
హైన్రిష్ ష్లీమన్ (1822-1890) ఒక్క జీవితకాలంలో అనేక అవతారాలెత్తాడు. మృత్యువు అంచులదాకా ఎన్నోసార్లు ప్రయాణించాడు. అలా వెళ్ళి వచ్చిన ప్రతిసారీ తన జీవితంలో మున్నెన్నడూ అధిరోహించని కొత్త శిఖరాలకు చేరుకుంటూనే ఉన్నాడు.
పుట్టింది పోలాండ్ సరిహద్దుల్లోని ఒక జర్మన్ కుగ్రామంలో. పెరిగింది రష్యాలో. దుర్భరమైన దారిద్ర్యాన్ని చవిచూసాడు. కాని కోట్లకు పడగలెత్తే వ్యాపారాలు చేసాడు. దాదాపుగా ప్రపంచమంతా పర్యటించాడు. ఇండియా, చైనా, జపాన్ లతో పాటు అమెరికా కూడా చూసాడు. కాలిఫోర్నియా గోల్డ్ రష్ లో తాను కూడా పాలుపంచుకున్నాడు. ప్రపంచమంతా ఒక వ్యాపారసామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. అహంభావి, పెత్తందారు, అబద్ధాలకు తక్కువేమీ లేదు. కానీ ఈ రోజు ప్రపంచం తన గురించి గౌరవంతో తలుచుకునేలాంటి విజయాలు కూడా సాధించి తన వారసత్వంగా వదిలిపెట్టి వెళ్ళాడు. వాటన్నిటిలోనూ తలమానికం అని చెప్పదగ్గది హోమర్ రాసిన ఇతిహాసాల్లో వర్ణించిన ట్రాయి నగరం ఆనవాళ్ళు వెతకడానికి చేసిన ప్రయత్నం.
కేవలం కవి కల్పన మాత్రమే అనుకున్న ఒక నగరాన్ని ఒక చారిత్రిక యథార్థంగా నమ్మి దాని ఉనికిని వెలికితియ్యడానికి అతడు చేసిన ప్రయత్నం అతణ్ణి తదనంతర కాలంలో మరెందరో పురాతత్త్వవేత్తలకి స్ఫూరిగా నిలబడింది. అది ఎల్లల్లేని స్ఫూర్తి. 1920 ప్రాంతాల్లో భారతదేశంలో అప్పటి బ్రిటిష్ ఆర్కియాలజిస్టులు సింధునాగరరిక అవశేషాల్ని తవ్వితీయడానికి హరప్పా, మొహెంజొదారోల్లో తవ్వకాలు చేపట్టడం వెనక, రామాయణంలోని లంక గురించి సంకాలియా మధ్యభారతదేశంలో అన్వేషణ చేపట్టడం వెనక ష్లీమన్ కూడా ఉన్నాడని చెప్పవచ్చు.
అటువంటి జీవితం గురించి తెలుగు పాఠకులు తెలుగులో చదివే అవకాశం రాగలదని నేనే కాదు, నిన్న ఆ పుస్తక ఆవిష్కరణ సభలో మాట్లాడిన మిత్రులు కూడా అనుకోలేదు. కాని కల్లూరి భాస్కరంగారి ఇటీవలి పుస్తకం ‘బహురూపుల వాడు’ ( అస్త్ర, 2024) ష్లీమన్ జీవితం, అతడి వ్యక్తిత్వం, అతడు చేసిన సాహసప్రయత్నాల సమాహారం.
నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్బులో ఆ పుస్తకాన్ని నలుగురికీ చూపించే అవకాశం నాకు లభించింది. ఆ పుస్తకం గురించి డా. గోవిందరాజు చక్రధర్, డా.విరించి విరివింటి, డా.బుసుసు శ్రీనివాసు లు ప్రసంగించారు. తాడి ప్రకాశ్ అధ్యక్షతన జరిగిన ఆ సమావేశంలో ఆ పుస్తకం గురించి నా అభిప్రాయాలు పంచుకునే అవకాశం కూడా నాకు లభించింది.
ఎక్కడో గ్రీసులో ఎప్పటిదో ఒక పౌరాణిక-చారిత్రిక నగరం ట్రాయి గురించి ఒక జర్మన్-అమెరికన్ పరిశోధకుడు చేసిన అన్వేషణ గురించి ఇప్పుడు, 2025 లో తెలుగువారికి తెలియచెప్పవలసిన అవసరం ఎందుక్కలిగింది?
దీనికి జవాబుగా భాస్కరంగారు పుస్తకం మొదట్లోనే ‘ష్లీమన్ గురించి ఎందుకు చదవాలంటారా?’ అని ఒక ముందుమాట రాసారు. అందులో ఆయన రెండు కారణాలు చెప్పారు. ఒకటి, అత్యంత ఆకర్షణీయమైన ఆ వ్యక్తిత్వం. పరస్పర వైరుధ్యాలతో నిండి ఉన్న ఆ జీవితకథలో ఊహించలేని మలుపులున్నాయి. భాస్కరంగారు ఆ కథ చెప్పిన పద్ధతిలో మనల్ని నిలవనివ్వని ఉత్కంఠ దానికి జోడయ్యింది. రెండో కారణం, ష్లీమన్ గొప్ప భాషావేత్త కావడం. ముఖ్యంగా మన సంస్కృత పండితుల్లాంటి భాషావేత్త కావడం, ఆయన జీవితకాలం ఆరాధించిన హోమర్ కీ, మన వ్యాసుడికీ మధ్య ఎన్నో పోలికలుండటం అని చెప్పుకున్నారు భాస్కరంగారు.
అయితే ఈ రెండింటికన్నా కూడా ముఖ్యమైన కారణం ఒకటుంది. దానివల్లనే భాస్కరంగారు ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే’ (2022) అనే ఉద్గ్రంథం రాసారు. ఇటీవలికాలంలో ‘ఇవీ మన మూలాలు’ (2023) అనే గ్రంథం వెలువరించారు. ఇప్పుడు రామాయణం మీద విస్తృత అధ్యయనం చేపట్టారు. గత పదేళ్ళుగా ఆయన చేపడుతూ వస్తున్న ఈ అధ్యయనాల వెనక ఒక తపన ఉంది.
గత పదిపదిహేనేళ్ళుగా, ముఖ్యంగా, 2010 తర్వాత, భారతదేశంలో సోషల్ మీడియా వ్యాప్తి చెందాక, భారతదేశ గతం గురించీ, చరిత్ర గురించీ నలుగురూ మాట్లాడుకోవడం మొదలయ్యాక, నెమ్మదిగా రెండుశిబిరాలు రూపొందుతుండటం మనం చూస్తున్నాం. ఒక శిబిరంవారి దృష్టిలో గతంలో భారతదేశంలో అత్యున్నత సంస్కృతి, నాగరికతలు వర్ధిల్లడమే కాదు, ఇక్కణ్ణుంచే సమస్త ప్రపంచానికి అవి వ్యాపించాయి. రాకెట్లు, విమానాలు, అస్త్రాలు మొదలుకుని పురాణాల్లో వర్ణించిన సైన్సుని తక్కినదేశాలు భారతదేశం నుంచి కొల్లగొట్టుకుని తమవిగా చెప్పుకుంటూ ఉన్నాయి.
ఇవన్నీ భారతదేశంలోనే పుట్టాయి. ఆర్యులు బయటి నుంచి రాలేదు, భారతదేశం నుంచే ప్రపంచ దేశాలకు పయనించారు, సంస్కృతం అన్ని భాషల్లోనూ గొప్పది, అది దేవ భాష- ఇటువంటి వాదనలన్నమాట. భారతదేశంలో వర్ధిల్లిన ఆర్యసంస్కృతి, వేదాలు, పురాణాలు ప్రశ్నించడానికి వీల్లేనంత పరిశుద్ధ పరిజ్ఞానం. వాటిని చారిత్రిక దృష్టిలో పరిశీలించాలని చెప్పడం పాశ్చాత్యదేశాలు భారత్ పురోగమనాన్ని అడ్డుకోడానికి చేస్తున్న రాజకీయ కుట్ర- ఇలా నడుస్తుంది ఆ శిబిరం వారి ఆలోచనలూ, వాదనలూను. ఈ ఆలోచనలు రాజకీయంగా ‘హిందుత్వ ‘ భావజాలంగా ఘనీభవించడం కూడా మనం చూస్తున్నాం.
మరొకవైపు ఈ భావజాలాన్ని ఖండించే వాదనలు కూడా మనం గమనిస్తున్నాం. కానీ చాలా సార్లు ఈ ఖండనచేసేవాళ్ళ అధ్యయనానికి ఉన్న పరిమితులవల్లా, వాళ్ళ సిద్ధాంతాలకు ఉన్న పరిమితుల వల్లా, వారు మొదటిశిబిరంవారి వాదనల్ని ఖండిస్తున్నప్పటికీ, ఆ ఖండనకి తగినంత బలం చాలడంలేదనేది నాలాంటి వాళ్ళు గమనిస్తున్న విషయం. మొదటి శిబిరం వారికి స్పష్టంగా ఒక ఎజెండా ఉంది, ఒక రాజకీయ ప్రయోజనం ఉంది. వాళ్లది గోబెల్స్ తరహా ప్రచారం. దాన్ని ఖండించడానికి కేవలం ఒక ఎజెండానో, ఒక రాజకీయ ప్రయోజనమో ఉంటే సరిపోదు. సత్యం కోసం నిలబడి, అవసరమైతే ఒంటరిగానైనా, పోరాటం చేయగల ఆత్మస్థైర్యం కావాలి, నిర్విరామమైన కృషి కావాలి. అన్నిటికన్నా ముందు చేయవలసింది భారతీయ సమాజానికి మూలకందాలుగా ఉన్న మూలగ్రంథాలను చదవడం, అధ్యయనం చేయడం, వాటిని ప్రపంచవ్యాప్తంగా వికసించిన వివిధ సామాజిక శాస్త్రాల నేపథ్యంలో తులనాత్మకం అధ్యయనం చేయడం.
ఒక ఉదాహరణ చెప్తాను. రాముడు పధ్నాలుగువేల ఏళ్ళు పరిపాలన చేసేడని నమ్మే వారొక శిబిరంగానూ, అసలు రాముడనే వాడే లేడనేవారు మరొక శిబిరంగానూ వాదించుకుంటున్న కాలంలో రాముడనే ఒక ఊహ, ఒక భావన, ఒక నామం, ఒక ఆకృతి, ఒక గాథ- నెమ్మదిగా ఒక ఉపఖండం మొత్తాన్ని ప్రభావితం చేసే స్థితికి ఎలా చేరుకున్నాయి, వాటి మూలాలు ఎక్కడున్నాయి, వాటి ప్రభావాలు ఎంతదాకా ఉన్నాయి అని అన్వేషించడం సముచితమైన పద్ధతి. రాముడు లేడని వాదించినంత మాత్రాన భారతీయ సమాజం మీద రాముడు నెరిపిన ప్రభావం అదృశ్యమైపోదు. లేదా రాముడు దేవుడని వాదించినంత మాత్రాన, ఈ దేశంలో కొన్ని వర్గాలు తమ ప్రయోజనాలు కాపాడుకోడం కోసం ఆ దేవుణ్ణి ఏ విధంగా చేజిక్కించుకున్నాయో, తద్వారా తక్కిన బలహీనవర్గాల మీద ఏ విధంగా అధిపత్యం నెరిపాయో ఆ వాస్తవాలూ అదృశ్యమైపోవు. ఇప్పుడు కావలసింది, ఈ రెండు శిబిరాలతో సంబంధం లేకుండా, అసలు సత్యమేదో తెలుసుకోవాలన్న తపన, అన్వేషణ, అకుంఠిత కృషీ మాత్రమే.
భాస్కరం గారు చేస్తున్నది సరిగ్గా ఈ పనే.
భారతదేశ ప్రాచీన చరిత్రను exclusivist ధోరణిలోనూ, isolationist ధోరణిలోనూ చదివి (చాలాసార్లు చదవకుండానూ) ఊహాజనితమైన కట్టుకథలను ప్రచారం చేసేవారికి ఎవరేనా చెప్పగల సమాధానం ‘వాస్తవాలు, మరిన్ని వాస్తవాలు’ అని మాత్రమే భాస్కరం గారు నమ్ముతారు. కాబట్టే ఆయన ఇండాలజి, ఆర్కియాలజి, ఆంత్రొపాలజి, ఫిలాలజి, మైథాలజి, కంపేరిటివ్ రిలీజియన్, తులనాత్మక సాహిత్యంతో సహా చివరికి జెనెటిక్స్ దాకా కూడా వివిధ రంగాల్లో అధ్యయనం చేసిన గొప్ప పండితుల రచనల్ని నిరంతరం అధ్యయనం చేస్తూ, ఆ వెలుగులో, భారతీయ గ్రంథాల్నీ, చరిత్రనీ ఎప్పటికప్పుడు పునఃపరిశీలిస్తూ ఉన్నారు.
ఇటువంటి కృషి చేపడుతున్నవాళ్ళు మరికొందరు ఉండవచ్చుగాని, వీళ్ళల్లో భాస్కరం గారు చేస్తున్న కృషిని నేను దగ్గరగా చూస్తున్నాను. ఆయన కూడా తాను కొత్త పుస్తకం వెలువరిస్తున్న ప్రతి సారీ, నన్ను కూడా ఆ వేడుకలో భాగస్వామిని చేస్తూనే ఉన్నారు. అలాగని నేను ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలన్నిటికీ మద్దతుదారునని కాదు. కాని అసలు ముందు అలాంటి ఒక వివేచన చెయ్యగల ఆ scientific method కి నేను అభిమానినని చెప్పుకోగలను.
ఇప్పుడు ఈ పుస్తకమే చూడండి. ఇది ష్లీమన్ అనే ఒక వ్యాపారవేత్త జీవితకథగా నన్ను ఆకర్షించలేదు. ష్లీమన్ అనే ఒక gold digger కథగా కూడా నన్ను ఆకర్షించలేదు. అన్నిటికన్నా ముందు ఇది ఒక బహుభాషావేత్త కథ. కేవలం భాషాపరిజ్ఞానంతో, ఆ పరిజ్ఞానానికి పదును పెట్టుకుంటూ ఒక బీద పచారీకొట్టు పనివాడు ప్రపంచస్థాయి వాణిజ్యవేత్త కాగలడని చూపించిన కథ. అంత మాత్రమే అయితే కూడా దీని గురించి మాట్లాడి ఉండేవాణ్ణి కాను. కాని తాను నేర్చుకున్న భాషలన్నిటిలోనూ గ్రీకు అతడికి అత్యంత అభిమాన భాష కావడం, తన జీవితమంతా తన సంభాషణలు, ఉత్తరప్రత్యుత్తరాలు, డైరీలు ప్రతి ఒక్కటీ ప్రాచీన గ్రీకులోనే రాసుకున్న ఒక ప్రాచీన గ్రీకు ప్రేమికుడి కథ ఇది. తన చిన్నప్పుడు తన తండ్రి ద్వారా విన్న ఇలియడ్, ఒడెస్సీ కథల్ని దాటి అతడు మానసికంగా ఒక్కరోజు కూడా ఒక్క అడుగు కూడా బయటికి రాలేదు. చివరిదాకా ఆ ప్రాచీన ఇతిహాసాల పట్ల ఆ వ్యామోహమే అతణ్ణి ఒక passionate పరిశోధకుడిగా మార్చింది. తన మొదటి వివాహం విఫలమయినప్పుడు మళ్ళీ పెళ్ళి చేసుకోడానికి అతడు వెతుక్కున్నది ఒక గ్రీకు వనితనే. ఆ పెళ్ళి చూపుల్లో ఏమి జరిగిందో భాస్కరం గారి మాటల్లో (పే.133) చూడండి:
కాసేపటికి సోఫియా వచ్చింది. తెల్లని దుస్తులు ధరించింది. జుట్టు రిబ్బన్ తో ముడేసుకుంది. గంభీరంగా ఉంది. అందరిముందూ వైనూ, కేకులూ ఉంచారు. సోఫియా తలవంచుకుని కూర్చుంది. ష్లీమన్ తన ప్రపంచయాత్రా విశేషాలను చక్కని గ్రీకులో చెప్పడం ప్రారంభించాడు.అతడు మధ్యలో సోఫియా వైపు తిరిగి ‘నీకు దూరప్రయాణాలు ఇష్టమేనా?’ అని అడిగాడు.
ఇష్టమేనని ఆమె చెప్పింది.
‘రోమన్ చక్రవర్తి హేడ్రియన్ ఏథెన్సును ఎప్పుడు సందర్శించాడు? ‘ అని అడిగాడు.
సోఫియా తేదీతో సహా టకీమని చెప్పింది.
‘హోమర్ పంక్తులు కొన్ని అప్పజెప్పగలవా?’ అని అడిగాడు.
గడగడా అప్పజెప్పింది. పరీక్ష నెగ్గింది.
ఇదే ఈ కథలో మనల్ని దగ్గరకు లాక్కునే అంశం. ష్లీమన్ అనే మనిషి పరస్పర వైరుధ్యాలతో కూడిన ఎన్నో దారుల్లో నడిచి ఉండవచ్చుగాక, కానీ అతనిలో పసితనం నుంచి చివరిదాకా కూడా ఈ గ్రీకుప్రేమనే అతడి జీవితానికొక పరమార్థాన్ని సంతరించింది.
ఈ సందర్భంగా భగవద్గీతలోని ఈ శ్లోకం (2:41)నాకు గుర్తొస్తున్నది. నిన్న నా ప్రసంగంలో కూడా ఈ శ్లోకాన్నే తలుచుకున్నాను:
వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో2వ్యవసాయినామ్
(ఏదైనా ఒక్క పనిలో నిమగ్నుడైనవాడి బుద్ధి ఒక్కతీరుగానే ఉంటుంది. కాని చాలాపనుల్లో సంచరించే బుద్ధి అనేకకొమ్మలుగా చీలినట్టుగా అంతూపొంతూ లేకుండా ఉంటుంది)
ష్లీమన్ జీవించిన జీవితం పైకి చూడటానికి అత్యంత అవ్యవసాయికం. అనేక దారుల్లో నడిచిన నడక. కాని ఆ బహురూపుల వెనక, ప్రాచీన గ్రీకు భాష పట్ల, హోమర్ పట్లా, ఆయన సృజించిన కావ్యప్రపంచం పట్లా అతడికున్న నిశ్చయాత్మకత అత్యంత దృఢంగా ఉంది కాబట్టే, తనతో తాను ఆడుకున్న జూదంలో అతడు గెలిచాడు, స్మరణీయుడయ్యాడు.
10-3-2025


Sir… How engaging the text.
A well-structured, insightful, and intellectually stimulating piece that bridges history, literature, and ideology compellingly…Sir. We are indebted to the quill and the fine ink on the canvas of your literary blog…solely yours!
Thank you so much!
ఇలాంటివి చదివినప్పుడు మీకు ఎంత రుణపడిపోతున్నానో అనుకుంటా.
ధన్యవాదాలండీ!
ధన్యవాదాలు మేడం
మీ ద్వారా అక్కడ లేనే అన్న దిగులు లేదు. ఆ పుస్తకం గురించినదంతా మీరు రాయడంతో ఆది చదవడంతో ఆ దిగులు పోయింది. ధన్యవాదాలు
ధన్యవాదాలు సార్
‘బహురూపులవాడు’ పుస్తకం చదవాలని ఎంతో ఆశక్తి కలిగించింది.,మీరు పుస్తకం గురించి, ప్లీమన్ బహుముఖ ప్రజ్ఞాశాలిని గురించి చదువుతుంటె ఎంతో సంతోషం కలిగింది. భాస్కరంగారికి చాలా ఋణపడివున్నాం. వారికీ, ఇంత సంక్షిప్తంగా మాకు అందజేసిన మీకూ మనఃపూర్వక అభినందనలు.
ధన్యవాదాలు మేడం