
హైదరాబాదుకి చెందిన సుర్ మండల్ సంస్థవారు, బెంగలూరుకి చెందిన సప్తక్ సంస్థతో కలిసి నిన్న సాయంకాలం ఒక సంగీతకచేరీ ఏర్పాటు చేసారు. బి.ఎం.బిర్లా సైన్సు సెంటరు భాస్కర ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కచేరీకి నిన్న ఆదిత్యతో కలిసి హాజరయ్యాను.
కచేరీ రెండు భాగాలుగా నడిచింది. మొదటిభాగంలో ధార్వాడు ఘరానాకి చెందిన షఫీఖ్ ఖాన్ సితారు కచేరీ. రెండవభాగంలో బెంగలూరు కి చెందిన శ్రీమతి పూర్ణిమా భట్ కులకర్ణి గానం. ఇద్దరికీ కూడా గురుమూర్తి వైద్య తబలా సహకారం అందించారు. గాయిక గానానికి రాహుల్ దేశ పాండే హార్మోనియం అందించారు.
నేనొక సితారు కచేరీ ప్రత్యక్షంగా వినడం ఇదే మొదటిసారి. షఫీఖ్ ఖాన్ మార్వా రాగాన్ని ఎంచుకున్నాడని చెప్పగానే చాలా సంతోషమనిపించింది. మార్వా ఒక సాయంకాల రాగం కావడమే కాక, ఆ రాగం వినగానే, నాకు చాలా ఏళ్ళ కింద నేను విన్న పన్నాలాల్ ఘోష్ వేణువు గుర్తొస్తుంది. మార్వా రాగాన్ని ఘోష్ తన బాసురీమీద వినిపించిన ఆ కాసెట్టు నేనెన్నిసార్లు విన్నానో చెప్పలేను. ఒక విధంగా చెప్పాలంటే, మార్వారాగాన్ని వినడానికి, ఆ కాసెటు నాకొక పాఠ్యగ్రంథంగా మారిపోయిందని చెప్పవచ్చు.
మార్వా అనగానే నా కళ్ళముందొక నది ఒడ్డు, పగలంతా నదిమీద తిరిగి, సాయంకాలం కాగానే ఒడ్డుకి చేర్చిపెట్టిన పడవలు కనిపిస్తాయి. అస్తమయ సంధ్యలోని నారింజ రంగు కాంతి ఆకాశమ్మీంచి నది మీదకి ఒలికిపోతూ ఊదా రంగుగా మారిపోతూ కనిపిస్తుంది. నిన్న సంగీతకారుడు ఆలాపన వినిపిస్తున్నంతసేపూ, ఒడ్డుని తాకి నెమ్మదిగా చిట్లిపోతున్న చిన్నిచిన్ని నీటితరగల చప్పుడు వినిపిస్తూనే ఉంది. అది గోదావరి నదినా? ఎన్నోసార్లు ఆ రావిచెట్టునీడన కూచుని ఆ చిరునీటితరగల చప్పుడు విన్నట్టే నిన్నకూడా విన్నాను.
హిందుస్తానీ కచేరీల్లో ఆలాపన నిజంగా ఒక lyrical chapter. సాధారణంగా శ్రోతలు సంగీతకారుడినుంచి వైదుష్యప్రదర్శన కోరుకుంటారు. అతడికీ, పక్కవాద్యకారుడికీ మధ్య తమమనసులోనే ఒక పోటీ పెట్టుకుంటారు. కచేరీ జరుగుతున్నంతసేపూ ఆ పోటీలో ఎవరు నెగ్గుతున్నారా అని చూస్తూ ఉండటమే వాళ్ళ వ్యాపకంగా ఉంటుంది. సంగీతాన్ని, ముఖ్యంగా, ఒక సంగీతప్రదర్శనని ఎలా సమీపించాలో తెలియకపోవడం వల్ల వచ్చే పరిస్థితి ఇది.
నిజానికి సంగీతం ఎదట మనం అంతర్ముఖులం కావాలి. ఆ సన్నిధిలో మనం కలుసుకోవలసింది మనల్నే. జపాను సంస్కృతిలో ‘షిన్ రిన్ యోకు’ అనే ఒక భావన ఉంది. దాని అర్థం forest bathing అని. నువ్వొక ప్రభాతవేళనో, సాయంకాలంపూటనో ఒక అడవిలోనో, కొండదారినో నడిచివచ్చావనుకో, అది అడవిలో స్నానం చేసినట్టే అంటారు జపాను వాళ్ళు. సంగీతం అటువంటి స్నానం. నువ్వొక సాయంకాల రాగం విన్నావంటే, ఒక dusk bathing అన్నమాట. ఒక ప్రభాత రాగం విన్నావంటే, ఒక సముద్రస్నానంతో సమానం. నిన్న సాయంకాలం ఆ సితారు ఆలాపన వింటున్నంతసేపూ నాకు ఒక నది ఒడ్డున కూచున్నట్టూ, నా పాదాలు ఆ నీళ్ళల్లో మునిగీ మునక్కుండా పెట్టుకున్నట్టూ, చిన్ని చిన్ని నీటితరగలు నా పాదాల్ని తాకి విరిగి కిందకి జారిపోతుంటే, నా హృదయంలోపల ఎవరో చేయిపెట్టి మెత్తని సున్నితమైన తంత్రులేవో కెరలిస్తున్నట్టూ అనిపించింది.
ఆలాపన తరువాత, ఆయన రెండు కృతులు కూడా వినిపించాడుగానీ, ఆ వేదికమీద ఉన్న విద్యుద్దీపాల వేడిమికి సితారు తంత్రులు వదులైపోతూ ఆయన్ని మాటిమాటికి ఇబ్బందిపెడుతూనే ఉన్నాయి. నిజానికి ఇలాంటి కచేరీలు జరిగేటప్పుడు స్టేజి మీద డిమ్ లైటింగు ఉండాలి. పట్టపగల్లాగా ఉన్న ఫ్లడ్ లైట్ల కాంతిలో సంగీతకారుల్ని కూచోబెట్టి కచేరీ చేయమనడం మండుటెండలో పనిచేయమన్నట్టే.
వదులవుతున్న తంత్రుల్తో మాటిమాటికీ సితారు సీలల్ని బిగించుకుంటూనే సంగీతకారుడు ఆ వేదికనీ, ఆడిటోరియంనీ కోమలస్వరాలతో నింపేసాడని, అతని తర్వాత గాయిక కచేరీ మొదలుపెట్టాక నాకు బాగా అర్థమయింది. శ్రీమతి పూర్ణిమా భట్టు వంతు వచ్చేటప్పటికి సమయం దాదాపు ఎనిమిది కావొస్తుండటంతో ఆమె భాగేశ్రీ రాగాన్ని ఎంచుకున్నారు. అది ఆమె వివేకం. భాగేశ్రీ రాత్రి వేళలో రెండవజాము రాగం. అంటే రాత్రి తొమ్మిదిగంటలనుంచి పన్నెండుగంటల మధ్యలో ఆలపించే రాగం. విరహప్రధాన రాగం. కాంక్షాతప్త ప్రతీక్షతో కూడిన బరువుతో పాటు, వేచిఉండటంవల్ల అలసిసొలసి పోయే గుణం కూడా ఆ రాగంలో వినిపిస్తుంది. నిజానికి నేనా రాగాన్ని ఎక్కువసార్లు వినలేదు. అది చాలా వైదుష్యప్రధానమైన రాగమని నాకు నమ్మకం. నిన్నటి గాయిక ఒక విదుషి అని ఆమె ఆలాపన మొదలుపెట్టగానే గుర్తుపట్టగలిగాను.
అయితే, అప్పటికే నా మనసుని ఆవరించి ఉన్న సాయంకాల రాగప్రచ్ఛాయ నుంచి ఈ రెండవజాము రాగానికి మనసుని వెంటనే మళ్ళించడం నాకు సాధ్యం కాలేదు. నేను నా మనసుని సమాయత్తపరుచుకునేలోపే ఆమె ఆలాపన ముగించి బందిష్ ఎత్తుకున్నారు. భాగేశ్రీ రాగంలో ఆమె వినిపించిన రెండు బందిష్ లలోనూ, మొదటి బందిష్ లో, ఆమె రాగస్వభావాన్ని పూర్తిగా ఆవిష్కరించారని చెప్పవచ్చు. హిందుస్తానీ సంగీతం సమయప్రధానమేకాదు, ఋతుప్రధానం కూడా కాబట్టి, ఆమె భాగేశ్రీ తర్వాత మధుకౌంస్ రాగంలో రెండు బందిష్ లు వినిపించారు. రెండవ బందిష్ ఒక శరచ్చంద్రికా గీతి. ఆ గీతి వింటున్నంతసేపూ నాకు వేదుల సత్యనారాయణశాస్త్రి పద్యాలు వింటున్నట్టే ఉంది. ఆ కృతి మాత్రం సాహిత్యప్రధానంగానే వినిపించింది. చివరగా ఆమె మరాఠీ నాట్యసంగీత్ నుంచి ఒక కీర్తన వినిపించి తన కచేరీ ముగించారు.
పూర్ణిమాభట్ తన గానమంతా ఎటువంటి వివశత్వానికీ లోనుకాకుండా, శ్రోతల్ని కూడా వివశుల్ని కానివ్వకుండానే చూసుకున్నారు. అది వైదుష్యప్రధాన ప్రదర్శన. ఆమెకి తన సమయం మీద, ఎంపిక మీద, స్వరరాగప్రస్తారం మీద పూర్తి అదుపు ఉంది, ఆద్యంతం ఆమెకి ఆ స్పృహ ఉందనిపించింది.
తుఫాన్ల మధ్య నడుస్తున్న ఈ శరదృతువులో వెన్నెల ఇలా సంగీత కచేరీల్లో మాత్రమే కనిపిస్తున్నది.
27-10-2025


ఎన్నోసార్లు రావిచెట్టునీడన చిరునీటితరగల చప్పుడు …
ఆహా…
కచేరీ జరుగుతున్నంతసేపూ ఆ పోటీలో ఎవరు నెగ్గుతున్నారా అని చూస్తూ ఉండటమే వాళ్ళ వ్యాపకంగా ఉంటుంది. సంగీతాన్ని, ముఖ్యంగా, ఒక సంగీతప్రదర్శనని ఎలా సమీపించాలో తెలియకపోవడం వల్ల వచ్చే పరిస్థితి ఇది.
దీని వల్ల నేను ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డాను.
నిజానికి సంగీతం ఎదట మనం అంతర్ముఖులం కావాలి. ఆ సన్నిధిలో మనం కలుసుకోవలసింది మనల్నే
ఆహా…
నమోనమః.
ధన్యవాదాలు మేడం