మనిషి కోసం అన్వేషణ

పలమనేరు బాలాజీ రాసిన ఈ కవితలు చదువుతుంటే రెండేళ్ళ కిందట స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగినప్పటి రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు నేను చిత్తూరు జిల్లా ఎన్నికలకి రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున పరిశీలకుడికిగా వెళ్ళాను. బాలాజీ అప్పుడు వి.ఆర్‌.కోట మండలానికి ఎన్నికల అధికారిగా ఉన్నారు. అదికాక మరో మండలానికి కూడా ఆయన ఇంఛార్జిగా ఉన్నట్టు గుర్తు. నిమిషం కూడా విరామంలేకుండా ఆ ఎన్నికల్లో ఆయన అహర్నిశలు పనిచేయడం దగ్గరనుంచి చూసాను. రోజంతా ఎన్నికల ఏర్పాట్లు చూసుకుని సాయంకాలమయ్యాక ఆయన నన్ను పలమనేరు తీసుకువెళ్ళారు. అప్పుడు కూడా, రాత్రి తొమ్మిది దాటాక కూడా ఆయన ఎవరో అధికారులతో టెలి కాన్ఫరెన్సులో మాట్లాడుతూనే ఉన్నారు. ఉద్యోగమూ, బాధ్యతలూ, చుట్టూ ఉన్న సమాజమూ ఒక మనిషిని ఇంతగా ఆక్రమించుకున్నాక ఆయనకి కవిత్వం చదవడానికీ, రాయడానికీ సమయమెక్కడుంటుందా అనుకున్నాను. కాని, ఈ కవితలు చదువుతుంటే, బహుశా ఇటువంటి మనుషులకే కవిత్వం చాలా అవసరమని అనిపిస్తూండింది.

2
ఈ పుస్తకంలోని కవితలు అన్నిటికన్నా ముందు జీవించడం గురించిన కవితలు, జీవిస్తున్న స్ఫురణని అనుభూతిలోకి తెచ్చుకుని, బతుకుని మరింత ఫలప్రదం చేసుకోవాలనుకునే కవితలు.

ఇవి మనుషులకోసం తపిస్తున్న ఒక హృదయం చెప్పుకున్న మాటలు. కాలం గడిచిపోతూంటే, నిముషాలు, రోజులూ, సంవత్సరాలూ వేళ్ళ సందుల్లోంచి నీళ్ళల్లాగా జారిపోతుంటే, అన్నిటికన్నా ముందు సజీవమైన మనుషుల్తో కలిసి మాట్లాడుకునే జీవితం, ఆ సంభాషణ, ఆ అనుభూతి-వాటికోసం ఒక దాహార్తితో తపించిన కవితలు.

‘మనసుతో మాట్లాడటం’ ఇదీ మనం గుర్తుపెట్టుకోవలసిన మాట. ఎందుకంటే, ఈ రోజుల్లో ‘మోసకారితనంతో మాయచేయడమే మనిషితనం అయిన e-రోజులు’ అయిపోయాయి అంటాడు కవి. పొద్దుణ్ణుంచీ, రాత్రిదాకా తాను కూడా యాంత్రికంగా పనిచేస్తో, ఒక ఎలక్ట్రానిక్‌ పరికరంగా మారిపోతానేమో అనే వేదన ఈ కవిత్వానికి ఊటబుగ్గ. ఈ సమస్య కవిదే కాదు, భావుకుడైన ప్రతి ఒక్కరి ‘జీవుని వేదన’ కూడా.

అందుకని కవి తాను సజీవంగా స్పందించిన, ఊపిరి పీల్చిన, పలకరించిన, పలవరించిన ప్రతి క్షణాన్నీ ఎంతో పదిలంగా గుర్తుపెట్టుకున్నాడు. ప్రపంచంలో మనుషులంతా ‘అమ్మకందారులూ, కొనుగోలు దారులూ’ అనే రెండు వర్ణాలుగా, వర్గాలుగా, లింగాలుగా, దేశాలుగా మారిపోతున్న కాలంలో, ‘చిగురించే మనుషుల్ని’ వెతుక్కుంటున్నాడు. ఇలా అంటున్నాడు:

కాని అలాంటి మనుషులు అంత సులభంగా తారసపడరు కదా. అందుకే ఇలా అనుకుంటున్నాడు:

బాలాజీ అన్వేషణ మనుషుల గురించి. తనని తాను దర్శించుకోడానికీ, నిర్వచించుకోడానికీ మరొక మనిషి తప్పని సరి అని కవి నమ్మకం. ఈ మాటలు చూడండి:

టైలరు చొక్కా కుడుతున్నప్పుడు మిషనుసూదికి ఎక్కించిన దారం లోపలకి పోయి లోపలి దారాన్ని పైకి లాగినట్టు కవికి కనిపించే బయటి మనిషి అతణ్ణి స్పందింపచేసినప్పుడు అతడి లోపలి మనిషిని బయటికి తీసుకొస్తాడు. ఆ ఇద్దరూ ఒక్కలాంటి మనుషులే కావడం కవికి సంతోషాన్నిస్తుంది. తన లోపలి శిశువు సజీవంగా లేనప్పుడు మటుకే మనుషులు బయటి తనను తాను వెతుక్కుంటాడు అంటాడు కవి. ‘లోపలి శిశువును పోగొట్టుకున్న మనిషి లోచూపు లోపించిన మనిషి.’ అలాకాక, తనలోని శిశువిని కాపాడుకోగలిగినప్పుడు,

ఈ కవితలు బాలాజీ శిశుహృదయంతో రాసాడు కాబట్టే ఇందులో అధికభాగం కవితలు, అమ్మ గురించీ, తన పిల్లల అమ్మ గురించీ, తనకి అమ్మగా మారిన తన పిల్లల గురించీ ఉండటంలో ఆశ్చర్యం లేదు. స్త్రీల గురించీ, తనని కడుపులో పెట్టుకుని చూసుకున్న తన తల్లి, సహచరి, కూతురుల గురించి కవి మాట్లాడినప్పుడల్లా మన హృదయంలో కూడా ఒక తంత్రి మృదుమధురంగా మోగడం మనకి వినబడుతుంది.

ఇంత శక్తిమంతమైన కవితావాక్యాలు బహుశా నేనొకప్పుడు వాల్ట్‌ విట్మన్‌ లో మాత్రమే చూడగలిగాను.
కవిత్వం పూర్తిగా హృదయభాష అయినప్పుడు దానికి మరే అలంకారాలతోనూ పనిలేదు. అత్యంత స్వభావోక్తి అత్యంత కవితామయంగా వినిపిస్తుంది. చూడండి, ‘పాయసం’ అనే కవిత మొదలుపెడుతూనే మొదటివాక్యం-

చుట్టూ ఉన్న సమాజంలోనూ, తమ తమ జీవితాల్లోనూ మానవత్వాన్ని పునఃప్రతిష్టించాలంటే ఏమి చెయ్యాలి? ఈ కవి దృష్టిలో, చెయ్యవలసిందల్లా, తన లోపలి మనిషితో బయటి మనిషిని వెతుక్కోడమే. అటువంటి విద్య నేర్పడమే సాహిత్యప్రయోజనం, సాహిత్య సంస్కారం. ఈ వాక్యాలు చూడండి:

అలా సజీవంగా ఉన్న సంస్కారం కవిహృదయాన్ని అంటిపెట్టుకుని ఉందికాబట్టే, అతడిలా అంటున్నాడు:

కవికి స్పష్టంగా తెలుసు:

ఈ మెలకువతోనే అహరహం జీవిస్తున్నాడు కాబట్టే అతడి సుఖదుఃఖానుభవాల్తో మనం కూడా తాదాత్మ్యం చెందగలుగుతున్నాం. ఆదికవికి శోకం శ్లోకంలోకి పర్యవసించిందని మనకు తెలుసు. ఈ కవికి మౌనం కూడా శ్లోకంగా పరిణమించింది. చూడండి, ఈ మొత్తం సంపుటిలో అద్భుతమైన వాక్యాలు నాలుగు మాత్రమే ఎత్తి చూపమంటే నేనీ వాక్యాలవైపు చూపిస్తాను:

3

ఆ రాత్రి మేము పలమనేరు చేరుకునేటప్పటికి రాత్రి పదయ్యింది. వారిజ వేడి వేడి అన్నంలో సెనక్కాయల పచ్చడి కలిపి పెట్టింది. నా చెల్లెలు పెట్టిన ఆ అన్నం రుచి ఇప్పటికీ ఎంత తాజాగా అనిపిస్తున్నదో, ఈ కవితలు కలిగించిన స్ఫూర్తి కూడా ఎప్పటికీ అంతే తాజాగా ఉంటుందని చెప్పగలను.

8-11-2023

3 Replies to “మనిషి కోసం అన్వేషణ”

  1. చాలా ఏండ్ల క్రితం ఏనుగుల బెడద గురించి బాలాజీ గారు రాసిన కథొక దానిని విశ్లేషించిన గుర్తు. ప్రభుత్వాలు రచయితల కథలు చదివి సమాజాభివృద్ధికి తగిన చర్యలు గైకొనడానికి ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పరచాలని నేను రాసినగుర్తు. తరువాత అదే పలమనేరు బాలాజీ గారి జనప్రియ సాహిత్యం గురించి రాసిన వ్యాసానికి జవాబుగా ఒక వ్యాసం రాసి పోస్టు చేయకుండా ఇప్పటికీ నా పాత రాతల ఫైల్లో భద్రంగా ఉంది. అందులో మామూలు చదువరిని
    మంచి పాఠకుడిగా మార్చటంలో జనప్రియ సాహిత్యం పాత్ర గురించి చర్చించాను . వారి కథలు అప్పట్లో నాకు సామాజిక స్పృహ కలిగిన కొత్త ఆలోచనలతో రాసినవిగా అనిపించాయి. ఇప్పుడు మీరు పరిచయం చేస్తున్న కవితలు చదువుతుంటే
    మామూలు మాటల తోనే మామూలు విషయాలను స్పృశిస్తూ మంచి కవిత్వం ఎలా పుట్టించవచ్చో అవగతమౌతున్నది. నిరంతర సాహిత్య శ్వాస కలిగిన వారి, మానవీయ దృక్పథం కలిగిన వారి రచనలు తప్పక ఆదరణీయమౌతాయి. వారికి మీకు అభినందనలు.

  2. కవితలు ఇంకా చదవలేదు. సమీక్ష చదివాక
    కవితా వాక్యాలు చుట్టూరా పరిభరామిస్తున్నాయి. కవికి, సమీక్షకులు కి అభినందనలు

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading