నన్ను వెన్నాడే కథలు-6

ఒకప్పుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ ఏదో ఇంటర్వ్యూ బోర్డులో కూచున్నారట. ఇంటర్వ్యూకి వచ్చిన ఒక అభ్యర్థిని నీ అభిమాన తెలుగు రచయిత ఎవరు అని అడిగారట. అతడు ‘శరత్ బాబు’ అని చెప్పాడట. ‘యూ ఆర్ సెలక్టెడ్’ అన్నారట శర్మగారు.

నేను కూడా తెలుగు సాహిత్యం చదవడం మొదలుపెట్టిన కొద్దిరోజులకే శరత్ నా అభిమాన తెలుగు రచయితగా మారిపోయాడు. మరీ ముఖ్యంగా నేను నాగార్జున సాగర్ లో ఇంటర్మీడియేటు చదువుకున్న రోజుల గురించి తలుచుకుంటే, ‘శ్రీకాంత్’, ‘భారతి’, ‘చరిత్రహీన్’, ‘గృహదహనం’, ‘శేషప్రశ్న’ ల్లో మనుషులూ, ఆ కుటుంబాలూ, ఆ ప్రశ్నలూ, ఆ చర్చలూ గుర్తొస్తాయి అన్నిటికన్నా ముందు. శరత్ జ్వరం నేను రాజమండ్రి వెళ్ళిన చాలాకాలందాకా కూడా నన్ను పట్టే ఉంది. అప్పటికి శరత్ వ్యాసాలూ, ఉత్తరాలూ, ఆయన జీవితచరిత్రా, ఆయన సాహిత్యం పైన చర్చలూ కూడా చదివేసి ఉన్నాను. ఆయన నవలల్లో ఏది గొప్పది- శ్రీకాంత్ నా, లేక శేషప్రశ్ననా లేక పథేర్ దాభీనా అని నాలోనేనే వితర్కించుకుంటూ ఉన్న సమయంలో ( నా రాజమండ్రి మిత్రులకి శరత్ పైన గొప్ప ఇష్టమేమీ ఉండేది కాదు, ఆ నవలలంతటా కన్నీళ్ళూ, పాదధూళీ తప్ప మరేమీ ఉండవని వేళాకోళమాడుతుండేవారు) సుబోధ్ చంద్ర సేన్ గుప్త ‘గృహదహనం’ అన్నిటికన్నా గొప్ప అని నవల అని రాసినప్పుడు, మళ్ళా ఆ నవల తీసి మరోసారి చదవకుండా ఉండలేకపోయాను.

అటువంటి రోజుల్లో ఒకసారి గోదావరి గట్టున సరస్వతీ పవర్ ప్రెస్ లో అడుగుపెట్టాను. అక్కడే ‘అమృత సంతానం’, ‘వనవాసి’, ‘జీవనలీల’, శ్రీపాద చిన్నకథలు వంటి అనర్ఘరత్నాలతో పాటు ‘విశ్వకథావీథి’ ఆరుసంపుటాలూ కూడా నా చేతుల్లోకి వచ్చాయి. వాటిని నేను రీ-డిస్కవర్ చేసిన రోజులు నాకూ, తెలుగు సాహిత్యానికీ కూడా గొప్ప భాగ్యదినాలు. ఎందుకంటే, అప్పటికి శ్రీపాద చిన్నకథల గురించి చాలామందికి తెలిసి ఉన్నప్పటికీ, తక్కిన పుస్తకాల గురించి రాజమండ్రి కూడా మర్చిపోయింది. నాకొచ్చే చిన్నపాటి జీతంలోంచే ఆ పుస్తకాలు వీలైనన్ని కాపీలు కొని నా మిత్రులు ప్రతి ఒక్కరికీ పంచిపెడుతూ ఉండేవాణ్ణి.

‘విశ్వకథావీథి’ (1955-58) ఆరుసంపుటాల అనువాద కథలు. ఒక్కో సంపుటంలోనూ ఆరు కథల చొప్పున పురిపండా అప్పలస్వామిగారు ఎంపికచేసి అనువదించిన కథలు. ఆ ఎంపిక ఆయనే చేసి ఉండాలి. ఎందుకంటే ఆ పుస్తకానికి మాతృక అని చెప్పదగ్గ పుస్తకమేదీ ఇప్పటిదాకా నాకు ఇంగ్లిషులో కనిపించలేదు. అటువంటి ప్రపంచ కథకుల్నీ, ఆ కథల్నీ ఆయన ఎలా కనుగొన్నారో, ఏ మూలాలనుంచి అనువదించారో మనకి తెలియదుగానీ, ఆ కథలన్నీ అప్పలస్వామిగారి magic touch తో తెలుగు కథలుగా మారిపోయేయి. అదుగో, ఆ సంపుటాల్లో, మొదటి సంపుటంలోనే, శరత్ బాబు రాసిన ‘మహేశం’ కథ చదివాను. అప్పుడు నాకు బహుశా ఇరవై ఇరవయ్యొక్కేళ్ళ వయసు. ఆ కథ చదవగానే నిశ్చేష్టుణ్ణైపోయాను. ఆ శరత్ నాకు తెలిసిన శరత్ కాదు. నా పదహారేళ్ళ వయసునుంచీ నన్ను అలరిస్తూ, బుజ్జగిస్తూ, లాలిస్తూ వచ్చిన శరత్ కాదు. అసలు అప్పలస్వామిగారు అనువదించింది శరత్ కథనేనా, ఆయన పొరపడలేదు కదా అని పదే పదే అనుకున్నాను. నాకు తెలిసిన శరత్ బెంగాలీ భద్రలోక్ కి చెందిన మధ్యతరగతి జీవితాల్ని లోపలనుంచీ నిగ్గుతేలుస్తున్న శరత్. కాని ఇలా ఒక బీద ముస్లిం కుటుంబానికి చెందిన ఒక అత్యంత నిష్ఠుర, హృదయవిదారక వాస్తవాన్ని కథగా మార్చగల శరత్ కాదు. ఏమైనప్పటికీ ఆ కథ నాలో నేను అంతదాకా నిర్మించుకున్న శరత్ ప్రతిమను భగ్నం చేసేసింది. మహారచయితల్ని మనమూహించుకునే పరిమిత రూపాలకు కుదించకూడదనే విలువైన పాఠం నేర్చుకున్నాను ఆ కథ మీద చాలాకాలం నాలోనేనే వాదించుకున్న తరువాత.

‘మొహేష్ ‘(1922) శరత్ రాసిన కథల్లో అత్యంత విఖ్యాతి పొందిన కథ. ఇంగ్లిషులోనే రెండు ముఖ్యమైన అనువాదాలు వచ్చాయి. ఒకటి సాహిత్య అకాదెమీ కోసం శశధర్ సిన్హా అనే ఆయన చేసిన The Drought and Other Stories (2010) లో The Drought పేరుమీద చేసిన అనువాదం. మరొకటి, రూపా సంస్థ కోసం అనిందిత ముఖర్జీ చేసిన Stories from Saratchandra, Innocence and Reality (2018) అనే సంపుటంలో పొందుపరిచిన అనువాదం. ఫ్రెంచిలో కూడా ఒక అనువాదం 1978 లో వచ్చిందని విన్నాను. కాని, అప్పలస్వామిగారు వీరందరికన్నా ఎన్నో ఏళ్ళు ముందే తెలుగువారికోసం ఆ కథని అనువదించడం ఆయన ఔదార్యానికీ, మన భాగ్యానికీ గుర్తుగా మిగిలిపోతుంది.

శరత్ రాసిన కథలన్నిటిలోనూ ‘మొహేష్’, ‘అభాగీర్ స్వర్గ’ అనే రెండు కథలు చాలా ప్రత్యేకమైనవి. మొదటిది ముస్లిం జీవితాన్ని చిత్రించిన కథ అయితే, రెండోది దళితజీవితాన్ని చిత్రించే కథ. దాదాపుగా అదే సమయంలో మున్షీ ప్రేమ్ చంద్ ‘సవాసేర్ గేహూ’ (1924) కథ రాస్తున్నాడు.

బెంగాలీ రచయితలు ఎంతసేపూ హిందూ సమాజాన్నే చిత్రిస్తూ ఉంటే బెంగాలీ హిందువుల భాషగా మిగిలిపోయే ప్రమాదం ఉందని భావిస్తూ, శరత్ 1936 లో జహానారా చౌధురీకి రాసిన ఉత్తరంలో (శరత్ ఉత్తరాలు, దేసీ ప్రచురణ, 1954, పే.184) ఇలా అంటున్నాడు:

కానీ ఒక్క మహేశం కథ చాలు, శరత్ తననీ, సమస్త బెంగాలీ సాహిత్యకారుల్నీ కూడా బయటపడేసాడని చెప్పడానికి.

చదవండి. ఈ కథ ఇన్నేళ్ళుగానూ నా గుండె లో దిగబడ్డ ఇనుపములుకులాగా కలుక్కుమంటూనే ఉంది. మొదటిసారి చదివినప్పుడు దీన్ని ఒక బీద ముస్లింని చిత్రించిన కథగానే గుర్తుపెట్టుకున్నాను. కాని ఇప్పుడు ఈ కథని ఎన్నో పార్శ్వాలనుంచి చదవవచ్చనిపించింది. ఉదాహరణకి, ఇది అమీనా కథ కూడా. ఈ కథలో అమీనా ఆడుకుంటున్నట్టు ఒక్కమాట కూడా కనిపించదు అని రాసింది అనిందితా ముఖర్జీ తన అనువాదాలకు ముందుమాటలో. ఒక బాలిక నష్టశైశవానికి సంబంధించిన కథ ఇది. అలాగే దీన్ని మహేశం అనే ఒక మూగజీవి వైపునుంచి కూడా చదవ్వచ్చు. ఇది వలస కథ కూడా. గ్రామాలు ఎట్లా ఆత్మహత్యకు పాల్పడుతూ వచ్చాయో చెప్పిన కథ కూడా. ఈ కథ వచ్చి పాతికేళ్ళు తిరక్కుండానే బెంగాల్లో హిందువులూ, ముస్లిములూ ఒకరినొకరు నరుక్కున్నారంటే ఆశ్చర్యం లేదు. అందువల్ల ఈ కథ హిందూ-ముస్లిం జీవితాల మధ్య కనిపించని అగ్నిపర్వతం కథ కూడా.

శరత్ ఈ రోజు జీవించి ఉండి, కలకత్తాలో ఈ కథ రాసి ఉంటే, అతడి ఇంటిమీద దాడి జరిగి ఉండేదనీ, తమ మనోభావాలు గాయపర్చేడని ఒక మతానికి చెందిన వారు అతణ్ణి జైలుకి పంపించేదాకా విశ్రమించి ఉండేవారు కారనీ ఒక బ్లాగరు రాసింది చదివాను. ఆ మాటల్లో అతిశయోక్తి లేదు.


మహేశం

మూలం: శరత్ చంద్ర ఛటోపాధ్యాయ

అనువాదం: పురిపండా అప్పలస్వామి

ఊరు పేరు కాశీపురం. గ్రామం చిన్నది. అక్కడి జమీందారుకూడా చిన్నవాడు. అయినా అతడి ప్రతాపం దొడ్డది;ఎవ్వరూ కిక్కురుమనడానికి వీలులేదు.

అవాళ జమీందారు చిన్నకొడుకు పుట్టినదినం. పూజలూ, పునస్కారాలు అన్నీ పూర్తి చేసుకొని పురోహితుడు తర్కరత్నంగారు మిట్టమధ్యాహ్నవేళ ఇంటికి పోతున్నాడు. వైశాఖమాసం ముగియ వస్తున్నా ఆకాశంలో మబ్బుపిసరనిపించడం లేదు. అగ్గి కురుస్తున్నట్టుంది. ఎదురుగుండా దిగంత వ్యాప్తమైన మైదానం ఎండి పగుళ్ళువారి పోయింది. లక్షలాది పగుళ్ళనుండి భూదేవిరక్తం పొగళ్ళరూపంగా పైకి వస్తూ ఉంది.

దాని పొలిమేర, దారిప్రక్క సాలెగఫూరు సాయిబు ఇల్లుంది. వాకిటి మట్టిగోడ పడిపోయి దారితో కలిసిపోయింది. లోపలి అంతఃపురం తన లజ్జా సంభ్రమాలను వ్యక్త పరుస్తూ పథికులముందు జాలిగ ఆత్మసమర్పణం చేస్తున్నది. పోతూ పోతూ ఆగి తర్కరత్నంగారు గట్టిగా అరిచాడు.

“ఒరేయ్, గఫూర్ ! ఇంట్లో వున్నావురా ! ఒరేయ్!”

అతడి పదేళ్ళకూతురు ద్వారం దగ్గరకు వచ్చిచెప్పింది.

“మా బాబును పిలుస్తున్నారా? జ్వరంగా ఉంది. ”

“జ్వరం గిరంనూ ! పిలూ వెధవని.”

గఫూరు పైకి వచ్చాడు ; జ్వరంతో వణకుతూ నిలబడ్డాడు. దాని పడిపోయిన గోడ ప్రక్కనే చిన్న తుమ్మచెట్టుంది. కొమ్మని ఒక ఎద్దు కట్టి ఉంది. తర్కరత్నంగారు దాన్నిచూపిస్తూ ‘ఇదంతా ఏవిటో చెప్పూ. ఇది హిందువుల గ్రామమనీ, దీని జమీందారు బ్రాహ్మడనీ నీకు తెలుసంటావా లేదా?’

పురోహితుడి మొఖం ఎండవల్లా, కోపంవల్లా ఎర్రగా కంది పోయింది. అంచేత నోటవచ్చే ప్రతీమాటా వేడెక్కి అగ్గినిప్పులా ఉంది. గఫూరుకదేవీ అర్థం కాక తెల్లబోయి అతడి మొహం చూస్తున్నాడు.

“ఉదయం వెళ్ళేటప్పుడు చూశాను. ఈ ఎద్దు ఇక్కడే కట్టేసి ఉంది. ఇప్పుడు రెండు ఝాములు కావచ్చినా కూడాఅలాగే కట్టి వుంది. ఒక వేళ గోహత్య జరిగిపోయిందంటే జమీందారు నిన్ను ప్రాణాలతో పాతి పెట్టేస్తాడు. అలాంటి ఇలాంటి బ్రాహ్మడు కాదతగాడు.”

“ఏం చేసేది బాబూ, నేను చాలా చిదికిపోయినాను. దీనికితోడు జ్వరంఒకటి నన్ను తినేస్తూ ఉంది. తాడుపట్టుకు ఎలాగైనా మేపుకొద్దామనుకుంటాను. కాని తల తిరిగిపోతుంది, తూలిపోతున్నాను. ”

“అయితే విప్పేయి దానంతట అదే మేసుకు వస్తుంది.”

“ఎక్కడ విప్పేది బాబయ్యా? ఇంకా ప్రజల ధాన్యం నూర్పు పూర్తి కాలేదు. కళ్లాల్లో గడ్డికుప్పలు తియ్యలేదు. మైదానంలో గడ్డి దుబ్బయినా లేదు. తమామూ మాడి పోయింది. ఎవరి ధాన్యంలో ఐనా, ఎవరి కళ్లంలో ఐనామూతి పెట్టిందంటే — చెప్పండి బాబూ ఎలా దీన్ని విప్పేది? ”

తర్కరత్నం గారు కొంచెం మెత్తబడ్డాడు.

“పోనీ ఎక్కడన్నా చల్లని చోటన్నా కట్టూ. రెండు పరకలన్నా దాని మొహాన తగలెయ్యి, నమల్నన్నా నములుతుంది. నీ కూతురింకా వంట చెయ్యలేదా! కొంచెం గంజయినా దానిముందు పొయ్యి, త్రాగుతుంది. ”

గఫూరు జవాబు చెప్పలేదు. పెద్ద నిట్టూర్పు మాత్రం విడిచాడు.

“అదీ లేదనుకుంటాను. అయితే నీ ధాన్యం ఏం చేసినట్టూ నీవంతుకు దొరికిందంతా అమ్మేసి గుటకాయ స్వాహా చేసేశావూ! కసాయి వెధవా!”

ఎండిన పెదవులు చప్పరిస్తూ గఫూరు మెల్ల మెల్లగా అన్నాడు.

“పదిహేను మణుగుల గింజలు వంతుకి వచ్చాయి. అవన్నీ నిరిటి బాకీక్రింద లాక్కున్నారు జమీందారు బాబు. ఏడుస్తూ చేతులు జోడించుకు మనవి చేసుకున్నాను. ‘ కొండంత ప్రభువులు, మీ రాజ్యం విడిచి నేనెటు పోతాను గనుక. ఏమీ ఇవ్వక పోయినా పదికట్టలు గడ్డయినా ఇప్పించండి. ఇంటిమీద చొప్పలేదు. ఒక్కటేగది. అందులోనే తండ్రీ కూతుళ్ళం పడి ఉన్నాం. ఏతాటి కమ్మయినా కప్పుతాను. కాని గడ్డి పరకలు లేకపోతే నా ‘మహేశం’ చచ్చిపోతుంది ‘ అని-”

“వాః ! మజాగా పేరు పెట్టావ్ ! ‘ మహేశం ’. నవ్వలేక నాకు ఊపిరెగిరిపోతున్నాది.”

“జమీందారుబాబుకు నా మీద జాలి కలగలేదు. ధాన్యం కొట్లో వేయించివేశారు. ఒక్క గడ్డి పరకయినా యిప్పించలేదు. ”

ఇక మాటాడలేక పోయాడు. సాయిబు కళ్ళనీళ్లు తిరిగాయి. ఏడుస్తున్నాడు.

“అయితే నువ్వు బలే వాడిలా ఉన్నావు. తినేసి కూచుంటానంటావ్ ! వారిది ఇవ్వవలసింది ఇవ్వనంటావ్! జమీందారు తన ఇంటినుండి తెచ్చి నీకు తినిపిస్తాడేం ! నీజాతి లక్షణమే అంతా! కాకపోతే రామరాజ్యంలో బ్రదుకుతూ ఆ మహారాజును నిందిస్తావా?”

“నిందించలేదు బాబయ్యా ! ప్రభువును నిందించడమే ! కాని మీరే చెప్పండీ, నేనెక్కడనుండి తెచ్చిచ్చేది? ఏదో నాలుగు సెంట్ల భూమి. దానిమీదే వ్యవసాయమంతాను. రెండు సంవత్సరాలు బొత్తిగా పంటలు పోయాయి. మడిలో సేనుమడిలోనే మాడిపోయింది. తండ్రీకూతుళ్లకు కడుపునిండ తిండికి దొరకలేదు. ఇల్లు చూడండి, వర్షంలో రాత్రుళ్లు ఒక మూల ఇద్దరమూ కూచుంటున్నాం. కాళ్ళు చాపుకోవడానికి చోటులేదు. నా మహేశాన్ని చూడండి. లెక్క పెట్టిందికి వీలుగా ఉన్నాయి ఎముకలు మీరైనా రెండు మానికలు ధాన్యం అప్పియ్యండి స్వామీ ! పశువునైనా రెండుపూటలు మేపుకుంటాను. “

గఫూరు చేతులుజోడించుకుని పురోహితుడి పాదాల దగ్గర చతికిల బడ్డాడు. తర్కరత్నంగారు తటుక్కున రెండడుగులు వెనక్కు తప్పుకొని : “ఆరి నీకక్కా గట్టా ! ముట్టేస్తావేమిటీ?”

“లేదు బాబూ ! ముట్టను : నాకు తెలీదా! బాబూ, నాకీ సమయంలో రెండు మానికల గింజలు ఇప్పించండి. అవాళ మీయింటి దగ్గర నాలుగేసి కుప్పలు చూసివచ్చాను. నాకిప్పించడం మీకో లెక్క కాదు. నేను ఆకలికి చచ్చిపోతేపోతాను. కాని ఇది నోరులేని పశువు. ఊరికే నిలబడి చూస్తుంది. నోటితో చెప్పలేదు. కంటతడి పెడుతుంది.”

“ఒరేయ్ సాయిబూ, అప్పడుగుతున్నావు కదా ! ఎలా తీరుస్తావురా ! ముందీ మాట చెప్పు!”

“ఎలాగన్నా తీర్చేస్తాను బాబయ్యా ! దగా చెయ్యను.”

“దగా చెయ్యవు, ఊఁ, గడుసువాడివి, దగా చెయ్యవు ! లే, అడ్డుగాలే, పొద్దు తిరిగిపోతూ ఉంది, పోవాలి. ” వెక్కిరింపుగా అంటూ, మందహాసం చేస్తూ ముందుకు వేసిన అడుగు వెనక్కుతీసి తర్కరత్నంగారు: “వెధవ, ఇది కొమ్ములూపుతూ మీదికి వస్తూ ఉంది. పొడిచి పారెయ్యదు కదా !” అతడి చేతిలో పళ్ళూ, కాయకూరలూ, తడిబియ్యం వగైరా మూటఉంది. “ వాసన తగిలి తినెయ్యాలనే చూస్తుందిరోయ్ ! రైతు ఎలాంటివాడో ఎద్దూ అలాంటిదేనోయ్ ! గడ్డిపరక నోటికి తగల్దుగానీ పళ్ళూ బియ్యం తినెయ్యాలని చూస్తుంది! వెళ్ళూ, దాన్ని దార్లోనుండి తప్పించు. దీని కొమ్ములు చూస్తే ఎపుడో ఒకర్ని పొడిచి చంపేస్తుంది. తప్పదు.” అరుస్తూ, గొణుగుతూ, అంగలు వేసుకొంటూ వెళిపోయాడు, తర్కరత్నంగారు.

గఫూరు చూపుత్రిప్పి మానంగా మహేశాన్ని చూస్తూ నిలబడి పోయాడు. లోతైన దాని నల్లనికళ్లు రెండూ వేదసతో, ఆకలితో నిండి ఉన్నాయి.

“ఒక పిడికెడైనా నీకిచ్చాడు కాడు. మూటలో అధికంగానే ఉంది. కాని అతడెవ్వరికీ ఇవ్వడు. పోనీ ! ఇవ్వకపోతే, ఏం చేస్తాము !! “

గఫూరు గొంతుక గద్గదికమై పోయింది. కళ్ళంబడి బొటబొట నీరు కారింది. మెల్లగా ఎద్దుదగ్గరకు వెళ్ళాడు. మెడా, తలా, వీపూ చేత్తోనిమురుతూ “మహేశం ! బిడ్డా! ఎనిమిదేళ్ళు మమ్మల్ని పెంచి పోషించావు. ఇప్పుడు ముసలివై పోయావు. కడుపునిండా తిండి నీకు పెట్టలేక పోతున్నాను. అయినా నీకు తెలుసు కదూ, ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నానో.”

ఎండ కూడా దుఃఖంతో చెమ్మగిల్లుతూ ఉన్న ట్లుంది. మహేశం మెడ ముందుకు చాచి, కళ్లుమూసుకుని నిలుచుంది. గఫూరు కన్నీళ్ళు మహేశం వీపుమీద పడుతున్నా తుడిచి వేస్తూ మళ్ళీ అస్పష్టంగా అంటున్నాడు. “నీ నోటి దానా లాక్కున్నాడు జమీందారు. స్మశానం దగ్గరి బంజరుకూడా అమరకం చేసేశాడు. నువ్వేచెప్పూ, ఈ కరువు కాలంలో ఏమిచ్చి నిన్ను బ్రతికించగలనూ! పోనీ నిన్ను విప్పేశాననుకో పై వాళ్ళ కుప్పల్లో నోరుపెడతావు. ఏంచేసేదీ! నీ దేహంలోనా బలంలేదాయె. అంచేత ఎవ్వరూ నిన్ను కొనరు. లోకులు సంతలో అమ్మెయ్యమంటారు. ” – మరిన్ని కన్నీళ్లు బొటబొట రాలాయి. పడిపోయిన కొంపవెనక్కు వెళ్ళి, ఇంత పాత చొప్ప తెచ్చి దానిముందు వేశాడు. ” “ఇంద, వేగంకొంచెం తినేయ్. ఆలస్యంచేశావంటే మళ్ళీ ” ఇంతలో అతని కూతురు అమీనా పిలిచింది. “బాబా! తిందువుగానిరా!” అమీనా బైటికి వచ్చి అంతా చూసింది.

“మళ్ళీ ఇంటి చొప్పతీసేశావా బాబా !”

గఫూరు భయపడినంతా ఐంది. సిగ్గుపడుతూ అన్నాడు. “లేదమ్మా, పాతచొప్ప, పాడైపోయి దానంతట అదే క్రిందపడి ఉంటే- “

“బాబా, నేను లోపలినుండి వింటూనే ఉన్నాను. ఇపుడే మీదనుండి లాగావు. ”

“లేదమ్మా, లాగలేదు. కాని—”

“కాని బాబా, గోడ పడిపోతే ”

గఫూరు మాట్లాడలేదు. ఈ చిన్నగది తప్ప తనకు ఉన్నదంతా ఐపోయింది. చొప్పపోతే వచ్చేవర్షాలకు ఇదికూడాఉండదు. అదీకాక ఇలాచేసి ఎన్నాళ్ళని గడుస్తుంది గనక !

“బాబా, చేతులు కడుక్కురా, వడ్డించేస్తాను ”

“కొంచెం గంజి పెట్టూ, ముందు దీనికి త్రాగించి వస్తాను.”

“ఇవాళ గంజిలేదే —అది కుండలోనే ఇగిరిపోయిందయ్యా!”

“గంజిలేదూ!- ” గఫూరు మాటాడలేదు. ఆపదకాలంలో ఏమాత్రమూ నష్టపరచరాదన్నమాట పదేళ్ళ పిల్ల అమీనాకు కూడ తెలిసిపోయింది. గఫూరు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళి నిలబడ్డాడు. చిన్న ఇత్తడి తబుకులో తండ్రికోసం శాకాన్నం వడ్డించి తనకోసం ఒక మట్టి మూకుడులో రెండు మెతుకులు వడ్డించుకుంది అమీనా. కొంచెం చూచి మెల్లగా అన్నాడు గఫూరు.

“అమ్మా, అమీనా ? నాకు మళ్ళీచలి వేస్తున్నది. జ్వరంతో అన్నం తినమంటావా ! ”

“ఇందాకా ఆకలిగా ఉందన్నావుగా ! ”

“ఇందాకా,—అవును. అప్పటికి జ్వరం లేదనుకుంటాను ”

“అయితే తీసి ఉంచేస్తాను. సాయంకాలం తిందువుగాని”

“పాచి వంటకం తింటే జబ్బు మరింత అధిక మవుతుందో ఏమో!”

గఫూరు ఏమాలోచించాడో – ‘ ఒక పనిచెయ్యి తల్లీ! ఈ అన్నం పట్టుకెళ్ళి మహేశం ముందు వెయ్యి. ఏమంటావు ! రాత్రికి నాకోసం పిడికెడు వండెయ్యలేవూ?” అమీనా తల ఎత్తి తండ్రి మొహం చూసింది. కొంతసేపటికి మెల్లగా అంది.

“వండేస్తాలే.”


2

ఐదారు రోజుల తరవాత. విచారంగా, సుస్తీగా గఫూరు గుమ్మంలో కూర్చున్నాడు. అతడి మహేశం నిన్నటినుండీ ఇంటికి రాలేదు. మహేశం శరీరంలో బలమే లేదాయె. ఉదయంనుండీ అమీనా వెదుకుతూ తిరుగుతూనే ఉంది. రెండు ఝాముల వేళ అయాక చెమటలోడ్చుకుంటూ వచ్చి చెప్పింది: ‘బాబా, బాబా, కరణంగారు మహేశాన్ని బందెల దొడ్డిలో వేశారు. ”

“చుఫ్, నోరుముయ్ ”

నిజమేనయ్యా, వాళ్ళ నౌకరు చెప్పాడు. ”

“ఏంచేసిందనీ ?”

“వాళ్ళతోటలో చెట్లు పాడు చేసిందట! ”

గఫూరు రాయిలా కదలలేదు. ఇంతవరకూ అనేకవిధాల శంకించాడు. కాని. ఇదిమాత్రం అతడికి తట్టలేదు. తానెంతదిక్కుమాలిన వాడో, అంత గర్భ దరిద్రుడు కూడాను. అంచేత తనకు ఇలాంటి ఆపద ఎవరన్నా కలిగిస్తారని. అతడు ఊహించలేదు. అందులోనూ కరణంగారి లాంటి ఘరానా మనిషి నడవలేని మహేశంవంటి పశువును బందెలదొడ్డిలో!”

“పొద్దు పోతున్నది. మహేశంకోసం వెళ్ళొద్దూ ?”

“ఉహూఁ ”

“మూడు దినాలు దాటితే సంతలో పోలీసు వాళ్ళు అమ్మేస్తారట!”

”అమ్మేయనీ”

సంత అంటే ఏమిటో అమీనా ఎరగదు. కాని సంతలో మహేశాన్ని అమ్మడం అంటే తనతండ్రి భయపడడం అనేకమార్లు చూసింది. కాని ఇవాళ ఆమాట విని కూడా అతడు ఏమీ ఇదవకపోవడం ఆమెకు అర్థం కావడం లేదు.

రాత్రి చీకటి కమ్ముకున్నాక గఫూరు సడిలేకుండా వంశిదుకాణానికి వెళ్ళాడు. దాచిపట్టుకున్న ఇత్తడి తబుకు బల్లమీద పెట్టి “ ఒక రూపాయి కావాలి బాబూ, ” అన్నాడు. తబుకు తూకం వగైరా వంశికి చిరపరిచితం. ఈ రెండేళ్ళలో ఆ తబుకు ఐదుసార్లైనా తాకట్టు పట్టి ఉంటాడు. ఏమీ అభ్యంతరం చెప్పకుండా రూపాయి తీసి ఇచ్చాడు.

మర్నాడు మహేశం మళ్ళీ గఫూరు వాకిట కనపడింది.

అదే తుమ్మచెట్టు. అదేత్రాడు. అదే నిరాహారం. నీళ్ళు కారుస్తూ ఉన్న నల్లని జాలికళ్ళు. ఒక ముసలి సాయిబువచ్చి నిఘాగా దాన్ని చూస్తున్నాడు. ప్రక్కని ముడుకులు ముడుచుకొని గఫూరు కూర్చున్నాడు. పరీక్షచేయటం పూర్తిచేసి ముసలిసాయిబు వచ్చడం కొంగునుండి ఒక పదిరూపాయల నోటు విప్పాడు. పదిసార్లు అటూ ఇటూ నలిపాడు. చివరికి గఫూరు చేతిలో పెట్టి “ దీన్ని మార్చదలచలేదు మరి. ఇంద. తీసుకో”

గఫూరు అప్రయత్నంగా అందుకున్నాడు; మాట్లాడడు, కదలడు.

సాయిబు ఎద్దును విప్పబోయాడు. గఫూరు దభాలున లేచాడు.

“కబర్దార్ ! విప్పావంటే ఏమౌతుందో, చూసుకో! ముసలిసాయిబు త్రుళ్ళిపడ్డాడు.

“ఏం ??”

“ఏం లేదూ, గీం లేదూ. నావస్తువు నేను అమ్మను. ” నోటు గిరవాటు వేశాడు.

“మాట ఇచ్చి బయానా కూడా పుచ్చుకున్నావు కదా!” ముందు పుచ్చుకున్న బయానా రెండు రూపాయలు కూడా గఫూరు విసిరికొట్టాడు. జట్టీ ఇష్టంలేక ముసలిసాయిబు ఇంకో రెండురూపాయిలు చేర్చి :

“ఇందుకోసమేనా, పోనీ పుచ్చుకో, అది ముందే చెప్పరాదూ!” అన్నాడు.

“ఊఁహూఁ”

“కాని ఇంతకు మించి దమ్మిడీ ఐనా ఎవ్వరూ ఇవ్వరు, తెలిసిందా!”

ఊఁహూఁ”

“ఊఁహూఁ అంటే నాకర్థంకాదు. ఏమి వచ్చినా దీని చర్మంవల్ల నేనా, దీని శరీరంలో మరేమైనా ఉంది గనకనా ?”

గఫూరు తల గిర్రుమన్నది. ఏదో చెడ్డ మాటకూడా నోటంబడి వచ్చింది. వెర్రివాడిలా పారిపోయాడు ఇంటిలోకి.

“పొండి, ఈచుట్టుప్రక్కల కనబడ్డారా మాట దక్కదు. జమీందారుతో చెపుతాను. జాగ్రత్త!”

చేసేదిలేక వెళ్లిపోయాడు ముసలి సాయిబు.

మరికొంత సేపటికి జమీందారుగారి కచేరికి పిలువువచ్చింది గపూరుకు. గఫూరు గ్రహించాడు సర్కారువారి చెవికి ఈ కబురెలాగో వెళ్లిందని. కచేరీలో చిన్నా పెద్దాఉన్నారు. గఫూరును చూడగనే జమీందారు కళ్ళెర్ర చేస్తూ ” ఏంరా, గఫూర్ ! నిన్నేం చేయాలో తెలీకండా ఉంది. నువ్వెక్కడ బ్రతుకుతున్నావో తెలుసా!”

“చిత్తం, సర్కార్ ! గులాపోణ్ణి కాళ్ళకు మొక్కుతా. చేసిన తప్పుకి హుజూరువారు వేసే శిక్ష దాఖలు చేనుకుంటాను. కాని, సర్కార్ ! తిండికిలేక మాడిపోతున్నాను. మరెప్పుడూ అమ్మడానికి ప్రయత్నం చెయ్యను. క్షమించండి.”

గఫూరు ఏడుస్తున్నాడు.

అందరికీ ఆశ్చర్యం వేసింది. గఫూరు కరుకుతురక అనీ, పంతగొట్టనీ మాత్రం వాళ్ల నమ్మకం. పశువును కసాయివాడికి విక్రయించడం, అందులో బ్రాహ్మణ జమీందారు గ్రామంలో తప్పని అతడు వొప్పుకుంటున్నాడు. గఫూరు తన రెండుచెవులూ పట్టుకొని గుంజీలుతీసి నిలబడ్డాడు.

‘సర్కార్’ ! మరెప్పుడూ ఈపని చెయ్యను.”

జమీందారుగారు క్షమించారు. వారి క్షమాగుణాన్నీ, ధర్మపరిపాలననీ అందరూ ప్రశంసించారు. తర్కరత్నంగారు గోశబ్దం మీద శాస్త్రప్రమాణంతో వ్యాఖ్యానం వినిపించారు. ధర్మజ్ఞానహీనుడైన గఫూరు పూర్వజన్మంలో ఏపాపం వల్ల ఈజన్మ ఎత్తాడో, మ్లేచ్ఛజాతిని ఎంచేత గ్రామంలో ఉంచరాదో శాస్త్రప్రమాణాలతో రుజువుచేసి అక్కడివారి జ్ఞాననేత్రం వికసించేటట్టు చేశాడు. ఈ తిరస్కారానికి తాను అర్హుడే అనుకున్నాడు గఫూరు. ఈ అవమానం వల్ల తన హృదయం తేలికపడ్డట్టయింది. ఊళ్లో ఇంతగంజి అడిగి తెచ్చి మహేశానికి పెట్టాడు. తలమీదా, శరీరం మీదా చేతులు నిమురుతూ ఏవేవో గొణుగుకున్నాడు.

3

జ్యేష్టమాసం ఐపోవస్తున్నది. ఆకాశం మండిపోతూఉంది. ప్రపంచమంతా దగ్ధమయ్యేవరకూ ఈ మంట చల్లారదా ! మిట్టమధ్యాహ్నం, గఫూరు ఇంటికి తిరిగి వచ్చాడు. పై వాళ్ల దగ్గర కూలిచేసే అలవాటతనికి లేదు. జ్వరం విడిచి నాలుగైదురోజులయింది. దుర్బలంగా ఉన్న శరీరం మరింత అలిసిపోయి ఉంది. ఐనా కూలికోసమే ఇవాళ వెదికి వచ్చాడు. దుర్భరమైన ఎండ మాత్రం తన నెత్తిని మండించింది. వాకిట్లోనే నిలబడి పిలిచాడు.

“అమీనా ! వంటయిందా ?”

అమీనా పైకి వచ్చి మౌనంగా నిలబడింది.

“అరే, వంటైందా అంటా, ఏం ? వండలేదూ ! ఎంచేతా?”

“బియ్యం లేవు”

“పొద్దున్నే ఎందుకు చెప్పలేదు ?”

“రాత్రే చెప్పాను కదా ! ”

“రాత్రి చెప్పిన మాట ఎలా జ్ఞాపకం ఉంటుందనుకున్నావ్ !”

తన వికారమైన గొంతుకవల్ల కోపం మరింత అధికమైంది.

మొహం మరింత వికృతం చేస్తూ :

“బియ్యం ఎలా ఉంటాయి! జబ్బుతో ఉన్న ముసలితండ్రి తిననీ తినక పోనీ, వయసు పిల్లకు నాలుగైదు సార్లు తిండికావాలి ! ఇక నుంచి బియ్యం తాళం వేసి ఉంచుతాను. దాంతో రోగం కుదురుతుంది. తే, ముంతెడు మంచినీళ్లు తే, దాహంతో కళ్లు పేలిపోతున్నాయి. ఊఁ, అవీ లేవని చెప్పేయ్.
అమీనా అలాగే తల వేలేసుకు నిలబడ్డాది. ఇంట్లో మంచి నీళ్లు కూడా లేవని తెలిసిపోయింది.

అమాంతంగా ఉరికి అమీనా చెంప మీద ఒక్క దెబ్బవేశాడు.


“హరామ్ జాదీ ! రోజంతా ఏంచేస్తున్నావ్ ! ఇంతమంది చస్తున్నారు. నీకుమాత్రం చావు రాకండా ఉంది. ”

అమీనా ఏమీ జవాబు చెప్పలేదు. మట్టికడవ ఎత్తుకొని, కళ్లుతుడుచుకుంటూ మండుటెండలో బైలుదేరింది. ఆ కళ్లమరుగు నుండి ఏదో ఒక బాణం వచ్చి గఫూరు గుండెల్లో తాకినట్లైంది. అమీనా తల్లి చనిపోయిన తరువాత ఆమెను ఎలాపెంచి పెద్దచేసిందీ తనకే తెలుసు. ఇంట్లో ధాన్యం గింజలు ఐపోయిన నాటినుండీ రెండుపూటలు కడుపునిండ తిండికి లేదు. ఇవాళ ఒకపూట తింటే – రేపు దినమంతా పస్తు. కూతురు మీద తెలిసీకూడా ఊరికే నిందలాడాడు. నీళ్లు ఇంట్లో లేకపోవడానికికూడా కారణం తనకు తెలుసు. గ్రామంలోని రెండు చెరువులూ ఎండి పోయాయి. జమీందారుగారి ఇంటి చెరువునీళ్లు అందరికీ లభ్యం కావు. పొరుగు ఊరు పొలిమేర రెండు గుమ్ములు త్రవ్వి వాటినుండి నీళ్లు తీస్తున్నారు. అక్కడ తీర్థమంత తోపులాట. అందులోనూ అమీనా తురకపిల్ల. గుమ్మిదగ్గరకు వెళ్లడానికి వీలులేదు. దూరంగా నిలబడి బ్రతిమిలాడితే ఎవరన్నా ధర్మాత్ములు ఇన్ని నీళ్లు ఎత్తి పోస్తే అవితీసుకు రావాలి. గంటల తరబడి బ్రతిమిలాడినా ఒక్కొక్కసారి పోసేవాళ్లుండరు. ఇదంతా గఫూరుకు తెలుసు. ఇవాళఒక వేళ అక్కడ నీళ్లు లేకపోయి ఉండవచ్చు. లేదా తమతోపులాటలో అమీనా మీద ఎవరికీ దయ కలగకపోయీ ఉండవచ్చు. ఇదంతా స్ఫురించగానే అతడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సరిగా ఇదే సమయానికి జమీందారు గారి బంట్రోతువాకిట్లో గట్టిగా అరిచాడు :

“ఏయ్, గఫూర్ ! ఇంట్లో ఉన్నావూ!”

“ఏం?”

“హుజూర్ వారు రమ్మంటున్నారు. ”

“నేనింకాఏమీ తినలేదు. కొంచెం సేపటిలో వస్తాను. ”

ఈ అవమానం బంట్రోతుకు దుర్భరమైంది. ఇక అశ్లీలసంబోధన చేస్తూ —

“చెప్పుతో దవడ ఊడగొట్టి ఈడ్చుకు రమ్మని హుకుం, తెలుసా ?”

“జాబేజా ! చక్రవర్తి రాజ్యంలో ఎవడూ ఎవడికీ గులాంకాడు. నేను పన్ను కడుతూ ఇక్కడ ఉన్నాను. రాను వెళ్లు.”

గఫూరు వంటి క్షుద్రజీవి ఇలాఅనడం ఎంత అనుచితం!- ఎంత ప్రమాదం ! తరవాత ఏం జరిగిందీ విస్తరించనవసరంలేదు. కొన్ని గంటలయాక అతడు జమీందారుగారి కచేరీనుండి ఇంటికి వచ్చాడు; మాట్లాడకండా కూర్చున్నాడు.

కళ్లూ, మొహం వాచిపోయి ఉన్నాయి. ఈ శిక్షకంతకూ కారణం మహేశం. గఫూరు బైటికి వెళ్లాక త్రాడు తెంపుకొని జమీందారుగారి వాకిట్లో దూరింది. పూల మొక్క చివురుతినేసింది. ఇలా ఇదే తొలిసారికాదు. అనేకసార్లు జరిగింది.

