
ఊదారంగు పూతతో మెరుస్తున్న లేతాకుపచ్చని చెరకు తోటలమీద మధ్య కారు హైవే మీంచి సంగారెడ్డి జిల్లా ఆత్మకూరు వైపు తిప్పాము. ఆ దారిమీద ‘శ్రీచిష్తి లింగేశ్వర ఆశ్రమం’ అనే బోర్డు కనిపించింది. ‘చిష్తి’, ‘లింగేశ్వర’ అనే రెండు పదాలు ఒకే పదబంధంగా కనిపించగానే నాకు ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. నేడు దేశం రెండు ధ్రువాలుగా విడిపోతున్నదని మీడియాలో, సోషలు మీడియాలో అనుదినం, అనుక్షణం కనవస్తున్న వార్తలన్నీ వట్టి గాలికబుర్లని ఆ ఒక్క మాట తేల్చేసింది. ఇదుగో, ఇక్కడ ఒకాయన, హిందూ-ముస్లిం ఆధ్యాత్మిక సముద్రాల మధ్య ఒక వంతెన కట్టుకున్నాడని, తాను ఆ దారిన నడుస్తూ, తనని అనుసరిస్తున్న వేలాదిమందిని కూడా చేయిపట్టుకు నడిపిస్తున్నాడనీ నమ్మకం కలిగింది.
శ్రీ చిష్టి లింగేశ్వర నిలయంగా పేరొందిన ఆ ఆశ్రమంలో శ్రీ శ్రీ శ్రీ సద్గురు చిరసంజీవులు అనే రామభక్తుడు జమాల్ దాస్ అనే దీక్షానామంతో నివసిస్తున్నారనీ, ఆయన గత డెబ్భై ఏళ్ళుగా రామభక్తికీర్తనల్తో ఆ ప్రాంతాన్ని పునీతం చేస్తున్నారనీ చెప్తూ, మిత్రుడు గంగారెడ్డి, ఆయన కీర్తనల పిడిఎఫ్ లు కూడా పంపించగానే, నాకు ఆ మహనీయుడి దర్శనం వెంటనే చేసుకోవాలనిపించింది.
నెమ్మదిగా ఆ ఆశ్రమంలో అడుగుపెట్టాం. నిండుగా విరబూసిన మామిడిచెట్లతో మాఘమాసపు పూర్వాహ్ణం మాకు స్వాగతం పలికింది. ఆ ఆశ్రమంలో ముందు రోజు పెద్ద జాతర జరిగిందనీ, రాత్రంతా భజనలు నడిచాయనీ, ఆ స్వామి, (ఆయన్ని అప్పా అని పిలుస్తారు,) అలిసిపోయి ఉంటారనీ, మేము ఆ మధ్యాహ్నం రాకూడదా అన్నారు మాకు, ఆ ఆశ్రమం పరిచయం చేసిన మిత్రులు. కానీ ఎలానూ అంతదూరం వచ్చాము కాబట్టి అప్పాగారి దర్శనం లభించకపోయినా, ఆ ఆశ్రమంలో అడుగుపెట్టినా చాలు, కొంతసేపు కూచుని వెళ్ళిపోతామని చెప్పాం.
ఆ ఆశ్రమ ప్రాంగణంలో ముందురోజు జాతర జరిగినట్టుగా రంగురంగుల జెండాలు అలంకరించిన రథం ఒకటి కనిపించింది. రాత్రంతా భక్తులు పాడుకున్న పాటలు ఇంకా ఆ ప్రాంగణాన్ని విడిచిపెట్టలేదనిపించింది. పొద్దున్న పదిగంటలవేళ అయినప్పటికీ ఇంకా చలిగాలి వీస్తూనే ఉంది. అక్కడ కొద్దిగా ఎండపొడ పడుతున్నచోట కొంతసేపు కూచుని వెళ్ళిపోదామనుకున్నాం. కాని మా భాగ్యం కొద్దీ, అప్పాగారి కుమార్తె శకుంతలమ్మ వచ్చి మమ్మల్ని పలకరించారు. ఆమె తన తండ్రి, తన గురువు అయిన జమాల్ దాస్ గారి గురించి చాలా విశేషాలు చెప్పుకొచ్చారు.
ఆయన పందొమ్మిదేండ్లకే రామభక్తి కీర్తనలు రాయడం మొదలుపెట్టారట. ఆధ్యాత్మికతమీద దృష్టి బలపడ్డాక తనకి ఎవరేనా గురువు లభిస్తే బాగుణ్ణని ఎదురుచూస్తూ ఉన్నారట. అటువంటి రోజుల్లో ఒక రోజు ఆయన కీర్తనలు విన్న ఒక సద్గురువు ఆయన్ని తనదగ్గరకు పిలిపించుకున్నారట. ఆ గురువు మెదక్ జిల్లా వట్టిపల్లి వాస్తవ్యులు, పేరు నాయబ్. వికారాబాదు దగ్గరుండే సయ్యద్ పల్లికి చెందిన సూఫీదాస్ అనే ఒక మహ్మదీయ యోగి నుంచి దీక్షపొందిన గురువు ఆయన. ఆయన చిరసంజీవులుగారితో మాట్లాడుతుండగా, మాటల మధ్యలో తెలిసిందేమంటే, చిరసంజీవులుగారి తండ్రి లక్ష్మయ్యగారూ, నాయబ్ గారూ కూడా సహాధ్యాయులని. ఆ సద్గురువు నాయబ్ గారు చిరసంజీవుల్ని తన శిష్యులుగా స్వీకరించి ఆయనకు జమాల్ దాస్ అనే దీక్షానామాన్ని ఇచ్చారట. అప్పణ్ణుంచీ జమాల్ దాస్ ఆత్మకూరు గ్రామం కేంద్రంగా , ఒక సూఫీ రామదాసుగా. భక్తి సంకీర్తనే జీవితంగా జీవిస్తూ ఉన్నారట.
ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టినప్పటికీ, జమాల్ దాస్, గృహస్థ జీవితాన్నీ, తాను చేస్తూ ఉన్న కమ్మరి కొలిమినీ, తన వ్యవసాయాన్నీ వదిలిపెట్టలేదు. ‘మా అమ్మ ఆయనకు పూర్తి సహకారం అందించింది. తనకు ఆస్తిపాస్తులు సంపాదించిపెట్టమని అడగలేదు. ఆయన పాటలు పాడుకుంటూ ఉంటే ఆయన ఆలనాపాలనా మొత్తం తానే చూసుకుంది’ అని చెప్పారు శకుంతలమ్మ.
ఈలోపు స్వామి మమ్మల్ని చూడాలనుకుంటున్నారని శకుంతలగారి చిన్న కుమారుడు వచ్చి చెప్పాడు. మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మాకు ఆయన దర్శనం లభిస్తుందని మేమెంత మాత్రం అనుకోలేదు. మమ్మల్ని శకుంతలమ్మ ఆయన దగ్గరకు తీసుకువెళ్ళి తాను ముందు ఆయనకు నమస్కారం చేసి మమ్మల్ని పరిచయం చేసారు. మేము కూడా ఆయనకు నమస్కరించి ఆ గదిలోనే ఆయన ముందు కూచున్నాము.
నాతో పాటు గంగారెడ్డి, కొర్రపాటి ఆదిత్య కూడా ఉన్నారు. ఆయన వారిద్దరి గురించీ కూడా వివరాలు అడిగి తెలుసు కున్నారు. ఆ ఎనభై ఆరేళ్ళ ఆ వృద్ధుడు ఒక ఆధ్యాత్మిక గురువులాగా కాకుండా చిరకాల సన్నిహితుడిలాగా ఆత్మీయుడిలాగా, మన కుటుంబంలో మనిషిలాగా కనిపించారు. ఆయన వదనంలో అపురూపమైన ప్రసన్నత వెల్లివిరుస్తూ ఉంది. ఆయనకు వినికిడి కొద్దిగా సన్నగిల్లిందనీ, కాబట్టి, మా గురించిన వివరాలు శకుంతలమ్మ గారు ఒకటికి రెండు సార్లు చెప్తూ వచ్చారు. ఆ మాటల్లో నేను కవిత్వం రాస్తుంటాననే మాట ఆయనకు వినబడింది.
‘అయితే మీ పాటలు వినిపిస్తారా?’ అనడిగారు. నేను గీతకర్తను కానందుకు సిగ్గనిపించింది. నేను పాటలు రాయలేదనీ, వచన కవిత్వం రాస్తుంటాననీ చెప్పాను. నాకు కబీరు అంటే చాలా ఇష్టమనీ, ఆయన కవిత్వాన్ని అనువదించాననీ కూడా చెప్పాను. ఇక్కడ ఒక గురువు ఒక సూఫీ గురుపరంపరలో దీక్ష తీసుకుని, కబీరులాగా, రామభక్తి కీర్తనలు రాస్తున్నారన్న విషయం తెలియగానే చూడాలనిపించిందనీ అందుకే వచ్చాననీ చెప్పాను
అప్పుడు ‘మీరు మీ కీర్తనలు పాడితే వినాలనుకుంటున్నాం’ అని అన్నాడు గంగారెడ్డి. కాని అప్పాగారి ముఖంలో ముందురాత్రి అలసట స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకని ఆయన్ని బలవంతపెట్టాలనిపించలేదు. ఆయన ఒకటి రెండుక్షణాలు మౌనంగా ఉండిపోయారు. అప్పుడు నెమ్మదిగా ‘తెల్లవారె చిరసంజీవా లేవోయీ’ అంటూ ఒక కీర్తన అందుకున్నారు. ఆయన కీర్తనల సంపుటాలు అప్పటికే మా దగ్గర ఉండటంతో ఆయన పాడుతుంటే ఆ కీర్తన చదుకుంటూ ఉన్నాము. ఆయన పల్లవితో పాటు రెండు చరణాలు పాడి వినిపించారు.
‘మీరేదైనా ఉపదేశం ఇస్తారా మాకు? ‘ అనడిగాడు గంగారెడ్డి. ‘ఆయన పాడిన పాటలోనే ఆయన ఉపదేశం ఉందికదా, ఇంక మళ్ళీ ప్రత్యేకంగా అడగవలసిన పనిలేదు’ అన్నాను. అని ఆ పల్లవీ, ఆ రెండు చరణాలూ మరోసారి చదువుకున్నాము.
తెల్లవారె చిరసంజీవా లేవోయీ
చెల్లునార నిదురా బోవా లేవోయీ
కల్లజగములోనా కలసీ తల్లడిల్లకోయీ
ఎల్లపొల్లె మాయామమతాలెల్ల నీడలోయీ
చెల్లిపోయె వేళా వెంటరారోయీ
ఇల్లుముల్లె తల్లీ పిల్లా లేరోయీ
ఈ ప్రపంచమోహానిదురా ఇకను చాలునోయీ
సుప్రభాతమాయె చూడూమీ ప్రకాశమోయీ
సుప్రసిద్ధమైన జన్మా నీదోయీ
అప్రయోజనమునూ జేయారాదోయీ.
మరికొంతసేపు నిశ్శబ్దంగా కూచున్నాక, వెళ్ళొస్తామని లేచాం. ‘అన్నం తినివెళ్ళండి’ అన్నారాయన. మేము అప్పుడే సంగారెడ్డిలో బ్రేక్ ఫాస్ట్ చేసుకుని వచ్చామనీ, ఆకలిగా లేదనీ, చెప్పాం. ఆయన ఏమీ మాట్లాడలేదు. తన పక్కనున్న సంచిలోంచి ముందురోజు జరిగిన జాతర ప్రసాదాలు తీసి మా చేతుల్లో పెట్టారు. మేము మరోసారి ఆయనకు నమస్కరించి బయటకు వచ్చాం.
కాని శకుంతలమ్మగారు మేము అక్కడ ఏమీ తినకుండా వెళ్ళిపోడాన్ని ఇష్టపడలేదు. ఆ ఆశ్రమంలో అడుగుపెట్టిన అతిథులు ఏమీ తినకుండా వెళ్ళిపోతే తమకి బాధగా ఉంటుందని చెప్తూ కనీసం రొట్టెలైనా తిని వెళ్ళమన్నారు. మేము అక్కడే కూచుని చపాతీలు ఆరగించడం మొదలుపెట్టాం. ఇంతలో ఆమె మళ్ళా వేడి వేడి అన్నమూ, పప్పూ పట్టుకొచ్చారు. ఆమె ఆత్మీయత చూస్తే, నాకు చాలా ఏళ్ళ కిందట రవీంద్రకుమారశర్మగారు చెప్పినమాట గుర్తొచ్చింది. ‘పడమటి దేశాల్లో వ్యవహారంతో ఆత్మీయత, ఈ దేశంలో ఆత్మీయతతో వ్యవహారం’ అన్నారాయన. అంటే ఇక్కడ, మన పూర్వకాలపు గ్రామాల్లో, మనుషులు తాము పదే పదే కలుసుకోడం కోసం ఏదో ఒక పని కల్పించుకునేవారని ఆయన ఉద్దేశ్యం. ఆధునిక జీవితం అలా కాదు. ఇక్కడ పని సజావుగా జరగడానికి మనుషుల మధ్య ఆత్మీయత నెలకొనాలని చూస్తుంటాం. లేకపోతే, ఆ తల్లి ఎవరు? మేమెవరం? అంత పొద్దున్నే మా కోసం ఆమె అన్నం వండిపెట్టి, మేము ఎంతో కొంత తినివెళ్ళేదాకా ఆమె ప్రాణం అంతలా కొట్టుకుపోవడమేమిటి?
హైదరాబాదు తిరిగి వచ్చాక ఆయన కీర్తనలు తీసి చదవడం మొదలుపెట్టాను. ‘భక్తచిరసంజీవామృతము’ పుస్తకానికి రాసుకున్న ముందుమాటలో ఆయనిలా రాసుకున్నారు:
‘(తన గురువు) ఒక్కొక్కప్పుడు ఏకాంతముననుండ ఇట్లనువారు, చిరంజీవులు, ఎవరు ఏ గాయకులు పాడినా నాకు నీవు పాడితేనే సమ్మతము. ఈ మాట జీవితమున్నంతకాలం జ్ఞాపకముంచుకోవాలే. సారెసారెకు నీవే పాడుమని అనిపించుకోవద్దు అని చెప్పేవారు.’
తన గురువునుండి పొందిన ఆ ప్రేమని ఇప్పుడాయన తిరిగి మళ్ళా ధారాళంగా వెదజల్లుతున్నారు కాబట్టే వేలాదిమంది శిష్యులు ఆయన సన్నిధి నుంచి స్ఫూర్తి పొందుతున్నారు. విద్యావంతులైన నాగరికులు తమ శక్తియుక్తులన్నీ మనుషుల్ని మతాల పేరిట విడదీయడానికి చూస్తుంటే, ఇక్కడ, ఈ సూఫీ సంప్రదాయ రామదాసును ఆశ్రయించుకున్న గ్రామీణులు, మతాలకు అతీతమైన ఒక ప్రేమసమాజాన్ని నిర్మిస్తున్నారు. ఈ దేశం మీద ఆకాశం కూలిపోకుండా ఇంకా నిలబడిందంటే ఇటువంటి మహనీయుల వల్లనే అని మరోసారి నమ్మకం కలిగింది నాకు.
Featured photo: Photography by A.Gangareddy
22-1-2026


చరిత్ర లో భక్తి .. భావన మొదలైన కాలాన్ని గుర్తించి చదువుతున్నప్పుడు ఈ కబీరు భక్తి సంప్రదాయం నన్ను కలవర పెట్టింది. ఆ గొప్ప ఒరవడి అద్భుతమైనది. అది ఇప్పటికీ కొనసాగడం మధురమైన వార్త నాకు. మీ అనుభవపు అనుభూతి ముచ్చటగా చెబుతూ పోయి పోయి గొప్ప ముగింపునిచ్చారు. ఆకాశం అలా పడకుండా ఎలా నిలిచి ఉంది అనే వో చందమామ కథ ఇప్పటికి నన్ను గగుర్పాటుకు గురిచేస్తూనే ఉంటుంది. ఆ కథ ముగింపులో ఇలాంటి ఓ మహిమాన్వితుని గురించి చెప్పి ఇలాంటివాళ్లే ఆకాశాన్ని నిలబెట్టి పట్టుకున్నారు అంటాడు రచయిత. మీ ముగింపు నాకు మళ్ళీ ఆ నా గగుర్పాటును కలిగించింది సర్. మధురం!!