
గత పదిపదిహేనేళ్ళుగా రాస్తూ వచ్చిన వ్యాసాల్లో నాటకానికీ, నాట్యానికీ, సంగీతానికీ సంబంధించిన వ్యాసాలేమున్నాయా అని చూస్తే 45 వ్యాసాలు మాత్రమే తేలాయి. నాటకం పట్ల నాకున్న అనురక్తినీ, ఈ రంగంలో చాలా చేయాలనుకునే నా కలల్నీ బట్టి చూసుకుంటే నిజానికి రాయవలసినంత రాయలేదనే అర్థమయింది. అలానే సంగీతంతో నేను గడిపిన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే సాహిత్యం మీదా, విద్య మీదా, చిత్రలేఖనం మీదా నేను రాసినదానికన్నా ఎక్కువ రాయవలసి ఉందిగాని రాయనే లేదని కూడా అర్థమయింది. కాని, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది, ఈ రంగాలకు సంబంధించిన నా ఆలోచనల్ని ఇలా పుస్తక రూపంలో వెలువరించడానికి.
ఇప్పుడు ఈ 45 వ్యాసాల్నీ ఇలా ‘రసధార’ గా విశ్వావసు ఉగాది కానుకగా మీ చేతుల్లో పెడుతున్నాను. ఈ పుస్తకాన్ని ఇక్కడ డౌనులోడు చేసుకోవచ్చు.
శ్రీ టి.జె.రామనాథం (1939-2000) వంటి ప్రయోక్తతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా భాగ్యమని నాకు చాలా అలస్యంగా అర్థమయింది. నన్నొక నాటకం రాసిమ్మని ఆయన చాలాసార్లు అడిగినా రాయలేకపోవడం నా దురదృష్టం. ఇంక ఇప్పుడు నేను చెయ్యగలిగిందల్లా ఈ పుస్తకాన్ని ఆయన జ్ఞాపకాలకు అంకితమివ్వడమే.
ఇది నా 59 వ పుస్తకం.
ఎప్పట్లానే ఈ పుస్తకాన్ని కూడా మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాను.
29-3-2025


శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు sir 🙏
హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు🙏