
అదేమి చిత్రమో గాని నా ముందొక నరకం ప్రత్యక్షమయినప్పుడల్లా ఒక కొత్త కవి కూడా ప్రత్యక్షమవుతుంటాడు, డాంటే ని నరకం దాటించిన వర్జిల్ లాగా. పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఇప్పటిదాకా నేను నరకం చూడని కాలం లేదు. చోటు మారి ఉండవచ్చు, గోడలు మారి ఉండవచ్చు, కాని అదే హింస, అదే రిరంస. కాని ప్రతి సారీ ఒక పూలతోట పరిచయమవుతూనే ఉంది. ఇన్నాళ్ళ తరువాత, ఇన్నేళ్ళ తరువాత, నడిచి వచ్చిన దారుల్ని వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ నరకాలేవీ గుర్తులేదు, ఆ పూలతావి తప్ప. ఆ హింస తాలూకు ఆనవాళ్ళేవీ మిగల్లేదు, అప్పుడు చదువుకున్న పద్యాలు తప్ప, అప్పుడు పరిచయమైన కవులు తప్ప. ఇదుగో, ఇప్పుడు నా చేతుల్లో మారిస్ మాటర్లింక్ రాసిన The Intelligence of Flowers (2005) ఉంది. మరికొంత కాలం గడిచేక, వెనక్కి తిరిగి ఈ రోజుల్ని తలుచుకుంటే, బహుశా నాకు గుర్తుండిపోయేవి, మేడమీద నిండుగా విరిసిన అపరాజితాలతా, ఈ పుస్తకమూ మాత్రమేనని నిశ్చయంగా చెప్పగలను.
మాటర్లింక్ ఫ్రెంచి భాషలో సాహిత్యం సృష్టించిన బెల్జియం కవి. నాటకర్త, యోగి, మిస్టిక్. నోబెల్ పురస్కారాన్ని పొందినవాడు. కాని అతడు కూడా నరకం చూసాడు. డిప్రెషన్ లో కూరుకుపోయాడు. తన జీవితంలో అత్యంత పరీక్షాత్మకసమయంలో అతడీ పుస్తకం రాసాడు. పూల గురించి. అలాగని అతడు రాసింది కవిత్వం కాదు. బోటని. కాని ఏ వృక్షశాస్త్రజ్ఞుడికీ సాధ్యంకాని కవితాత్మతో రాసాడు. అలాగని వట్టి కవిత్వం రాయలేదు.
ఏళ్ళ తరబడి తన తోటలో గంటలతరబడి, రోజులతరబడి పూలమొక్కల మధ్య వాటి అత్యంత సూక్ష్మ స్పందనల్నీ, ప్రతిస్పందనల్నీ గమనిస్తో రాసిన పుస్తకం అది. ఒక కిండర్ గార్టన్ తరగతిగదిలో చిన్నారి పిల్లల మధ్య గడుపుతో వాళ్ళ సున్నితమైన స్పందనల్నే గమనిస్తో ఒక విద్యావేత్త తన అనుభవాలు పుస్తకంగా రాస్తే ఎలా ఉంటుంది? మాంటిస్సోరి Discovery of Child లాగా ఈ పుస్తకం ఒక discovery of flowers.
ఏదైనా పుస్తకం చదివితే అది చదువుతుండగానో, చదివినవెంటనో మనలో రేకెత్తే స్పందనల్ని వెంటనే రాసేసుకోవాలి. లేకపోతే పూల తావిలాగా అవి గాల్లో కలిసిపోతాయి. మాటర్లింక్ పూల గురించి రాసింది చదివాక ఆ స్పందనలు నా రక్తంలో కలిసిపోయినట్టున్నాయి. ఏదో ఒకటీ రెండూ వాక్యాల్నీ, అక్కడా ఇక్కడా ఏరి మళ్ళా గుర్తుచేసుకుందామనుకుంటే, ఆ వాక్యాలు పుస్తకాల మధ్యలో పెట్టి ఎండిపోయిన పూలరేకల్లాగా ఉన్నాయి.
‘ఏ మంచిపూవులన్ ప్రేమించినావొ నిను మోచె నిన్ను తల్లి కనకగర్భమున’ అన్నాడు కవి. అలాంటి బంగారు తల్లులు ప్రతిదేశంలోనూ, ప్రతి భాషలోనూ ఉండటం మన అదృష్టం. మాటర్లింక్ రాసిన ఈ పుస్తకాన్ని ఇంగ్లిషులోకి అనువదించిన ఫిలిప్ మోస్లే అనే అతను సుదీర్ఘమైన ముందుమాట కూడా రాసాడు. అందులో వృక్షశాస్త్రానికీ, సాహిత్యానికీ మధ్య యుగాలుగా ఉన్న సాన్నిహిత్యం గురించి చాలా కొత్త విషయాలు సమగ్రంగా రాసుకొచ్చాడు. ప్రాచీన గ్రీకుల్లో మొక్కల మొదటి వర్గీకరణ చేపట్టిన థియోఫ్రాటస్, డయోస్కారిడస్ లు మొదలుకుని ప్లేటో, వర్జిల్, లుక్రీషియస్ ల మీదుగా లిన్నేయస్, షోపెన్ హోవర్ లదాకా యూరప్ లో వృక్షశాస్త్రానికీ, కవిత్వానికీ మధ్య సరిహద్దులు చెరిగిపోయిన తావుల్ని అతడు గుర్తుపట్టాడు.
రస్సెల్ అన్నాడట, వృక్షశాస్త్రజ్ఞులవల్లనే ఈ ప్రపంచాన్ని ఒక యంత్రంగా కాకుండా, ఒక జీవంగా పరిశీలించడం మొదలయ్యిందని. అటువంటి దర్శనం వల్లనే రొమాంటిసిజం సాధ్యమయ్యిందని. తిరిగి మళ్లా రొమాంటిసిజం జర్మన్ ప్రాకృతిక తత్త్వశాస్త్రాన్ని ప్రభావితం చేసింది. ప్రాణుల, జాతుల పరిణామాన్ని డార్విన్ అధ్యయనం చేసి సిద్ధాంతాలు రూపొందించడానీకన్నా ముందే ఎమర్సన్ ‘నేచర్’ మీద తన ప్రసిద్ధ ప్రసంగం వెలువరించడంలో అందుకే ఆశ్చర్యం లేదు.
మనకీ, యూరపియన్ సాహిత్యకారులకీ మధ్య ప్రధానమైన తేడా ఎక్కడంటే, వాళ్ళల్లో చాలామంది ఏదో ఒక శాస్త్రంలోనో, లేదా ఏదో ఒక మానవరంగంలోనో సుప్రసిద్ధమైన కృషి చేసినవాళ్ళు కూడా అయ్యుంటారు. ఉదాహరణకి రూసో లాంటి వాడు Letters on the Elements of Botany (1771-73) రాస్తే, గొథే లాంటి మహాసాహిత్యకారుడు The Metamorphosis of Plants (1795) లాంటి పుస్తకం రాసాడు. కాలరిడ్జ్ లాంటి కవి Theory of Life (1848) రాస్తే, రస్కిన్ లాంటి కళావిమర్శకుడు Studies of Wayside Flowers (1874) లాంటి పుస్తకం రాసాడు.
ఆ అనువాదకుడు తన ముందుమాటలో పేర్కొన్న మరెందరో రచయితల్నీ, శాస్త్రజ్ఞుల్నీ వారు పరస్పరం ఒకరినొకరు ఎలా ప్రభావితం చేసుకున్నారో ఆ సంప్రదాయాన్నంతా మళ్ళా ఎత్తి రాయలేనుగానీ, యూరపియన్ కవులు మంచి పూవుల్ని ప్రేమించి మాత్రమే ఊరుకోలేదు, వాటి గురించి జీవితమంతా అధ్యయనం చేస్తోనే ఉన్నారన్నది నేను తెలుసుకున్న అంశం.
భారతదేశంలో కవుల్లో, రచయితల్లో, సాహిత్యకారుల్లో లేదా వృక్షశాస్త్రజ్ఞుల్లో ఎవరున్నారు అలాంటివాళ్ళు? అసలు మన రచయితలకి ఎంతమందికి ఎన్ని పూలపేర్లు తెలుసు? ఎంత వెదికి చూసినా ఇద్దరే కనిపిస్తారు: ఒకరు, వాల్మీకి, రెండోది, టాగోర్. వాళ్ళిద్దరికీ సమానంగా, కొన్నిసార్లు వారికన్నా మరింత సూక్ష్మ సంవేదనలతో సంగం కవులు కనిపిస్తారు. అంతే. నిజానికి మన నిఘంటుకారులకి కూడా పూల గురించి తెలీదు. ఒకప్పుడు నేను బషో యాత్రానుభవాల్ని తెలుగు చేయాలని కూచున్నప్పుడు ఆయన ప్రస్తావించే పూలకీ, పండ్లకీ దాదాపుగా ఒక్క తెలుగు పదం కూడా దొరకలేదు!
అలాంటిది, మాటర్లింక్ లాంటి కవి, నాటకకర్త, ఋషితుల్యుడు తన జీవితకాలం పాటు తానెన్ని యుద్ధాలు చేస్తో ఉన్నా, తనచుట్టూ ప్రపంచం ఎన్ని యుద్ధాల్లో కూరుకుపోతూ ఉన్నా, మొక్కల్నీ, పూలనీ తదేకంగా చూస్తో ఉండటం మానలేదని తెలియడం గొప్ప ఆశ్చర్యంతో పాటు కొత్త ఉత్సాహాన్ని కూడా ప్రేరేపిస్తోంది.

పట్టుమని వందపేజీలు కూడా లేని ఈ పుస్తకంలో ‘పూల ప్రజ్ఞానం’ తో పాటు, పరిమళం మీద కూడా ఒక వ్యాసం ఉంది. రెండింటిలోనూ మాటర్లింక్ రాసింది సైన్సు కాదు. కవిత్వం. కానీ పూలనీ, పూల సుగంధాన్నీ ఒక శాస్త్రజ్ఞుడిగా పరిశీలించాక పుట్టిన కవిత్వం అది. ఇంకా చెప్పాలంటే, అతడిలోని శాస్త్రజ్ఞుడివల్ల అతడిలోని కవి అదృశ్యం కాకపోగా, మరింత బలం పుంజుకున్నాడన్నమాట.
ఉదాహరణకి పరిమళం గురించి రాసిన వ్యాసంలో ఈ వాక్యాలు చూడండి:
కొన్ని సాయంకాలాలు గాని లేదా ప్రభాతాలు గాని గుర్తొస్తే అన్నిటికన్నా ముందు గుర్తొచ్చేది ఆయావేళల్లో పూచే పూల సుగంధాలే. అవి గులాబీలుగానీ లేదా మల్లెలుగానీ, మరొకటిగానీ. ఆ పూలతావి సోకగానే భూమ్మీద మొత్తం వాతావరణమే ఏదో హటాత్పరిణామానికి లోనయినట్టుగా, మొత్తం భూగోళమంతా అంతులేని సంతోషనిలయంగా మారిపోయినట్టుగా అనిపిస్తుంది. అలాంటి వేళల్లో ఆ పూలతావి తొందరగా చెరిగిపోయేదిగానో లేదా అస్పష్టంగానో లేదా అనిర్దిష్టంగానో కాకుండా స్థిరంగా, విస్తారంగా, సంపూర్ణంగా, శాశ్వతంగా, ఉదారంగా, అత్యంత సహజంగా, మనల్నుంచి ఎవరూ ఎన్నటికీ విడదీయలేనిదిగా మనకు అనుభవానికొస్తుంది.
అసలు అన్నిటికన్నా ముందు మనం aerial beings మి అని చెప్తూ, ప్రాణవాయువే మనకి జీవితాన్నిస్తున్న శక్తికాబట్టి పరిమళాల ద్వారానే ముందు మనం మన చుట్టూ ఉన్న ప్రకృతిని పోల్చుకుంటాం అని చెప్తూ, ఇలా రాస్తున్నాడు:
మనం వర్షాన్నో, సాయంసంధ్యనో గుర్తుపడుతున్నట్టే పొగమంచునీ, మంచునీ, పొద్దుటి తుషారబిందువుల్ని, ప్రభాత ఫలాల్నీ, నక్షత్రాల మినుకునీ కూడా వాటి సుగంధంతో ఎందుకు గుర్తుపట్టకూడదు? మన చుట్టూ ఉన్న స్థలంలో ఆవరించిన ప్రతి ఒక్కదానికీ ఏదో ఒక పరిమళం ఉండేఉంటుంది. బహుశా ఇప్పుడు మనం దాన్ని గుర్తుపట్టలేకపోవచ్చు, కాని ఒక వెన్నెల కిరణం, నీటిగలగల, తేలిపోయే మబ్బుతునక, చిరునవ్వే ఆకాశం ప్రతి ఒక్కటీ పరిమళిస్తోనే ఉండి ఉంటుంది.
పూల గురించీ, పూలమొక్కల్లోని చైతన్యం గురించీ, వాటిలోని ప్రజ్ఞానం గురించీ రాసిన వాక్యాలు కూడా ఇలానే ఉంటాయి. వాటిల్లో పరిశీలనాశక్తి ఎంత ఉందో, భావుకత్వం కూడా అంతే ఉంది. ఒక స్వేచ్ఛాగానం అన్నమాట. ఈ వాక్యాలు చూడండి:
ఏదో ఒక సాధారణ చైతన్యంతో కూడుకున్న తెలివైన జీవరాశి అక్కడక్కడా చెదురుమదురుగా పడి ఉన్నది కాదనీ, మన చుట్టూ విశ్వవ్యాప్తంగా ఒక ప్రజ్ఞానరసంలాంటిది ప్రవహిస్తో ఉందనీ, దాన్ని తాకుతున్న ప్రతి ఒక్క ప్రాణిలోనూ ఆ ప్రజ్ఞానరసం చొచ్చుకుపోతూనే ఉంటుందనీ అనుకుంటాను. అయితే ఆ ప్రాణుల్లో కొన్ని ఆ చైతన్యప్రవాహాన్ని తమలో బాగా ప్రవహింపచేసుకోగలవు, కొన్ని అంతబాగా ప్రవహింపచేసుకోలేవు. అంతే తేడా. ఇప్పటిదాకా, ఈ భూమ్మీద, బహుశా మానవజాతి ఒక్కటే ఈ చైతన్యస్రవంతిని మరీ ఎక్కువ అడ్డగించుకోకుండా తనలోకి తీసుకోగలది అని కూడా అనుకుంటున్నాను. ఆ చైతన్య స్రవంతినే మతాలు దైవం అని పిలిచాయి. మనలోకి చొచ్చుకుపోయి ప్రసరించే ఈ సూక్ష్మ విద్యుత్ శక్తికి మన నరాలు తీగలుగా పనిచేస్తే, మన బుద్ధి ఒక రాగిచుట్టలాగా ఆ శక్తిని మరింత ద్విగుణీకృతం చేసుకుంటూ ఉంటుంది. కాని మనలో ప్రసరించే ఈ దివ్యశక్తి నిజానికి మన చుట్టూ ఉన్న రాయీరప్పా, తారకలూ, పూలూ, పశుపక్ష్యాదులగుండా మనలోకి ప్రవహిస్తున్నదే అని మాత్రం చెప్పక తప్పదు.
మన లో ప్రవహిస్తున్న ఈ ప్రజ్ఞాన స్రవంతి గురించి మనం మాటల్లో చెప్పగలుగుతున్నాం గానీ, ఇటువంటి శక్తిస్ఫురణలో మాత్రం మొక్కలు మనకన్నా వేలయుగాల ముందున్నాయన్నది మాటర్లింక్ పుస్తక సారాంశం. ఈ వాక్యాలు చూడండి.
ప్రతి పువ్వుకీ తనదైన ఒక ఊహ, ఒక వ్యవస్థ, తన ఉపయోగంలో పెట్టుకోగల సముపార్జిత అనుభవం ఉన్నాయని ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. వాటి చిన్న చిన్న ఆవిష్కరణల్నీ, అవి అనుసరించే రకరకాల పద్ధతుల్నీ దగ్గరగా చూసినప్పుడు మనకి మానవుడు తన ఆధీనంలో ఉన్న వనరుల్తో ఎటువంటి యాంత్రిక ప్రతిభను కనపరుస్తున్నాడో ప్రదర్శించే మహాపారిశ్రామిక ప్రదర్శనలు గుర్తొస్తాయి. కాని మన యాంత్రిక ప్రతిభ నిన్నమొన్నటిది. పూలల్లో కనవచ్చే యాంత్రిక శక్తి వేల ఏళ్ళుగా వర్ధిల్లుతూ వస్తున్నది. పూలు ఈ భూమ్మీద తొలిసారిగా తలెత్తినప్పుడు వాటికి నేర్చుకోడానికీ, అనుకరించడానికి ఎటువంటి నమూనాలూ లేవు. అవి ఏమి సాధించుకున్నా అదంతా తమలోంచి తాము పైకి తెచ్చుకున్నదే. మనమింకా గదలు తయారుచేసుకుంటున్నప్పుడు, బాణాలు సంధిస్తున్నప్పుడు, ముళ్లగదలు విసుర్తున్నప్పుడు, ఇంకా మరీ ఇటీవలి కాలానికి వస్తే, రాట్నాలూ, కప్పీలూ, కొక్కేలూ, గొట్టాలూ కనిపెడుతుండగా, అంటే మరీ ఈ మధ్యనే మనం వడిసెల, గడియారం, నేతమగ్గం లాంటి మనం గర్వించదగ్గ యంత్రాల్ని కనుక్కునేటప్పటికే, పూలు ఇటువంటి సూత్రాల్నే కొన్ని వేల సంవత్సరాలుగా అనుసరిస్తో ఉన్నవని గమనించాలి. మనం ఒక మరచుట్టు ఎలా పనిచేస్తుందో కనుక్కుని మహా అయితే వందేళ్ళు అయి ఉండవచ్చు, కాని మేపుల్ చెట్టూ, నిమ్మచెట్టూ అదే సూత్రాన్ని వృక్షజాతి తలెత్తిన కాలానికే కనిపెట్టలేదా?
మొక్కల్లోని ఆ అద్భుత ప్రజ్ఞానాన్ని ఆయన తాను స్వయంగా పరిశీలించిన అనేక ఉదాహరణల్తో వివరిస్తాడు. ఇంకా ఏమంటున్నాడో చూడండి:
మన చుట్టూ ఉన్న వాటిని దగ్గరగా పరిశీలించినమీదట, బహుశా మనం మాత్రమే ఏదీ కొత్తగా సృష్టించలేమని అర్థమవుతుంది. ఈ భూమ్మీద అడుగుపెట్టిన వాళ్ళల్లో చివరివాళ్ళుగా మనకి మిగిలిందల్లా ఇప్పటికే ఈ భూమ్మీద ఉన్న ప్రతిఒక్కదాన్నీ గమనించడం, మనమిక్కడ అడుగుపెట్టకముందే పరచి ఉన్న దారుల్ని చూసి చిన్నపిల్లల్లాగా ఆశ్చర్యపోవడం మాత్రమే.
చూడటం ఒక పార్శ్వం. మనం కూడా చూస్తాం. పూలు పూసిన మొక్కల్ని చూస్తాం, సంతోషిస్తాం. అది మరికొంత లోతుగా చూస్తే పరిశీలన అంటాం. కాని చూసినదాన్ని బట్టి చూడనిదాన్ని సంభావించడం ఊహాగానం. అది కవికి మాత్రమే సాధ్యమవుతుంది. ఈ వాక్యాలు చూడండి:
మొక్కల్ని సదా పోషించే అత్యంత ఆవశ్యకమైన భాగం వాటి వేర్లు. అవి నేలని విడిచిపెట్టకుండా అంటుకుపోయి ఉండే భాగం. మనల్ని విభ్రాంతపరిచే భౌతిక సూత్రాల్లో మనం భరించలేనంత ప్రాకృతిక సూత్రం ఏమై ఉండవచ్చు అని అడిగితే చెప్పడం కష్టమేమోగాని, మొక్కలకి మాత్రం కాదు. పుట్టినప్పటినుంచి మరణీంచేదాకా తమని మరెక్కడికీ కదలనివ్వనది ఆ ప్రాకృతిక సూత్రమేనని వాటికి తెలుసు. మన శక్తిసామర్థ్యాల్ని అటూ ఇటూ తిరుగుతూ ఊరికే వృథాపుచ్చే మనకన్నా దేనికి మొదటి ప్రాధాన్యానివ్వాలో వాటికి బాగా తెలుసు. తన వేర్ల నీడల్లోంచి తలెత్తి నెమ్మదిగా పూలవెలుతురులో పైకి వికసించేదాకా ప్రతి మొక్కా ఒక దృశ్యకావ్యం. తన సమస్త అస్తిత్వాన్నీ అది ఒకే ఒక్క ప్రణాళికకి అనుగుణంగా నడుపుకుంటుంది. నేలలోంచి పైకి లేవడం, పాతాళ విధిభారం నుంచి బయటపడటం, తనమీద విధించిన ప్రాకృతిక నిశ్చలసూత్రాల పట్టునుంచి తప్పించుకోవడం, సంకుచితసీమావధిని బద్దలుగొట్టడం, రెక్కలు విప్పుకోవడం, వీలైనంతగా తన బంధాలనుంచి స్వేచ్ఛగా విప్పారడం, విధి ఒకవైపు తన స్థలాన్ని కుంచింపచేస్తూ ఉండగా, తాను వీలైనంతగా తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేసుకోవడం, తన చుట్టూ ఉన్న జంతుజీవప్రపంచంలోకి అడుగుపెట్టడం- తమకి విధినిర్దేశించిన పరిమిత ప్రపంచం నుంచి తమకిచ్చిన జీవకాలంలో మొక్కలు ఇలా తమని తాము విస్తరింపచేసుకోవడం ఆశ్చర్యావహం కాదా? పాదార్థిక ప్రకృతి విధించే చలనసూత్రాల్ని ఇలా ధిక్కరించడం అద్భుతం కాదా? సాహసమంటే ఏమిటో, నిర్భీతి, అపారమైన సహనం, ఆధిపత్య ధిక్కారం అంటే ఎలా ఉండాలో మొక్కలు మనిషికి ఒక ఉదాహరణగా నిలబడుతున్నాయి. మనం మనమీద ఒరిగిపడుతున్న అనివార్య స్థితిగతులు-ఉదాహరణకి, బాధ, వృద్ధాప్యం, మృత్యువు-లాంటి వాటినుంచి మనల్ని మనం పైకిలేవనెత్తుకోడానికి, మన తోటలో వికసించిన అతిచిన్న పువ్వు చూపించే శక్తిలో, సహనంలో, సామర్థ్యంలో సగం చూపించగలిగినా కూడా, మన జీవితం ఇలా ఉండకుండా మరోలా ఉండితీరుతుంది.
ఇటువంటి వాక్యాలు చదివినప్పుడు ఒక కవి ఒక శాస్త్రజ్ఞుడు కూడా అయితే ఎంత సత్యసౌరభం వికసిస్తుందో తెలియవస్తుంది. ఒక శాస్త్రజ్ఞుడు కవి కూడా అయితే, బంగారానికి తావి అబ్బినట్టే కదా.
అయితే పూలని ఎంత ప్రస్తుతించినా, మాటర్లింక్ కి, మనిషి స్థానం ఏమిటో కూడా తెలుసు. మనిషి బలం ఎక్కడుందో అతడు మర్చిపోడు. చూడండి ఏమంటున్నాడో:
ప్రాణికోటిలోగానీ, ప్రకృతిలోగాని, మొత్తం ప్రతిభ అంతా జాతిలో ఉంటుంది, కాని విడివిడి ప్రాణుల్ని పరికించి చూస్తే అవి మొద్దుల్లానే కనిపిస్తాయి. ఒక్క మానవజాతిలో మాత్రమే మనం రెండు ప్రజ్ఞానాల యథార్థవికాసాన్ని చూడగలం. ఆ రెండు ప్రజ్ఞానాల మధ్యా ఒక సమతూకాన్ని నిశితంగానూ, క్రియాశీలకంగానూ నిలుపుకోవడంలోనే మానవజాతి భవిష్యరహస్యం దాగి ఉంది.
అంటే పువ్వుల్లో, పక్షుల్లో, క్రిమికీటకాల్లో కనవచ్చే ప్రజ్ఞ విడివిడి ప్రాణుల ప్రజ్ఞ కాదు. అవి ఆయా జాతులు పరిణామక్రమంలో ఒక జాతిగా సాధించుకున్న ప్రజ్ఞ. అందుకే ఒక సాలీడు గూడు ఎంత బాగా అల్లినా, యుగాలుగా, గూడు మాత్రమే అల్లగలదు, మరొక పని చెయ్యలేదు అని అంటాడు టాగోర్. కాని ఒక్క మనిషికి మాత్రమే రెండు రకాల ప్రజ్ఞానాలు సాధ్యం. ఒకటి మానవజాతిగా యుగాలుగా సముపార్జించుకున్న అనుభవం, వివేకం. రెండోది ఒక విడి వ్యక్తిగా, ఒక బుద్ధిగా, ఒక హృదయంగా తనకై తాను చేయగల ఊహాగానం, రూపొందించగల సిద్ధాంతం, ఉదాహరణగా చూపించగల తన ప్రవర్తన. మానవాళికి సుందర భవిష్యత్తు సాధ్యపడాలంటే, జాతిగా, వ్యక్తులుగా- రెండురకాలుగానూ సాధ్యపడుతున్న ప్రజ్ఞానాల మధ్య ఎప్పటికప్పుడు సమతూకం సాధించుకుంటూ ఉండాలి అంటున్నాడు మాటర్లింక్.
27-6-2024


Beautiful!
అసలు మన రచయితలకి ఎంతమందికి ఎన్ని పూలపేర్లు తెలుసు?
మీ దగ్గరే చదివి గమనించిన వాల్మీకి, టాగోర్ అని ఆగి అనుకున్నాను. మీ జవాబూ అదే.
తాజా పూవులను అలంకరించుకున్న రాముడి పట్ల నాకు ఆసక్తి అని మీరు రాసిన మాటలు నన్ను మళ్ళీ మొత్తం రామాయణం చదివేలా చేశాయి గతంలో ఒకసారి. ( పుల్లెల వారి దయ)
ధన్యవాదాలు మానసా!
అద్భుతం
ధన్యవాదాలు స్వాతీ!
అద్భుతమైన వ్యాసం సార్
ధన్యవాదాలు గోపాల్!
పువ్వులు మనతో మాట్లాడుతాయి నిజంగానే
నేను శాస్త్రజ్ఞుడు , కవీ ఇలా ఏదీ కాకపోయినా
మీ నీటి రంగుల పువ్వుల్లో జీవం పుష్కలంగా ఉంటుందని మాత్రం తెలుసుకోగలిగాను 💐🍵
శుభోదయం గురువుగారు
ధన్యవాదాలు సోమ భూపాల్!
అదే నేల ,అదే నీరు,అదే గాలి . కాని వేర్లు వాటికేం కావాలో సంగ్రహించే లక్షణం ఒక అద్భుతం. ఒక చెట్టు ఆకులన్నీ ఒకే ఆకృతి, ఒకే వాసన , ఒకే కమైన శాఖా విన్యాసం ఒకేరకమైన పూవులు , ఒకే రకమైన పరిమళాలను సంతరించుకోవడం సృష్టి విచిత్రాలలో ఒకటి అనిపిస్తుంది.
అవును సార్! మీ స్పందనకు ధన్యవాదాలు.
ధన్యవాదాలు మేడం!
అద్భుతమైన, అపురూపమైన పరిశీలన సర్.. సృష్టిలో ప్రతి చిన్న విషయంలో ఉన్న ప్రత్యేకతను, విశిష్టతను, భిన్నతను, అద్వితీయతను నిశితంగా పరిశీలించి, అర్ధం చేసుకోసుకొని.. కవితాత్మకంగా గ్రంథస్థం చేసిన మహానుభావుల ఋణం ఎలా తీర్చుకోగలమో!!
ధన్యవాదాలు మేడం
ఏదైనా పుస్తకం చదివితే అది చదువుతుండగానో, చదివినవెంటనో మనలో రేకెత్తే స్పందనల్ని వెంటనే రాసేసుకోవాలి. లేకపోతే పూల తావిలాగా అవి గాల్లో కలిసిపోతాయి. మాటర్లింక్ పూల గురించి రాసింది చదివాక ఆ స్పందనలు నా రక్తంలో కలిసిపోయినట్టున్నాయి. ఏదో ఒకటీ రెండూ వాక్యాల్నీ, అక్కడా ఇక్కడా ఏరి మళ్ళా గుర్తుచేసుకుందామనుకుంటే, ఆ వాక్యాలు పుస్తకాల మధ్యలో పెట్టి ఎండిపోయిన పూలరేకల్లాగా ఉన్నాయి.
‘ఏ మంచిపూవులన్ ప్రేమించినావొ నిను మోచె నిన్ను తల్లి కనకగర్భమున’ అన్నాడు కవి. అలాంటి బంగారు తల్లులు ప్రతిదేశంలోనూ, ప్రతి భాషలోనూ ఉండటం మన అదృష్టం.
ఈ మాటలు చాలు .
నేను ఎప్పుడూ చేసేది ముందుగా నాకు నచ్చినవి రాసి దాచుకోవడం. కేవలం మీ రచనలు మాత్రమే.
మీ సునిషిత పరిశీలన నాకు మంచి మెలుకువ ని కలిగించి నేను చెప్పదలుచుకున్న విషయాల పట్ల స్పష్టత కల్పిస్తుంది.
అదొక్కటే కాదు. నేను దాచి ఉంచిన సంగతులు మా పిల్లలకి మాటల మధ్య తెలియజేస్తూ ఉంటాను.. వాళ్ళు వారి పిల్లలకి తెలియజేయాలనే . అదే జరుగుతోంది కూడా. పుస్తకాల పట్ల నిజంగానే అవగాహన కలిగిన మా పిల్లలు వారి అబ్బాయికి తెలియజేయడం నాకు అమితానందం కలుగజేసి విషయం.
ఇదే తమరు చెప్పే అద్భుతమైన పరంపర.
నమోనమః
ధన్యవాదాలు మేడం
మనం రోజూ చూసే ఇరవై ముప్ఫై పూల మీద ఒక పుస్తకం రాయమని వినతి. కాసిని పూల చిత్రాలూ, కాసిన్ని పూలతో ఇంటర్వ్యూలూ , ఇంకాసిన్ని పూలతో చర్చలూ , మధ్యలో నాయికలూ, పుష్పలావికలూ, పక్కన పుష్ప ధారులూ, ధారిణులూ వెరసి కాళిదాసు పూరించిన కుసుమే కుసుమోత్పత్తి అన్నట్లు తయారయితే ఆహా… ఆలోచనే మనోమోహనంగా ఉంది . The world is waiting for you
మంచి ఆలోచన