
31
దయ క్షమ శాంతి
దేవుడు నివసించే స్థలాలివి.
కరువు రోజుల్లో ఆకలిగొన్నవాడు
అన్నం దగ్గరికి పరిగెత్తినట్టు
తన కీర్తనలు పాడేచోటుకి
దేవుడు పరుగెత్తుకొస్తాడు.
తుకా అంటున్నాడు
ఆయన పేరెత్తినాచాలు
వచ్చి మనదగ్గరే ఉండిపోతాడు.
दया क्षमा शांति । तेथें देवाची वसति ॥१॥
पावे धांवोनियां घरा । राहे धरोनियां थारा ॥ध्रु.॥
कीर्तनाचे वाटे । बराडिया ऐसा लोटे ॥२॥
तुका म्हणे घडे । पूजा नामें देव जोडे ॥३॥ (1432)
32
ఎవరు దుఃఖితులో ఎవరు శోకితులో
వాళ్ళని తనవాళ్ళుగా భావించేవాడే
సాధుసత్పురుషుడు.
అతడిలో దేవుడున్నాడని తెలుసుకో.
నిలువెల్లా నవనీతం సజ్జనుడి చిత్తం.
ఎవరు అశక్తులో వాళ్ళని
తనవాళ్ళుగా చేరదీసుకుంటాడు.
తన పుత్రుడిపట్ల ఎలాంటి దయచూపిస్తాడో
తన సేవకుడిపట్లా అలానే నడుచుకుంటాడు.
అతడు రూపెత్తిన భగవంతుడని
ఎన్నిసార్లు చెప్పాలి అంటున్నాడు తుకా.
जें का रंजलें गांजलें । त्यासि म्हणे जो आपुलें ॥१॥
तोचि साधु ओळखावा । देव तेथें चि जाणावा ॥ध्रु.॥
मृदु सबाह्य नवनीत । तैसें सज्जनाचें चित्त ॥२॥
ज्यासि आपंगिता नाहीं । त्यासि घरी जो हृदयीं ॥३॥
दया करणें जें पुत्रासी । ते चि दासा आणि दासी ॥४॥
तुका म्हणे सांगूं किती । तोचि भगवंताची मूर्ती ॥५॥ (347)
33
అన్నీ వదులుకున్నవాణ్ణి ఏదీ అంటదు
అగ్నికీలలాగా అతణ్ణేదీ మలినపర్చదు.
నీళ్ళల్లో ఉన్నా ఏదీ అంటని కమలంలాగా
సత్యవాది ఈ ప్రపంచంలో జీవిస్తాడు.
పరోపకారి, ప్రాణులపట్ల దయాళువు
అతడు నిలువెల్లా ఆత్మస్థితివంతుడు.
ఎవరినీ విమర్శించడు, ఏ విమర్శా వినడు
అతడు ఈ లోకంలో నడయాడే జనార్దనుడు.
తుకా అంటున్నాడు ఈ సత్యం తెలియనివాళ్ళు
తాపత్రయాల్లో కూరుకుపోతూనే ఉంటారు.
सर्वस्वाचा त्याग तो सदा सोंवळा । न लिंपे विटाळा अग्नी जैसा ॥१॥
सत्यवादी करी संसार सकळ । अलिप्त कमळ जळीं जैसें ॥ध्रु.॥
घडे ज्या उपकार भूतांची दया । आत्मिस्थति तया अंगीं वसे ॥२॥
नो बोले गुणदोष नाइके जो कानीं । वर्तोनी तो जनीं जनार्दन ॥३॥
तुका म्हणे वर्म जाणितल्याविण । पावे करितां सीण सांडीमांडी ॥४॥ (1025)
34
మనసు స్థిరంగా ఉండనివాడు
ఎప్పుడూ అసహనమే-
అలాంటివాడు నాక్కనిపించకూడదు
వాడు నడపీనుగ.
వాడిమాటలనిండా మురికి
వాడు నోరెత్తితే అశుభం.
తుకా అంటున్నాడు
వాడికి మంచిమాట తెలియదు
మనుషులకోసం బతకడం తెలియదు.
सदा तळमळ । चित्ताचिये हळहळ ॥१॥
त्याचें दर्शन न व्हावें । शव असतां तो जिवे ॥ध्रु.॥
कुशब्दाची घाणी । अमंगळविली वाणी ॥२॥
नेणे शब्द पर । तुका म्हणे परउपकार ॥३॥ (58)
25-4-2025


ఉపనిషత్సారం ఉగ్గడించినట్లుంది🙏
అవును సార్! ఆయన నిజంగానే ఋషి.