
నా మిత్రుడు వేణు చల్లా పక్షి ప్రేమికుడని మీకింతకు ముందే చెప్పాను. అమెరికావాసినే గాని కొన్నాళ్ళుగా హైదరాబాదులో ఉంటున్నాడు. తాను పక్షుల్నెలా ఫొటోలు తీస్తాడో ఇక్కడ ఉండగానే చూపించమని ఒకసారి అడిగాను. తెల్లవారుజామునే లేచి ఏ చెరువులదగ్గరికో, లేదా ఏ సముద్రపు ఒడ్డుకో లేదా ఏ అడవుల్లోకో పోయి పక్షుల్ని అతడు ఫొటోలు తీసే పద్ధతి చూడాలని చాలారోజులుగా ఉండింది. అందుకని వాళ్ళింటి దగ్గరే పక్షుల్ని చూపిస్తానంటే మొన్న పొద్దున్న వెళ్ళాను.
మణికొండ దగ్గర లాంకో హిల్సుకి ఇంతకుముందు కూడా వెళ్ళాను. అది పూర్తి జనారణ్యం. అక్కడ మనుషులు కనిపించడమే కష్టం. ఇంక పక్షులెక్కడ కనిపిస్తాయనుకున్నాను. నేను వెళ్ళేటప్పటికే కన్నెగంటి రామారావు కూడా వచ్చి ఉన్నాడు.
‘మరీ ఎక్కడో కాదు, ఇదుగో, ఇక్కడే, మా కాలనీలోనే ఒక చిన్న చెరువు ఉంది. అక్కడే చాలా పక్షులు కనిపిస్తాయి’ అన్నాడు వేణూ. ఇరవయ్యవ అంతస్థులో ఉన్న తన ఫ్లాటునుంచి కిందకి దారితీస్తూ. అతడితో పాటు, అతడి విజయాలవెనక ఉన్న అతడి సహచరి నాగేశ్వరి కూడా. నేనూ, రామారావూ వాళ్ళనే అనుసరించాం.
మేం నలుగురం ఆ లాంకో టవర్సు ఎదురుగా ఉన్న చెరువువైపు నడిచాం. దాన్ని చెరువు అనవచ్చునా? బహుశా ఒకప్పుడు అక్కడొక నీలి సరోవరం నిండుగా వెన్నెలనీ, వెలుగునీ రాత్రీ, పగలూ పట్టి ఉంచుతూ ఉండిఉండవచ్చు. కానీ ఇప్పుడు మానవుడు ఆ అందమైన లోకాన్ని ఎంతగా ఆక్రమించుకోవాలో అంతగానూ ఆక్రమించుకున్నాక, ఒక ఆనవాలుగా మాత్రమే దాన్ని మిగిల్చి పెట్టాడు. ఆ మిగిలిన చిన్నపాటి కుంటనిండా నాచు. కాబట్టి, అది చెరువు కాదు, ఒక నాచురంగు ఊహ అనుకోవాలి.
ఆ చెరువుకి మొదట్లోనే ఎల్లమ్మతల్లికొక గుడికట్టారు. ఆ గుడి కూడా లేకపోయుంటే, ఆ చెరువు దగ్గర మేం నాలుగడుగులు వేసేపాటి శుభ్రత కూడా మిగిలి ఉండేది కాదని అర్థమయింది, అక్కడ అడుగుపెట్టిన మొదటిక్షణాల్లోనే. గుడి వైపు ఒక్కజాగా శుభ్రంగా వదిలిపెట్టి తక్కినమూడువేపులా చెరువుని ఒక డంపు యార్డుగా మార్చడం మొదలుపెట్టేసారు. ఆ డంపులోనే తాను కొన్నాళ్ళ కింద ఒక కొండచిలువని కూడా చూసానని చెప్పాడు వేణు.
కాని కృశించిపోతూ, ఒక మురికి కూపంగా మారుతున్న ఆ చిన్నినీటి గుంటని నమ్ముకుని ఇంకా ఎంత పక్షి లోకం విహరిస్తూ ఉన్నదో వేణు కళ్ళతో చూస్తే తప్ప తెలియలేదు. ‘అదుగో చూడు దాన్నే పాండ్ హెరాన్ అంటారు. ఇదుగో, ఈ బైనాకులర్స్ తో చూడు’ అని చూపించాడు. ఆ వెనువెంటనే, ఒకటీ, ఒకటీ చొప్పున బ్రాంజ్ వింగెడ్ జకానా, కేటిల్ ఈగ్రెట్, గ్రీన్ బీ ఈటర్, రెడ్ వెంటెడ్ బుల్బుల్, స్వాలో, పర్పుల్ మూర్ హెన్ లతో పాటు ఇండియన్ మైనా, వైట్ థ్రోటెడ్ కింగ్ ఫిషర్, స్పాటెడ్ డోవ్, గ్రే హెరాన్, హూపీ, రెడ్ వాటెల్డ్ లాప్ వింగ్స్- ఎన్ని? మొత్తం 13 కదా, చూపించాడు.
నాకు ఆ పక్షుల్ని చూస్తుంటే ఒక స్లమ్‌లో అమ్మాయిల్ని చూసినట్టుంది. వాళ్ళుంటున్నది స్లమ్లోనేగానీ, అందరూ చక్కగా తయారై కాలేజికి వెళ్లడానికి సిటీబస్సు స్టాపు దగ్గర వేచి ఉన్నట్టుగా అనిపించింది.
‘నేను కెమేరా తేలేదు. పక్షుల్ని చూపిద్దామని తీసుకొచ్చాను. పక్షుల్ని ఫొటో తియ్యాలంటే అదొక శాస్త్రం. అదొక డిసిప్లిను. దానికి తగ్గట్టుగా డ్రెస్సూ, షూసూ ఉండాలి. అదొక మనఃస్థితి. ఒక అన్వేషణ’ అని అన్నాడు వేణు. అని తాను అంతకుముందు అక్కడ తీసిన పక్షుల ఫొటో ఆల్బం తన ఫోనులో చూపించాడు. ‘ఇక్కడికి ఇప్పటికి ఓ యాభై అరవై సార్లేనా వచ్చి ఉంటాను. పొద్దున్నే వచ్చి నా కెమేరా సిద్ధంగా పెట్టుకుని గంటల తరబడి వెయిట్ చేస్తూ ఉంటే, ఎప్పటికో ఒక పక్షి నాకు దగ్గరగా వస్తుంది. మనం దాని దగ్గరకు వెళ్ళడం కాదు’ అని అన్నాడు. అర్థమయింది. మనం కూడా ఆ హాబిటాట్ లో భాగమైపోవాలన్నమాట అని అనుకున్నాను.
మణికొండ దగ్గర వేణు తీసిన పక్షిపోటోలు ఈ ఆల్బములో చూడొచ్చు https://www.flickr.com/photos/venuchalla/albums/72177720310871913/with/53091620925
ఆ చెరువుచుట్టూ నడుస్తుంటే చాలా ఆలోచనలు కలుగుతూ ఉన్నాయిగాని, రెండు ఆలోచనల దగ్గర నా మనస్సు పదేపదే ఆగుతూ వచ్చింది. మొదటిది, ఆ టవర్సులో ఉన్నవాళ్ళు ఆ చెరువుని దత్తతతీసుకుని దాన్ని బాగుచేసుకోవచ్చుకదా అని. వాళ్ళ పిల్లలకే అదొక పక్షిపాఠశాలగా మారుతుందికదా అని. రెండోది, అయ్యో, నేను అడవుల్లో తిరుగుతున్నప్పుడు, ఈ స్నేహితుడు అక్కడికి వచ్చి ఉంటే ఎంత బాగుండేది కదా అని. తూర్పుకనుమల్లోనో లేదా మా రాజవొమ్మంగి పెద్దచెరువుదగ్గరో లేదా మా శరభవరం లొద్దులోనో ఈ పక్షిప్రేమికుడితో నడిచి ఉంటే ఎన్ని పక్షుల్ని పరిచయం చేసుకోగలిగి ఉండేవాణ్ణో కదా అని అనిపించింది.
‘ఇక్కడ మన దగ్గర ఆ కల్చర్ ఇంకా రాలేదు. అమెరికాలో బర్డ్ వాచింగ్ పెద్ద ఉద్యమం. The Big Year అనే సినిమా చూసావా?’ అనడిగాడు వేణు. లేదన్నాను. ‘చూడు. ఒక ఏడాదిలో ఎన్ని పక్షుల్ని చూడగలమనేదే వాళ్ళ తపన. కనీసం కొత్త పక్షి పేరు విన్నా కూడా వాళ్ళకి ఆ రోజు పండగే’ అని అన్నాడు.
నాకు కొన్నేళ్ళ కిందట ఋషీవేలీ పబ్లిక్ స్కూలుకి వెళ్ళినప్పటి ఒక జ్ఞాపకం గుర్తొచ్చింది. అక్కడ డైనింగు హాల్లో నోటీసు బోర్డుమీద ఒక ప్రకటన చూసాను. ‘ఈ ఆదివారం బర్డ్ వాచింగ్ కి రావాలనుకున్నవాళ్ళంతా ఫలానా సమయానికి ఫలానా చోట సమావేశమవ్వాలి’ అని రాసి ఉంది అందులో. అప్పటికి ఎన్నో ఏళ్ళ కిందటే నేను జిల్లాలనుంచి హెడ్డాఫీసుకి వచ్చేసాను. లేకపోయుంటే, ఇంకా జిల్లాల్లో పనిచేస్తూ ఉండి ఉంటే, ప్రతి ఆదివారం ఏదో ఒక ఆశ్రమపాఠశాలకో, గురుకుల పాఠశాలకో పోయి పిల్లల్తో కలిసి బర్డ్ వాచింగుకి పోతూ ఉండేవాణ్ణే అనడంలో సందేహం లేదు.
పక్షులు, చెట్లు, మూలికలు, శిలలు- ఎంత సుసంపన్నమైన ప్రపంచం మన పాఠశాలల చుట్టూ ఉంటుంది! కాని మన ఉపాధ్యాయులు నాలుగ్గోడల మధ్యా మూసి ఉన్న తరగతిగదుల్లోనే పుస్తకాలు చూస్తూ పిల్లలకు పాఠాలు చెప్తారు! అంతకన్నా విషాదం మరేముంటుందిగనుక!
నిన్ననే ఎక్కడో చదివాను, కలహారీ ఆదిమజాతివారు తమతో కలిసి జీవించిన ఒక యాంత్రొపాలజిస్టుని ఒకసారి అడిగారట: నీకు నక్షత్రాల చప్పుళ్ళు వినిపిస్తాయా అని. వినిపించవని చెప్తే వాళ్ళు నమ్మలేకపోయారట. అతడు తమతో హాస్యమాడుతున్నాడు అనుకున్నారట. థామస్ మన్ ఒక వ్యాసంలో రాసింది చదివినప్పుడు కూడా నేనిలానే నిశ్చేష్టుణ్ణయ్యాను. రెండుమూడు వందల ఏళ్ళ కిందటిదాకా కూడా నావికులకి పగటిపూట నక్షత్రాలు కనిపించేవట. ఆ చుక్కల జాడ పట్టుకునే వారు మహాసముద్రాల మీంచి ప్రయాణించగలిగేవారట.
తాను లేదా తన కుటుంబం, తన చిన్న సమాజం, తన తెగ, తన జాతి కాక ఈ ప్రపంచం, ఈ విశ్వం మరెంతో అపారమైనవని మనిషి తనకు తాను పదే పదే గుర్తుచేసుకుంటూ ఉండాలి. అది అతడికి వినయాన్నిస్తుంది. నాకు గాంధీగారంటే ఎందుకంత ఆరాధన అంటే, ఇటువంటి సున్నిత సంస్కారానికి ఆయన జీవితం పొడుగునా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. ఆయన్ని అరవై మూడేళ్ళ వయసులో యెరవాడ మందిరంలో నిర్బంధించినప్పుడు మహదేవ్ దేశాయి, పటేల్ కూడా ఆయనతో పాటే ఉన్నారు. వారు జైల్లో చేసిన అనేక పనుల్లో ఒకటి రాత్రిపూట నక్షత్రాల్ని గుర్తుపట్టడం!

మేం ఆ చెరువు దగ్గర గడిపినంతసేపు గడిపి దగ్గరలో ఒక రెస్టరెంటులో బ్రేక్ ఫాస్టుకి వెళ్ళాం. అలా వెళ్ళినవాళ్ళం దాదాపు పన్నెండుదాకా అక్కడే ఉండిపోయాం. చివరికి ఆ రెస్టరెంటు వాళ్ళు మాతో సున్నితంగా ఇక బయల్దేరండి అని చెప్పేదాకా. ఆ మూడు నాలుగ్గంటల పాటు వేణు, రామారావు, నాగేశ్వరిగారు మాట్లాడుకుంటూ ఉండగా వినడమే ఒక విద్య. వాళ్ళ మాటల్లో సహజంగానే ట్రంపు, ఎలాన్ మస్క్, ప్రపంచ రాజకీయాలు, వలసలు, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సు, రోబోలు, కాపిటల్, మార్క్సిజం లాంటి అంశాలు చర్చలో పదేపదే వినిపిస్తూ వచ్చాయి.
నిజమే, ప్రస్తుతం దాదాపుగా ప్రపంచమంతా పూర్తిగా కుడివైపు తిరుగుతూ ఉంది. ఒకప్పుడు ఇండస్ట్రియలైజేషన్ వల్ల కలోనియలిజం ఏర్పడి దానివల్ల ఆసియా ఆఫ్రికా ఖండాల్లో జాతీయవాదం తలెత్తి ఆ దేశాల్నీ, జాతుల్నీ విడుదల చేసింది. ఇప్పుడు గ్లోబలైజేషన్ పర్యవసానంగా పడమటి ప్రపంచంలో కొత్త రకం జాతీయవాదం మొదలైంది. ఇది ఆసియా ఆఫ్రికా దేశాల నుంచి పడమటి దేశాలకు వలసల్ని నిరోధించడం మీద దృష్టి పెట్టింది. ఆ దేశాల నమూనాలో ప్రపంచంలో తక్కిన దేశాలు కూడా గోడలు కట్టుకోవడం మొదలుపెట్టాయి. వారందరికీ ఒక నమూనా అమెరికా. ప్రస్తుతం అమెరికాని నడిపిస్తున్న రాజకీయ శక్తులు diversity, equity, inclusion ని ఎంత మాత్రం సహించేవిగా లేవనీ, అవి అమెరికన్ చరిత్రను తిరగరాసే క్రమంలో ఉన్నాయనీ మనకు తెలుస్తూనే ఉంది. మనం మన కళ్ళముందే మరొక హిట్లర్ తయారవడాన్ని చూస్తూన్నాము.
అదే సమయంలో, ఇక్కడ లాంకో టవర్సు దగ్గర మనిషి చేస్తున్న ఆక్రమణకీ, అక్కడ అమెరికాలో బలపడుతున్న వాదనకీ మధ్య తేడా లేదనిపించింది. ఉదాహరణకి ఇక్కడ ఈ చెరువుదగ్గర మనిషి ఏమనుకుంటున్నాడు? ఇది తన స్థలం అనుకుంటున్నాడు. ఇక్కడ తన కాక్రీటు ప్రపంచానికి తప్ప మరొక జీవికీ, మరొక జీవావరణానికీ చోటు అవసరం లేదనుకుంటున్నాడు. మనం మన చిన్నప్పుడే ఈ పశుపక్షివృక్ష ప్రపంచానికి దూరమైపోయాం కాబట్టి మన పిల్లల్నీ దూరంగా తీసుకొచ్చేసాం. కాని ఈ ప్రపంచం మనిషి ఒక్కడికోసమే కాదనీ, ఎంతో జీవవైవిధ్యంతో కూడిన లోకమంతటిలోనూ మనిషి కూడా తక్కినవాటిలానే ఒక ప్రాణిమాత్రమేననీ తెలియచెప్పి ఉంటే ఆ అందమైన చెరువు నేడొక మురికి గుంటగా మారిపోయి ఉండేది కాదు కదా!
వైవిధ్యం ఈ భూమి తాలూకు సత్యం, శ్రేయస్సూ, సౌందర్యం కూడా. వైవిధ్యాన్ని మనం భరించడం కాదు, ప్రేమించగలగాలి. ఒక పక్షిలాగా మరొక పక్షి ఉండకపోవడంలో, ఒక కూతలాగా మరొక కూత వినిపించకపోవడంలో ఎంత అపురూపమైన జీవవైవిధ్యం ప్రకాశిస్తున్నది! దీన్ని మనం పట్టించుకోడం మానేసాక, ఈ ప్రపంచం కేవలం మనిషి కోసమే అని నమ్మడం మొదలుపెట్టాక, ఆ మనుషుల్లో కూడా కేవలం అమెరికన్లకి మాత్రమే ఈ భూమ్మీద పూర్తి హక్కు ఉందని చెప్పుకోడానికి ఎంతసేపు పడుతుంది?
ఇంటికొచ్చాక The Big Year (2011) సినిమా చూసాను. అది పక్షి ప్రేమికుల కథ. వాళ్ళ మధ్య పోటీ, ఆ పోటీలో ముందునిలబడటం కోసం వాళ్ళు వాళ్ళ జీవితాల్లో చెల్లించవలసి వచ్చే మూల్యానికి సంబంధించిన కథ. ‘మనం అమెరికన్లం బర్డ్ వాచింగ్ ని కూడా పోటీగా మార్చేసుకుంటాం’ అంటాడొక పాత్ర అందులో. పర్వాలేదు, అమెరికన్లు పక్షుల్ని చూడటంలో యుక్రెయిన్ నీ, గాజానీ కనీసం కొంతసేపు మర్చిపోగలిగినా చాలు ప్రస్తుతం మనం మన భయాందోళనలనుంచి కొంతేనా ఉపశమనం పొందడానికి.
కానీ, మనం సత్వరమే మనకీ, మన పిల్లలకీ కూడా అలవాటు చేయవలసింది ఈ వ్యాపకాన్ని. ఈ మధ్య ఒక తెలుగు సినిమా చూసాను. అందులో ఒక చిన్నపిల్లవాడి పాత్రద్వారా అత్యంత అసభ్యకరమైన భాష చెప్పిస్తూ ఉంటాడు దర్శకుడు. ఆ పిల్లవాడు ఓటీటీ ఎక్కువ చూస్తుంటాడట, అందుకని అలా మాట్లాడుతున్నాడంటాడు దర్శకుడు. కానీ తాను కూడా తన సినిమాతో చేస్తున్నది అదే పని అని ఆ దర్శకుడికి తెలియలేదు. కాబట్టి మన పిల్లలు చూడవలసింది ఆ సినిమాతో సహా ఏ ఓటీటీనీ కాదు, ఇదుగో, ఇలాంటి పక్షుల్నీ , మొక్కల్నీ , చుక్కల్నీనూ. అప్పుడైనా ఈ ప్రపంచం మనకొక్కరికే కాదనే మెలకువ మొదలవుతుందనుకోవచ్చు.
Featured image: A watercolor after a photograph by Venu Challa
10-2-2025


అద్భుతమయిన విశ్లేషణ.మనుషులుగా సిగ్గుపడే పరిస్థితి.
ధన్యవాదాలు
అమీన్ పూర్ చెరువు దగ్గర కూడా చాలా రకాల వలస పక్షులు వస్తుంటాయి. ఒకసారి వెళ్లాను నేనూ. మా ఇంటి
పరిసరాలలో నే దాదాపు పధ్నాలుగు రకాల పిట్టలను చూస్తాం. అడపాదడపా పారడైజ్ ఫ్లై కాచర్ లాంటి పక్షులు కూడా.
Hyderabad Birding Pals అని ఫేస్బుక్ లో ఓ పేజి ఉందండీ. అందులో మా తమ్ముడు కూడా ఉన్నాడు.తను మంచి ఫోటోగ్రాఫర్. తనలా చాలా మంది ఉన్నారు వాళ్లంతా కలసి Birds of Telengana అనే పాకెట్ సైజ్ పుస్తకం తీసుకుని వచ్చారు ఈమధ్య. స్కూల్స్ లో పంచడానికి.
చాలా సంతోషం ఈ విషయాలు పంచుకున్నందుకు.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యోగ రీత్యా “ కొల్లేరు సరస్సు పరిరక్షణ కోసం కొన్ని నెలల కాలం ఆ సరస్సు లోనే నా ఉదయాస్తమయాలు గడిచేవి. ఇరు సంధ్యల మధ్య విరామంలేని విధి నిర్వహణ మనశ్శరీరాల్ని బిగబట్టి పిండేసేది.
(కొల్లేరు ఆపరేషన్ లో భాగంగా)
కానీ, ఆ యిరు సంధ్యల్లో సందడి చేసే వలస పక్షులు మనశ్శరీరాల్ని కడిగి తేలిక పరిచేవి. రంగు రంగుల విహంగాలు చేసే వింత వింత ధ్వనులబట్టి ఆ పక్షుల పేర్లు, వాటి ఆహార, విహార అలవాట్లు గురించి మిత్రుడు, అసిస్టెంటు కన్సర్వేటర్ “మోజెస్ జార్జ్” చెపుతూండేవారు.
నిజమే! ప్రపంచం మన వొక్కరిదే కాదు.
“పక్షులు ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా” అనేది కొల్లేటి ప్రజలు నినాదం! ఇది నేటికీ నా చెవుల్లో గింగురుమంటూనే వుంటుంది!
ఈ వ్యాసం పాక్షికంగా ప్రకృతి ప్రేమను, పాక్షికంగా మానవ సమాజంలో సాగుతున్న పరిణామాలను, అంతర్లీనంగా మన అభ్యాసాలపై చేస్తున్న విమర్శను కలగలిపిన భావోద్వేగ గాథ. రచయిత ఒక పక్షి ప్రేమికుడు అయిన మిత్రుడి సహచర్యంలో పక్షుల్ని వీక్షించేందుకు వెళ్ళిన అనుభవాన్ని వర్ణించడమే కాకుండా, ఆ అనుభవం ద్వారా తనలో కలిగిన సందేహాలను, ఆలోచనలను, ఆవేదనను అద్భుతంగా వ్యక్తీకరించాడు. చెరువుల మధ్య కొట్టుకుంటూ బతికే పక్షుల మీద ఆయన చూపిన ఆకర్షణ, వాటి జీవనవిధానాన్ని చూస్తూ మనుషుల లౌకిక జీవితానికి ఆయన చేసిన ఉపమానాలు చాలా హృదయస్పర్శిగా ఉన్నాయి. ఒక్క పక్షిని గమనించడం ద్వారా ప్రపంచ రాజకీయాలపై, సామాజిక వ్యవస్థలపై, విద్యాపద్ధతులపై, పిల్లలపై, మన సంస్కృతిలో వైవిధ్యాన్ని ఎలా చూచాలో ఆయన చేసిన వ్యాఖ్యానాలు ఆలోచనల్ని రేకెత్తించేలా ఉన్నాయి. భాష నెమ్మదిగా సాగుతూ, ప్రతి వాక్యంలో ఒక చిత్రాన్ని గీయ듯 వర్ణనలతో నిండిపోయింది. ఈ వ్యాసం పాఠకునిలో ఒక ప్రకృతి ప్రేమికుడిని మేల్కొలపగలదు, ఒక బహుళ సాంస్కృతిక చింతనాపరుణ్ణి తయారు చేయగలదు, తన పిల్లల భవిష్యత్తుపై బాధ్యతతో ఆలోచించగల తల్లిదండ్రుని మార్చగలదు. వ్యాసం చివర్లో వచ్చిన సందేశం — ఈ భూమి మనిషికోసమే కాదు, జీవవైవిధ్యం మన సమాజానికి అవసరమైన విలువ — అన్నదే ఈ రచన ప్రాణం.
శైలజా మిత్ర గారు! మీ స్పందన చాలా సమగ్రంగా, చాలా ఉత్తేజకరంగా, చాలా భావస్ఫోరకంగా ఉంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.