హెమింగ్వే సూత్రాలు

త్రిపుర గారు రాసిన ‘భగవంతం కోసం’ (1964) కథలో కథకుడు ఒక రెస్టరెంట్లో వెయిటరు ఉన్నిథన్ ని వర్ణిస్తూ ‘ఒక్కొక్క మార్కూ అలా నేల మీద జల్లుతూ వెళ్ళేడు లోపలకి హెమింగ్వే వాక్యం లాగ- నీట్ గా, బ్రిస్క్ గా, ఓవెర్ టోన్స్ ఏఁవీ లేకుండా..’ అని రాస్తాడు. హెమింగ్వే శైలి ప్రపంచవ్యాప్తంగా భాషలకి అతీతంగా అభిమానుల్ని సంపాదించుకుందని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణేగాని, చక్కని ఉదాహరణ.

హెమింగ్వే వాక్యాల్లోని గాఢత, క్లుప్తత, తీవ్రత ఆయన ఏళ్ళ తరబడి చేసిన సాధన వల్ల ఒనగూడిన విలువలు. ఆయన జీవించిన జీవితం కూడా సామాన్యమైంది కాదు. కానీ కొత్తగా రచనలు మొదలుపెడుతున్నవాళ్ళకే కాదు, ఏళ్ళ తరబడి రాస్తూ ఉన్నవాళ్ళకి కూడా హెమింగ్వే నుంచి నేర్చుకోవలసింది చాలానే ఉంది. ఆయన శైలిని అనితరసాధ్యం చేసిన కొన్ని సూత్రాలు, కొందరి దృష్టిలో పదకొండు, కొందరికి పదమూడు, కొందరికి కేవలం నాలుగు మాత్రమే, మళ్ళీ మళ్ళీ చదివినప్పుడల్లా కొత్తగానే ఉంటాయి. ఆలోచింపచేసేవిగా ఉంటాయి. చివరికి హెమింగ్వే యాప్ కూడా ఒకటి నెట్లో చూసాను. అంటే మనమేదన్నా రాసి దానిలో ఫీడు చేస్తే అది హెమింగ్వే పద్ధతిలో దాన్ని సరిదిద్ది మనకి అందిస్తుందన్నమాట.

నాలుగైదు రోజుల కిందట మళ్ళా హెమింగ్వే రూల్సు కనబడ్డాయి నెట్లో. మళ్ళా ఎవరో కొత్తగా వాటిని చదివి థ్రిల్లయి మనతో పంచుకున్నారు. వాటిని చదవగానే మీతో పంచుకోవాలనిపించింది. చూడండి.

1. చిన్న చిన్న వాక్యాల్లో రాయండి

చిన్న వాక్యాలు, పొట్టి పొట్టి వాక్యాలు- హెమింగ్వే శైలిని గుర్తుపట్టే మొదటి సూత్రం. ఏదో కథలో అనుకుంటాను, ముళ్ళపూడి వెంకటరమణ, అసాధ్యమైన పనులు కూడా చెయ్యగలను అని కథకుడితో చెప్పిస్తూ, శివాజీ గణేశన్ తో చిన్న చిన్న డైలాగులు చెప్పించగలను అంటాడు. కాని తెలుగు రచయితలకి, నాతోసహా, సాధ్యం కానిదే చిన్న వాక్యాలు రాయడం. చిన్న వాక్యాల్లో మాట్లాడటం తెలుగువాడి స్వభావం కాదు. ‘సులభంగా, సూటిగా చెప్పేసి, ఇంత ధ్యానానికి, మౌనానికీ, కార్యాలకీ, విజయాల వ్యవధి నివ్వరాదా అని చెలం కోర్కె’అని చలంగారు అన్నమాట నిజమేగాని, ఆయన కూడా ఆ పని చేయలేకపోయాడనే అనాలి. కాని చిన్న వాక్యాలు రాయడం ఈ రోజు అవసరం మాత్రమే కాదు, ధర్మం కూడా. ఆ మధ్య ఒకాయన తనకు నచ్చిన కవిత ఒకటి సభలో చదివి వినిపించాడు. ఆ కవితలో కవి చెప్పదలచుకున్న భావం మొదటి రెండు వాక్యాల్లోనే పూర్తయిపోయింది. కాని ఆ తర్వాత కూడా మరొక ముప్ఫై నలభై పంక్తులు నడిచింది ఆ కవిత. ‘కవిత్వంలోనూ, జీవితంలోనూ  economy of words and thoughts లేకపోవడం దేశభక్తికన్న హీనమైన పాపం’ అని కూడా చలంగారు అన్నారుగాని, ఇప్పుడు దేశభక్తి గురించి మాట్లాడకపోవడమే పాపంగా మారిపోయిన కాలంలో, ఇంకా ఎకానమీ ఆఫ్ వర్డ్స్ గురించి పట్టించుకునేవాళ్ళెవరు? కాని ప్రయత్నించాలి. సాధన చెయ్యాలి. చిన్ని చిన్ని వాక్యాలు, సూటి వాక్యాలు, తేట వాక్యాలు రాయడం మన ద్వితీయ నైజంగా మారిపోవాలి.

2. యాక్టివ్ వాయిస్ లో రాయండి.

యాక్టివ్ వాయిస్ లో అంటే సకర్మక ప్రయోగంతో రాయడం వాక్యానికి గతిశీలత తీసుకొస్తుంది. అకర్మక ప్రయోగం, ఇంకా సూటిగా చెప్పాలంటే ‘బడు’ ప్రయోగం తెలుగుకి ఎంత మాత్రం శోభించేది కాదు. ‘ఆ ప్రాంగణం చక్కగా అలంకరించబడింది ‘అని రాయడం వ్యాకరణరీత్యా సమ్మతమేమోగాని, వినడానికి మాత్రం చాలా కటువుగా ఉంటుంది. ‘ఆ ప్రాంగణాన్ని చక్కగా అలంకరించారు’ అనడంలో అందం మాత్రమే కాదు, సౌలభ్యం కూడా ఉంది.

3. చూపించండి, చెప్పకండి

మనం ఏమి చెప్పదలుచుకున్నా దాన్ని వివరించకూడదు, చూపించాలి అనే మాట హెమింగ్వే సూత్రాల్లో ప్రధానమైందే అయినా, దాన్ని చెప్పినవాళ్ళల్లో ఆయనే మొదటివాడు కాడు. పాశ్చాత్య ప్రపంచంలో అందరికన్నా ముందు అరిస్టాటిలు ఈ మాట చెప్పాడు. Plot is character revealed by action అని ఆయన చెప్పిన మాట సుప్రసిద్ధం. మన కథకులు తమ పాత్రల్ని చాలా వివరంగా వర్ణిస్తారు. పరిసరాల్ని వర్ణిస్తారు. వాళ్ళ పాత్రలు ధారాళంగా మాట్లాడుతుంటాయి. చాలాసార్లు పాత్రలు మాటాడేదానికీ, కథలో వారి చేతలకీ మధ్య పొంతన ఉండదు. కొన్నిసార్లు విరుద్ధంగా కూడా ఉంటుంది. పాత్రలు మాటాడకుండా వాటి ప్రవర్తన ద్వారా వాటి స్వభావాన్ని కథకుడు చెప్పడానికి ప్రయత్నిస్తే చాలాసార్లు పాఠకుడికి దాన్నెలా అర్థం చేసుకోవాలో తెలియదు కూడా. కానీ ఒక కథని మనం  మళ్ళీ మళ్ళీ చదవాలనుకుంటే, దానిలో పైపైన కథనాన్ని దాటి లోతైన పరిశీలనలు తప్పకుండా ఉండితీరాలి. అలా చెయ్యడానికి కథకుడు ‘చెప్పకూడదు’, ‘చూపించాలి.’

4. తర్వాత ఏమి జరగబోతోందో మీకు తెలిసినప్పుడు రాయకండి, కొంతసేపు ఆగండి

హెమింగ్వే అనుభవం మీంచి తెచ్చుకున్న మెలకువ ఇది. ఆయన చెప్పేదేమంటే, మనం రాసుకుంటూ పోతున్నప్పుడు, కథలోగాని, సంభాషణల్లోగాని, కథాక్రమంలోగాని తర్వాత ఏమి జరగబోతోందో మనకి తెలిసినప్పుడు, రాయకండి, ఒక్క క్షణం ఆగండి అని అంటున్నాడు. దానివల్ల మనం మన వ్యక్తచైతన్యంలోంచే రాస్తూపోకుండా, మన అవ్యక్తమానసానికి కూడా పని చెప్తాం అంటాడు. అలా ఆగినప్పుడు మనలో ఉన్న దాహం చల్లారిపోకుండా మన సృజనశక్తులు సజీవంగా నిలబడతాయంటాడు.

5. ఒక్కటేనా యథార్థ వాక్యం రాయండి

మనం ఏదన్నా రాస్తున్నప్పుడు అందులో ఒక్కటేనా యథార్థవాక్యం రాయాలంటాడు. అంటే కవితావాక్యం కాదు, తెలివిగా రాయడం కాదు, మన ఆగ్రహాన్నో, ఆవేదననో, సంతోషాన్నో, అసమ్మతినో ఏదో ఒకటి ఉపన్యాసధోరణిలో రాసుకుంటూ పోవడం కాదు. ఒక్క వాక్యం. ఉన్నది ఉన్నట్టుగా, నువ్వు చూసింది చూసినట్టుగా, నీకు అనుభవంలోకి వచ్చిందేదో కనీసం ఒక్క వాక్యమేనా ఉండాలంటాడు. ఇది తెలుగు రచయితలకి, ముఖ్యంగా పత్రికా సంపాదకులకి ఔషధం లాంటి వాక్యం. మన పత్రికా సంపాదకీయాలు చూడండి. మన సంపాదకులు తాము రాసేది ఎంత కవితాత్మకంగా రాస్తే అంత శక్తిమంతంగా రాసేమని అనుకుంటూ ఉంటారు. కాని అక్కడ కావలసింది కవిత్వం కాదు, ఉన్న నిజాల్ని నిర్భయంగా, నిస్సంకోచంగా చెప్పడం.

6. రాసిందాన్ని నిర్మొహమాటంగా ఎడిట్ చేసుకోండి.

కాకిపిల్ల కాకికి ముద్దు. ప్రతి రచయితకీ తాను రాసిన ప్రతి ఒక్క వాక్యం మీదా ఎంతో ముద్దు ఉండటం సహజం. పూర్వపు రోజుల్లో దాన్ని పత్రికాసంపాదకులు క్షుణ్ణంగా పరిశీలించి అవసరం లేని భాగాల్ని ఎడిట్ చేసేవారు. ఇప్పుడు అలా ఎడిట్ చేస్తే రచయితలు ఊరుకోరు. లేదా ఎవరేనా సంపాదకులు ఎడిట్ చేస్తున్నా, వాళ్ళు క్షుణ్ణంగా చదివి ఎడిట్ చేస్తున్నారనీ చెప్పలేం. దీనికి పరిష్కారం ఒక్కటే. రచయితనే తన రచనల్ని ఎడిట్ చేసుకోవడం. ఈ సోషల్ మీడియా యుగంలో తన ఇష్టాయిష్టాల్ని అదుపు చేసుకోవలసిన అవసరం లేకుండానే, తానేది రాస్తే దాన్ని ప్రజామాధ్యమాల్లో పెట్టే అవకాశం ఏర్పడ్డాక, ఎడిట్ చేసుకోవడం అనే మాట విడ్డూరంగా ఉంటుంది. కాని ఒక వాక్యం ప్రజాస్మృతిలోకి ప్రవహించాలంటే, అది చుట్టూ ఉన్న సమాజాన్ని ఎంతో కొంత ఆరోగ్యవంతంగా ప్రభావితం చెయ్యాలంటే, ఎడిటింగ్ తప్పనిసరి.

7. క్రియాపదాలు ప్రభావశీలంగా ఉండాలి

మనం వాక్యాల్లో ప్రయోగించే క్రియాపదాలు బలంగా ఉండాలి అనేది మరో సూత్రం. ఉదాహరణకి సుప్రసిద్ధమైన ఈ హెమింగ్వే వాక్యం చూడండి:

There is nothing to writing. All you do is sit down at a typewriter and bleed.

ఇది కవిత్వం కాదు. కాని ఈ వాక్యంలో మనం ఊహించలేనంత శక్తి పుడుతూ ఉండటానికి కారణం ఆ bleed  అనే క్రియాపదం. మనం ఏది రాసినా, మన క్రియాపదాలు అలా మన ఒంట్లోంచి, మన రక్తమాంసాల్లోంచి పుట్టుకొచ్చేవిగా ఉండాలంటాడు.

8. విశేషణాలూ, క్రియావిశేషణాలూ వదిలిపెట్టండి.

ఒక్కొక్క జాతిని ఒక్కొక్కరకమైన అస్వస్థత పీడిస్తూ ఉంటుందనుకుంటే తెలుగు రచయితల్ని పీడించే జబ్బు ఇది. మనం ఏమి రాసినా విశేషణాలూ, క్రియావిశేషణాలూ ఉపయోగించకుండా రాయలేం. దానికి కారణం మన క్రియాపదాలు దుర్బలంగా ఉండటమే. ‘అతడు నవ్వాడు’ అంటే సరిపోతుంది. ‘అతడు గట్టిగా నవ్వాడు’, ‘అతడు పేలవంగా నవ్వాడు’, ‘అతడు నీరసంగా నవ్వాడు’- ఈ వాక్యాలన్నీ నీరసవాక్యాలే. అసలు ‘ఒక గొప్ప ‘అనే ప్రయోగం చెయ్యని తెలుగురచయితగానీ, కవిగానీ, వక్తగానీ మీకెప్పుడేనా కనబడ్డారా? ఈ ‘ఒకగొప్ప’ అనేదానికన్నా అర్థంలేని పదం మరొకటి లేదనిచెప్పవచ్చు. తాను దేన్ని వివరించబోతున్నాడో దానిగురించి ఆ రచయిత ఒక్క క్షణం కూడా ఆగి ఆలోచించనప్పుడే ‘ఒక గొప్ప’ అనే విశేషణం వాడతాడు.

9. సంభాషణలు రాస్తే నాటకరచయితలాగా రాయండి

మన కథల్లో పాత్రలు ఏమి మాట్లాడినా ఉపన్యాసాలు ఇస్తుంటాయి. లేదా ఏదో ఒకటి వివరించడానికి ప్రయత్నిస్తుంటాయి. మన సినిమాల్లో సంభాషణలు చూడండి. అవి బొమ్మలు మాట్లాడుకుంటున్నట్టు ఉంటాయి. కాని ఒక రచయిత తన కథలో ఒక సంభాషణ రాస్తే అది ఒక నాటకంలో సంభాషణలాగా అంత శక్తిమంతంగా ఉండాలి. వాళ్ళ భావాల్ని ఆ సంభాషణలు దృశ్యమానం చెయ్యాలి. అంతే కాదు, మన సంభాషణల్లో ఉండే విరుపులు, నొక్కులు, ముక్కలముక్కల మాటలు, తునిగిపోయే వాక్యాలు- నిజజీవితసంభాషణల్లో ఉండే బిగువంతా అక్కడి రావాలి. అప్పుడే దాన్ని మనం వ్యావహారిక భాష అనగలుగుతాం.

10. బాధ గురించీ, నొప్పి గురించీ స్పష్టంగా రాయండి

హెమింగ్వే శైలిలోని ఈ లక్షణం గురించి రాస్తూ ఒక విమర్శకుడు  He didn’t explain emotions. He exposed them  అని అన్నాడు. మన రచయితలు కథల్లో ఏదేనా బాధనో, దుఃఖాన్నో, భరించలేని వేదననో చెప్పాలనుకున్నప్పుడు ఆ పాత్రలతో ఉపన్యాసాలిప్పిస్తారు. కాని అక్కడ చెయ్యవలసిన పని వీలైనంత స్పష్టంగా, అవసరమైతే కటువుగానైనా సరే, ఆ బాధని బాధగా చెప్పడం. అలా రాయడం మామూలు విద్య కాదు. ఆ పాత్రకి కలిగిన కష్టం రచయిత తనకి కలిగిన కష్టంగా అనుభవంలోకి తీసుకుంటే తప్ప అలా రాయలేడు.

11. మీ పాత్రల గురించి తీర్పులివ్వకండి

ప్రతి ఒక్క రచయితా జీవితకాలం సాధన చెయ్యవలసిన సూత్రం ఇది. ఇటువంటి సూత్రం వల్లనే మపాసా, చెహోవ్, ఓ హెన్రీ వంటి కథకులు ఇప్పటికీ ప్రభావశీలంగా ఉన్నారు. దానర్థం రచయితకి ఒక దృక్పథం ఉండకూడదని కాదు. అతడు మంచిచెడ్డల్లో మంచివైపు నిలబడకూడదని కాదు. తప్పకుండా నిలబడాలి. అది రచయిత ప్రాథమిక కర్తవ్యం. కాని దానికి పైన రాసిన మూడో సూత్రం పాటించాలి. ‘చెప్పకండి, చూపించండి’ అంటే, రచయిత తాను చెప్పకుండా పాఠకుడే స్వయంగా మంచిచెడ్డల్లో మంచిని ఎంచుకునేటట్టు చెయ్యగలగాలి. టాల్ స్టాయి ‘విందు తర్వాత’ కథలో చేసిందదే. As a writer, you should not judge, you should understand అంటాడు హెమింగ్వే.

ఇవీ పదకొండు సూత్రాలు. కొంతమంది పదమూడు సూత్రాలు కూడా లెక్కేసారు. కాని కొంతమంది వీటన్నిటినీ నాలుగు సూత్రాలకి కుదించారు. అవి:

1. చిన్న వాక్యాలు రాయండి.

2. మీ మొదటి పేరాగ్రాఫు చిన్నదిగా ఉండేలా చూసుకోండి.

3. Use Vigorous English. ఇక్కడ vigor అంటే ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది. ఒకాయన దీన్ని వివరిస్తూ ఒక మాటన్నాడు: Making each word count అని. నిజం. ప్రతి ఒక్క పదం ఆచితూచి రాయాలి. తెలుగులో, చాసోలాగా.

4. Be positive, not negative. ఈ వాక్యం వ్యక్తిత్వ వికాసం గురించి కాదు. మనం ఏది రాసినా, అక్కడ ఏది ఉందో దాని గురించి రాయాలి. అక్కడ ఏది లేదో దాని గురించి కాదు. నువ్వు ఏమి చెప్పదలుచుకున్నావో దాన్ని సూటిగా చెప్పు. ముందూ వెనకా ఉపోద్ఘాతాలూ, అనవసరమైన వ్యాఖ్యలూ, వ్యంగ్యమూ, కామెంటరీ అక్కర్లేదని దాని భావం.

హెమింగ్వే ఈ శైలినెట్లా సొంతం చేసుకోగలిగాడు? కింగ్ జేమ్స్ బైబిలు బాగా చదివినందువల్లనా అని ఒకాయన అడిగాడు. కాదు, దీర్ఘకాలం పాత్రికేయుడిగా, మరీ ముఖ్యంగా ఫీల్డునుంచి వార్తలు పంపవలసిన పాత్రికేయుడిగా పనిచేసినందువల్ల. ఎందుకంటే నువ్వు పంపే వార్తల్లో ప్రతి ఒక్క పదానికీ లెక్క ఉంటుంది. ఖర్చవుతుంది. కాబట్టి every word counts. ఇప్పుడు ఏమి రాసినా ఖర్చు లేదుకాబట్టి ఎంతేనా రాసుకుంటూ పోతున్నాం. కాని పాఠకుడు తన టైము ఖర్చుపెట్టడానికి ఇష్టపడడని మర్చిపోతున్నాం.

అందుకని పైన చెప్పిన పదకొండు సూత్రాలూ అంతిమంగా ఒకటే సూత్రం : Make each word count.

28-7-2025

6 Replies to “హెమింగ్వే సూత్రాలు”

  1. అన్నీ బాగున్నాయి. నేను కవిత్వానికి కూడా అన్వయించి చూసుకున్నాను.

    పొట్టి వాక్యాలు…రాయడం సరే, మాట్లాడేటప్పుడు కూడా నా ఊహకు అందవు 😁

    ముందు నేను మితభాషిని అయి, తర్వాత ప్రయత్నం మొదలెట్టాలి. ❤️❤️

  2. హెమ్మింగ్వే రచనాశైలి సూత్రాలు తెలుగులో ఇంత అర్థమయ్యేలా ఎవరైనా విశదీకరించడం నేను ఇంతవరకూ చూడలేదు, చదవలేదు. ధన్యవాదాలు భద్రుడు గారు. పొట్టి వాక్యాలు.. గట్టి వాక్యాలు రాయడం నాకు చాలా కష్టం.. ఇప్పటినుంచి నేను ఏది రాసినా ఈ సూత్రాలు పాటించడానికి కాన్షియస్ గా ప్రయత్నించాలి.

  3. నిజమే.. సార్ .. మీరు ఉదహరించిన సూత్రాలు అక్షరాలా సాహితీ వేత్తలు అందరూ చదివి నేర్చుకోవలసిన విషయాలు .. కానీ చాలా  వరకు కవులు , రచయితలు ఏ ప్రక్రియ అసలు ఎలా రాయాలో తెలియకుండానే మహా కవులు అయిపోయారు .. లేదా ఎంత రాసినా రాసి లో తప్ప వాసికెక్కరు . అదృష్టం కొద్దీ వాసికెక్కినా నిత్యం నవ్వులపాలు అవుతూనే ఉంటారు ..నాకు తెలిసీ సమయం చాలా విలువైంది అని తెలుసుకోకపోవడమే ఇందుకు ప్రధాన కారణం . తీరా తెలుసుకునేసరికి జీవించడానికి సమయమే అయిపోతుంది .. ఇటీవల ఒక స్నేహితుడు కవిత్వం ,కానీ కథ కానీ ఇలా రాయాలి అని చెప్పకూడదు … ఎవరికీ ఎలా రాయాలనిపిస్తే అలా రాస్తారు .. ఏ ప్రక్రియ అయినా ఇలా రాయాలి ఇలా ఉండాలి అనే విషయాలు చర్చించకూడదు అన్నాడు . భిన్న భావాలు ఎక్కడైనా ఉండటం సహజమే .. కానీ నేను మాత్రం సమయాన్ని చాలా కోల్పోయాననే ఒప్పుకుంటాను. మీరు ఉదహరించిన ప్రతి విషయం ఒక పదేళ్ల క్రితం నేనెందుకు చూడలేదు అనుకుంటాను … 

    1. ఈ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు. రాయటానికి ఏ నియమాలూ లేవనీ, ఏ నిబంధనలూ అక్కర్లేదని ప్రతి రచయితకీ రచనలు మొదలుపెట్టిన మొదట్లో అనిపిస్తుంది. సహజం. కానీ కాలం గడిచే కొద్దీ పాఠకులు కొన్ని రచనలు మాత్రమే ఎందుకు పదేపదే చదువుతారో, చాలా రచనలు అసలు ఎందుకు చదవరో, అర్థం కాకపోయే కొద్దీ ఇలాంటి నియమనిబంధనలవైపు చూపు సారించడం మొదలుపెడతారు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading