మందం మందం మధుర నినదైః

నెమ్మది అడుగులతో భాద్రపదం ప్రవేశించింది. కాలనీలో వినాయక చవితి పందిళ్ళకి ఏర్పాట్లు మొదలుపెట్టుకుంటున్నారు. మా ఇంటిపక్క వీథిలో పారిజాతం నిండుగా వికసించడం మొదలుపెట్టింది. శ్రావణమాసపు గడిచినా మలివానాకాలమింకా పూర్తికాలేదని తెలుస్తూనే ఉంది. ఇటువంటి సంధ్యవేళ మాష్టారి అబ్బాయి మార్కండేయులు నుంచి వాట్సపు పేజి.

ఏమా అని తెరిచి చూద్దును కదా, గోదావరి గళం నుంచి ప్రవహిస్తున్నట్టు, మాష్టారి కంఠస్వరంలో కృష్ణకర్ణామృత శ్లోకాలు. అలానే వింటూ ఉండిపోయాను. సాయంకాల ప్రార్థన పూర్తయిందనిపించింది.

ఎప్పుడో నలభై ఏళ్ళ కిందట సదనంలో గణపతి నవరాత్రుల సందర్భంగా శ్రీకృష్ణకర్ణామృతం మీద మాష్టారి ప్రసంగం గుర్తొచ్చింది. ఆయన కర్ణామృతం మొదటిసారి చదివిన చాలాకాలం పాటు మరే కవీ, మరే కావ్యమూ ఆయన్ని ఆకట్టుకోలేదట. ఆ మాటే ఆయన ఒకసారి ముట్నూరు కృష్ణారావుగారితో చెప్పారట. ‘నాకు శ్రీకృష్ణదేవుడు తప్ప మరెవరూ కనిపించడం లేదు, మరే కవీ నా మనసుకి పట్టటం లేదు’ అని. కాని ఆ ఋషి మందహాసం చేసి మాష్టారితో అన్నారట: ‘బాబూ, లీలాశుకుడు శ్రీకృష్ణుడిలో ఏ సౌందర్యాన్ని చూసారో, కాళిదాసభవభూతులు మొత్తం ప్రపంచంలోనే ఆ శ్రీకృష్ణసౌందర్యాన్ని చూసారు. పెద్దయ్యాక నువ్వే గ్రహిస్తావు’ అని!

ఆ పారవశ్యాన్ని మీరు కూడా ఆస్వాదిస్తారని ఇదుగో, ఇక్కడ పంచుకుంటున్నాను.

శ్రీకృష్ణాకర్ణామృతం: 2:2-11

యాం దృష్ట్వా యమునాం పిపాసుర నిశం వ్యూహో గవాం గాహతే,
విద్యుత్వానితి నీలకంఠనివహో యాం ద్రష్టుముత్కంఠతే
ఉత్తంసాయ తమాల పల్లవమితిచ్ఛిందంతి యాం గోపికాః
కాంతిః కాళియశాసనస్య వపుషః సా పావనీ పాతు నః (2-2)

దేవః పాయాత్పయసి విమలే యామునే మజ్జతీనామ్,
యాచంతీ నామనునయ పదైర్వంచితాన్యంశుకాని,
లజ్జాలోలైరలస విలసైరున్మిషత్పంచబాణై-
గోపస్త్రీణాం నయన కుసుమైరర్చితః కేశవో నః (2-3)

మాతర్నాతః పరమనుచితం యత్ఖలానాం పురస్తా-
దస్తాశంకం జఠరపిఠరీ మూర్ధయే నర్తితాసి
తత్క్షంతవ్యం సహజసరళే వత్సలే వాణి! కుర్యాం
ప్రాయశ్చిత్తం గుణగణనయా గోపవేషస్య విష్ణోః (2-4)

అంగుళైగ్రైరరుణకిరణైర్ముక్తసంరుద్ధ రంధ్రం
వారం వారం వదనమరుతా వేణుమాపూరయంతం
వ్యత్యస్తాంఘ్రిం వికచకమలచ్ఛాయ విస్తారనేత్రం,
వందే వృందావనసుచరితం, నందగోపాలసూనుమ్. (2-5)

మందం మందం మధుర నినదైర్వేణుమాపూరయంతం
బృందం బృందావన భువిగవాం చారయంతం చరంతం
ఛందోభాగే శతమఖముఖధ్వంసినాం దానవానామ్,
హంతారం తం కథయ రసనే! గోప కన్యా భుజంగం. (2-6)

వేణీమూలే విరచిత ఘనశ్యామ పింఛావచూడో,
విద్యుల్లేఖావలయిత ఇవ స్నిగ్ధపీతాంబరేణ
మామాలింగన్మరకతమణిస్తంభగంభీరబాహుః
స్వప్నేదృష్టస్తరుణ తులసీభూషణో నీలమేఘః (2-7)

కృష్ణే హృత్వా వసననిచయం కూలకుంజాధిరూఢే
ముగ్ధా కాచిన్ముహురనునయైః కిం న్వితి వ్యాహరంతీ
సభ్రూభంగం సదరహసితం సత్రపం సానురాగం,
ఛాయాశౌరేః కరతలగతాన్యంబరాణ్యాచకర్ష (2-8)

అపి జనుషి పరస్మిన్నాత్తపుణ్యో భవేయమ్
తట భువి యమునాయాస్తాదృశో వంశనాళః
అనుభవతి య ఏషశ్రీమదాభీరసూనో
రధరమణి సమీపన్యాసధన్యామవస్థాం (2-9)

అయి పరిచిను చేతః ప్రాతరంభోజనేత్రం
కబర కలిత చంచత్పింఛదామాభిరామం,
వలభిదుపలనీలం వల్లవీభాగధేయం
నిఖిలనిగమవల్లీ మూలకందం ముకుందం (2-10)

అయి మురళి, ముకుంద స్మేరవక్త్రారవింద
శ్వసన మధురసజ్ఞే త్వాం ప్రణమ్యాద్యయాచే,
అధరమణి సమీపం ప్రాప్తవత్యాం భవత్యాం
కథయ రహసి కర్ణేమద్దశాం నందసూనోః (2-11)


ఏ కాంతిని చూసి దప్పికగొన్న ఆవులమందలు యమునానదిని చేరుకుంటున్నవో, ఏ కాంతిని చూసి మెరుపుతో కూడుకున్న మేఘమని తలచి నెమళ్ళు ఉత్కంఠకి లోనవుతున్నవో, తళుకులొత్తుతున్న ఏ కానుగచెట్ల కాంతిని చూసి తమ శిరసుని అలంకరించుకోడానికి గోపికలు ఆ చివుళ్ళని తెంపుతున్నారో, అటువంటి కాళియశాసనుడి తనూకాంతి మమ్మల్ని పరిపాలించుగాక! (2.2)

నిర్మల యమునా జలాల్లో మునకలేస్తూ, తమనుంచి లాక్కున్న వస్త్రాల కోసం వేడుకుంటున్న గోపీస్త్రీల సిగ్గులో మొగ్గలవుతున్నవీ, పంచబాణస్ఫురణని కలిగిస్తున్నవీ, నెమ్మదిగానూ, వెలుగులీనుతూనూ ఉన్నవీ అయిన తమ చూపులనే పూలతో పూజలందుకుంటున్న ఆ కేశవమూర్తి మమ్ము రక్షించుగాక! (2.3)

సరళసహజ వాత్స్యల్యమూర్తీ, తల్లీ, ఓ సరస్వతీ, ఏదో ఈ నా కడుపు నింపుకోడం కోసం నిన్ను తీసుకుపోయి ఇన్నాళ్ళూ దుర్జనులముందు నాట్యం చేయిస్తూ వచ్చాను. ఇందుకు నిజంగా నిష్కృతిలేదు. ఇప్పుడు గోపవేషధారి అయిన విష్ణు గుణగానం చేసి నా అపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. (2.4)

ఎర్రని కాంతులు చిమ్మే ఆ అంగుళుల్తో ఆ పిల్లంగోవి రంధ్రాలు మూస్తూ తెరుస్తూ దాన్ని తన నోటిగాలితో మాటిమాటికీ పూరిస్తున్నవాడూ, వ్యత్యస్తభంగిమలో నిలుచున్నవాడూ, వికసించిన తామరపూలవంటి నేత్రాల కాంతిని ప్రసరింపచేస్తున్నవాడూ, బృందావనాన్ని తన నడతతో శోభింపచేస్తున్నవాడూ అయిన నందగోపాలసూనుడికి నమస్కరిస్తున్నాను. (2.5)

పిల్లంగోవిని మెల్లమెల్లగా మధురసునాదంతో నింపుతున్నవాడూ, బృందావనంలో గోవులబృందాల్ని మేతకు నడిపిస్తున్నవాడూ, వేదాంతసీమలో సంచరిస్తున్నవాడూ, దేవేంద్రాదులను బాధిస్తున్న రాక్షసులను వధిస్తున్నవాడూ, గోపకన్యకలమానసచోరుడూ అయిన అతణ్ణి కీర్తించవే నాలుకా! (2.6)

సిగముడిమొదటనే చిత్రంగా అలంకరించిందీ, మబ్బులాగా నల్లదైందీ అయిన నెమలిపింఛం అలంకారంగా కలిగినవాడూ, పీతాంబరపు తళతళల మెరుపులు చుట్టుకున్నవాడూ, ఇంద్రనీలమణి స్తంభాల్లాంటి దిటవైన బాహువులు కలిగినవాడూ, లేతతులసీమాల ధరించినవాడూ, అయిన నీలమేఘశ్యాముడు లక్ష్మిని ఆలింగనంచేసుకుంటూ నా కలలో కనబడ్డాడు. (2.7)

గోపీస్త్రీల వస్త్రాల్ని హరించి కృష్ణుడు యమునా నది ఒడ్డున ఒక చెట్టుమీద ఎక్కుతుండగా ఒక ముగ్ధ మాటిమాటికి అనునయంతోనూ, ఎందుకిలా చేస్తున్నావని అడుగుతూ, కనుబొమలు ముడిచి, చిరునవ్వుతో, అనురాగంతో ఆ నీళ్ళల్లో కనిపిస్తున్న శ్రీకృష్ణుని చేతుల్లోంచి ఆ వస్త్రాలు లాక్కుంటున్నది. (2.8)

సంపత్కరుడూ, ఆభీరసూనుడూ అయిన శ్రీకృష్ణుని అధరమణికి దగ్గరా ఉన్నందువల్ల ధన్యమైన ఏ అవస్థని ఈ పిల్లంగోవి అనుభవిస్తూ ఉన్నదో అటువంటి భాగ్యాన్ని, అంటే, ఈ యమునానదీ తీరంలో వెదురుపొదగా పుట్టడానికి కనీసం వచ్చే జన్మలో అయినా నోచుకోగలుగుతానా! (2.9)

ఓ మనసా! ప్రాతఃకాలవేళ వికసించే తామరపూల వంటి నేత్రాలు కలిగినవాడూ, సిగలో ధరించి మెరుస్తున్న నెమలిపింఛం వల్ల మనోజ్ఞంగా గోచరిస్తున్నవాడూ, ఇంద్రనీలమణిలాంటివాడూ, గోపీస్త్రీల భాగదేయస్వరూపుడూ, నిఖిలవేదసారానికీ మూలకందమైనవాడూ అయిన ముకుందుడిగురించి చింతించు. (2.10)

ఓ మురళీ! మందహాసంతో కూడుకున్న ముకుందవదనారవిందాల ఊర్పులనే తేనెల తీపి తెలిసినదానివి కాబట్టి నీకు ప్రణమిల్లిమరీ ఒకటి యాచిస్తున్నాను. అదేమంటే, నువ్వు ఆయన అధరమణి సామీప్యాన్ని పొందుతున్నప్పుడు, ఆ ఏకాంతంలో, ఆ నందసూనుడి చెవిలో నా అవస్థ గురించి చెప్పి పుణ్యం కట్టుకో. (2.11)


Featured image courtesy: https://thehouseofthings.com/

24-8-2025

12 Replies to “మందం మందం మధుర నినదైః”

  1. అద్భుతమైన శ్లోకాలు..ప్రసంగం తప్పకుండా వింటాను

  2. ఆ అమృతాన్ని మాకూ పంచినందుకు అనేక ధన్యవాదములు సార్ 🙏❤️🌹

  3. ఈ రచనలో ఒక భక్తి-రసానుభూతి ప్రవాహం ఉంది. ఆరంభంలో భాద్రపద మాసం, వినాయక చవితి వాతావరణం, పారిజాతం పరిమళం వంటి వర్ణనలు సహజంగా పాఠకుడిని ఆధ్యాత్మిక, సాంస్కృతిక నేపథ్యానికి తీసుకెళ్తాయి. మాష్టారి జ్ఞాపకం, ఆయన వాణి నుంచి ప్రవహించే శ్రీకృష్ణకర్ణామృత శ్లోకాల అనుభూతి, అద్భుతమైన నస్టాల్జియాను కలిగిస్తున్నాయి.. లీలాశుకుడి శ్లోకాల ఎంపికలో మాధుర్యం, భక్తి, శృంగారరసాలు సమతౌల్యంలో ఉండటం ఆకట్టుకుంటుంది. గోపికల లీలలు, కృష్ణుని సౌందర్యవర్ణనలు సున్నితంగా, భావప్రధంగా ఉన్నాయి. ముఖ్యంగా వస్త్రహరణ, మురళీ సన్నివేశాల వర్ణనలో కవి భక్తిలోనూ, శృంగారంలోనూ అద్భుతమైన సంతులనం పాటించాడు. రచనలో పూర్వస్మృతులు, ప్రస్తుతానుభూతి కలయిక పాఠకుడికి భక్తి, సాహిత్యాస్వాదన రెండింటినీ అందిస్తుంది. గోదావరి గళం నుంచి వినిపిస్తున్నట్టుగా శ్లోకాలు వినిపించాయన్న వాక్యం భావనాత్మకం. మాష్టారి మాటల్లోని లోతైన తాత్త్వికత — “లీలాశుకుడు కృష్ణుడిలో ఏ సౌందర్యాన్ని చూశాడో, కాళిదాసభవభూతులు మొత్తం ప్రపంచంలో చూసారు. పాఠకుడిని ఆలోచనలో పడేస్తుంది. మొత్తానికి ఈ రచన భక్తి, సాహిత్యం, జ్ఞాపకాల సుందర మేళవింపు. చదివిన వారికి కృష్ణకర్ణామృత మాధుర్యాన్ని స్వయంగా అనుభవించేలా చేస్తుంది.

  4. మల్లవరం శరభేశ్వర శర్మగారి వాణిని వినే అదృష్టం మాకూ కలుగచేసిన మీకు అనేకానేక ధన్యవాదాలు చిన వీరభద్రుడు గారూ.
    ఆ మహానుభావుడి గురించి వీరలక్ష్మీదేవి గారి నోట విన్నాను, రచనల్లో చదివాను.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading