గాలినాసరరెడ్డికి లేఖలు

ఒకప్పుడు ఒక రచయితని పూర్తిగా చదివేమని ఎప్పుడనుకునేవాళ్ళమంటే వాళ్ళ ఉత్తరాలు కూడా చదివేకనే. తెలుగులో వీరేశలింగం, గురజాడ, శ్రీ శ్రీ, ముఖ్యంగా చలం, చివరికి టాగోరు, శరత్ లతో సహా వారి లేఖాసాహిత్యం చదివేకనే వారు బాగా అర్థమయ్యారని అనుకునేవాళ్ళం. సంజీవదేవ్ వంటి వారి లేఖాసాహిత్యమైతే, నాబోటివాళ్ళకి, అది కవిత్వమూ, కళావివేచనా, కొన్ని సార్లు తత్త్వశాస్త్రం కూడా.

కవి, ఎంతకాదన్నా, తన రచనల్లో, కవిత్వంలో, ఎంతో కొంత ఎడిటింగుకి పాల్పడుతూ ఉంటాడు. తనకు తెలీకుండానే ఒక persona ని ఆశ్రయిస్తుంటాడు. కొన్నిసార్లు అదే తన అసలు ముఖమని అతడు తన పాఠకుల్ని నమ్మించబోతాడు కూడా. కానీ, ఉత్తరాల్లో, డైరీల్లో ఎక్కడో, ఎంత దాచినా దాగకుండా, అతడి యథార్థమానసం మన ముందు ప్రత్యక్షమవుతుంది. అలా కనిపించడం వల్ల ఏమవుతుంది? పాఠకుడికి ఆ కవి మరింత సన్నిహితుడవుతాడు. పాఠకుడు కవితో మమేకమవుతాడు. అతడు కూడా తనలానే ఒక విహ్వలమానవుడనీ, కానీ, ఏ సృజనశక్తివల్లనో, తన అధీరమనఃస్థితిని అతడు దాటగలుగుతున్నాడనీ పాఠకుడు గ్రహిస్తాడు.

అందుకనే అనిల్ బత్తుల సంకలనం చేసిన ‘గాలినాసరరెడ్డికి లేఖలు, 1982-2012’ (బోధి ఫౌండేషన్, 2025) నా చేతికి అందగానే మొత్తం 86 ఉత్తరాలూ ఏకబిగిని చదివేసాను. ఇంతకీ ఇవి నాసరరెడ్డి రాసిన లేఖలు కావు, నాసరరెడ్డికి కవిమిత్రులు రాసినవి. అంటే కవిని నేరుగా చూడకుండా అద్దంలో చూసినట్టుగా అన్నమాట.

ఈ ఉత్తరాలన్నిటిలోనూ నన్ను చాలా గాఢంగా ఆకట్టుకున్నది కొత్తపల్లి వీరభద్రరావుగారు రాసిన ఉత్తరం (17-11-2000). మూడు పేజీల ఆ ఉత్తరం చదివేక, వీరభద్రరావుగారి గురించి విని ఉండీ, ఆయన్ని ఒక్కసారేనా చూడకపోవడం ఎంత పెద్ద తప్పిదమో అర్ధమయింది. ఈ ఉత్తరం రాసినప్పుడు ఆయన వయసు 80 ఏళ్ళు. ఆ రోజుల్లో ఆయన తాను ఉంటున్న అద్దె యిల్లు ఖాళీ చేయవలసిందేనని ఇంటి యజమాని కోర్టు కేసు పెట్టి ఉన్నాడు. ముప్ఫై ఏళ్ళుగా తాను ఉంటున్న ఇల్లు ఖాళీ చేయవలసి వస్తుందని అనుకోకపోవడం వల్ల, ఆయన కాగితాలు, పుస్తకాలు, రాతప్రతులు అన్నీ చెల్లాచెదరుగా పడి ఉన్నప్పుడు, తనకి నాసరరెడ్డినుంచి ఉత్తరం అందిన నాలుగైదు గంటల్లో జవాబు రాసారాయన!

ఎందుకో ఇలా చెప్తున్నారు: ‘దీని కారణాలు మీకున్న సాహిత్యపిపాస, జిజ్ఞాస, సత్యం తెలుసుకోవాలి అనే కుతూహలం-అనేవి. నాకూ ఇవి కొద్దిగానో గొప్పగానో ఉండటం వల్ల, నేను మీ జాబు చూసి ఆకర్షితుడనై ఈ జవాబు వెంటనే వ్రాస్తున్నాను.’ ఈ ఒక్క వాక్యం నాసరరెడ్డినీ, వీరభద్రరావుగారినీ కూడా మనకి సరైన రీతిలో చూపిస్తున్నది. ఇక ఆ ఉత్తరం అంతా, ఆయన, వివిధ పాశ్చాత్యభాషల్లోని స్పెల్లింగుల్ని తెలుగులో రాసినప్పుడు, వాటి ఇంగ్లిషు స్పెల్లింగు ప్రకారం రాయడమే సముచితమని చెప్పడం గురించి రాసింది. అందుకు ఎన్ని ఉదాహరణలిచ్చారు! ఎన్ని భాషల నుంచి ఇచ్చారు! మొత్తం పుస్తకం అంతా లుప్తమై, ఈ ఒక్క ఉత్తరం దొరికినా కూడా, ఈ పుస్తకాన్ని నేను చాలా విలువైన పుస్తకంగా లెక్కించుకోగలను.

కరుణశ్రీనుంచి కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళై దాకా, సినారె నుంచి చేకూరి రామారావుదాకా ఈ పుస్తకంలో ఎందరి ఉత్తరాలో కనిపిస్తాయి. కాని ఆ లేఖలన్నిటిలో ఎం.ఎస్.నాయుడు ఉత్తరాలు ప్రత్యేకమైనవని, ఈ పుస్తకం చదివేక, మీక్కూడా అనిపిస్తుంది. తక్కినవాళ్ళు ఒక శిష్యుడికో, మిత్రుడికో, లేదా ఒక తోటికవికో రాసినట్టుగా ఉత్తరాలు రాసారు. కాని నాయుడు ఉత్తరాలు ఒక మనిషికి రాసినవి, ఒక హృదయానికి రాసినవి. కొన్ని వాక్యాలు చూడండి:

‘మీ కవితలంటే ఇష్టం, ప్రేమ, జీవితం, ఊపిరిసలపనితనం.'(17-9-95)

‘ఎందుకు మీ కవిత్వం యిష్టపడ్డానో చెప్పలేను. చినుకుల్లో చందమామని చూసినట్టు, మీ కొన్ని కవితల్ని చదూతుంటే, నీళ్ళేని కళ్ళకి అందమైన దుఃఖం బరువుగా హత్తుకుంటున్నట్టు.’

‘ఒంటరితనం మీకూ వున్నందుకు ఆశ్చర్యపోతున్నాను ఆలోచించే విచారంలో.’

‘బాధ్యతలు ఇబ్బందులు కన్నీళ్ళు ఆనందం లేని ఒంటరితనం నాది, నాచే ఏం చేయనివ్వని ఒంటరితనం. ప్రేమించుకోడం, ప్రేమించడం ఎంత కష్టమో తారీఖులు మారుతున్న కొద్దీ తెలుస్తోంది. స్నేహితులకి వుత్తరాలు రాయటం మాటల్లో మాటల్తో లాని పని. ఏం చేస్తాం. ఇంతే. ఇంతవరకే రాసుకోగలం.’ (7-10-95)

ఇలా ప్రతి ఉత్తరంలోంచీ ఒకటి రెండు వాక్యాలేనా పంచుకోవాలని ఉందిగాని భావ్యం కాదని ఆగుతున్నాను. ఇంకో మాట కూడా చెప్పాలి. ఈ ఉత్తరాలన్నిటిలోనూ ఒక్క నాయుడి ఉత్తరంలోనే ఒక కవిత పంచుకోడం కూడా కనిపిస్తుంది.

ఇందులో కొందరు హిందీ, సంస్కృత కవులు, ముఖ్యంగా హైకూ రాసే కవుల ఉత్తరాలున్నాయి. హర్షదేవ్ మాధవ్ అనే ఆయన సంస్కృతంలో హైకూలు రాసిన కవి అట. ‘లావారసదిగ్ధాః స్వప్నమయాః పర్వతాః’ అటువంటి ఒక హైకూ కావొచ్చును, ఆయన తన ఉత్తరంలో ప్రస్తావించాడు. అలాగే భగవత్ శరణ్ అగ్రవాల్, సత్యభూషణ్ వర్మ వంటి హిందీ హైకూ కవుల ఉత్తరాలు కూడా.

వర్మ 8-3-1990 నాటి లేఖలో ఇలా అంటున్నాడు: We have no dearth of meters(chhanda) in Indian poetry. If we cannot follow the form of Haiku, there is no point of calling it a Haiku. It can be writtern under any Indian name. ఈ వాక్యం చదివాక ఆయన రాసిన హైకూలు చదవాలనిపిస్తున్నది నాకు.

ఈ ఉత్తరాల్లో రెండుచోట్ల నా ప్రస్తావన ఉండటం నాకు సంతోషాన్నిచ్చింది. కానీ, అదేమిటి?, నేను నాసరరెడ్డికి ఒక్క ఉత్తరం కూడా రాయలేదా?

ఎవరేనా కవి లేదా రచయిత తాను రాసినవో, తనకి రాసినవో, ఉత్తరాల సంకలనాల్లో బహుశా ఇదే చివరిది కావొచ్చును. ఇక మీదట మనం వాట్సప్ మెసేజిల సంకలనాలు వెలువరించవలసి ఉంటుందేమో!(అది కూడా ఆ మెసేజిలు డిలీటు చేసేయకపోయి ఉంటేనే!)


గాలినాసరరెడ్డికి లేఖలు, 1982-2012, సంపాదకుడు: అనిల్ బత్తుల, బోధి ఫౌండేషన్, 2025, వెల రు.100, ప్రతులు నవోదయ, లోగిలి, ఆమెజాన్ లలో లభ్యం.

Featured photo courtesy: Gustavo Medeiros via pexels.com

2-1-2026

3 Replies to “గాలినాసరరెడ్డికి లేఖలు”

  1. :(( WhatsApp crash కాకుండా ఉంటే 😭😭 . లేదంటే ఇష్టమైన కవులు రాసిన మెసేజ్ లనే దాచుకు చదువుకునే భోగం కూడా పోతుంది.

    ఈ పుస్తకం నాకూ నచ్చుతుందని అనిపిస్తోంది. చదువుకుంటాను.. ❤️❤️

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading