
మూడవ అధ్యాయం
45
అది శూన్యరూపం కాదు, అశూన్య రూపమూ కాదు
అది శుద్ధరూపమూకాదు, విశుద్ధరూపమూ కాదు
నిజానికి అది రూపమూ, విరూపమూ కానే కాదు
పరమార్థ తత్త్వానిది తనదైన సహజ స్వరూపం.
46
వదిలిపెట్టు, సంసారాన్ని వదిలిపెట్టు
వదిలిపెట్టు, అన్నివేళలా వదిలిపెట్టు.
త్యాగాత్యాగాలు రెండూ విషతుల్యాలే.
ఉన్నదొక్కటే శుద్ధం, సహజం, అమృతం.
నాలుగవ అధ్యాయం
1
ఆవాహన చెయ్యడమూ, ఉద్వాసన చెప్పడమూ
లేనప్పుడు ఇక పువ్వులూ, పత్రీ ఎలా ఉంటాయి?
ధ్యానమెక్కడ? మంత్రాలెక్కడ? నా శివార్చన
ఎంత సమమో, అంత అసమం కూడా.
2
నేకు కేవలం బంధవిబంధ ముక్తుణ్ణి కాను
కేవలం శుద్ధవిశుద్ధాలనుండి ముక్తుణ్ణి కాను
యోగవియోగాలనుంచి మటుకే ముక్తుణ్ణీగాను
పూర్తి విముక్తుణ్ణి, ఆకాశంతో పోల్చదగ్గవాణ్ణి.
3
ఇదంతా పుడుతున్నదనే మాట నిజమే
ఇదంతా పుడుతున్నదనే మాట నిజంకాదు కూడా
నాలో నాకెటువంటి వికల్పమూ కలగటం లేదు
నిర్వాణ స్వరూపుణ్ణి, వికారాలు అణగినవాణ్ణి.
4
నేనేదీ అంటుకున్నవాణ్ణికాను, అంటుకోనివాణ్ణీ కాను
నాకు దగ్గరగా ఉన్నవాణ్ణిగాను, దూరంలోనూ లేను
నాకు నాకన్నా భిన్నమైందేదీ కనిపించనివాణ్ణి
నిర్వాణ స్వరూపుణ్ణి, సకల వికారాలు అణగినవాణ్ణి.
5
ఎరుకలేని వాడికి ఎరుకలభించినస్థితి కాదు నాది
ఎరుక కలిగితే ఎలా ఉంటుందో కూడా తెలియనివాణ్ణి
ఎరుక కలగడం, ఎరుకలేకపోడం గురించి ఎలా చెప్పను
నిర్వాణ స్వరూపుణ్ణి, సకల వికారాలు అణగినవాణ్ణి.
6
ధర్మానికి కట్టుబడలేదు, పాపానికీ కట్టుబడలేదు
బంధాలకి కట్టుబడలేదు, మోక్షానికీ కట్టుబడలేదు
కట్టుబడటం, బయటపడటం రెండూ తెలియనివాణ్ణి
నిర్వాణ స్వరూపుణ్ణి, సకల వికారాలు అణగినవాణ్ణి
7
పరులూ, పరులు కానివాళ్ళూ అంటూ లేరునాకు
మిత్రుల్లేరు, శత్రువుల్లేరు, మధ్యస్థులూ లేరు
కాబట్టి ఒకటిమంచిదనీ, ఒకటి కాదనీ ఎలా చెప్పేది?
నిర్వాణ స్వరూపుణ్ణి, సకల వికారాలు అణగినవాణ్ణి.
8
నేను ఉపాసకుణ్ణికాను, అలాగని ఉపాస్యదేవతనీగాను
నేను ఉపదేశాన్నిగాను, ఆచరించవలసిన క్రియనీగాను
కాబట్టి సంపూర్ణజ్ఞానం గురించి ఏమని చెప్పగలను?
నిర్వాణ స్వరూపుణ్ణి, సకల వికారాలు అణగినవాణ్ణి.
9
వ్యాపించిందంటూ లేదు, వ్యాపించబడేదీ లేదు
ఒకదానికి ఆశ్రయమైనదంటూ లేదు, ఆశ్రయంకానిదీ లేదు
కాబట్టి శూన్యాశూన్యాల గురించి నేనేలా చెప్పేది?
నిర్వాణ స్వరూపుణ్ణి, సకల వికారాలు అణగినవాణ్ణి.
10
గ్రహించేవాడు లేడు, గ్రహించదగ్గదీ లేదు
నాకొక కారణమూ లేదు, కార్యమూ లేదు
ఇక చింత్యం, అచింత్యం అంటూ ఏమని చెప్పేది?
నిర్వాణ స్వరూపుణ్ణి, సకల వికారాలు అణగినవాణ్ణి.
11
తెగ్గొట్టేదంటూ లేదు, తెగ్గొట్టబడేదీ లేదు
తెలుసుకునేవాడు లేడు, తెలుసుకోదగ్గదీ లేదు
కాబట్టి నాన్నా, రాకపోకలంటూ ఏమని చెప్పగలను?
నిర్వాణ స్వరూపుణ్ణి, సకల వికారాలు అణగినవాణ్ణి.
12
నాకు దేహం లేదు, దేహం లేకపోడమూ లేదు
బుద్ధి, మనస్సు, ఇంద్రియాలంటూ లేనివాణ్ణి
కాబట్టి రాగమనీ, విరాగమనీ ఎలా చెప్పగలను?
నిర్వాణ స్వరూపుణ్ణి, వికారాలు అణగినవాణ్ణి.
13
పేర్కొన్నంతమాత్రాన అది ప్రత్యేకమనికాదు
పేర్కొనకపోయినంతమాత్రాన అదృశ్యమూ కాదు
మిత్రమా! అది సమాసమం అని ఎలా చెప్పను?
నిర్వాణ స్వరూపుణ్ణి, సకల వికారాలు అణగినవాణ్ణి.
14
ఇంద్రియాల్ని జయించలేదు, జయించకనూ పోలేదు
నన్ను నేను అదుపులో పెట్టుకునే నియమాలు నావి కావు
మిత్రమా, జయాపజయాల గురించి నేనేమని చెప్పేది?
నిర్వాణ స్వరూపుణ్ణి, సకల వికారాలు అణగినవాణ్ణి.
15
నేనెప్పటికీ ఒక మూర్తినిగాను, అమూర్తినీ గాను
నాకెన్నటికీ ఆదిమధ్యాంతాలన్నవి లేనేలేవు
ఇక, మిత్రమా! బలాబలాల గురించి ఏమని చెప్పను?
నిర్వాణ స్వరూపుణ్ణి, సకల వికారాలు అణగినవాణ్ణి.
16
తండ్రీ! నాకు మృత్యువు లేదు, అమరత్వం లేదు
విషావిషాల్లేవు, నాకెన్నటికీ పుట్టుక లేదు
కాబట్టి శుద్ధాశుద్ధాలగురించి ఏమని చెప్పను?
నిర్వాణ స్వరూపుణ్ణి, సకల వికారాలు అణగినవాణ్ణి.
17
నాకు స్వప్నం లేదు, జాగృతిలేదు
యోగనిద్రలేదు, రాత్రింబవళ్ళు లేవు
ఇక తుర్యం, అతుర్యం అని దేని గురించి చెప్పేది?
నిర్వాణ స్వరూపుణ్ణి, సకల వికారాలు అణగినవాణ్ణి.
18
అన్నింటినుంచీ పూర్తిగా బయటపడ్డవాణ్ణని తెలుసుకో
నన్నెటికీ మాయ కమ్మదు, సమ్మోహం ఆవరించదు
కాబట్టి సంధ్యావందనాది కర్మల గురించి ఏమని చెప్పను?
నిర్వాణ స్వరూపుణ్ణి, సకల వికారాలు అణగినవాణ్ణి.
మూడవ అధ్యాయం
45
న శూన్య రూపం న విశూన్యరూపం
న శుద్ధరూపం న విశుద్ధరూపం
రూపం విరూపం న భవామి కించిత్
స్వరూపస్య పరమార్థతత్త్వమ్.
46
ముంచ ముంచ హి సంసార త్యాగం ముంచ హి సర్వథా
త్యాగాత్యాగవిషం శుద్ధమమృతం సహజం ధ్రువమ్.
నాలుగవ అధ్యాయం
1
నావాహనం నైవ విసర్జనం వా
పుష్పాణి పత్రాణి కథం భవంతి
ద్యానాని మంత్రాణి కథం భవంతి
సమాసమం చైవ శివార్చనం చ.
2
న కేవలం బంధవిబంధముక్తో
న కేవలం శుద్ధవిశుద్ధముక్తః
న కేవలం యోగవియోగముక్తః
స వై విముక్తో గగనోపమోహమ్.
3
సంజాయతే సర్వమిదం హి తథ్యం
సంజాయతే సర్వమిదం వితథ్యం
ఏవం వికల్పో మమ నైవ జాతః
స్వరూపనిర్వాణమనామయోహమ్.
4
న సాంజనం చైవ నిరంజనం వా
నా చాంతరం వాపి నిరంతరం వా
అంతర్విభిన్నం నహి మే విభాతి
స్వరూపనిర్వాణమనామయోమహమ్.
5
అబోధబోధో మమ నైవ జాతో
బొధస్వరూపం మమ నైవ జాతం
నిర్బోధబోధం చ కథం వదామి
స్వరూపనిర్వాణమనామయోమహమ్.
6
న ధర్మయుక్తో న చ పాపయుక్తో
న బంధయుక్తో న మోక్షయుక్తః
యుక్తం స్వయుక్తం న చ మే విభాతి
స్వరూపనిర్వాణమనామయోమహమ్
7
పరాపరం వా న చ మే కదాచిత్
మధ్యస్థ భావో హి న చారిమిత్రం
హితాహితం చాపి కథం వదామి
స్వరూపనిర్వాణమనామయోమహమ్.
8
నోపాసకో నైవముపాస్యరూపం
న చోపదేశో న చ మే క్రియా చ
సంవిత్స్వరూపం చ కథం వదామి
స్వరూపనిర్వాణమనామయోమహమ్.
9
నో వ్యాపకం వ్యాప్యమిహాస్తి కించిత్
న చాలయం వాపి నిరాలయం వా
అశూన్యశూన్యం చ కథం వదామి
స్వరూపనిర్వాణమనామయోమహమ్.
10
న గ్రాహకో గ్రాహ్యకమేవ కించిత్
న కారణం వా మమ నైవ కార్యం
అచింత్యచింత్యం చ కథం వదామి
స్వరూపనిర్వాణమనామయోమహమ్.
11
న భేదకం వాపి న చైవ భేద్యం
న వేదకం వా మమ నైవ వేద్యం
గతాగతం తాత కథం వదామి
స్వరూపనిర్వాణమనామయోమహమ్.
12
న చాస్తి దేహో న చ మే విదేహో
బుద్ధిర్మనో మే న హి చేంద్రియాణి
రాగో విరాగశ్చ కథం వదామి
స్వరూపనిర్వాణమనామయోమహమ్
13
ఉల్లేఖమాత్రం న హి భిన్నముచ్చై-
రుల్లేఖమాత్రం న తిరోహితం వై
సమాసమం మిత్ర కథం వదామి
స్వరూపనిర్వాణమనామయోమహమ్.
14
జితేంద్రియోహం త్వజితేంద్రియో వా
న సమ్యమో మే నియమో న జాతః
జయాజయౌ మిత్ర కథం వదామి
స్వరూపనిర్వాణమనామయోమహమ్.
15
అమూర్తమూర్తిర్న చ మే కదాచిదా-
ద్యంతమధ్యం న చ మే కదాచిత్
బలాబలం మిత్ర కథం వదామి
స్వరూపనిర్వాణమనామయోమహమ్.
16
మృతామృతం వాపి విషావిషం చ
సంజాయతే తాత న మే కదాచిత్
అశుద్ధశుద్ధం చ కథం వదామి
స్వరూపనిర్వాణమనామయోమహమ్.
17
స్వప్నః ప్రబోధో న చ యోగముద్రా
నక్తం దివా వాపి న మే కదాచిత్
అతూర్యతూర్యం చ కథం వదామి
స్వరూపనిర్వాణమనామయోమహమ్.
18
సంవిద్ధి మాం సర్వవిసర్వముక్తం
మాయా విమాయా న చ మే కదాచిత్
సంధ్యాదికం కర్మ కథం వదామి
స్వరూపనిర్వాణమనామయోమహమ్.
5-11-2024


🙏🙏🙏
బందో ముక్తో భవిష్యసి!
ఆకాశమే దద్దరిల్లి
వాన చినుకుల మేను తడిసి
మట్టివాసన నిన్ను పిలిచి
హృదయమే ఉప్పొంగినా
తనువంత వేణువై రాగాల తేలిన
బతుకంత జీవన నావ గా సాగినా
బందో ముక్తో భవిష్యసి..
ఏ క్షణమైనా ఏ బంధమైనా విముక్తి.
నీలి ఆకాశంలో సూర్యోదయం
పిట్టల కూతల
నెమలి సయ్యాటల
జలపాతాల కనువిందుల
రాగరంజితమౌ హరివిల్లుల..
హృదయమే ఉప్పొంగినా..
విశ్వగోళంలో ప్రియబంధువెవరూ?
ఏ తత్వమో ఏమో ఏ ఒక్కటీ కాదు.
ఏ బంధమో ఏమో ఏది నిలిచేది కాదు.
నీవు నేనంటూ ఇద్దరం
మనుషులుగ సాగేటి ఒక్కరం
బందో ముక్తో భవిష్యసి.
ఏ క్షణమైనా ఏ బంధమైనా విముక్తి !
నమోనమః
ధన్యవాదాలు