నన్ను వెన్నాడే కథలు-16

నేను సాహిత్యం చదవడం మొదలుపెట్టినరోజుల్లో చారిత్రిక కథలు, నవలలు అంటే చెవికోసుకునేవాణ్ణి. మా అన్నయ్య సుందర్రావు ద్వారా అడవి బాపిరాజు, నోరినరసింహ శాస్త్రి, తెన్నేటి సూరి వంటి రచయితల నవలలు పరిచయమయ్యాయి. ఆ తర్వాత తాడికొండ లైబ్రరీలో విశ్వనాథ సత్యనారాయణ పురాణవైర గ్రంథమాల నవలలు నన్ను ఆకట్టుకున్నాయి. 1857 తిరుగుబాటుమీద పురిపండా అప్పలస్వామి రాసిన ‘వీరభారతం’ నాకు పారాయణ గ్రంథంగా ఉండేది.

కాని తాడికొండలోనే మొదటిసారి నేను మాస్తి ‘చిక్కవీర రాజేంద్ర’, కురతులైన్ హైదర్ ‘అగ్నిధార’ నవలలు చదివేను. ఆ నవలలకీ తెలుగు రచయితలు రాసిన చారిత్రిక నవలలకీ మధ్య ఏదో ప్రధానమైన వ్యత్యాసం ఉందని ఆ పసితనంలోనే నాకు తెలిసిందిగాని, అదేమిటో నాకై నేను స్పష్టంగా పోల్చుకోలేకపోయాను. ఆ తర్వాత రాజమండ్రి రోజుల్లో ప్రేమ్ చంద్ ‘చదరంగపు ఆటగాళ్ళు’ కథ చదివినప్పుడు ఒక కథకుడు చరిత్రని ఎలా చిత్రించాలో నాకు లీలగా బోధపడింది. కాని నిజమైన చారిత్రిక కథ ఎలా ఉండాలో జయశంకర ప్రసాద్ రాసిన ‘గూండా’ (1934-35) చదివినదాకా నాకు తెలియనే లేదు.

మా హీరాలాల్ మాష్టారి పుణ్యమా అని జయశంకర ప్రసాద్ నాకు తాడికొండ రోజుల్లోనే పరిచయమయ్యాడు. ‘సమస్త హిందీ సాహిత్యం ధ్వంసమైపోయినా పర్వాలేదు, రామ చరిత మానస్, కామాయని మిగిల్తే చాలు!’ ఇదీ మా మాష్టారి నోటమ్మట నేను పదేపదే విన్నమాట. ఆయన ప్రోద్బలంతోనే కామాయని, ఆసూఁ కూడా చదవడం మొదలుపెట్టాను కూడా. కాని, ఇదుగో, ఈ ‘గూండా’ కథ చదివాకనే నాకు ప్రసాద్ అంటే ఏమిటో తెలిసొచ్చింది

నేషనల్ బుక్ ట్రస్టు వారు వేసిన ‘కథాభారతి:హిందీ కథలు’ (1971), సాహిత్య అకాడెమీ వారు వేసిన ’23 హిందీ కథలు’ (1974) రెండు సంపుటాల్లోనూ ఈ కథ ఉంది. ఆ రెండు సంపుటాల్లోనూ కూడా ఈ కథ అప్పట్లో నేను మళ్ళీ మళ్ళీ చదివాను. ఒక చారిత్రిక సంఘటనని కథగా రాయాలంటే ఈ కథ ఒక నమూనా అని నాకు గుర్తుండిపోయింది. ఇప్పుడు నలభయ్యేళ్ళ తర్వాత, బంగారు రామాచారి పుణ్యమా అని, ’23 హిందీ కథలు’ మళ్ళా నా చేతుల్లోకి వచ్చాక, మళ్ళా ఈ కథ చదివాను. సందేహం లేదు, ఇది మణిపూస.

1781 జూలై-ఆగస్టు నెలల్లో, వారన్ హేస్టింగ్సు బనారస్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడం ఈస్టిండియా కంపెనీ తొలిరోజుల్లో ఒక ముఖ్యఘట్టం. (ఈ విషయం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే https://nithinks.com/2020/08/14/benares-rebellion-15august-1781/ వ్యాసం చదవండి.) ఆ సంఘటనలో బనారస్ ప్రజలు కూడా కంపెనీని ఎదిరించి రాజా చేత్ సింగ్ కి మద్దతుగా నిలబడ్డారని చరిత్ర చెప్తున్నది. అటువంటి ఒక ముఖ్యఘట్టాన్ని ప్రసాద్ కథగా మలిచిన తీరు నిజంగా సమ్మోహనీయం.


గూండా

హిందీ మూలం:  జయశంకర ప్రసాద్

 తెలుగు అనువాదం: వేమూరి రాధాకృష్ణమూర్తి

ఏభై సంవత్సరాలకు పైబడి వుంటుంది అతని వయస్సు. అయినా యువకుల కంటె బలంగాను దృఢంగాను వున్నాడు. అతని చర్మంలో ఎక్కడా ముడతలు పడలేదు. జోరున కురుస్తున్న వర్షంలోను, పుష్య మాసపు రాత్రుల్లోను, మిటమిటలాడే జ్యేష్ఠ  మాసపు ఎండలోను, అంగీ అయినా తొడుక్కోకుండా తిరగడమంటే అతనికి సర్దా.  మెలి కలు తిరిగిన అతని కోరమీసాలు తేలుకొండిలా, చూచేవాళ్ల కళ్లల్లోకి గుచ్చుకుంటూ వుంటాయి. అతని శరీరం శ్యామలవర్ణంతో పాములా నిగనిగలాడుతూ నున్నగ వుంటుంది. అతడు కట్టుకొనే నాగపూరు ధోవతికి గల ఎర్రని పట్టుఅంచు ఎంతో దూరాన్నుంచి కొట్టవచ్చినట్లు కనబడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వుంటుంది. నడుముకు బిగిం చిన బనారస్ పట్టు పై పంచలో ఒక వైపున ముత్యపు చిప్పలాంటి పిడిగల చురకత్తి దాగివుంటుంది. అతని ఉంగరాల జుట్టును బంధించి వుంచే బంగారు వన్నె అంచుగల తలపాగాకొస ఒకటి అతని వెడల్పాటి వీపుమీద, మరో కొన తలమీద ఠీవిగా విహరిస్తూవుంటాయి. ఎత్తయిన అతని భుజం మీద పదునైన కసాయికత్తి ఎప్పుడు చూచినా పుండవలసిందే. కిర్రు చెప్పులు తొడుక్కొని బజారున నడుస్తుంటే అతడు వస్తున్నాడని అందరికి గుర్తే. అతడు పెద్ద గూండా.

అజాతశత్రువు పరిపాలిస్తున్నప్పుడు ఉపనిషత్పాఠాల పరిషత్తులో చేరి బ్రహ్మవిద్య నేర్చుకొనేందుకై దూర దూరాలనుండి పండిత ప్రకాండులగు బ్రహ్మచారులు కాశీపట్టణం వస్తూవుండేవారు. అట్టి కాశీ పట్టణ స్వరూపం క్రీస్తుశకం పదునెనిమిదవ శతాబ్దపు చివరిభాగంలో చాలావరకు మారిపోయింది. గౌతమబుద్ధుడు, శంకరాచార్యుల ధర్మ సిద్ధాంతాల చర్చలు, వాద ప్రతివాదాలు శతాబ్దాల తరబడిగ ప్రతి ధ్వనిస్తుండే దేవాలయాలు, మఠాలు ధ్వంసమైపోయినందున, బ్రహ్మ చారులు హతమార్చబడినందున అట్టి చర్చలు పూర్తిగా లోపించి పోయాయి. అస్పృశ్యతను గట్టిగా పాటించే పరమ పవిత్రమైన వైష్ణవ మతం కూడా విచ్చలవిడిగా విహరించే క్రొత్తగా అవతరించిన మతోన్మాదాన్ని ఎదుర్కొనలేక కాశీ పట్టణంలో అధైర్యపడి పిరికి పందరూపం దాల్చింది. న్యాయశాస్త్రం, బుద్ధిబలం అంతా ఆయుధ శక్తి ముందు తలవంచడం గమనించి ఛిన్నాభిన్నమై నిరాశ పడి పోయిన కాశీ పట్టణ పౌర జీవితం ఒక క్రొత్త సంప్రదాయాన్ని సృష్టించింది. శౌర్యం ఆ సంప్రదాయ లక్షణం. మాట కోసం ప్రాణాలను సైతం వదలడం, సింహ ప్రవృత్తి గల జీవికోపార్జన, ప్రాణభిక్ష కోరిన పిరికి వాళ్ల మీద, దెబ్బ తిని పడిపోయిన శత్రువుల మీద దెబ్బ తీయకపోవడం, పీడితులకు, నిర్బలులకు సహాయం చేయడం, ప్రతి క్షణం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని తిరగడం ఆ సంప్రదాయ లక్షణం. అట్టివాళ్లను కాశీ పట్టణ ప్రజలు గూండాలని పిలిచేవాళ్లు.

జీవితంలో అలభ్యమైన కోరికలు నెరవేరనందున జనం విరక్తి చెందుతూ వుంటారు. అదేవిధంగా ఏదో ఒక మానసికమైన దెబ్బ తగిలి గాయపడి పేరు ప్రతిష్ఠలు గడించిన జమీందారు బిడ్డడు నన్హక్ సింగ్ గూండాగా మారిపోయాడు. ఆస్తినంతటినీ రెండు చేతులతో నాశనం చేసివేశాడు. విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి అతడు ఏర్పాటు చేయించిన వేడుకలను వినోదాలను కాశీ పట్టణ ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరు. వసంత ఋతువునందు అతడు జరిపించిన ప్రహసనాలతో కూడిన నాటక ప్రదర్శనాలకు ధనం, బలం, ధైర్యం, సాహసం, తెగింపు ఎంతో అవసరం. ఒక పర్యాయం, నన్హక్ సింగు కూడా కాలికి గజ్జెలు కట్టి, చేతికి తోడా తొడిగి, కండ్లకు కాటుక పెట్టుకొని ఒక చెవికి వేలాది రూపాయల విలువ గల ముత్యాల ఆభరణం పెట్టుకొని, మరో చెవికి తెగిపోయిన చెప్పు ముక్క కట్టుకొని ఒక వజ్రాలు పొదిగిన పిడి గల కత్తి పట్టుకొని మరో చేతిని ఆభరణాల బరువుతో క్రుంగిపోతున్న వేషం వేసికొని తన ప్రక్కన నటిస్తున్న ప్రియురాలి భుజం మీద ఆనించి ‘గుత్తి వంకాయలమ్మే అమ్మీ, ఒక్కసారి యిటు రావేమే. ..’ అంటూ పాటలు పాడాడు.

బనారస్ నగరానికి బయట గల పచ్చిక బయళ్లలోను, మంచినీటి బావుల దగ్గర, గంగానదిలో బోటుమీద అతడు తరచు కనబడుతూ వుంటాడు. జూద గృహాన్నుండి బయటికి వచ్చి బోగం వాళ్ల పేటలో నాలుగు రోడ్ల కూడలి వద్దకు అతడు వచ్చేసరికి ప్రఖ్యాతి వహించిన కాశీ నగరపు అందమైన, చురుకైన వేశ్యాంగనలు చిరు నవ్వులతో అతనికి స్వాగతం చెప్పి, కండలు తేరిన అతని శరీరాన్ని రెప్ప వాల్చని కండ్లతో నమిలి మ్రింగుతూ వుండేవారు. అతడు తమలపాకులు అమ్ముకొనేవాడి దుకాణం ముందు కూర్చొని వేశ్యాంగనలు పాడే పాటలు వింటూ వుంటాడేగాని ఎన్నడూ వాళ్ల గడపమీద కాలు పెట్టడు. జూదంలో గెలుచుకొన్న రూపాయల్ని రెండు చేతులతో పట్టుకొని వేశ్యల కిటికీల ముందు నిలబడి ఎగుర వేస్తుంటే కొమ్ములు తిరిగిన మొనగాళ్లంతా నివ్వెరబోయి తల తడుముకునేవారు. అప్పుడు అతడు విరగబడి నవ్వుతూ వుండే వాడు. వేశ్యల యింటికి పదమని కొందరు బలవంతం చేసినప్పుడు.

నిట్టూర్పు విడిచి మౌనం వహించేవాడు. అప్పుడు అతని ముఖంమీద విషాద రేఖలు అలుముకొంటూ వుండేవి.

ఇప్పుడే అతడు బంసీ జూద గృహాన్నుండి బైటకు వచ్చాడు. ఇవాళ అతణ్ణి అదృష్టం వరించలేదు. పదహారుమంది అప్సరసల నృత్యం కూడా అతణ్ణి ఇవాళ ఆకర్షించలేకపోయింది. పాన్ షాపు యజమాని పేరు మన్నూ. తిన్నగా వెళ్ళి అతడి కొట్టుముందు కూర్చొన్ని ‘ఇవాళ శకునం కలిసిరాలేదోయ్ మన్నూ’ అని అంటూ నిట్టూర్పు విడిచాడు.

‘అదేమిటి దొరా, ఇందులో బాధ పడటం దేనికి ? మేమంతా లేమా. నా సంపదంతా మీదేగదా దొరా.’

‘అరే, బడ్డూ, ఒకరిని అడిగి డబ్బు తీసికొని జూదం ఆడడం నన్హక్ సింగు జన్మలో ఎరుగడు. అలా జరిగిననాడు యీ సింగు చచ్చిపోయినట్లే.  నేను జూదం ఎప్పుడు ఆడతానో తెలుసా? చేతిలో ఒక దమ్మిడీ అయినా లేనప్పుడు జూద గృహంలో అడుగు పెడతాను. పెద్ద కుప్ప వున్నచోట తిష్ఠవేస్తాను. పందెం కాస్తాను. అక్కడ పందెం మనల్ని వరించి తీరాలిసిందే. అంతే.  కీనారాం బాబా యిచ్చిన వరమహిమోయ్ యిది.’

‘ఇవాళ అలా జరగలేదేం దొరా?’

‘మొదటి పందెం మనమే గెలిచాం. కాని తరువాత రెండు మూడు పందాలు ఎదురు తిరిగాయి. వచ్చిందంతా వెళ్ళిపోయింది. అయినా యిదిగో అయిదు రూపాయలు మిగిలాయి. తీసికో. ఒక రూపాయి పాన్ బీడాకు తీసికో.  మిగతా నాలుగూ మలూకీ దాసుకు యివ్వు.  వాణ్ణి వెంటనే దులారీ వేశ్య దగ్గరకు పంపు.  పాట ప్రారం భించమని చెప్పమను. ఏ పాటో తెలుసా.  అదే…. ‘చెలీ ప్రియుడు యిట లేడాయెనే’ అనే పాట.

గంజాయి దమ్ముకోసం నిప్పు ముట్టిస్తున్న మలూకీ దాసు నన్హక్ సింగ్ మాట వినేసరికి అదిరిపడ్డాడు. రెండు అంగల్లో దులారీయిల్లు చేరుకొని మెట్టు ఎక్కాడు. ఆ హడావుడిలో అతని మోకాలి చిప్పకు గట్టిదెబ్బ కూడా తగిలింది. నన్హక్ సింగ్ కనుబొమల దెబ్బ ముందు, యీ దెబ్బ అతనికి బాధనిపించలేదు. మలూకీదాసుకు నన్హక్ సింగ్  దెబ్బ ఎలా వుంటుందో బాగా తెలుసు. కండ్లారా చూచిన ఒక ఘట్టం అతడు ఎన్నటికీ మరిచిపోలేడు. ఒక పర్యాయం జూదంలో గెలిచి బరువైన రూపాయల సంచి పుచ్చుకొని  పాన్ షాపు ముందు కూర్చున్నాడు. ఇంతలో పెండ్లి ఊరేగింపు వారి బాజాలు వినబడ్డాయి. నన్హక్ అడిగాడు – ‘ఎవరిదిరా యీ పెండ్లి ఊరేగింపు ?’

‘ఠాకూర్ బోధీసింగ్ కొడుకుది దొరా’ అని అన్నాడు మన్నూ. నన్హక్ పండ్లు పట పట మన్నాయి ‘మన్నూ, ఇటు బోధీసింగ్ పెండ్లివాళ్లు వెళ్లడానికి వీలులేదు. అరే, మలూకీ, వెళ్లు పోరులో మమ్మల్ని గెలిచి ముందుకు అడుగు వేయమని చెప్పు బోధీసింగుకు’ అని గద్దించాడు నన్హక్ సింగ్. ఇప్పటివరకు అతని భుజంమీద నిద్రిస్తున్న కసాయి కత్తి అతని చేతుల్లోకి వచ్చేసింది. తళ తళ మెరుస్తూ మీసం మెలివేస్తూ నిలబడ్డాడు. వీరావేశంతో నన్హక్ సింగ్.

భయంకరమైన నన్హక్ సింగ్ స్వరూపం చూచి మలూకీ గజ గజ వణికిపోయాడు. పరుగెత్తుకొని బోధీసింగు దగ్గరకు వెళ్లాడు. బోధీసింగు, నన్హక్ సింగ్ ఎదురుపడి అయిదు సంవత్సరాలయింది. ఒక రోజున నడి రోడ్డుమీద ఇద్దరూ మాటమీద మాట అనుకొన్నారు. మధ్యలో జనం కల్పించుకొన్నందున అనాడు యిద్దరికీ ఘర్షణ జరగలేదు. ఆ తరువాత మళ్లీ యిద్దరూ ఒక చోట తటస్థ పడలేదు. ఈనాడు నన్హక్ సింగ్ కి అవకాశం దొరికింది. ప్రాణాలకు తెగించి ఒంటరిగా నిలబడ్డాడు నన్హక్ సింగ్.  బోధీసింగుకు నన్హక్ వ్యవహారం ఏమిటో బాగా తెలుసు. అందులో కడుపున కన్న బిడ్డడి వివాహం. తానే తగ్గి మూకీతో ‘పోరా పో, బాబుగారు ఇక్కడ వున్నారని మాకు తెలియక వచ్చామని, అతడే నిలబడితే యిక ఊరేగింపు వెంట నేను వుండనని,  యిద్దరు వియ్యంకుళ్లు ఊరేగింపు వెంట వుండనవసరం లేదన్నానని చెప్పు పో’ అని బోధీసింగు అక్కడి నుండి తిరిగి వెళ్లిపోయాడు.

నన్హక్ సింగ్ ముందుకు అడుగువేశాడు.  మలూకీ భుజంమీద రూపాయల సంచి వుంచి పెండ్లి ఊరేగింపు ముందు తానే నిలబడ్డాడు. ఊరేగింపు దర్జాగా ముందుకు సాగింది.  పెండ్లికి అయిన ఖర్చంతా తానే భరించాడు నన్హక్ సింగ్.  పెండ్లి పూర్తి అయిన తరువాత మరుసటి రోజున ఆ పాన్ షాపు దగ్గరకి పెండ్లి కూతురు, పెండ్లి కొడుకు లిరువురినీ ఊరేగింపుగా తీసికొనివచ్చితిరిగి పంపివేశాడు.

ఆనాడు మలూకీకి పది రూపాయలు బహుమానంగా లభించాయి. అలాంటి నన్హక్ సింగ్ మాటవిని కదలకుండా కూర్చుంటే తిన్నగా యమధర్మరాజు గారిని దర్శించవలసి వస్తుందని మలూకీకి బాగా తెలుసు.  అందుకనే త్వర త్వరగా వెళ్లి ‘నేను శ్రుతి కలుపుతాను. నీవు వెంటనే పాట ప్రారంభించు. బల్లూ, – యింతలో మంచినీళ్లు త్రాగి వచ్చేస్తాడు’ అంటూ దులారీని తొందర పెట్టాడు.

‘అమ్మ బాబోయ్. కొంప మునిగిందిరా బాబూ’ అంటూ దులారీ లేచి కిటికీలో నుండి తొంగి చూచింది. ఎదురుగా పాన్ షాపు ముందు నన్హక్సింగ్ నిలబడి వున్నాడు.  అతని చూపులు తన కిటికీ మీదనే వుండటం దులారీ గ్రహించింది. తలవంచి వినమ్రతతో సలాం చేసింది. నన్హక్ సింగ్ బదులుగా తిరిగి సలాం చేశాడు. ఇంతలో ఎవరివో మాటలు వినబడి నన్హక్ సింగ్ చూపులు దులారీ మీదనుండి ప్రక్కకు మళ్లాయి.

చేతిలో సన్నటి పిడిగల చేతికర్ర. కండ్లకు సురమా, నోట్లో పాన్ బీడా, గోరింటాకు వల్ల ఎర్రబడ్డ గడ్డం, తెల్లగా కొట్టవచ్చినట్లు కనబడుతున్న ఎర్రని గడ్డపు వెంట్రుకల మొదళ్లు, కుచ్చులటోపీ, ముళ్లు వేయబడిన అంగరఖా, వెంట అంచులు గల దుస్తులు ధరించిన ఇద్దరు ప్రభుత్వ సిపాయిలు. ఎవరో మౌల్వీ సాహెబు, అతడి వేషం చూచి నన్హక్ సింగుకు పక్కున నవ్వు వచ్చింది. నన్హక్ వంక చూడ కుండానే మౌల్వీ సాహెబు ఒక సిపాయితో ‘ఏయ్ చోల్దార్, రెసి డెంటుగారి భవంతిలో కచ్చేరీ చేయాలి. వెంటనే బయలుదేరమని దులారీకి చెప్పు. అదుగో జాన్అలీ కొట్టు. ఇంతలో మేము అక్కడ అత్తరు కొంటాం. త్వరగా రా ‘ అని అంటూ ముందుకు అడుగువేశాడు.

సిపాయి మిద్దెమీదకు ఎక్క బోతున్నాడు. మౌల్వీ సాహెబు  జాన్అలీ కొట్టు దగ్గరకు వెళ్లబోతున్నాడు. నన్హక్ బిగ్గరగా ‘దులారీ, మేము ఇక్కడ యింకా ఎంత సేపు కూర్చోవాలి? సారంగీ వాడు రాలేదా?’ అంటూ గద్దించాడు.

దులారీ నాజూకుగా ‘మీరు మాకు యాజమానులు. మీకోసమే నేను యిక్కడ కూర్చున్నాను. మీరు ఎప్పుడూ నా యింటికి. ..’  అన్నదో లేదో మౌల్వీసాహెబుకు వళ్లంతా మండిపోయింది. పెద్దగా అరిచాడు -, అరే చోబ్దార్, ఇంకా ఆ కుక్కబుద్ధి ఛోకరీ మిద్దెనుండి దిగనేలేదా. సరే,  వెంటనే కొత్వాల్ దగ్గరకు వెళ్లు.  మౌల్వీ అల్లా ఉద్దీన్ కుబరా పిలిచాడని నా పేరు బెట్టి చెప్పు. వెంటనే వచ్చి యీ కుక్కను చితక గొట్టమని చెప్పు.  నవాబ్ గిరీ పోయినప్పటి నుండి యీ కాఫర్ల కండ్లకు కావరం ఎక్కింది.  చూపిస్తా నా తడాఖా ఏమిటో.’ అతని మాటలు పరిసరాల్లో ప్రతిధ్వనించాయి.

కుబరా మౌల్వీయా! అమ్మ బాబోయ్. కుబేరా మౌల్వీయే. మన్నూ గజ గజ వణుకుతూ దుకాణం సర్దుకోసాగాడు. దగ్గరలోనే కూర్చొని కునికిపాట్లు పడుతున్న కోమటివాడు ఉలిక్కిపడి లేచేసరికి నెత్తికి పైకప్పు దూలం గట్టిగా కొట్టుకున్నది.  మహారాజా చేత్ సింగును మూడున్నర సేర్ల చీమలనూనె కావాలని అడిగిన మౌల్వీ యితగాడే.  మౌల్వీ అల్లాఉద్దీన్ కుబరా.  ఆ బజారంతా గందర గోళమైపోయింది.  అంతా భయపడి పోతున్నారు. ‘అరే, మన్నూ సింగ్, అరవకుండా కూర్చుంటావా లేదా?’  అని అన్నాడు నన్హక్ సింగ్.  మన్నూ మారు మాటాడకుండా కూర్చున్నాడు. ‘దులారీ అక్కడినుండి కదలవలసిన అవసరం లేదు.  పాట ప్రారంభించు.  మేము యిలాంటి అడవా రకాన్ని చాలామందిని చూచాం.  నిన్నటి దాకా పాచికలు వేసి జ్యోతిషం చెప్పి అర్థణాలు అడుక్కు తినే వీడు యివాళ దర్పం చూపిస్తున్నాడు బోగంవాడలో’ – అని అన్నాడు నన్హక్. ఆ మాటలు మౌల్వీ చెవిన పడ్డాయి. వెనక్కు తిరిగి చూచి ‘ఎవడురా యీ లుచ్చా’ అని అరిచాడు.

‘నీ బాబునిరా, నన్హక్ సింగు’ అన్న సమాధానం చెవిలో పడడంతో పాటు మౌల్వీ సాహెబు నెత్తిమీద పేరు మోసిన బనారస్ దెబ్బ కూడా గట్టిగా పడింది. ఆ దెబ్బకు మౌల్వీ సాహెబు నరాలు మొత్తం ఝుల్లుమనడమే గాక కండ్లు కనబడకుండా పోయాయి.  కాళ్ళు తడబడి పోయాయి.  సిపాయి లిద్దరూ ప్రక్కనే వున్న వీధిలోకి పారి పోయారు.  మౌల్వీ సాహెబ్ పడుతూ లేస్తూ అమాంతం వెళ్ళి జాన్ అలీ కొట్లో కూలబడ్డాడు.

జాన్ అలీ కొంచెం మంచినీళ్లు యిచ్చి మౌల్వీ సాహెబుతో ‘మౌల్వీ సాహెబ్ ! ఈ గుండాతో పెట్టుకొన్నావా రగడ. తేలికలో పోనిచ్చాడు. అసలు ఈ పాటికి ఆ కసాయి కత్తి పడివుండాల్సింది నీ మెడమీద, బతికిపోయావు’ అని అన్నాడు. మౌల్వీ సాహెబు నోరు తెరవుడు పడలేదు. మిద్దెమీది నుండి పాట వినబడసాగింది. ‘చెలీ, ప్రియుడు యిట లేడాయనే’ పాట పూర్తయింది. అంత సేపూ ఎవరూ ఎటూ కదలలేదు. అప్పుడు నన్హక్ సింగ్ మెల్లగా లేచి నెమ్మదిగా అడుగులు వేసుకొంటూ వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి పట్టుతెరలతో మూయబడిన ఒక పల్లకీ వచ్చింది. ఆ పల్లకివెంట రాజ భటుడు ఒకడున్నాడు. అతడు రాజమాత ఆజ్ఞ దులారీకి అంద జేశాడు.

దులారీ మౌనంగా వెళ్లి పల్లకిలో కూర్చున్నది. ధూళితోను, సంధ్యా సమయపు పొగతోను నిండిన యిరుకైన బనారస్ సందు ల్లోంచి ఆ పల్లకి శివాలయం రేవు వైపుకు సాగిపోయింది.

2

శ్రావణమాసపు చివరి సోమవారం. రాజమాత పన్నా శివాలయంలో కూర్చొని పూజ చేసికొంటూ వున్నది. దులారీ దేవాలయం బయట కూర్చొని యింకా కొంత మంది గాయకురాండ్రతో కలిసి భజన గీతాలు పాడుతూవున్నది.  హారతి పట్టిన తరువాత దోసిటితో పూవులు దేవుని పాదాల పైవుంచి పన్నా భక్తితో దేవునికి నమస్కరించింది.  ప్రసాదం తీసికొని బయటకు రాగానే దులారీ కనబడింది.  మహారాణిని చూడగానే దులారీ చేతులు రెండు జోడించి లేచి నిలబడి ‘ముందుగానే వచ్చేదాన్ని. కాని ఏం చేయను ? దరిద్రుడు కుబరా మౌల్వీ వచ్చి రెసిడెంటుగారింటికి పదమని కూర్చున్నాడు. గంటల తరబడి వాడితోనే సరిపోయింది  మహారాణీ,  పిలవగానే రాలేకపోయాను మన్నించండి’  అంటూ వంగి నమస్కరించింది.

‘కుబరా మౌల్వీ, ఎక్కడ విన్నా అతడి పేరే వినబడుతూంది.  ఇక్కడకు కూడా వచ్చి అతడు ఏమేమో అన్నాడట’  అంటూ  ‘ఆఁ ఆ తరువాత ఏమైంది ? నీవు ఇక్కడకు ఎలా రాగలిగావు’  అని అడిగింది రాణి పన్నా.

‘ఇంతలో బాబూ నన్హక్ సింగ్ అక్కడికి వచ్చాడు. అయ్యా, శివాలయం వెళ్లి భజన గీతాలు పాడాలి. మహారాణిగారి ఆజ్ఞ. కాని యీ సాహెబు పోనీయడంలేదు. నన్ను పోనీయండి’ అని వారిని ప్రార్థించాను. దానితో వారు మౌల్వీ సాహెబును గట్టిగా కొట్టారు. ఆ దెబ్బకు మన్ను కరిచాడు సాహెబు. అప్పటికిగాని నేను యిక్కడకు రావడం పడలేదు’.

‘బాబూ నన్హక్ సింగ్ ఎవరు?’

దులారీ తలవంచుకొని అన్నది- ‘రాణీగారు వారిని ఎరుగరా ! బాబూ నిరంజనసింగు కుమారుడు. చిన్నప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి ఊయల ఊగుతూ వుండేదాన్ని.  ఒక రోజున యిద్దరం కలిసి ఉయ్యాల లూగుతున్నాం.  నవాబుగారి ఏనుగు బెదిరి మనమీదకు దూకింది.  అప్పుడు మనల్ని రక్షించింది బాబూ నిరంజనసింగ్ కుమారుడు యీ నన్హక్ సింగే.’

చిన్నప్పటి ఆ ఘట్టాన్ని గురించి విని రాజమాత ముఖం వివర్ణమై పోయింది. తన్నుతాను సంబాళించుకొని ‘బాబూ నన్హక్ సింగ్ ఆ సమయంలో నీ వాడకు ఎందుకు వచ్చారు?’ అని అడిగింది మాట మారుస్తూ మహారాణి పన్నా.

దులారీ చిరునవ్వు నవ్వి తలవంచుకొన్నది. రాజమాత పన్నా తండ్రిగారి జమీందారీలో వుండే వేశ్య కూతురు దులారీ. ఆమెతో బాటు తాను చిన్నతనంలో అనేక పర్యాయాలు ఉయ్యాలలూగింది. చిన్నప్పటినుండి దులారీ కమ్మగా పాటలు పాడుతూ వుండేది.  అందంతో బాటు చంచలత్వం కూడా ఆ రోజుల్లోనే ఆమెలో ఎక్కువగా వుండేది.  కానీ యిప్పుడో,  పన్నా కాశీరాజు తల్లి-దులారీ కాశీ పట్టణపు ప్రసిద్ధ గాయకి. రాజమహలులో దులారీ పాట కచ్చేరీలు తరచుగా జరుగుతూ వుండేవి.  మహారాజా బలవంత సింగ్ జీవించి వున్నప్పటినుండి సంగీతం పన్నా జీవితంలో అవసరమైన భాగమై పోయింది. అయితే అప్పుడు ప్రేమ, దుఃఖము బాధలతో కూడిన విరహ కల్పనాగీతాలంటే అభిరుచి ఎక్కువగా వుండేది.  ఇప్పుడు సాత్విక భావమయమైన భజన గీతాలంటే మక్కువ ఎక్కువైంది. వైధవ్యంతో దీప్తివంతమైన రాజమాత పన్నా యొక్క ప్రశాంత ముఖం కొద్దిగా మలినమైపోయింది.

పెద్ద రాణి గారి సవతి ఈర్ష్యాజ్వాల బలవంతసింగ్ చనిపోయిన తరువాత కూడా ఆరిపోలేదు. అంతఃపురం కలహాలకు పుట్టినిల్లు అయిపోయింది. అందుకనే పన్నా తరచు కాశీలోనున్న రాజమంది రానికి వచ్చి పూజల్లో మునిగివుండేది.  రామనగర్లో ఆమెకు విశ్రాంతి దొరికేది కాదు. చిన్నరాణి కావడమే కాక బలవంతసింగుకు  ప్రేయసి కావడంతో బాటు ఒక కుమారుణ్ణి కన్న గౌరవం కూడా పన్నాకు లభించింది. అయినా వేరే కులమనే సామాజిక దోషం ఆపాదించబడిందనే బాధ ఆమె మనస్సును వేధిస్తూ వుండేది. ప్రారంభంలో తన పెండ్లి విషయమై జరిగిన చర్చ జ్ఞాపకం వచ్చింది.

పన్నా చిన్ని వేదికమీద కూర్చొని, పొంగిపొర్లుతున్న గంగా ప్రవాహాన్ని అన్య మనస్కురాలై చూస్తూ వున్నది. సామాన్యంగాతెలియకుండానే చేతినుండి జారి క్రింద పడి చేతికందకుండా పోయే వస్తువులా కాలగర్భంలో కలిసి పోయిన గత జీవిత ఘట్టాలను గురించి యోచించవలసిన అవసరం సామాన్యంగా వుండదు. దానివల్ల వచ్చేదీ పోయేదీ కూడా ఏమీ వుండదు. అయినా మానవ స్వభావం విచిత్రమైనది. అప్పుడప్పుడు ‘ఆ విషయం జరిగివుంటే’ అని అని పిస్తూ వుంటుంది. అదేవిధంగా పన్నాకూడ తనను రాజా బలవంత సింగు బలవంతాన పెండ్లి చేసికోకపోయివుంటే ఏం జరిగివుండేదో అని బాబూ నన్హక్ సింగు పేరు విన్నప్పటినుండి ఊహించుకో సాగింది. పన్నా వెంట మరో దాసీ మనిషి నిలబడివున్నది. దాని పేరు గేందా. బలవంత సింగు పన్నాను వలచినప్పటి నుండి గేందా ఆమె దగ్గర వుంటూ వున్నది. రాజ్యంలో ఎక్కడ ఏమి జరుగుతున్నదీ వివరాలన్నీ గేందా ప్రతిరోజూ పన్నాకు చెబుతూ వుంటుంది. గేందాకు చాలా విషయాలు తెలుసు. దులారీని కించ పరచాలనే ఉద్దేశ్యంతో గేందా నన్హక్ సింగును గురించి చెప్పడం ప్రారంభించింది.

‘మహారాణీ! నన్హక్ సింగ్ తన జమీందారీ నంతటినీ వినోదాలకు,  దున్నపోతుల పోటీ పందాలకు,  బోగం మేళాలకు వెచ్చించి యిప్పుడు బందిపోటుగా తయారైనాడు. ఎక్కడ ఖూనీ జరిగినా అతని చేయి వుండి తీరుతుంది. ఎంతమంది ఆడవాళ్లు. ..’ మధ్యలోనే దులారీ అందుకొని ‘నీవు చెప్పింది అబద్ధం. బాబుగారి వంటి ధర్మాత్ముడు మరొకడు ఎవ్వడూ లేడు. ఎంతోమంది వితంతువులు ఆయన యిచ్చిన ధోవతి కట్టుకొని జీవిస్తున్నారు. ఎంతోమంది ఆడపిల్లల వివాహాలు వారి చేతిమీదుగా జరుగుతూ వుంటాయి. బాధితులకు, దుఃఖితులకు వారు గొప్ప అండ’ అని చెప్పుకుపోసాగింది.

పన్నారాణి హృదయంలో కొంత తరళత్వం పొంగివచ్చింది. ఆమె నవ్వుతూ అన్నది- ‘దులారీ, ఆయన నీ దగ్గరకు వస్తూ వుంటారు కదూ. అందుకనే కాబోలు ఆయన్ని తెగ పొగడుతున్నావు?’

‘కాదు మహారాణీ, ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను. బాబూ నన్హక్ సింగ్ యీ నాటివరకు నా గడప త్రొక్కలేదు.’  రాజమాతకు ఆ అత్యద్భుతమైన వ్యక్తిని గురించి తెలుసుకొందామని ఆతురత కలిగింది. అయినా యిక ఏమీ చెప్పవద్దన్నట్లుగా ఆమె దులారీవంక తీక్షణంగా చూచింది. దులారీ యిక ఏమీ మాట్లాడలేదు.  మొదటి జామును సూచిస్తూ సన్నాయి మోత వినబడింది.  దులారీ సెలవు తీసికొని వెళ్లి పాలకీ ఎక్కి కూర్చున్నది.  అప్పుడు గేందా యిలా అన్నది. – ‘మహారాణీ, నగర పరిస్థితి బాగా లేదు. పట్ట పగలే ప్రజల్ని దోచుకుంటున్నారు. ఎక్కడబడితే అక్కడ విచ్చల విడిగా జూదాలు సాగుతున్నాయి. జూదాల్లో జనం సర్వము పోగొట్టు కొని ఫకీర్లు అయిపోతున్నారు. పిల్లల్ని సైతం మోసం చేస్తున్నారు. ఎక్కడబడితే అక్కడ కర్రలతోను, కత్తులతోను కొట్లాటలు జరుగుతున్నాయి. అటు రెసిడెంటుతో మహారాజుకు పడటంలేదు’  గేందా మాటలు విని కూడా పన్నా ఏమీ మాట్లాడలేదు.

మరునాడు రాజా చేత్ సింగుకు రెసిడెంటు మార్క్ హేమ్ ఒక జాబు పంపించాడు. అందు నగర పరిస్థితిని గురించి హెచ్చరించాడు. అవ్యవస్థను గురించి తీవ్రంగా విమర్శించాడు కూడా. బందిపోట్లను, గూండాలను పట్టుకోమని, వాళ్లమీద గట్టి నిఘా అవసరమని కూడా సలహా యిచ్చాడు.  కుబరా మౌల్వీకి జరిగిన శృంగభంగాన్ని గురించి కూడా అందులో పేర్కొన్నాడు.  హేస్టింగ్ రానున్నాడను వార్తకూడా తెలియజేశాడు. తరువాత శివాలయం రేవు వద్ద, రామ నగర్ లో గొడవలు జరిగాయి. కొత్వాలు హిమ్మత్ సింగుకు పిచ్చిఎక్కినంత పని అయింది. ఎవరి చేతుల్లోనైనా కత్తులు, కార్లు, లాఠీలు, విచ్చుకత్తులు వగైరాలు వుంటే వాళ్లను వెంటనే పట్టుకోవడం ప్రారంభించాడు.

ఒకనాడు నన్హక్ సింగ్ సుమ్మావాగు  సంగమం దగ్గర గల ఎత్తుగా వున్న దిబ్బమీద పచ్చికబయలులో కొద్దిమంది అనుచరులతో బాటు కూర్చొని భంగు కలుపుతున్నాడు. గంగానదిలో అతడి చిన్ని బోటు మర్రిఊడకు కట్టివేయబడి వున్నది. కొందరు పాటలు పాడు తున్నారు. నాలుగు జట్కాబండ్లు గుర్రాలతో సహా అక్కడే సిద్ధంగా వున్నాయి.

‘మలూకీ ! పాట నచ్చటం లేదు. జట్కా ఎక్కి వెళ్ళు. దులారీని పిలుచుకురా’  అని అన్నాడు నన్హక్ సింగ్. మలూకీ వెంటనే జట్కా ఎక్కి వెళ్లిపోయాడు. ఇవాళ నన్హక్ సింగ్ మనస్సు సరిగా లేదు.  భంగు తయారుచేయడానికి పూనుకొన్నారు.  కాని నిషా ఎక్కడం లేదు. గంట సేపట్లో దులారీ అక్కడకు చేరుకొన్నది ‘బాబుగారూ మీ ఆజ్ఞ ప్రకారం వచ్చేశాను’ అని అన్నది.

‘దులారీ, యివాళ నీ పాట వినాలని కుతూహలంగా వున్నది.’

‘ఈ అడవిలోనా ? ఎందుకో?’ అంటూ సందేహంతో నవ్వుతూ అడిగింది దులారీ.

‘సందేహించకు. ఏ విధమైన యిబ్బంది నీకు కలుగదు’ నవ్వుతూనే సమాధానం చెప్పాడు నన్హక్.

‘ఈ మాటే ఆ రోజున మహారాణీగారితో చెప్పి వచ్చాను’

‘ఏమిటి చెప్పావు ? ఎవరితో చెప్పావు?”

‘రాజమాత పన్నా దేవిగారితో’ – ఇక ఆ రోజున పాట కుదర లేదు. రాగాలాపన జరుగుతూ వున్నప్పుడు నన్హక్ సింగ్ కండ్లలో కన్నీటి బిందువులు నిండటం దులారీ గమనించింది. పాటలు, నృత్యాలు పూర్తి అయిపోయాయి.  వర్షాకాలపు రాత్రి.  ఇలకోళ్ల చప్పుడు విపరీతంగా ప్రతిధ్వనిస్తూంది.  అక్కడే వున్న దేవాలయపు ఒక చిన్న గదిలో నన్హక్ సింగ్ చింతాక్రాంతుడై కూర్చున్నాడు.  అతని కండ్లు మూతపడటం లేదు.  మిగతా వాళ్లందరూ నిద్ర పోయారు.  కాని దులారీకి కూడా నిద్ర పట్టలేదు.  ఆమెకు నన్హక్ సింగ్ మీద మక్కువ పెరిగిపోతూ వున్నది.  తన్నుతాను సంబాళించు కొనేందుకై చాలా ప్రయత్నం చేసింది.  చివరకు విఫలురాలై లేచి నన్హక్ సింగ్ దగ్గరకు మెల్లగా చేరుకొన్నది.  చప్పుడు విని ఉలిక్కిపడి నన్హక్ వెంటనే ప్రక్కనే వున్న కత్తిని తీసికొన్నాడు. ‘ఆడవాళ్లమీద కూడా కత్తి ప్రయోగిస్తారా బాబుగారూ’ అంటూ ఫక్కున నవ్వింది దులారీ.

కొద్ది దూరాన దీపం సన్నగా వెలుగుతూ వున్నది. ఆ వెలుగులో దులారీ ముఖాన్ని పరిశీలించి చూచాడు సింగ్. ఆమె ముఖంలో కామ ప్రవృత్తి తొణికిసలాడుతూ వుండడం గమనించాడు. ‘ఏం దులారీ, అప్పుడే వెళ్లిపోవాలా ? మౌల్వీ సాహెబు మళ్లీ కబురు చేశాడా?’ అని ప్రశ్నించాడు. దులారీ, సింగు దగ్గరకు వచ్చి కూర్చున్నది. ‘ఏం భయంగా వున్నదా?’ అని అడిగాడు నన్హక్.

‘లేదు.  ఒక్క విషయం అడుగుదామని వచ్చాను’

‘ఏమిటది?’

“ఏమీ లేదు.  . .  అదే మీ హృదయంలో. .. ఎన్నడూ. ..’

ఓహో, అదా.  ఆ విషయమై నన్ను అడుగకు.  నా హృదయం పనికి రాకుండా పోయింది.  అందుకనే దాన్ని ఎప్పుడూ అరచేతుల్లో పెట్టుకొని తిరుగుతున్నాను. ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తున్నారు, త్రొక్కివేస్తున్నారు – చీల్చివేస్తున్నారు – ఎగుర వేస్తున్నారు – చచ్చిపోదామని ప్రయత్నిస్తున్నాను. కాని చావడంలేదు.’

‘బాబుగారూ,  ఏమిటీ మాటలు ? చనిపోయేందుకు కూడా ఎక్కడి కైనా వెతుక్కుంటూ పోవాలా ? మీకు కాశీపట్టణ పరిస్థితి తెలియదా! ఏ క్షణంలో ఏమవుతుందో చెప్పలేము. చాలా గందరగోళం జరిగేటట్లున్నది. బనారస్ వీధులు జనాన్ని కరిచేందుకు ఉరుకుతున్నాయా అన్నట్లున్నవి.’

‘ఏమైన క్రొత్త విశేషం జరిగిందా?’

‘ఎవడో హాస్టింగ్ దొర వచ్చాడట. శివాలయం రేవుదగ్గర తెల్ల వాళ్ల పటాలాన్ని కాపలా వుంచాడట. రాజా చేత్ సింగ్, రాజమాత పన్నా అక్కడే ఉన్నారు. వాళ్లను పట్టుకొని కలకత్తాకు పంపిస్తారని వదంతిగా ఉన్నది.’

‘ఏమిటీ!’ పన్నాగూడా. .. రాణివాసం కూడా అక్కడే ఉన్నదా?’  గాబరాగా అడిగాడు నన్హక్.

‘రాణిగారి పేరు వినగానే మీ కండ్లలో కన్నీరు కారుతుందేంబాబుగారూ?’

నన్హక్ సింగ్ ముఖం ఎర్రబడింది. ‘ఆ విషయమై నన్ను అడుగకు. తెలుసుకొని నీవు ఏమీచేయలేవు’ అంటూ నన్హక్ సింగ్ లేచినిలబడ్డాడు. త్వరత్వరగా ఏమిటో వెతకడం ప్రారంభించాడు. కొద్ది సేపటికి సంబాళించుకొన్నాడు ‘దులారీ, రాత్రిపూట ఏకాంతంగా వున్నప్పుడు ఒక ఆడమనిషి వచ్చి నా పక్కమీద కూర్చోవడం నా జీవితంలో యిదే మొదటిసారి. జీవితంలో వివాహం చేసికోనని శపథం పట్టాను. అందునిమిత్తం ఎన్నో అబద్దాలు ఆడుతూ అపరాధాలు చేస్తూ తిరిగాను. ఎందుకో తెలుసా? ఆడవాళ్లంటే నాకు పరమ అసహ్యం.  వాళ్లకు ప్రబల శతృవును, ఇక పన్నా. .. ఇందులో పన్నా తప్పు ఏమీ లేదు. .. దుర్మార్గుడు బలవంతసింగ్. వాడి గుండెల్లో చురకత్తిని గుచ్చలేకపోయాను. వాడి రక్తం కండ్ల చూడలేక పోయాను. .. అంతా అయిపోయింది.  ఏమన్నావు ? పన్నాను పట్టుకొని తెల్లవాళ్ళు కలకత్తా పంపుతారా. అక్కడే. .. పన్నాను. ..’ నన్హక్ సింగ్ కు పిచ్చెక్కినంత పనయింది. దులారీ చూస్తూండగానే సింగ్ త్వర త్వరగా పరుగెత్తుకుంటూ కారుచీకట్లో మర్రిచెట్టు క్రిందకు వెళ్ళాడు.  పొంగి ప్రవహిస్తున్న గంగానదిలో బోటును వదిలాడు. నన్హక్ సింగ్ తో  బాటు బోటు వడివడిగా ముందుకు సాగింది. ఎటు చూచినా కారు చీకటి.  కన్ను పొడుచుకొన్నా ఏమీ కనబడటం లేదు.  దులారీ హృదయం భయంతో కంపించిపోయింది.

3

క్రీస్తుశకం 1781 ఆగష్టు 16 వ తేదీనాడు కాశీ పట్టణమంతా గందరగోళంగా వున్నది. శివాలయం ఘాట్ దగ్గర రాజా చేత్ సింగును లెఫ్టినెంట్ ఇస్టాకర్ నిర్బంధించాడు. నగరమంతటా ఆశాంతి చెలరేగింది. దుకాణాలన్నీ మూసివేయబడ్డాయి. ఇండ్లలో పిల్లలు ‘అమ్మా ఇవాళ పాలవాడు రాలేదేం?’ అని అడుగుతూంటే తల్లులు అరవవద్దని చెప్పి వాళ్లను మాట్లాడకుండా చేస్తున్నారు.  రోడ్లన్నీ నిర్మానుష్యంగా వున్నాయి. తెల్లవాళ్ల పటాలం కాపలా వున్నచోట కుబరా మౌల్వీ అప్పుడప్పుడు వస్తూ పోతూ కనబడు తున్నాడు.  మౌల్వీని చూచి తెరచి వున్న కిటికీలు కూడా మూసుకొనేవి.  ప్రజలు భయభ్రాంతులై పోయారు. నాలుగు రోడ్ల కూడలి దగ్గర చిథరూసింగ్ భవంతి కాశీ పట్టణపు శౌర్య వీర్య ప్రతాపాదులను తన లోపల దాచుకొని ఠాణా రూపంలో అభినయం చేస్తున్నది. ఇంతలో ఎవరో పిలిచారు – ‘హిమ్మత్ సింగ్’

‘ఎవరు ?’  కిటికీలో నుండి తొంగి చూచి హిమ్మత్ సింగ్  ప్రశ్నిం చాడు.

‘బాబూ నన్హక్ సింగ్ ను’

‘ఇంకా నీవు బైటనే వున్నావా ?”

‘పిచ్చివాడా ! మహారాజా నిర్బంధించబడ్డారు. కాశీనగర వీరుల్ని విడిపించు. వీళ్లందరినీ తీసికొని ఒక్క పర్యాయం శివాలయం ఘాటుకు వెళ్లి వస్తాం. ‘

‘అయితే కొద్ది సేపు ఆగు’ అంటూ హిమ్మత్ సింగు ఏమో ఆజ్ఞాపించాడు.  సిపాయిలు బైటకు వచ్చారు. నన్హక్ సింగ్ కరవాలం తళతళ మెరిసింది. సిపాయిలు లోపలికి పరుగెత్తారు.

‘నమ్మక ద్రోహుల్లారా, గాజులు తొడుక్కోండి’ అంటూ జనం చూస్తుండగానే రివ్వున దూసుకు వెళ్లిపోయాడు నన్హక్ సింగ్.

నన్హక్ మహా వీరుడు. కొద్దిమంది అనుచరులు అతని మాట మీదప్రాణాలు సైతం అర్పించేందుకు సిద్ధమైనారు. రాజా చేత్ సింగు చేసిన రాజకీయ అవరాధమేమిటో అతనికి తెలియదు. కొద్దిసేపు ఆలోచన చేసి కొద్దిమంది అనుచరులను సింహద్వారం దగ్గర గొడవ చేయమని చెప్పి పంపించాడు. ఇటు తాను శివాలయం కిటికీ క్రిందకు గంగా ప్రవాహంలో ఒక చిన్న బోటును నడుపుకొంటూ చేరు కొన్నాడు. భవంతి గోడకు అమిత కష్టం మీద త్రాడు కట్టి బోటును ఆపి కోతిలా ఒక్క ఎగురు ఎగిరి కిటికీలోనుండి లోనికి ప్రవేశించాడు.  అక్కడ రాజమాత, రాజా చేత్ సింగు, బాబూ మనియార్ సింగ్ నిలబడి వున్నారు. ‘మీరు ఇంకా ఇక్కడ ఉంటే మేమేమి చేయ గలం ? పూజలు కాగానే మీరు రామనగర్ వెళ్లిపోయి వుంటే ఇదంతా…’ అంటున్నాడు మనియార్ సింగ్.

“ఇప్పుడు నేను రామనగర్ ఎలా వెళ్లను’ అని వాపోయింది తేజస్విని రాజమాత పన్నా.

‘ఏం చెప్పను? నా సైనికులంతా కైదీలుగా పట్టుబడ్డారు’ అంటూ మనియార్ సింగ్ తన దుఃఖాన్ని ప్రకటించాడు.

ఇంతలో సింహద్వారం దగ్గర గొడవ ప్రారంభమైంది. రాజ కుటుంబం ఆలోచనలో మునిగి వున్నందున నన్హక్ సింగ్ రాకను వాళ్లు గుర్తించలేదు. ఎదురుగా వున్న ద్వారం మూయబడివున్నది. నన్హక్ సింగ్ ఒక పర్యాయం గంగా ప్రవాహాన్ని చూచాడు. అందులో ఒక పడవ రేవును చేరుకొనేందుకై కెరటాలతో పోరాడుతూ వున్నది. అతనికి సంతోషం కలిగింది. ఇక ఆలశ్యం చేయకూడదని నిర్ణయించు కొని ‘రాజమాత ఎక్కడ?’ అని ప్రశ్నించాడు.

అంతా వెనక్కు తిరిగి చూచారు. ఎదురుగా ఆయుధాలతో యుద్ధ సన్నద్ధుడైన ఒక అపరిచిత వీరుడు నిలబడివున్నాడు.

‘నీవెవరు?’ చేత్ సింగ్ ప్రశ్నించాడు.

‘విలువ కట్టుటకు వీలులేని రాజకుటుంబ సేవకుణ్ణి’

పన్నా నోటినుండి ఒక నిట్టూర్పు వెలువడింది. ఆమె అతడెవరో గుర్తించింది. ఎన్నో సంవత్సరాల తరువాత అతణ్ణి చూచింది. అతడు నన్హక్ సింగ్.

“నీవు ఏం చేయగలవు?” మనియార్ సింగ్  ప్రశ్నించాడు.

‘ప్రాణాలు అర్పించగలను. ముందు మహారాణిని బోటుమీద కూర్చో పెట్టండి. క్రింద మరో పడవ వున్నది. దానిని నడిపేందుకు సరంగులు వున్నారు. త్వరగా పంపండి.’

మనియార్ సింగ్  బైటకు తొంగి చూచాడు. స్త్రీల ద్వారం దగ్గర వుండే రాజుగారి బోటుమీద నలుగురు సరంగులు నిలబడి ఎదురు చూస్తున్నారు ‘మీరు పదండి. మీ వెంట నేను వస్తాను’ అని అన్నాడు మనియార్ సింగ్  రాజమాత పన్నాతో.

‘మరి. . .” చేత్ సింగ్ ను  చూచి పుత్రవాత్సల్యంతో ప్రశ్నించింది రాజమాత. అందుకు సమాధానం ఎవ్వరిదగ్గరలేదు.  ‘అయితే నేను ఇక్కడే వుంటాను’ అన్నాడు మనియార్ సింగ్ . ఆ స్థితిలో నవ్వుతూ నన్హక్ సింగ్ అందుకొని ‘మీరు బోటు మీదకు వెళ్లి కూర్చోండి.  రాజా కూడా బోటుమీద సురక్షితంగా కూర్చోనంతవరకు యీ నన్హక్ సింగ్ పదిహేడు తుపాకీ గుండ్లకు గురి అయి కూడా తట్టుకొని నిలబడ గలడని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇక కదలి వెళ్లండి’ అని ధైర్యం చెప్పాడు.

పన్నా నన్హక్ సింగును చూచింది. ఒక్క క్షణం సేపు ఇరువురి కండ్లు కలిశాయి. ఆ ఉభయుల కండ్లలో జన్మ జన్మల విశ్వాసం జ్యోతివలె వెలుగుతూ వున్నది. అటు సింహద్వారం బలవంతాన తెరవబడుతూంది. నన్హక్ సింగ్ పరిస్థితి తీవ్రతను గుర్తించి ‘త్వరగా బయల్దేరండి’ అని తొందర పెట్టాడు.

మరుక్షణంలో పన్నా బోటు మీద ఉన్నది. నన్హక్ సింగ్ సింహ ద్వారం దగ్గర లెఫ్టినెంట్ ఇష్టాకరుతో వున్నాడు. చేత్ రాం వచ్చి ఒక జాబును మనియార్ సింగ్ చేతికి అందించాడు.

‘మీ జనం గొడవ చేస్తున్నారు. ఇక ఫైరింగు ఆర్డరు ఇవ్వక తప్పదు’ అని అన్నాడు ఇష్టాకర్ .

‘నా సైనికులు ఇక్కడ ఎవరూ లేరు’ అని అన్నాడు నవ్వుతూ మనియార్ సింగ్.

బయట కలవరం ఎక్కువగా వున్నది.

‘మొదట చేత్ సింగును నిర్బంధించండి’ అని అన్నాడు చేత్ రాం.

‘అందుకు ధైర్యం ఉన్నవాడెవడో ముందుకు రావచ్చు’ అంటూ బాబూ మనియార్ సింగు కత్తి తీసి నిలబడ్డాడు. ఇంతలో కుబరా మౌల్వీ అక్కడకు వచ్చాడు. ఇక్కడ మౌల్వీ సాహెబు బుద్ధి పని చేయలేదు. ఎవ్వరూ బయటకు వెళ్లలేని స్థితి ఏర్పడింది.  ‘ఇంకా చూస్తావేం చేతారాం’ అని హెచ్చరించాడు మౌల్వీ.

చేతారాం రాజాచేత్ సింగ్ మీద చేయి చేసుకోపోయాడు. ఇంతలో నన్హక్ సింగ్ చేతి ఖడ్గం అతడి భుజాన్ని నరికివేసింది. ఇష్టాకర్ ముందుకు వచ్చాడు. మౌల్వీ సాహెబు అరుపులు ప్రారంభించాడు.  కన్ను మూసి కన్ను తెరిచేలోపల నన్హక్ సింగ్ ఇష్టాకరును, అతని అనుచరుల్ని చాలామందిని హతమార్చివేశాడు. మౌల్వీ సాహెబు తప్పించుకొందామని చూచాడు.

‘ఆ రోజున తగిలినదెబ్బ నీకు గుణపాఠం నేర్పలేదన్న మాట. ఇక చూడు ముక్కలు చేసేస్తాను’ అంటూ కసాయి కత్తితో మౌల్వీ సాహెబును నరికివేశాడు. కొద్ది క్షణాల్లో ఎవ్వరూ ఊహించనంతగ పరిస్థితి చేయిదాటిపోయింది.

‘చేత్ సింగ్, ఇంకా చూస్తావేం ? త్వరగా వెళ్లి బోటు ఎక్కి వెళ్లిపో’ అని అన్నాడు నన్హక్. సింగు శరీరాన్నుండి రక్తం కారసాగింది. అటు సింహద్వారాన్నుండి తెల్లవాళ్లు లోనికి రాసాగారు.  చేత్ సింగ్ కిటికీలోనుండి బోటులోకి దిగుతూ ఒక్క పర్యాయం వెనకకు తిరిగి చూచాడు. ఇరవై, ముప్పైమంది తెల్లవాళ్లు తుపాకులు పేలుస్తుం టే ఒక్కడే అందరినీ ఎదుర్కొని కత్తితో పోరు సాగిస్తున్నాడు నన్హక్ సింగ్. అభేద్యంగా నిలబడియున్న నన్హక్ సింగ్ శరీరాన్నుండి రక్తం ధారలు కట్టి ప్రవహించసాగింది. గూండా శరీరంలోని అవయవా లన్నీ ఒక్కొక్కటే తెగి అక్కడే క్రిందపడిపోయాయి. కొద్ది సేపటికి అతని మొండెం కూడా క్రింద పడిపోయింది. అతడే కాశీ పట్టణపు గూండా నన్హక్ సింగ్.


Featured image: Shivala Bhavan, William Daniell R A,(1769-1837)

9-12-2025

6 Replies to “నన్ను వెన్నాడే కథలు-16”

  1. ఎంత అద్భుతమైన కథ పరిచయం చేశారు భద్రుడు గారు. ముందు గా మీరు సూచించిన లింకు లో నాకు తెలియని చరిత్ర గురించిన వ్యాసం చదివి ఈ కథ చదివానేమో, ఇంక ఈ కథ గూండా నన్హక్ సింగు పాత్ర నన్ను కూడా జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. నిజమే చరిత్ర ఆధారిత కవితలు ,కథలు, నవలలు , నాటకాలు రాసేవాళ్ళకి ఒక కోర్సు మెటీరియల్ ఈ కథ. మీరు సూచించిన వ్యాసం చదివితే తెలుస్తుంది జయశంకర్ ప్రసాద్ గారు ఒక చారిత్రక సంఘటన ఆధారం చేసుకుని ఎంత గొప్ప కథ సృష్టించి మరెంత గొప్పగా రాశారో. ఆ చరిత్ర, ఈ కథ మాకు పరిచయం చేసినందుకు మీకు అనేక ధన్యవాదాలు.

    1. మీరు ఆ వ్యాసంతో సహా చదివినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అపార జ్ఞాన తృష్ణ, పఠనాభిలాష నన్ను ఎప్పటికప్పుడు విభ్రాంతికి గురి చేస్తూనే ఉంటాయి.

  2. Sir, haven’t read all of your “నన్ను వెన్నాడే కథలు”, but the ones I have read, each one is truly unique.
    This historical fiction piece became a compelling read because of the context you provided about the real events that occurred in 1781 in Varanasi.
    Thank you for sharing both the context and the story, and for your engaging introduction. 🙏🏽

  3. ఆణిముత్యం లాంటి అనువాద కథను విశాల వేదిక మీద వినయంతో అద్భుతంగా పరిచయం చేసిన ఆత్మీయసోదరునికి శుభాకాంక్షలు మరియు ధన్యవాదములు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading