ఆదిమరాసలేఖ

ఈనాటి యువతరంలో అపూర్వప్రజ్ఞావంతుల్లో పరిమి శ్రీరామనాథ్ గారు ఒకరు. ఆయన పాండిత్యం, రసజ్ఞత, భాషావైభవం నన్ను ఆశ్చర్యపరుస్తుంటాయి. ఆయన కిందటేడాది తన కావ్యం ఒకటి నాకు పంపి నా అభిప్రాయం రాయమని అడిగినప్పుడు నాకు ఏమి రాయాలో తోచలేదు. అసలు ఆ కావ్యాన్ని అర్థం చేసుకునే శక్తి ఉందా నాకు అనిపించింది. ఇన్నాళ్టికి ఆ కావ్యం ఈ రోజే నా చేతులకు అందింది. అందులో ఆయన నా అభిప్రాయం కూడా ప్రచురించారు. దాన్నిక్కడ మీతో పంచుకుంటున్నాను.


నలభయ్యేళ్ళ కిందట నేను రాజమండ్రిలో ఉంటున్న రోజుల్లో మా మాష్టారు మల్లంపల్లి శరభయ్యగారిని కలుసుకుని మాట్లాడుతున్నప్పుడల్లా నన్నొక లోటు వేధించేది. అదేమంటే ఆయన ఏ ప్రాచీన సంస్కృత, ఆంధ్ర కవుల గురించీ, కావ్యాల గురించీ మాట్లాడుతున్నారో వారిని నేను చదవలేదు కదా అని పదే పదే గుర్తొచ్చేది. ఆ కవుల్నీ, ఆ కావ్యాల్నీ ఆయనలాగా హృదయస్థం చేసుకోకపోయినా కనీసం ఒక్కసారి చదివి ఉన్నా కూడా ఆయన ఏమి మాట్లాడుతున్నారో, ఆ స్వారస్యాన్ని నాతో పంచుకుంటున్నారో మరింత లోతుగా, మరింత ప్రగాఢంగా ఆస్వాదించి ఉండేవాణ్ణి కదా అనిపించేది. ఆయనకు కూడా నాలో ఒక చక్కని సాహిత్య సహచరుణ్ణి చూసుకోగలిగి ఉండేవారు కదా అనిపించేది. ఆయనలాగా ఆ ప్రాచీన సాహిత్యాన్ని చదివి ఉన్న శిష్యులో, మిత్రులో ఆయనకు లభించి ఉంటే, ఆయన అంత ఒంటరితనం అనుభవించి ఉండేవారు కాదు కదా అనిపించేది.

ఏళ్ళ తరువాత నాకు కవితాప్రసాద్ పరిచయమయ్యాక, ఆయన రాజమండ్రి రోజుల్లో నాతో పాటు శరభయ్యగారిని కలుసుకుని ఉంటే మాష్టారికి తన భాషనీ, తన భావోద్వేగాల్నీ పంచుకోగలిగే ఒక ఉత్తమ శ్రోత లభించి ఉండేవాడు కదా అనుకున్నాను. కాని కవితాప్రసాద్ కి ప్రాచీన ఆంధ్ర సాహిత్యంతో ఉన్నంత ఘనిష్ట పరిచయం ప్రాచీన సంస్కృత కావ్యప్రపంచంతో లేదనే చెప్పాలి. ఆ రెండు కావ్యప్రపంచాల్లోనూ సమాన అభినివేశం కలిగిన రసజ్ఞులెవరేనా కనిపిస్తారా అనే కుతూహలం మాత్రం నా మనసులోంచి తప్పిపోలేదు.

అటువంటిది ఇన్నాళ్ళకు సామాజిక మాధ్యమం పుణ్యమా అని ఇద్దరు రసజ్ఞులైన మిత్రులు నాకు తారసపడ్డారు. ఒకరు పరిమి శ్రీరామనాథ్, మరొకరు ఇ.ఎన్.వి.రవి. ఈ ఇద్దరికీ ప్రాచీన సంస్కృత, ప్రాకృత, తెలుగు సాహిత్యాల్లో ఉన్న అభినివేశం, అధికారం నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తుతూనే ఉన్నాయి. ఈ ఇద్దరూ యువకులు, సాఫ్ట్ వేర్ నిపుణులు. కానీ ప్రాచీన భారతీయ కావ్యసంప్రదాయం పట్లా, అలంకారశాస్త్రాల పట్లా, రసానందం పట్లా, ఔచిత్యం పట్లా ఉన్న అవగాహన, అధ్యయన విస్తృతి, వినయసంపద నన్ను ఈ ఇద్దరు మిత్రులకీ జీవితకాల అభిమానిగా మార్చాయంటే అతిశయోక్తి కాదు.

ఈ ఇద్దరిలో మళ్ళా శ్రీరామనాథ్ మరింత ప్రత్యేకం. ఈయన కవి. ఆయన పద్యం రాసినా, మరొకరి పద్యం గురించి రాసినా, కేవలం వచనం రాసినా కూడా ఆ వాక్కు ఎంతో సంస్కారవంతంగానూ, ఎంతో వినయనమ్రంగానూ ఉంటుంది. అత్యంత ప్రౌఢ వాక్కు. ఆ మనిషిని చూడకుండా కేవలం ఆయన వ్యాసాలో, పద్యాలో చదివితే, మనకళ్ళముందు ఒక వయోవృద్ధుడు మెదుల్తాడు. ఆ రాతల్లోని గాంభీర్యానికీ, ఆ పండుదనానికీ, మనకళ్ళముందు కనబడే యువకుడికీ పొంతన చిక్కదు.

కొన్నిసార్లు అనిపిస్తూంటుంది, అసలు ఈ యువకుడు రాసే పద్యాల్నీ, ఇతడు చేసే సాహిత్యప్రశంసనీ అర్థం చేసుకోగలిగే శక్తి ఉందా నాకు అని. అటువంటిది, ఆయన తన ఈ కావ్యం ‘జీవాతువు’ నాకు పంపించి నా అభిప్రాయం అడగినప్పుడు నాకేమనాలో తోచలేదు.

2

మళ్ళా ఆయనే తన కావ్యంలోకి నేను ప్రవేశించడానికి వీలుగా ఈ మాటలు కూడా రాసారు:

ఈ పరిచయ వాక్యాలు ప్రతి ఒక్క పాఠకుడికీ ఉపకరిస్తాయనిపించింది. కాబట్టే వాటిని యథాతథంగా ఇక్కడ పొందుపరిచాను.

3

జీవాతువు అంటే బతుకును నిలబెట్టే ఒక శక్తి, సారాంశం, ఒక ఔషధం. మనం మామూలుగా బతుకుతున్నప్పటికీ, మన జీవితసారాంశాన్ని పూర్తిగా, సార్థకంగా, సంపూర్ణంగా అందుకోలేకపోతున్నామని మనకు తెలుస్తూనే ఉంటుంది. మనం మాట్లాడే మాటలు, చేసే పనులు, మనుషుల్తో మన సంబంధాలు- ఏవీ కూడా పూర్తిగా వికసించకుండానే సగంలోనే తునిగిపోతూ ఉండటం మనకు అనుభవమే. అలాకాక జీవితంలో ఏ ఒక్క అనుభవాన్నైనా మనం పూర్తిగా అనుభవానికి తెచ్చుకోగలిగామనే స్ఫూర్తినిచ్చే దానికోసం మనం వెతుక్కుంటూనే ఉంటాం. ఎగ్జిస్టన్సయలిస్టులు దాన్ని authenticity అన్నారు. జీవాతువు అంటే జీవితానుభవాల్ని authentic  గా మార్చే ఒక రసాయనం, ఒక మెలకువ, మాటల్ని మంత్రంగా మార్చే ఒక మహిమ.

అది మనం ప్రయత్నిస్తే వచ్చేది కాదు, పాకులాడితే దక్కేదీ కాదు. అదొక ఎడతెగని తపనలోంచి, బతుకంతా ఒక ఎదురుచూపుగా గడిపినప్పుడు మాత్రమే మనల్ని నిలువెల్లా తడిపేసే ఒక అమృతవృష్టిగా అవతరిస్తుంది. రోజువారీ జీవితం యాంత్రికంగా మారుతున్నవేళ, మానవమేధ, ప్రతిభ, సృజనశక్తులన్నీ యంత్రానికి ఊడిగం చేస్తున్నవేళ, అదొక మబ్బుగా, చినుకుగా, వానకురిసి వెలిసిన తరువాత వెలుగుగా మన జీవితాల్లో ప్రత్యక్ష్మయ్యే ఒక సాక్షాత్కారం, ‘ఎనిమిది నూరుల కోటుల మనుజుల్లో ‘ ఎవరికో గాని దక్కని ఒక వరదానం. అప్పుడు మాత్రమే ‘భవ్యాధ్వం ‘ ‘సవ్యమ’ వుతుంది. ‘శారద ‘ ‘సారద’ అవుతుంది.

ఈ కావ్యంలో అటువంటి సాక్షాత్కారాలు రెండు సందర్భాల్లో కనిపిస్తాయి. మొదటిది, కథకుడి జీవితంలో ప్రేమ ప్రవేశించినప్పుడు. ఒక ‘మీనుల కళ్ళది ‘ కవి జీవితంలో అడుగుపెట్టగానే అతడి గుండె అశోకంగా మారింది. అతడొక ‘ఆంతర మోదవిద్య’ కనుగొన్నాడు. ఆ సాక్షాత్కార సంతోషం, సంభ్రమం మొత్తమ రెండవ సర్గలో ఇరవై పద్యాల్లో (18-38 ) కవి ఎంతో మనోజ్ఞంగా వర్ణించాడు. ఈ కావ్యభాగం తెలుగు కావ్యప్రపంచంలో ఎన్నటికీ వసివాడని పచ్చని పచ్చికబయల్లాంటిదని చెప్పవచ్చు. ఆ పద్య శయ్య, ఆ పదసంయోజనం, ఆ లలిత మృదూక్తి- ఇరవయి ఒకటవ శతాబ్దిలో కూడా తెలుగు పద్యలత ఇంత సుకోమలమైన మోసులెత్తగలదా అని నివ్వెరపరిచేటంత నవీనంగానూ, హృద్యంగానూ ఉన్నాయి. ‘నవ్య వాసంత సుచ్ఛాయ ‘, ‘అపరిమిత రిరంస ‘, ‘కమ్ర గంగావతరణము’, ‘ప్రేమకాంతిపాతము ‘, ‘అనామక సమాలీన ప్రియాకారత ‘- సహస్రాధిక కవుల మధ్య ఒక కవిని ప్రత్యేకంగా నిలబెట్టగలిగేది ఇటువంటి భాషాసౌకుమార్యమూ, భావశబలతలే. వీటికి ఇదుగో, ఇటువంటి పద్యశిల్పం తోడైతే చెప్పేదేముంది? ఈ పద్యం చూడండి:

ఇది యొక లేత గుప్పిలి చెలీ! విడదీసిన వీగిపోవు ప్ర
ల్లదములు చెల్లవెప్పటికి, లక్ష్యము లేని కఠోరతన్ బిగిం
చెదమనెదేని మ్లానమగు, జీవఘనాఘనవారి వంటి ఈ
సదమలవస్తురాజ సువిశాలపు నీడలలో చరింతమే.

ఇక కావ్యంలోని రెండవ సాక్షాత్కారం కవి పైన కుమ్మరించిన ధూతమేఘపు వాన.  ఆ మేఘం ‘ద ద ద’ అనే ఉపనిషత్సందేశంతోనే కవి గుండెని తాకినప్పటికీ, అది వానగాన మారగానే సౌందర్యగంగావతరణం సంభవించింది. చివరి సర్గలో తొమ్మిది పద్యాల్లో వర్ణించిన వాన వెల్లువ తెలుగు కావ్యప్రపంచంలో మరొక పసిడితునక. ఈ వర్షతాండవానికి పోల్చదగింది పుట్టపర్తివారి శివతాండవం మాత్రమే. ఆ వాన నడక, ఆ వాన లయ, ఆ వాన జడి కావ్యం పతాకస్థాయికి చేరుకున్న ఘట్టం ఇది. కేవలం శబ్ద లయల మాధుర్యం మాత్రమే కాదు, భావనా మాధుర్యం కూడా పరిపక్వమైన భాగమిది. ఈ వాక్యాలు చూడండి:

ఇంటిగుమ్మము వ్రేలి యింపారు వరికంకి
పులుగు పొడవగ వడ్లు జలజలని రాలినటు..

మంత్రముల వల్లె వలె, మేల్పాలవెల్లి వలె
కల్లోలినీ కూల చలనఫేనము వోలె
పలకరింతలవోలె పులకరింతల వోలె
పలవరింతలవోలె పొటమరింతలవోలె
అలలవలె, కలల వలె వలలవలె, పొదల వలె
పురుల వలె, మరుల వలె, చిరులవలె, నళుల వలె..

తొలిపలుకులై నాటి తుదిసుఖములై దాటి
మలికళుకులై తాకి నునుచలువలై పాకి..

4

పద్యానికి కాలం చెల్లిపోయిందని భావించే తెలుగు సాహిత్యంలో ఈ కావ్యం  ‘నవ్యజీవునిపైన’ ‘కావ్యమేఘపు వాన’గా వర్షిస్తున్నది.  ‘నవీన జీవనగ్లాని’తో సతమతమవుతున్న మన పట్లఅపారమైన ప్రేమతో, వాత్సల్యంతో మహాప్రకృతి మనకు రాసిన ‘ఆదిమ రాసలేఖ’ ఇది.

నిజానికి వచన కవిత్వమే ఈనాటి కవితా ప్రక్రియ అని మనం అనుకుంటున్నాం గాని, పాశ్చాత్య ప్రపంచం అలా భావించడం లేదు. ఇరవయ్యవశతాబ్దపు అగ్రగణ్యులైన కవుల్లో జోసెఫ్ బ్రాడ్ స్కీ ఒకడు. ఆయన పూర్తి ఛందోబద్ధమైన పద్యాలే రాసాడు. విక్రం సేథ్ అయాంబిక్ టెట్రామీటర్ లో రాసిన కథాకావ్యం Golden Gate  మనకు తెలిసిన మరొక సమకాలిక ఉదాహరణ. తెలుగు భాష పద్యంకోసమూ, పద్యం తెలుగు భాష కోసమూ పుట్టాయా అన్నట్లుగా మన పూర్వమహాకవులు తెలుగు పద్యాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకుపోయారు. వారి స్థాయికి చేరలేమనే ఒక విహ్వలతా స్ఫురణ వల్లనే చాలామంది పద్యం రాయడానికి సాహసించలేదన్నది కాదనలేని నిజం. కాని సమర్థుడైన భావుకుడు, గొప్ప అధ్యయనం, రసజ్ఞతలతో పూనుకున్నప్పుడు, ఇప్పుడు కూడా తెలుగుపద్యం సర్వాంగసుందరంగా ప్రభవించగలదనడానికి ఈ కావ్యమే ఒక నిరూపణ.

ఏ కావ్యంలోనైనా, కావ్యగత సందర్భాన్నీ, కథాసందర్భాన్నీ దాటి కొన్ని పద్యాలు సార్వకాలికతను సంతరించుకుంటాయి. తర్వాతి తరాలు వాటిని సుభాషితాలుగా నెత్తిన పెట్టుకుంటాయి. ‘నానారుచిరార్థ సూక్తినిధి ‘ అని ఆది కవి అన్నది అటువంటి పద్యాల గురించే. ఈ కావ్యంలో కూడా అటువంటి నిధికి కొరతలేదు. ఈ పద్యాలు చూడండి:

పత్రవృతాంతాణువు మొదలు భావయోగ
రత సహస్రార పద్మపరాగ లహరి
వరకు నిబిడీకృతమయి జవమున నిండి
కలదు సౌందర్యరోచి ప్రాకామ్యభూతి

ఆ వెలుగు శల్క సోకుట
పూవో, తరువో, లతాంగి ముఖదీప్తియు యో
గ్యావృతి తీయు కవాటము
లావేగము మోదరచిత హర్మ్యంబునకున్

కవి తన యేకాంతములో
నవశిల్పము నూహజేసి నవ్వును, ప్రసవా
సవమును పూసి పదముల ప్ర
సవించు సేతదభిశీత సంస్పర్శమునన్

హృదయమను తేటకొలనున
పదములు కేళ్ళురక భావపావన కళా
రదళముల నడుమ మరిమరి
పొరలెడు పద్యమ్ము మంత్రపూర్తము తండ్రీ

అవ్యక్తము, శుద్ధము, స
త్యవ్యవసాయము, తపస్సుధామమునై స
ర్వ వ్యాపితమైనట్టిది
దివ్యబలరసానుభూతి దీపిలునెపుడున్

సవ్యాపసవ్యపథముల
నవ్యవికాసోపజీవ్య నౌయానములన్
కావ్యమకారణబంధువు
భవ్యమనశ్శక్తిదాయి, పరనిధి సుమ్మా

5

నాలుగైదేళ్ళ కిందట నేను తమిళనాడులో శివకవుల అడుగుజాడల్ని పోల్చుకుంటూ నా ప్రయాణ అనుభవాలు పంచుకుంటున్నప్పుడు, తిరుక్కోయిలూర్ గుడిలో అవ్వైయ్యార్ రాసిన వినాయక అగవళ్ గురించి ప్రస్తావించాను. శ్రీరామనాథ్ గారు వెంటనే ఆ గీతాన్ని ఇంగ్లిషు నుంచి అద్భుతంగా తెలుగు చేసారు. అప్పుడే అనిపించింది ఈ భావుకుడు ఒక స్వతంత్ర కావ్యం రాస్తే ఎలా ఉంటుందా అని. ఆ ప్రాచీన కవయిత్రీ, ఆమె కొలిచిన ఆ వినాయకుడూ కూడా ఈ కవిని పుష్కళంగా ఆశీర్వదించారని ఇప్పుడు అర్థమవుతోంది. ఆయనతో పాటు ఈ కావ్యవీథిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ ఆ ఆశీస్సులు లభిస్తాయని కూడా నాకు  నమ్మకంగా ఉంది.


Featured image: Photograph by Farid Bettioui, Courtesy: pexels.com

21-4-2024

7 Replies to “ఆదిమరాసలేఖ”

  1. లోతైన కావ్యానికి లోతైన విశ్లేషణ!

    పుస్తకాలను చేతితో కూడా ముట్టని యువత ఉన్న ఇప్పటికాలం లో ఇలాంటి కవి రచయిత ఉండటం గొప్ప విషయం.

    శ్రీ పరిమి శ్రీరామనాధ్ గారికి అభినందన వందనాలు.

    వారిని మాకు పరిచయం చేసిన మీకు కృతజ్ఞతాభివందనాలు 🙏🙏❤️🌹

  2. “పద్యం రాసినా, మరొకరి పద్యం గురించి రాసినా, కేవలం వచనం రాసినా కూడా ఆ వాక్కు ఎంతో సంస్కారవంతంగానూ, ఎంతో వినయనమ్రంగానూ ఉంటుంది.”

  3. శ్రీ పరిమి శ్రీరామనాథ్ గారు గురించి ఎఫ్భి లో తెలుసు. మీ పరిచయం లో నామనసులో మాట చెప్పారు అనిపించింది.
    మీ ఇరువురికీ హృదయపూర్వక అభినందనలు.💐💐

  4. నవ్యజీవునిపైన కావ్య మేఘపు వాన గురించి మీ రచన నవ్య మానవుని జీవిత గ్లానీ ని చూపించడమే కాదు ఆ కావ్య గొప్ప దనాన్ని ఆవిష్కరణ చేసింది సర్. ధన్యవాదాలు

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading