ఆ ప్రసంగమే ఒక పురస్కారం

సుంకర గోపాల్ ని మొదటిసారి విజయవాడలో కొన్ని శేఫాలికలు ఆవిష్కరణ రోజు విన్నాను. అంత అనర్గళంగా, అంత భావస్ఫోరకంగా మాట్లాడే వక్తల్ని ఈ తరంలో నేను చూడలేదు. ఎంత భావోద్వేగంతో మాట్లాడుతున్నా ఎక్కడా ఔచిత్యం, సంయనమం కోల్పోని వాగ్ఝరి ఆయనది. కిందటి నెలలో కవిసంధ్యవారి తరఫున నాకు శిఖామణి జీవనసాఫల్య పురస్కారం అందించినప్పుడు యానాంలో జరిగిన సభలో గోపాల్ నా కవిత్వం మీద మాట్లాడేడు. కాని ఆ రోజు సమయం చాలక ఆయన మాట్లాడాలనుకున్నదంతా మాట్లాడలేకపోయాడు. కాని ఆ ప్రసంగం దానికదే ఒక పురస్కారమని అర్థమయింది. అందుకని తాను రాసుకున్నది నాకు పంపించమని అడిగాను. ఇదుగో, అలా పంపించిందే ఆ వ్యాసం.


భద్రుని కవిత్వాన్ని మూటలకెత్తినప్పుడు

వాడ్రేవు చినవీరభద్రుడు. ఈ పేరు సాహిత్యంలో ఏ స్థాయిలో వినిపిస్తుందో కనిపిస్తుందో మనకు తెలుసు. ఆయన ఏ ప్రక్రియ చేపట్టినా అందులో వేలు కాదు, హృదయం పెట్టాడు. పైనున్న ఆకాశం, రాత్రి మెరిసే నక్షత్రాలు, తేనె రంగు చంద్రుడు, మామిడి చెట్టు, దాని పూత, పండు, కదిలే మేఘం, కోయిల పాట, సూర్య కాంతి, వీటన్నింటినీ చూసి భద్రుడు పసిపిల్లాడిలా ఆశ్చర్యపోతాడు. భద్రుడు మొదటి మూడు సంపుటాలు పరిశీలిస్తే ప్రత్యేకమైన భాషను రూపొందించుకున్నట్టుగా తెలుస్తుంది.

కలిసి పనిచేసే క్షణాలు, సంపద సృష్టించే క్షణాలు, సంఘంగా మారిన క్షణాలు అయ్యో నేను మనిషిగా రూపొందేక్షణాలు కాకుండా పోతున్నాయి

అంటూ భద్రుడు కలవరపడ్డాడు . ‘నిర్వికల్పసంగీతం’, ‘ఒంటరి చేల మధ్య ఒక్కత్తే అమ్మ’, ‘పునర్యానం’ తర్వాత, ఆయన కవిత్వ నిర్మాణంలోనూ, భాషలోనూ మార్పుని స్పష్టంగా గమనించవచ్చు. ఒక పూర్తి పరివ్రాజకుడిగా ఎట్లా బతకాలో అన్వేషణ కనిపిస్తుంది. కవిత్వం భౌతిక విజయ సాధనం కాదనే తన మిత్రుని నమ్మకాన్ని ఆయన బలపరిచాడు.

అస్తిత్వాల్ని, ఆరాటాలని, పోరాటాలని కవిత్వంలోకి తీసుకురావడాన్ని భద్రుడు వ్యతిరేకించలేదు. తనని తాను త్యజించుకోవడాన్ని సాధన చేస్తున్నాను అంటాడు. తనని తాను నిలదీసుకోవడానికి కవిత్వాన్ని ఎంచుకున్నాడు. మనలో ఉన్న ఆధిపత్య వాసనల్ని జాగరూకతతో పట్టుకోగలిగితే సమాజానికి మనమెంత మేలుచేయగలమో అనేది భద్రుని విశ్వాసం.

నా కవిత్వం ప్రజల కోసం కాదు. సాహిత్య విమర్శకుల ఆమోదముద్ర కోసం కాదు. నా కీర్తి కోసం కాదు. నా కవిత్వం మీకు తెలిసిన ఇతర ఏ కారణాలవల్ల కాదు. నాతృష్ణ, నా ప్రశ్న, నా తత్వం, నా అభిలాష ఒకటేమిటి నా చైతన్యమంతా ఎల్లలు లేని ఒక హోంసిక్ నెస్ నుంచి పొంగిందే

అని ప్రకటించిన కవికి తాను వేసుకున్న దారిలో అలా హాయిగా నడవడం తెలుసు. మన కవిత్వానికి మనకు మించిన పరీక్ష అధికారి ఎవరు ఉంటారు?

మొట్టమొదటి మానవుడు ఎక్కడి నుంచి స్ఫూర్తి పొంది ఉంటాడు? అతనేమీచూసి పాటై ఉంటాడు? అతను ఎక్కడి నుంచి వాక్యాన్ని పలికి ఉంటాడు? మొట్టమొదటి మానవుడి కేక అనుకోండి, అరుపు అనుకోండి, సంభ్రమం, విభ్రమం, ఉద్వేగం, ఉత్సాహం ఏదైనా అది చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి పొందిన అనుభూతి అయి ఉంటుంది.

పంచభూతాలు అతని కవితా వస్తువులు. పక్షి , కీటకం, ఆకురాలిన శబ్దం, కొమ్మ విరిగిన చప్పుడు , వాన పాడిన పాట, వాగు నడిచే నడక, మాట్లాడుతున్న నది ఇట్లా భద్రుడు వీటన్నిటిని తన కవిత్వంలో వ్యక్తీకరించాడు.

కవిత్వం అంటే సృజనాత్మక రూపం దాల్చే విశిష్టత. విశిష్టత సాధించగల అతి గొప్ప సృజనాత్మక రూపం విశిష్ట జీవితమే. అప్పుడు జీవితమే కవిత్వం అవుతుంది కవిత్వమే సత్యం కాదు. సత్యమే కవిత్వం.

అని భద్రుడు పలికిన మాటలు ఆయన కవిత్వానికి పునాదులు.

ఆదిమమానవుడు లేదా అడవి మనిషి యొక్క మొట్టమొదటి వ్యక్తీకరణ అనుభూతే. మనుషులు గుంపులుగా, ముఠాలుగా , మందలుగా కూడుకున్నాక తేడాలు, భేదాలు క్యూ కట్టాయి. వీటన్నింటినీ బద్దలు కొట్టి మళ్ళీ అట్లాంటి మానవ ఉద్వేగాలు, అంటే, స్వచ్ఛమైన ఉద్వేగాలు – వాటి ప్రకటన భద్రుని కవిత్వంలోని అంతస్సారంగా కనిపిస్తుంది.

భద్రుడి ఏడు కవిత సంపుటాలు చదివిన తర్వాత నేను ఆయన ఆత్మను పట్టుకోలేదు కానీ వారి మానసిక సంస్కారాన్ని అంచనా వేయగలిగాను. ఆయన బయలుదేరిన సమయంలో అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకున్నాయి. అదే సమయంలో ఇస్మాయిల్, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ , కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ అజంత, మోలాంటివారు గొప్ప స్పందన కలిగిన కవిత్వాన్ని రాస్తూ ఉన్నారు. అప్పటికే భద్రుడు ఉన్నతమైన ప్రతిభావంతమైన మానవ శక్తిగా ఎదిగి ఉన్నాడు. పుస్తకాలను ప్రేమగా లోపలకి తీసుకుంటున్నాడు. మానవ సమూహాన్ని తీక్షణంగా చూస్తున్నాడు. ప్రకృతిని హృదయంతో చూస్తున్నాడు. రక్తం నిండా సరికొత్త జీవశక్తి తొణికిసలాడుతోంది. నిర్వికల్ప సంగీతం కవితా సంపుటిని చదివితే ఈ విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. ఆ కవిత్వం అలవాటైన మన నిమగ్నతను భగ్నం చేస్తుంది. ధ్వంసం చేస్తుంది. గణాచారిగా ఊగిపోతున్న భద్రుడు కనిపిస్తాడు. అప్పుడు రాస్తున్న వస్తున్న కవిత్వపంథాలో ఆ కవిత్వం ఉండదు. చాలా సున్నితమైన భావాలను కవిత్వం చేసినట్లుగా తెలుస్తుంది. మానవ చేతనకు సంబంధించి అంతర్ లోకాల్లో కనిపించే చేతనలు కనిపిస్తాయి. చేతన అచేతనల సమ్మేళనం కనిపిస్తుంది.

ఇస్మాయిల్ కవిత్వంలో తెరలు మనకు తెలుస్తాయి. భద్రుడి తెరలు తెలుసుకోలేం. అంతః చేతనకు సంబంధించిన సున్నితమైన అంశాలను మనముందు ఉంచుతాడు. పద్యాన్ని సెన్సిటైజ్ చేయడం కనిపిస్తుంది. మానవీయ భావనలు కొత్తగా చూపారు. నిర్వికల్పసంగీతం చదువుతున్నంతసేపు మన చుట్టూ కొత్త కాంతివలయం వలుకుంటుంది అనుభూతి పంజరం అలా చుట్టుకుంటుంది. అయితే అది ఎట్లాంటి అనుభూతి చెప్పడం సాధ్యంకాదు. ప్రకృతి, మానవజీవన మమేకం, రోజువారి జీవితం కేంద్రకంగా కవితలు సాగుతాయి. కవిత్వానికి సరికొత్త గతిశీలతగా అనిపిస్తుంది. చాలా విలువైనదే కానీ చేతికి దొరకదు. అంటే ఆ కాలానికి అది పాదరసం లాంటి కవిత్వం. ఫస్టాఫ్ ఇట్స్ కైండ్ అనే మాట దానికి వర్తిస్తుంది. ఆ వాక్యాలను మనం గుర్తుపెట్టుకోలేం. కవిత్వాన్ని గుర్తుపెట్టుకునేటట్లు రాయడం ఎంత గొప్ప లక్షణమో గుర్తుపెట్టుకోలేనట్లుగా రాయడం కూడా అంతే గొప్ప లక్షణం. మనం దొరకబుచ్చుకోవడంలో కష్టపడుతున్నామంటే అందులో ఏదో ఉన్నట్లు లెక్క. భద్రుడి కవిత్వం చలిలో నీరెండ నులివెచ్చదనాన్ని అనుభవించడం, నిర్వికల్ప సంగీతం తెలుగు పాఠకులకు అలవాటైన కవిత్వం కాదు. సరికొత్త సృజనకు నిదర్శనం. సృజన అంటే ముందు ఉండేది కాదు అంతకు ముందు ఉండేది తిరిగి చెప్తే సృజన కాదు. అంతకు ముందు లేనిదై ఉండాలి. ఎంత సున్నితమైన అంశాలను పట్టుకోగలిగితే కవిత్వంలో అంత లోతు ఉన్నట్లు లెక్క. బైరాగి, గురజాడ, శ్రీశ్రీ ల ప్రభావం కూడా కనిపిస్తుంది.

ఒక కవి పెరిగిన వాతావరణం కవిత్వంలో తొంగి చూస్తూనే ఉంటుంది. ఆయన పెరిగిన ఆ శరభవరం ప్రాంత కొండల వనాల మొదటి ఊపిరి కవిత్వం అవుతూఉంది. శరభవరం చనుబాల ప్రాణశక్తి ఉంది. ఆయన ఇంట్లో భక్తి, చుట్టూ జానపదాలు, జాతరలు; అడవి పూల మొక్కల నీడలు , ఇంట్లో పురాణ ఇతిహాసాల జాడలు ఇట్లా తెలియకుండానే ఒక అంతఃసంఘర్షణ. ఆయన మొట్టమొదట రాసిన కవిత్వంలో వాక్యం నిండా కుదురైన ఆవేశం కనిపిస్తుంది. భద్రుడు కవిత్వంలో తన ఆత్మను విముక్తం చేసుకున్న కవి. నిర్వికల్పసంగీతంలో ‘సంగమం కోసం’, ‘ఒక స్త్రీవక్షోజంకోసం’, అలాగే టైటిల్ కవిత, ‘సత్య పూర్ణ’ లాంటి కవితలు చదవాలి. ‘పెరట్లో వెన్నెల’ కవిత చదివాక ఆయన ఊహాశక్తికి కాసేపు నేను ఊయల ఊగాను. ‘వెన్నెల శాసనాల్లా కొబ్బరాకులు’ అనే మాట ధ్యానంలో ఉన్న కవి నుండి వస్తుంది. పెద్దాపురం సూర్య దేవాలయాన్ని నెపంగా చేసుకొని రాసిన కవితలో ‘ఆకలి జీవిస్తున్న మృత్యువు’ అన్నాడు. ‘సూర్యుడిని నిర్మించింది ఆకలి’ అనే వాక్యంతో కవితను ఆపేస్తాడు. ఆ ముగింపు దగ్గర నుంచి మనం అలాగే ఆగిపోయి ఆశ్చర్యపోతాం.

ఆకులు రాలిన అరణ్యంలోకి
కోకిల ప్రవేశించే కాలంలో
నన్ను కన్నాది మా అమ్మ
ఆమెకు అనేక నమస్కారాలు.

ఈ నాలుగు వాక్యాల నీడలు ఆయన కవిత్వంలో కనిపిస్తూనే ఉంటాయి. అందులోనే ఆయన రాసిన ‘నా ఊరు గురించి గీతం’ అనే కవిత, ఆయన కవిత్వానికి మేనిఫెస్టో లాంటిది. ఆధునిక జీవితానికి ఆధునిక కవిత్వానికి మధ్య సరిహద్దు చెరిపేదే తన ప్రయత్నమని ఆయన చేసిన ప్రకటన వాస్తవం. ఆయన పొందని దానిని ఆయన కవిత్వం చేయలేకపోయాడు. అతనిది కానిదేదీ అతను రాయలేకపోయాడు.

‘ఒంటరిచేల మధ్య ఒక్కతే అమ్మ’ కవితా సంపుటిలో ఆయన మనకు చాలా దగ్గర అవుతాడు. ఒక ప్రత్యేక భాషను గమనించ వచ్చు. ‘సెలవు, రాజమండ్రీ, సెలవు’ ‘నూర్జహాన్’, ‘ప్రవాసం ఒక యుద్ధ రహస్యం’, ‘లోలిత’ , ‘చెరుకు తోటల కొసల మీంచి’, ‘ఒక్క ఖడ్గం దొరికితే చాలు’, ‘ఈ రోజు ఎంత ప్రియమైన రోజు’, ‘ప్రియమైన రెండు అశ్లీల పద్యాలు’ ఇట్లాంటి కవితలు మనకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి.

నువ్వు శబ్దాన్ని మృదువుగా నీ స్వర పేటికలో మడిచి పెట్టగానే
చెదిరిన అనేకవేల నా ఆత్మ శకలాలు ఒకటిగా చేరతాయి

ఒక గాయని గురించి రాసిన అత్యంత గొప్ప వాక్యాలు ఇవి. పొలాల్లో నాట్లు వేస్తున్న స్త్రీలను ఉద్దేశించి ‘వంగిబారులు తీరి తదేక దీక్షలో ఈ స్త్రీలు తమ చేతులతో రచిస్తున్నదేమిటి?’ అని అమాయకంగా అడుగుతారు. మట్టి మనుషుల్ని ఒక్కటి చేస్తుందంటాడు. 1991 లో దక్షిణాఫ్రికా అధ్యక్షులు నెల్సన్ మండేలా మన దేశ పర్యటనకు వచ్చిన సందర్భంలో రాసిన కవిత ఆయన ఎంత సామాజికుడో తెలుపుతుంది.

ఈరోజు చాలా ప్రియమైన రోజని. ఆయన మన దేశానికి వచ్చిన సందర్భంలో పళ్ళతో పువ్వులతో నవ్వులతో నాట్యాలతో స్వాగతం పలికినా, చిట్లిన వీపుతో, ఒంగిన నడుముతో, బరువెక్కిన వదనంతో, పొలాల్లోంచి, వీధుల్లోంచి చూసే సామాన్య జనం ఉంటారు.

27 ఏళ్ల పాటు జైల్లో ఉన్నావన్న ఒకే ఒక ఆశ్చర్యం తప్ప
మా ప్రభుత్వాధినేతలకు నువ్వు మరేమీ కావు
జైలు నిర్మించడమే తప్ప జైళ్లు తెలియని వాళ్ళకి
ఈ రెండు రోజులు నువ్వు ఒక గర్వ కారణమైన బందీవి.

అని అంటాడు. అంతేనా!

చూసిన దేశం నా దేశం కాదు
నీకు నా అసలయిన దేశాన్ని చూపించాలని వుంది.
ఉక్కలో చెమటలో కిక్కిరిసిన బస్సుటాపు పైన కణకణలాడే ఎండలో
రైతుల మధ్య కూలీల మధ్య దళారీల మధ్య చోటుకోసం
కిక్కిరిసిన ధూళిలో
నిన్ను నా వూరు తీసుకువెళ్ళాలని వుంది.

అంటాడు.

రాయాలంటే ఏదో ఒక ఉద్వేగం తాళజాలనంతగా కమ్ముకు రావడమే కాదు, రాయాలంటే గొప్ప ప్రేమ కూడా కలగాలి. లోకం పట్ల ఎంతో బాధ్యత గా చేయాలి, ఆ పని నా తరంలో పైకి వస్తున్న ఎంతోమంది యువకుల్లో ఆవేశం ఎక్కువ ప్రేమ తక్కువ. నేను వాళ్ళ లాంటి వాడినే ఉద్వేగం ప్రేమగా వికసించేదాకా ఓపిక పట్టడమే నేను చేయగలిగింది.

అని ఆయన ఒక చోట రాసుకున్నారు. తన కవిత్వం గురించి తాను అడుగడుగునా బేరీజు వేసుకుంటూ సాగిన కవి భద్రుడు.

కోకిల ప్రవేశించే కాలం నాటికి ఆయన భాష నిర్మాణపరంగా తనని తాను తగ్గించుకున్నట్లు తెలుస్తుంది. తగ్గినప్పటికీ చాలా సరళమైన వాక్యాలతో, పదాల సారళ్యం, నిరాడంబరత, సూటిదనం భావ సౌందర్యంతో కవిత్వం ఉంటుంది.

దైనందిన జీవితంలోని అలసట, నిరాసక్తత, నగర జీవితంలోని కిక్కిరిసినతనాన్ని చిత్రీకరిస్తూనే, నగర జీవితాన్ని కంటే ముందు గడిపిన పల్లె జీవితంలో ఉండే సజీవతను, అప్పటి ఆశని, వసంతాన్ని, ఆ బాల్య కాల వైశాల్యాన్ని పునః పునః స్మరించడం కనిపిస్తుంది.

ఆ ఒక్క కూజితంతో కోకిల
నా నగర జీవితాన్నంతా ఒక మూలకు తుడిచేసింది

అని అంటారు.

ఒక కోకిల లోకం కోసం గొంతు సవరించాలంటే
లోకం కూడా కోకిల కోసం చెవులు రిక్కించాలి

నీటి రంగుల ప్రపంచంలో మరో నిర్మాణం వైపు వెళ్లారు. పద్యాల లాగా నాలుగు పాదాలతో ప్రోస్ పోయెమ్ నిర్మాణమది. ‘ఇంధనం అగ్నిగా మారినట్టు ప్రతిరోజూ ఒక పద్యంగా మారిన’ తనాన్ని చూడొచ్చు. పాలు గారే ప్రపంచాన్ని కోరుకున్నాడు. కవిత రాసే సమయంలో మన భౌతిక మానసిక పరిసరాలు ఎలా ఉంటాయో భద్రుడు చెప్పాడు. ముందు కవిగా మన గుండె చీల్చుకుని ఆపై శ్రోతల గుండెను చీల్చమంటాడు. గంప చంక నెత్తుకుని కొమ్మ కొమ్మని తడిమి కూరగాయలు కోసినట్లు, కవితలు కూర్చడం ఆరోగ్యవంతులు చేయగలరని నిర్ధారిస్తారు. జీవితమంతా తనను పొద్దున్నే నిద్ర లేపుతూ దుప్పటి లాగే నాన్నను తలచుకున్నాడు. పురిటివాసన కోసం వెతుకులాట కనిపిస్తుంది. దీపం పట్టుకుని వచ్చే అమ్మ కోసం ఎదురుచూస్తున్నాడు. ఎంతో అమాయకంగా జీవించిన అమ్మని గురించి గొప్పవాక్యాలు రాశారు.

ఆమెకు తెలిసిందేదో మాకు తెలియనే లేదు, జీవించక
తప్పని ఈ ఒక్క జీవితాన్నీ నిశ్శేషంగా జీవించడమెట్లానో.

‘కొండమీద అతిథి’లో నన్ను నేను ఎండకట్టుకోవడం కోసమంటూ ఆకుపచ్చ కుండపోత కనిపిస్తుంది. వెనక్కి వెళుతూ జ్ఞాపకాలు నెమరు వేయడం కనిపిస్తుంది. రాష్ట్ర విభజన అప్పటి దిగులు కనిపిస్తుంది. మనలోని ఆధిపత్య వాసనాల్ని మనం ఎంత జాగ్రత్తతో పట్టుకోగలిగితే సమాజానికి అంత మేలు చేయగలుగుతాం అనే నమ్మికతో సాగుతుంది. సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచవలసిన అవసరాన్ని గుర్తించమంటాడు.

క్రిస్మస్ రోజుల్లో అడవి దారిలో పయనిస్తూ ఇంద్రవెల్లి, ధనోర, గుడిహత్నూర్ లలో కట్టుకోవడానికి గుడ్డలు కూడా నోచుకోని తల్లుల్ని పిల్లల్ని చూస్తూ

పయనించాలి విజ్జీ, మనం
ఆరునెలకొకసారైనా
వెతుక్కుంటూ, ఈ అడవి బాటన
మనని మనం గుర్తుపట్టడానికి

అని అనడం ద్వారా ఏం ఆశిస్తున్నారో అర్థం అవుతుంది.

విల్లమ్ములు, తుపాకులు, తుడుంమోత,
చెక్ డ్యామ్లు, పత్తి చేలు, కరువు ఋణాలు
తోసుకుంటూ దారి చేసుకుంటూ
పిల్లలతో నడు ముందుకి

విజ్జీ, ఇది మన వూరు, మన అడివి

ఈ చివరి వాక్యాలలో ఆయన రాసిన వూరు, అడివి పదాలు గమనించాలి. మనం ఏ కవినీ పూర్తిగా చదవడం మానేశాం. చాలా త్వరగా కొన్ని నిర్ధారణలకు వచ్చేస్తాం. ఏవో కొన్ని మాటలు నమ్మి దాన్ని చదవడం ఆపేస్తాం. ‘కొండమీద అతిథి’లో ‘ఎయిర్ హోస్టెస్’ కవిత చదవాలి.

ఆమె లాగానే మనం చెప్పవలసిన నాలుగు మాటలు చెప్పేసి అందరితో కలిసి మౌనంగా పైకి ఎగరాలనే నిర్ధారణకు వచ్చేస్తాం.

ఆ తర్వాత వచ్చిన ‘కొండ కిందపల్లె’ చాలా అద్భుతమైన కవిత్వంగా సాగింది. ఆయనలోని దర్శన గుణానికి విశ్వరూపం ఈ కవితా సంపుటి. మన కవిత్వం మన గురించి మాట్లాడుతుంది. కవిత్వంతో మనం సంభాషించకపోతే మనం నిలిచిపోయినట్టే. మన కవిత మనల్ని కదిలించిందా లేదా చదివించిందా అనే తూకాన్ని సరిగ్గా చూసుకోవాలి. ‘కొండ కిందపల్లె’ కవిత సంపుటి మొత్తం గొప్ప వ్యక్తీకరణలు ఉన్నాయి. తన కూతురు అమృత పూర్ణ అమెరికా ప్రయాణమైనప్పుడు రాసిన కవితచదవాలి. అందులో ఆయన అంతరంగం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కవితా సంపుటిలో భూమితో సంభాషించే రైతులు 270 ఎకరాల నీటిపంజరం కొల్లేరు విధ్వంసం, శానిటైజర్, రాజవొమ్మంగి నూకాలమ్మ జాతరలో తెచ్చుకున్న ఈల, బీజాక్షరాలు, పొలాల పక్కన నిద్ర లేవడం ఒక ప్రార్ధన లాంటి కవితలు ఎవరినైనా చదివింపజేస్తాయ్. ఆయన కవిత్వంలో రైతులు, పంటచేలు, ఊడ్పులు, కోతలు, గిరిజన గ్రామదేవతల ప్రస్తావనలు కనిపిస్తూనే ఉంటాయి.

ఇంకా తెల్లవారకుండానే
కోతలకు వచ్చిన రైతు కూలీలాగా
కిటికీ పక్క పక్షుల కిల కిల
అప్పుడు నువ్వేమీ చేయకపోయినా
నిద్ర లేస్తే చాలు
ఒక కొడవలి నీ చేతి కందినట్టే ఉంటుంది.

బరువు తూచే యంత్రం మీద రాసిన కవిత చూడండి, మన బరువు దిగిపోయి, తేలిక పడిపోతాం.

డబ్బాలో పడ్డ నాణెం
చీటీగా మారినట్టు
లోపల చప్పుడు చేసిన భావమేదో
కవితగా బయటకొస్తుంది
భలే క్షణాలు
బరువు తూచుకోగానే
బరువు దిగిపోయినట్టు అనిపిస్తుంది

భద్రుడు సాయంకాల గగనం మీద కొంగలబారు ఎగిరినప్పుడల్లా దాస్యం లేని దేశాన్ని ముక్కున కరిచి చేస్తున్నట్లే ఉందంటాడు. ఏమి భావన ఇది. తాను ఏ స్వాతంత్య్రాన్ని వాగ్దానం చేయలేననీ, కనిపించని ఊడిగాలని కనుక్కోవడం మీదనే దృష్టి పెట్టాననీ ‘కొండ కింద పల్లే లో స్పష్టపరిచాడు. చివరగా ఆయన చేసిన కొన్ని కొత్త ఊహల్ని, అభివ్యక్తులనిపరిశీలిద్దాం.

‘ఏటి ఒడ్డున నీటి చెలమఆకాశాన్ని విరబూసింది’

‘ఎవరో వెలుగును గంపలకెత్తుతున్నారు’

‘పద్యం పలకలేని కవిని నేను
నా బదులు ఆకాశం కరిగి కన్నీరు అయింది’

‘పాలు పడుతూ తల్లి బిడ్డని రొమ్ముమార్చినట్టు
సూర్యుడిని ఉత్తరోన్ముఖం చేస్తుంది ఆకాశం’

‘పువ్వులో పురుగులా మృత్యువు పొంచి ఉంటుంది’

‘రసాలూరే పండ్ల లాగా చెమట స్రవించే కండలు’

‘గడప దగ్గర దోసిలి పట్టి నిలుచున్న దిగంతం’

‘వాన మందలు’, ‘వాన పిట్ట’, ‘నది మీద పద్మాసనం వేసుకున్న నావలు’ ‘ఎండ విసిరిన వల’- ఇట్లా జాబితా చాలానే ఉంది.

భద్రుడు సోషల్ పోయెట్ కాదనే వాదన కూడా ఉంది. బహుశా ఇది అతన్ని అసమగ్రంగా చదివి చెప్పిన స్టేట్మెంట్ గా అనిపిస్తుంది. ఆయన రాసిన ‘గ్రీష్మఋతువులో రంజాన్’ అనే కవిత చదవండి. ‘రంజాన్ రోజుల్లో మెహదీపట్నం’ కూడా చదవండి. ఇంకా ఇట్లాంటి జాబితా చాలానే ఉంది.
అవును.

కలసి ప్రార్థన చేసిన వాళ్ల ధన్యులు
ఈ లోకం వాళ్ల కోసం మరింత తేటపడుతుంది
కలసి ఉపవసించిన వాళ్ళు ధన్యులు
ఈ లోకం వాళ్ల కోసం మరింత శుభ్రపడుతుంది.
కూడి కూడారగించిన వాళ్ళ ధన్యులు
ఈ లోకం వాళ్ల కోసం మరింత పక్వమవుతుంది.

వాడ్రేవు చినవీరభద్రుడిని చదివిన తర్వాత మనం కూడా తేటపడతాం, శుభ్రపడతాం, మరింత పక్వమౌతాం.


సుంకర గోపాల్, 94926 38547

17 Replies to “ఆ ప్రసంగమే ఒక పురస్కారం”

  1. ఏదో వ్రాసా ననుకొనే భ్రమ నుండి బయటపడ్డాను

  2. గొప్ప వ్యాసం సర్. మీ కవిత్వం పై ఇంత విశ్లేషణాత్మక సమగ్ర వ్యాసం చదవటం సంతోషం గా ఉంది. గోపాల్ సమర్థుడు. మీ కవితాఝరి ని వాక్యాలలోకి మల్లించగలిగాడు.
    ఇరువురికి అభినందనలు.

  3. ఎంత బాగా అధ్యయనం చేసారో మీ కవిత్వాన్ని .
    “ఒక కోకిల లోకం కోసం గొంతు సవరించాలంటే
    లోకం కూడా కోకిల కోసం చెవులు రిక్కించాలి”
    సుంకర గోపాల్ గారు అలాంటి పాఠక లోకం ప్రతినిధి. ఆస్వాదించడానికి ఒకసారి చదివితే చాలు. కానీ ఇలా విశ్లేషించాలంటే తరచి తరచి చదవాలి . మీకూ సుంకర గోపాల్ గారికీ అభినందనలు.

  4. ఒక పురస్కార సభలో , ఆ పురస్కారం కంటే ప్రసంగమే ఒక పురస్కారం అంటే , ఆ ప్రసంగం ఎలా ఉందని చదివాను. డా.సుంకర గోపాల్ తన ప్రసంగంలో వాడ్రేవు చిన వీరభద్రుడు గారి ఆత్మను పట్టుకోగలిగారు. నిజానికి చినవీరభద్రుడుగారు కవిత్వమే కాదు, ఆయన వచనాన్ని కూడా కవిత్వమయం చేయగల సౌందర్య పిపాసి. ఆయన అరకులోయ మీద రాసిన వ్యాసం నాకిప్పటికీ గుర్తే. ఆ గిరిజన జీవితాలు, ఆ ప్రకృతి, దాన్ని అల్లుకోనే మంచు దుప్పట్లను వర్ణించిన తీరు అద్భుతం. ఆయన నిరంతర అన్వేషి. ఇరువురికీ నమస్కారం.

  5. మీ కవిత్వం చదివినంత హాయిగా వుంది ఈ మదింపు. ఏవైతే అనుభూతులు మన నుండి పైకి లేస్తాయో సరిగ్గా వాటినే సున్నితంగా పట్టుకున్నాడు గోపాల్. ఈ రోజుల్లో చలాగ్గా రాస్తున్న గోపాల్ వ్యాసాలు చదవడం మంచి అనుభవమే. మీ ఇరువురకి అభినందనలు.. కృతజ్ఞతలు..

  6. బాగుంది సర్

    సవిస్తరంగా మీ కవిత్వ కోణాలను అన్నిటినీ కలిపి కుట్టిన వ్యాసం

  7. గోపాల్ ప్రసంగ వ్యాసం ఆసాంతం చదివాను సర్
    మీ కవిత్వంలో మమేకమై ఆత్మను విశ్లేషించాడు.
    నిశ్చల ప్రవాహం లోని తేట నీటిని దోసిలి లో నింపుకొని అర్ఘ్యమిస్తున్నట్లు గా, మిమ్మల్ని పరివ్రాజకులు గా అభివర్ణించి
    అందులో మీ ప్రతిబింబాల్ని మాకు చూపించాడు.మీకూ,మా గోపాల్ కు అభినందనలు

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading