నన్ను వెన్నాడే కథలు-13

ఆధునిక భారతీయ రచయితల్లో ప్రేమ చంద్ అగ్రేసరుల పంక్తిలో మరీ అగ్రేసరుడిగా నిలబడే రచయిత. ఆయన రచనలన్నీ దాదాపుగా తెలుగులోకి అనువాదమయ్యాయి. దాదాపు ప్రతి గ్రంథాలయంలోనూ ఆయన పుస్తకాలు ఒకటో రెండో చేతికందుతూనే ఉంటాయి. నిజానికి భారతదేశంలో ప్రగతివాద సాహిత్యం మొదటి అడుగు వేసింది ఆయన అధ్యక్షతనే.

కాని ఎందుకనో, తెలుగు సాహిత్య చర్చల్లో, ప్రేమ చంద్ పేరు వినబడదు. ఈ పదిపదిహేనేళ్ళుగా ఫేస్ బుక్కు మాధ్యమంలో నేను ఉంటున్నప్పటికీ ఆయన రచనల గురించీ ఎవరూ రాయగా, కొత్తగా ఏదన్నా మాట్లాడగా వినలేదు, చదవలేదు. పెంగ్విన్ బుక్సు వారు Premchand, the Complete Short Stories (2017) నాలుగు సంపుటాలు తెచ్చి ఏడెనిమిదేళ్ళు కావొస్తున్నప్పటికీ, కనీసం ఆ పుస్తకాల అట్టలు కూడా నేను ఈ మధ్యకాలంలో ఏ తెలుగు మీడియాలోగాని, సోషలు మీడియాలోగాని చూడలేదు.

ఇందుకు కారణాలేవై ఉండవచ్చు అని ప్రశ్నించుకుంటే, నాకు కనిపిస్తున్న సమాధానం ఒక్కటే. ప్రేమ చంద్ రచనలు మన ఉద్రేకాల్ని ఉద్రేకించవు. అవి మనలోని సాత్త్విక మానవుణ్ణి సున్నితంగా తట్టిలేపుతాయి. మనిషిని బాధిస్తున్న, నిర్బంధిస్తున్న, అణచివేస్తున్న శక్తుల్ని గుర్తుపట్టడంలో ఆయనకన్నా మించిన realist ఇప్పటిదాకా భారతీయ భాషల్లో మరొక రచయిత పుట్టలేదు. కాని అతడు ఆ శక్తుల్ని తన అపారమైన ఆదర్శదృక్పథంతో నిలవరించడానికి ప్రయత్నిస్తాడు. మనం రాజకీయాల్లో భరించలేని ఈ గాంధేయ వైఖరిని సాహిత్యంలో మాత్రం ఎలా భరించగలుగుతాం? అందుకనే ఆయన పట్ల మౌనం వహిస్తాం. మన జీవితంలో, సమాజంలో ఆదర్శదృక్పథం కనుమరుగవుతున్నకొద్దీ ప్రేమ్ చంద్ ని తలుకుకోవడం కూడా కనుమరుగవుతున్నది.

ఉదాహరణకి ఈ ‘సాల్టు యినస్పెక్టరు’ (నమక్ కా దరోగా, 1907) కథనే చూడండి. నేను ప్రభుత్వోద్యోగంలో చేరకముందు చదివిన కథ ఇది. ఈ కథ  చదివినప్పుడే, ఒక సంపన్నుడు తన సమస్త శక్తుల్తో, చాకచక్యంతో, స్తుతిపాఠాలతో ప్రలోభపరుస్తున్నప్పటికీ, నిశ్చలంగా నిలబడ్డ ఆ యువప్రభుత్వసేవకుడే నా హృదయంలో స్థిరపడిపోయాడు. మూడున్నర దశాబ్దాల నా ఉద్యోగ జీవితంలో ఆ యువకుడు నాకు ఎన్ని సార్లు గుర్తొస్తూ ఉన్నాడో చెప్పలేను.

నన్ను వెన్నాడే కథల్ని మీకు పరిచయం చెయ్యాలనుకున్నప్పుడు ముందు ఈ కథతోటే మొదలుపెడదామనుకున్నాను. కాని నేను ఏ తెలుగు అనువాదంలో చదివానో, ఆ పుస్తకం నాకు ఎంత గాలించినా దొరకలేదు. చివరికి ఈ కథ నేనే అనువదించక తప్పింది కాదు.

ఉప్పు సత్యాగ్రహం కన్నా పాతికేళ్ల ముందే వచ్చిన ఈ కథ కలోనియలు పాలనా వ్యవస్థ పైన ఒక రచయిత ప్రకటించిన అసమ్మతి. ప్రభుత్వ ఉద్యోగంలో అవినీతి సంస్థాగతమైపోయి, పౌర సమాజమూ, న్యాయవ్యవస్థా కూడా అవినీతిపరుడికి కొమ్ము కాస్తుండే వ్యవస్థని ప్రేమ్ చంద్ నిస్సంకోచంగా, నిర్భయంగా, అపారమైన ఆవేదనతో చిత్రించాడు. ఒక శతాబ్దం పైగా గడిచిన తర్వాత ఈ కథ పాతబడకపోగా,  మరింత ప్రాసంగికంగా కనిపిస్తున్నది. నిజాయితీపరులూ, విలువలకు నిలబడే వాళ్ళూ ప్రభుత్వ ఉద్యోగంలో నిలదొక్కుకోలేకనే ప్రైవేటు, కార్పొరేటు ఉద్యోగాల వైపు మళ్ళి పోతుండడం ఇప్పటి వాస్తవం.

ఇన్నేళ్ళ తరువాత ఈ కథ మళ్ళా చదివినప్పుడు, దాదాపు నలభయ్యేళ్ళ నా ఉద్యోగ జీవితానుభవం నా వెనక ఉంది. ఈ కథలో అప్పుడు నాకు కనిపించనిదీ, ఇప్పుడు నా ఉద్యోగం నాకు నేర్పిన పాఠాల వెలుగులో నాకు కనిపించిందీ ఒక విషయం ఉంది. అదేమంటే, నీతినిజాయితీలతో కూడిన ఒక ప్రభుత్వాధికారికి భగవంతుడు తప్ప మరెవరూ బాసటగా నిలబడటానికి ముందుకు రారన్నదే. ప్రేమ్ చంద్ కి ఆ విషయం తెలుసు. అందుకని, తనని నమ్ముకున్నవాడికోసం, స్తంభాన్ని చీల్చుకుని మరీ భగవంతుడు ప్రత్యక్షమయినట్టుగా, కరడుగట్టిన వ్యాపారస్థుడి గుండె చీల్చి మరీ ఇక్కడ భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసాడు.


మున్షీ ప్రేమ్ చంద్

సాల్టు యినస్పెక్టరు

దేవుడు పుష్కళంగానూ, ఉచితంగానూ ఇస్తున్న ఉప్పు కంటూ ఒక శాఖని ఏర్పాటుచేయగానే  ప్రజలు ఉప్పుని ఉచితంగా వాడటం నిషేధమైపోయింది. దాంతో ప్రజలు రహస్యంగా ఉప్పు కొనడం అమ్మడం మొదలుపెట్టారు. మోసం, కుయుక్తీ, కుతంత్రాలు స్వాభావికమైపోయాయి. పట్వారీపనిలాంటి మర్యాదా, మన్ననా ఉన్న ఉద్యోగాలు వదులుకోడానికి కూడా కొందరు సిద్ధపడ్డారు. చివరికి లాయర్లు కూడా ఈ ఉద్యోగాన్ని చూసి అసూయపడ్డారు. ఇంగ్లిషు విద్యా, క్రైస్తవ మతమూ పర్యాయపదాలుగా చలామణి అయిన రోజులవి. పారశీకంలో ఏ మాత్రం పరిజ్ఞానం ఉన్నా గర్వకారణంగా భావించిన కాలం అది. పారశీక ప్రేమకావ్యాలు చదవి సంతోషించగలిగేవాళ్ళు సులువుగా ఉన్నతస్థానాల్లో కుదురుకోగలిగేవారు.

మున్షి వంశీధరుడు జులేఖా కథా, మజ్నూ, ఫర్హాదుల ప్రేమకథ చదివి ఉన్నాడు. అమెరికా ఖండాన్ని కనుగొనడంకన్నా, నైలునది యుద్ధం కన్నా కూడా ఆ ప్రేమకథని మరింత ముఖ్యంగా భావిస్తూ ఉద్యోగాన్వేషణ మొదలుపెట్టాడు. అతడి తండ్రి లోకం చూసిన వాడు.

అతడు తన కొడుక్కి సలహా చెప్పాడు: ‘నాన్నా, మన పరిస్థితి నీకు తెలుసు. మనం అప్పుల్లో పీకలదాకా కూరుకుపోయి ఉన్నాం. నీ అక్కచెల్లెళ్ళా శరవేగంగా ఎదుగుతున్నారు. నేనా ముసలివాణ్ణైపోయాను. ఈ లోకం నుంచి ఎప్పుడు వెళ్ళిపోతానో నాకే తెలీదు. ఇప్పుడు నువ్వే ఈ యింటికి పెద్దదిక్కు కింద లెక్క. ఉద్యోగం వెతుక్కునేప్పుడు దాని హోదా ఏమిటి, నెలకి జీతం ఎంతొస్తుంది లాంటివి చూడకు. ఉద్యోగమంటేనే ఒక సాధుమందిరం లాంటిది. అక్కడ నైవేద్యాలూ, కానుకలూ ఏ మాత్రం రాగలవన్నదే నువ్వు చూసుకోవాలి. కాబట్టి జీతాన్ని మించి ఆదాయం రాగల ఉద్యోగం కోసం వెతుక్కో. నెలజీతం పున్నమి చంద్రుడిలాంటిది. ఒకరోజు బాగా కనిపిస్తుంది. మర్నాటినుంచీ సన్నగిల్లడం మొదలుపెట్టి, చివరికి అదృశ్యమైపోతుంది. కాని పైసంపాదన అలా కాదు. అది ఎప్పుడూ ఎడతెగక పారే ఏరులాంటిది. ఎప్పటికప్పుడు నీ దప్పిక తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది. నెలజీతం మనుషులు పంచేది, కాబట్టి, దానిలో ఎదుగుబొదుగూ ఉండవు. పైసంపాదన ఒక దైవానుగ్రహం, కాబట్టి దానికి తరుగుండదు. నువ్వు చదువుకున్నవాడివి. నీకు ఇంతకన్నా వివరించి చెప్పాల్సిన పనిలేదు. అదంతా నీ మనస్సాక్షి మీదా, మంచిచెడ్డల విచక్షణమీదా ఆధారపడి ఉంటుంది. మనుషుల్ని చూడు, వాళ్ళ అవసరాల్ని గమనించు. అప్పుడు సరైన సమయంకోసం ఎదురుచూసి, ఆ క్షణం రాగానే సరైన నిర్ణయం తీసుకో. నీ సహాయం కావలసిన మనిషిపట్ల నువ్వు కనికరం చూపించవలసిన పనిలేదు. కానీ నీతో పని పడని మనిషితో ఎలా నడుచుకోవాలన్నది అంత తేలికైన విషయం కాదు. నా మాటలు గుర్తుపెట్టుకో. వాటిల్లో ఒక జీవితకాలపు అనుభవం ఉంది..’

ఈ మాటలు చెప్పి వంశీధరుడి తండ్రి అతణ్ణి పరిపూర్ణంగా ఆశీర్వదించాడు. విధేయుడైన కొడుకులానే అతడు కూడా తన తండ్రిమాటలు శ్రద్ధగా ఆలకించాడు. అప్పుడు తన అదృష్టం వెతుక్కుంటూ, సహనం తోడుగా, సాహసం బలంగా, పట్టుదల మార్గదర్శకురాలిగా విశాలప్రపంచంలో అడుగుపెట్టాడు. అతడు బయలుదేరిన వేళావిశేషం మంచిది కావడంతో అతడికి ఉప్పుశాఖలో ఉద్యోగం దొరికింది. జీతం తగ్గట్టే ఉంది. పై సంపాదనకు పరిమితి లేదు. ఈ శుభవార్త తెలియగానే వృద్ధమున్షీ ఆనందం పట్టలేకపోయాడు. ఇప్పుడు కిరాణాదుకాణం వాడికి వాళ్ళపట్ల నమ్మకం కుదిరింది. అప్పులవాళ్ళు మెత్తబడ్డారు. ఇరుగూపొరుగూ అసూయాగ్రస్తులయ్యారు.

2

శీతాకాలపు రాత్రి. పోలీసు కానిస్టేబిళ్ళూ, పహరావాళ్ళూ చిత్తుగా తాగిపడివున్నారు. వంశీధరుడు ఇక్కడ పనిచేయడం మొదలుపెట్టి ఆరునెలలే అయ్యింది. ఈ కొద్దికాలంలోనే అతడు తన విధి నిర్వహణవల్లా, నిజాయితీ వల్లా  పై అధికారుల విశ్వాసాన్ని చూరగొన్నాడు, కొంతమంది ప్రజల అయిష్టాన్ని కూడా మూటగట్టుకున్నాడు. ఉప్పుశాఖ కార్యాలయానికి తూర్పుదిక్కున సుమారు మైలు దూరంలో యమున ప్రవహిస్తూ ఉంది. దానిమీద ఒక పడవలవంతెన కూడా ఉంది. యినస్పెక్టరు తన శిబిరంలో ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. అతడు అకస్మాత్తుగా కళ్లు తెరిచి చూసేటప్పటికి నదీప్రవాహపు సంగీతానికి బదులు బండ్ల చప్పుడూ, పడవవాళ్ళ అరుపులూ వినబడుతున్నాయి. అతడు లేచి కూచున్నాడు. ఇంత నట్టనడిరాత్రి పడవలకి నదిదాటవలసిన అగత్యం ఏమొచ్చుంటుందని ఆలోచించాడు. అందులో ఏదో తేడాలేకపోతే అవి చీకట్లో ఎందుకు ప్రయాణమవుతున్నట్టు? అతడు యూనిఫాము తొడుక్కున్నాడు. పిస్టలు జేబులో పెట్టుకున్నాడు. గుర్రం ఎక్కి నదివైపు బయలుదేరాడు. పొడుగ్గా ఒక బండ్ల వరస వంతెనదాటుతూ కనిపించింది.

అతడు ఉరుములాగా గర్జించాడు: ‘ఎవరి బండ్లవి ?’

క్షణకాలం నిశ్శబ్దం రాజ్యం చేసింది.

కొంతసేపు లోగొంతులో గుసగుసలునడిచాక అందరికన్నా ముందున్న బండివాడు జవాబిచ్చాడు: ‘ఇవి పండిత అలోపీదీనువి.’

‘ఎక్కడి పండిత అలోపీదీను?’

‘దాతాగంజు వాస్తవ్యుడు.’

మున్షీ వంశీధరుడు క్షణకాలం మౌనంగా ఉండిపోయాడు. అలోపీదీను ఆ ప్రాంతంలో సుసంపన్నుడైన, సువిఖ్యాతుడైన జమీందారు. లక్షల రూపాయల మేరకు ప్రామిసరీనోట్లతో వ్యాపారం చేస్తాడు. అదికాక, ధాన్యం వ్యాపారం కూడా ఉంది. ఆ ప్రాంతంలో చాలా పలుకుబడి కలిగినవాడు. ఆ ప్రాంతంలో వేటాడానికొచ్చే ఇంగ్లిషు అధికారులూ, మాజిస్ట్రేటులూ అతడి ఆతిథ్యం స్వీకరిస్తూ ఉంటారు. ఏడాది పొడుగునా అతడి ఇంటిదగ్గర సంతర్పణ నడుస్తూనే ఉంటుంది.

ఆ బండ్లు ఎక్కడికి పోతున్నాయంటే కాన్పూరుకి అని చెప్పారు వాళ్ళు వంశీధరుడికి. కాని ఆ బండ్లల్లో ఉన్న సరుకేమిటని అడిగితే మాత్రం జవాబు లేదు. యినస్పెక్టరుకి అనుమానం బలపడింది.

అతడు గద్దించి మరీ అడిగాడు ‘ ఏం నోట్లో మాటపడిపోయిందా మీకు? చెప్పండి, బండ్లల్లో ఉన్న సరుకేమిటి?’

అయినా కూడా జవాబు రాకపోవడంతో అతడు తనే గుర్రం మీద ఒక బండిదగ్గరకి వెళ్ళి ఆ బండిలో ఉన్న ఒక బస్తా పరీక్షించి చూసాడు. అతడి అనుమానాలు నిజమయ్యాయి. ఆ బస్తానిండా ఉప్పురాళ్ళ ముద్దలు.

3

పండిత అలోపిదీన్ తన అందమైన రథంలో సగం నిద్రలో, సగం మెలకువగా ప్రయాణిస్తూ ఉన్నాడు.

భయంతో బెంబేలెత్తిన బండ్లవాళ్ళు చాలామంది వచ్చి అతణ్ణి నిద్రలేపి ‘మహారాజా, యినస్పెక్టరు మన బండ్లు ఆపేసాడు. నది ఒడ్డున నిలబడి మిమ్మల్ని రమ్మంటున్నాడు ‘ అని చెప్పారు.

లక్ష్మీదేవి చేతుల్లో ఉన్న అపారమైన శక్తిగురించి అలోపిదీనుకి అనుభవపూర్వకంగా తెలుసు. డబ్బుకి స్వర్గలోకంలో కూడా పలుకుబడి ఉందంటూ ఉంటాడు. అతడి అభిప్రాయం నిజమే. సత్యం, న్యాయం లక్ష్మీదేవి చేతుల్లో కీలుబొమ్మల్లాంటివి, వాటిని కోరుకున్నట్టు ఆడించొచ్చు.

అతడు తన రథంలో సుఖంగా వాలిఉన్నవాడు కించిత్తు కూడా చలించకుండా ‘మీరు పదండి నేను వస్తున్నాను’ అన్నాడు.

తీరిగ్గా ఒక కిళ్ళీతీసుకుని బుగ్గన పెట్టుకున్నాడు.

అప్పుడు తన వంటిమీదున్న బొంత పక్కన పడేసి లేచి యినస్పెక్టరు దగ్గరకొచ్చి, యాథాలాపంగా, ‘బాబూజీ, మీకు నా ప్రణామాలు. నేనేమి అపరాధం చేసానని నా బండ్లన్నీ ఇలా ఆపేసారు? మాలాంటి బ్రాహ్మల పట్ల మీరొకింత గౌరవం చూపించి ఉండాల్సింది’ అని అన్నాడు.

వంశీధరుడు అలోపిదీనుని గుర్తుపట్టాడు. ‘ప్రభుత్వ ఉత్తర్వులు’ అని అన్నాడు ఒక్కముక్కలో.

అలోపిదీను నవ్వేసి అన్నాడు కదా ‘ నాకు ప్రభుత్వమంటే ఏమిటో, ఆ ఉత్తర్వులేమిటో తెలీదు. నా వరకు నాకూ మీరే ప్రభుత్వం. మన మధ్య ఇదొక కుటుంబవ్యవహారం లాంటిది. మీరు నేనూ పరాయివాళ్ళమా? మీరు అనవసరంగా శ్రమపడ్డారు. ఈ రేవుదగ్గర వెలసిన దేవుడికి నైవేద్యాలు సమర్పించుకోకుండా ఈదారిన ఎలా పోగలను? స్వయంగా నేనే మీదగ్గరికి రాబోతున్నాను కదా.’

సంపన్నుడైన ఆ జమీందారు చేసిన ఈ స్తోత్రపాఠాలు వంశీధరుడి మీద ఎటువంటి ప్రభావాన్నీ చూపించలేకపోయాయి. ‘అణాకానీకోసం ఆత్మనమ్ముకునే దుర్మార్గుల్లో ఒకణ్ణి కాను నేను. ఈ క్షణాన్నే మిమ్మల్ని అరెస్టుచేస్తున్నాను. తెల్లవారగానే మీకు జరిమానా విధిస్తాను. ఇంతకన్నా చెప్పేదేమీ లేదు. జమేదారు బద్ధూసింగ్, ఈయన్ని అదుపులోకి తీసుకో. ఇది నా ఆజ్ఞ’ అని అన్నాడు.

ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. పండిత అలోపిదీను, ఆయన దగ్గరిమనుషులూ, బండివాళ్ళూ అంతా నిర్ఘాంతపోయారు. ఇటువంటి అప్రియమైన మాటలు వినవలసి రావడం పండిట్జీకి తన జీవితకాలంలో బహుశా ఇదే మొదటిసారి. బద్ధూసింగు అడుగుముందుకేసాడుగానీ అతణ్ణి పట్టుకోడానికి సాహసించలేకపోయాడు. నీతిసూత్రాల్ని నమ్ముకుని సంపదపట్ల అంత తృణీకారం చూపించగల ఒక అధికారిని అలోపిదీను ఇప్పటిదాకా చూసి ఉండలేదు. అతడు కలవరపడిపోయాడు.

‘అతడు ఇంకా లేతగా ఉన్నాడు’ అనుకున్నాడు పండిట్జీ. ‘ డబ్బు ఎటువంటి సుఖసంతోషాల్ని తేగలదో అతడింకా తెలుసుకోవలసే ఉంది. బహుశా నోరు తెరిచి అడగడానికి మొహమాట పడుతూ ఉండవచ్చు. కొద్దిగా లాలించాలి, బుజ్జగించాలి.’

అతడు వినయంగా ‘ బాబూ సాబ్, నాపట్ల మరీ అంత ఆగ్రహం చూపించకండి. నా పరువుప్రతిష్టలు భంగపడతాయి. నేను సర్వనాశనమైపోతాను. అదీకాక, ఇంతాచేసి మీరు బావుకునేదేమిటి? బహుశా మీకేమన్నా అవార్డులు రావొచ్చు. కాని మేము మీకు శత్రువులం కాదుకదా..’

‘మీరేం చెప్పదలుచుకున్నా వినడానికి సిద్ధంగా లేను’ అన్నాడు వంశీధర్ ఆ సంభాషణ తుంచేస్తూ.

అంతవరకూ తనకేమీకాదన్న భరోసాతో నిలబడ్డ అలోపిదీనుకి కాళ్ళ కింద నేల జారిపోతున్నట్టుగా అనిపించింది. అతడి ఆత్మవిశ్వాసానికీ, ఐశ్వర్యమదానికీ దెబ్బతగిలింది. అయినా డబ్బుకుండే మహిమ పట్ల అతడు తన విశ్వాసాన్ని పట్టుకుని ఇంకా వేలాడుతూనే ఉన్నాడు. తన మానేజరువైపు తిరిగి ‘లాలాజీ, బాబుగారికి వెయ్యి రూపాయలు సమర్పించు. ఇప్పుడాయన ఆకలిగొన్న సింహంలాగా ఉన్నారు’ అన్నాడు.

వంశీధరుడి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘వెయ్యి రూపాయలు కాదు సరికదా లక్షరూపాయలైనా నా విధ్యుక్తధర్మం నుంచి నన్ను పక్కకు తప్పించలేవు ‘ అన్నాడు.

నిజాయితీ చూపిస్తున్న ఆత్మనిర్భరత్వపు ఈ మూర్ఖప్రదర్శన చూసి ఐశ్వర్యదేవతకి కోపమొచ్చింది. సిరిసంపదలకీ, నీతినిజాయితీలకీ మధ్య పూర్తిబలప్రదర్శన మొదలయ్యింది. అయినా డీలా పడిపోకుండా సంపద ఒకదానివెనక ఒకటిగా తన ప్రయత్నాలు చేస్తూనే ఉండింది- వెయ్యి రూపాయలనుంచి అయిదువేల రూపాయలకు, అయిదు నుంచి పది, పదినుంచి పదిహేను, చివరికి ఇరవైవేలదాకా పలికింది. కానీ విధినిర్వహణ మాత్రం తనమీద పడుతున్న ఈ చావుదెబ్బలకి కూలిపోకుండా, మొక్కవోని ధైర్యంతో ఒక పర్వతంలాగా ఎదురొడ్డి నిలబడింది.

ఇక చివరికి పట్టలేని నిస్పృహతో ‘ఇంతకుమించి నేను చెయ్యగలిగిందేమీ లేదు, ఇంక మీ యిష్టం ‘అని అన్నాడు అలోపిదీను.

వంశీధరుడు జమేదారుకోసం గట్టిగా కేకపెట్టాడు. యినస్పెక్టరును లోపల్లోపలే కసిదీరా శపించుకుంటూ బద్ధూ సింగు ఆలోపిదీను వైపు అడుగేసాడు.

భయంతో అలోపిదీను రెండడుగులు వెనక్కి వేసి ‘బద్ధూ సాహెబ్, దేవుడి ముఖం చూసి నన్ను జాలిదలుచు. నేను ఇరవై అయిదు వేలయినా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాను’ అన్నాడు.

‘అసాధ్యం.’

‘ముప్ఫై వేలు.’

‘అసంభవం.’

‘నలభై లక్షలయినా కూడా ఉపయోగం లేదంటూ ఉంటే నలభై వేలెక్కడ? బద్ధూ సింగ్. ఇతణ్ణి అరెస్టు చెయ్యి. ఇతణ్ణుంచి మరొక్క మాట వినడానికి కూడా సిద్ధంగా లేను.’

విధినిర్వహణ ఐశ్వర్యాన్ని కాళ్ళకింద తొక్కిపడేసింది. బలిష్టుడైన ఒక యువకుడు బేడీలు పట్టుకుని తన దగ్గరకు వస్తూండటం అలోపిదీను చూసాడు. అతడు నిస్సహాయంగా నలువైపులా చూసి అకస్మాత్తుగా స్పృహతప్పి నేలకూలిపొయ్యాడు.

4

ప్రపంచమైతే నిద్రపోతూ ఉందిగాని ప్రజల నాలుకలకి నిద్రలేదు. అవి రాత్రంతా ఆడుతూనే ఉన్నాయి. తెల్లవారేటప్పటికల్లా ప్రతి ఒక్కరి నోట్లోనూ ఈ కథనే ఆడుతూ ఉంది. ఇప్పటికి ప్రపంచం నేరవిముక్తం అయినట్లుగా ప్రతి ఒక్కచోటా ఖండనవాక్యాలు, అభిశంసన వాక్యాలు వినిపించడం మొదలుపెట్టాయి. ప్రతి ఒక్కరూ  తామే మరింత నిజాయితీపరులమన్నట్టుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. పాలల్లో నీళ్ళు కలిపే పాలవాడూ, టికెట్టుకొనకుండానే రోజూ రైల్లో ప్రయాణించే గుమాస్తాలూ, తప్పుడు పత్రాలు సృష్టించే వడ్డీవ్యాపారస్థులూ, జిత్తులమారి వ్యాపారులూ ప్రతి ఒక్కరూ జరిగిందానికి అనంగీకారంగా తలపంకించడం మొదలుపెట్టారు.

ఆ మర్నాడు తన చేతులకి బేడీలు తగిలించి కానిస్టేబిలు కోర్టుకి నడిపిస్తుండగా అలోపిదీను సిగ్గుతో తలవంచుకుని లోపల్లోపల ఆగ్రహంతో, దుఃఖంతో రగిలిపోతూ ఉండగా, మొత్తం పట్టణమంతా తల్లడిల్లిపోయింది. అంతమంది జనాలు అంత ఆతృతగా గుమికూడటం తిరుణాలల్లో కూడా కనబడదు. జనం ఎంత పెద్ద ఎత్తున గుమికూడారంటే కోర్టుహాలు ఎక్కడ మొదలవుతున్నదో, వీథి ఎక్కడ ముగుస్తున్నదో చెప్పడం కష్టమయింది.

కాని కోర్టురూములో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆ ప్రాంతానికి పండిత అలోపిదీను మకుటం లేని మహారాజు. మాజిస్ట్రేట్లు అతడి ఆరాధకులు. అధికారులు అతడిమెహర్బానీ కోసం పడిగాపులు పడేవాళ్ళు. అటార్నీలు, లాయర్లూ అతడెప్పుడు పిలిస్తే అప్పుడొచ్చి వాలడానికి సిద్ధంగా ఉంటారు. ప్యూన్లు, అటెండర్లు, వాచ్మేన్లు అతడికి బానిసలు. అతణ్ణి చూడటానికి జనం నలుదిక్కులనుంచీ పరుగెత్తుకొచ్చారు. ప్రతి ఒక్కరి ముఖంలోనూ ఆశ్చర్యమే- అతడు చేసిందానిపట్ల కాదు, అతడలా ఎలా పట్టుబడాడన్నదానిపట్లనే. అంత ఐశ్వర్యవంతుడు తన వాక్చాతుర్యంతో దేవుళ్ళని కూడా మభ్యపెట్టగలవాడు, ఇప్పుడిలా చట్టం ముందు నేరస్థుడిగా నిలబడటమనే అసంభవం ఎలా సంభవమైంది? ముందు ఆసకార్యపోయాక నెమ్మదిగా సానుభూతి ప్రకటించడం మొదలుపెట్టారు. అతడి తరఫున వాదించడానికి ఏకంగా ఒక లాయర్ల దళమే మోహరించింది. న్యాయదేవత ప్రాంగణంలో సంపదకీ, విధినిర్వహణకీ మధ్య పోరుసన్నాహం మొదలయ్యింది. వంశీధరుడు మౌనంగా నిలబడి ఉన్నాడు. తనకి మద్దతుగా అతడికి సత్యం తప్ప మరొక బలం లేదు, నిజం తప్ప మరొక ఆయుధం లేదు. సాక్షులు లేకపోలేదు నిజమేగాని వారు దురాశ నీడ కింద ఊగిసలాడుతున్నారు.

న్యాయదేవత త్రాసు తనకి వ్యతిరేకంగా మొగ్గబోతున్నట్లు వంశీధరుడికెలానో స్ఫురించింది. న్యాయానికి సిరిసంపదలు పట్టనిమాట నిజమేగాని ప్రజల కన్నుగప్పి నర్తించే రహస్య ఆకాంక్షలు లేకపోలేదు. మనుషులకి రకరకాల ఆహ్వానాలు పంపడం ద్వారా, కానుకలు కురిపించడం ద్వారా సంపద ఎన్నో కుయుక్తులు పన్నగలదు. నిజమే, అది న్యాయదేవత ఆలయమేగాని, అక్కడున్న అధికారులు మాత్రం దురాశతో మత్తెక్కినవాళ్ళు. కేసు విచారణ తొందరగానే ముగిసింది.

డిప్యూటీ మాజి స్ట్రేటు తన తీర్పు వినిపించాడు: ‘పండిత అలోపిదీనుకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన సాక్ష్యం బలహీనంగానూ, నిరాధారంగానూ ఉంది. అతడు అటువంటి హీన చర్యకు, అది కూడా ఏదో నాలుగుడబ్బుల కోసం , ఒడిగడతాడనడం అసంభవం అనేది నిర్వివాదాంశం. ఏదో తక్షణ ఉద్రేకంలో,  యినస్పెక్టర్ మున్షీ వంశీధర్, చేయకూడని పొరపాటు చేసాడు. ఇది అత్యుత్సాహం తప్ప మరోటి కాదు. విధినిర్వహణకు అంకితమైన ఇటువంటి యువకుణ్ణి చూసి మాకు సంతోషంగా ఉంది. అయితే ఉప్పుశాఖలో నీతినిజాయితీలపట్ల మక్కువ మరీ మితిమీరినందువల్ల అతడు తన విచక్షణ కోల్పోయి సరైన నిర్ణయం తీసుకోలేకపోయాడు. ఇకమీదట మరింత జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా అతణ్ణి హెచ్చరిస్తున్నాం.’

ఆ తీర్పు వినగానే లాయర్లు సంతోషంతో ఎగిరి గంతేసారు. పండిత అలోపిదీను మందహాసంతో కోర్టురూమునుంచి బయటికొచ్చాడు. అతడి శ్రేయోభిలాషులు అతడిమీద డబ్బు కురిపించారు. అక్కడ ఔదార్యతరంగం, ఉత్సాపు కెరటం ఎంతలా వెల్లువెత్తాయంటే కోర్టు పునాదులే కదిలిపోతాయా అనిపించింది. వంశీధరుడు కూడా కోర్టురూమునుంచి బయటికొచ్చినప్పుడు, అతడి గౌరవం దెబ్బతిన్నట్టు కనిపించకపోయినప్పటికీ, ఎత్తిపొడుపులూ, వెక్కిరింతలూ నలుదిక్కులనుండీ అతడిమీద వర్షించాయి. ప్యూన్లూ, కానిస్టేబుళ్ళూ వంగి నమస్కరించారు. కాని సరిగ్గా ఆ క్షణాన్నే ప్రతి ఒక్కటీ అతడిలోపల రగులుతున్న స్వాభిమానాన్ని బలపరుస్తూనే ఉంది. తాను ఈ  కేసులో గెలిచి ఉంటే, అతడిటువంటి గర్వంతో బయటకు అడుగుపెట్టగలిగి ఉండేవాడు కాడు. ప్రపంచం అతడికి మొదటి పాఠం నేర్పింది; న్యాయం, చదువు, గొప్ప గొప్ప బిరుదులు, పొడవాటి గెడ్డాలు, రెపరెపలాడే అంగరఖాలు-ఏ ఒక్కటీ నిజంగా గౌరవనీయాలు కావు.

5

వంశీధరుడు సంపదతోటీ పలుకుబడితోటి శత్రుత్వం కొనితెచ్చుకున్నాడు. కాబట్టి దానికి అతడు మూల్యం చెల్లించవలసి వచ్చింది. వారం రోజులు కూడా తిరక్కుండానే అతడు సస్పెన్షను ఉత్తర్వులు అందుకున్నాడు. అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా నడుచుకున్నందుకు లభించిన శిక్ష ఇది. అధైర్యంతోనూ, నిరుత్సాహంతోనూ కుంగిపోయి అతడు ఇంటిబాట పట్టాడు. అతడి తండ్రి పెద్ద మున్షీ అతడి వైఖరి చూసి మండిపడ్డాడు. ‘వాడు ఇంటినుంచి బయట అడుగుపెట్టేటప్పుడే నేను వాడికి హితబోధ చేసాను. కాని వాడు నా మాటలు వినిపించుకోలేదు. వాడు కేవలం తన జీతపురాళ్ళనే నమ్ముకున్నందువల్ల, ఈ వయసులో ఇప్పుడు నేను కిరాణా దుకాణాలవాళ్లవీ, అప్పులిచ్చినవాళ్ళవీ ఫిర్యాదులు వినవలసి వస్తోంది. నేను కూడా ప్రభుత్వంలో ఉద్యోగం చేసాను. నాకేమంత అధికారంలేకపోయినా, ఏదో ఉన్నంతలో నాకు చేతనైన విధంగా నడుపుకున్నాను. చూడు, నువ్వేదో నిజాయితీపరుడైన అధికారిగా ఉండాలని తాపత్రయపడ్డావు. అదెలాగుందంటే ఒకవైపు నీ ఇల్లు చీకట్లో పడి ఉంటే, పోయి మసీదులో దీపం పెట్టినట్టుంది. నిన్ను చూసి నాకు జాలేస్తోంది. నీకు చెప్పించిన చదువంతా వృథా.’

రెండుమూడు రోజుల తర్వాత దయనీయ పరిస్థితిలో వంశీధరుడు ఇంటికి చేరి జరిగిందంతా తండ్రికి చెప్పినప్పుడు ఆయన కోపానికి పట్టపగ్గాల్లేవు.

‘నాకు దేంతోనైనా నీ తలబాది నా తలబాదుకోవాలని ఉంది.’

చాలాసేపటిదాకా ఆయనట్లా అరుస్తూ, పెడబొబ్బలు పెడుతూ కోపంలో నోటికొచ్చినట్టు మాటాడుతూనే ఉన్నాడు. వంశీధరుడు అక్కణ్ణుంచి వెళ్ళిపోకపోయి ఉంటే ఆయన తన కోపంలో ఏమన్నా చేసి ఉండేవాడు. వంశీధరుడితల్లి కూడా చాలా దిగులుపడింది. పూరీజగన్నాథానికీ, రామేశ్వరానికీ వెళ్ళాలన్న ఆమె కన్నకలలు ఆవిరైపోయాయి. చివరికి వంశీధరుడి భార్యకూడా చాలారోజుల పాటు అతడితో సరిగ్గా మాట్లాడనే లేదు.

వారం రోజులిట్లా గడించాయి- బంధుమిత్రుల వెక్కిరింపులూ, అపరిచితుల సానుభూతి వాక్యాలూ వినవలసి రావడం దుర్భరంగా ఉండింది. ఒక సాయంకాలం, పెద్ద మున్షీ రామనామం జపించుకుంటూ ఉండగా, ఒక పెద్ద రథం వచ్చి, ఆయన గుమ్మం దగ్గర ఆగింది. ఆ బండి ఆకుపచ్చరంగులోనూ, దాని తెరలు గులాబి రంగులోనూ ఉన్నాయి. చక్కటి మేలుజాతి ఎడ్లు ఆ బండికి పూన్చి ఉన్నాయి. వాటి కొమ్ములకి ఇత్తడి తొడుగులున్నాయి, వాటి మెడలో నీలపురంగు పట్టీలు వేలాడుతున్నాయి. వచ్చిన అతిథుల్ని స్వాగతించడానికి మున్షీ ముందుకు దూకాడు. దగ్గరకు వెళ్ళి చూస్తే, ఆ వచ్చినతడు, పండిత అలోపిదీను. మున్షీ అతణ్ణి స్వాగతిస్తూ, అతడి ముందు మోకరిల్లి, వంశీధరుడు చేసిన పనికి క్షమాపణలు చెప్పుకోడం మొదలుపెట్టాడు.

‘మీకు నేను నా ముఖమెలా చూపించేది? నా కొడుకు నా ముఖానికి మసిపూసేసాడు. కాని నేనేం చెయ్యగలను? వాడు పనికిమాలినవాడో మరొకటో కాని మేము మీనుంచి ఎందుకు తప్పించుకు తిరగాలి? అటువంటి కొడుకుని కనేకన్నా నిస్సంతుగా ఉండిపోయుంటే ఎంతో బాగుండేది.’

అలోపిదీను తనతో కరచాలనం చేస్తున్నప్పుడు వంశీధరుడు తన హుందా కోల్పోకుండానే ఉన్నాడు. పండిత అలోపిదీను తనని అవహేళన చెయ్యడానికే వచ్చాడని అతడు అనుమానించాడు. కాని ఎటువంటి పశ్చాత్తాపాన్నీ ప్రకటించలేదు. తన తండ్రి చేస్తున్న ముఖస్తుతి అతడికి సహించరానిదిగా తోచింది.

పండిట్జీ సంభాషణ మొదలుపెట్టాడు ‘లేదన్నా, మీరలా అనకండి’ అన్నాడు.

గాలి ఇప్పుడేదిక్కుకి వీస్తున్నదో పెద్ద మున్షీకి కొరుకుడుపడలేదు. అయోమయంగా చూస్తూ ‘మరి అటువంటి కొడుకు గురించి ఇంకేమనగలను’ అన్నాడు.

‘మీ వంశానికే గర్వకారణమైన అటువంటి కొడుకునిచ్చినందుకు మీరు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. తాను నమ్మిన విలువలకోసం సమస్తం త్యాగం చెయ్యడానికి అతడిలాగా వెనుకాడనివాళ్ళు ఈ లోకంలో ఎందరుంటారు?’ అన్నడు అలోపిదీను ఉత్సాహంగా.

అప్పుడతడు వంశీధరుడికేసి తిరిగి ‘యినస్పెక్టరు సాబ్, నేను మిమ్మల్ని పొగుడుతున్నానని అనుకోకండి. కేవలం పొగడటానికే నేను ఇంతదూరం వచ్చిఉండేవాణ్ణి కాను. మీరు ఒక ప్రభుత్వాధికారిగా మీకున్న అధికారాల్ని వినియోగించి ఆ రాత్రి నన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు నేను నా అంతట నేనే మీ ముందు లొంగిపోడానికి వచ్చాను. డబ్బూ, పలుకుబడీ ఉన్నవాళ్ళని వేలాదిమందిని చూసాను. ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళతో ఎందరితోనో వ్యవహారం నడిపేను. నా సంపదతో వాళ్ళందరినీ నా బానిసల్ని చేసుకోగలిగేను. కాని మీరు నా మీద గెలిచారు. మీరనుమతిస్తే మిమ్మలనొక్క మాట అడగాలని ఉంది’ అని అన్నాడు.

పండిట్జీ తన హృదయంలోంచీ మాట్లాడుతున్నాడని వంశీధరుడు గ్రహించాడు. అతడు ఆమోదపూర్వకంగా పండిట్జీ వైపు చూసాడు. అతడి స్వాభిమానం స్థానంలో నెలకొన్న ఒకింత సిగ్గుతో, అతడు మొహమాటంగానే ‘మీ పెద్దమనసు మిమ్మల్నిక్కడిదాకా తీసుకొచ్చింది. నేను నా బాధ్యతల నిర్వహణకోసమే మీతో కటువుగా ప్రవర్తించవలసి వచ్చింది. ఇప్పుడు నేను మీ సేవకు సిద్ధంగా ఉన్నాను. మీరు ఏమి ఆదేశిస్తే నాకు చాతనైనంతమేరకు దాన్ని నెరవేరుస్తాను’ అని అన్నాడు.

అలోపిదీను సానుకూల దృక్కుల్తో అతణ్ణి చూస్తూ, ఆ రాత్రి నది ఒడ్డున మీరు నా ప్రతిపాదన తిరస్కరించారు. కాని ఇప్పుడు నేను చెయ్యబోయే ప్రతిపాదనని మీరు అంగీకరించక తప్పదు’ అన్నాడు.

‘నేను మీకేమి చెయ్యగలనో తెలీదు. కాని నేనేది చెయ్యగలిగితే అది తప్పకుండా చేస్తానని మాత్రం చెప్పగలను.’

అలోపిదీను ఒక దస్తావేజు తీసి వంశీధరుడి ముందు పెట్టాడు. ‘ ఈ పవరాఫ్ అటార్నీ శ్రద్ధగా చదివి సంతకం పెట్టండి. నేను బ్రాహ్మణుణ్ణి. మీరు నా విన్నపం అంగీకరించేదాకా నేనిక్కడనుంచి కదలబోవడం లేదు.’

వంశీధరు ఆ కాగితం చదువుతూనే, కృతజ్ఞతాపూర్వకంగా, అతడి కళ్ళల్లో అశ్రువులు పొంగిపొర్లాయి. సాలీనా ఆరువేల రూపాయల జీతం మీద అతణ్ణి తన ఆస్తిపాస్తులు మొత్తానికి అటార్నీగా నియమిస్తూ అలోపిదీను రాసిన పత్రం అది. జీతంకాక, రోజువారీ ఖర్చులకోసం ప్రత్యేక భత్యం, తిరగడానికి గుర్రం, అపరిమిత అధికారాలూ అతడికి దఖలు పరుస్తున్నట్లుగా ఉందందులో. వంశీధరుడు కష్టం మీద గొంతు పెగుల్చుకుంటూ ‘పండిట్జీ, మీరు చూపిస్తున్న ఈ ఔదార్యానికి కృతజ్ఞ్తలు చెప్పడానికి నా దగ్గర మాటల్లేవు. కాని నిజం చెప్పాలంటే, నేనింత గౌరవానికి తగను.’

‘మీరు మిమ్మల్ని ప్రశంసించుకోనక్కర్లేదు’ అన్నాడు అలోపిదీను.

వంశీధరుడు గంభీరస్వరంతో ‘నేను మీ బానిసని. మీవంటి గౌరవనీయులకోసం నేనేమి చెయ్యడానికేనా సిద్ధమే. కాని మీరు చూపిస్తున్న ఉద్యోగం చెయ్యడానికి తగిన అనుభవం, జ్ఞానం, విశాలదృష్టీ నాకులేవు. ఈ పనులు చెయ్యడానికి మీకు చాలా అనుభవజ్ఞుడూ, సమర్ధుడూ అయిన మనిషి కావాలి’ అన్నాడు.

అలోపిదీను కలం చేతుల్లోకి తీసుకుని ‘నేను అనుభవంకోసం, జ్ఞానం కోసం, సమర్ధతా, విశాల దృష్టి కోసం చూడటం లేదు. చాలాకాలంగా నేను రాళ్ళల్లో ముత్యాలకోసం వెతుక్కుంటున్నాను. నా భాగ్యవశాత్తూ జ్ఞానం కన్నా, విశాలదృష్టికన్నా మించిన వజ్రాన్ని కనుక్కోగలిగాను. ఇదుగో, కలం తీసుకుని మరేమీ ఆలోచించకుండా సంతకం పెట్టండి. మీరెప్పటికీ ఇలానే కటువువైన, కనికరంలేని, కాని విధ్యుక్తధర్మాన్ని నిర్వహించడంలో ఏమరుపాటులేని యినస్పెక్టరుగానే ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను’ అని అన్నాడు.

వంశీధరుడి కళ్ళల్లో నీళ్ళు నిండాయి. ఆ ఔదార్యం అతణ్ణి ముంచెత్తింది. అతడు కృతజ్ఞతాపూర్వకంగా ఆలోపిదీను కేసి చూసి, వణుకుతున్న చేతుల్తో, ఆ పత్రం మీద చేవ్రాలు చేసాడు.

అలోపిదీను సంతోషంతో ఎగిరి గంతేసి వంశీధరుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు.


Featured image: pc: wikipedia

28-10-2025

4 Replies to “నన్ను వెన్నాడే కథలు-13”

  1. ఇలాంటి కథలు చదవక చాల రోజులైంది. మీ అనువాదం లో చదవడం సంతోషంగా ఉంది . నిజాయితీ కి గుర్తింపు ఉంటుందనే ధైర్యాన్ని అందించడం లో కథ సార్థకమైనది. మీరన్నట్టు
    ఇప్పుడు ఇలాంటి కథల ఆవశ్యకత మరీ ఎక్కువగా ఉంది. ఫాతిమా కాన్వెంటు హిందీఉపాధ్యాయిని దాదాపు ముప్పై ఐదేళ్ల క్రితం ప్రేంచంద్ కథను నృత్యరూపకంగా ప్రదర్శించడానికి నా చేత తెలుగులో సినాప్సిస్ రాయించిన జ్ఞాపకాన్ని పైకి తోడారు . మీకు కృతజ్ఞతాభినందనలు

  2. మన జీవితంలో, సమాజంలో ఆదర్శదృక్పథం కనుమరుగవుతున్నకొద్దీ ప్రేమ్ చంద్ ని తలుకుకోవడం కూడా కనుమరుగవుతున్నది.

    ప్రభుత్వ ఉద్యోగంలో అవినీతి సంస్థాగతమైపోయి, పౌర సమాజమూ, న్యాయవ్యవస్థా కూడా అవినీతిపరుడికి కొమ్ము కాస్తుండే వ్యవస్థని ప్రేమ్ చంద్ నిస్సంకోచంగా, నిర్భయంగా, అపారమైన ఆవేదనతో చిత్రించాడు

    నిజాయితీపరులూ, విలువలకు నిలబడే వాళ్ళూ ప్రభుత్వ ఉద్యోగంలో నిలదొక్కుకోలేకనే ప్రైవేటు, కార్పొరేటు ఉద్యోగాల వైపు మళ్ళి పోతుండడం ఇప్పటి వాస్తవం.

    ఇది చదివాక నేను అతి గర్వంగా తలెత్తుకోగల ఒక సంఘటన జరిగింది. మా నాన్నగారు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ లో డిప్యూటీ డైరెక్టర్ గా ఉండేవారు. భమిడిపాటి రామ గోపాలం గారు మా నాన్నగారి అండర్ లో పనిచేసేవారు. చిన్నప్పుడు రోజూ ఇంటికి ఫైల్స్ పట్టుకుని వచ్చేవారు. మేము భలే ఆడుకునేవాళ్ళం. తరుచూ ట్రాన్స్ఫర్స్ మూలంగా ఆయన ఎక్కడ ఉన్నారో తెలియలేదు. ఒకసారి శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మి గారు విశాఖ లో మా ఇంటికి దగ్గర్లో నే ఉన్నారని చెప్పడం తో వెళ్ళాను.
    ఆయన తన ఆత్మకథ పుస్తకం చూపిస్తూ మా నాన్నగారి గురించి… అమ్మ గురించి ఏమి రాసానో చూడమన్నారు. దానిలో ఉంది.
    శ్రీ ఉమామహేశ్వరరావు లంచం తీసుకోవడం ఎరగని ఉత్తముడు… అని.
    చాలదా… హరి నామ సౌఖ్యా మృతము … చాలదా? అనే హాయి. నమస్కరిస్తూ వెనుతిరిగాను.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading