
ప్రాచీన సంస్కృత, ప్రాకృత, తమిళ కవిత్వాల్లో తొలివానాకాలం గురించిన వర్ణనల గురించిన తలపోతలు ‘ఆషాడమేఘం’ గా ఈ తొలకరి ప్రారంభంలో వెలువరించాను. వర్ష ఋతువు ముగిసేలోపే ఇలా ఆ మున్నీరు ఒక సహృదయాకాశపు మిన్నేరుగా మారి తిరిగి పన్నీరుగా కురుస్తుందని అనుకోలేదు. ధన్యవాదాలు చిన్నమాట మానసా! ఇలా ఒక్కరు చదువుతున్నా కూడా ప్రపంచ సాహిత్యమంతా తీసుకొచ్చి కుమ్మరించాలనిపిస్తుంది!
సంజవేళ విరజాజి విచ్చుకుంటున్నది
మానస చామర్తి
ఆశ్వయుజమాసంలో ఆషాఢమేఘం నా చేతుల్లో! ![]()
కిటికీలలో కదలకుండా కువకువలాడే పావురాళ్ళు, ముడిచిపెట్టిన విసెనకర్రలు, మూసిఉన్న కిటికీలతో ఓ వానాకాలపు వైభవాన్ని చెప్పాడు నక్కీరరు అనే కవి. ఆ చలిగాలిలో ఆ నగరంలో ఉన్నవాళ్ళు నీళ్ళను ఏవగించుకుంటున్నారనీ నిప్పు కోసం తహతహలాడుతున్నారనీ అతడు తన కావ్యంలో రాసుకున్నాడు. బెంగళూరు వానల్లో నిండా మునిగినదాన్ని, ఆ చలిగాలుల రంపపు కోతలు గుర్తొస్తేనే నిప్పు ఊసెత్తిన ఈ కవి చేతులు ముద్దాడాలనుంది నాకు. ఆ వానలను చూస్తే ఎంత ఆనందమో అంత ఆందోళన. భర్తృహరికి అభిసారికలే ఎందుకు గుర్తొచ్చారో వెళ్ళి అడగగలమా మనం?
“కురుస్తున్న వానకి”
సూది పడటానికి కూడా
సందులేని చీకటి,
ఆకాశమంతా అరుస్తున్న
చిక్కటి మబ్బులు,
ఎడతెరిపిలేని వర్షధార
బంగారు తీగలాగా మెరిసే మెరుపులు-
అభిసారికలకు ఈ రాత్రిపూట
ఎంత ఆనందమో అంత ఆందోళన. (శృం. 94 , భర్తృహరి)
*
ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా వెంటపడే ప్రియసఖుడి ఊహలా, ఈ ఏడాది మొత్తం వాన ఏ ఊరెళ్ళినా నా వెనుకపడి వస్తూనే ఉంది. ఈ ఏడాదిలో నుండి నా జ్ఞాపకాల గురించి ఏం రాద్దామనుకున్నా, “మతుల తీగెలనూపి, స్మృతుల గాయము రేపి..” “మేఘాల మోహాలు ముసురు”కొన్న రాత్రులే నా కళ్ళ ముందుకొస్తున్నాయి.
రాతిరంతా ఇక్కడ వాన. బాల్కనీలో నిలబడి చూస్తోంటే ఎదురు మట్టి రోడ్ల మీద నలుపు ఎరుపు రంగులను సమంగా కలుపుకుని పారుతోంది వాననీరు. వాటిపై తేలుతూ వస్తోన్న చితుకుల తాకిడికి వీధి దీపాల వెలుతురు చితికిపోయి కనపడుతోంది. ఏమిటీ సౌందర్యం వర్షం కురిసే రాత్రులలో? వాల్మీకి మొదలుకుని కాళిదాసు మీదుగా నా కృష్ణశాస్త్రి దాకా, నా దాకా ఎంతమందిని ఈ వాన ఇట్లా మోహపెడుతుంది! ఆ కవులందరి లోకాల్లోని వర్ష ఋతు సౌందర్యాన్ని పరిచిన సంపుటి తెరిచాను-భద్రుడు గారు రాసిన ఆషాఢమేఘం. నాకు నొక్కింత నీ గాలి సోక ఒడలు జలదరించునదేమో ఆషాఢజలద అని రాశారట శరభయ్య గారు. ఈ పుస్తకంలో ఏ పుట దగ్గర ఆగినా ఆ తొలివానల తుంపరతో తగిలే పులకింతే. అట్లానే ఎప్పటికో నిద్రపోయాను.
ఈ ఉదయం వాన విడిచిన నిర్మలమైన ఆకాశంలో నుండి సౌమ్యంగా సూర్యుడు పైకొస్తున్నప్పుడు, నల్లటి ముద్దలా ఉన్న మేఘమొకటి మెల్లగా కరిగి ఆకాశమంతా అలుక్కుపోతునట్టు కనపడుతోంటే – రాత్రి చదివిన మాటలే గుర్తొచ్చాయి.
“శక్యం అంబరమారుహ్యమేఘసోపానపంక్తిభిః ” — ఈ మేఘాలనే నిచ్చెన ఎక్కి ఆకాశానికి ఎక్కగలిగితే, కొండమల్లెల మాల కట్టి సూరీణ్ణి అలంకరిస్తానని రాసుకున్నారు ఆదికవి.
*
అసలైతే ఈ పుస్తకం గురించి వానలు నిండుగా కురిసే శ్రావణంలోనే రాసుకోవాలి. కానీ వాల్మీకి కవి లెక్కలో ఆశ్వయుజం కూడా వర్షసంజ్ఞలోకే వస్తుందని ఈ పుస్తకంలో చదివాక, ఈ రోజు నాలుగు మాటలు ఈ పుస్తకం గురించే పంచుకోవాలనిపించింది. ఆకాశం చూద్దునా…
క్వచిత్ ప్రకాశం, క్వచిదప్రకాశం
నభః ప్రకీర్ణాంబుధరం విభాతి
క్వచిత్ క్వచిత్ పర్వతసన్నిరుద్ధం
రూపం యథా శాంతమహార్ణవస్య
(మేఘాలు వెదజల్లబడ్డ ఆకాశం ఒకచోట ప్రకాశవంతంగానూ, ఒకచోట మబ్బుపట్టినట్టుగానూ ఉండి, పర్వతాలు అడ్డగిస్తున్న శాంతమహాసముద్రంలాగా ఉంది)
అపార్ట్మెంట్ కింద పూల చెట్ల చుట్టూతా ఒకటే రొదగా తుమ్మెదలు – “రొద సేయకే తుమ్మెదా..” అని పాడుదును కానీ, నిన్నటి వాటి అవస్థ గుర్తొచ్చి జాలేసింది. తప్పతాగిన తేనెల మత్తంతా కురిసే వర్షధారల్లో కరిగిపోయాక అవస్థ కాక పాపం మరింకేమిటి?
“ఆగకుండా కురుస్తున్న వర్షధారలకి దెబ్బతిన్న కడిమిచెట్లమీద వాలుతున్న తుమ్మెదలకి అప్పటిదాకా పూలతేనెలో మునిగితేలిన మత్తంతా నెమ్మదిగా దిగిపోతున్నది” – అని రాసిన కవీ! నీకు వంద వందనాలు.
*
సంగం కవుల ప్రణయభూమికల గురించి ఈ సంపుటిలో చదువుతుంటేనే కవిత్వం రాయాలనిపిస్తుంది. ఈ ప్రణయభూమికలనే సంగం కవులు తిణై అన్నారుట. వీటికొక ప్రాకృతిక సంకేత స్థలమూ, ఋతువూ, పువ్వూ, పక్షి, సమయం, సందర్భం ఉన్నాయ్. సరి, ఈ సంపుటిలో వానాకాలం మొదలవగానే వికసించే విరజాజుల చుట్టూ వికసించిన తమిళ వర్ష ఋతు కవిత్వం చదివితే ఎలాటి అరసికులకైనా కవిత్వమంటే ప్రేమ మొదలవుతుందని నాకనిపించింది. ఎట్లాంటి ప్రేమలు! ఎట్లాంటి కవిత్వం! ఇదిగో ఇట్లా ప్రాణం పెకలించి చేతిలో పెడుతున్నట్టు మాటలాడిన మనిషి తారసపడితే సర్వస్వాన్నీ వదిలేసుకుందామనిపించే కవిత్వాలు ఇవి.
నెచ్చెలీ, ఎలానో ఒకలాగా
ఈ రోజంతా ఈదులాడినా
ఏం ప్రయోజనం?
సూర్యతాపం సద్దుమణిగాక
విరజాజి మొగ్గతొడుగుతుంది.
అప్పుడింకేమీ చెయ్యలేను.
వరదలాగా ముంచెత్తే రాత్రి
సముద్రంకన్నా పెద్దది.
(కంగుళ్ వెళ్ళత్తార్, కురుంతొగై, 387)
ఆ నచ్చిన మనిషి కోసం, ఆ ఎడబాటుని ఓర్చడం కోసం – ఏం చెయ్యగలదు యే స్త్రీ అయినా! చుట్టూ ఉన్న చరాచర జగత్తులోనూ వాళ్ళు కలిసున్న రోజుల జ్ఞాపకాలను తలచి చూసుకోవడం తప్ప. జాలిగా తన చెలికత్తెలతో, ఒక్కటే అనిపిస్తోంది అంటూ, ఇలా వాపోవడం తప్ప.
మా తోటలో అల్లుకున్న
నాలుగు బీరతీగెలు తెంపి
ఆ పూలు పట్టుకుపోయి చూపించగలరా
వాడికి?
చెప్పగలరా నాలుగు మాటలు?
చూడు నీ ఆడమనిషి ముఖం కూడా
ఇప్పుడు వీటిలాగే తయారైందని!
ఈ కవిత్వం చదివితే నిజంగా…మంచి కవిత్వపు బలమంతా అది రేకెత్తించ్చే స్పురణల్లోనే కదా ఉంటుందనిపించింది.
లేకపోతే –
సాయంకాలం. వర్షం. విరజాజి విచ్చుకోవడం. ఈ మూడింటితోనూ ఇంత ప్రేమని, ఇంత విరహాన్ని, ఇంతలా కూడాలనే ఆరాటాన్ని, కూడినప్పుడు భుజాల చుట్టూ పరుచుకునే ఆ విరజాజి పూలతావిని పట్టి తెచ్చి చెప్తారా ఎవరైనా! చెప్పి, ఇన్నేళ్ళ తరువాత కూడా ఆ కవిత్వం చదివి, తనకు మనసైన వాళ్ళతో పంచుకునేంతలా ప్రలోభపెడతారా? ఆ సంగం కవులు మహాకవులు.
*
ఐంగురు నూరు – ఐదు వందల కవితల సంకలనం. యే కాలంలోని వాడో రసజ్ఞశేఖరుడైన ఓ చేరదేశపు రాజుకి ఇట్లా ఒక్కొక్క తిణై మీద వంద వంద చొప్పున ఐదు వందల కవితలతో ఓ సంకలనం చెయ్యాలనే బుద్ధి పుట్టిందట. అంతే దొడ్డ మనసున్న ఇంకో కవిశేఖరుడు 2023లో ఆ వంద కవితల నుండీ పది కవితలు ఎంపిక చేసి మణిపూసల మాల కట్టి ఇచ్చాడు. విరజాజుల పూదండ అంటే మాత్రం నష్టమేమీ? ఇవి వాడే పూలెలానూ కావు. పల్లెపట్టుల్లో నడిచే ప్రణయగాథల సౌరభాలు పంచే ఈ కవితలు – దేవలోకపు విరజాజులు.
సంతోషమో విషాదమో నేనే ఇంకా తేల్చుకోలేకపోతున్నాను కానీ – ఈ క్రింది కవిత చదవగానే నా కళ్ళు వర్షించబోయే మేఘాలయ్యాయి. ప్రేమలో తపించి తపించి నీరసపడిన ఆ ప్రణయిని బేల గుండెని పదాల్లోకి తెచ్చిన కవీ – నువ్వే స్వర్గాల్లో ఉండి ఉంటావో కదా ఇప్పుడు!
దయలేని కవీ
ఒక మాట అడుగుతాను చెప్పు.
నన్ను వదిలిపెట్టి
అతడు వెళ్ళిన దేశంలో
కమ్ముకుంటున్న మబ్బులు
వానని స్వాగతించేచోట
పసులకాపరుల పూలదండల్లో
విరజాజి వానకబుర్లు
వినిపిస్తున్నచోట కూడా
సాయంకాలాలు
ప్రేమలేనివేనా? (476)
*
గాథాసప్తశతి పేరు వింటేనే నా మనసు ప్రాచీన కాలాల నిశ్శబ్దంలోకి, నెమ్మదిలోకి, హాయిలోకి మరలిపోతుంది. వాళ్ళు చూపెట్టిన ప్రపంచాల్లో వదులుకోలేని ఆకర్షణేదో కనపడి నన్నటు పదే పదే లాగుతూ ఉంటుంది. భద్రుడు గారు ఆ కవుల గురించి రాస్తూ, ఈ పుస్తకంలో ఒక మాటన్నారు – వాళ్ళు మన ఇంద్రియ చైతన్యం మీద ఎప్పటికప్పుడు పేరుకుంటూ ఉండే నివురుని ఉఫ్ఫని ఊదేసే కవులని. మన చైతన్యాన్ని సునిశితం చేసే ఆ కవుల ప్రభావాన్ని ఇంతకన్నా సూటిగా స్పష్టంగా సరళంగా చెప్పడం కష్టం. ఏం పట్టుకున్నారు వీళ్ళు? గాఢమైన అనుభూతికి లోనైనప్పుడు మనిషికి ఆ అనుభూతికి దోహదం చేసిన ప్రధానమైన మనిషిని వాతావరణాన్నే కాక, అప్పుడు అనుసంధానంగా వెనుక ఉన్న ఋతువును, పక్షులను, పూలను కవిత్వంలోకి పట్టుకొచ్చారు. అందుకని అనుభవానికి ఆ వాతావరణమూ, వాతావరణానికి ఆ అనుభవమూ మెలిపడిపోయి ఒకదానిని గుర్తు చేసుకుంటే మరొకటి అదే తరహా రసోద్దీప్తికి కారణమవుతున్నాయి. భద్రుడు గారు చెప్తారూ – ఇట్లాంటి కవిత్వం రాయాలంటే, ఇలా రాయాలంటే, ఆ కవులు బతికిన కాలాలు సమాజాలు ఎంతో రసనిష్యందితాలై ఉండాలని. ఎంత మంచిమాట!
చూడు! కొండవాగులో కొట్టుకుపోతున్న
కడిమిచెట్టు, సుడికి తెగిపోతున్న
పూలకేసరాలు. వాటితో పాటే
తేలుగుతూ మునుగుతూ తేనెటీగలు.
ఈ పుస్తకంలో ముందు గాథాసప్తశతి కవిత్వం గురించి చదివి, ఆ పులకలు తగ్గీతగ్గకుండా ఉన్నప్పుడే మీరీ కవిత దగ్గరకు రండీ – వరద నీటిలో కొట్టుకుపోతూ కూడా తేనె కోసం ఆత్రపడే తేనెటీగల్లా – మునుగుతూ తేలుతూ – ఈ కవిత్వంలో మీరు ఉక్కిరిబిక్కిరి కాకుండా ఉండగలరేమో చూడండి. అద్భుతమైన కవిత! అద్భుతమైన..
*
టాగోర్ మేఘదూతం కవిత రాస్తూ – నా మనసు రికామీ మేఘంలా ఈ గదిలో నుండి ఎటో వెళ్ళిపోయింది అని రాస్తాడు. ఈ పుస్తకం చదువు తుంటే నా పరిస్థితీ అదే. శ్రావణరాత్రులు విరహానికీ శారదరాత్రులు కలయికకీ గుర్తులట. గీతగోవిందంలోని నడివానాకాలంలోకి తీసుకుపోయే ఈ కవిత పుస్తకపు చివరి పేజీల్లో కనపడి అట్లా నాలో నాటుకుపోయింది. ఆ కానుగ చెట్ల చీకట్ల నుండి బయటపడతానన్న నమ్మకమూ లేదు, బయటపడాలన్న ఆశా లేదు. ఆ నందనందనుణ్ణి పొదువుకున్న రాధ ప్రేమలోనే ఈ ప్రపంచమింత భద్రంగా, అందంగా ఉందనుకుంటే, ఈ వాన ఇప్పట్లో ఆగేలానూ లేదు.
“రాధా! ఆకాశంలో మబ్బులు వ్యాపిస్తున్నాయి, కానుగచెట్ల అడవిలో చీకట్లు చిక్కనవుతున్నాయి, రాత్రి సమీపిస్తోంది, ఈ పిరికి పిల్లవాణ్ణి తొందరగా ఇంటికి తీసుకుపో అని నందుడు చెప్పినప్పుడు ఆ రాధా, ఆ మాధవుడూ ఇద్దరూ ఆ దారిలో, ఆ యమునా నది ఒడ్డున ప్రతి చెట్టు నీడనా రహస్యప్రణయంలో కూరుకుపోయారు” ![]()
24-9-2025


ఓహ్…
నను మకరందం లో ముంచెత్తిన అనుభూతి!
వీరభద్రుల వారికి నేను జన్మంతా దాసోహం 🙏
చామర్తుల వారికి నేను పాదాక్రాంతం…🙏
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
సర్…ధన్యోస్మి.
కవిః కరోతి కావ్యాని లాలయేత్యుత్తుమో జనః
తరుః ప్రసూతి పుష్పాణి మరు ద్వహతి సౌరభం
అన్నట్లుగా మానస చామర్తి గారు ఆషాఢమేఘం చదివి స్పందించిన తీరు హృద్యం. ఈ కావ్యానందస్పందనకు ప్రతిస్పందన గా
చిన్న పద్యం
తేనె పూలలోన తెలియకుండగ నుండు
తేనె తీయు విద్య తెలియవలయు
పూవు వాడనీక పూదేనె తీయును
తేటి తాగి పంచు తెరవరులకు
మీకు మానస చామర్తి గారికి అభినందనలు.
హృదయపూర్వక కృతజ్ఞతలు సార్!
వర్షం..జల్లు, కుంభవృష్టి, పెనుతుఫాను.. దేనికదే అందం గా భయం గా ఉంటాయి అయినా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది.. మీ రచన అంతే ఒకసారి చదివి తే సరిపోదు మళ్ళీ మళ్ళీ చదవాల్సిందే చాలబాగ అనేక వర్ష వర్ణనలను స్పృశించారు 👌👏💐🙏
ధన్యవాదాలు.
మానస చామర్తిగారికి ధన్యవాదములు 💐🙏