
అదే వీథి, అడ్డదిడ్డంగా అవే కరెంటుతీగలు
అదే దుమ్ము, అవే బిల్డింగులు
అదే మార్కెటు, అవే హారన్లు
వాటిమధ్య అకస్మాత్తుగా
ఆకుపచ్చని ఫౌంటెను తెరిచినట్టు
మా ఇంటిముందు కానుగచెట్టు.
పండగరోజుల్లో గంగిరెద్దు
ఇంటిముందుకొచ్చినట్టు
ఇప్పుడీ కానుగచెట్టు మా వీథిలో.
గంగిరెద్దూ తనే
సన్నాయి ఊదుతున్నదీ తనే
మధ్య లో ఉండీ ఉండీ
నెమలీకల కుచ్చు పైకెత్తి
నోరారా దీవించినట్టు
తెరలు తెరలుగా
ఒక మిలమిల.
ఇన్నాళ్ళుగా చీకటినేలలో
ఆ వేర్లు ఏ సంగీతసాధన చేసాయో
ఇప్పుడిలా చెట్టు మొత్తం
ఒక నాదస్వరంగా నినదిస్తున్నది.
కాలం ఒకచెట్టుతో
ఇలా రాగాలాపన చేయించగలదని
నాకిప్పటిదాకా తెలీదు.
తానున్నచోటనే ఉంటూ
వెలుగునిట్లా విరజిమ్మగల
విద్య నాకెవరూ నేర్పలేదు.
కొమ్మల్లోంచి గగనంలోకీ
గగనమ్మీంచి కొమ్మల్లోకీ
పక్షులు ఎగురుతున్నట్టు,
తిరిగి మళ్ళా వాలుతున్నట్టు
చెట్టు నిండా
ఒక ధగధగ.
చెట్టుకీ, సూర్యుడికీ మధ్య
యుగాలుగా నడిచే ఒక సంభాషణ-
నాకు ఆ మాటలు అర్థంకావట్లేదుగానీ
ఆ భాష చిరపరిచితమే.
ఏ పారా పలుగూ లేకుండానే
కరచరణక్లేశంలేకుండానే
బంగారాన్నిట్లా
తవ్వితీయొచ్చని నాకిప్పుడే తెలిసింది.
వెలుతురు ఊట
చేతాళాల గణగణ-
ఈ గంగిరెద్దు ఇక్కడున్నంతకాలం
ప్రతిరోజూ పండగే.
20-2-2025


Lovely, sir.
Thank you !
ధన్యవాదాలు
ఎంత గొప్ప తన్మయీభావ కవిత. ఇన్నాళ్ళుగా చీకటినేలలో
ఆ వేర్లు ఏ సంగీతసాధన చేసాయో
ఇప్పుడిలా చెట్టు మొత్తం
ఒక నాదస్వరంగా నినదిస్తున్నది.
అద్భుతమైన కల్పన . నమస్సులు.
ధన్యవాదాలు సార్
అత్యద్భుతం మాష్టారూ
ధన్యవాదాలు మేడం
Brilliant sir, brilliant.
నెమలీకల కుచ్చు పైకెత్తి
నోరారా దీవించినట్టు
తెరలు తెరలుగా
మిల మిల….
మీ కవిత్వ భాష కూడా అనాదిగా నేను ఈ ప్రకృతిలో వింటున్నదీ పోల్చుకో ప్రయత్నిస్తున్నదీ…అందుకే మీరు కవిత రాసిన ప్రతిసారీ, ఆ రోజంతా నా హృదయం సంతోషంగా ఆ వాక్యాలు పాడుకుంటుంది.
ధన్యవాదాలు మానసా!
ఎంత imagination ఈ కవిత నిండా !
చాలా బాగుంది సార్.
ధన్యవాదాలు సార్!
ఆకుపచ్చని గంగిరెద్దు.. lovely sir నమస్సులు
ధన్యవాదాలు సార్
వసంతాగమనానికి సూచనగా ఆ లేతాకు పచ్చదనం, ఆ లేత నునుపుల మెరుపుదనం, ఆ గంగిెద్దుల పోలిక బాగు బాగు…💚💛💚
ధన్యవాదాలు ప్రసూనా
అసలు నిన్నటి నుండి ఇటువంటి కవిత కోసం ఎదురు చూస్తున్నా..
నిన్న నే నాకో కోయిల జంట కనిపించింది.. అందులో ఆడ కోయిల రివ్వున వచ్చి వయ్యారంగా ఓ పచ్చని చెట్టు మీద వాలినపుడు, చాతయీ.. కాకుండా మొబైల్ తో ఫోటో తీసుకున్నాను.
గాలి కానుగాకుల తో చేరి గానం చేయడాన్ని- కాలం చెట్టు తో చేసిన రాగాలాపన అనడం- చాలా బాగుంది.
ధన్యవాదాలు మేడం