గఫూరు బీదరికం అతణ్ణి రక్షించేది. ఈసారికూడా దండాలుపెట్టి బ్రతిమాలుకుంటే క్షమాపణ దొరికేది. కాని బంట్రోతుతో పెద్దమాటలాడడం తనకు ఇంతముప్పు వచ్చింది. జమీందారు కచేరీలో తనమీద పడిన దెబ్బలకూ, తిట్లకూ పల్లెత్తి మాటాడలేదు గఫూరు. తిరిగివచ్చి అలాగే మౌనంగా కూచున్నాడు. ఆకలీ, దప్పి అతడి గుర్తులోలేవు. మిట్ట మధ్యాహ్నం ఆకాశంలాగే అతడి హృదయం దహించుకుపోతున్నది. ఇలా ఎంత సేపో గడిచింది. హటాత్తుగా వాకిట్లో కూతురు కేక వినపడింది. పైకివచ్చి చూశాడు. అమీనా క్రింద పడిపోయిఉంది. కడవ పగిలి చెక్కలైపోయిఉంది. నీళ్లుఅటూ ఇటూ ప్రవహిస్తున్నాయి. మహేశం ఆ నీళ్లు త్రాగుతున్నాది. రెప్పపాటులో గఫూరు ఉరికాడు. ప్రక్కని ఉన్న నాగేటిపిడి రెండు చేతులా ఎత్తి బలంగా కొట్టాడు మహేశంనెత్తిమీద.

మహేశం వాల్చినతల పైకి ఎత్తాలని ప్రయత్నించింది ఓసారి. తిండిలేక జీర్ణించిపోయిన దాని శుష్కశరీరం నేలమీద పడి పొర్లడం ఆరంభించింది. కంటి కొనల నుండి చుక్కలు చుక్కలుగ చెవులవరకూ ప్రవహించాయి కన్నీళ్లు.

తలమీద రక్తంచుక్కలు కనిపించాయి. రెండుసార్లు గజగజవణికింది కళేబరం. తరవాత ముందు కాళ్లూ, వెనక కాళ్లూ చాపగలిగినంతగా చాపి వేసింది. చివరి ఊపిరి వదిలి వేసింది.

అమీనా ఏడుస్తూ “ బాబా ! ఎంతపనిచేశావు ! ఎంతపనిచేసావు బాబా ! మన మహేశం చచ్చిపోయింది. ”

గఫూరు నిలుచున్న చోటినుండి కదలలేదు. రెప్పలు వాల్చని కళ్లతో, మహేశం కళ్లను – రెప్పలు పడని ఆ నల్లనికళ్లను రెంటినీ చూస్తూ రాయిలా నిలబడిపోయాడు. గంటలో ఈవార్త విని ప్రక్క ఊరినుండి చెమారవాళ్లువచ్చి మూగారు. మహేశాన్ని నాల్గుకాళ్లూ కలియగట్టిమోసుకుపోయారు. వాళ్ల చేతుల్లో దారైన కత్తులు మెరుస్తున్నాయి. గఫూరు నిలువునా వణికి పోతూ, రెండుకళ్లూ చేతులతో కప్పుకున్నాడు. అంతే. ఒకమాటైనా అనలేదు.

దీనికి చేయవలసిన ప్రాయశ్చిత్తం కోసం జమీందారు పురోహితుడికి కబురంపారని ఊళ్లో వాళ్లు చెప్పారు. ప్రాయశ్చిత్తంకోసం ఇల్లూ వాకిళ్లూ అమ్మేయవలసి వస్తుందేమో! గఫూరు దేనికీ జవాబు చెప్పలేదు. ముడుకుల్లో తల పెట్టుకొని ఎక్కడివాడక్కడే కూర్చుండి పోయాడు.

రాత్రి చాలా గడిచిపోయింది. చీకట్లో నక్షత్రాలు సూదుల్లా ఉన్నాయి. అర్ధరాత్రి కూతుర్ని లేపాడు.

“అమీనా, బేటీ ! పద వెళ్లిపోదాం. ”

ద్వారం దగ్గిర పడుకున్న అమీనా కళ్ళు నులుపుకుంటూ లేచింది.

“ఎక్కడి కెళదాం బాబా ?”

“మిల్లులో పని చేసిందికి. ”

అమీనా త్రుళ్ళిపడింది.

ఇంతకుముందు ఎంత కష్టంవచ్చినా మిల్లులోకి తండ్రి వొప్పుకునేవాడు కాదు. మర్యాదా ఉండదనీ; ఆడవాళ్ళమానం అసలే దక్కదనీ రకరకాల మాటలు చెప్పేవాడు.

“పద బేటీ ! ఆలస్యం చెయ్యకు. దూరం నడవాలి. ”

నీళ్ళుత్రాగే చెంబూ, తండ్రి అన్నం తినే తబుకూ వెంట తీసుకుపోవాలనీ అమీనా చూసింది. కాని అతడు వద్దన్నాడు.

“ఇవన్నీ ఇక్కడే ఉండనీ తల్లీ ! వీటితో మన మహేశం ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ”

దరిద్రంకంటె నల్లగా ఉంది చీకటి, దుఃఖంకంటె గంభీరంగాఉంది. తాత ముత్తాతలు కట్టిన ఇంటి గుమ్మం వదిలి, కూతురు చేయి పట్టుకొని ఆ చీకటిలోకి నడిచాడు గఫూరు. వాకిట్లో తుమ్మచెట్టు దగ్గరికి వచ్చి చటుక్కున ఆగిపోయాయికాళ్ళు. తరంగతరంగంగా దుఃఖం పొర్లి వచ్చింది. వెక్కి వెక్కి ఏడ్చాడు. చుక్కల నీలిఆకాశం వైపు తలఎత్తి అన్నాడు :

“యా అల్లా ! నన్ను నీఇష్టం వచ్చిన శిక్ష వెయ్యి. కాని, నా మహేశం దాహంతోనే చచ్చిపోయింది. మేయడానికి ఇంతభూమి ఎవరూ వదలలేదు. నువ్వు ప్రసాదించిన మైదానంనుండి ఇంతగడ్డి ఎవరైతే దాన్ని తిననివ్వలేదో, నువ్విచ్చిన నీళ్ళుకూడా ఎవరైతే దాన్ని త్రాగనివ్వలేదో వారిని – ఆ అపరాధాన్ని మాత్రం క్షమించకు! క్షమించకు? “

9-9-2025

6 Replies to “నన్ను వెన్నాడే కథలు-6”

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading