దివ్యస్పర్శ

ఆషాఢమాసం మొదలయ్యింది. రెండు వారాలుగా నిలిచిపోయిన ఋతుపవన మేఘాలకి ఇవ్వాళ మళ్ళీ కదలిక వచ్చినట్టుంది. కాని ఇంకా మబ్బులు మరీ కారునలుపెక్కలేదు. అయినా భూమ్మీద చల్లనినీడ ఆవరించింది. తల్లి ప్రేమగా దగ్గరికి తీసుకున్నప్పుడు బిడ్డ కళ్ళు మూసుకున్నట్టు చెట్లు ఒక నిశ్శబ్దంలో ఒదిగి ఉన్నాయి. ఋతువులు మారేటప్పుడు మనకి కనిపించేది వట్టి అందం మాత్రమే కాదు. ఆకాశాన్నీ, భూమినీ కూడా తన బాహువుల్లోకి పొదువుకునే మహాస్తిత్వమేదో మనకి ఆ సమయాల్లో స్ఫురిస్తుందనుకుంటాను. దాన్ని చిత్రించాలనుకునే చిత్రకారులు కుంచెలు విదిలిస్తారు, గాయకులు స్వరాలు కూర్చుకుంటారు, కవులు పదాలు వెతుక్కుంటారు.

మనల్ని కూడా తనలో భాగం చేసుకున్న ఆ ఉనికినే మనం Being అనవచ్చునా? సచ్చిదానందమూర్తిగారు గొప్పమాటన్నారు. Man is the neighbour of Being అని. ఆ మాటవినగానే షిర్డిలో నిరంతరం ఒక ధునిని రగిలించుకుంటూ తదేకంగా ఆ జ్వాలనే కన్నార్పకుండా చూసే సాయిబాబా మదిలో మెదిలాడు. అరుణాచలపర్వతాన్నే చూస్తూ జీవితమంతా గడిపిన రమణమహర్షి గుర్తొచ్చాడు. తన చుట్టూ నిరంతరం మారుతున్న ప్రకృతిలో ప్రతి ఒక్క క్షణంలోనూ ఆ అస్తిత్వసౌందర్యాన్ని చూస్తూ ఎప్పటికప్పుడు ఆ వైనమంతా తన నోటుబుక్కులో రాసుకున్న కృష్ణమూర్తి గుర్తొచ్చాడు.

ఆ ఉనికి నీకు స్ఫురించడమే నిజమైన వార్త. తక్కినదంతా దుమ్ము. ఏదో ఒక క్షణకాలంపాటు స్ఫురించిపోయేదిగా కాకుండా ఆ ఉనికి గురించిన మెలకువ నిత్యం నీలో తెంపులేని ప్రజ్ఞానంగా కొనసాగడమెట్లా? ఇదుగో, నా ఎదట, Brother Roger of Taize Essential Writings (2006) ఉంది. మొన్న ఆ పుస్తకం నా చేతుల్లోకి వచ్చినప్పుడే మొదటిసారి ఆయన గురించి వినడం. ఆయన ముఖ్యమైన రచనల్లోంచి Marcello Fidanzio అనే ఆయన ఎంపికచేసిన వాటిల్లో బ్రదర్ రోజెర్  Journals నుంచి కూడా కొన్ని పేజీలున్నాయి. ఈ రెండు మూడు రోజులుగా ఆ వాక్యాలే నా మనసుని పట్టి వున్నాయి. ఎందరో ఆధ్యాత్మిక సాధకుల వలె, యోగులవలె, ఆ క్రైస్తవ సాధువుకి కూడా ఆ ఉనికిని గ్రహించగలిగాడనీ, ఆ వెలుగులోనే ఒక పూర్ణ జీవితం జీవించాడనీ ఆ వాక్యాలు సాక్ష్యమిస్తున్నాయి. అక్కడితో ఆగకుండా ఆయన్ని ఎవరు కలిసినా వారికి కూడా ఆ సత్యస్ఫురణ ఎంతో కొంత అందినట్టే, ఇప్పుడు, ఆ వాక్యాలు చదువుతున్న నాక్కూడా ఆ దివ్యస్పర్శ ఎంతో కొంత తాకుతూనే ఉంది.

బ్రదర్ రోజర్ గా ప్రసిద్ధి చెందిన Roger Schutz (1915-2005) పుట్టడంలో స్విజ్జర్లాండులో పుట్టినా, రెండవ ప్రపంచ యుద్ధకాలంలో నాజీలు ఫ్రాన్సుని ఆక్రమించినప్పుడు, ఆ యుద్ధబాధితులకి అండగా నిలబడటంకోసం Taize అనే ఒక సరిహద్దుగ్రామంలో నివాసం ఏర్పరచుకున్నాడు. 1940 నుంచి ఆజీవితం అరవయ్యేళ్ళకు పైగా అక్కడే ఉండిపోయాడు. మనిషికి ఆధ్యాత్మిక స్వస్థత చేకూర్చవలసిన క్రైస్తవులు వివిధ శాఖలపేరిట చీలిపోడం చూసి వారందరినీ ఒక ఉమ్మడి తాటిమీదకి తీసుకురావడం కోసం కృషి చేసాడు. శాఖలకి అతీతంగా చేసే అటువంటి ధార్మిక సేవని ecumenism అని అంటారు. ఆయన పిలుపు విని ఎన్నో దేశాలకు చెందిన ఎన్నో శాఖలకు చెందిన ఆధ్యాత్మిక సాధకులు అక్కడికొచ్చి ఆయనతో కలిసి పనిచేసారు. నిస్వార్థమైన, నిష్కల్మషమైన ఆ కృషిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వచ్చిన Pope John XXIII ఆయన్ని వీలైనన్ని సార్లు తనని కూడా వచ్చి కలుసుకొమ్మని అడుగుతూ ఉండేవాడట. 1960 లో బ్రదర్ రోజర్ ని మొదటిసారి చూసినప్పుడు Ah, Taize, that little springtime అని సంతోషంగా పలకరించాడట. ఆ తర్వాత ఆయన గురించి ఎవరు ప్రస్తావించినా  He is an open man, full of joy and spontaneity అనేవాడట. బ్రదర్ రోజర్ తాము చేస్తున్న కృషి గురించి చెప్పినప్పుడు చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయేవాడట.

ఒక మనిషి క్రైస్తవుడా, బౌద్ధుడా, సూఫీనా, శిక్ఖునా లేదంటే రామానుజకూటమికి చెందినవాడా అన్నదాంతో నాకు నిమిత్తం లేదు. మార్గాలేవైనా కావచ్చును, కానీ ఆ సాధకుడు ఆ ఉనికిని తన ఎరుకలోకి తెచ్చుకున్నవాడు అవునా కాదా అన్నదే నాకు ముఖ్యం. ‘కొందరిని చూడగానే కస్తూరి పరిమళం గుప్పుమంటుంది’ అని రూమీ అన్నట్టుగా, అటువంటి సత్యాన్ని దర్శించినవారిని మనం సులభంగా గుర్తుపట్టవచ్చును. మనమే కాదు, నిరక్షరాస్యులు కూడా గుర్తుపట్టగలరు వారిని. ‘అటువంటి వారికి ఒకటే గుర్తు. వారి సన్నిధిలో మన మనసు శాంతివహిస్తుంది’ అని అన్నారు రమణమహర్షి. అటువంటి వారి వాక్యాలు చదివినా, వారి మాటలు విన్నా కూడా శాంతి మనకి అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు బ్రదర్ రోజర్ రాసుకున్న జర్నళ్ళలోని వాక్యాలు చదువుతున్నప్పుడు అటువంటి శాంతినే నాక్కూడా అనుభవంలోకి వస్తున్నది.

ప్రపంచంలో తక్కిన చోట్లలానే మన దగ్గర కూడా మతానికీ, ఆధ్యాత్మికతకీ మధ్య సరిహద్దుల్ని గుర్తుపట్టేవాళ్ళు చాలా తక్కువ మంది. మతమంటే స్థిరీకరించబడ్డ ధ్యానం. ఒక ఆచారంగా మారిపోయిన ఆరాధన. విగ్రహంగా మారిపోయిన సన్నిధి. కాని ఆధ్యాత్మిక అంటే నిరంతరం జ్వలించే ఒక అన్వేషణ. తనకీ, తన చుట్టూ ఉన్న సర్వాస్తిత్వానికీ మధ్య నిరంతరం ఒక ఐక్యం కోసం మెలకువ. ఆధ్యాత్మికత ఒక నిరంతర నైతికోద్యమం. అటువంటి నిత్య చలన, జ్వలన శీలత్వంతో కూడిన యోగులకీ, ఋషులకీ భారతదేశం పుట్టినిల్లు అయినప్పటికీ, వారి ప్రత్యక్షానుభవాలు, దైనందిన జీవితానుభవాలూ నలుగురితోనూ పంచుకోవడం అరుదు. ఎవరన్నా ఒక ఎం. లాంటివారు రామకృష్ణ పరమహంస బోధామృతం రాసినట్టుగా, ఒక దేవరాజ మొదలియారు వంటివారు అనుదినము రమణులతో తమ అనుభవాల గురించి రాసినట్టుగా, ఒక కృష్ణమూర్తి నోటుబుక్కు రాసుకున్నట్టుగా, తక్కినవారి గురించి రాసేవారు ఎవరూ లేరు. వారి స్థానంలో మనకి బిగ్గరగా వినిపించేది పీఠాధిపతులూ, ప్రవచనకారులూ మాత్రమే. కాని నిజమైన ఆధ్యాత్మిక సాధకుడు ఆ మతాధిపతుల నుంచీ, ఆ టెలివిజను ప్రవచనకారులనుంచీ నేర్చుకోగలిగేదీ ఏమీ ఉండదు.

కాని క్రైస్తవమిస్టిక్కులూ, బౌద్ధ సాధువులూ ఇంకా తమ అనుభవాల్ని గ్రంథస్థం చేస్తూ ఉన్నందువల్ల వారి నుంచి మనం నేర్చుకునేది చాలానే ఉందనిపిస్తుంది. అలా గ్రంథస్థం చేయడం వారొక బాధ్యతగా భావించి మరీ చేస్తుంటారు. బ్రదర్ రోజర్ 60 ల నుంచీ తన రోజువారీ అనుభవాలనూ, insights నీ జర్నల్లో రాసిపెట్టుకుంటూ ఏడాదికో రెండేళ్ళకో ఒకసారి వాటిని పుస్తక రూపంగా వెలువరించేవారు. అందులో తన లోపలా, బయటా సాక్షాత్కరిస్తున్న ఈశ్వరవైభవంతో పాటు, తనని కలిసేవారిగురించీ, తనతో వారు చేసే సంభాషణల గురించీ, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నల గురించీ, తనకి స్ఫురిస్తున్న సమాధానల గురించీ రాసుకుంటూ వచ్చారు. అవి కూడా వైజ్ఞానిక సూత్రాల్లాంటివే. ఆధ్యాత్మిక విజ్ఞానానికి సంబంధించిన సూత్రాలవి.

ఉదాహరణకి 9-2-1970 నాడు ఆయన రాసుకున్న ఈ వాక్యాలు చూడండి:

ఇది, ఈ నిజాయితీ, ఈ స్పష్టత – నిరంతరం దైవంతో కలిసి జీవించాలనుకునేవాళ్ళకి మాత్రమే ఇలా చెప్పడం సాధ్యమవుతుంది.

ఇటువంటిదే మరొక అనుభవం 3-7-1970 నాటిది కూడా రాసుకున్నాడు. ఈ మాటలు చూడండి:

మన చుట్టూ ఉన్న సమాజంలో ఇటువంటి మాటలు మాట్లాడగలిగిన వారు ఎవరేనా ఉన్నారా? నిత్యం తన విశ్వాసాన్ని తాను బలపర్చుకోడానికే ప్రయత్నిస్తూనే ఉన్నాననీ, ఆ ప్రయాణంలో తన సందేహాలు తనని అడ్డగించలేవనీ చెప్పగలిగేవారున్నారా? మన సమాజంలో దైవం గురించీ, ఆధ్యాత్మిక సాధన గురించీ, విశ్వాసం గురించీ నలుగురితో పంచుకోలేని వాతావరణమే నెలకొని ఉంది. అది కూడా సైన్సు పేరు మీద. అలాగని బేసిక్ సైన్సుల్లో మానవాళి పురోభివృద్ధికి తోడ్పడే ఆవిష్కరణలు చేస్తున్న శాస్త్రవేత్తలైనా మన సమాజంలో పెరుగుతూ వస్తున్నారా? లేదు. మనం పరానికీ చెడ్డాం, ఇహానికీ చెడ్డాం.

తమమనసుల్లోపల, తమ ఆత్మల్లో ప్రతి రోజూ తలెత్తే సూక్ష్మ సంవేదనల్ని కదా మనం నలుగురితో పంచుకోవాలి! కవిత్వం అటువంటి ఒక ప్రక్రియనే కదా. కాని మన కవిత్వం కూడా ఈ పార్శ్వంలో చాలా బలహీనం. తనలోనూ, మనలోనూ కూడా ఒక ఆత్మిక యుగోదయాన్ని మేల్కొల్పగలిగిన కవులు ఈ రోజు తెలుగులో ఎంతమంది ఉన్నారు?

అటువంటి కవిత్వం రావాలంటే ముందు అటువంటి మెలకువ ఉండాలి. ఆ మెలకువ ఎప్పటికప్పుడు జారిపోకుండా చూసుకునే శ్రద్ధ కావాలి. 4-6-1971 నాడు బ్రదర్ రోజర్ రాసుకున్న ఈ వాక్యాలు చూడండి:

ఈ మాటలు చదువుతుంటే నాకేమనిపించిందంటే, ఇటువంటి స్ఫురణలు సాధారణ లౌకిక జీవితంలో కూరుకుపోయిన మనకి కూడా కలుగుతూనే ఉంటాయని. కాని మనం వాటిని గుర్తుపట్టం. మనలో ఉదయించే ఆ వెలుగుని పట్టించుకోకుండా మరెక్కడో వెతుక్కుంటూ ఉంటాం. కానీ ఇటువంటి పుస్తకాలు చదివినప్పుడు, అన్నిటికన్నా ముందు, మనలోని ఆధ్యాత్మికతకే మనం మరింత సన్నిహితంగా జరుగుతాం. 16-7-1973 నాటి ఈ వాక్యాలు చూడండి:

ఇప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళల్లో, ఎంత బలహీనంగా రాస్తున్నప్పటికీ, కవులు మాత్రమే ఇటువంటి మెలకువల్ని నమోదు చేస్తున్నారు. కాని వాళ్ళు తమలో ఉదయిస్తున్న ఈ వెలుగు బయటనుంచి వస్తున్నదని భావిస్తూ తమకి స్ఫూర్తికోసం వార్తాపత్రికలవేపూ, రోడ్లవేపూ చూస్తున్నారు. కాని తమ లోనే, తమ పక్కనే, తమని కలుస్తున్న ప్రతి మనిషిలోనూ ఈ విద్యుతుత్పత్తి అవుతున్నదని మర్చిపోతున్నారు. 26-4-1975 నాడు బ్రదర్ రోజర్ రాసుకున్న ఈ వాక్యాలు చూడండి:

ఇలా చాలా వాక్యాలు మీతో పంచుకోవాలని ఉంది. తైజ్ కి చెందిన బ్రదర్ రోజర్ రాసుకున్న ఈ జర్నళ్ళు చదువుతున్నప్పుడు అన్నిటికన్నా ముందు నాలో కలిగిన అనుభూతి నాకు నేను తేటపడటమే. దాన్నే మనం spirituality అని అంటాం. దాన్నే ఆయన 7-8-1978 న ఇలా ఒక్క వాక్యంలో రాసుకున్నాడు:

For whoever has learned to love, for whoever has learned to suffer, life is imbued with serene beauty.

26-6-2025, 26-6-2025

12 Replies to “దివ్యస్పర్శ”

  1. “బ్రదర్ రోజర్ రాసుకున్న ఈ జర్నళ్ళు చదువుతున్నప్పుడు అన్నిటికన్నా ముందు నాలో కలిగిన అనుభూతి నాకు నేను తేటపడటమే“
    🙏🏽🙏🏽🙏🏽

  2. చాలా గొప్ప వ్యక్తిని , అతని అద్భుతమైన ఆధ్యాత్మిక చింతనా భావాల్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు భద్రుడు గారు.
    ఈ వాక్యాలు “ఒక మనిషి ప్రేమించినప్పుడు, తనని తిరిగి ప్రేమిస్తున్నారో లేదో అన్న ఆలోచన లేకుండా ప్రేమిస్తున్నప్పుడల్లా సంతోషం మన పక్కనే ఉంది. అదే, తనని నలుగురూ ప్రేమిస్తున్నారని ఆ మనిషి అనుభూతి చెందినప్పుడు అతడికి కలిగే సంతోషం మాటల్లో చెప్పలేనిది..” కలిగించిన సంతోషం కూడా మాటల్లో చెప్పలేనిదే.

  3. ఈ చల్లని మబ్బులు ముసిరిన ఉదయం మీ హృదయాహ్లాదకర వాక్యాలు చదువుతుంటే
    ఎద తనిసిపోయింది. ఒక పుస్తకాన్ని చదవడం కాకుండా మనసుకెక్కించుకుని ఆ మనోల్లాసాన్ని
    చదువరులకు అందజేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య. ముప్పై అయిదేళ్ల వయసులో జిడ్డుకృష్ణమూర్తి చెప్పిన ఎరుక మళ్లీ స్ఫురించింది. రమణమహర్షి నువ్వెవరో ముొమదు తెలుసుకో అన్న విషయం గుర్తుకు వచ్చింది. వీరిని పరిచయం చేసిన మా అత్తగారి మేనమామ మా ఆవిడకు తాతయ్య జెకేను , రమణ మహర్షిని , రజనీష్ ను ప్రత్యక్షం గా చూసి వారి లెక్చర్స్ విని తరించిన వారు శుష్కాచారాలను నిర్ద్వంద్వంగా ఖండించిన నేనూ శాస్త్రి తాతయ్యగానే సంభాషించిన ఎం. వి.శాస్తి గారిని చాలా రోజుల తరువాత జ్ఞప్తికి చేసుకోగలిగాను.
    The whole world is in you . You only have the key to open that room అన్న జేకే మాటలు మనసులో బలంగా నాటుకున్నాయి.
    ఒకరోజు బిర్లా టెంపుల్ వెళితే అక్కడ ఒక వ్యక్తి సీరియస్ గా గోడకానుకుని పుస్తకం చదవడంలో లీనమైన దృశ్యాన్ని చూపి , see he is meditation. అన్నారు. మీ పోస్టు చివర్లో రోజర్ కొటేషన్ వెయ్యి ప్రవచనాల సారాంశం.ఎప్పుడూ తక్కువ రాయాలనుకుని వివశతలో ఎక్కువ రాస్తుంటాను. మంచి మార్గం చూపే వ్యక్తులు కరువైన ఈ రోజుల్లో మీరు మాకొక ఆధ్యాత్మిక దూత కావడం మా అదృష్టం
    నమస్సులు .

  4. Man is the neighbor of Being… ఎంత గొప్ప సత్యం… ఆ Being చుట్టూ రోజూ మనం ఎరుకతో చూడలేక, చూడాలని తోచక, కళ్మిలముందే కదిలిపోతున్న పరమాద్భుత దృశ్యాలూ, వాటి తాలూకు అలౌకిక అనుభూతులూ ఎన్నెన్నని… ఈ వాక్యం చదవగానే డైరీలో పొదువుకున్నా పదిలంగా..ఆ పరిమళం పోకుండా…
    రోజూ ఎక్కడెక్కడి మాధుర్యాన్నో మధుపంలా సేకరించి, మాకంతా రుచిచూపిస్తున్న మీ తపనకు 🙏🙏🙏
    శేషు దరూరి

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading