
అసలు కథాచట్రం భారతదేశంలోనే ఎందుకు ప్రభవించింది? జైనులు కథాచట్రాన్ని ఎలా తల్లకిందులు చేసారు? మధ్యాసియా కథాచట్రాన్ని ఎలా నవీకరించింది? చివరకు పాశ్చాత్యప్రపంచం దాన్ని ఎలా స్వీకరించింది? ఈ ప్రయాణాన్ని వివరించమని హెగెల్ ని అడిగితే ఎలా విశ్లేషిస్తాడు?- ఇవీ మనం కిందటి వారం వేసుకున్న ప్రశ్నలు.
కథాచట్రం అంటే ఏమిటి
కథాచట్రం అంటే కథలో కథ, కథలో కథ, కథలో కథ. మీరు కొండపల్లి బొమ్మలు చూసే ఉంటారు. వాటిల్లో ఒకతరహా బొమ్మలో, బొమ్మలో బొమ్మ, బొమ్మలో బొమ్మ, బొమ్మలో బొమ్మ ఉంటుంది. దానికి స్ఫూర్తి అని చెప్పదగ్గది రష్యను మత్ర్యోష్కా బొమ్మ. అది కూడా అలానే. బొమ్మలో బొమ్మ. కథాచట్రం అంటే అటువంటి మత్ర్యోష్కా బొమ్మ. కొండపల్లి బొమ్మ.
ప్రాచీన యుగాల్లో కూడా ఇతిహాసాలు ప్రభవించినప్పుడు కథాచట్రాన్ని వాడుకున్నారు. ఉదాహరణకి మనం నౌక విరిగిన ఈజిప్షియన్ నావికుడి కథ గురించి చెప్పుకుంటున్నప్పుడు, అది కథలో కథ, కథలో కథ అని చెప్పుకున్నాం. అలానే గిల్గమేష్, బౌద్ధ జాతక కథలు కూడా ఒక రకంగా కథలో కథలే. ఇక మహాభారతమైతే పూర్తిగా కథలో కథ. అది నైమిశారణ్యంలో ఉగ్రశ్రవ సౌతి చెప్పిన కథ. ఆయన ఆ కథ వైశంపాయనుడి నుంచి విన్నాడు. వైశంపాయనుడు వ్యాసుడినుంచి విన్నాడు. ఉదాహరణకి కురుక్షేత్ర ఘట్టం తీసుకుంటే, అది మనకి ముందు సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నట్టుగా ఉంటుంది. కాని అది వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పిన కథలో భాగం. వైశంపాయనుడు జనమేజయుడికి అలా చెప్పాడని ఉగ్రశ్రవ సౌతి శౌనకాది మునులకి చెప్పే కథ అది. కాబట్టి కథాచట్రానికి మహాభారతమే ఒక నమూనా ఇచ్చిందని చెప్పవచ్చు. అంతే కాదు, అందులో, మూలకథకుడైన వ్యాసుడు కథాసృష్టికర్తగా మాత్రమేకాక, ఒక సాక్షిగా, పాత్రగా, కథ ఆగిపోయినప్పుడల్లా, దాన్ని ముందుకు నడిపించేవాడిగా కనిపిస్తాడు. ఉదాహరణకి శంతనుడి కొడుకులు విచిత్రవీర్యాదులు మరణించి, ఆ వంశం నిస్సంతుగా మిగిలిపోయే ప్రమాదం వచ్చినప్పుడు, వ్యాసుడు స్వయంగా రంగంలోకి దిగి ఆ కథని ముందుకు నడుపుతాడు. కురుక్షేత్రంలో పరస్పరం యుద్ధం చేసుకున్నవాళ్ళు వ్యాసుడి సంతతి అని మనం గుర్తుపెట్టుకుంటే, వ్యాసుడు చెప్పిన కథ అతడి స్వానుభవమే అని కూడా మనకి అర్థమవుతుంది.
ఇటువంటి కథానిర్మాణం భారతదేశానికే ఎందుకు ప్రత్యేకం?
ఇటువంటి ఒక కథానిర్మాణం మహాభారతానికే ప్రత్యేకమైందిగా కనిపిస్తుంది. ఎందువల్ల? మూడు కారణాలు చెప్పవచ్చు. మొదటిది, భారతీయ ప్రాపంచిక దృక్పథం ప్రకారం ఈ జగత్తు ఒక సంసారం. అంటే పూర్వకాలపు భారతీయులు చరిత్రని రేఖీయ గమనంలో కాక, వర్తుల గమనంలో చూసారు. జన్మ, మృత్యువు మళ్ళా జన్మ, మృత్యువు. ఎవరి కథా కంచికి చేరుకోదు. తిరిగి తిరిగి మళ్ళా ఆ కథలే సంభవిస్తుంటాయి. మనుషులు తాము చేసిన తప్పులే తిరిగి తిరిగి చేస్తుంటారు. పడ్డ కష్టాలే మళ్ళా మళ్ళా పడుతుంటారు. కాబట్టి ఒకరి కథ మరొకరి కథని అప్రయత్నంగా గుర్తుకు తెస్తుంది. వారి కథలో మరో కథ. కాని చివరికి అన్ని కథలూ ఒక్కలాంటివే. అసంఖ్యాకులైన జీవులు ఇలా జన్మచక్రంలో పడి పైకి కిందకీ లేస్తూ ఉండగా, ఎవరో ఒకరు, ఎరుకకలిగి, వారు ఈ చక్రం నుంచి బయటపడతారు. అలా బయటపడటం ఎలా అని తక్కినవారు ప్రశ్నిస్తూ ఉంటారు. తమకి కూడా ఆ మెలకువ కలిగేదాకా, చెప్పుకున్న కథలే మళ్ళా మళ్ళా చెప్పుకుంటూ ఉంటారు.
రెండోది, ప్రాచీన సమాజం ధర్మం గురించి మాట్లాడినప్పటికీ, ఆ ధర్మం, వర్ణం-ఆశ్రమం-సందర్భం అనే మూడింటి కలయికమీద ఆధారపడేది. అంటే ఎవరేనా ఒక పని చేసారంటే, మంచిగాని, చెడుగానీ, దానికి ఆ పాత్ర తాలూకు నేపథ్యం తెలుసుకోవలసిన అవసరముండేది. అంటే అటువంటి సందర్భంలోనే వారి పూర్వీకులు ఎలా ప్రవర్తించి ఉండేవారో తెలుసుకోవలసిన పని పడేది. లేదా ఎవరో ఒకరు తెలిసినవారు ఆ కథ మళ్ళా చెప్పేవారు. ఉదాహరణకి పరీక్షిత్తు వేటకి వెళ్ళినప్పుడు ఒక ముని తనకి జవాబివ్వడం లేదనే క్షణికోద్రేకంలో ఒక చచ్చిన పాముని అతని మెళ్ళో వేసి తిరిగొచ్చాడు. దాని పర్యవసానం మనకి తెలుసు. కాని పరీక్షిత్తు అలా క్షణికోద్రేకంలో ఉచితానుచితాలు మర్చిపోవడమనేది ఏదో యాథాలాపంగా జరిగింది కాదనీ, కురు వంశచరిత్రలోనే అటువంటి సంఘటనలు పదే పదే పునరావృతమవుతున్నాయనీ చెప్పడానికే భారతం ప్రభవించింది. కద్రువ, వినత మొదలుకుని, దేవయాని, శర్మిష్ఠలమీదుగా, ద్రుపదుడు, ద్రోణుడు మధ్య సంభవించిన వ్యర్థకలహం చివరికి కురువంశనాశనానికి ఎలా దారితీసిందో చెప్పడం మహాభారతం ఉద్దేశ్యం. కాబట్టే, కథలో, కథలో కథ, కథ వెనుక కథ చెప్పుకుంటూ పోతుంది.
ఇక మూడవ కారణం, శిల్ప సంబంధమైంది. ప్రాచీన భారతీయ ఇతిహాసాలు మౌఖిక ప్రధానమైనవి కాబట్టి, ఒకరు మరొకరికి ఆ కథలు చెప్తున్నప్పుడు, తమ కాలాలకీ, అనుభవాలకీ చెందిన కథల్ని కూడా అందులో చేర్చుకుంటూపోయారు.
కాని మహాభారతం నిజమైన కథాచట్రం కాదు
అయినా కూడా మనం మహాభారతాన్ని ఇతిహాసంగా లెక్కేస్తాం తప్ప కథాచట్రంగా లెక్కవెయ్యం. మధ్యయుగాల కథానిర్మాణం కథాచట్రపద్ధతిలో నడవడానికి కారణమైనవి బృహత్కథా, పంచతంత్రమూ తప్ప మహాభారతం కాదు.
ఎందుకని? ఇందుకు మూడు కారణాలు చెప్పవచ్చు. మొదటిది, మహాభారతం చరిత్రను రేఖీయక్రమంలో చూడకుండా, వర్తుల గమనంలో చూసినప్పటికీ, దాని కథానిర్మాణం మాత్రం సరళరేఖీయం. అందులో ఒక కథనుంచి మరొక కథ పుట్టుకొస్తుంది. అంటే ఒకవిధంగా గొలుసుకట్టు కథ అన్నమాట. ఆ పద్ధతిలో అదొక విజ్ఞాన సర్వస్వ లక్షణాన్ని సంతరించుకుంది. అంటే, ఆ గొలుసుకథల్లో రకరకాల సందర్భాల్లో, రకరకాల పాత్రల ద్వారా, ధర్మం,న్యాయం, ఆఖ్యానాలు, ఉపాఖ్యానాలు ఏవైనా చెప్పుకుంటూ పోవచ్చు. అవి మూలకథని బలపరిచేవిగా ఉంటున్నప్పటికీ, వాటిని తొలగించినందువల్ల కథాగమనం కుంటుబడదు. అంటే వాటికీ, ముఖ్యకథకీ ఉన్న సంబంధం అవయవ-అవయవి సంబంధం.
రెండోది, దాని ముఖ్య ఉద్దేశ్యం అనుశాసనం. వేదాలు, ఉపనిషత్తులు బోధించిన ఒక ధార్మిక వ్యవస్థని నిలబెట్టడం. ఆ కథాగమనంలో కూడా ప్రశ్నలు ఉంటాయిగాని, అవి అంతిమంగా వేదవిహిత ధర్మాన్ని మరోసారి ఉద్ఘాటించడానికి ఉపకరించేవిగానే ఉంటాయి. ఇక మూడవది, ముఖ్యమైన అంశం, మహాభారత కథాచట్రాన్ని మరొక జాతి, మరొక సంస్కృతి యథాతథంగా స్వీకరించలేవు. ఎందుకంటే, ఆ సంస్కృతి, ఆ ధర్మం, ఆ అనుశాసనాల నుండి ఆ కథల్ని వేరుచేసి చూపలేం. కాబట్టి ఆ కథల్ని మరోచోట మరో కాలానికి, సందర్భానికి అనువుగా చెప్పుకోలేం.
ఆ అవకాశం బృహత్కథకీ, పంచతంత్రానికీ దక్కింది
అందువల్ల మధ్యయుగాల కథానిర్మాణాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేసే అవకాశం మహాభారతానికి కాక, బృహత్కథకీ, పంచతంత్రానికీ దక్కింది. అందుకు మూడు కారణాలు చెప్పుకోవచ్చు. మొదటిది, బృహత్కథా, పంచతంత్రం రెండూ కూడా, అసలు కథాశిల్పంలోనే, గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చేయని చెప్పవచ్చు. ఎందుకంటే, ఇక్కడ కథ రేఖీయం కాదు, వర్తులం కూడా కాదు. ఎక్కడికక్కడ తెరుచుకుని, మూసుకుపోయే చిన్న చిన్న విడి విడి భాగాల సమాహారం అన్నమాట. Modular. అంటే విడివిడి కథాభాగాలతో నిర్మాణమైన కథాచట్రాలు. వీటిని ఎవరేనా వాడుకోదలుచుకుంటే, ఆ విడివిడిభాగాల్ని విడగొట్టుకుని, పట్టుకుపోయి, తమకి అవసరమైన పద్ధతిలో తిరిగి అమర్చుకోవచ్చు.
రెండోది, మహాభారతం ఒక అనుశాసన లక్ష్యంతో పుట్టింది కాగా, పంచతంత్రం ఒక బోధనాసాధనంగా పుట్టుకొచ్చింది. అది కూడా మందమతులైన ముగ్గురు పిల్లలకి చెప్పిన కథ. ఇంకా చెప్పాలంటే, అతి తక్కువ వ్యవధిలో వారికి విద్యాబుద్ధులు చెప్పే ఉద్దేశంతో చెప్పిన కథ. కాబట్టి, దాని ఉద్దేశ్యం ప్రపంచాన్ని పరిపాలించే ఒక ధార్మిక వ్యవస్థని బలపర్చడం కాదు. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన ఒక వ్యావహారిక నీతిని వివరించడం. కాబట్టి, మధ్యయుగాల్లో, జాతుల మధ్యా, దేశాల మధ్యా యుద్ధాలరూపంలో, వాణిజ్యం రూపంలో సంపర్కం సంభవించినప్పుడు, ప్రపంచపు సరిహద్దులు విస్తరిస్తున్నప్పుడు, ప్రపంచాన్ని అర్థం చేసుకోవలసిన అవసరం వచ్చినప్పుడు, అది కూడా నిరక్షరాస్యులైన అత్యధిక ప్రజానీకానికి చెప్పవలసి వచ్చినప్పుడు, పంచంతంత్ర కథాశిల్పమే ఎక్కువ ప్రయోజనకారిగా కనిపించింది. ఎందుకని? ఎందుకంటే, ఆ శిల్పాన్ని స్వీకరించి, ఆ కథల్ని స్వంతం చేసుకోడానికి, జాతి, సంస్కృతి, పాండిత్యభేదాలేవీ అడ్డురావు కాబట్టి.
ఇక, మూడవది, అన్నిటికన్నా ముఖ్యమైంది, బృహత్కథా, పంచతంత్రమూ రెండూ కూడా అంతదాకా దైవకేంద్రకంగా ఉన్న కథని ఇహలోక కేంద్రకంగా మార్చేసాయి. దీన్ని మనం secularization అనవచ్చు.
బృహత్కథ
మనం ప్రాచీన కథారూపాల గురించి చర్చించు కుంటున్నప్పుడు సామాన్యశకం మొదటి శతాబ్దిలో రోములో ఫయాడ్రసు చెప్పిన వ్యంగ్యకథల దాకా వచ్చి ఆగాం. సరిగ్గా అదే కాలంలో గోదావరీ తీరంలో శాతవాహన పాలనా కాలంలో ఒక లౌకిక సాహిత్య విప్లవం సంభవించింది. ముఖ్యంగా హాలశాతవాహనుడి పాలనా కాలంలో (సా.శ.20-24) ఆయనే స్వయంగా సంకలనం చేసిన గాథాసప్తశతి పూర్తిగా లౌకిక, సామాన్యజనజీవితాన్ని చిత్రించిన కవిత్వం కాగా, ఆయన కాలంలోనే గుణాఢ్యుడనే రచయిత రాసాడని చెప్పే బృహత్కథ కథాప్రక్రియని మొదటిసారిగా నేలకు దింపింది.
తాను రాసిన రచనని రాజు నిరాదరించాడనీ దాంతో గుణాఢ్యుడు ఆ కావ్యాన్ని అగ్నికి ఆహుతి చేసాడనీ మనం వింటూ వచ్చాం. ఆ కావ్యాన్ని గుణాఢ్యుడు పైశాచీ భాషలో రాసాడని కూడా విన్నాం. ‘పిశాచం’ అంటే మనుష్యమాంసాన్ని ఆరగించేది అని అర్థం. కాబట్టి పైశాచి అనేది, వింధ్యప్రాంతంలోని అప్పటి గిరిజనతెగల ఒక భాషకి, ఒక ప్రాకృతవిశేషానికి, సంస్కృతకవులు పెట్టుకున్న నిందార్థకమైన పేరు అని మనం ఊహించవచ్చు. అంటే గుణాఢ్యుడి బృహత్కథ, గోదావరీ తీరంలో, ఇప్పటి తెలంగాణా ప్రాంతంలో, వింధ్యపర్వతశ్రేణి అంచుల్లో, ఒక గిరిజన ప్రాకృతంలో రాసిన కావ్యం అని నిర్ధారణగా చెప్పుకోవచ్చు. ఆ పుస్తకం నష్టమైనప్పటికీ, ఆ కథ మాత్రం తదనంతరం కాదంబరి, బృహత్కథామంజరి, కథాసరిత్సాగరం వంటి గ్రంథాలకు మూలకథగా నిలబడిపోయింది.
పంచతంత్రం
ఇక సా.శ.మూడవశతాబ్దికి చెందిన పంచతంత్రం కథాప్రక్రియను పూర్తిగా ఇహలోక కథగా మార్చేసింది. విష్ణుశర్మ అనే ఒక పండితుడు ముగ్గురు మందమతులైన రాజపుత్రుల్ని ఆరునెలల్లో సుబుద్ధులుగా మార్చడానికి చెప్పిన కథలు. అందులో మిత్రలాభం, మిత్రభేదం, కాకోలుకీయం, లబ్ధప్రణాశం, అపరీక్షిత కారకం అనే అయిదు భాగాలుగా కథాచట్రం నిర్మాణమైంది. పంచతంత్రం, బృహత్కథ- ఈ రెండింటిలో ఏదిముందు, ఏది వెనకా అని చెప్పడమూ కష్టమే, అలాగే ఒకదాన్నుంచి మరొకటి పుట్టుకొచ్చిందని చెప్పడమూ కష్టమే. సా.శ. మొదటి రెండు శతాబ్దాల యుగధర్మంలోంచే ఈ రెండు కథనచట్రాలూ ప్రభవించాయని చెప్పవచ్చు. తర్వాత రోజుల్లో కథాచట్రాన్ని ప్రభావితం చేసినప్పుడు, ఒకదానికొకటి పూరకాలుగా పనిచేసాయని కూడా చెప్పవచ్చు.
ఉదాహరణకి కథాచట్రానికి అవసరమైన తర్కాన్ని బృహత్కథ సమకూరిస్తే, కథాశిల్పానికి అవసరమైన సౌలభ్యాన్ని పంచతంత్రం సమకూర్చింది. మహాభారతం ఉపదేశాత్మకం కాగా, పంచతంత్రం బోధనాత్మకం. అంటే మహాభారతంలో చెప్పినదాన్ని మళ్ళా మరొక కథాచట్రం ద్వారా చెప్పలేం. కాని పంచతంత్రంలో చెప్పిన నీతిని మరో రకం కథాచట్రంతో కూడా చెప్పవచ్చు. అలాగే పంచతంత్రం ప్రధానంగా పశుపక్ష్యాదుల్ని పాత్రలుగా తీసుకుంది. ఇంకోలా చెప్పాలంటే, కథాచట్రంలో పొదిగిన జానపదకథా సంపుటమే పంచతంత్రం అనవచ్చు. అంటే ఒక పాత్ర ఒక కథ చెప్పగానే ఆ కథ అక్కడితో అయిపోతుంది. మళ్ళా మరొక పాత్ర మరొక కథ చెప్తే, అప్పుడు మరొక కథ మొదలవుతుంది. బృహత్కథ అలా కాదు. అది నరవాహనదత్తుడనే ఒక మనిషి చేపట్టిన సాహసయాత్ర. ఆ యాత్రలో అతడికి తారసపడ్డ ప్రతి ఒక్కరూ ఒక కథ చెప్తారు. ఆ కథలోంచి మరో కథ పుట్టుకొస్తుంది. ఆ విధంగా దానికి సముద్రమంత వైశాల్యం సాధ్యపడింది.
పంచతంత్రంలో బోధన ముఖ్య ఉద్దేశ్యమైనప్పటికీ, అది శ్రోతకి ఆహ్లాదాన్నీ, విస్మయాన్నీ, చమత్కారం వల్ల కలిగే సంతోషాన్నీ కూడా అందిస్తుంది. కానీ బృహత్కథకి అటువంటి ఉపదేశ బాధ్యత లేదు. అది పూర్తిగా అద్భుత రసప్రధానం. శ్రోతలో సౌందర్య స్పృహని జాగృతం చెయ్యడం మీదనే దాని దృష్టి. తర్వాత రోజుల్లో కథాచట్రాలు వికసించినప్పుడు, పంచతంత్రం నుంచీ, బృహత్కథనుంచీ కూడా పరస్పరపూరకంగా ఉన్న ఈ రెండు రకాల లక్షణాల్నీ స్వీకరించాయి.
కథాలౌకికీకరణ
కథాచట్రం వల్ల లౌకీకరణ సాధ్యపడటం కాదు, కథని లౌకిక అవసరాలకు వాడుకోవడం కోసమే కథాచట్రం అవసరమైందని చెప్పవచ్చు. ఇందుకు ప్రధానంగా నాలుగు కారణాలు చెప్పవచ్చు. మొదటిది, ధర్మాన్ని బలపరచడమే సాహిత్య లక్ష్యమని భావించే సమాజంలో, ధర్మాన్ని నేరుగా ప్రశ్నించడం కన్నా, పశుపక్ష్యాదుల పాత్రల ద్వారా ప్రశ్నించడం సులభం. కథాచరిత్రలో అలిగరి ఒక రాజకీయ అవసరంగా మారడాన్ని మనం అర్ధం చేసుకోగలం.
రెండవది, ధర్మశాస్త్రాలు లేదా ధర్మాన్ని ప్రతిష్ఠించాలనుకునే ఇతిహాసాలు, సత్యం అపౌరుషేయం అని నమ్ముతాయి, తమ శ్రోతల్ని కూడా అలా నమ్మమని చెప్తాయి. అలాకాక, యథార్థ జీవితసన్నివేశాల్లో ధర్మం విస్పష్టంగా ఇదీ అని చెప్పగలిగేదిగా ఉండదనీ, ఒకటి కన్నా ఎక్కువ మార్గాలు కనిపిస్తున్నప్పుడు, ఒకదానికన్నా మరొకటి ఎందువల్ల మంచిదో వివేచించి తేల్చుకోవలసి ఉంటుందనీ కథకులు భావిస్తారు. జీవితం పరలోక ప్రధానమైనప్పుడు రెండో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. మంచిచెడుల గురించిన చింతన మొదలుకావడమే జీవితం ఇహలోక ప్రధానమవుతున్నదనడానికి గుర్తు. కథాచట్రాల్లో మనకి కనిపించేది ఈ సంవాదమే.
మహాభారతం ధర్మానికీ, ధర్మసూక్ష్మానికీ మధ్య తేడా చూసింది. భారతం దృష్టిలో ధర్మం వర్ణాశ్రమాల్ని బట్టి నిర్ణయమవుతుంది. కాని రెండు ధర్మాల మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు, ఏ ధర్మాన్ని ఎంచుకోవాలనేది ధర్మసూక్ష్మాన్నిబట్టి ఆధారపడుతుంది. ఉదాహరణకి ధర్మవ్యాధుడి కథలో, కౌశికుడు ఒక గృహిణి ఇంటిముందు భిక్షకోసం నిలబడి ఆమె జాగు చేస్తున్నదని శపించడానికి సిద్ధ్పడతాడు. కాని ఆ గృహిణి తాను అతిథిని ఆదరించడం అనే ధర్మానికీ, పతిసేవ అనే ధర్మానికీ మధ్య ఎంచుకోవలసి వచ్చినప్పుడు పతిసేవకే ప్రాధాన్యాన్నిచ్చానని చెప్తుంది. కాబట్టి కౌశికుడి శాపం తననేమీ చెయ్యలేదని చెప్తుంది. ఇది చాలా సూక్ష్మమైన చర్చ. కాని మనం గమనించవలసిందేమంటే, ఆమె అలా ఎంచుకున్నప్పుడు అది కూడా మరొక ధర్మమే కావడం గమనించాలి. అలా ఒక ధర్మానికి బదులు మరొక ధర్మాన్ని ఎంచుకోవడం కాక, అప్పటికి ఏది అవసరమో, ఆ విధంగా నడుచుకోవడం గురించి పంచతంత్రం మాట్లాడుతుంది. అందుకని అప్పటిదాకా ‘ధర్మం’ అని చెప్తున్న భావనలో పంచతంత్రం ‘నీతి’ అనే భావనని ప్రవేశపెట్టింది.
వైదిక ధర్మాన్ని అనుసరిస్తూ ధర్మశాస్త్రాలు, స్మృతులు ప్రభవించాక, ఆచరణలో అవి ఎదుర్కోలేని సమస్యల్ని వివరిస్తూ మనకి నీతిశాస్త్రాలు పుట్టుకొచ్చాయి. అర్థశాస్త్రం, కామశాస్త్రం, శుక్రనీతి, కామందకనీతి మొదలైన నీతులూ, శాస్త్రాలూ లౌకిక జీవితప్రధానంగా వికసించినవే. ఇవి సామూహిక ధర్మం, సామాజిక ధర్మం అనే వాటి స్థానంలో, సందర్భోచిత ధర్మాన్ని ముందుకు తీసుకు వచ్చాయి. ఇలా ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఎప్పటికప్పుడు తాను ఏ విధంగా వ్యవహరించాలో తెలుసుకోవడమే నీతి. ధర్మం ఎప్పటికీ చెక్కుచెదరనిది కాగా, ఎప్పటి అవసరాలకు తగ్గట్టుగా అప్పటికి వర్తించేది నీతి. అయితే ఈ విషయంలో మళ్ళా బృహత్కథకీ, పంచతంత్రానికీ మధ్య తేడా ఉంది. పంచతంత్రం ప్రధానంగా లౌకిక అవసరాలకు తగ్గ నీతి గురించి మాట్లాడుతుంది. కానీ బృహత్కథలో అటువంటి నీతి సమస్య కూడా లేదు. అది కేవలం మానవుడి గమ్యాన్ని మాత్రమే అంటే destiny ని మాత్రమే దృష్టిలో పెట్టుకున్నట్టు కనబడుతుంది.
ఇక కథానిర్మాణంలోకి జైనులు ప్రవేశించాక, ఈ పరిమితులు కూడా దాటి, అనేకాంతవాదం ముందుకొచ్చింది. అనేకాంతవాదం, స్యాద్వాదం అనే జైన దార్శనికభావనలు కథని పూర్తిగా లౌకిక ప్రక్రియగా మార్చేసాయి. వాటి గురించి వచ్చేవారం తెలుసుకుందాం.
8-2-2026


Good morning sir today your article about stories is very nice & informative from Srinidhi dept of heritage museum employee
ధన్యవాదాలు