
శ్రీ లక్ష్మణమూర్తిగారు ఇటీవల స్వర్గస్థులయ్యారన్న వార్త చాలా ఆలస్యంగా తెలిసింది. ఆయన్ని నేను ఒకే ఒక్కసారి కలుసుకున్నాను, అది కూడా ఇరవయ్యేళ్ళ కిందట. కానీ ఆ ఒక్క సమావేశమే ఆయనతో ఒక జీవితకాలం గుర్తుపెట్టుకునే సాహిత్యానుభవాన్నిచ్చింది. ఆ విశేషాలు అప్పట్లో తెలుగు ఇండియా టుడే లో ‘సాలోచన’ లో పంచుకున్నాను. ఆ తర్వాత ఆ వ్యాసం ‘సోమయ్యకు నచ్చిన వ్యాసాలు’ పుస్తకంలో పొందుపరిచాను. ఇప్పుడు ఆయనకు నివాళిగా ఆ వ్యాసాన్నిక్కడ మరోమారు మీతో పంచుకుంటున్నాను.
లాంగినస్ ప్రాచీన గ్రీకు అలంకారవేత్త. ఆయన సాహిత్యసౌందర్యం గురించి కొంత వివేచన చేశాడు. ఒక మనిషి సాహిత్యవివేచన చేసి, ఏదైనా కృతి రసాత్మకంగా ఉందా లేదా అని చెప్పడానికి ఒక జీవితకాలపు తపస్సు చేయవలసి ఉంటుందని ఆయన అన్నాడని ఐ.ఏ.రిచర్డ్స్ రాశాడు.
సాహిత్య రసవివేచన మానవ సాంస్కృతికవికాసంలో అత్యున్నత పరిణతి. దానికి కేవలం పాండిత్యం చాలదు. తోటి మానవుడి జీవితానుభూతిని తనదిగా సంభావించుకోగల మనఃస్థితి సాధ్యమైనవాడికే అటువంటి హృదయస్పందనం సాధ్యమవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే అదొక ఆధ్యాత్మికసాధన, హృదయసీమలో ప్రకాశించే మెలకువ. పచ్చని పచ్చికబయలుగా తన ఆత్మను ప్రపంచపథికుల కోసం పరచిపెట్టుకోగల సుకుమార రసార్ద్రత.
అటువంటి వ్యక్తిని కేవలం సాహిత్య విమర్శకుడని అనలేం. ఉదాహరణకు, ఐ.ఏ.రిచర్డ్స్‌నే తీసుకుందాం. గత శతాబ్దంలో కొత్తరకం సాహిత్యవిమర్శను పరిపుష్టం చేసిన సాహిత్య తపశ్శీలి అతను. కానీ, అతడు కేవలం సాహిత్యవిమర్శకుడు కాడనీ, తమ గురువనీ, బోధకుడనీ, తమ విమోచనకారుడనీ, అతడి అంతర్దృష్టి వల్లే ఆధునికప్రపంచం తమకు బోధపడిరదనీ క్రిష్టఫర్ ఇషర్‌వుడ్ చెప్పుకున్నాడు.
అటువంటి సాహిత్యపథనిర్మాతలకు మన దగ్గరొక మంచిపదముంది. వాళ్ళని మనం సహృదయులంటాం. కవులెంతమందైనా ఉండవచ్చు. కానీ, సహృదయులరుదు. కవుల సంఖ్య పెరిగిన నిష్పత్తిలో సహృదయులు వికసించకపోతే ఆ జాతి సాంస్కృతికపరిణామంలో ఏదో లోపమున్నట్టు. మన తెలుగునేల మీద మన మధ్యే జీవిస్తున్న అటువంటి అరుదైన సహృదయుల్లో ఆచార్య లక్ష్మణమూర్తి ఒకరు. లక్ష్మణమూర్తిని చూసినప్పుడు ప్రాచీన గ్రీకు ఆలంకారికుడు చెప్పిన మాటలు సాకారద్యోతకమవుతాయి.
నేను ఆయన్ని కలవడానికి వెళ్లేటప్పటికి ఆయన అరవిందుల యోగదర్శనం మీద సంస్కృతంలో ఒక ప్రసంగపాఠాన్ని సిద్ధంచేసుకుంటున్నారు. ‘అరవిందుల మీద ఆకాశవాణివారు సంస్కృతంలో ఒక ప్రసంగాన్ని అడిగారు. అరవిందులు ఉపయోగించిన యోగదర్శన పరిభాషకు సంస్కృతసమానార్థకాల్ని వెతకడం కొద్దిగా కష్టంగానే ఉంది’ అన్నారు.
అది మొదలు, ఇక ఆ తరువాత గడిచిన సమయమంతా అరవిందులు మొదలు మల్లంపల్లి శరభయ్య దాకా ఎందరో సాహిత్యరసవేత్తలు, సాహిత్యపద్ధతులు, సాహిత్యరహస్యాల చర్చగా, సరససన్మిలనంగా మారిపోయింది.కొంతసేపు ఆయన జీవితవిశేషాల గురించి ప్రశ్నలు. తాను యూనివర్శిటీలో ఇంగ్లీషు చదువుకున్నప్పుడే సాయంకాలం కోర్సుగా సంస్కృతం కూడా చదువుకున్నారనీ, వేదాంతశాస్త్రంలో ప్రత్యేకంగా డిప్లొమా కూడా పొందారనీ చెప్పారాయన. విలియం స్టైరాన్ నవలల మీద డాక్టరల్ అధ్యయనం చేశారనీ, నలభయ్యేళ్ళకే కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ కాగలిగారనీ కూడా చెప్పారు.
సంస్కృతాన్నీ, ఇంగ్లీషునీ సమానంగా అధ్యయనం చేసినందువల్ల ఆయన సాహిత్యాధ్యయనం తులనాత్మక అధ్యయనం కాగలిగింది. ‘నన్ను బయటివాళ్ళు సంస్కృతప్రొఫెసర్ అనే అనుకుంటారు. ఎవరన్నా పిలిచినా తెలుగు, సంస్కృతసాహిత్యాల మీద ప్రసంగించమనే పిలుస్తుంటారు’ అన్నారు.
తన అభిమానకవుల గురించి చెబుతూ, ‘సంస్కృతంలో వాల్మీకి, కాళిదాసు, తెలుగులో నన్నయ, విశ్వనాథ ఇక ఇంగ్లీషులోనైతే మిల్టన్, వర్డ్స్‌వర్త్. కానీ, నా తీరిక సమయపు వ్యాపకమంతా న్యూ క్రిటిక్స్‌ని చదువుకోవడమే. సంస్కృతకవిత్వం లేదా ఇంగ్లీషు న్యూక్రిటిసిజం. ఈ రెండూ చదువుకోవడంలో నాకు గొప్ప సంతోషం మాస్టారూ’ అన్నారాయన.
మరి ఆయన రచించిన పుస్తకాలు? అన్నిటిలోనూ బాధాకరమైన విషయమదే. ఆయన రాసిన పుస్తకాలంటూ (తన డాక్టరల్ థీసిస్, ఒక శతకమూ తప్ప) ఏమీ లేవు. రేడియో కోసం సంస్కృతకవులందరి మీదా దాదాపు యాభై ప్రసంగవ్యాసాలు రాసి ఉంటాను. కానీ, ఒక్కటి కూడా మిగల్లేదు. నా విద్యార్థి ఒకరు ఆకాశవాణిలో కూడా ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు వాటిని డిస్పోజ్ చేసేసారు’ అన్నారాయన. కానీ, ఆ మాటల్లో ఏదో పోగొట్టుకున్నారన్న భావమేమీ లేదు. సాహిత్య రససంపన్నులందరితోనూ ఇదే సమస్య. వాళ్ళ దగ్గర మనకు చివరకు దక్కేది కొన్ని ఫ్రాగ్మెంట్స్ మాత్రమే.
అటువంటి తునకలు ఆధారంగానే హిమాలయోన్నతమైన వారి రసపారవశ్యాన్ని మనం అంచనా వేసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు, మల్లంపల్లి శరభయ్య గురించి మాట్లాడుతూ ఆయన అన్నమాట. ‘మామూలుశ్రోత ఒక మాట విన్నప్పుడు అది అతనికి సమాచారంగా, పరిజ్ఞానంగా మారుతుంది. శరభయ్య వంటి భావుకుడి చెవిన పడ్డప్పుడు మాట ఏకకాలంలో పరిజ్ఞానంగానూ, అనుభూతిగానూ కూడా మారుతుంది’.
సాహిత్య పదప్రయోగం గురించి, ఒక పదం ఒక కవిసమయంగా ఎదగవలసిన అవసరం గురించి నేనన్న మాటలకు ఆయన ప్రతిస్పందిస్తూ అన్నారు: ‘ఏదైనా ఒక పదాన్ని ప్రయోగిస్తే దాన్ని విన్నప్పుడు అది శ్రోతలో ఎన్నో సమానభావాల్నీ, సంబంధితభావాల్నీ మేల్కొల్పుతుంది. ఆ భాష ఎంత విస్తృతి కలిగిందైతే ఆ జాగృతి అంత రసమయంగా ఉంటుంది. సంస్కృతానికున్న విశిష్టత ఇక్కడే ఉంది. ఒక భాషగా సంస్కృతానికున్న రిఫరెన్షియల్‌ఏరియా చాలా పెద్దది. కావ్యాల్లో కనిపిస్తుంది, నాటకాల్లో కనిపిస్తుంది. శాస్త్రాల్లో, అలంకార గ్రంథాల్లో కనిపిస్తుంది. పూర్వకవి ప్రయోగాలుంటాయి. సంస్కృతసంప్రదాయంలో పరిపుష్టమైన శిక్షణ పొందిన శ్రోతకి ఒక పదం వినగానే అది కేవలం ఒక పదంగా, ఒక అర్థంతో మాత్రమే కనిపించదు. తన సమస్త సూక్ష్మబంధాల్తోనూ, సహస్ర అర్థఛాయలతోనూ అతణ్ని అవహించేస్తుందది’
ఓ ఉదాహరణ కూడా చెప్పారు. ‘గరిక చూడండి. పైకి ఒకటి రెండు గడ్డిపోచల్లానే కనిపిస్తుంది. కానీ, పెళ్ళగించి చూస్తే దాన్ని అతుక్కుని వేలాదివేళ్ళు ఒకదానికొకటి అల్లుకుపోయిన మహావ్యవస్థ ఒకటి కనిపిస్తుంది. సంస్కృత పదప్రయోగాలు అటువంటివి. కాళిదాసు మేఘసందేశాన్ని చూడండి. ఒక కావ్యంగా అది సాధించే ప్రయోజనం ఇటువంటి సూక్ష్మలోకజాగృతి కలిగించడమే. టీకాతాత్పర్యాలతో చదివితే బోధపడేది కాదది. ఒక పొయెమ్‌గా అది హైలీ ఎవొకేటివ్. ఒక కవిగా నన్నయకీ, తిక్కనకీ మధ్య తేడా కూడా ఇదే’ అని కూడా అన్నారు.
సుదీర్ఘమూ, రసనిష్యందమూ అయిన సాహిత్యసంప్రదాయాన్నుంచి వచ్చిన రసజ్ఞుడు చెప్పిన కవిత ఎలా ఉంటుందో ఆయన ‘గోపికావల్లభా’ శతకాన్ని చూసి తెలుసుకోవచ్చు. ఒక భక్తిధారగా ఆ శతకం మనకు పడ్డాది సుబ్బరాయకవినీ, జనమంచి వెంకటరామయ్యనీ గుర్తుకు తెస్తుంది. కానీ, ఒక సాహిత్యరత్నకోశంగా దానిలో సంస్కృతాంధ్రసాహిత్యసంప్రదాయం అంతస్రోతస్సుగా తెలియవస్తుంది. ‘వికసన్నీల జలేజ కోమలతనూ’, ‘శిఖిపింఛానిబిరీ సనీల చికుర శ్రీకల్పితాషాడ’ లాంటి సంబోధనలు ఒక శిక్షితశ్రోతలో రేకెత్తించగల సంవేదనల తేనెతుట్టెని ఏమని చెప్పగలం?
‘సాలోచన’, ఇండియాటుడే తెలుగు, 2004, సోమయ్యకు నచ్చిన వ్యాసాలు, 2012


ప్రొఫెసర్ లక్ష్మణ మూర్తి గారి గురించి రాసిన మీ వ్యాసం చదువగానే మీరు దేశికోత్తముడు అని సదాశివ కావ్య సుధకు రాసిన ముందుమాట అందులోనే ప్రొఫెసర్ లక్ష్మణ మూర్తి గారు రాసిన వ్యాసం, ఆ పుస్తకావిష్కరణకు ఆవిష్కర్త గా ఆయననను ఆహ్వానించడానికి ఆయన ప్రత్యక్షశిష్యుడే గాక అంతేవాసి కూడా అయిన తమ్ముడు డా. శరత్ బాబుతో వారింటికి వెళ్లడం
ఆయన ఎంతో వాత్సల్యంతో తమ అంతర్గృహ పఠనాలయంలో ఆత్మీయంగా ముచ్చటించటం అన్నీ ఏక కాలంలో రీలులా కనిపించాయి. అనివార్య కారణాల వల్ల మీరు సదాశివగారు ఆనాటి కార్యక్రమానికి హాజరు కాలేక పోవడం జరిగింది. ఆ రోజు సభలో వారి సదాశివ మీద ఒక గొప్ప ప్రసంగం చేసారు. అది నేను విన్న విలువైన సాహిత్య ప్రసంగాలలో ఒకటి. ఆ తరువాతి కాలంలో వారి సోదరులు రంగాచార్య గారి పరిచయం మా కాగజ్ నగర్ కవి వరదాచార్యుల మీద రాసిన వరదాభ్యుదయం కు ముందు మాటకోసం వెళ్లినప్పుడు ఏర్పడింది. అపార పాండిత్య గరిమ కలిగిన ఆ సోదరులను తలచుకుంటే విద్యా దదాతి వినయం అన్నమాటకు సార్థకత చేకూరుతుంది. ఆయన అవ్యాజ ప్రేమానురాగాన్ని ఇప్పటికీ పొందుతూనే ఉన్నాను . ప్రాతః స్మరణీయులైన ప్రొఫెసర్ లక్ష్మణ మూర్తిగారి పాండిత్య ప్రకర్ష తెలియాలంటే మీ వంటి వారి వల్లే అది సాధ్యం. వారికి నివాళులు. మీకు నమస్సులు.
చాలా సంతోషం సార్! మీరు రాసిన ప్రతి ఒక్క వాక్యం నాకు ఎంతో సంతోషం కలిగించింది.
లక్ష్మణమూర్తి గారికి అక్షర నివాళి 🙏🙏
ధన్యవాదాలు మేడం
గొప్ప వ్యక్తిని కలిసిన సందర్భం లో గొప్ప విషయాలు వ్యక్తీకరింపబడటం అత్యంత సహజం …
ముఖ్యంగా ఆచార్య లక్ష్మణ మూర్తి గారు
అసాధారణమైనమేధావి .. సంస్కృతాంధ్రాంగ్లభాషానిష్ణాతులు కావడం కూడా ఒక ప్రధాన కారణం …
మీ వ్యాసాన్ని నేను అప్పట్లో ఇండియా టుడే లో కూడా చదివాను …
నేను వారి తమ్ముడి విద్యార్థి నీ కావడం , నా చిన్ననాటినుండీ వారితో సాన్నిహిత్యం ఉండటం మూలాన ఎన్నెన్ని విషయాలు నేర్చుకోగలిగానో లెక్కేలేదు …
నా షష్టిపూర్తి సందర్భంగా వారు ” దేహళి ” అనే వారి వ్యాస సంపుటిని మమ్మల్ని ఆశీర్వదించి అంకితం చెయ్యడం నా పూర్వజన్మ సుకృతమే …
వారి ” గోపికావల్లభా ” ” సమర్పణం ” కవితా సంపుటులు , ” ఉపనిషత్తులు ” “గీతాంజలి” రేడియో ప్రసంగవ్యాస సంపుటులు ప్రచురించడానికి వారిని ఒప్పించటమే ఇబ్బందైంది … వారు ఏవీ వద్దంటుంటారు …
వారి మృతి జీర్ణించుకోలేని సత్యం … మరొకసారి మీ వ్యాసం ఎన్నో జ్ఞాపకాలని తట్టి లేపింది …
మీరు ఈ వ్యాసం చదవడం నా భాగ్యం. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.