
ఈ రెండేళ్ళుగా గడిపిన నా జీవితంలో విలువైనదంటూ ఉంటే, ఇదుగో, ఈ ఈశ్వర స్తుతి గీతాలు తెలుగు చేసిన క్షణాలు కూడా. వెనక్కి తిరిగి చూసుకుంటే, కిందటేడాది ఈ గీతాల్ని నేను తెలుగు చేస్తున్నప్పుడు, నాకు తెలీకుండానే నా చుట్టూ ఒక అంధకారం అల్లుకుంటూ ఉంది. తీరా నేను చీకట్లో చిక్కుకున్నానని తెలిసిన తరువాత, ఆ రోజుల్ని తలుచుకుంటే, ఆ కాలంలో నాకు తెలీకుండానే నా చుట్టూ ఉన్న సజీవ మానవ ప్రపంచంలో, నాకు నిజంగా దక్కిన వాటా సర్వేశ్వరుడే అని నెమ్మదిగా అర్థమయింది. అంటే మనుషులు లేరని కాదు, మనుషుల్తో నాకు బంధాలు లేవనీ కాదు. కానీ మనుషుల్తో నా అనుబంధాల్లో ఈశ్వరుణ్ణి కనుగొనకపోతే ఆ అనుబంధాలు బరువు తప్ప మరేమీ కాదు. అందుకని మనుషులు కనబడ్డప్పుడు కూడా, మరీ ముఖ్యంగా మనుషులు కనబడ్డప్పుడల్లా, అక్కడ ఈశ్వరుడున్నాడా అని వెతుక్కుంటున్నాను. వాళ్ళ వైపు నుంచే కాదు, ముఖ్యంగా నా వైపు నుంచి కూడా.
అందుకని ఈ ఈశ్వరస్తుతి గీతాలు ఆగమగీతాలు కూడా. ఈశ్వరుడు నిన్ను సదా కనిపెట్టుకుని ఉన్నాడని పదే పదే చెప్పే గీతాలు. ఈశ్వరకృపకు మనం ఎలుగెత్తి ధన్యవాదాలు చెప్పాలని గుర్తుచేసే గీతాలు. అందుకని లోక రక్షకుడు ఉదయించిన ఈ రోజున, ఎంతో పవిత్రమైన ఈ రోజున, ఈ పుస్తకాన్ని మళ్ళా మీతో పంచుకుంటున్నాను.
ప్రభువు ఎవరిని ప్రేమిస్తాడో
ఆ ఇల్లు దేవుడు కట్టకపోతే రాళ్ళెత్తిన కూలీలది వృథాశ్రమ. ప్రభువు నగరాన్ని కాచి చూసుకోకపోతే కావలివారు రాత్రంతా మేలుకుని వృథా.
నువ్వు పొద్దున్నే లేచిపరిగెత్తడం, రాత్రి ఆలస్యంగా పక్కమీదకు చేరడం నీ శ్రమ, నీ ఆరాటం సమస్తం వృథా- ప్రభువు ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళకి మాత్రమే విశ్రాంతిని కానుకచేస్తాడు.
తెలుసుకో, పిల్లలు ప్రభువు ప్రసాదించే వారసత్వం. వాళ్ళని నవమాసాలు మోసినందుకు బహుమానం.
వీరుడైన విలుకాడి చేతిలో శరాల్లాంటివాళ్ళు నీ యవ్వనకాలంలో నీకు పుట్టిన సంతతి. అట్లాంటి పిల్లల్తో అమ్ములపొది నింపుకున్నవాడు ధన్యుడు. గుమ్మం దగ్గర విరోధుల్తో వాదించేటప్పుడు అతడికి అవమానపడే అగత్యం కలగదు.
(యాత్రాకీర్తన, సొలోమోను కృతి, కీర్తనలు, పాతనిబంధన, 127)
Images courtesy: Wikimedia commons
24-12-2024


మీ పవిత్ర కరకమలములకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు…
ఈ ఈశ్వర ప్రసాదాన్ని నా సహచరులతో ఇప్పుడే పంచుకున్నాను….🙏🙏🙏
ధన్యవాదాలు బాలయ్య గారూ!🙏
ఎంత మంచి మాటలు sir. మన బంధాలు, అనుబంధాలు, సన్మానాలు,అవమానాలు అన్నీ ఈశ్వర దత్తమే అనుకుంటే ఎంత ప్రశాంతత దొరుకుతుంది! అదే ఈశ్వరుడిని విస్మరిస్తే ఇవన్నీ ఎంతటి బరువు! ఈ పుణ్య దినాన మీరిచ్చిన ఈ కానుక కి ధన్యవాదాలు.
ధన్యవాదాలు మేడం
బోధకుడు యేసయ్య పుట్టిన రోజు మీ పుస్తకం నాకు చేరటం ఎంత గొప్ప అనుభూతి. నాకు కూడా భక్తి కవిత్వం, భక్తి గీతాలు ఎంతో ఇష్టం. చాలా సాంత్వన కలుగుతుంది. మీ పుస్తకం త్వర త్వరగా చూసాను. మనసుకి చాలా ఆనందం కలిగింది. చదువుతాను మాస్టారూ. ఇంత గొప్ప సంపదని మాకు అందచేస్తున్న మీ సహృదయతకి ఎలా కృతజ్ఞతలు చెప్పాలి మాస్టారూ….
మీరు చదవడమే నాకు పదివేలు. హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టారూ!
ఎంతో ప్రశాంతత ను ప్రసాదించేవి ఆగమగీతాలు. 🙏
ధన్యవాదాలు మేడం