పూర్వజన్మల మీద

నాలుగైదేళ్ళుగా తెలుగులో కొన్ని చీనా కవితల అనువాదాలు చూస్తూ ఉన్నాను. చీనాకవుల్ని అనువదించటం మాటలు కాదు. ఆ అనువాదకుడికి కూడా చీనాకవుల లక్షణాలుంటేతప్ప ఆ అనువాదాలు అనువాదాల్లాగా కనిపించవు. ఈ అనువాదకుడిలో ఆ ప్రతిభ పుష్కలంగా ఉన్నందువల్ల ఆ అనువాదాలు నన్ను విభ్రాంతికి గురిచేస్తో వచ్చేయి. రెండేళ్ళ కిందట హైదరాబాదు వచ్చేక ఆ కవిని మొదటిసారి చూసేను.

పి.శ్రీనివాస్ గౌడ్ అనే ఆ కవి తనని తాను పరిచయం చేసుకుని తన కవిత్వ సంపుటి ‘చిన్ని చిన్ని సంగతులు‘ నా చేతుల్లో పెట్టాడు. ఆ పుస్తకం వెంటనే చదివి ఉండవలసింది. కాని మరేదో ధ్యాసలో పక్కన పెట్టాను. తీరా ఒకరోజు నా మిత్రురాలొకామె ఈ కవిత చూసారా అంటో నాకో కవితను వాట్సప్ లో షేర్ చేసారు. ఆశ్చర్యం! అది నా మీద శ్రీనివాస్ గౌడ్ రాసిన కవిత. అది కూడా ఒక చీనా కవి ఎవరో నా మీద రాసినట్టే ఉందనిచెప్పడం అతిశయోక్తి కాదనుకుంటాను. దాన్ని మీతో వెంటనే పంచుకుని ఉండవలసింది. ఇప్పటికే ఆలస్యం చేసాను. కనీసం ఇప్పుడేనా పంచుకోనివ్వండి.


పి.శ్రీనివాస గౌడ్

పూర్వజన్మల మీద

పూర్వజన్మలమీద
పునర్జన్మలమీద
నమ్మకం లేదు.

మహాకవుల సరసన
పుట్టాల్సినవాడు
కాలకాంతివత్సరంలో
ఏదో తప్పిదం జరిగి
మన మధ్య పుట్టాడు

ఆయన సంగతేమోగానీ
ఆయన కాలపు మనుషులందరిదీ
అదృష్టవసంత కోయిల
ప్రవేశించిన కాలం.

కూత వినాలంటే
పూత పూయక తప్పదు.

(చినవీరభద్రుడు గారికి పుట్టినరోజు జేజేలు)

22-7-2024

23 Replies to “పూర్వజన్మల మీద”

  1. “ ఆయన కాలపు మనుషులందరిదీ
    అదృష్టవసంత కోయిల
    ప్రవేశించిన కాలం”
    Indeed!!

    “కూత వినాలంటే
    పూత పూయక తప్పదు.”
    ఇపుడిపుడే మొగ్గ తొడిగినట్లు. 😊

    🙏🏽 super కవిత🙏🏽

  2. అందర్నీ తన వారిగా కలుపుకుపోయే శ్రీనివాస్ గౌడ్ చెప్పింది నిఖార్సయిన నిజం..విజయనగరం లో మహానుభావుడు ఏ.యు.నరసింహమూర్తి గారు రాసింది అదే.
    ఒక చిన్నపడవ. ఒక చిన్ని తెడ్డు. ఒంటరిగా ప్రయాణించే అద్భుత సాహిత్య సంచారి వీరభద్రుడు అని సెలవిచ్చినప్పుడు నేను ఎంత ఆనందించా నో… యంగ్ జనరేషన్ శ్రీనివాస్ గౌడ్ దాకా అదే మాట.
    మా లాంటి సామాన్యులు మీ దాకా ఎందుకు వస్తారో తెలుసా సర్.
    మా పలక మీద రాసిన అక్షరాలు దిద్ది మమ్మల్ని సరిదిద్దుతారని..
    ప్రపంచం లో ఇన్నిన్ని వింతలూ , విశేషాలు, మాయా మర్మాలు , మేజిక్ లు కళ్ళముందు వెస్ట్రన్ బీట్ తో దద్దరిల్లి స్తున్నా అటు వైపొక్కసారి చూసి కాస్త నెమ్మదించి మీ వైపు చూసేది మీ సాహిత్యం లో ఉన్న మృదువైన , లాలిత్యమైన మెలకువలు కలిగిన జీవిత సత్యాల కోసం.. మీరు వెదికే దారుల్లో మేము రావడం మీరు లోకాన్ని చూసే చూపులో ఉండే సత్యాన్వేషణ కోసం. మీరు చదివే పుస్తకాల్లో ఇంకా ఏముందో అనే ఆత్రుత.
    నమస్సులు.

  3. హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు మహోదయా … 🙏

  4. కాల కాంతి వత్సరం ….ఎంత చక్కటి ప్రయోగం.ఎంత ఊహించిన దాని అర్ధాన్ని అందుకోలేకపోతున్నాను.ఇద్దరికీ అభినందనలు💐💐💐

  5. ఆహా, ఎంత సుకుమారమైన అభివ్యక్తి! అతి సుందరం! కేవలం పూగంధమే పట్టిస్తోంది ఈ పూత ఏపూవుదో. భద్రుడు గారికి అభినందనలు!

  6. సాటి కవి గొప్పతనమే ఇది…శ్రీనివాస్ సార్ అభినందనలు.

  7. అవునన్నది నిజం.. అదృష్టవంతులం. అక్షరశుభాకాంక్షలు అద్భుతం. అభినందనలు కవీ

  8. శ్రీనివాస్ గారన్నది సత్యం. మేము అదృష్టవంతులం. జన్మ దిన శుభాకాంక్షలు మీకు.

  9. కూత వినాలంటే
    పూత పూయక తప్పదు.
    – Entha Nijam!

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading