అదెలా సాధ్యపడుతుంది?

తాడికొండ స్కూలు పూర్వవిద్యార్థులం కొంతమందిమి మొన్న ఒక ఆన్-లైను గోష్ఠిలో పాల్గొన్నాం. ఆ సంభాషణ గురించి మరోసారి వివరంగా రాస్తాను. కాని ఆ సందర్భంగా ఒక మిత్రుడు అడిగిన ప్రశ్న నన్ను నివ్వెరపరిచింది.

అతడు మేము స్కూల్లో ఉన్నప్పటి ఒక సంఘటన నాకు గుర్తుచేసాడు. అప్పట్లో మా స్కూలు ఉపాధ్యాయుల్లో ఇద్దరు దంపతులు కూడా ఉండేవారు. వాళ్ళంటే పిల్లలకి చాలా ఇష్టంగా ఉండేది. వారిని ఉన్నట్టుండి ఒకరోజు మా ప్రిన్సిపాలుగారు రిపాట్రియేటు చేసేసారు. ఆమె నిర్ణయాన్ని వెనక్కి తీసుకొమ్మని పిల్లలం కొందరం నిరాహారదీక్ష చేసామట. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినవాళ్ళల్లో నేనే ముందున్నానట. కాని మేం రెండురోజులు అన్నం తినడం మానేసినా, మా ప్రిన్సిపాలుగారు మమ్మల్నెట్లానో కన్వీన్సు చేసారేగాని, తన నిర్ణయం వెనక్కి తీసుకోలేదట. ఈ విషయం గుర్తు చేస్తూ ఆ మిత్రుడు, ఆ సంఘటన గురించి నన్ను మరింత వివరంగా చెప్పమని అడిగాడు.

ఆశ్చర్యం! నాకు ఆ సంఘటన ఏమీ గుర్తులేదు. అతడు ఆ సంగతి చెప్తున్నంతసేపూ నా జ్ఞాపకాల్ని తవ్వుకుని చూస్తూనే ఉన్నానుగానీ, చిన్నపాటి ఆనవాలు కూడా కనిపించలేదు. బహుశా అతడు పొరపడ్డాడేమో అనుకుందామనుకుంటే, అతడి జ్ఞాపకాలైతే చాలా స్పష్టంగా ఉన్నాయి.

నేను మళ్ళీ మళ్ళీ నా సబ్-కాన్షస్, అన్-కాన్షస్ మెమొరిని కూడా తట్టిలేపడానికి ప్రయత్నించాను. ఉహుఁ. నాకేమీ గుర్తులేదు. మా స్కూలు గురించిన ఏ చిన్ని సంఘటన కూడా మర్చిపోని నేను అంత ముఖ్యమైన సంఘటన ఎలా మర్చిపోయేను? మా ప్రిన్సిపాలుగారి నిర్ణయం పట్ల నిరసన ప్రకటించడమంటే చిన్న విషయం కాదే! కానీ నాకేమీ గుర్తులేదు. ఆ ఫైలు నా మెమొరీలోంచి ఎప్పుడో డిలీటు అయిపోయినట్టుంది.

ఆ మీటింగు అయిపోయాక, ఆ విషయం గురించి ఆలోచిస్తే, చెప్పొద్దూ, నాకు చాలా సంతోషమనిపించింది. దాదాపు యాభై ఏళ్ళ కిందటి సంఘటన. అత్యంత అప్రియమైన సంఘటన. అది నా వ్యక్త, అవ్యక్త స్మృతిలోంచి తొలగిపోవడం నాకు చాలా ఊరటగా అనిపించింది. మనిషి జీవించి ఉండగా ముక్తి లభించడమంటే ఇదే. నువ్వు నడిచి వచ్చిన దారుల్లో పోగేసుకుంటూ వచ్చిన దుమ్ము, నువ్వింకా ఆ దారిలో ఉండగానే రాలి పోతూ ఉండటం. కొన్నాళ్ళు గడిచాక, అసలటువంటి దుమ్ము నీ మీద పడ్డట్టు నీకు గుర్తే లేకపోవడం.

సమకాలిక మనస్తత్వ శాస్త్రం ఇటువంటి వాటి గురించి ఏమి చెప్తున్నదో నాకు తెలియదుగాని, నేను చదివినంతవరకూ, ఫ్రాయిడియను సైకాలజీ ప్రకారం ఆ అప్రియమైన జ్ఞాపకాలు ఎక్కడికీ పోవనీ, అవి నెమ్మదిగా మన అన్-కాన్షస్ చేతనలోకి అణగిపోయి, మనకి తెలియని విధంగా మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయనీ చదివాను. కాని యూంగ్ చెప్పినదాని ప్రకారం అన్-కాన్షస్ చేతన అనేది నిజానికి కలెక్టివ్-కాన్షస్ నెస్ అనీ, అది వ్యక్తి, సామూహిక చేతనలో భాగమయ్యే తావు అనీ కూడా చదివాను. కానీ ఈ రెండు సిద్ధాంతాల ప్రకారం చూసినా, ఒక మనిషి తన అప్రియమైన జ్ఞాపకాన్ని సంపూర్తిగా మర్చిపోయేడంటే, అది ఆ వ్యక్తికి మాత్రమే విడుదల కాదు, ఆ మేరకు సామూహిక చేతనకి కూడా విడుదలే.

మనల్ని బాధించిన మనుషులూ, మనం బాధించిన మనుషులూ, మనం ఇతరుల్ని నొప్పించిన ఘటనలూ, మనల్ని ఇతరులు నొప్పించిన ఘటనలూ అవి గడిచిపోయిన కొన్నేళ్ళ దాకా కూడా గుర్తొస్తూనే ఉంటాయి. ఆ తర్వాత జ్ఞాపకాల్లోంచి తప్పుకుని కలల్లో ప్రత్యక్షమవుతుంటాయి. కొన్నాళ్ళకు కలల్లోంచి కూడా తప్పుకుంటాయి.

అప్రియమైనవే కాదు, అసలు చాలా జీవితానుభవాలు బయట ముగిసేక కూడా ఆ నాయిస్ మన కలల్ని వెంటాడుతూనే ఉంటుంది. నేను నా ఉద్యోగజీవితం నుంచి బయటికొచ్చి మూడేళ్ళు దాటినా కూడా కలల్లో ఇంకా ఉద్యోగం చేస్తూనే ఉన్నాను. ఏవో మీటింగులు, రివ్యూలు, ఆదేశాలు, చర్చలు, వాదోపవాదాలు- కాకపోతే, ఒకటే తేడా- కలల్లో నా ఉద్యోగ జీవితపు సహచరులతో పాటు ఫేస్ బుక్కు ఫ్రెండ్సు కూడా కనబడుతుంటారు. వాళ్ళు మా ఆఫీసుకు వచ్చినట్టూ, మేమేదో మాట్లాడుకుంటున్నట్టూ.

కాని, అప్రియమైనవే కాదు, ప్రియమైనవి కూడా నా జ్ఞాపకాల్లోంచి తొలగిపోవాలి. జీవితానుభవాలు మెలకువలోనే కాదు, నిద్రలో కూడా సద్దుమణగాలి. అదెలా సాధ్యపడుతుంది? ధ్యానం వల్లనా? మనసుని శూన్యం చెయ్యడం వల్లనా? లేక రంగుల్తోనో, రాగాల్తోనో మనసుని ముంచితేల్చడం వల్లనా? తొలగిపోవాలి. ఈ లోకం నుంచి సెలవు తీసుకునే క్షణం వచ్చేటప్పటికి మనం, మన జ్ఞాపకాల్నే కాదు, చివరికి మన కాలికంటుకున్న దుమ్ము కూడా ఇక్కడే దులిపేసి పోగలగాలి.

14-7-2025

14 Replies to “అదెలా సాధ్యపడుతుంది?”

  1. అచేతన అనుభవాల ప్రభావం వ్యక్తి ప్రవర్తన పైన ఉంటుంది అనే విషయాన్ని సమ్మోహనం పద్దతి అనుసరించి నిజమని ఫ్రాయిడ్ నిరూపించాడు సార్! ఆసక్తికరమైన అనుప్రయుక్త విషయం చెప్పారు. ధన్యవాదములు సార్

  2. This is amazing sir!
    “ఒక మనిషి తన అప్రియమైన జ్ఞాపకాన్ని సంపూర్ణంగా మర్చిపోయేడంటే, అది ఆ వ్యక్తికి మాత్రమే విడుదల కాదు, ఆ మేరకు సామూహిక చేతనకి కూడా విడుదలే.”

    But, as you yourself asked “అదెలా సాధ్యపడుతుంది? ధ్యానం వల్లనా? మనసుని శూన్యం చెయ్యడం వల్లనా? లేక రంగుల్తోనో, రాగాల్తోనో మనసుని ముంచితేల్చడం వల్లనా?” is that really possible?

    Probably a very unrelated, but I was reminded of this one moment from my recent past.
    I had gone to a place of wilderness. ఆ దట్టమైన అడవిలో, ఆ మహావృక్షాల కింద, కళ్ళు నిండిపోయే పచ్చదనం మధ్య, where the only sound was bird song… in that one still moment, I suddenly realized how insignificant I was in this vastness. ఆ ఎరుక అంటారో ఏమంటారో తెలియదు కానీ ఆ క్షణం తెలియని ఒక తేలిక అనిపించింది. I think I experienced a sense of freedom from everything. There was nothing to bother about. Sustained experience కోసం ఏం చెయ్యాలో!! 😊

    1. చాలా అపురూపమైన అనుభవం లభించింది మీకు. మీరన్నట్లే దాన్ని కొనసాగించడం ఎలా!

  3. Beautiful sir. నండూరి శ్రీనివాస్ గారు ఒకసారెప్పుడో…యాదేవీ సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థితా…యాదేవీ సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థితా ..గురించి చెబుతూ…స్మృతి మరపు కూడా అమ్మవారి దయ, అందుకే గుర్తుండవల్సినవి గుర్తుండేలా చేయమనీ, మరచిపోవలసినవి మరపు పొరల్లోకి నెట్టమని ప్రార్థించుకోవాలని చెప్పారు.
    ఆ మరపు…అది కొన్ని క్షణాలైనా, గంటలైనా రోజులైనా జీవితకాలం గుర్తు రాకుండా పోవడమైనా, ఆ దయ ఏదో ఉండబట్టే జీవితంలో ఈ సంతోషం నిలబడిందని ఎప్పుడూ అనిపిస్తుంది. ఆ మాటలు విన్న ముహూర్త బలమో ఏమో కానీ ఎన్నోసార్లు నా ఉదయపు ప్రార్థనలో ఆ మాట వచ్చిపోతూనే ఉంటుంది.

    ప్రయత్నం ద్వారా ఎన్నో సాధించుకుంటాం. ఎన్నో పెంపొందించుకుంటూ ఉంటాం. ఈ రోజు తెల్లవారుజామున పోస్ట్ చదివితే మరీ అనిపించింది…ప్రయత్నం ద్వారా మరపు సిద్ధించదు కదా అని. ప్రయత్నం చేస్తే అదింకా బలమైన జ్ఞాపకమవడమే తప్ప ఫలమేముంది? అందుకని మీరన్నట్టు అంత కన్నా గొప్ప విడుదల ఇంకోటి ఉండదనే అనిపించింది. మీ మీద దయావర్షం ఏనాటి నుండో కురుస్తూ ఉందనడానికి ఇదొక చిన్న, అందమైన ఉదాహరణ అని కూడా.

    ఇది రాస్తుంటే ఇంకొకటి కూడా తోస్తోంది..బహుశా మీ ప్రయత్నం, దృష్టి ఎన్నడూ మరపు మీద లేవు. అవి బహుశా నేర్చుకోవలసిన, సాధించవలసిన వాటి మీద ఉండటం కూడా మిమ్మల్ని కాపాడి ఉండవచ్చు.

    Thank you again! ❤️

  4. విద్యార్థినిగా ఉన్నంతకాలం ఎన్నో గుర్తుంచుకోవడం, పునశ్చరణ చేసుకోవడం అలవాటైపోయి, దశాబ్దాలు గడచినా మారని ఆ అలవాటు వల్ల అనవసరమైనవెన్నో చేరి బుర్రలో తేనెటీగల రొద ఎక్కువైపోయింది. మీ టపా చదివాక మర్చిపోగలగడం కూడా సాధన చేయవలసిన అవసరమే అనిపిస్తోంది.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading