
కిందటి నెలలో పందొమ్మిదో తేదీన కూకట్ పల్లిలోని యోగి వేమన ఫౌండేషను వారు వేమన పుట్టినరోజు జరిపారు. ఆ సందర్భంగా వేమన గురించి ప్రసం గించవలసిందిగా ఆ సంస్థ అధ్యక్షులు ఎం.ఇ.వి ప్రసాదరెడ్డిగారు నన్ను ఆహ్వానించేరు. కాని కిందటేడాది కూడా, నేను ఆ పండగకు హాజరై ప్రసంగించాననీ, మళ్ళా కొత్తగా చెప్పడానికి ఏముంటుందనీ ఆయనతో అన్నాను. కాని ఆయన ‘కిందటేడాది చెప్పిందే మరోసారి చెప్పండి, మరింత వివరంగా చెప్పండి’ అని అడిగితే కాదనలేక వెళ్ళాను. ఆ సంస్థ వారు ‘యోగి వేమన చరిత్ర, శతకం ‘అనే ఒక పుస్తకం ప్రచురించారు. వేమన మీద నేను గతంలో రాసిన రెండు వ్యాసాలు కూడా ఆ పుస్తకంలో పొందుపరిచారు. ఆ పుస్తకాన్ని ఆ రోజు ఆవిష్కరించే భాగ్యం నాకు కలిగించారు.
వేమన మీద కొత్తగా ఏమి చెప్పగలనా అని అనుకున్న నాకు, ఆ రోజు వారితో పంచుకోడానికి చాలానే విషయాలు కనిపించేయి. ఒకప్పుడు గురజాడ గురించి రాయడానికి ఉద్యుక్తుడవుతూ శ్రీశ్రీ కూడా ఇలానే అనుకున్నది గుర్తొచ్చింది. ఆ రోజు నా ప్రసంగంలో నేను ప్రధానంగా గత మూడు శతాబ్దాలుగా వేమన తెలుగు వారికి ఎప్పటికప్పుడు కొత్తగా ఎలా కనిపిస్తూ వస్తున్నాడో వివరించేను. అయితే ఈ విషయం నేను గతంలో కూడా చెప్పిందే. కాని ఈసారి నేను కొత్తగా చెప్పిందేమంటే, ప్రతి ఒక్క శతాబ్దంలోనూ వేమన కొత్తగా కనిపించడం కాదు, ఎప్పటికప్పుడు వేమన కొత్తగా రూపొందుతున్నాడు అన్నది.
ఈ సందర్భంగా కబీరు విషయంలో కూడా ఇలానే జరిగిందని చెప్పాను. ప్రసిద్ధ కబీరు పండితుడు పారస్ నాథ్ తివారి కబీరు రచనల్లో ఏవి మూలరచనలు లేదా అసలైన కబీరు రాసిన రచనలు అని వడగట్టడానికి ప్రయత్నించాడు. శ్యామసుందర దాస్ వెలువరించిన ‘కబీరు రచనావళి’ (1928) ప్రజాబాహుళ్యంలో చొచ్చుకుపోయిన కబీరు రచనల్ని సంకలనం చేస్తే, తివారీ వెలువరించిన ‘కబీరు గ్రంథావళి ‘(1961-66) అత్యంత శాస్త్రీయ పద్ధతిలో కబీరు మూల రచనల్ని నిష్కర్ష చేసింది. ఆయన తేల్చిన లెక్క ప్రకారం, 744 దోహాలు, 200 పదాలు, ఇరవై రమైనీలు మాత్రమే కబీరు మూలరచనలు. తక్కినవన్నీ కాలక్రమంలో కబీరుపేరుమీద వికసించి, కబీరు స్రవంతిలో చేరిపోయిన రచనలు. కాని ఆయన వేటినైతే మూల రచనలుగా పేర్కొన్నాడో, వాటికన్నా, తదనంతర కాలంలో కబీరు పేరు మీద వ్యాప్తి చెందిన గీతాలే ఎక్కువ ప్రజాదరణకు నోచుకున్నాయని మనం గ్రహిస్తాం. అలహాబాదులోని బెల్వదేరు ప్రెస్సువారు ముద్రించిన కబీరు పదావళిలో తివారి నిగ్గుతేల్చిన రచనలు దాదాపుగా కనిపించవనే చెప్పాలి. అంటే ఏమిటి? ఈ తదనంతర కబీరు కబీరు కాడా? కాడు, భాషాపరమైన సాక్ష్యం ప్రకారం. కాని ఇతడు కూడా కబీరే, భావాన్ని సాక్ష్యంగా తీసుకుంటే. అంటే, ఒక మూలకబీరుని ప్రజలు తమవాడిగా మార్చుకునే క్రమంలో ఆ కబీరు విస్తరిస్తూవచ్చేడన్నమాట.
వేమన విషయంలోనూ ఇదే జరిగింది. పారస్ నాథ్ తివారీ అసలు కబీరుని నిగ్గు తేల్చినట్టుగా, దాదాపు 5000 దాకా విస్తరించిన వేమన పద్యాల్లో, అసలు వేమన పద్యాలు ఏవై ఉండవచ్చు? అదృష్టవశాత్తూ, సంజీవనాథ స్వామి అనే ఫాదర్ లెగాక్ 1729 లో పారిస్ పంపించిన వేమన పద్యాలు అసలు వేమనపద్యాలకు చాలా దగ్గరగా ఉన్నవని మనం రూఢిగా చెప్పవచ్చు. బంగోరె ప్రేరణ మీద, ఆచార్య గోపి అభ్యర్థన మీద, డా.జె.ఎస్.ఆర్.ఎల్. నారాయణమూర్తిగారు ఆ పద్యాల పారిస్ ప్రతిని 1980 లో సంపాదించారు. ఆ పద్యాల్ని ఆచార్య గోపి గారు 1990 లో పుస్తక రూపంగా వెలువరించారు. దానికి ఆరుద్ర విపులమైన పీఠిక కూడా రాసారు. తెలుగు వారి భాగ్యం వల్ల 1730 నాటి పారిస్ ప్రతి పద్యాలు మనకి లభ్యమై మూడు దశాబ్దాలపైనే గడిచినప్పటికీ, వాటికీ, బ్రౌన్ సేకరించిన వేమన పద్యాలకీ ఇంతదాకా ఎవరూ తులనాత్మక పరిశోధన చేసినట్టు నాకు కనిపించలేదు. అలానే 1729 లో సంజీవనాథ స్వామి అనే ఫాదర్ లెగాక్ ఈ పద్యాల్ని ఎందుకు సేకరించాడు, అప్పటి, సామాజిక-రాజకీయ పరిస్థితులు ఎటువంటివి అన్న విషయం కూడా ఎవరూ సమగ్రంగా పరిశీలన చేసినట్టు లేదు. ఆచార్య గోపిగారు వెలువరించిన పుస్తకంలో కూడా ఆరుద్ర, వేటూరి ఆనందమూర్తి, ఆచార్య గోపిగారల వ్యాసాలు కూడా పాఠభేదాలమీద, భాషావిశేషాలచుట్టూ పరిభ్రమించాయేగాని, ఆ పద్యాల ఆధారంగా అసలు వేమనని ఆవిష్కరించే ప్రయత్నం చేయలేదు.
పారిసు ప్రతి లో మొత్తం 367 పద్యాలున్నాయి. వాటిల్లో 294 ఆటవెలదులు, 67 కందాలు, ఒక తేటగీతి,ఒక సీసపద్యం, ఒక చంపకమాల, ఒక పద్యం ఉన్నాయి. వేమనపేరు మీద రకరాకల ముద్రిత, అముద్రిత పద్యాల్లోని దాదాపు 15 వేల పద్యాల్లో కనిపించనివి ఏడు పద్యాలు పారిస్ ప్రతిలో మాత్రమే కనిపిస్తున్నాయని కూడా ఆచార్య గోపిగారు రాసారు. అసలు ఆ ఏడు పద్యాలమీదనే ఒక డాక్టొరల్ పరిశోధన చేసి ఉండవచ్చు.
అసలు వేమన పద్యాల్ని ఫ్రెంచి వారికోసం ఒక జెసూటుమిషనరీ ఎందుకు సేకరించవలసి వచ్చింది? దానికి కారణాలు వెతకాలంటే, పద్ధెనిమిదో శతాబ్దపు ఆంధ్ర-నైజాంపాలిత రాయలసీమ చరిత్రలోకి వెళ్ళాలి. 1746-63 మధ్యకాలంలో మూడు కర్ణాటక యుద్ధాలు జరిగేయి. వీటిల్లో మొదటి కర్ణాటక యుద్ధం 1746-48 మధ్యకాలంలో జరిగింది. కర్ణాటక యుద్ధాలు జరగడానికి కారణం, వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది, యూరోపులో ఇంగ్లాండుకీ, ఫ్రాన్సుకీ మధ్య 1740 లో తలెత్తిన యుద్ధం. ఆ యుద్ధమేఘాలు ఆంధ్ర-నైజాం ప్రాంతంలోని రాయలసీమ దాకా విస్తరించి కర్ణాటక యుద్ధాలుగా పరిణమించేయి. ఆ యుద్ధాలు ముగిసేటప్పటికి, ఆంధ్ర-రాయలసీమ ప్రాంతంలో ఈస్టిండియా కంపెనీ ఆధిపత్యం సుష్థిరమైంది. అంటే 1757 లో ప్లాసీ యుద్ధం జరిగి బెంగాలు ఈస్టిండియా కంపెనీ చేతుల్లోకి పోకముందే, ఈ ప్రాంతాలు బ్రిటిష్ ఆధిపత్యంలోకి ప్రవేశించాయన్నమాట.
కాబట్టి 1746 కన్నా ముందు ఈ ప్రాంతాలమీద ఫ్రెంచివారి దృష్టిపడిందనీ, వారు ఈ ప్రాంతాల్ని ముందు మత పరంగా, తర్వాత రాజకీయంగా ఆదిపత్యంలోకి తెచ్చుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నారనీ మనం గ్రహించవచ్చు. అప్పటికి భారతదేశంలో వలసలు ఏర్పరచుకుంటున్న పోర్చుగీసు వారి కంటపడని ఆంధ్ర-రాయలసీమలోని ఈ ప్రాంతాల్లో ఫ్రెంచి జెసూటు మిషనరీలు ఒక Carnatic Mission తో 1700 నాటికే అడుగుపెట్టారు. ‘ప్రజల ద్వారం గుండా ప్రజల్ని సమీపించి మన ద్వారం గుండా వారిని మనలోకి తెచ్చుకోవడం’ ఆ మిషను ఉద్దేశ్యం. అందుకోసం వారు కర్మకాండకీ, అగ్రవర్ణాల ఆధిపత్యానికీ దూరంగానూ, ఇంకా చెప్పాలంటే వాటిపట్ల అసంతృప్తితోనూ ఉన్న ప్రజలతో మమేకమై వారి సాహిత్యాన్ని సేకరించే పనిమొదలుపెట్టారు. అప్పుడు ఫ్రాన్సును పరిపాలిస్తున్న పధ్నాలుగవ లూయీ పారిసుని ప్రపంచ విజ్ఞానకేంద్రంగా మార్చాలని కలలుగన్నాడు. ఆయన ఆదేశాల ప్రకారం ఫ్రెంచి జెసూట్లు కళల్నీ, సైన్సునీ పెంపొందించగల సాహిత్యం ఎక్కడెక్కడున్నా సరే దాన్ని పారిసు తరలించే పని 1695 లోనే మొదలుపెట్టారు.
అందులో భాగంగా రాజుగారి గ్రంథాలయానికి లైబ్రేరియన్ గా ఉన్న అబే బిగ్నాన్ కొంతమంది జెసూట్లను భారతదేశం పంపించాడు. వారిలో జెసూట్ ఫాదర్ లెగాక్ లేదా సంజీవనాథ స్వామి చంద్రగిరి కేంద్రంగా పనిచేసాడు. అప్పటికి భారతదేశంలో ప్రవేశించి పని మొదలుపెట్టిన మొదటి జెసూట్లు సంస్కృతం, తమిళం మీద దృష్టిపెట్టగా, లెగాక్ తెలుగు మీద దృష్టిపెట్టాడు. తెలుగు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని ముఖ్యంగా రెడ్లు, గండికోట క్షత్రియుల్ని సమీపించడానికి అప్పటి రాయలసీమలో ప్రచలితంగా ఉన్న సాహిత్యం తమకి తోడ్పడగలదని అతడు భావించాడు. అప్పటికే వేమన పద్యాలు ఆ ప్రాంతంలో ప్రచలితంగా ప్రజలనాలుకలమీద ఉన్నాయి. కాబట్టే అతడు ఆ పద్యాల్ని మొదటి ప్రాధాన్యతలో సేకరించి పారిసు పంపించాడు.
సంజీవనాథ స్వామి సేకరించిన వేమన పద్యాల్ని మనం ఈ నేపథ్యంలో పరిశీలించాలి. ఆయన ఆ పద్యాల్ని ఏ గ్రామాలనుంచి, ఏ వృత్తికారులనుంచి, ఎన్ని ప్రతులుగా సేకరించాడో లేక అన్నీ కూడా మౌఖికంగానే సేకరించాడో మనకు తెలియదు. అలానే అతడు తనకి దొరికిన పద్యాలన్నీ సేకరించి పంపించాదో లేక ఏవన్నా వదిలిపెట్టేశాడో కూడా తెలియదు. కాని 1695-1746 మధ్యకాలంలో ఆంధ్ర-నైజాం పాలిత రాయలసీమ పైన ఫ్రెంచి వారు పెట్టుకున్న మతధార్మిక-రాజకీయ ఆకాక్షల్ని బట్టి, ఫాదర్ లెగాక్, వీలైనన్ని పద్యాలు సేకరించి, దొరికి నవన్నీ పంపించేడనే అనుకోవాలి. తాను సేకరించిన పద్యాల్ని అతడు తిరిగి మళ్ళా వడబోతపొయ్యలేదని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే, తాను పని చేస్తున్నది ఒక రాజాజ్ఞ మేరకు కాబట్టి, బ్రౌనులాగా, తనకి దొరికిన పద్యాల విషయంలో స్వతంత్రించి నిర్ణయాలు తీసుకునే స్థితిలో లెగాక్ ఉండి ఉండడని చెప్పవచ్చు.
కాబట్టి సంజీవనాథ స్వామి వేమన పద్యాల్ని సేకరించి, సంకలనం చేసి, పంపించడానికే పరిమితమైనప్పటికీ, అతడు తనకు తెలిసో, తెలియకుండానో, ఒక వేమనను నిర్మించాడు. ఆ వేమన పద్ధెనిమిదో శతాబ్దపు వేమన. మనముందున్న పారిసు ప్రతి పద్యాల్ని మనం నిశితంగా చదివినప్పుడు, మనకి కనిపించే వేమనకి మూడు లక్షణాలున్నాయని చెప్పవచ్చు. మొదటిది, అతడు అప్పటి ఆంధ్ర-నైజాం పాలిత రాయలసీమలో కొత్తగా తలెత్తుతున్న రెడ్డి-పాళేగారు-కాపు రాజకీయ శక్తుల ప్రాంతానికి చెందినవాడు. అందుకనే వేమన గురించిన అన్ని ఐతిహ్యాల్లోనూ ఆయన్ని ఒక రెడ్డిగా చిత్రిస్తూ వచ్చారు. రెండోది, విజయనగర సామ్రాజ్య పతనం (1565) నుంచి మొదటి కర్ణాటక యుద్ధం (1746) మధ్య రెండు శతాబ్దాల పాటు వివిధ రాజకీయ వర్గాలు- మొగలులు, మరాఠాలు, స్థానిక నవాబులు- ఆధిపత్యంకోసం కలహిస్తూ ఉన్నారు. నిరంతర రాజకీయకల్లోలం, కరువుకాటకాలు, పన్నులు, అణచివేతలు ప్రజాజీవితాన్ని కుంగదీస్తూ వచ్చాయి. అటువంటి కాలంలో రాజులూ, పురోహితులూ ఇద్దరూ కూడా ప్రజలకు దారిచూపించలేకుండా ఉన్నారు. ఆ ఆత్మవంచన, సామాజిక కాపట్యం, డంబం మీదనే 1729 నాటి వేమన తమ అస్త్రాల్ని ఎక్కుపెట్టాయి. కాని అదే సమయంలో, వీటినుంచి ప్రజల్ని కాపాడగల ఒక దారి తెలిసినవాడిగా కూడా, అటువంటి ఒక విద్యనేర్చినవాడిగా వేమన ఆ పద్యాల్లో కనిపిస్తాడు. ప్రజలకు రాజకీయ శక్తులు స్థిరతని ఇవ్వలేని అటువంటి దుర్భర కాలంలో ఆయన చేతిపనివారలవైపూ, వృత్తికారులవైపూ చూసేడని చెప్పవచ్చు. అందుకనే ఆ పద్యాల్లో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేతగాళ్ళు, విశ్వకర్మలు కనిపిస్తారు. కబీరులానే వేమన కూడా అంగడికి చెందిన పదజాలంతోనే ఆత్మవిద్య బోధిస్తాడు. సరిగ్గా ఈ కారణం వల్లనే లెగాక్ వేమన్నని పట్టుకున్నాడని మనం చెప్పవచ్చు.
ప్రజాజీవితంలో ఒక నిశ్శబ్ద విప్లవం సంభవిస్తూ ఉంది. పద్ధెనిమిదో శతాబ్ద ప్రారంభం నాటికి ఆంధ్ర-నిజాం పాలిత రాయలసీమ ప్రజలు రాజ్యానికీ, మతానికీ చెందిన అన్ని విషయాల్లోనూ నిచ్చెనమెట్ల వ్యవస్థతో విసిగిపోయారు. ఆ వ్యవస్థని ఎత్తిచూపడంలో వేమన నీళ్ళు నమల్లేదు. ఉదాహరణకి ఈ పద్యాలు చూడండి:
నేర్పుగల్గువారు నెరతనము గలవారు
విద్యచేత విర్రవీగు వారు
పసిడిగల్గువాని బానిస కొడుకులు-
అల్పజాతివాని కధికారమిచ్చినా
దొడ్డవాడయినను తూలితిట్టు
చెప్పుదినెడి కుక్క చెరుకు తీపెరుగునా-
కోతినొకడు తెచ్చి కొత్త పట్టముగట్టి
కొండముచ్చులెల్ల కొలిచినట్టు
నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు-
ఆ పరిస్థితుల్లో ప్రజలు తమకీ, సత్యానికీ, తమకీ, దేవుడికీ, తమకీ, రాజుకీ మధ్య మరింత తక్షణ, మరింత ప్రత్యక్ష, మరింత సరళ సంబంధాన్ని కోరుకుంటూ ఉన్నారు. దాన్ని వేమన పట్టుకున్నాడు.
శతాబ్దాలుగా వేమనలోని ఈ సామాజిక విమర్శకుడి రూపం ఎలా మారుతూ వస్తున్నప్పటికీ, పిల్లలకీ, పెద్దలకీ కూడా పనికొచ్చే ఒక ఆచరణాంతక నీతిని బోధించే ఒక వేమన పారిసు పద్యాలనాటికే చాలా స్పష్టంగా ఉన్నాడు. చూడండి, ఈ పద్యాలు 1729 నాటికే వేమన పేరుమీద ప్రచలితంగా ఉన్నాయి.
‘పెక్కు చదువులేల, తర్కవాదములేల. ..’
‘ఆత్మశుద్ధిలేని ఆచారమది యేల. ..’
‘పదుగురాడు మాట పాటియై ధరజెల్లు. ..’
‘అల్పనరుడు బల్కు ఆడంబరముగాను. ..’
‘తప్పులెంచువారు తండోపతండముల్ . ..’
‘కులములోననొకడు గుణవంతుడుండాయెనా . ..’
‘ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు. ..’
‘వేరు పురుగు చేరి వృక్షంబు జెరుచును. ..’
‘అనువుగాని వేళ అధికులమనరాదు …’
‘నీళ్ళలోన మొసలి నిగిడి ఏనుగు దిను. ..’
‘ఎంత చదువు చదివి ఏ నీతి విన్నను. ..’
‘గంగిగోవు పాలు గరిటెడెనైనను చాలు. ..’
‘చంపదగిన యట్టి శత్రువుతనచేత. ..’
ఈ పద్యాలు పారిసు చేరిన వందేళ్ళ తరువాత ఈస్టిండియా కంపెనీ ఉద్యోగిగా కడపకి వచ్చిన సి.పి.బ్రౌను 1824 లో మొదటిసారి వేమన పద్యాలు చేతుల్లోకి తీసుకున్నప్పుడు తనకి చాలా సులభంగా, సరళంగా అర్థం కాగల ఒక తెలుగు కవి దగ్గరైనట్టే భావించాడు. ఆ తర్వాత ఆయన వేమన పద్యాల్ని ఇంగ్లిషులోకి అనువదించడం, వేమన ఒక అంతర్జాతీయ కవిగా మారడం, ఆ సంగతంతా మనకు తెలిసిందే. కాని మనం గుర్తించని విషయమేమిటంటే, బ్రౌను వేమన గురించి మాట్లాడుతున్నప్పుడు, తనకు తెలియకుండానే పందొమ్మిదో శతాబ్దపు వేమనని రూపొందిస్తూ ఉన్నాడని.
ఆయనకి వేమన గురించి అబే దుబోయి పుస్తకం ద్వారా తెలిసిందే తప్ప, అప్పటికి పారిసులో ఉన్న పద్యాలు ఆయన చూడలేదు. ఆయనకి లెగాక్ గురించి కూడా తెలిసి ఉండదు. కాబట్టి వేమన పద్యాలు తాను సేకరించినప్పుడు, 1824 లో వాటిని అనువదించినప్పుడు, వాటిని moral, satirical and mystic తరగతులకు చెందినవిగా వర్గీకరించాడు. అప్పటికే తాను 2100 కు పైగా వేమన పద్యాల్ని సేకరించానని చెప్తూ, వాటిల్లో 693 పద్యాలు మొదట్లో అనువదించాడు. తర్వాత 1839 నాటికి ఆ సంఖ్య 1215 కి చేరుకుంది. ఆ సంపుటికి రాసుకున్న ముందుమాటలో ఆ పద్యాల్ని మొదట అయిదు తరగతులుగా అంటే religious, moral, satirical, mystic and miscellaneous అనే అయిదు తరగతులుగా వర్గీకరించుకుని, ఆ తర్వాత చివరి రెండు తరగతుల్నీ పక్కనపెట్టి, religious, moral, satirical విభాగాల్ని మాత్రమే తన అనువాదంలో పొందుపరిచాడు. 1824 నాటి అనువాదంలో వేమనను ఒక వేదాంతిగా అభివర్ణించినవాడు కాస్తా, 1829 నాటికి వేమన ఒక జంగం కావొచ్చునని ఊహించాడు1840 నాటి ముందుమాటలో వేమన బసవన్న బోధల పట్ల మొగ్గు చూపుతున్నాడేగాని వీరశైవుడు కాడని అభిప్రాయపడ్డాడు. 1866 లో చివరగా రాసిన వ్యాసంలో వేమనను rustic epigrammatist అని అభివర్ణిస్తూ, అతడి పట్ల బ్రాహ్మణపండితుల ద్వేషం, నిరాదరణా వల్ల వాళ్ళు తనని కూడా దూరంపెట్టారని రాసుకున్నాడు.
1824 నుంచి 1866 దాకా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు బ్రౌను వేమనతో కలిసి నడిచాడు. ఆ ప్రయాణంలో వేమన గురించి ఏదీ ఇతమిత్థంగా తేల్చుకోలేకపోయాడు. పైగా, తనకు తెలియకుండానే తనొక వేమనను రూపొందిస్తూ ఉన్నాడు. ఎలా? మొదటిది, తాను సేకరించిన మొత్తం పద్యాల్ని అనువదించకపోవడం వల్ల. అంటే మొత్తం పద్యాల్లో కొన్ని పద్యాల్ని ఎంచుకోవడంతోటే, అతడు అసలు వేమనని పక్కన పెట్టి, తన దృష్టిలో ఉన్న వేమనకు పట్టంకట్టినట్టే అవుతుంది. అలా పద్యాల్ని ఎంపిక చేస్తున్నప్పుడు మొదట్లో mystic గా కనిపించిన పద్యాల్ని తర్వాత వదిలిపెట్టడం గమనించాలి. ఎందుకు వదిలిపెట్టాడు? .. because devoid of interest and utility అని రాశాడు. ఈ రెండు పదాలూ గమనించదగ్గవి. ఆయన utility అనే మాట వాడటం వెనక తనకు తెలియకుండానే ఇంగ్లిషు యుటిలిటేరియనిజానికి అనుగుణంగా వేమనని పరిశీలిస్తున్నాడన్నమాట. 1829 లో రాసిన ముందుమాటలో ఆయన తాను వదిలిపెట్టిన పద్యాల్లో చాలా భాగం satirical తరహావే అని చెప్తూ, అందుకు కారణం వాటిల్లో .. railing was substituted for just remarks అని రాసాడు. అంటే ఏమిటి? సంఘాన్ని విమర్శించినప్పుడు ఆ విమర్శ నాయబద్ధంగా ఉండకుండా కేవలం అధిక్షేపంగా మాత్రమే ఉందట. అంటే ఏమిటి? ఆయన వేమనని దాదాపుగా Victorian Sensibility కి అనుగుణంగా సవరించుకున్నాడన్నమాట.
మూడో విషయం, వేమన పద్యాల్ని లెగాక్ సేకరించినప్పుడు వాటిని శతకం అనిగానీ, లేదా religious, moral, and satirical అనిగానీ వర్గీకరించలేదు. అసలు అటువంటి వర్గీకరణనే ఒక పండితసంప్రదాయం. అంటే ఏమిటన్న మాట? లెగాక్ సేకరించిన పద్యాల్లో వేమన ఒక సజీవ సంస్కృతికి గళాన్నిచ్చినవాడుగా, ఒక తిరుగుబాటుదారుడిగా, ఒక రసవాదిగా కనిపిస్తే, బ్రౌను ఆయన్ని ఒక philosopher-poet గా రూపొందించే ప్రయత్నం చేసాడు. అటువంటి ప్రయత్నానికి తనకి అనువుగా అనిపించిన పద్యాల్ని అనువదించాడు. అనువుగా కనిపించనివాటిని పక్కన పెట్టేసాడు. తన పద్యాల్ని బ్రౌను అలా వర్గీకరించాడని తెలిస్తే అందరికన్నా ముందు వేమననే అసంతృప్తి వ్యక్తం చేసి ఉండేవాడు. తాను జీవితకాలం ఏ పండితసంప్రదాయాన్ని ధిక్కరిస్తూ వచ్చాడో తిరిగి అటువంటి పండితుల చేతుల్లోనే తాను పడ్డానని వాపోయి ఉండేవాడు. అంతేకాదు, బ్రౌను మొదలుగా తదనంతర వేమన పండితులు తనని వేదాంతి, యోగి, వీరశైవుడు, శివయోగి, నాథయోగి మొదలైన పేర్లతో పిలవడాన్ని కూడా వేమన తట్టుకోలేకపోయి ఉండేవాడు.
బ్రౌను 1829 లో రాసిన ముందుమాటలో వేమనని గ్రీకు కవి లూసియన్ తో పోల్చాడు. Lucian of Samosata (సా.శ.125–180)తో బ్రౌను వేమనని పోల్చడం ఎంత వరకూ సముచితం అన్నది కూడా ఎవరూ ఇంతదాకా అధ్యయనం చేసినట్టు లేదు. స్థూలంగా చూసినప్పుడు ఈ ఇద్దరి మధ్యా పోలిక సమంజసమే అనిపిస్తుందిగాని, ఇద్దరి మధ్యా కీలకమైన భేదం ఒకటుంది. లూసియన్ వ్యంగ్యం వ్యంగ్యంతోటే ఆగిపోతుంది. కాని వేమన వ్యంగ్యం వెనక, అధిక్షేపం వెనక, సామాజిక విమర్శ వెనక పరిపూర్ణమానవుడి కోసం ఒక ఆరాటం ఉంది. అసలైన ఒక విద్య గురించిన అన్వేషణ ఉంది. తక్కినవారంతా లోహాన్ని శుద్ధి చేసి బంగారంగా మార్చే హేమతారక విద్యకోసం అర్రులు చాస్తున్నప్పుడు వేమన దాన్ని దాటిన ‘ఆత్మ శుద్ధి’ మాట్లాడుతున్నాడు . అందుకోసం మనిషి కొత్తగా చేయవలసింది కూడా ఏమీలేదు, ‘ఒక్క మనసుతోన ఊరకున్న సర్వసిద్ధుడగును, సర్వంబు తానగును-అని కూడా అన్నాడు.
ఇటువంటి పద్యాలు 1729 నాటికే పారిసు చేరుకున్నాయంటే, ఆ వాస్తవాన్ని ఒకసారి మనం కాలరేఖ మీద పెట్టి చూస్తే ఏమి తేలుతుంది? ఆ పద్యాలు లూయీ చక్రవర్తి గ్రంథాలయానికి చేరినప్పటికి ఫ్రెంచి విప్లవం ఇంకా తలెత్తనే లేదు. Age of Enlightenment అప్పుడప్పుడే మొగ్గతొడుగుతోంది. ఆ ప్రమాణాల ప్రకారం వేమన అప్పటి ఫ్రాన్సు కన్నా ఎంతో ముందున్నట్టు లెక్క. కాగా ఒక శతాబ్దం తర్వాత, 1824 నుంచి 1866 దాకా కూడా బ్రౌను తాను దర్శిస్తున్న వేమననని స్పష్టంగా పోల్చుకోలేక, తికమకపడుతూనే ఉన్నాడు. ఇక ఇరవయ్యవ శతాబ్దిలో వేమనని ఒక ధిక్కారకుడిగానూ, విమర్శకుడిగానూ ఎలా చూసారో, ఇరవయి ఒకటవ శతాబ్దిలో ఆయన్ని మళ్ళా కొత్తగా ఒక విద్యావేత్తగా ఎలా దర్శిస్తున్నారో, నేను గతంలో వివరంగా రాసేను, కాబట్టి ఆ రోజు నా ప్రసంగంలో వాటిగురించి మళ్ళా ప్రస్తావించలేదు.
17-2-2026


Wonderful sir
Thank you so much!
నేర్చుకున్నదంత నేర్పుగా నేర్పెడు
నిశ్చయమున సిద్ధి నెరువు మీరు
వేర్లనుండి గొనుచు వెలువరించదె చెట్టు
విశ్వదాభిరామ వినుర వేమ
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
విలువైన సమాచారాన్ని తెలుసుకున్నాం. కృతజ్ఞతలు సార్.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు…
ధన్యవాదములు సార్ 🙏❤️❤️
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
Sir after gathering so much literary knowledge, did you discover any underlying universal truth about life ?
Have you been able to understand the relationship between Man , Universe and God ?
Will any amount of the exploration of material world through science, arts, music etc help realise the ultimate truth ?
Is it an endless cycle of activity between the ocean of consciousness and waves of names and forms?
నేను చేసే ప్రతి ఒక్క పనీ, నా తలపులూ, మాట్లాడే మాటలూ అన్నీ కూడా నాకూ, భగవంతునికీ మధ్య ఒక నిత్య, సజీవ, రసమయ సంబంధంగానే నేను భావిస్తాను.