సంధ్యాసమస్యలు

మహాప్రస్థానంలో ఈ ‘సంధ్యాసమస్యలు’ (1939) చదవని వారుండరు. అయినా మరోసారి.

సంధ్యాసమస్యలు

ఆ సాయంత్రం…
రాక్సీలో నార్మా షేరర్‌,
బ్రాడ్వేలో కాంచనమాల!
ఎట కేగుటో సమస్య తగిలిం దొక విద్యార్థికి!

ఉడిపీ శ్రీకృష్ణవిలాన్‌లో-
అటు చూస్తే బాదం హల్వా,
ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ!
ఎంచుకొనే సమస్య కలిగిందొక ఉద్యోగికి!

ఆ సాయంత్రం… ఇటు చూస్తే అప్పులవాళ్లూ
అటు చూస్తే బిడ్డల ఆకలి!
ఉరిపోసుకు చనిపోవడమో,
సముద్రమున పడిపోవడమో
సమస్యగా ఘనీభవించిందొక సంసారికి!

ఈ కవిత నేను మొదటిసారి చదివి యాభై ఏళ్ళకు పై మాటే. మహాప్రస్థానంలో చదివిన వెంటనే నన్ను ఆకట్టుకున్న మొదటి కవితల్లో ఇది కూడా ఒకటి. కవికీ, పాఠకుడికీ మధ్య ఎటువంటి అడ్డుగోడలూ లేని కవిత ఇది. చదవగానే కవిత చిన్నపిల్లవాణ్ణి కూడా చలింపచేస్తుందనడానికి నా అనుభవమే నిరూపణ.

కానీ ఈ రోజు ఎందుకనో, ఏవో ఆలోచనల మధ్య, ఈ కవిత గుర్తొచ్చి, ఇన్నేళ్ళుగానూ ఈ కవితను అర్థం చేసుకోవలసినట్టే అర్థం చేసుకున్నానా అని అనుమానమొచ్చింది.

మొదటిసారి చదివినప్పుడు నాకు కలిగిన భావం ఏమిటంటే, ఒక సాయంకాలం, ఒక విద్యార్థికీ, ఒక ఉద్యోగికీ, ఒక సంసారికీ కలిగిన సమస్య దేన్నెంచుకోవాలని. మొదటి ఇద్దరి సమస్యా వినడానికి చాలా తేలిగ్గా అనిపించే సమస్య. నిజానికి సమస్య కానే కాదు. బతకడానికి సంబంధించిన రోజువారీ ఎంపికల గురించిన సమస్యలవి. కాని మూడవది నిజమైన సమస్య. బతకలేకపోవడానికి సంబంధించిన సమస్య. చావటానికి సంబంధించిన సమస్య. ఎలా చనిపోవాలో ఆ మార్గాన్ని ఎంచుకోడానికి సంబంధించిన సమస్య.

మొదటి రెండు సమస్యలూ మనం కూడా ఏదోలాగా ఎప్పుడో ఒకప్పుడు ఎదురుకునేవేకాబట్టి ఆ రెండు సమస్యల గురించీ చదవగానే మనకి తెలీకుండానే నవ్వొస్తుంది. ఇవి నిజంగానే సమస్యలేనా అనిపిస్తుంది. వీటినిలాగ కవితలాగా రాయవలసినంత సమస్యలా అని అనుకుంటూనే మూడో సమస్య చదివేటప్పటికి బిత్తరపోతాం. అది మనల్ని మనం ఊహించని షాకు కి గురిచేస్తుంది. నిజానికి ఆ మాటల్ని అర్థం చేసుకునేలోపే మన మనసుకి తిమ్మిరెక్కుతుంది. మనం నిరుత్తరులమైపోతాం.

గొప్ప కవి తానొక గంభీరమైన విషయాన్ని ప్రతిపాదించేముందు దానికన్నా తక్కువ గంభీరమైన విషయాల్ని ముందుచెప్పడం ద్వారా తాను తర్వాత చెప్పబోయే విషయాన్ని మరింత గంభీరం చెయ్యడం ఒక రచనాపద్ధతి. మహాప్రస్థానంలో ఇటువంటి తావులు మరికొన్ని ఉన్నాయి. ఉదాహరణకి,

అని అంటున్నప్పుడు రక్తం కన్నా కన్నీళ్ళు మరింత వేదనాకరమని చెప్పడం ఇలాంటిదే. కాని రక్తమూ, కన్నీళ్ళూ ఒక గాంభీర్యాన్ని ద్యోతకం చేయడంలో ఒకదానికొకటి తీసిపోనివే. అంతేకాదు, మామూలుగా మనం కన్నీళ్ళకన్న రక్తం ఎక్కువ భయకారకమని భావిస్తుంటాం. కవి ఆ వరసని తల్లకిందులు చేసి కన్నీళ్ళను రక్తంకన్నా మరింత విలువైన జీవనస్రావంగా మార్చేసాడు.

కాని ఈ కవితలో విద్యార్థి, ఉద్యోగి, సంసారి ఎదుర్కున్న సమస్యలు సమానగంభీరాలు కావు. ఆ రెండింటిలోనూ మొదటి రెండూ ఆ విద్యార్థినీ, ఉద్యోగినీ బాధించేది క్షణకాలంపాటు మాత్రమే. అవి నిజానికి బాధించేంత పెద్ద సమస్యలు కూడా కావు. చాలా అల్పమైనవేనని మనకి తెలుసు. కాని అంత అల్ప విషయాల్లో కూడా ఏదో ఒకటి ఎంచుకోవలసి రావడానికి మనం ఒకక్షణం ఆలోచించవలసి రావడమే అక్కడ విషాదం. కానీ మూడవ సమస్య అటువంటిది కాదు. అది నిజమైన సమస్య. అది ఏ దారిన చనిపోవాలన్న ఎంపికకి సంబంధించిన సమస్య కాదు. అసలు బతకడమా, మరణించడమా అన్న సమస్య. చనిపోవడం నిశ్చయమని తేల్చుకున్నాక ఆ సంసారి ఏ దారిన చనిపోవాలి అని ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ, ఆ తటపటాయింపులోనే, అతడికింకా జీవితం మీద ఆశపోనేలేదనే ధ్వని ఉందందులో.

ఇదీ, ఈ కవితను ఇన్నాళ్ళూ నేను అర్థం చేసుకున్న తీరు. కానీ ఇప్పుడు ఎందుకనో, హటాత్తుగా, ఈ కవిత నాకు కొత్త విషయాలు చెప్తున్నది.

అదేమంటే, ఆ ముగ్గురి సమస్యలూ ఆ ముగ్గురికీ సమస్యలేననీ. వాటిల్లో ఎక్కువ తక్కువలు పాఠకుడిగా మనం ఏర్పరచుకుంటున్నాం తప్ప, వాళ్ళు అలా అనుకోవడం లేదని! ఆ సమస్యలు ఎదుర్కొంటున్నవాళ్ళకి వాటి తీవ్రతలో, మూడూ ఎవరికి వారికి ఒక్కలాగే తీవ్రమైనవేనని! అంటే అటు అప్పులవాళ్ళనీ, ఇటు బిడ్డల ఆకలినీ ఎలా ఎదురుకోవాలో తెలియక ఉరిపోసుకు చనిపోదామా, సముద్రంలో పడిచనిపోదామా అని ఆ సంసారి క్షోభకు గురవుతున్న సమయంలోనే ఒక విద్యార్థి రాక్సీకి వెళ్ళాలా, బ్రాడ్వేకి వెళ్ళాలా తేల్చుకోలేకుండా ఉన్నాడు. ఒక ఉద్యోగి హోటల్లో బాదం హల్వా ఆర్డరు చేయాలా, సేమ్యా ఇడ్లీ ఆర్డరు చేయాలా తేల్చుకోలేకుండా ఉన్నాడు. ఒక సంసారికి ఎలా చావాలన్నది ఎంత జీవన్మరణ సమస్యనో, ఆ మొదటి ఇద్దరికీ ఆ క్షణాల్లో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా అంతే జీవన్మరణ సమస్యలన్నమాట!

ఇదీ ఈ కవితలో విషాదధ్వని. అంటే నీ తోటిమనిషి, జీవించడానికి చిన్నపాటి ఆశ కూడా చిక్కక, ఉరేసుకుని చనిపోతున్నప్పుడో లేదా సముద్రంలో దూకి చచ్చిపోతున్నప్పుడో, నీకు అతడి గురించి ఆలోచించే వ్యవధి లేదు. అసలు అటువంటి వాడొకడు ఉన్నాడనీ, వాణ్ణి జీవితం కాటువెయ్యడానికి పొంచి ఉందనీ నీకు ఊహక్కూడా రాదు. నీ సమస్య ఎంతసేపూ, ఈ సినిమాకి వెళ్లాలా, ఆ సినిమాకి వెళ్ళాలా, ఒటీటీలో ఈ ఛానలు చూడాలా, ఆ ఛానలు చూడాలా, స్నేహితుల్ని పార్టీకి పిలవాలంటే ఈ హోటలుకి వెళ్ళాలా, ఆ హోటలుకి వెళ్ళాలా, సాయంకాలం మీటింగుకి ఈ చొక్కా వేసుకు వెళ్ళాలా, ఆ చీర కట్టుకు వెళ్ళాలా- ఎవరి సమస్యలు వాళ్ళవి, ఎవరి ఎంపికలు వాళ్ళవి, ఎవరి ఎంపికల తీవ్రత వాళ్ళది.

మనమిలాంటి సమస్యల్లో అతలాకుతలమవుతున్నప్పుడు – మరొకరెవరో, మనకి బొత్తిగా తెలీనివాళ్ళు కాదు, బాగా తెలిసినవాళ్ళే, మన మిత్రులే, మనతో కలిసి తిరిగినవాళ్ళే, ఎన్నోసార్లు కలిసి కబుర్లు చెప్పుకున్నవాళ్ళే, కలిసి నవ్వుకున్నవాళ్ళే, ఇప్పుడు, ఉరిపోసుకు చనిపోవాలా, సముద్రంలో పడిమరణించాలా తేల్చుకోలేకపోతున్నారు అని- ఎవరేనా ఒక దివ్యదృష్టితో తెలుసుకుని, మనకి చెప్పారే అనుకుందాం. అప్పుడేనా మనం మన సమస్యల్ని పక్కన పెట్టేస్తామా? లేదనుకుంటాను. పైగా అప్పుడు ఆ వార్త మనకొక కొత్త సంధ్యాసమస్యని సృష్టిస్తుంది. అతడు అలా చనిపోడం సముచితమా లేక చనిపోకుండా ఉండటం సముచితమా అని ఆలోచనలో పడతాం. అలా చనిపోకుండా ఉండటానికి అతడలా చేసి ఉంటే బావుండేదా లేక ఇలా చేసి ఉండే బావుండేదా అని మనతో మనమే వాదించుకుంటాం.

ఇన్నాళ్ళూ ఈ సంధ్యాసమస్యలు కవిత చదివినప్పుడల్లా నా హృదయం ఆ సంసారికోసం మూలిగేది. కాని ఇప్పుడు ఆ సంసారికన్నా కూడా ఆ విద్యార్థీ, ఆ ఉద్యోగీ మరింత పెద్ద విషాదంలో కూరుకుపోయేరనీ, ఆ సంసారి ఒకవేళ మరణిస్తే, మరణించి కూడా బతికిపోతాడేమోగానీ, ఆ విద్యార్థీ, ఆ ఉద్యోగీ మాత్రం జీవిస్తున్నట్టు కనబడుతున్నారేగాని, ఎప్పుడో మరణించేరనీ, మరణించినట్టు వాళ్ళకెప్పటికీ తెలీనేతెలీదనీ ఈ కవిత నాకు చెప్తూ నన్ను ఉలిక్కిపడేలా చేస్తున్నది.


Featured image: A doll hangs from a noose outside a dorm window on the campus of Mississippi State University in 1962 — an apparent protest against James Meredith, the first African American student admitted to the segregated University of Mississippi. 
Francis Miller/The LIFE Picture Collection/Getty Images and edition.cnn.com

5-7-2025

9 Replies to “సంధ్యాసమస్యలు”

  1. మీ విశ్లేషణ బాగున్నది సర్. ముఖ్యంగా కవి ఒక గంభీరమైన విషయం చెప్పాలనుకున్నపుడు తేలికైన ఉపమానాలు కొన్ని ప్రస్తావిస్తాడు అన్న చోట బాగా నచ్చింది. రాస్తూనే ఉన్నా రాసే వాక్యాలలోని కొత్త అర్ధం స్పురణకు వచ్చింది. మీ వ్యాసం వలన.🙏

  2. సంధ్యా సమస్యలు లో ఒక కొత్త అర్థం ఆవిష్కరించారు. చాలా కన్విన్సింగ్ గా అనిపిస్తోంది మీ కొత్త కోణం. Btw, with a remarkable coincidence I was listening to the radio on my drive today morning about James Meredith, the first African American student to have got admitted to the segregated University of Mississippi. In The Year We Both Were Born…

  3. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం ,
    నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం ( ఇదే ఇప్పటికికూడా జరుగుతోంది , జరుగబోతోఉంది , సమస్త సృష్టి రహస్యం ఏదైనా వుంది అంటే ఇదే , ఇంతకు మించిన నిజం లేదు )

    అలాగే , “నీవు పోతే ఎవరు బాధ పడ్డారు మిత్రం , ఏదో నేను ఇంకో నలుగురు మిత్రులు తప్ప అంటూ మా కాళ్లకు డెక్కలు మొలిచాయి, సారా దుఖాణాలు సజావుగా సాగుతున్నాయి ” అనే మాట 1930 లో చెప్పారు అంటే , మనం అనుకొనే ” గతమంతా బాగుండేది అనే మాట తప్పు ” ఎప్పుడు ఈలోకం కుళ్ళు ,కత్తులు , చంపుకోవడం లోనే వుంది , శాంతి ఎప్పుడు లేదు ………..శ్రీ శ్రీ గారి కవితలు నిజంగానే ఒక విప్లవం నిజాలు పలకడం లో అని నాకు అనిపిస్తుంది సార్

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading