంగా ప్రకటిస్తున్నాడని గమనించాలి.
1
నత్తా, ఏదో ఒకటి తేల్చుకో
నువ్వు ఇంట్లో సగమున్నావు
బయట సగమున్నావు.
2
వానసవ్వడి
మధ్యలో అప్పుడప్పుడు
అడ్డగిస్తూ దగ్గు.
3
ఎండలో కుళ్ళుతున్న
పచ్చికట్టె వాసన చుట్టూ
జీరాడుతున్న వసంతం.
4
ఈ రోజు కడు దీర్ఘంగా ఉంది
మామూలుగా గోలచేసే పిచికలు కూడా
చిత్రంగా మౌనం వహించాయి.
5
గాలివాన తరువాత
గోడమీంచి తొంగిచూస్తూ
నులితీగ.
6
పండుతున్న ఆకులమీద
నిద్రలేని నా కళ్ళమీద
మళ్ళీ మరొక ప్రభాతం.
7
సరసుమీంచి
శీతాకాలపు నల్లని చెట్లు దాటి
పిల్లంగోవి మందస్వరాలు.
8
నా కిటికీలోంచి చూసిన
ఆ మొదటి పువ్వు
మళ్ళీ కనిపించలేదు.
9
తన కాలాన్ని జ్వలిస్తూ
తన జ్వలనాన్ని కాలంతో కొలుస్తూ
ఒంటరి కొవ్వొత్తి.
10
నా కోపం అణగేకొద్దీ
మరింత మెరుస్తున్న వసంతతారకలు
తిరిగి వీస్తున్న మారుతం.
28-1-2025

