
1
నేనేదో ఒక మాయచేసి
మనుషుల్ని మోసగించను.
నీ పాటలు పాడుకుంటాను.
పదే పదే నిన్ను తలుచుకుంటాను.
నాకు మూలికల గురించి తెలియదు,
మహిమలు చూపించేవాణ్ణీ గాను.
నాకు శిష్యబృందాల్లేవు.
యాచకుణ్ణని చెప్పుకోడానికి సిగ్గుపడను.
మఠాధిపతినిగాను
భూములు సంపాదించినవాణ్ణీగాను.
దేవతార్చనలు చేసేవాణ్ణిగాను
అలాంటి దుకాణం తెరిచినవాణ్ణీగాను.
దెయ్యాల్ని వదలగొట్టేవాణ్ణిగాను
జాతకాలు చెప్పేవాణ్ణీగాను.
ఒకటిచెప్పి మరొకటి చేసే
ప్రవచనకర్తను అసలే కాను.
నెత్తిన అగ్నిహోత్రం పెట్టుకుని
మంత్రాలు వల్లించేవాణ్ణిగాను.
జపమాల పట్టుకుతిరిగేవాణ్ణిగాను
చుట్టూ పాషండుల్ని పోగేసుకునేవాణ్ణిగాను.
మహత్వం పెంచే స్తంభన, సమ్మోహన మంత్రాల
ఉచ్చాటనలూ, ఉపచారాలూ చేసేవాణ్ణిగాను.
నేనలాంటివాణ్ణెవరినీగాను
తుకా అంటున్నాడు:
నేను నరకంలో మగ్గే పిచ్చివాణ్ణిగాను . (272)
2
ఎవరన్నా నాతో’నువ్వు కవివయ్యా అనొచ్చు.
కానీ నా వాక్కు నాది కాదు.
నా పాటల్లో కనబడేది నా యుక్తికాదు
ఈ లోకాన్ని నడిపిస్తున్నవాడే నాతో పాడిస్తున్నాడు.
పామరుణ్ణి నేనేమి చెప్పగలను
గోవిందుడు ఏది పలికిస్తే అది పలుకుతున్నాను.
ఆయన ఏది కొలవమంటే అది కొలవడమే నా పని
నాదంటూ ఏమి లేదు, మొత్తం నా యజమానిదే.
తుకా అంటున్నాడు: నేను నమ్మకస్తుడైన పనివాణ్ణి
ఆయన నామముద్ర మోసుకుతిరిగేవాణ్ణి. (1007)
మరాఠీ మూలం
1
कपट कांहीं एक । नेणें भुलवायाचें लोक ॥१॥
तुमचें करितों कीर्त्तन । गातों उत्तम ते गुण ॥ध्रु.॥
दाऊं नेणें जडीबुटी । चमत्कार उठाउठी ॥२॥
नाहीं शिष्यशाखा । सांगों अयाचित लोकां ॥३॥
नव्हें मठपति । नाहीं चाहुरांची वृत्ति ॥४॥
नाहीं देवार्चन । असे मांडिलें दुकान ॥५॥
नाहीं वेताळ प्रसन्न । कांहीं सांगों खाण खुण ॥६॥
नव्हें पुराणिक । करणें सांगणें आणीक ॥७॥
नाहीं जाळीत भणदीं । उदो म्हणोनि आनंदी ॥८॥
नेणें वाद घटा पटा । करितां पंडित करंटा ॥९॥
नाहीं हालवीत माळ । भोंवतें मेळवुनि गबाळ ॥१०॥
आगमीचें नेणें कुडें । स्तंभन मोहन उच्चाटणें ॥११॥
नव्हें यांच्या ऐसा । तुका निरयवासी पिसा ॥१२॥
2
करितों कवित्व म्हणाल हें कोणी । नव्हे माझी वाणी पदरींची ॥१॥
माझिये युक्तीचा नव्हे हा प्रकार । मज विश्वंभर बोलवितो ॥ध्रु.॥
काय मी पामर जाणे अर्थभेद । वदवी गोविंद तेंचि वदें ॥२॥
निमित्त मापासी बैसविलों आहें । मी तों कांहीं नव्हे स्वामिसत्ता ॥३॥
तुका म्हणे आहें पाईकचि खरा । वागवितों मुद्रा नामाची हे ॥४॥
2-2-2025


నేను నమ్మకస్తుడైన పనివాణ్ణి
ఆయన నామముద్ర మోసుకుతిరిగేవాణ్ణి…
పోస్టు చివరలో ఈ వాక్యాలు ఆ వచనాలకి ఒక
బ్యూటిఫుల్ ముద్ర వేశాయి.
ధన్యవాదాలు
ప్రవచనకర్రలు చదివితే బాగుండు!
అవును సార్
ఉన్నావా అసలున్నావా అని దేవుని ప్రశ్నించిన సినిమా తుకారాముని చూసాము. నా వాక్కు నాది కాదు,పలికించే గోవిందుడిదే అని పలికిన
నిజ తుకారాముని మీరు చూపించారు.నమస్సులు
మీరు ఈ పోస్ట్ చదివారంటేనే నాకు ఎంతో సంతోషం కలిగింది. ధన్యవాదాలు శ్రీధర్ గారూ!
నేను నమ్మకస్తుడైన పనివాని ఆయన నా( రా)మ ముద్ర మోసుకు తిరుగువాని 👌👌👌
అనే పదాలు చదవగానే మదిలో.. అ నారదమహర్షి మళ్లీ భక్తతుకారంగా అవతరించాడేమో అనిపించింది.. 🙏
ధన్యవాదాలు