ఆత్మోత్సవ గీతం-1

ఈ ఏడాది నాకు చాలా సంతోషమనిపించిన సంగతి వాల్ట్ విట్మన్ Song of Myself ని తెలుగులోకి తీసుకురావడం. ఇంకా చెప్పాలంటే ఒకింత గర్వంగా కూడా అనిపించిన సంగతి. ఎందుకంటే, విట్మన్ రాసిన ఈ కవితని తెలుగులోకి తీసుకొచ్చే అవకాశం నాకే లభించడం, అంతేకాదు, నాకు తెలిసిన సమాచారం మేరకి భారతీయభాషలన్నిటిలోనూ ఈ గీతానికి ఇదే మొదటి అనువాదం కావడం కూడా.

అయోవా యూనివెర్సిటీ వారి ఇంటర్నేషనల్ రైటింగ్ ప్రోగ్రాం ఒక విట్మన్ వెబ్ నడుపుతోంది. అందులో సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్ గురించి వారిచ్చిన వివరాల్ని బట్టి చూస్తే ఈ గీతానికి ఇప్పటిదాకా ఆరబిక్, చైనీస్, పిలిప్పినో, ఫ్రెంచ్, జర్మన్, కుర్దిష్, మలయ్, పర్షియన్, పోలిష్, పోర్చుగీస్, రొమేనియన్, రష్యన్, స్పానిష్, టర్కిష్, యుక్రేనియన్ భాషల్లోకి అనువాదమయ్యింది. వీటిల్లో ఫ్రెంచి, జర్మన్, రష్యన్, స్పానిష్ అనువాదాలు మాత్రమే పోయిన శతాబ్దంలో వెలువడ్డవి. తక్కినవన్నీ కూడా ఈ గత పదిపన్నెండేళ్ళలో వెలువడినవే.

అంటే, ఈ గీతానికి ప్రపంచవ్యాప్త అనువాదాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయన్నమాట. ఆ వరసలో తెలుగు అనువాదం కూడా చేరడం నాకు సంతోషంగానూ, కించిత్ గర్వంగానూ కూడా ఉంది.

2

వాల్ట్ విట్మన్ (1819-1892) ఉత్తర అమెరికాకి చెందిన కవి. ఆయన సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్ దీర్ఘకవితని మొదటిసారి 1855 లో ప్రచురించాడు. ఆ తర్వాత పాతికేళ్ళ కాలంలో దాన్ని మర్ళ్ళా అయిదు సార్లు సవరించి ప్రచురించాడు. ఆ ఆరు ప్రచురణల్లో   1855, 1856, 1860 ప్రచురణలు అమెరికన్ అంతర్యుద్ధానికి ముందూ, 1867, 1871ం 1881 ప్రచురణలు అంతర్యుద్ధానికి తర్వాతా వచ్చాయి. మొదట్లో ఆ గీతానికి Poem of Walt Whitman, An American అనీ, తర్వాత కేవలం Walt Whitman అనీ, చివరగా 1881 నాటికి Song of Myself అనీ శీర్షికలు పెట్టాడు. అంటే పందొమ్మిదో శతాబ్దంలో అమెరికా అనుభవించిన సాంఘిక, రాజకీయ అంతస్సంఘర్షణని ఆ కవీ, ఆ కవితా కూడా పూర్తిగా తమలోకి ఇంకించుకున్నాయనీ, ఆ నూతన రాజకీయ వ్యవస్థ, ఒక ప్రజాస్వామిక దేశంగా, ఒక మానవతావాద వ్యవస్థగా రూపొందడానికి పడ్డ నలుగులాటని ఆ గీతం సూక్ష్మస్థాయిలో ప్రతిబింబిస్తున్నదనీ మనం అర్థం చేసుకోవచ్చు.

ఇరవయ్యవ శతాబ్ది మొత్తం ఆ గీతాన్ని మొదట్లో అలానే చూసినప్పటికీ నెమ్మదిగా దానిలోని సాంఘిక, రాజకీయ సందర్భాన్ని దాటి ఒక ఆధ్యాత్మిక వేదనని కూడా చూడటం మొదలుపెట్టారు. ఈ శతాబ్దం మొదలయ్యాక, ఆ గీతం పట్ల ఆసక్తి మరింత విస్తారమైంది. అయోవా యూనివెర్సిటీ చేపట్టిన విట్మన్ ప్రాజెక్టులో భాగంగా Ed Folsom, Christopher Merrill అనే ఇద్దరు విట్మన్ పండితులు 2014 లో ఒక ఏడాది పాటు సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్ మీద ఒక మాసివ్ ఓపెన్ ఆన్ లైన్ కోర్సు నడిపారు. అందులో భాగంగా ఆ ఇద్దరూ ఈ గీతంలోని 52 సర్గలమీదా 52 వారాల పాటు పాఠం చెప్పారు. ఆ వీడియో పాఠాలు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు. వాటితో పాటు 52 సర్గల మీదా వారిద్దరూ వివరంగా నోట్సుకూడా రాసారు. వారిలో ఎడ్ పోల్సొమ్ ప్రతి సర్గనీ భాషాపరంగా వివరిస్తే,క్రిష్టఫర్ మెర్రిల్ ప్రతి సర్గనీ తక్కిన ప్రపంచమహాకావ్యాలతో పోలుస్తూ తులనాత్మక విశ్లేషణ చేసాడు. సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్ గురించి మరింత వివరంగా ఆలోచించాలనుకునేవాళ్ళకి ఆ వీడియో పాఠాలూ, ఆ ఆన్ లైన్ వ్యాఖ్యానాలూ గొప్ప వనరు.

ఆ పండితులిద్దరూ తాము ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచిన వ్యాఖ్యానాల్ని తిరిగి Song of Myself with a Complete Commentary (2016) పేరిట పుస్తకంగా కూడా వెలువరించారు. ఆ పుస్తకానికి ఎడ్ ఫొల్సొమ్ ఒక చక్కని ముందుమాట కూడా రాసాడు. అమెరికన్ అంతర్యుద్ధ కాలం (1861-65) తర్వాతనుంచీ  వర్గ, జాతి, లైంగిక సంఘర్షణలతో పాటు, భాషాపరమైన, మతపరమైన, విజ్ఞాన శాస్త్ర పరమైన విషయాల్లో కూడా అమెరికా ఎదుర్కుంటూ వస్తున్న ప్రశ్నల ఎదట సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్ చదువుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుందని  అంటాడు ఆయన.

ఆ పండితులిద్దరూ అందిస్తున్న ఈ సరికొత్త వ్యాఖ్యానాన్ని పరిశీలించేముందు ఇప్పటిదాకా ఈ గీతాన్ని అమెరికా, తక్కిన ప్రపంచమూ కూడా ఎలా సంభావించాయో ఒకసారి చూద్దాం.

3

1620 ఆగస్టు 15 న మే ఫ్లవర్ అనే ఓడలో కొందరు బ్రిటిష్ పౌరులు అమెరికా ఖండానికి వలసకు బయల్దేరినప్పటినుంచీ, 1775-1783 లో వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి రాజకీయంగా స్వాతంత్ర్యం పొందినదాకా అమెరికాది ఒక చరిత్ర. కాని 1776 తర్వాత అమెరికా తనకొక ప్రత్యేక వ్యక్తిత్వం ఉందనీ, తన అస్తిత్వానికి ఒక విశాల రాజకీయ ప్రయోజనం ఉందనీ నమ్మడం మొదలుపెట్టింది. తనకంటూ ఒక సాహిత్యం, ఒక తత్త్వశాస్త్రం, ఒక ప్రాపంచిక దృక్పథం ఉండాలనీ, ఉన్నాయనీ నమ్ముతూ వాటిని అన్వేషించడం మొదలుపెట్టింది. అంటే ఉత్తర అమెరికా ఖండం మీద ఒక బ్రిటిష్ కాలనీగా మొదలైన ఒక సమాజం ఒక ఆదర్శరాజ్యంగా రూపొందే ప్రయత్నం మొదలుపెట్టిందన్నమాట.

అలా ఒక జాతి ఒక ఆదర్శ రాజ్యంగా మారడానికి ఒక దర్శనం అవసరమవుతుంది. పందొమ్మిదో శతాబ్దిలో ఎమర్సన్ (1803-1892) అమెరికాకి అటువంటి ఒక దర్శనాన్ని అందించాడు. ఆయన చేసిన ప్రసంగాలు అమెరికా మేధావుల్లో కొత్త ఆలోచనల్ని ప్రేరేపించాయి. ఆయన చూపించిన వెలుగులో ఎందరో కవులు, రచయితలు, ప్రజాస్వామిక వాదులు తమ తమ మార్గాల్ని వెతుక్కున్నారు. ముఖ్యంగా ఆయన చేసిన American Scholar (1837) అనే ప్రసంగం అమెరికా ఆలోచనకి సంబంధించిన స్వాతంత్య్ర ప్రకటనగా ప్రశస్తికెక్కింది. ఆ ప్రసంగం నుంచే ఒక మార్గరెట్ ఫుల్లర్, ఒక థోరో వంటి చింతనాపరులు రూపుదిద్దుకున్నారని చెప్పవచ్చు.

ఒక జాతిని ఒక సంస్కృతిగా, ఒక మానవతాపూర్వక వ్యవస్థగా తీర్చిదిద్దే క్రమంలో కవులు ముందుంటారు. మానవచరిత్రలో నాగరికతలు వికసించిన తొలిరోజులనుంచీ మహాకవులూ, ఇతిహాసకారులూ ఆయా జాతులకి తమ కావ్యాలద్వారా ఒక దారి, ఒక గమ్యం చూపిస్తో వచ్చారు. అమెరికా రాజకీయ స్వాతంత్య్రం పొందాక కూడా ఇంకా ఇంగ్లిషు కవుల దర్శనం మీదనే ఆధారపడకూడదనీ, తనకంటూ కొత్త కవులు ప్రభవించాలనీ ఎమర్సన్ పిలుపునిచ్చాడు. 1837 లో  The American Scholar పేరిట ఆయన చేసిన ప్రసంగంలో ప్రతి ఒక్క యుగం తన తన పుస్తకాలు తనే రాసుకోవలసి ఉంటుందని అన్నాడు. లేదా ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్క తరం తన తర్వాతికోసం పుస్తకాలు రాసుకోవాలనీ, అంతకన్నా పాతబడ్డ పుస్తకాలు ఆ కర్తవ్యాన్ని నెరవేర్చలేవనీ కూడా అన్నాడు.

1844 లో ఆయన రాసిన The Poet అనే వ్యాసంలో ఈ భావాన్ని మరింత విస్తరించాడు. అ అమెరికన్ కవిత్వానికీ, దర్శనానికీ, ఆత్మాన్వేషణకీ ఆ వ్యాసం ఒక వేకువ పిలుపు. ఇన్నేళ్ళ తరువాత కూడా ఆ వ్యాసం పాతబడలేదు సరికదా, ఇప్పటికీ ప్రతి సమాజానికీ, ప్రతి జాతికీ స్ఫూరినివ్వగలిగేదిగా వినిపిస్తూనే ఉంటుంది. అందులో ఆయన అమెరికా కి కావలసిన కవి ఎలా ఉండాలో వివరిస్తూ ఇలా అంటున్నాడు:

నేను దర్శిస్తున్న కవి కోసం ఎదురుచూడకుండా ఉండలేకపోతున్నాను. మనం మన జీవితానికి తగిన విధంగా ఇంకా సంసిద్ధంకాలేకపోతున్నాం. మన కాలానికీ, మన సాంఘిక పరిస్థితులకీ తగ్గట్టుగా కవిత పలకలేకపోతున్నాం. మనం మన జీవితాన్ని నిజంగా సాహసికంగా మొదలుపెడుతున్నట్లయితే దాన్ని ఒక ఉత్సవంగా జరుపుకోడానికి వెనకాడకూడదు. కాలమూ, ప్రకృతీ మనకెన్నో బహుమానాలు అందించాయిగాని, ఒక సకాలమానవుణ్ణి, ఒక కొత్త మతాన్ని, ఒక సమన్వయకారుణ్ణి ఇంకా ప్రసాదించనేలేదు. అతడికోసమే సమస్త విషయాలూ వేచి ఉన్నాయి. తానొక బృహత్ చిత్రలిపిలో, ఒక సార్వత్రికతలో తన స్వీయజీవితాన్ని గానం చేసానని దాంతే చెప్పుకున్నాడు. మనకి, అమెరికాకి, ఇంకా అటువంటి ప్రజ్ఞానిధి చిక్కలేదు. అతుల్యమైన మన సమకాలిక సామగ్రి గురించి స్పష్టంగా తెలిసి ఉండి, ఒక నిరంకుశ నేత్రంతో, మన సమకాలిక అనాగరికతలోనే, మన వస్తువ్యామోహం మధ్యనే ఒక దేవతల ఊరేగింపును కనుగొనగలిగిన కవి కావాలి మనకి. హోమర్ కావ్యాల్లోనూ, మధ్యయుగాల్లోనూ, కాల్వినిజంలోనూ అతడు ఏ దేవతల్ని ఆరాధనాపూర్వకంగా దర్శించాడో అటువంటి దేవతల శోభాయాత్రని చూడగలిగినకవి కావాలి. బాంకులూ, సుంకాలూ, వార్తాపత్రికలూ, స్థానిక రాజకీయాలూ, మెధడిజమూ, యూనిటేరియనిజమూ లాంటివాటినుంచి ప్రజలు ఉత్తేజం పొందలేరు. కాని ట్రాయి నగరమూ, డెల్ఫిలోని దివ్యవాణీ ఏ పునాదులమీద నిలబడ్డాయో ఇవి కూడా అటువంటి విస్మయకారక ప్రాతిపదికలమీదనే నిలుచున్నాయని మర్చిపోలేం. మన ఎన్నికలూ, మన సమస్యలూ, మన రాజకీయాలూ, మన చేపలవ్యాపారాలూ, మన ఆదివాసులూ, మన నావలూ, మన తిరస్కారాలూ, మన ధూర్తజనుల ఆగ్రహం, మన సజ్జనుల భీరుత్వం, ఉత్తరాది రాష్ట్రాల వాణిజ్యం, దక్షిణాది రాష్ట్రాల తోటలూ, పడమటి ప్రాంతాల్లో పెరుగుతున్న విస్తరణ, ఓరెగాన్, టెక్సాస్- ఇవన్నీ ఇంకా కవిత్వంగా మారవలసే ఉంది. అయినా కూడా మొత్తం అమెరికా మన కళ్ళముందొక కావ్యంగా సాక్షాత్కరిస్తూనే ఉంది. దాని అపారమైన భౌగోళిక విస్తృతి మన ఊహాశీలతకు దిగ్భ్రమగొల్పుతూనే ఉంది.’

సరిగ్గా ఈ వాక్యాలనుంచే విట్మన్ రూపొందాడని మనం చెప్పుకోవచ్చు. Leaves of Grass మొదటి ప్రచురణకు 1855 లో అతడు రాసుకున్న ముందుమాటలో ఎమర్సన్ వాక్యాల్నే మరింత బిగ్గరగా ప్రతిధ్వనించాడు. చూడండి:

మన జాతి తాలూకు ఈ అపారమైన భౌగోళిక విస్తృతి దాని పౌరుల స్వభావంలో కూడా అపారమైన ఔదార్యంగా, హృదయవైశాల్యంగా మారకపోతే ఆ ప్రాకృతిక విస్తృతి రాక్షసవిస్తృతి మాత్రమే అవుతుంది.

కాబట్టి అమెరికన్ భౌగోళిక విస్తృతికి తగిన నిష్పత్తిలో అమెరికన్ ఆత్మవిస్తృతి కూడా సంభవించాలి. అది కవిత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఎమర్సన్ చెప్పినమాటల్నే విట్మన్ కూడా చెప్తున్నాడు. అది సాధ్యమేనని కూడా అతడు భావిస్తున్నాడు. ఎందుకంటే:

ఈ భూమ్మీద ఏ కాలంలోనైనా జీవించిన జాతులన్నిటిలోనూ అమెరికన్లే బహుశా పూర్తి కవితాస్వభావులు అని చెప్పవలసి ఉంటుంది. మౌలికంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలే ఒక మహాకావ్యం.

ఇంకా ఇలా అంటున్నాడు:

జాతులన్నిటిలోనూ అమెరికా రక్తనాళాల్లోనే కవిత్వం పూర్తిగా పొంగిప్రవహిస్తూ ఉంది. కాబట్టి అమెరికాకి మరింత మంది కవులు కావాలి. ఆ కవులు తప్పకుండా మహాకవులై ఉంటారు, వారిని అమెరికా తప్పకుండా గరిష్టస్థాయిలో వినియోగించుకోగలుగుతుంది. అమెరికన్ జాతికి సూచికలుగా అమెరికన్ కవులు నిలబడ్డట్టుగా అమెరికన్ ప్రెసిడెంట్లు నిలబడతారని అనుకోలేను.

తానూహిస్తున్న కవి ఎలా ఉండాలో ఎమర్సన్ చేసిన ప్రసంగాన్ని విట్మన్ రాసుకున్న ముందుమాటతో కలిపి చదివితే మనకి స్పష్టంగా తెలిసేది ఒకటే సంగతి: అదేమంటే, ఎమర్సన్ ఏ కవి కోసం ఎదురుచూస్తున్నాడో ఆ కవి తానేనని విట్మన్ భావిస్తున్నాడనే. అలా అనుకోవడంలో ఆత్మాశయం కాదు ఉన్నది. అమెరికాని కీర్తించడానికి, అమెరికన్ ఉత్సవం జరుపుకోడానికి అమెరికా ఒక కవి కోసం ఎదురుచూస్తున్నప్పుడు తాను ఆ కవిగా మారడం ఒక చారిత్రిక, సామాజిక, నైతిక బాధ్యతగా విట్మన్ భావించాడని మనం గ్రహించాలి.

సాధారణంగా చిన్న చిన్న తెగలు ఒక జాతిగా రూపొందే యుగోదయకాలాల్లో ఇటువంటి బాధ్యత తలకెత్తుకునే మహాకవులు, ఇతిహాసకారులు ప్రభవిస్తారు. వ్యాసవాల్మీకులూ, హోమరూ, వర్జిలూ, ఛాసరూ, దాంతే, ఫిరదౌసి, పుష్కిన్ వంటి కవులిట్లానే ప్రభవించారు. అది ఒక యుగం ఒక జాతికి ఇచ్చే పిలుపు. ఆ పిలుపుని వినగలగడం అందరికీ దక్కే భాగ్యం కాదు. ప్రతికాలంలోనూ కొందరికి ఆ పిలుపు వినిపించినా దానికి తగినట్టుగా ప్రతిస్పందించగల దారుఢ్యం అందరికీ ఉండదు. అంతిమంగా ఒక యుగానికి ఒకరు మాత్రమే ఆ పిలుపుని అందిపుచ్చుకుని యుగకర్త కాగలుగుతారు. అమెరికాకి సంబంధించినంతవరకూ విట్మన్ అటువంటి యుగకర్త. అందుకనే బోర్హెస్ విట్మన్ ని అమెరికన్ ఉషస్సుగా అభివర్ణించాడు.

21-9-2024

8 Replies to “ఆత్మోత్సవ గీతం-1”

  1. విట్మన్ నా ప్రియమైన కవి .ఆత్మోత్సవగీతం శీర్షిక చాలా నప్పింది Song of myself కి . చాలా హాయిగా వుంది.

  2. ప్రతికాలంలోనూ కొందరికి ఆ పిలుపు వినిపించినా దానికి తగినట్టుగా ప్రతిస్పందించగల దారుఢ్యం అందరికీ ఉండదు. అంతిమంగా ఒక యుగానికి ఒకరు మాత్రమే ఆ పిలుపుని అందిపుచ్చుకుని యుగకర్త కాగలుగుతారు.
    అచ్చం మీలా. నమస్సులు

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading