
మొన్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో బి.కృష్ణకుమారిగారు నా స్టాలు దగ్గరకు వచ్చి తమ సంపాదకత్వంలో వెలువరించిన ‘సంపెంగ సౌరభాలు’ (పున్నాగ పబ్లికేషన్స్, 2025) అనే పుస్తకం నాకు కానుకగా ఇచ్చారు.
ఆ పుస్తకం వెంటనే తెరిచి చూసాను. అది ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల్లోని సాంకేతిక విద్యాశాఖలో పనిచేసిన ఉద్యోగినుల అనుభవాల సంకలనం. ఒకరిద్దరి అనుభవాలు అక్కడికక్కడే చదివేసాను. కృష్ణకుమారిగారితో పాటు, ఎల్.విజయశారద అనే ఆమె కూడా సంపాదకత్వం వహించిన ఆ పుస్తకం నాకు ఆసక్తికరంగా అనిపించింది. అసలు అన్నిటికన్నా ముందు అటువంటి ఆలోచనే కొత్తగానూ, ఎంతో విలువైందిగానూ అనిపించింది. ఎందుకంటే, వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగినులు పదవీవిరమణ చేసాక, వారికి తమ జీవితం గురించి కొంత స్థిమితంగా నెమరువేసుకోగల వీలు చిక్కాక, తమ జీవిత పయనం గురించి రాయించవచ్చుననే ఆలోచన చాలా విలువైందనిపించింది. మనకి తెలుసు, ఒక స్త్రీ చదువుకుంటే ఒక కుటుంబాన్ని చదివించినట్టని. ఇప్పుడు ఈ లోకోక్తి కూడా మారింది. ఒక స్త్రీ చదువుకుంటే ఒక తరం మొత్తం చదువుకున్నట్టని చెప్పవలసిన కాలం ఇది. ఎందుకంటే ఈ మహిళలంతా సాంకేతిక విద్యాశాఖలో పనిచేసినవారు. ఎందరో బాలికలు పాలిటెక్నిక్ విద్యని అభ్యసించడానికి అవసరమైన వ్యవస్థను నిలబెట్టినవాళ్ళు, నడిపినవాళ్ళు, ఆ యజ్ఞంలో తమ కాలాన్ని, శక్తియుక్తుల్ని, ఉత్సాహోద్వేగాల్ని ఇంధనంగా సమకూర్చినవారు.
ఇందులో మొత్తం 14 మంది ఉద్యోగినుల అనుభవాలున్నాయి. ఇద్దరు ఇంగ్లిషులో రాసారు. తక్కినవన్నీ తెలుగులో. రాసినవారిలో కమలా అజ్వానిగారు అందరికన్నా సీనియర్. అసలు మొత్తం సాంకేతిక విద్యాశాఖలోనే ఆమె కురువృద్ధురాలు. 1931 లో పుట్టినవారు. తక్కినవారిలో ఇద్దరు 49 లో పుట్టారు. మిగిలినవారు 55-65 మధ్యకాలంలో పుట్టినవారు. అంటే ఇప్పుడు 60-70 ఏళ్ళ మధ్యవయసుగలిగినవారు.
రెండుమూడు రోజుల కిందట కృష్ణకుమారిగారి వాల్ మీద చూసాను. ఆమె పుస్తకాల స్టాలు దగ్గరకు వచ్చిన ఒక సందర్శకుడు ఈ పుస్తకం పేజీలు కొన్ని తిరగేసి తన మిత్రుడితో ‘ఇది వ్యక్తిత్వ వికాస గ్రంథంలాగా ఉంది’ అని అన్నాడట. ఆ మాటలో చాలా నిజముంది. వ్యక్తిత్వ వికాస గ్రంథం అనే కన్నా, జయగాథల సంపుటం అనడం మరింత సముచితంగా ఉంటుంది.
సాధారణంగా తెలుగు పౌరసమాజంలోనూ, పాఠకవర్గాల్లోనూ కూడా ఒక అభిప్రాయం ఉంది. అదేమంటే, సామాజిక అసమ్మతిని ప్రకటించినవాళ్ళూ లేదా సాయుధపోరాటాల్లో పాల్గొన్నవారూ లేదా ప్రజాజీవితంలో ప్రత్యక్షంగా పాల్గొని జైలుకు వెళ్ళి వచ్చినవాళ్ళూ- వాళ్ళ జీవితాలు మాత్రమే చాలా స్ఫూర్తిదాయకాలనీ, విలువైనవనీ, వారినే తోటిమనుషులకి ఆదర్శప్రాయంగా చూపించగలుగుతామనీ. ఈ అభిప్రాయంలోని పాక్షికతను నేను చాలా ఏళ్ళుగా ఎత్తిచూపిస్తూనే ఉన్నాను. పోరాటమనేది ఒక స్థలానికో, లేదా ఒక సాధనానికో లేదా ఒక సందర్భానికో మాత్రమే పరిమితమయ్యేది కాదు. అది ప్రతి ఒక్కచోటా, ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ అనుక్షణం, అనుదినం సంభవిస్తూనే ఉంటుంది. దాన్ని మనం చూడగలగాలి, చూపగలగాలి. గిరిజన ప్రాంతాల నుంచి పై చదువులు చదువుకుని ఒక విశ్వవిద్యాలయంలో అసిస్టంటు ప్రొఫెసరు కాగలిగిన ఒక బాలిక జీవితకథ కన్నా మించిన స్ఫూర్తిదాయకగాథ మరేముంటుంది చెప్పండి? అది మామూలు ప్రయాణం కాదు. కాన్సర్ తో పోరాడుతూ తన మనోబలమే ఊతంగా స్వస్థత తెచ్చుకుంటున్న ఒక నడివయస్కురాలి పోరాటం మామూలు పోరాటమా? అర్ధాంతరంగా భర్త చనిపోతే ఎటువంటి సామాజిక భద్రత లేకపోయినా కూడా స్వశక్తితో కాలానికి ఎదురీది తన పిల్లల్ని చదివించుకున్న ఒక ఒంటరి మహిళ చేసే పోరాటం ఏ సంగ్రామానికన్నా తక్కువ? ఇవి జయగాథలు. ఇటువంటి గాథల్ని విన్నప్పుడు ఎవరేనా వీటితో మమేకం కాగలుగుతారు. ఈ అనుభవాల్లో తమని తాము పోల్చుకోగలుగుతారు. తమ జీవితాలు కూడా విలువైనవేననే ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకోగలుగుతారు.
మరొక దురభిప్రాయం కూడా మన సమాజంలో వ్యాప్తిలో ఉంది. అందేమంటే, ఒక ప్రభుత్వోద్యోగి జీవితానుభవం కన్నా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేవాళ్ళ జీవితానుభవం మరింత విలువైనదని. పైకి చెప్పకపోయినా, ప్రభుత్వోద్యోగుల పట్ల ఒక అసహనం, చిన్నచూపు, ఇంకా చెప్పాలంటే, ఒకింత ద్వేషం కూడా కలగలసిన ఒక మిశ్రమ భావం మన సమాజంలో కనిపిస్తూంటుంది. బహుశా అత్యధిక సంఖ్యాకులకి కనీస భద్రతకూడా లేకపోగా ప్రభుత్వోద్యోగులు ఎన్నో రకాల సౌకర్యాలకి నోచుకుని కూడా అవినీతిపరులుగా మారుతున్నందువల్ల బలపడుతూ వస్తున్న అసహనంగా దీన్ని మనం అర్ధం చేసుకోవచ్చు. కాని అందరూ ప్రభుత్వోద్యోగులూ ఒక్కలాంటివారు కారని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.
అయితే ఏమిటట? వీరేం చేసారు? తమ ఉద్యోగం తాము చేసారు. తమ కుటుంబాల్ని చూసుకున్నారు. తమ పిల్లల్ని పెంచిపెద్దచేసుకుని వృద్ధిలోకి తెచ్చుకున్నారు. ఇంతమాత్రానికే ఇందులో ప్రశంసించదగ్గది ఏముంది అనవచ్చు. ఈ ప్రశ్నకి నేను జవాబు రాసేముందు సంపాదకులు ఏం రాసారా అని చూసాను. వారికి కూడా ఇటువంటి ప్రశ్నలు తలెత్తుతాయని అనిపించినట్టుంది. అటువంటి ప్రశ్నలకి వారు తమ ముందుమాటలో కొంత గట్టిగానే జవాబిస్తూ రాసారుగాని, ఈ వాక్యాలు మరింత సమంసజసంగా అనిపించాయి. వారిలా అంటున్నారు:
‘రాయటం మొదలెట్టాక వాటిని పుస్తకంగా తేవటం అనేది మా అందరి ఆకాంక్షా అయిపోయింది. మాకు చాలా సంతోషంగా అనిపించింది. రాస్తున్న ప్రోసెస్ లో మమ్మల్ని మేం కొత్తగా చూస్తున్నట్లు అనిపించింది. మాకు ఆ సంతోషం చాలు అని కూడా అనిపించింది.’
ఇవన్నీ దాదాపుగా సాంకేతిక విద్యాశాఖ హెడ్ ఆఫీసులో పనిచేసిన ఉద్యోగినుల అనుభవాలు. నేను కూడా మొత్తం పద్ధెనిమిదేళ్ళు గిరిజన సంక్షేమశాఖ హెడ్డాఫీసులో పనిచేసాను. కాబట్టి హైదరాబాదులో హెడ్డాఫీసులో పనిచేసే ఎన్.జి.ఓ లు, మినిస్టీరియల సిబ్బంది రోజువారీ జీవితాలెలా ఉంటాయో చాలా దగ్గరగా తెలుసు. మా ఆఫీసులో కూడా ఎందరో ఉద్యోగినుల పని నేను చాలా దగ్గరగా చూసాను. అందరు ఉద్యోగినులూ ఇందులో కనవచ్చే ఉద్యోగినులంత నిబద్ధత కలిగినవారని చెప్పలేనుగానీ, పనిచేసే ఉద్యోగినులు మాత్రం వజ్రాల్లాంటివారని చెప్పగలను. హెడ్డాఫీసు నడిచిందంటే చాలాసార్లు దాదాపుగా అటువంటి వారి వల్లనే అని కూడా చెప్పగలను. కాబట్టి వారు సమాజానికి అదనంగా మరేదో చెయ్యలేదే అన్న చింత నాకు లేదు. చెయ్యలేకపోయామన్న చింత కూడా వారికి లేకపోతే బాగుణ్ణనే అనుకుంటాను.
మన సమాజంలో ఒక దుర్లక్షణం ఉంది. అదేమంటే, ప్రతి ఒక్కరూ తాము చేసే ఉద్యోగం తప్ప, తక్కినవాళ్ళు చేసే ఉద్యోగాల్నో, పనుల్నో చాలా విలువైనవిగా భావించడం. ప్రభుత్వంలో ఒక సెక్రటరీ స్థాయి అధికారి సమాజానికి చెయ్యగల సేవ నిజంగా లెక్కగట్టలేనిది. కాని అతడు తన డిజిగ్నేషను ప్రిన్సిపలు సెక్రటరీ ఎప్పుడవుతుందా అని ఆశగా ఎదురుచూడటంలోనే కాలం గడుపుతూ ఉంటాడు. తీరా ప్రిన్సిపలు సెక్రటరీ అయ్యాక, స్పెషలు ఛీఫ్ సెక్రటరీ ఎప్పుడవుతానా అనుకుంటూ ఉంటాడు. కాని మూడున్నర దశాబ్దాల నా ఉద్యోగజీవితంలో నేను గమనించిన సత్యమొకటుంది. అదేమంటే, ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఉద్యోగం విలువైనదే. ప్రభుత్వమనే బృహత్ యంత్రంలో ఒక్క చిన్న నట్టు పనిచేయకపోయినా ఆ ప్రభుత్వశాఖ కుప్పకూలుతుంది. మౌనంగా, నిస్వార్ధంగా, తనకి అప్పగించిన పని తాను చేసుకుంటూ పోయే అసంఖ్యాకులైన చిన్న ఉద్యోగులవల్లనే ప్రభుత్వం నడుస్తున్నదికాని, శాఖాధిపతుల వల్లా, ప్రభుత్వకార్యదర్శులవల్లా, మంత్రులవల్లా కాదని చెప్పడానికి నా దగ్గర వందలాది ఉదాహరణలున్నాయి.
ఈ సంకలనంలో కనవచ్చే అనుభవాల్లో నన్ను ముగ్ధుణ్ణి చేసింది ఈ అంశమే. ఇందులో దాదాపుగా ప్రతి ఒక్కరూ చాలా చిన్నవయసులోనే, అభం శుభం తెలియని ప్రాయంలోనే గవర్నమెంటు సర్వీసులో చేరారు. కాని వారు తమకప్పగించిన పని నేర్చుకున్నారు. పరీక్షలు రాసి ప్రమోషన్లు తెచ్చుకున్నారు. తమకి అప్పగించిన ప్రతి ఒక్క పనినీ ఒక సవాలుగా స్వీకరించారు. తాము కెరీరు ఎక్కడ మొదలుపెట్టారో అక్కడ ఆగిపోలేదు. అలా ఆగిపోకుండా ముందుకు నడిచినవారిని, వారు స్త్రీలుగానీ, పురుషులుగానీ, వారిని తమకు రోల్ మోడళ్ళుగా తీసుకున్నారు. ఒక లాబ్ అటెండరుగా ఉద్యోగం మొదలుపెట్టి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాలు స్థాయికి ఎదిగిన ఒక ఉద్యోగి ఈ పుస్తకంలో మనకు కనిపిస్తాడు. అటువంటి ఉదాహరణలు చూస్తూ ముందుకు నడిచారు కాబట్టే టెన్త్ తో చదువు ఆపేసి ఉద్యోగంలో చేరిన ఒక కృష్ణకుమారి పాలిటెక్నిక్ కాలేజిలో ఇంగ్లిషు లెక్చెరరు ఉద్యోగందాకా ప్రయాణించగలిగారు.
94 ఏళ్ళ వయస్కురాలైన కమలా ఆజ్వాని ఒక వాక్యం రాసారు: ‘While I was Principal, I had two goals, one was by all means to encourage and promote girls in technical education and the other, to educate my children. I succeeded in accomplishing both.’ ఇంతకన్నా ఏ ఉద్యోగిని అయినా లేదా ఏ తల్లి అయినా కోరుకోగలదేముంటుంది?
ఇదంతా చేసుకుంటూ కూడా ప్రజాజీవితంలో పాల్గొని తామేదన్నా చేయగలిగితే ఆ ఉద్యోగినులు, ఆ ఉద్యోగులు, మరింత భాగ్యవంతులు. కాని అలా చేయలేకపోయినా వచ్చిన నష్టమేమీ లేదు. తమ ఉద్యోగం తాము సక్రమంగా చేసుకుంటూ తమ పిల్లల్ని తాము చక్కగా పెంచుకోగలిగితే చాలు. ఈ మధ్య ఒక అగ్రనటుడి సినిమా విడుదలైన సందర్భంగా అతడి అభిమాని అయిన ఒక యువకుడు తన గుడ్డలు విప్పుకుని మరీ వీరంగం ఆడిన దృశ్యాన్ని మన మీడియా పదే పదే చూపించింది. ఆ దృశ్యం చూడగానే నాకు ముందు ఆ పిల్లవాడి తల్లిదండ్రులే మనసులో మెదిలారు. అయితే ఆ తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోలేని నిరుపేదలేనా అయి ఉండాలి లేదా పిల్లల్ని గాలికొదిలి సమాజసేవ చేస్తున్నవాళ్ళేనా అయి ఉండాలి. ఈ పుస్తకంలోని తల్లులు అలాంటివాళ్ళు కాకపోగా, తమ జీవితాల్ని తాము తీర్చిదిద్దుకున్నవాళ్ళూ, తమ పిల్లల జీవితాల్ని తీర్చిదిద్దినవాళ్ళూనూ.
7-1-2025


మీ కడకు చేరుకొనుటయు
చేకొని మీరదియు చదివి చెప్పుటయెల్లన్
ప్రాకటముగ ప్రతి పొత్తము
వేకువ కిరణాలకాంతి విరిసిన విరియౌ
ధన్యవాదాలు సార్!
ఒక్క అక్షరం వదలకుండా చదివాను. చాలా విపులంగా, వివరంగా రాశారు. తమరు చెప్పినదంతా చదివి నేను ఎంతో ఆనందించాను.
“ప్రజాజీవితంలో పాల్గొని తామేదన్నా చేయగలిగితే ఆ ఉద్యోగినులు, ఆ ఉద్యోగులు, మరింత భాగ్యవంతులు. కాని అలా చేయలేకపోయినా వచ్చిన నష్టమేమీ లేదు. తమ ఉద్యోగం తాము సక్రమంగా చేసుకుంటూ తమ పిల్లల్ని తాము చక్కగా పెంచుకోగలిగితే చాలు. ఇది అంతా స్కిప్ కాకుండా అందరూ చదవాలి.
అప్పుడు కొంతమంది తల్లితండ్రులైనా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. వారి పిల్లలు బంగారు బాట వైపు పయనిస్తూ కుటుంబానికి, ఉత్తమ సమాజానికి, దేశానికి మార్గదర్శకులవుతారు.
మీకు నమోనమః
గొప్ప పుస్తకాన్ని పరిచయం చేసేరు సర్. ధన్యవాదాలు. మీరు చెప్పిన ప్రతి మాట వాస్తవం.
మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు. ప్రతి ఉద్యోగం విలువైనదే. గొప్పగా చెప్పారు. నేను సేకరించిన నాణేలు, స్టాంపుల ప్రదర్శలో భాగంగా నా దగ్గర ఉన్న పుస్తకాలను కూడా ప్రదర్శించాను. వాటిలో మీ పుస్తకాలను చాలా ఆసక్తిగా పరిశీలించి ముఖ్యంగా ఆ వెలుగుల కోసమే, కొన్ని కలలు కొన్ని మెలకువలు గురించి అడిగారు. వివరించడం జరిగింది. మిత్రుడు శశిధర శర్మ ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, చిగురుమామిడి అభ్యర్థన మేరకు ఏర్పాటు చేసాను. కృతజ్ఞతలు.