జ్యోతిర్మయ రోదసి

మొన్న సాయంకాలం కె.బి.ఆర్ పార్కుపక్కనుంచి వెళ్తున్నప్పుడు నిండుగా వికసించిన ఒక మోదుగచెట్టు హటాత్తుగా పలకరించినప్పుడు-


మోదుగపూలని చూడకుండానే ఈ మాఘమాసం
గడిచిపోయిందనుకున్నాను, కాని, నా కోసం కూడా
బెంగపెట్టుకుంది పలాశం.

ప్రతి ఒక్కదాన్నుంచీ నువ్వు దూరంగా జరిగినప్పుడు
నీనుంచి ప్రతి ఒక్కటీ దూరంగా జరిగినప్పుడు-
అప్పుడు కూడా
ధూసరవర్ణ క్షేత్రాలమీద, పొగలాంటి అడవులమ్మట
ప్రసరించే విద్యుత్కాంతి ప్రవాహానికి
నిలబెట్టిన రాగిచుట్టల్లాగా
ఎగరేసిన జెండాల్లాగా ఎలుగెత్తిన పద్యాల్లాగా
మోదుగలు పూసే కాలమొకటి ఉంటుంది.

ఎర్రని మట్టిగాజుల చేతుల్తో నేల
నింగిముఖాన్ని తనవైపుకు తిప్పుకునే తావులుంటాయి.
అడవులు కొండలు పల్లెలు పొలాలు
కించిద్విద్యున్మయ రాగమొకటి సాధనచేస్తూంటాయి.
నువ్వు నడవక తప్పని ఆ బీడుభూముల్లో కూడా
వికసించే రోచిర్మయ కాలమొకటి ఉంటుంది.

కాలం రెండు విధాలు: న్యూసు పేపర్ల కాలమొకటి
పూలూ పక్షులూ, చెట్లూ చేమల కాలమొకటి.
వార్తాపత్రికలు నిన్ను తమవైపు గుంజుకోవాలని చూస్తాయి.
నువ్వేమో పక్షులవైపు, పలాశలవైపు పయనించాలని
పెనగులాడుతుంటావు.

చిరకాలంగా నడుస్తున్న
ఈ నలుగులాటనుంచి
నిన్ను బతికిస్తున్నదేది?
శీర్ణపత్రశుష్కకాలానికి ఆవలవున్న
అనుగ్రహసీమ.

అక్కడ మోదుగచెట్ల అడివిలో
పాడుతున్నవాళ్ళెవరో కనబడరుగాని
పాట వినిపిస్తూనే ఉంది.
వృద్ధి క్షీణతల కాలాన్నిదాటి
నువ్వొక్క అడుగూ వేసే కొద్దీ
నీకొక ఆశీర్వాదం తోడు రావడం
గమనిస్తున్నావు కద!

అయినా ఇంకా మాటిమాటికీ మధ్యలో
వెనుదిరిగి చూస్తావెందుకు?
నువ్వీ దైనందినకక్ష్య దాటాలేగాని
ఆపైన ఉండేదంతా జ్యోతిర్మయ రోదసి.

7-3-2025

12 Replies to “జ్యోతిర్మయ రోదసి”

  1. మా తలపుల్లోనూ వికసించాయి మోదుగలు 🙏🙏🙏

  2. “నువ్వొక అడుగు వేసే కొద్ది నీకొక ఆశీర్వాదం తోడు రావటం “

      1. జ్యోతిర్మయ రోదసి కోసం ఎదురు చూస్తూ….

  3. “నువ్వు నడవక తప్పని ఆ బీడుభూముల్లో కూడా
    వికసించే రోచిర్మయ కాలమొకటి ఉంటుంది”

  4. మీ ఇంప్రెషనిస్టిక్ వర్ణచిత్రాలు చూస్తుంటే మోనెట్ చిత్రాలు చూస్తున్నంత అనుభూతి. మీ కవిత్వానికి తావి.

  5. Multiple times చదువుకున్నాను ఈ కవితని.
    పలాశం అంటే తెలియలేదు. తెలుసుకున్నాను.

    “ జ్యోతిర్మయ రోదసి” -title అద్భుతంగా వుంది.

    “ ఎలుగెత్తిన పద్యాల్లాగా
    మోదుగలు పూసే కాలం”
    “ అక్కడ మోదుగచెట్ల అడివిలో
    పాడుతున్నవాళ్ళెవరో కనబడరుగాని
    పాట వినిపిస్తూనే ఉంది.”

    ఊళ్ళో మోదుగ చెట్టు జ్ఞాపకం
    మోదుగ ఆకులు విస్తర్లు కుట్టిన జ్ఞాపకం

    “ నువ్వీ దైనందినకక్ష్య దాటాలేగాని
    ఆపైన ఉండేదంతా జ్యోతిర్మయ రోదసి”

    ఎందుకో this poem makes me feel very melancholic every time I read it. Not able to articulate what is happening inside.
    Beautiful paintings, sir.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading