ఏ దివిలో విరిసిన పారిజాతమో

ఆమెను నేను ఎన్నడూ కలుసుకోలేదు, చూడలేదు, కనీసం ఫోన్ లో కూడా మాట్లాడుకోలేదు. కానీ నా జీవితంలో నా హృదయానికి ఎంతో సమీపంగా వచ్చిన అత్యంత ఆత్మీయుల్లో ఆమె కూడా ఒకరిని మాత్రం గుర్తుపట్టగలిగాను.  ఎప్పుడో ఒకప్పుడు విశాఖపట్నం వెళ్ళినప్పుడు, ఈసారో, మరోసారో ఆమెని చూడాలనీ, ఆమె చేస్తున్న పనుల గురించి మరింత వివరంగా అడిగి తెలుసుకోవాలనీ, ఆమె నుంచి మరింత స్ఫూర్తి పొందాలనీ, ఆమెకి నేను ఏదైనా నాలుగు ధైర్య వచనాలు చెప్పగలిగితే మనసారా చెప్పాలనీ అనుకుంటూ ఉండగానే ఇంతలోనే ఆమె చెప్పా పెట్టకుండా ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది.

ఒకసారి తన వాల్ మీద ఆమె ఫోటో పెట్టినప్పుడు ఆమె కన్నుల్లో అనంతాంబరపు కాంతి లోకాలు కనిపిస్తున్నాయని రాశాను. ఆ కళ్ళు, ఎంతో నిర్మలమైన ఆ కళ్ళు, చివరిదాకా జీవితంతో పోరాడుతూనే ఉన్నప్పటికీ, ఒక్క క్షణం కూడా ఈ లోకం మీద విసుగు చూపించని కళ్ళు,  సదా అమృతం కురిపిస్తూనే ఉన్నవి ఆ కళ్ళు.

నిజానికి ఈ ప్రపంచం సాయి పద్మ లాంటి వాళ్ళకి చెందవలసిన ప్రపంచం. చిరకాలం ఆమెలాంటి వాళ్ళు జీవించవలసిన ప్రపంచం. అంత పోరాట స్ఫూర్తి, అంత ప్రేమైక హృదయం కలిగిన మనుషులు మరొక నాలుగు రోజులు మన మధ్య మసిలితే మనం మరింత సార్ధకంగా, మరింత సంతోషంగా జీవించగలమని నమ్మకం కలుగుతుంది. కానీ అదేమిటో నాకు ఇప్పటికీ అర్థం కాదు- ఈ ప్రపంచం నుంచి ఆమెలాంటి వాళ్లే అంత తొందరగా ఎందుకు వెళ్ళిపోతారో?

సాయి పద్మా! మిమ్మల్ని కలుసుకోలేకపోయాను. ఆ లోటు తీరేది కాదు. కానీ మీరు నాకు పరిచయమయ్యారు అన్న భాగ్యం అంతకన్నా ఎంతో గొప్పది. మనుషులు ఒకరికొకరు స్ఫూర్తిదాయకంగా ఉండడానికి రోజులు తరబడి కలిసి కబుర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదనీ, ఎవరి జీవిత పోరాటాలు వారు కొనసాగిస్తూనే మధ్యలో ఒక్కసారి తలెత్తి చూసినప్పుడు పరస్పరం పంచుకునే ఆ సాంత్వనకన్నా మించిన గొప్ప స్నేహం మరొకటి ఉండబోదని మన పరిచయం నాకు నిరూపించింది.

పద్మా! మొన్ననే కదా మీరు నా పుట్టిన రోజుకి శుభాకాంక్షలు చెప్పారు. నా ప్రతి పుట్టినరోజుకీ మీరు ఏదో ఒక మాట, నన్ను బతికించే మాట, నా పట్ల నా నమ్మకాన్ని బలపరిచే మాట చెప్తూనే వచ్చారు. కానీ నేనే!  నేను మీకేమివ్వగలిగాను? ఇప్పుడు ఇంకేమివ్వగలుగుతాను?

మీరు ఏ దివిలో విరిసిన పారిజాతమో!  మీలాంటి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆ తావుని స్వర్గంగా మార్చగల వాళ్ళు. ఇప్పుడింక నేరుగా స్వర్గాన్నే మీ తావుగా మార్చుకున్నారు.

15-4-2024

9 Replies to “ఏ దివిలో విరిసిన పారిజాతమో”

  1. హృదయపూర్వక అశ్రుపూర్వక నివాళి.

  2. “……. ఎవరి జీవిత పోరాటాలు వారు కొనసాగిస్తూనే మధ్యలో ఒక్కసారి తలెత్తి చూసినప్పుడు పరస్పరం పంచుకునే ఆ సాంత్వనకన్నా మించిన గొప్ప స్నేహం మరొకటి ఉండబోదని……… ” చాలా చక్కటి భావం వీరభద్రుడు గారూ.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading