
బైరాగి రాసిన రాస్కల్నికోవ్ కవితకు భావార్థం ఇది. శుక్రవారం ఈ కవితమీద ప్రసంగించబోతున్నాను కాబట్టి ఈ భావార్థాన్ని ముందే చదువుకోడానికి వీలుగా ఇక్కడ పొందుపరుస్తున్నాను. మూల కవిత చూడాలనుకున్నవాళ్ళు సోమశేఖరరావు వాల్ మీద చూడవచ్చు.
ఈ కవితను బైరాగి వృషభగతి రగడలో రాసాడు. రగడ తెలుగు దేశి ఛందస్సు. అది అయిదు విధాలు. అందులో వృషభగతి రెండేసి పంక్తుల చొప్పున నడుస్తుంది. ప్రతి పంక్తిలోనూ 3+4, 3+4, 3+4, 3+4 మాత్రల అమరిక ఉంటుంది. ప్రతి రెండు పంక్తులకీ అంత్యప్రాస తప్పనిసరి. చూడండి:
గహన+మానస, కాన+నంలో, చిక్కు+తీవెల, తలపు+గుబురులు
సూర్య+రశ్ములు, సోక+వచ్చట, సడలు+ఆకుల, గాలి+కబురులు
తర్వాత రోజుల్లో గురజాడ రగడ పంక్తుల్లో మొదటి పంక్తిని రెండు పాదాలుగానూ, రెండవ పంక్తిని రెండు పాదాలుగానూ విరిచి, నాలుగవ పాదంలో 3+4, 3+4 కి బదులు సగం పాదంగా విడిచిపెట్టాడు. అంత్యప్రాసని తొలగించి, దానికి బదులు యతినీ, ప్రాసనీ ఐచ్ఛికంగా వాడుకుంటూ వచ్చాడు. చూడండి:
పట్ట+మేలే, రాజు+వైతే
పట్టు+నన్నిపు, డనుచు+కన్యక
చుట్టు+ముట్టిన, మంట+ లోనికి
మట్టి+తాజనియెన్
అదే ముత్యాలసరంగా ప్రసిద్ధి కెక్కింది. ఆయన దారిలో ముత్యాలసరంతో శ్రీశ్రీ మరెన్నో కొత్త ప్రయోగాలు చేసిన గేయాలు మహాప్రస్థానానికి బలం చేకూర్చాయి. గురజాడ, శ్రీశ్రీల ప్రయోగాల్ని పక్కనపెట్టి బైరాగి మళ్ళా పూర్వపు పద్ధతిలోనే రగడని ఎటువంటి మార్పులూ చెయ్యకుండా ఈ గీతంలో ఉపయోగించుకున్నాడు.
తోవ ఎక్కడ సోనియా ?
చొరబడటమే కష్టమైన అడవిలాంటి మనసులో చిక్కుపడ్డ తీగెల్లాగా తలపులు గుబురుగా పేరుకున్నాయి. ఇక్కడ సూర్యకాంతి సోకదు. ఆకులు సడలినప్పుడల్లా గాలి కబుర్లు వినిపిస్తాయి. ఎప్పుడూ అర్థరాత్రి చీకటి జడలు విప్పుకుని ఉండే అడవిలో, ఆకుపచ్చటి ప్రకృతి వదనంలో భీతి ప్రతిఫలించడం కూడా కనిపించదు. ఇది మొత్తం భ్రాంతితో కూడుకున్న చోటు. ఇక్కడ ఉండటానికి అంతా ఉంది కానీ ఏమీ లేదు.
ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. అది మానవమాత్రుల బుద్ధిహీనత. వివిధ సిద్ధాంతాల మధ్య నలుగులాట. ఒకదానితో ఒకటి పొసగని వైరుధ్యాల మధ్య ఒక కొట్లాట. ఇప్పటికే శాపానికి గురయి ఉన్న హృదయమనే నేలమీద ఎడతెగకుండా కురిసే నిప్పుల వాన. ఏది కారణం, ఏది ఫలితం అనే అంశాల మీద ఏ మాత్రం సారంలేని ఊకదంపుడు చర్చలు. గ్రహభేదాలు, వయోభేదాలమీద ఎంతసేపటికీ పెరుగుతూ పోతూ, ఎప్పటికీ తెగని చర్చలు. కంచెకవతల ఏముందో కూడా చూడలేని అస్థిరమతులకీ, చపలబుద్ధులకీ, ఎదుటిమనసుల్ని అర్థం చేసుకునే తీరుతెలియని వికలమతులకీ అంతరంగం ఒక చీకటిగుహ. వారి తెలివి ఊరికే తిరుగాడే గుడ్డిగుడ్లగూబ. వాళ్ళు వెతుకుతున్న కస్తూరిమృగం సువాసన దాని నాభినుంచి పుట్టేదే. ఇక్కడ వెలుగు లోపల ఉంటే బయటకి ఎలా కనబడుతుంది? అతడు నడిపేదే చీకటి గుర్రాల్ని కదా, మరి ఎందుకట్లా తొట్రుపడుతుంటాడు?
ఇంక బయట కూడా శూన్యమే. మహానగరమా పెద్ద పుట్టలాగా ఉంది. పెద్దదైన ప్రతి భవన గోపురమూ కూడా ఆకాశాన్ని ముద్దిడుతున్నదా అన్నంత పొడుగ్గా ఉంది. నగరంలోని రాజపథాలు రాక్షసుడి చేతిలో గీతల్లాగా ఉన్నాయి. సందుగొందుల్లో తాగుబోతుల వెకిలి పాటలు మార్మోగుతున్నాయి. జీవితమనే పాముకి వేయి నాలుకలు, లక్ష చీలికలూ, కోటి కోరలూనూ. తోవ తప్పిన మనిషి హృదయం ఇక్కడ ఎక్కడుంది? ఈ కళేబరమనే బీడుభూమిలో కండరాలే ఇసుకమిట్టలుగా ఉన్నాయి. మృత్యుస్పర్శని జయించిన జీవితమనే నది ఎక్కడుంది?
ఇక్కడ మనిషి తనలో తనే ఒంటరిగా ఉన్నాడు. చెప్పుకోలేని బాధల చీకటి గోతిలోనూ, బాధతో తాను పెడుతున్న కేకల ప్రతిధ్వనుల మధ్యా ఓదార్పుల ఉపశమనమెలా దొరుకుతుంది? కళ్ళముందు మంచు మసక. కలలనిండా కారుతున్న కన్నీటి ధారలు. నిద్రపోతున్న పసిపాప బుగ్గల మీద తడికట్టిన, ఆరని కన్నీటి చారికలు. ఇక్కడంతా ఏదో ఒకరకంగా బతకడమనే ఒక తిరునాళ నడుస్తున్న సందడి. ఈ గడబిడలో తల్లి ఎక్కడ? పిల్లవాడెక్కడ? మందలో ఇవి తప్పిపోయిన పశువులు. ఇక్కడ ఎవరు ఎవరికి సాయంచేయగలరు? ఒకరికొకరు అపరిచిత ముఖాలుగా ఉన్న ఈ అడవిలో వన్యమృగాల వికటాట్టహాసం విన బడుతున్నది. ఇక్కడంతా రొదపెడుతున్న ఎండుటాకులు విసిరిన భయపాశం. ఇక్కడ మేలుకోరేవాడెవడు? మనసుకి దగ్గరగా రాగలవాడెవడు? ఇక్కడ మనిషి తనలో తనే ఒంటరి. సదా సుళ్లు తిరిగే చీకటి నది వినిపించే చప్పుళ్ళ మనసనే లోతైన గోతిలో వెలుగులెక్కడుంటాయి సోనియా?
దెబ్బతిన్న పాముల్లాగా పెద్ద పెద్ద కెరటాలు కస్సుమంటూ బుసలు కొడుతుంటే, దిక్కులు కనుబొమలు ముడుస్తుండటం చూసి పెనుతుపానులు మూలుగుతున్నాయి. అడ్డుకట్టలు తెంచుకుని ఉప్పెన పరుగుపెడుతూ నురగలు కక్కుతోంది. ఇలాంటి పరిస్థితిలో తలదాచుకోడానికి నీడ ఎక్కడ దొరుకుతుంది? చిమ్మచీకట్ల కారాగారంలో లోకం భయపడిపోతూ ఉంది. విరగబడి తిరగబడుతున్న కెరటాల తాకిడికి కొట్టుకుపోతూ ఉన్న చిన్న దీవిలాగా ఉంది మనిషి హృదయం. కాటుకలాగా నల్లగా ఉన్న ఈ చీకటి గోతిని చీకట్లు కప్పేసాయి. మొత్తమంతా చిత్తడి. దిక్కు తోచడం లేదు. తనస్పర్శతో మట్టిని బంగారంగా మార్చగల ఆ పరసవేది, ఒక మహాసూర్యకిరణంలాంటి జీవితం, ఈ వైతరణిని దాటించుకుంటూ ఒడ్డుకి తీసుకుపోగల సరైన ఆ పడవ ఎక్కడుంది?
వెలుగులెక్కడ సోనియా! పసివేషంలో కనిపిస్తున్న కల్పలతా ? వలపుకి ఒల్లని చిలిపి పిల్లల చిన్నదానా! కన్నదానా! శాపానికి గురయి పడిపోడానికి సిద్ధంగా ఉన్న త్రిశంకులకి ఆధారంగా నిలబడ్డదానా!
నువ్వు బతుకు లోతుల్ని తరచిచూసినదానివి. నీ లేత హృదయంలోనే రాగత్యాగాల అంచుల నీడలు కనిపిస్తున్నాయి. అనుభవాల ముడతల్లో దాగిన పురుగుల విషపు జాడలు కనిపిస్తున్నాయి. భరించలేని ఆకలి పెట్టే కడుపుమంటని చూసిన ఆత్రం కనిపిస్తున్నది. కక్కుర్తి, నగుబాటు, పాపపుపుట్ట దీన మానవదేహం. నువ్వు భరించలేని దెబ్బలేముంటాయి? నువ్వు మొయ్యలేని బరువులెక్కడుంటాయి? ప్రపంచమంతా కార్చిన కన్నీటిబిందువులు నీ కంఠానికి ముత్యాల హారంగా అమరుకున్నాయి. బురదతో కలగలిసిపోయిన పాపాల సరస్సులో పూసిన పద్మం నీ ప్రేమ. గొప్ప మమత అనే అమృతం ఆ పద్మ సుగంధం. అది కలిగించగల శాంతిలో తేనెటీగ తనను తాను మైమరచిపోతుంది.
ఏది తెలుసుకోకూడదో దాన్నంతా తెలుసుకున్న నువ్వు నేనేది తెలుసుకోవాలో దాన్ని నాకు తెలియచెప్పగలవు. ఆధారం లేని దారుల్లో ప్రయాణించిన నువ్వు నేను వెతుక్కునే దారికి ఆధారం చూపించగలవు. పాపాల శిశువుగా పుట్టిపెరిగిన నువ్వు ఈ పాపిని తాను అనుభవిస్తున్న శాపం నుంచి బయటపడవెయ్యగలవు. భరించలేని దుఃఖాలనే చీకట్లలో మగ్గి మరిగిపోయిన నువ్వు ఇప్పుడు నా రాత్రుల వెన్నెలగా చిరునవ్వగలవు.
సోనియా, సందేహమనే రాత్రిలో, ఆత్మహింస అనే భయంకరమైన అడవిలో దారి తప్పిపోయిన ప్రేతసమూహానికి తోవ ఎక్కడ? వెలుగు ఎక్కడ? బతుకుని తాకట్టు తీసుకున్న మృత్యువనే ఆ ముసిల్ది ఎక్కడ? నా ఋణం నుంచి నేను బయటపడే దారి చూపించే హక్కు తన చేతుల్లోకి తీసుకుని ఆమె ఎక్కడికి పోయింది? కాలచక్రం తిరగబడ్డట్టుంది. రాత్రికీ, పగటికీ తేడా తెలియడంలేదు. రక్తకాంతితో మలినపడ్డ గోళంలాగా కనబడుతున్నది సూర్యుడా? చంద్రుడా?
ఆ రోజుల్లో ఉదయించిన జీవితాన్ని వెలిగించిన ఆ ఆశయాలు, ఆ సదయశోభలు నేడెక్కడున్నాయి? ఇప్పుడు హంతకుడి చూపులనే దిగంతం నిండా రక్తకాంతి మాత్రమే పరుచుకుని ఉన్నది. గర్వంతో పైకెత్తుకున్న నీ శిరస్సుని ఇప్పుడు దుమ్ము కప్పేసింది. పాపాలతో కూడుకున్న దారిలో పాదధూళిని ప్రేమతో ముద్దాడుతున్నది. ఆనాటి తర్కం ఇప్పుడెక్కడుంది? నెత్తికెక్కిన ఆ బుద్ధివాదం ఇప్పుడేమయ్యింది? ఆ రోజు గర్వంతో నువ్వు చేసిన సింహనాదం ఇప్పుడు చివరికి నిస్సహాయతలో ముగిసిపోయింది. నీ వివేకం, నీ గుడ్డిభయం, అసహ్యం, నీ బాధ ఎక్కడున్నాయి? మొత్తం ప్రపంచాన్నంతా ఒక మహోన్మాద ప్రవాహం కమ్ముకుంది. మనిషి భాగ్యమంటూ ఉంటే అదిప్పుడు చెరలో చిక్కుకుంది. నీలో ఒక యూదా మేల్కొన్నాడు. ఇక్కడ హంస లేదు. ఏవి పాలో, ఏవి నీళ్ళో ఎవరు చెప్తారు?
మాటిమాటికీ నీ నరాల్ని ఒక గొంతుక మీటుతూ ఉంది. నెత్తుటిరుచి కలిగిన మరణపు వాసన నిత్యం హంతకుణ్ణే అంటిపెట్టుకుని ఉంది. ఒక ముఖాన్ని గుర్తు చేస్తున్న ఆ జ్ఞాపకం ఎంతచేసినా కూడా గతాన్ని మర్చిపోనివ్వడం లేదు. కోటిపుట్టుకల్ని కూడా మించి ఒక దుర్మరణం సంభవిస్తుంది. భయం కలిగేది క్షణకాలమే. కాని దాని ఫలితం మాత్రం యుగయుగాలకీ నిన్ను వదిలిపెట్టదు. రెండు కళ్ళతోనూ విన్నదనమిది. ఇప్పుడు నేలనీ, నింగినీ కూడా ఆవరించింది. లోకమంతా కూడా శోకం ఆవరించి చిమ్మచీకటి చిమ్ముతోంది. భ్రాంతి తప్ప శాంతి ఎక్కడుంది? చివరికి గడ్డిపోచలు కూడా ఎగతాళి చేస్తున్నాయి. దిక్కులన్నీ వెక్కిరిస్తున్నాయి. మేఘం నుదుటిన నల్లతాచులు కదలాడుతున్నాయి. నేరారోపణ చేయడానికి నా హృదయమే ఒక న్యాయస్థానంగా మారిపోయింది. నా నరనరాల్లోనూ నా మీదనే దృష్టి పెట్టి గూఢచారులు కుదురుకున్నారు. దీన్నుంచి బయటపడటమెలాగ? సోనియా, ఇంక నాకు నువ్వే దిక్కు. కళ్ళుండీ కూడా గుడ్డివాణ్ణి. నాకు బాసట అంటూ ఉంటే అది నువ్వే.
కలిమీ లేమీ అనే గోరువెచ్చని మసకసంజల మంచుదుప్పటి పరుచుకుంది. ఇది పిట్టలు ఈకలు రాల్చే తరుణం. చెట్లు ఆకులు రాల్చే సమయం. మనకి లభించగల విజయం తాలూకు బీజం ఇప్పుడు నిద్రలో ఎక్కడుందో? ఇక్కడ వెలుగూ, చీకటీ రెండూ లేవు. ఆకాశంలో చుక్కలకాపరి కూడా లేడు. మనం పొలిమేర కూడా దాటిపోయాం. ఇంక గతించిన కాలానికి చెందిన పిలుపులేవీ వినబోవడం లేదు మనం.
సోనియా! ఈ శూన్యసీమలో నా బతుక్కి నువ్వొకర్తివే హామీ. జీవితం సుఖంగా, శాంతిగా గడిచే ఆ సీమకి దారిచూపించగల వహ్నిపథ సంకేతం ఎక్కడుంది? శుభప్రదమైన నీ గొంతుతో ఒక్కసారి పిలిచి చూడు, మృత్యువు అనే చిన్న కునుకు వదిలి లాజరు శాశ్వత కాంతిసీమకి తప్పకుండా వస్తాడు. నీ కంఠస్వరం మృత్యు యజ్ఞం తాలూకు జీవమంత్రం. అది ఈ పాడుపడ్డ తాళ్ళని తెంచేసి ఆత్మని స్వతంత్రం చేయగలుగుతుంది.
తెలిసినదాన్నే మనం మరిచిపోయిన ఆ వేకువజాముల్లో మెలకువ శ్వేతశంఖాలూదుతున్న చప్పుడు. ఆ ధ్వని మాటల్ని దాటిన నీడగా మారుతున్నది. అటువంటి మహానిశ్శబ్దపు తోటలో మంచురాలిన పూలరేకల కదలికలుగా తేనెవాకల్లో సంగీతం వినిపిస్తున్నది.
చావు అనే దుర్గతిలోంచి కొత్త జీవితమనే సద్గతిలోకి, చీకట్లోంచి వెలుగులోకి, భ్రాంతినుంచి శాంతిలోకి, సోనియా, దారి చూపించు, వెలుగు చూపించు, తోవ చూపించు.
Featured photo: Sir Frank Dicksee, The Confession, 1896
4-2-2025

