
నీ మాటలేవో నువ్వు పోల్చుకుంటే నీ పాఠకులెవ్వరో అవి పోల్చుకుంటాయని ఎప్పుడో ఒక కవిత రాశాను. ఎమిలీ డికిన్సన్ ఊహించి ఉండదు: ఆమె మాటలతో ఇంతమంది అనుసంధానమవుతారని. పూల సౌందర్యాన్ని ప్రస్తుతిస్తూ ఆమె ఒకచోట Republic of Delight అని అన్నది. అంటే, సంతోషపు గణతంత్రం అన్నమాట. ఆ సంతోష గణతంత్రంలో ఇంత మంది పౌరులున్నారనీ, ఇంకా చేరుతూనే ఉన్నారనీ, చేరుతూనే ఉంటారని ఆమెకు తెలుసునా? ఇదిగో ఇప్పుడు ఆ గణతంత్రంలో సోమశేఖర్ కూడా చేరాడని ఈ ఉత్తరం సాక్ష్యమిస్తోంది.
ప్రియమైన మీకు,
నేను మీ ‘పోస్టు చేసిన ఉత్తరాలు’ ప్రతిరోజూ ఫేస్బుక్ పోస్టుల్లా వచ్చేటపుడే చదివినా మళ్లీ ఇలా అన్నీ ఉత్తరాలు మళ్ళీ ఒకసారి చదవటం గొప్ప అనుభూతి. అవీ అన్నీ మీతో ఇలా ఉత్తరం ద్వారానే పంచుకోవాలన్పించింది.
నేను మా ఊరికి దూరంగా, మా అమ్మా, నాన్నలకు దూరంగా వచ్చి చింతపల్లిలో గురుకుల కళాశాల లో ఇంటర్మీడియట్ చదవడానికి వచ్చినప్పుడు ఇంటికి ఉత్తరాలు వ్రాసేవాడిని. అంటే ఇవే మొదటివి కావు.
చిన్నప్పటి నుండీ పదవతరగతి వరకూ ఒకే ఊరులో చదవడం వలన దాదాపు నా చదువూ, బాల్యపు జ్ఞాపకాలూ అన్నీ అదే ఊరితో ముడిపోయాయి. ఇంటర్మీడియట్ చదువుతూ నేను నా మొదటి ఉత్తరం, ప్రేమలేఖ వ్రాశాను. నా ఆలోచనలూ, చదువులో సాధించాలనుకొన్నవీ, కొన్ని కవిత్వ వాక్యాలూ, అన్నీ కలగలిపి నా మనసులో భావాలు వ్యక్తం చేశాను. అప్పుడు ఎదురుపడి ఇచ్చేంత ధైర్యమూ లేదు. మిత్రుని ద్వారా ఆ అమ్మాయికి చేరిన తర్వాత, ఆమె చదివి చించిందో, వాళ్ల అమ్మా నాన్నలకి ఇచ్చిందో తెలియదు.
కానీ ఇప్పుడు మీ పోస్టు చేసిన ఉత్తరాలు చదువుతుంటే… తెలిసింది, ఎమిలీ డికిన్సన్ తనకి ఎన్నడూ జవాబు రాయని ప్రపంచానికి రాసిన ఉత్తరాలు ఎన్నో రాసుకుందని.
తరువాత నా ఇంటర్మీడియట్ మిత్రులకీ, ఇంజనీరింగ్ మిత్రులకీ, మిత్రురాళ్లకి ఎన్నో ఉత్తరాలు రాశాను. కానీ మీరన్నట్టు,
ఉత్తరాలు ఎందుకు రాయాలో, ఎలా రాయాలో తెలుసుకోవాలంటే ఎమిలీ డికిన్ సన్ రాసుకున్నట్టుగా ఉత్తరాలు చదవాలి.
కవిత్వమంటే ఉత్తరాలే.
పువ్వు రంగునీ, పరిమళాన్నీ
కలవరపరచకుండా
తుమ్మెద తేనె తాగినట్టు
భిక్షువు భిక్ష స్వీకరించాలి. (దమ్మపదం)
చిన్నప్పణ్ణుంచీ మనకి నిజంగా చెప్పవలసిన చదువంటూ ఏదన్నా ఉంటే, అది ఇది. పువ్వు నలక్కుండా తేనె సంగ్రహించడమెలానో చెప్పే విద్య.
ఇలాంటి విద్యలేమీ తెలియదు, అసలిలాంటి చదువే ఉందని తెలియదు. మీలాంటి గురువు గారు అపుడుంటే తెలిసేది నాకు.
అయినా ప్రేమ గురించి ఎంత గమ్మత్తైన విషయం చెప్పారు మీరు.
ప్రేమ చాలా గమ్మత్తు. అది నిన్ను నువ్వు సమర్పించుకుంటున్నావనే భ్రాంతితో మొదలుపెట్టి ఎదటిమనిషిని పూర్తిగా లొంగదీసుకునేదాకా విశ్రమించదు. ఇన్నాళ్లకు అర్థమైందేమంటే, ప్రేమంటే, ఒక సీతకోకచిలుకని సీతాకోకచిలుకగా ఉండనివ్వటం. దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించకపోవడం. అదొక grace. నీ నిమిత్తం లేకుండా నీ తోటలోకి వచ్చివాలే ఒక స్వర్గపు తునక. అది వచ్చి వాలిందా, సంతోషించు, చూడు, కళ్ళప్పగించి చూడు. ఎగిరిపోయిందా, చూడు, కళ్ళప్పగించి చూడు. ఆ ఒక్క క్షణం చాలదా, ఆ graceful moment!
అయినా ఉత్తరాలు ఎందుకు రాసుకోవాలి?
ఉత్తరాల్లో ఉన్న మహత్యం ఏమిటంటే, ఉత్తరాలు రాస్తున్నప్పుడు నువ్వు ప్రతి ఒక్కమాటనీ, ముందు నీ హృదయానికి వినిపించి, అప్పుడు కాగితం మీద పెడతావు. నువ్వు ఎవరికి రాస్తున్నావో ఆ మనిషి నీ పక్కనే ఉన్నదని సంభావిస్తావు. ఈ మెయిళ్ళూ, వాట్సాపులూ, ఎస్సెమ్మెస్సులూ అలా కాదు. అక్కడ నీకు స్పష్టంగా తెలుస్తుంది, నువ్వు ఎవరికి రాస్తున్నావో వాళ్ళు నీ దగ్గర లేరనీ, ఎక్కడో ఉన్నారనీ, వాళ్లకి నువ్వు పంపే మెసేజి వీలైనంత తొందరగా చేరాలనీ -అక్కడ దూరాన్ని దగ్గర చేయడమొక్కటే ఆలోచన. ఉత్తరాలు అలాకాదు. అక్కడ అసలు దూరమే లేదు. కాగితం చేతుల్లోకి తీసుకోగానే ఆ మనిషి నీ పక్కన వచ్చి కూచున్నట్టే. ఉత్తరం రాస్తున్నంతసేపూ నువ్వు ఆ మనిషిని సన్నిధిని అనుభూతి చెందుతున్నట్టే.
మరి ఉత్తరాలు ఎప్పుడు రాయాలి?
నీ అంతరంగం కలవరపడుతున్నదా, ఇతమిత్థంగా చెప్పలేని ఏ వేదననో లేదా ఉద్వేగమో నిన్ను నిలవనివ్వకుండా అస్థిరపరుస్తోందా, అయితే నువ్వు చేయవలసిన పని, ఉత్తరాలు రాయడం.
నేనేదో యవ్వనోద్రేకంలోనో, ఆకర్షణని ప్రేమనుకునో ప్రేమలేఖ రాసాను. కాని, ప్రేమలేఖ అంటే ఏమిటో మీరు చెప్పినట్టు ఇంతందంగా ఎవరు చెప్పలేదు.
నిజమైన ప్రేమలేఖ ఏమిటో తెలుసా? అది ముందు నువ్వు నీ గుండె చప్పుడు వినేలాగా చేస్తుంది. ఉత్తరం రాగానే నీ గుండె వేగంగా కొట్టుకోవడం నీకే వినిపిస్తుంది. నెమ్మదిగా ఆ గుండె చప్పుడు సద్దుమణిగాక, అప్పుడు నీ లోపల వినిపించే ఆ noiseless noise ని (అనాహతనాదం) నీకు వినిపించినప్పుడే ఉత్తరాలు ప్రేమలేఖలవుతాయి.
అసలు ప్రేమలేఖ రాయడమంటే ఏ స్వప్న లిపినో ఇద్దరికీ అర్థమయ్యే భాషలోకి అనువదించుకోవడం.
ప్రేమ నీకు రెక్కలిస్తుంది, నిజమే, కాని శాశ్వతంగా ఎగిరిపోడానికి కాదు. నువ్వు ఎక్కడెక్కడ విహరించినా తిరిగి నేలమీదకు రావాలని కూడా ప్రేమ కోరుకుంటుంది. అది ఎంత అమర్త్యమో, అంత మర్త్యం కూడా.
నువ్వు ఎంత చదువు, ఎంత రాయి, ఎంత లోకం చూసి ఉండు, కాని ప్రతిసారి ప్రేమముందు నువ్వు నిరక్షరాస్యుడివే. దాన్ని ఎలా స్వీకరించాలో, దాన్ని ఎలా తట్టుకోవాలో తెలియకనే మనుషులు తల్లకిందులవుతారు.
నిజానికి ఒక ఉత్తరం రాయడమంటే, పుడమి పులకించడమట. ఆ అమృతంలో దేవతలకి వాటాలేదట. ఎమిలీ డికెన్సన్ ఉత్తరాల గురించి చెప్పిన అమృత వాక్యమిది.
ఒక ఎమిలి డికిన్సన్, ఒక మార్గరెట్ ఫుల్లరు, ఒక ఎలిజబెత్ బ్రౌనింగు, ఒక తోరూదత్తు, ఒక రేవతీదేవి – వీళ్ల గురించి తలుచుకోవడమన్నా, రాయడమన్నా ఒక జలపాతాన్ని ఒక ఉత్తరంగా మార్చడం. వాళ్ళ జీవితాల్లో వాళ్లు చూసిన వెలుగు, వాళ్ల జీవితాల్ని దహించి వేసిన ఒక తపన, లోకాతీతమైన ఏ సౌందర్యమో తమని నిలవనివ్వకుండా నడిపించిన ఒక అనంత నీలిమ – వాటిని మళ్లా మన జీవితాల్లోకి వడగట్టుకోవడం.
మార్గరెట్ ఫుల్లర్, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ల స్నేహం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలున్నాయి, అవి ఏమిటంటే…
ముఖ్యంగా ఏ ఇద్దరు జ్ఞానాన్వేషకులకైనా, వికసిస్తున్న తమ సృజనశక్తులకి పరస్పరం ప్రేరణ అందించాలనుకుని స్నేహం చేసేవాళ్లకైనా వాళ్ల స్నేహం నుంచి నేర్చుకోవలసిన పాఠాలు చాలా ఉన్నాయి.
చలం గారు చెప్పిన ఎంత మంచి మాట మళ్ళీ గుర్తు చేశారు. మనం మన శరీరాన్నో, బుద్ధినో, మనసునో, ఏదో ఒక్కదాన్ని మాత్రమే తృప్తిపరిచే స్నేహాల దగ్గరా, అనుబంధాల దగ్గరా ఆగిపోలేం. మనం వెతుక్కునే మనిషి అవన్నీ వికసించే తావుగానో, విశ్రమించే తావుగానో ఉండాలని తపిస్తాం.
అసలు friend అంటే,
ఎవరు మన సమస్త జ్ఞానకాంక్షనీ, సృజనశక్తుల్నీ ప్రజ్వరిల్లచేయగలరో, ఎవరిని కలుసుకుంటే, మన తలనొప్పులూ, తలతిరగడాలూ అదృశ్యమైపోతాయో, ఎవరిని కలుసుకుంటే, భూమ్మీద ఇంతదాకా జీవించిన మానవులందరి వివేకమూ పంచుకోవాలనిపిస్తుందో, ఎవరిని కలుసుకుంటే, రాబోయే తరాల కోసం కలలుగనాలనిపిస్తుందో, అలాంటి friend ఒక్కరేనా ఉన్నారా?
ప్రతి ప్రేమానుభవమూ ఎంత సంతోషాన్ని తెస్తుందో అంతకన్నా మించిన వేదననీ, దుఃఖాన్ని మోసుకొస్తుంది. కానీ దానికి పరిష్కారం ప్రేమలు లేని ప్రపంచం కాదు. ప్రతి పరిచయం, స్నేహం ఒక తాళంచెవిలాంటిదే. అది మనలో నిద్రాణంగా ఉన్న దేవతల్నీ, దానవుల్నీ- ఇద్దర్నీ మేల్కొలుపుతుంది. ఆ ప్రేమ ఎంత బలంగా ఉంటే, ఆ దేవదానవులిద్దరూ కూడా అంత ప్రచండంగా ఉంటారు. కానీ, ప్రతి ఒక్క ప్రేమానుభవం ముగిసిపోతూనే నీలోని ఒక దానవుణ్ణి పూర్తిగా నిర్జించి, నీ హృదయంలో ఒక దేవతని ప్రతిష్టించి వెళ్ళిపోతుంది. ప్రతి ప్రేమా ఒక మెలకువ. యుగాలుగా నువ్వు మోసుకొస్తూ ఉన్న జన్మజన్మల అంధకారంలోంచి బయటకొచ్చే ఒక ప్రభాతం. ఇలాంటి ప్రేమానుభవము నాకూ కలిగింది.
ఎమర్సన్-మార్గరెట్ ల మధ్య వికసించిన స్నేహం తరువాత ఆయన వ్రాసిన Friendship అని వ్రాసిన వ్యాసంలో ఇలా అన్నాడు.
ఈ విశ్వంలో ఎక్కడో ఒకచోట తనకోసం ఎదురు చూస్తున్న ఒక స్నేహితుడు, స్నేహితురాలో ఉందని నమ్మకం కలిగితే చాలు, వెయ్యేళ్లు సంతోషంగా గడిపేయొచ్చు…. ప్రతి మనిషీ తన జీవితకాలం పాటు ఒక స్నేహాన్ని వెతుకుతూనే గడుపుతాడు.
ప్రేమకీ, స్నేహానికీ ఏమి కావాలి?
ప్రేమ మొత్తం భగవంతుడి సారాంశం అని చెప్పొచ్చు. అది వినోదం కాదు, మొత్తం జీవితానికొక అర్థాన్నిచ్చే వరం. కుర్రతనపు సంతోషంగా కాదు, అత్యంత విలువైందిగా చూసుకోవాలి మనం దాన్ని. మన స్నేహితుణ్ణో, స్నేహితురాలినో ఆమె హృదయంలోని సత్యసంధత మీదా, ఆ హృదయ వైశాల్యం మీదా, తల్లకిందులు చెయ్యడం సాధ్యం కాని ఆ పునాదుల మీదా పిచ్చి నమ్మకంతో చేరదీసుకోవాలి.
కానీ స్నేహాలు నిలబడాలంటే మనం వాటిలో కోల్పోడానికి అర్రులు చాచకూడదు. స్నేహమనే గొప్ప స్థితికి రెండు సమున్నత, గంభీరపార్శ్వాలు అవసరం. అవి రెండూ ఒక్కటవటానికి ముందు రెండుగా ఉండటం చాలా ముఖ్యం.
ఒక మనిషి తన తోటి మనుషులకు ఏమేరకు విలువైనవాడిగా మారతాడో దాన్ని ప్రతిఫలించేదే ప్రేమ.
స్నేహాలూ, ప్రేమలూ ధవళవస్త్రాల్లాంటివి. తొందరగా మాసిపోతాయి. కాబట్టి-
స్నేహం మామూలు విషయంగానూ, అలవాటుగానూ మారిపోకూడదు. అది సదా జాగరూకంగా, నవోన్మేషంగా ఉండాలి. మన గానుగెద్దు జీవితంలో అది ఒక కొత్త లయనీ, తర్కాన్నీ తేగలగాలి.
స్నేహితులు మనం వెతుక్కుంటే దొరికేవాళ్లు కారు. వాళ్లు మన జీవితంలోకి మన ప్రమేయం లేకుండానే వస్తారు. కాని అలా వచ్చిన తరువాత ఆ స్నేహాల్ని నిలుపుకోడం మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. అలా నిలుపుకోగలగడమే ప్రేమవిద్య.
కానీ నీకు లభించిన ఆ ప్రేమకి నువ్వు యోగ్యుడు కావడానికి సాధన చేయాలి ఒకరోజు ఒక ఏడాదో కాదు ప్రతిరోజూ చేయాలి ఒకరోజు సాధనతో మరొక రోజు స్నేహం నిలబడుతుంది ఆ మరొక రోజు స్నేహం ఆ తర్వాతి రోజు సాధనకి శక్తినిస్తుంది. స్నేహమంటే, ఎప్పటికప్పుడు నివురులూదుకోవాల్సిన నిప్పు.
గొప్ప కవులూ, రచయితలూ, కళాకారులూ రాసుకున్న ఉత్తరాల గురించి రాసిన ఉత్తరాలు అన్ని గుత్తిగా చేసి మీరు వ్రాసిన ‘పోస్టు చేసిన ఉత్తరాలు’ పుస్తకం చదవటం అమూల్యమైన అనుభవం.
ఎమిలీ డికెన్సన్ కవిత్వాన్ని, లేఖలనూ, ఎమర్సన్-మార్గరెట్ ఫుల్లర్ లేఖలనూ, రచనలనూ పరిచయం చేసినందుకూ, స్నేహానికీ, ప్రేమకీగల తేడాలను మరింతగా విశదపరిచినందుకు. ..
హృదయపూర్వకధన్యవాదాలతో,
మీ
సోమశేఖరరావు మార్కొండ.
10-9-2025


ఎమిలీకి, మీకు, సోమశేఖరరావు గారికి నమస్సులు!! 🙏🏽
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!
ఎంత గొప్ప ప్రతిస్పందన. అక్షరాక్షరం ఆణిముత్యం.మీ పుస్తకం సార్థకం ఐందని చెప్పడానికి ఈ లేఖాపూర్వక తులసీదళం చాలు . సోమశేఖర్ గారికి వినమ్ర నమస్సులు. మీకు హృదయపూర్వక అభినందనలు.
హృదయపూర్వక నమస్సులు సార్!
🙏
Thank you.
ఈ ఉత్తరం మనసును కదిలించేలా, ఆలోచింపజేసేలా రాసబడింది. ఇందులో ఉత్తరాల ప్రత్యేకతను ఎంతో అందంగా వివరించారు—ఉత్తరాలు రాస్తున్నప్పుడు ఎదుటి మనిషి పక్కన కూర్చున్నట్టే అనిపిస్తుందని చెప్పడం హృదయాన్ని తాకుతుంది. ప్రేమను సీతాకోకచిలుకతో పోల్చిన ఉపమానం, అది పట్టుకోవాలనుకోకుండా అలాగే ఉండనివ్వడమే నిజమైన ప్రేమ అనడం లోతైన సత్యం. స్నేహంపై Emerson–Margaret Fuller ఆలోచనల జతకలుపుతూ, చలం గారి మాటలను గుర్తు చేస్తూ స్నేహానికి ఉన్న తాత్త్విక గాఢతను చక్కగా ఆవిష్కరించారు. “స్నేహం నివురులూదుకోవాల్సిన నిప్పు” అన్న వాక్యం ఈ ఉత్తరానికి ఒక శాశ్వతమైన శిలాఫలకంలా నిలుస్తుంది. మొత్తానికి, ఈ ఉత్తరం కవిత్వం, జ్ఞాపకాలు, తాత్త్వికత, జీవన సత్యాల మేళవింపుతో ఒక అమూల్య అనుభూతిని కలిగిస్తుంది.
హృదయపూర్వక ధన్యవాదాలు శైలజ గారూ!
మీ ఉత్తరం అందింది.. మా దక్షిణగా 🛐
ధన్యవాదాలు