అంటున్నాడు తుకా-15

48

సాధుసంతుల గ్రామంలో సదా ప్రేమప్రభాతం
ఆందోళన ఉండదక్కడ, లేశమైనా దుఃఖముండదు.

అక్కడకి పోయి ఒక యాచకుడిగా బతుకుతాను.
వాళ్ళు రోజూ నాకింత భిక్ష పెడతారు.

సాధుసంతుల గ్రామంలో అపూర్వభండారం
విట్ఠలుడే వారి విత్తమూ, ధనమూనూ.

సాధుసంతులు అమృతపానంతో బతుకుతారు
ఎల్లవేళలా భగవంతుణ్ణి కీర్తిస్తుంటారు.

భగవంత్ప్రసంగమే వారి అంగడి
వాళ్ళూ అమ్మేదీ, కొనేదీ ప్రేమసుఖమే.

తుకా అంటున్నాడు: అక్కడ మరో ప్రసక్తిలేదు
అందుకనే పోయి అక్కడొక బిచ్చగాడిగా బతుకుతాను.

संतांचिये गांवीं प्रेमाचा सुकाळ । नाहीं तळमळ दुःखलेश ॥१॥
तेथें मी राहीन होऊनि याचक । घालितील भीक ते चि मज ॥ध्रु.॥
संतांचिये गांवीं वरो भांडवल । अवघा विठ्ठल धन वित्त ॥२॥
संतांचे भोजन अमृताचे पान । करिती कीर्तन सर्वकाळ ॥३॥
संतांचा उदीम उपदेशाची पेठ । प्रेमसुख साठी घेती देती ॥४॥
तुका म्हणे तेथें आणिक नाहीं परी । म्हणोनि भिकारी झालों त्यांचा ॥५॥ (1241)

49

నువ్వేదన్నా కోరుకుంటే సాధుసంతుల గోష్ఠి కోరుకో
మనసా! దాన్నిమించి మరొకటి తలవకు.

వాళ్ళ సమస్త అస్తిత్వంలోనూ భగవదైశ్వర్యం
భగవంతుడు తప్ప వారికి మరొకమాటలేదు.

నువ్వేదన్నా చెయ్యాలనుకుంటే సాధుసంతుల చెంతచేరు
మనసా! అంతకు మించి మరేదీ ఆలోచించకు.

నువ్వెక్కడన్నా కూచోదలిస్తే సాధుసంతుల మధ్యచేరు
మనసా! అంతకన్నా వివేకం మరొకటి లేదు.

నువ్వు పోదలచుకుంటే సాధుసంతుల గ్రామానికి పో
మనసా! నీకక్కడ శాంతి చిక్కుతుంది.

తుకా అంటున్నాడు: సాధుసంతులు సుఖసాగరం
మనసా! నిరంతరం వారినే ఆశ్రయించు.

घेसी तरी घेई संताची भेटी । आणीक ते गोष्टी नको मना ॥१॥
सर्वभावें त्यांचें देव भांडवल । आणीक ते बोल न बोलती ॥ध्रु.॥
करिसील तो करीं संतांचा सांगात । आणीक ते मात नको मना ॥२॥
बैससील तरी बैस संतांमधीं । आणीक ते बुद्धी नको मना ॥३॥
जासी तरि जाई संतांचिया गांवां । होईल विसावा तेथें मना ॥४॥
तुका म्हणे संत सुखाचे सागर । मना निरंतर धणी घेई ॥५॥ (1240)

50

నిజమైన వైష్ణవుడి ప్రేమమొత్తం
దేవుడిమీదే లగ్నమైఉంటుంది.

అతడికి మరిదేని పట్లా పట్టింపు ఉండదు
తనువూ, ధనమూ, జనమూ తృణసమానం.

మిన్ను విరిగి మీద పడ్డా
తన వ్రతంతప్పి పక్కకి తొలగడు.

తుకా అంటున్నాడు: ఇదేనా అతణ్ణి
శ్రేష్ఠుడిగా నిలబెడుతున్నది?

वैष्णव तो जया । अवघी देवावरी माया ॥१॥
नाहीं आणीक प्रमाण । तन धन तृण जन ॥ध्रु.॥
पडतां जड भारी । नेमा न टळे निर्धारीं ॥२॥
तुका म्हणे याती । हो का तयाची भलती ॥३॥ (366)

51

స్వభావంలో రాక్షసుడు, లోపల నిర్దయ
మనసు నిష్ఠురం, మాట కఠోరం.

ఈ దుర్గుణాలకి మూలం కులం కాదు
ఇవి ఎవరికి వారికి పుట్టే గుణగణాలు.

కాలకూటం, ఇత్తడి, శుద్ధబంగారం
వాటిని చూస్తేనే తెలిసిపోతుంది వాటిగురించి.

తుకా అంటున్నాడు: కులంకన్నా గోష్ఠి గొప్పది
సాధుసంతుల హృదయాలు నవనీతసమానాలు.

आसुरी स्वभाव निर्दय अंतर । मानसीं निष्ठुर अतिवादी ॥१॥
याति कुळ येथें असे अप्रमाण । गुणाचें कारण असे अंगीं ॥ध्रु.॥
काळकुट पितळ सोनें शुद्ध रंग । अंगाचेंच अंग साक्षी देतें ॥२॥
तुका म्हणे बरी जातीसवें भेटी । नवनीत पोटीं सांठविलें ॥३॥ (337)

52

ఆవునీ, కన్యనీ, హరినామసంకీర్తననీ
అమ్ముకునేవాడికన్నా అధముడు మరొకడుండడు.

మనిషిని అంచనా వెయ్యాల్సింది మంచిచెడ్డల్తో-
భగవంతుడా! వాటికి కులంతో సంబంధం లేదు.

తుకా అంటున్నాడు: ఆశాపాశానికి చిక్కుపడి
ఏది చెయ్యరాదో అదే చేస్తారు, నరకానికి పోతారు.

कन्या गौ करी कथेचा विकरा । चांडाळ तो खरा तया नांवें ॥१॥
गुण अवगुण हे दोन्ही प्रमाण । यातिशीं कारण नाहीं देवा ॥२॥
आशाबद्ध नये करूं तें करिती । तुका म्हणे जाती नरकामधीं ॥३॥ (123)

53

విఠోబా చరణాల్ని తలచేవారెవరో
వారే నా బంధువులూ, నా సజ్జనూలూను.

తక్కినవాళ్ళతో నా సంబంధం లాంఛనప్రాయం
వాళ్ళు కూడా దేవుడి సృష్టి అని సరిపెట్టుకుంటాను.

హృదయపూర్వకంగా వైష్ణవులకి సేవకుణ్ణి
వాళ్ళు తినగా మిగిలినదానికోసం ఆశపడతాను.

తుకా అంటున్నాడు: హరిప్రేమికుల్ని తలచినట్టు
తక్కినవాళ్ళని తలుచుకోడం నాకు చాతకాదు.

ते माझे सोयरे सज्जन सांगाती । पाय आठविती विठोबाचे ॥१॥
येरा मानी विधि पाळणापुरतें । देवाचीं तीं भूतें म्हणोनियां ॥ध्रु.॥
सर्वभावें झालों वैष्णवांचा दास । करीन त्यांच्या आस उच्छिष्टाची ॥२॥
तुका म्हणे जैसे मानती हरीदास । तैशी नाहीं आस आणिकांची ॥३॥ (263)


Featured image: Photography by Marian Florinel Condruz via pexels.com

24-11-2025

2 Replies to “అంటున్నాడు తుకా-15”

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading